[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
ఎంతో మంది వాగ్గేయకారులు, వారి సంగీత, సాహిత్య ప్రతిభతో వెలువరించిన అనేకానేక రచనలు సంగీతాభిమానులకు, విద్యాన్ముఖులకు దిక్సూచిగా చెప్పవచ్చు. ముఖ్యంగా త్రిమూర్తులలో ఒకరైన త్యాగయ్య గారి, జీవిత విశేషాలు, అలాగే ఆయన రచించి ప్రసిద్దిపొందిన ‘ఘన పంచరత్నాలు’ సామూహిక గోష్ఠులతో అందరికి సుపరిచితమే. రామాయణ, మహాభాగవతాలు భగవద్గీతలు ఎన్నిసార్లు వినినా, చదివినా, మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో, పునశ్శరణ చేయడం ద్వారా మోక్ష మార్గంలో అడుగిడవచ్చు. భక్తి ప్రపత్తులతో మనస్సు లగ్నం చేసి, భగవంతుని సేవగా మదిలో తలచి, కొలిచి – తిరిగి మనుష్యునిగా మనం జీవితాన్ని ముక్తి మార్గం వైపు నడపడానికి ఈ గ్రంథాలు ఉపయుక్తం అనడంలో సందేహం లేదు.
***
ఉపోద్ఘాతం:
త్యాగరాజు:
కర్ణాటక సంగీత ప్రపంచంమునకు శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తు స్వామి దీక్షితులు త్రిమూర్తులు. త్యాగరాజు భగవదవతారము. ఈ విషయాన్ని త్యాగయ్యగారే స్వీయ రచనయగు, ‘దాశరథీ నీ ఋణము దీర్చ నా తరమా’ కీర్తనలో తోడి రాగంలో చెప్పారు.
కీర్తిశేషులు శ్రీహరి నాగభూషణంగారు ఇలా వ్రాసియున్నారు: “శ్రీత్యాగరాజస్వామి శంభు, నారద, గణపతి, ఆంజనేయ, వాల్మీకి అంశలతో జనన మందినారని విమర్శకుల తలంపు. త్యాగయ్య కృతులు ఉపనిషత్సూక్తులకు ఆలవాలములని ఆ కారణముగ ఆయన కృతులకు ‘త్యాగబ్రహ్మపనిముత్తు’లను పేరు కలిగనదని బహు పండితాభిప్రాయము.”
త్యాగయ్య సహజ వాగ్గేయకారులు. మహాకవి. ముఖ్యశిష్యులలో ఒకరగు శ్రీ వాలాజాపేట వేంకట రమణ భాగవతులు – తాము వ్రాసిన గుర్వష్టక శ్లోకములతో అయ్యగారి వైభవము ఇట్లు చాటినారు:
“వ్యాసోనైగమచర్చయా మృదుగిరా వల్మీకజన్మామునిః వైరాగ్యే శుకఏవ భక్తివిషయే ప్రహ్లాదఏవస్వయం బ్రహ్మానారదఏవచాప్రతిమయోః సాహిత్యసంగీతయోః తం త్యాగరాజం భజే”.
శ్యాస్త్ర చర్చయందు వ్యాసుడు, మృదువైన వాక్యములను పలుకుటలో వాల్మీకీ, వైరాగ్యమున శుక యోగీంద్రులు, భక్తి విషయమున స్వయం ప్రహ్లాదులు, సాజత్యమున బ్రహ్మ సంగీతమున నారదుడు, రామనామామృత పానమున శివుని జయించిన వాడు త్యాగయ్య. ఆంధ్రుడగుట ఆంధ్రుల పుణ్య ప్రరీపాకము.
త్యాగయ్య పూర్వీకులు, జననము:
త్యాగయ్య పూర్వులు కర్నూలు జిల్లా కాకర్ల గ్రామమునకు చెందినవారు. త్యాగయ్య ముత్తాత పంచనదబ్రహ్మం. ములకనాటి వైదిక శాఖ. భారద్వాజస గోత్రము. ఆపస్తంభ సూత్రులు. వారిని విజయనగర ప్రభువులు హిందుధర్మ ప్రచారమునకై దక్షిణ దేశమున కంపిరి. వారికి ఐదుగురు కుమారులు. వారు 1. సదాశివ బ్రహ్మము 2. సదానందబ్రహ్మము, 3. సచ్చినందబ్రహ్మము 4.బాలబ్రహ్మము 5.గిరిరాజబ్రహ్మము.
కనిష్టుడగు గిరిరాజ బ్రహ్మము గిరిరాజ కవిగా పేరు పొందాడు. ఈయనకు సుబ్రహ్మణ్యభారతి అను నామంతరము కలదు.
తంజావూరు నేలిన మహారాష్ట్ర ప్రభువు శహాజీ ఆస్థానాంధ్ర కవియగు గిరిరాజ కవి త్యాగయ్య పితామహులగు గిరిరాజ కవి ఒకరేనని భ్రమపడియున్నారు.
కానీ వారు వేర్వేరని ఆచార్య శ్రీ యస్వీ జోగారావు గారు తమ ‘ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర’ ద్వితీయ భాగం పుట 314 నందు, ‘సప్త తంతువు’ అను వ్యాస సంపుటిలో త్యాగరాజు కృతులు అను వ్యాసంలో తెలిపారు.
గిరిరాజు బ్రహ్మము వ్రాసిన కీర్తనలు ‘సంగీత సంప్రదాయ ప్రదర్శని’ అను గ్రంథమున నీయబడినవి.
త్యాగయ్య పితామహులగు గిరిరాజ బ్రహ్మము శహాజీ సన్మానం అందుకొనినట్లు ‘కృతి మణిమాల’ అను గ్రంథమున తెలియచున్నది.
గిరిరాజ బ్రహ్మమునకు 5 కొడుకులు – కనిష్ఠుడు రామబ్రహ్మము. ఈయన గొప్ప పండితుడు. భాగవత శివపురాణ నిష్టాత. రామభక్తి పరుడు. పేరొందిన రామాయణ పౌరాణికుడు.
రామబ్రహ్మముగారు ‘సీతమ్మ’ అను కన్యను పరిణయం ఆడాడు. కొందరు ఆమెను ‘శాంతమ్మ’ అని కూడా అంటారు.
కమలాలయ క్షేత్రమున జన్మించిన కర్ణాటక సంగీత ప్రపంచమునకు మూర్తి త్రయమునడుగు శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దిక్షితులు నాదోపాసనతో ముక్తినొందిరి. ఈ మువ్వురు జీవన్ముక్తులు. (‘గీతాద్యఖిలోపనిషత్సార భూత జీవన్ముక్తుడౌటకు సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ అనిరి త్యాగయ్యగారు).
బాల్యం:
- దేవతా విగ్రహాలను తనివితీర పూజించటం.
- హరికథ గానాలు వినడం.
- తండ్రి చెప్పిన రామాయణ పురాణములు ఆసక్తితో వినడం.
- తిరువారూరు వీధి బడిలో చదివారు.
- తిరువారూరు (పంచనదక్షేత్రము) వీడి తిరువయ్యూర్ చేరినారు.
- త్యాగయ్య జీవితమంతా తిరవయ్యూర్ నందే గడిచినది.
- కావేరీ, కొల్లెడము, కుడమురుతి, వెన్నార్, వెట్టార్ అను 5 నదులు కలియు పవిత్ర స్థలము – పంచనదక్షేత్రం. అచట ఈశ్వరుడు పంచనదీశుడు. దేవి ధర్మసంవర్ధిని. త్యాగయ్య పంచనదీశుని ప్రణతార్తి హరుడని కీర్తించారు.
విద్యాభ్యాసం:
- 8వ ఏట ఉపనయన సంస్కారము.
- సంస్కృతాంధ్రమున నిష్టాతులు.
- అచ్యుతప్పనాయకుని కాలమున మహామేధావియైన గోవింద దీక్షితులు స్థాపించిన విద్యాశాలలో వేద వేదాంగ జ్యోతిష, తర్క, వ్యాకరణ ఆయుర్వేదములను, చతుషష్టి కళలను నేర్చుకున్నారు. ప్రవీణుడయ్యారు.
- త్యాగయ్య తల్లి సీతమ్మగారు మంచి గాయని. తండ్రి వీణ కాళహస్తి అయ్యర్ వద్ద సంగీత విద్యనభ్యసించెను. త్యాగయ్య మొదటి గురువు తల్లి సీతమ్మ గారే.
- తండ్రి గ్రామాంతరము వెళ్లినప్పుడు ఏక పీఠ విగ్రహమును పూజించే అవకాశం కలినది. షోడశోపచార పూజా విధులలో ‘గీతం శ్రావయామి’ అనుచు భగవంతునకు పాట పాడి వినిపించుట కూడ ఒకటి. త్యాగయ్య నోటి వెంట అపూర్వమైన సాహిత్యము వెలువడినది. అదే దివ్య నామ సంక్తీర్తనములై విరాజిల్లినవి. ఉదా: నమో నమో రాఘవాయ అనిశం (దేశికతోడి) 2. అన్యాయము సేయకురా రామ (కాపి, ఆది).
- రామనామ జపానికే ప్రాధాన్యత ఆయన కీర్తనలలో ఎక్కువ కన్పిస్తుంది. ఉదా – ‘సుఖి యెవ్వరో రామనామ సుఖి యెవ్వరో’ – ‘రామనామమనే వరఖడ్గము’ – ‘నామపుణ్యము చెలగునా’, – ‘రామా నీ యెడ, ప్రేమ రహితులకు నీ నామ రుచి తెలియునా’ – ‘ప్రేమ ముప్పరిగొను వేళ నాముమును దలచువారు’; ‘నాధ సుధారసంబు’ – ఆరబి.
- ‘ఇంతకన్నా ఆనంద మేమి’ – అనే బిలహరి రాగ కృతిలో ‘నీ జపముల వేళ ఈ జగములు నీవై రాజిల్లునయ్య’ లో గోచరిస్తుంది. రామనామము, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసము లొకటై రామనామ జపం జరుగుతుంది.
- ‘మేలు మేలు రామనామ మీ ధరలోన’ (సౌరాష్ట్ర); ‘రామ నామము మేలు రామ చింతన చాలు’ (భైరవి); ‘రామనామము జన్మరక్షక మంత్రం’ (అఠాణ) మొదలగు కీర్తనలలో రామనామ మహిమ గోచరిస్తుంది.
సమకాలీకులు – పట్నం సుబ్రమణ్యం అయ్యర్, మహావైద్య నాధయ్యర్, వీరు వెంకట సుబ్బయ్యగారి శిష్యులు. టైగర్ వరదాచారి, మైసూరు వాసుదేవాచారి, పట్నం సుబ్రహ్మణయ్యరునకు శిష్యులు. ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ మొదలైనవారు.
నారద సందర్శనము – స్వరార్ణవ ప్రాప్తి:
త్యాగయ్య జీవిత పంచాగమున 18వ సంవత్సరమునకు విశేష ప్రాముఖ్యత వుంది. 18వ యేటనే త్యాగయ్యగారు ‘పార్వతి’ అను కన్యాకామణిని వివాహమాడిరి. త్యాగయ్యగారు రామనామ జపమును ప్రారంభించినది 18వ ఏటనే.
సద్గురు కటాక్షము వల్లనే సందేహములు నివృత్తి కాగలవని ‘గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు’ (గౌరిమనోహరి) అని గురు కటాక్షమునకై ఎంతో పరితపించారు త్యాగయ్య. ‘ఆచార్యస్సహరిస్సాక్షాత్’ కాన శ్రీరామునే సద్గురువుగా నెంచి త్యాగయ్య ఇట్లు ప్రార్థించిరి: “నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మినాను” (ధన్యాసి – చాపు).
రామ షడక్షరీ మంత్రము ఉపదేశించిన రామకృష్ణానంద యతీంద్రులు త్యాగరాజు ఆర్తి నెరింగి త్యాగయ్యను చేరి నారదమంత్రోపదేశము చేసి “మంత్ర జపము చేయుము కృతార్ధడవు కాగలవు” అని చెప్పి వెడలిరి. “అధవా భవితవ్యానాం ద్వారాణి భవని సర్వత్ర” అని చెప్పుట ఈ సందర్భంలో సమంజసమే.
నారద మంత్రోపాసన ప్రారంభించిన కొన్ని దినాలకు ఓ యతీశ్వరుడు త్యాగయ్య యింటికి వచ్చి గ్రంథ మొసగెను. అదియే ‘స్వరార్ణవము’, ఆ యతీత్రుండే నారదునిగా గుర్తిరెరింగి త్యాగయ్య గారు ఆనందంతో నారదుని కీర్తించుచు చాలా కీర్తనలు వ్రాసారు.
నారద పంచరత్నములు:
- శ్రీనారదముని గురురాయ (భైరవి)
- శ్రీనారద నాద సరసీరుహ భృంగ శుభాంగ (కానడ)
- నారద గురుస్వామీ (దర్బారు)
- వరనారదనారాయణ స్మరణానందానుభవము (విజయశ్రీ)
‘నారదగానలోల’ (అఠాణ) రాగకృతిని నారద శబ్ద ప్రసక్త మాత్రము చేత నారద పంచరత్నముల చేర్చి చెప్పచున్నారు.
నారదగానలోలుడు విష్ణువు. విష్ణువును సంభోధించి చెప్పిన కీర్తన అది. నారదుని శరీరకాంతి ‘శరదిందు నిభము’. కాని అఠాణ రాగ కృతిలో ‘నీరద సమ నీల నిరుపమశీల’ అని వుంది. దానిని బట్టి ఇది నారద పంచరత్నం లోనిది కాదని చెప్పవచ్చు.
నారద పంచరత్నములనుటకు – సంఖ్య పూరణమునకె అయినచో నారద వర్ణనము కల్గిన ప్రహ్లాద భక్తి విజయం నందలి ‘నారదముని వెడలిన సుగుణాతిశయము వినరే’ అను దానిని చేర్చుట సమంజసము.
వాగ్గేయకారులలో నారద సందర్శన భాగ్యమును పొందినవారు కానీ, నారదుని పై కీర్తనలు వ్రాసినవారు గాని మరియొకరు లేరు, త్యాగయ్య గారొక్కరే అనుటకు సందియము లేదు.
వైష్ణవులకు శ్రీమద్రమానుజుడెట్లు అద్వైతులకు శ్రీశంకరాచార్యులెట్లో కబీరునకు రామానందుడెట్లు చైతన్యునకు నీశ్వరవధూటియు కేశవ భారతినెట్లో రామదాసునకు కబీరెట్లో – త్యాగరాజనకు నారదుడట్లు.
రజత గిరీశుడు నగజకు దెలుపు స్వరార్ణవ మర్మములు
విజయము గల త్యాగరాజున కెరుకే
(స్వరరాగసుధా.. శంకరాభరణము)
స్వరార్ణవ గ్రంథ పరిశీలనంతో త్యాగయ్యగారి సంగీత శాస్త్ర సందేహాలు తీరాయి. తర్వాత ఆయన రామాయణ కృతి రచన – నూతన రాగములు (కైకవశి, రసావళి) రాగాలు కనుగొన్నారు.
‘జ్యోతి స్స్వరూపిణి’ రాగం పాడి దీపము వెలిగించారట. రాగం యొక్క హెచ్చు, తగ్గుస్థాయిల అనుసరించి దీపము ప్రకాశం హెచ్చి తగ్గి అందరిని ఆశ్చర్యపరిచినదట.
పితృ వియోగం:
త్యాగయ్య అన్నగారి జష్యేశుడు సదానంగ క్రియాలోలుడై కాలక్షేపము చేయుచుండెను. త్యాగయ్య తన భార్యయగు పార్వతి కలసి కాపురం చేయుచుండెను. 1789 సంవత్సరం త్యాగయ్యగారికి 20వది సంవత్సర ప్రాయమున తండ్రి రామబ్రహ్మంగారు దివంగతులైరి. సీతమ్మగారి సహగమనాన్ని భర్త నిరాకరించాడు. త్యాగయ్య భావి ఔన్నత్యానికి చూచుటకు జీవించి యుండవలయునని చెప్పినాడు. భార్యావియోగం 1790లో జరిగింది. అప్పటికి త్యాగయ్య 23 సంవత్సరములు. పార్వతి మరణించుచు త్యాగయ్యను మరల వివాహమాడుమని కోరిరి. భార్య మరణం అతనికి మనస్తాపం కల్గించింది. పార్వతి కోరిక మేరకు ఆమె చెల్లెలు కమలాంబను వివాహమాడి ‘సీతామహాలక్ష్మి’ యను కుమార్తెను కన్నారు.
ఉంఛవృత్తి:
త్యాగరాజు అనాదియై, సంప్రదాయ బద్ధమై, అనిందితమైన ఉంఛవృత్తి మార్గమున జీవయాత్రను సాగించిరి. ఆయన చాలా సాధారణమైన జీవితమును గడిపిరి. మానవ జాతికి భక్తి, సంగీతముల సేవ చేసిన మహానీయుడు త్యాగరాజు. వారానికి ఒకసారి మాత్రమే శిష్య బృందంతో ఉంఛవృత్తి చేసేవారు. ఆ ఆర్జనతో ఇంటికి వచ్చిన అతిథులను పోషించెడివారు. అక్షయ పాత్రను శిరముపై పెట్టుకుని, తంబూర చేత బూని శిష్యులతో ఉంఛవృత్తి చేస్తూ చాలా కీర్తనలు గానం చేసేవారు.
ఉదాహరణ: హరిదాసులు వెడలె (యమునా కల్యాణి – ఆది).
త్యాగయ్య సమకాలీకుడు తాము నరసింహదాసు కూడా ఉంఛవృత్తి మార్గాన్నే ఎంచుకొని జీవయాత్ర సాగించాడు. నరసింహదాసు ఈ కీర్తన ఇందుకు ఉదాహరణ: “పరమ పావనమైన అక్షయపాత్ర జీవనాధారము చేసుక రాముల నమ్మితి ఈ దేహము స్వామికమ్మితి.”
త్యాగయ్య గారే ‘ఎన్నాళ్ళు తిరిగేది.. (మాళవశ్రీ, ఆది)’ కీర్తనలో
ఉప్పు కర్పూరము వరకు ఉంఛవృత్తిచే ఆర్జించినట్లు చెప్పికొనినారని శ్రీనారు మంచి సుబ్బారావు వ్రాసినారు. (తెలుగు సంగీత మహర్షులు రెండవ భాగం త్యాగయ్య జీవితచరిత్ర) ఉంఛవృత్తి కేవలం సంప్రదాయానుసారము మాత్రమే.
దినచర్య:
ప్రాతః కాలమున లేచి దైవారాధన చేసి, మేలుకొలుపులు పాడి శ్రీరామునకు ‘ఆకలి దీర పాలారగింపు’ చేసేడివారు. ‘చనువున ఘనునకు పన్నీటి స్నానము’ చేయించి, ‘కమ్మని భోజనము పెట్టెడివారు విడెమిచ్చెడి’ వారు. ‘నీవే నన్నెడ జేసితే నే నెవరితో దెలుపునయ్య’ అని (సౌరాష్ట) కీర్తనలో చెప్పారు. ‘చేతులార శృంగారము చేసి చూతున’ని శ్రీరామునికి అలంకారము చేసెడివారు. బాగుగ ఘననయ రాగముల దీపారాధన మొనరించి రాగరత్నమాలికచే రంజిల్లునట హరి – భాగవతోత్తములు కూడి పాడే కీర్తనములట – అని శ్రీరామునకు రోజు రోజుకు క్రొంగొత్త రాగములతో కూర్చిన దండను సమర్పించి – శ్రీరామునకు ఉయ్యాల వేసి పరుండ జేసి “ఉయ్యాల లూగవయ్యా శ్రీరామ” అని మల్లెమాల పాన్పు వేసి రామ చంద్రుని పరుండి పెట్టెవాడు. త్యాగయ్య ఈ విధంగా స్వవిరచిత కీర్తనములను రామదాస పురంధర సాది భక్తుల కీర్తనలను గానము చేయు చుండెడి వారు.
సీతాలక్ష్మి వివాహము 1810:
త్యాగయ్య ఏకైక పుత్రిక సీతాలక్ష్మి వివాహము జరిపించిరి.
రామదర్శనం కొరకు పరితపిస్తున్న త్యాగయ్యకు కలలో విశ్వామిత్రుని యాగ రక్షణమునకు అనుజుడగు లక్ష్మణుని వెంట నిడుకొని వెళ్తున్నట్లు కలగని ఆనందంతో ‘వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రి గూడి..’ అని కీర్త్తించారు. ‘నను పాలింప నడిచి వచ్చితివో..’ అని కీర్తించారు.
మాతృ వియోగం 1810:
సీతాలక్ష్మి వివాహం అనంతరం కొద్ది కాలానికే త్యాగయ్యగారి తల్లి కాలం చేసారు. త్యాగయ్య జీవితమున 1810 సంవత్సరం విశేష ప్రాముఖ్యత వుంది. కుమార్తె సీతాలక్ష్మి వివాహం, మాతృవియోగం, అన్నతో విడివడి వేరే కాపురం పెట్టడం జరిగాయి.
తీర్థయాత్రలు:
త్యాగయ్య్ వార్ధక్యమున అనగా 68, 69 సంవత్సర వయసున తీర్థయాత్రలు చేసారు. సందర్శించిన క్షేత్రములలో మధుర, ధనుష్కోటులు కూడా వున్నాయి.
అభేరిలో ‘మనసునిల్ప శక్తి లేకపోతే’, తోడిలో ‘కోటి నదులు ధనుష్కోటిలో..’ రచించారు. శ్రీరంగం, తిరువత్తియూర్ క్షేత్రాలలో దేవతల గురించి పంచరత్న కీర్తనలు చేసారు.
నవవిధ భక్తి మారమున వారు జీవితమంతయు నామ సంకీర్తనమునే వినియోగించిరి. ఉపనిషత్ బ్రహ్మేంద్రులు 108 ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాసారు. వాటిని అడయార్ ధియోసాఫికల్ సొసైటీ వారు ప్రచురించారు. కంచిలో తాళపత్ర గ్రంథములు వున్నవి. వీరి ఆహ్వానంపైనే త్యాగయ్య తీర్థయాత్రలకు పూనుకున్నారని అంటారు.
త్యాగయ్య దర్శించిన క్షేత్రాలు – వాలాజాపేట, తిరుపతి, పుత్తూరు, షోలింగర్, మదరాసు, తిరవత్తియూర్, కొవూరు, నాగులాపురం, శ్రీరంగం, నాగపట్టణం, లాల్ గుడి, మొదలైనవి. ఈ క్షేత్రాలలో దేవతా మూర్తులను కీర్తించుచూ చాలా కీర్తనలు రచించారు.
రామాయణ వాగ్గేయకారుడు, మహాకవి, గేయ నాటక మార్గదర్శి త్యాగయ్య ప్రాతః స్మరణీయుడు.
త్యాగరాజును సందర్శించిన మహనీయులు – త్యాగరాజు విద్వత్సమాగమము
తూము నరసింహదాసు (1822), గోపీనాథ భట్టురాచార్యులు, గోపాల కృష్ణభారతి, స్వాతి తిరునళ్ దూత వడివేలు (1835), గోవిందమారార్ (1843), ముత్తుస్వామి దీక్షితులు మొదలైన వారు. వీరు రచించిన కీర్తనలు కూడా చాలా ప్రాచుర్యం పొందినవే.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
