[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 5 త్యాగరాజు – పంచరత్నములు – గౌళ రాగం 1వ భాగము
పల్లవి:
‘దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో’
ఈ పల్లవిలో ‘దుడుకు గల” అనే పదాన్ని ‘నన్ను’ అనే ఉత్తమ పురుషతో జోడించి అన్వయించినపుడు కొందరు ప్రముఖులు, వాఖ్యాతలు అభిప్రాయాలు చెప్పినట్లు అన్వయ క్లిష్టత ఏర్పడుతుంది. అలాగాక, ‘నన్ను’ అనే ఉత్తమ పురుషైక వచనాన్ని విడదీసి ‘దుడుకు గల దొర కొడుకు’ అని జోడించి, రేపల్లెకు దొరయైన నంద కుమారుడైన కృష్ణుని వేడుకుంటున్నాడు అని కవి వాఖ్యానించుకుంటే ఈ అన్వయ క్లిష్టత తొలగిపోతుంది.
అనుపల్లవి:
‘కడు దుర్విషయాకృష్టుఁడై గడియ గడియకు నిండారు’
ఈ అనుపల్లవిలో వైష్ణవ భక్తి సంప్రదాయంలోని శరణాగతి లక్షణాలలో భక్తుడు తనను తాను ఎంతో అల్పునిగా భావిస్తూ తనకు గల ప్రత్యేకత ఏమి లేకపోయినా భగవంతుని కరుణయే శరణమని శరణాగతి కోరడం ముక్తికి ప్రధాన మార్గం అని చెప్పబడుతుంది. రామభక్తుడైన త్యాగరాజు తనను తాను పుణ్య కార్యములు ఏవీ చేయనివాడిగా చెప్పుకుంటున్నాడు. అలా చెప్పటంలోనే ఈయన పుణ్యమంతా కన్పిస్తుంది.
చరణం1:
‘శ్రీవనితాహృత్కుముదాబ్జావాఙ్మానసగోచర’
పదాలను బట్టి హృదయమనెడి ‘కలువ పద్మం’ అని అర్థం వస్తుంది. అప్పుడు అన్వయంలో క్లిష్టత ఏర్పడుతుంది. అలాగాక ‘శ్రీవనితా హృత్కుముదాప్త’ అంటే ‘లక్ష్మి’ అనే వనిత హృదయము అనే కలువకు చంద్రుని వంటివాడా (రామచంద్రుడు) అని అర్థం వస్తుంది. (లేదా) శ్రీ వనితా హృత్ ముదాబ్జ అని గ్రహిస్తే ‘లక్ష్మీ దేవి’ అనే స్త్రీ హృదయం అనెడి పద్మమునందు ఆనందం పొందువాడా అని అర్థం వస్తుంది. వాక్ నకు మనస్సునకు అందని మహాత్మ్యము గలవాడా.
చరణం 2:
‘సకలభూతములయందు నీవైయుండగ మదిలేకబోయిన’
ఈ చరణంలో సకల ప్రాణులలోను, అన్నింటా అంతటా నీవే యున్నావని తెలుసు. అయినా నాతోనే వున్న నిన్ను నా జ్ఞాననేత్రముతో దర్శింప లేకపోతున్నాను. ఈ ఆర్తిని దేనితో పోగొట్టుకోగలను? ఆత్మ సాక్షాత్కారమే జీవన్ముక్తి. భక్త కవులు అందరి సాధన ఆ సిద్ధి కోసమే. తనకి ఇంకా ఆ సిద్ధి లభించలేదని త్యాగరాజు ఆర్తితో పరితపిస్తున్నాడు.
చరణం3:
‘చిరుత ప్రాయమునాఁడె భజనామృత రసవిహీన కుతర్కుఁడైన’
ఈ చరణంలో భక్త కవులలో ఎందరికో భక్తి మార్గంలో నడిచే చిత్త శుద్ధి లేకపోయినా ఏ పూర్వ జన్మ పుణ్య పరిపాకం వల్లనో ఒక శుభ ముహుర్తాన భక్తి స్పందన హృదయంలో ఆవిర్భవించి, అది కళా రూపంతో అవ్యక్తమయినపుడు వారి జన్మ సార్థకమే. ఇందుకు వాల్మీకి కంటే గొప్ప ఉదాహరణ ఎక్కడ వుంది? ఇలాంటి మహనీయులు భక్తి మార్గంలో నడవకుండా ఎంతో కాలాన్ని వ్యర్థంగా గడిపారని పరితపించడం సహజం.
4,5 చరణాలు:
‘పర ధనములకొరకు నొరుల మదిని కరఁగ బలికి కడుపునింపఁ దిరిగినట్టి’
‘తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి’
ఆ విధంగా గడిచిన బాల్యంలో ధన వ్యామోహమంతా భౌతిక సుఖాపేక్షణా, చేసిన చర్యలకు పశ్చాతప్తులు అవుతున్నారు.
6వ చరణం:
‘తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుపదేశించి’
స్వలాభం కొరకై అల్పులైన నట విటాదులకు స్త్రీలకు, స్వర లయజ్ఞానం లేని సంగీతం నేర్పి, గొప్ప శిష్యులు గల మహా సంగీత విద్వాంసులతో సమానమనుకొను శిలాసదృస మూఢుడై బాల్యంలో కాలం వృథా చేసుకున్నాడు.
7వ చరణం:
‘దృష్టికి సారంబగు లలనాసదనార్భకసేనామిత ధనాదులను దేవ దేవ’
స్రీలోలాది భావదాసుడై భగవత్ పాదసేవ మరచినందుకు తనను తాను నిందించుకుంటున్నాడు.
8వ చరణం:
‘చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ’
చపలచిత్తులెందరో పరమ రమణీయమూర్తియైన రామచంద్రుని మనస్సులో నిలుపుకోలేక క్షుద్రమైన వ్యసనముల వెంటపడి వ్యర్థ జీవులవుతున్నారు. అట్టి వారిలో ఒకడు కాకుండా తనను కాపాడమని భగవానుని శరణు కోరుతున్నారు.
9వ చరణం:
‘మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద’
మానవ జన్మ అతి దుర్లభమైనది. ముక్తికి సాధనంగా దానిని వాడుకోవడమే ఈ జన్మకి సార్థక్యం. అలాగాక జీవితంలో అరిషడ్వర్గాలకి లొంగి కేవలం ధన సంపాదన కోసం నాస్తికతను ప్రబోధించే సారహీనమైన మతాలను అవలంబిస్తూ రాజుల సేవలు చేసేవారి జీవితాలు వ్యర్థం.
10వ చరణం:
‘సతులకై కొన్నాళ్లాస్తికై సురులకై కొన్నాళ్లు ధన’
ఈ చరణం ఆదిశంకరుల ‘భజగోవిందం’ స్తోత్త్రాన్ని స్పురింపజేస్తుంది. ఎప్పుడో అంతిమ కాలంలో భగవంతుని ప్రార్థించ వచ్చులే అనుకుంటు జీవితమంతా భార్య బిడ్డల పోషణకే వ్యర్థం చేస్తే అంతిమ కాలం ఎలా వుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి వయస్సుతో కాలంతో, మతాది విషయాలతో సంబంధం లేకుండా పరమాత్ముని శరణు కోరడమే తరించడానికి మార్గం.
***
గౌళ రాగం – ‘దుడుకు గల’ కీర్తన సాహిత్య భావం – వెంకట శ్రీరాములు
అజ్ఞానములోబడి తప్పులు చేసినవాడు కాల ప్రభావమున సజ్జనుడైనచో వానికి తన గతము ఎంతో బాధగా కన్పిస్తుంది. వాని హృదయంలోని ఆవేదనకు పరిమితి యుండదు. ఆలోచిస్తే ఏ ఒక్కరిద్దరుగాని, అందరూ ఈ కోవకు చెందినవారే. భక్తుడు మేలుకొంటాడు. ఇతరులు మేలుకోలేరు. ఇదే తేడా. నేను ఎంతో దౌష్ట్యము గలవాడను నన్ను ఏ రాజసుతుడు రక్షించునురా! అని తన దుడుకుతనమును వరుసగా ఏకరువు పెట్టుచున్నాడు.
నేను క్షణక్షణమునకు ఇంద్రియ విషయాసక్తుడనాయున్నాను.
ఓ లక్ష్మీ హృదయమును కలువకు చంద్రుని వంటి వాడవునూ, వాక్కులకు మనస్సునకు అందని వాడవునైన రామచంద్రా! సకల భూతముల యిందు నీవే యుండగా నా సంగతి ఎరుంగని దుడుకుతనము గలవాడను.
చిన్నతనములోనే నిన్ను సేవించు భక్తి లేక రసహీనమైన దుర్వాదములు చేయు దుడుకుతనము గలవాడను.
పరుల నుండి ధనమును ఆశించుచూ వారికి జాలి కలుగునట్లు పలికి కడుపు నింపుకొనుటకు తిరుగు దుడుకుతనము గలవాడను.
స్వల్పమునూ, లయనూ, ఎరంగక కఠినాత్ములయిన అజ్ఞానులు, నటులూ, విటులూ, అల్పులూ, వనితలూ తనకు వశమమగునట్లు బాధించి, సంతోషించి స్వరాదులు తెలిసిన భక్తులతో సమానమని పల్కు దుడుకుతనం కలవాడను. చూపులకు అందముగా కనబడు స్త్రీలూ, గృహములూ, సంతానము, సేవలు, అపార ధనములు మనసున నమ్ముకొంటిని గాని దేవాదిదేవా నీ పాదములను మరచితిని. అది యొక దుడుకుతనము.
స్వామియన రాముని చక్కని ముఖపద్మమును మనసున స్మరించుకొనక మదాంధులైన జనుల సేవల కోరి పరితాపమునబడి బాధల అనుభవించుచూ, కూడా దుర్విషయములను దురాశనూ, ఏవగించుకోలేక సతతము అపరాధములు చేయుచూ, చంచలచిత్తుడనగుట ఒక దుందుడుకుతనము.
మానవ జన్మము దుర్లభమని తలంచుకొని ఆనందము పొందలేక కామ క్రోధాది షడ్వర్గమునకు లోబడి మోసపోతిని. కావుననే బ్రాహ్మణుడనై పుట్టియు శూద్ర ధర్మముతో పనులు చేయుచుంటిని. అధములను ఏవగించుకొంటిని. రసహీనమైన దానిని సాధించుటకు తలక్రిందులగుచుంటుని. అది యొక దుడుకుతనము. ఓ త్యాగరాజ స్వామికి హితుడయిన స్వామీ, స్త్రీలకై కొన్నాళ్ళు, ఆస్తికై కొన్నాళ్ళు సుతుల కొరకై కొన్నాళ్ళు, సంపదలకై కొన్నాళ్ళు మాత్రమే ప్రవర్తించితినయ్య. ఇది యొక దౌష్ట్యము. ఇట్టి నన్ను ఏ రాజకుమారుడు కాపాడును? నీవే!
***
గౌళ ‘దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో’ – అవతారిక:
మానవుని మనుగడకు అన్నం ప్రాథమిమైన అవసరం. బ్రతుకు తెరువు అంటే అన్నం లభించినట్టే, అన్నగత ప్రాణాలు ఆనందం వైపు పురోగమించాలి. ఇది జీవిత లక్ష్యం. అన్న శుద్ధి లేనిదే ప్రాణశుద్ది గాదు. ప్రాణం హాయిగా ఉంటెనే మనస్సు నిర్మలంగా ఉంటుంది. విజ్ఞానాన్ని ఆర్జించి ఆనందం అనుభవించగలదు. కీలకం అన్నంలోనే ఉంది. అన్నం బ్రహ్మ అనే భావంతో అన్నాన్ని సంపాదించాలి. తినాలి. ఇతరులకు దానం చేయాలి అలాంటి అన్నం వల్ల నిల్చిన ప్రాణం అన్నకోశాన్ని పరిపూర్ణం చేస్తుంది. అన్నశుద్ది చేస్తుంది. అన్నం విషయంలో పవిత్రంగా నడుచుకొనే వ్యక్తి ఆత్మ వికాసం వైపు పురోగమించగలడు. భగవద్గీతలో దీనిని ఒక యౌగంగా యోగీశ్వరుడు ఉపదేశించాడు. ఆహారశుద్ధి లేని వానికి ధ్యాన యోగం కుదరదు.
“నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున॥”
“యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా॥”
అర్జునా! మిక్కుటముగా భుజించు వానికి గానీ, ఏమియు తినకుండ ఉపవాసం చేసే వానికి గాని ధ్యానం కుదరదు. అలాగే ఎక్కువ నిద్రించువానికి గాని, నిద్ర విసర్జించు వానికి గాని ధ్యానము కుదరుదు. పరిమితమైన ఆహారము, నిద్ర కల్గి జప తపాదులయందు నిర్ధిష్టములగు నియమాలు కలవానికే ధ్యానయోగం లభించును. అది సంసార దుఃఖాన్ని నశింప చేయును.
ఆహార నిద్రా భయాలు ఎల్ల జంతువులకు సహజము. మానవునికి వివేచన కలదు. ఆహార నిద్రలు ఆముహిష్మిక సాధనకు అవరోధం కాగూడదు. మనం తినడానికే బ్రతకడం లేదు. బ్రతకడానికి తినాలి. ఆనంద ప్రాప్తికి బ్రతకాలి. సత్త్వ గుణంతో జీవితం కొనసాగించాలి. న్యాయంగా కష్టపడి అన్నం సంపాదించాలి. మితంగా తినాలి. అప్పుడు జీవితం పవిత్రం అవుతుంది. ఎలాగైన నిద్రా సుఖం ఆహార సుఖం అనుభవిస్తే చాలు అనే దోరణి దుడుకుతనం అవుతుంది. దొంగతనం వల్లగానీ, ఇతరులను శ్లాఘించిగానీ, మోసగించి గానీ, సోమరితనం వల్ల యాచనకు పాల్పడిగాని సంపాదించే అన్నం కలుషితమైనది. ఆహారశుద్ధి, సత్వశుద్దిని కల్గిస్తుంది. మన సామర్థ్యం పవిత్రంగా ఉండాలి. మదమాత్సర్యాలు క్రోధావేశాలు ఆహారం సంపాదించే మార్గంపై ఆధారపడి ఉంటాయి.
కడుపే కైలాసం ఇల్లే వైకుంఠంగా బ్రతకడం దుడుకుతనం. దుండుదుకుతనం లోకంలో ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఈ లోక వ్యవహారాన్ని పరికించిన త్యాగయ్యకు జాలివేసింది. అలాంటి లక్షణాలు మనలో గూడా ఎక్కడైనా చోటు చేసుకుంటాయేమోనని భయం వేసి ఉండవచ్చు. మహానీయులు ఎప్పుడు జాగరూకతతో ఉంటారు. కలుషాన్ని నిరోధించే ప్రయత్నంతో ఇంద్రియ నిగ్రహం పట్ల సర్వకాల సర్వావస్థలలో జాగ్రత్త పడతారు. గీతాచార్యుడు అర్జునుడంతటి వాడిని ఇలా హెచ్చరిస్తాడు.
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః॥
(నిగ్రహించడానికి ప్రయత్నించే వివేకి యొక్క మనస్సును గూడా ఇంద్రియాలు బలాత్కారంగా ఆకర్షిస్తాయి)
కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కోసం సాధన చేసే ప్రతి వ్యక్తి సదా తనను శోధించుకుంటూ తన మార్గంలో అవరోధాలు లేకుండా చూడవలసిందని ఆత్మరామునితో మొరపెట్టుకోవాలి. ఇదే ఈ కీర్తనలో త్యాగయ్య పొందుపరచినాడు. తాను ఎంతో దుడుకుగల వాడినని రామునితో చెబుతూ “ఇలాంటి నన్ను ఏ దొరకొడుకు రక్షిస్తాడు?” అని లోకంలోని దుడుకులన్నీ ఏకరువు పెడతాడు. నిజానికి త్యాగయ్యలో ఈ దుడుకులు లేవు. ఆ మహనీయుడు లోకాను్గ్రహముతో అవివేకుల దుడుకులన్నీ తనపై ఆరోపించుకుని అందరి తరపున దేవునితో మొరపెట్టుకుంటాడు.
ఐహిక సుఖాలను అనేక విధాలుగా ఉదహరించి, ఇంద్రియ లోలత్వం వల్ల కలిగే తామస, రాజస గుణాలన్నింటినీ సోదాహరంణంగా కీర్తనలో పేర్కొంటాడు. ఇటువంటి దుడుకులు గల నన్ను ఏ కరణామయుడు రక్షిస్తాడు, అని అడుగుతాడు. మహాత్ములెన్నడు ఇతరుల లోపాలను ఎన్నరు. వారి దోషాల తమ యందారోపించుకుని వాటి నుండి రక్షణకై జగద్రక్షకుని వేడుకుంటారు. వారికి లోకమంతా తమ కుటుంబమే. తన పర బేధం లేదు.
ఇయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్
ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్
(స్వపర బేదాలు అల్ప బుద్ధులకే. ఉదారులకు లోకమే కుటుంబము)
ఈ శ్లోకం ఢిల్లీలో లోక్‍సభ భవన ప్రవేశ ద్వారంలో కుడ్య ఫలకంపై చెక్కబడింది. ఈ ఆశయం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది.
విషయాకర్షణ, అజ్ఞానం, భక్తి రాహిత్యము, పర ధనకాంక్ష, సుఖలాలస, కాంతాసక్తి, ఈషణత్రయము, భగవద్విముఖత్వం మొదలైన అంశాలు తన దుడుకులుగా త్యాగయ్య ఏకరువు పెట్టాడు. ఇదే విధముగా తన దుడుకులను ఈ విధంగా సంకీర్తనా చార్యుడైన అన్నమయ్య ఆయన ఇలవేల్పు అయిన శ్రీవేంకటేశ్వరునికి విన్నవించుకున్నాడు.
“మరువను ఆహారంబును మరువను సంసార సుఖము
మరువను యింద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ
ఎక్కడి మానుష జన్మము ఎత్తిన ఫలమేమున్నది.”
త్యాగయ్య తన త్రిప్పటలను జాలితో రామునికి విన్నవించాడు. ఇందులో అంతరార్ధం “ఈ దుడుకులను క్షమించి నన్ను కాపాడి ఇక మీదట ఈ లంపటంలో చిక్కుకొనకుండా ముక్తిని ప్రసాదించవలసినది. దుడుకులన్నిటికి మూల కారణం అన్నమయకోశం పరిశుద్ధి లేకపోవడం. అందుకే తన అన్నమయ కోశం శుద్ధి చేసుకుంటున్నట్లుగా ఈ కీర్తనను అర్థం చేసుకోవాలి.
“అన్న తెలివియే గానీ, అక్షర తెలివి లేదు” అనే సామెత లోకంలో వినబడుతుంది. అంటే అక్షరం బ్రహ్మపదార్థం. అది ఆనంద స్వరూపం. దాన్ని సాధించే వివేకం లేకుండా కడుపు నింపుకోవడమే ధ్యేయంగా ప్రవర్తించేవారి పట్ల ఈ సామెత వర్తిస్తుంది..
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
