Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-11

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 5 త్యాగరాజు – పంచరత్నములు – గౌళ రాగం 2వ భాగము

పల్లవి:

‘దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో’

రాజకుమారులలో శ్రీరాముడు పరమదయాకరుడు, ధర్మనిగ్రహుడు. ఆశ్రితవత్సలుడు. ‘ఏ దొర బ్రోచురా’ అని త్యాగయ్య ఎందకనలేదు? ఇందులో ఎంతో అంతరార్థం ఉంది. రామచంద్రుడు దశరథుని కుమారుడైనప్పటికీ రామాయణమంతటిలో యువరాజుగా భరతుడే పరిపాలించాడు. కానీ రామపాదుకల సాక్షిగా రాజ్యం ఏలినాడు.

రాజ్యభిషేకం భంగమైనా శిష్టరక్షణ, దుష్టశిక్షణ రాముడే చేశాడు. వనవాసంలో కూడా రాజధర్మాలనే నిర్వర్తించాడు. దొర కొడుకు గానే నటన చేశాడు. కానీ దొరగా చేయలేదు. త్యాగయ్య మనస్సులో రామడెప్పుడు రాజకుమారుడే. విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేసిన రాముడు త్యాగయ్య హృదయంలో సుప్రతిష్ఠుడైయున్నాడు. అప్రయత్నంగా త్యాగయ్య నోట ‘దొర కొడుకు’ అనే మాట వచ్చింది. అది హృదయంలో దాగివున్న స్థాయి భావం. చక్కని తెలుగులో బహిర్గతమైనది.

రక్షించడానికైనా ఒక మితం ఉండాలి కదా! ఒకటి రెండు దుడుకులైతే పోనిలే అని క్షమించి వదలి వేయవచ్చు. కాటుక కొండలవలె పెరిగిపోయిన దుడుకులు ఎవరు ఏ మాత్రం ఎలా క్షమించగలరు? ‘ఎంతో దుడుకు’ అనడంలోనే ఈ భావం అంతా ఇమిడి ఉంది. రామునికి ఆర్తి రక్షకుడని, అపరాధక్షముడని, పతితపావనుడని, ఎన్నో బిరుదాలు ఉండవచ్చు. ఆ బిరుదులను గూడా బెదరగొట్టె దుడుకులు తనలో ఉన్నాయని, అలాంటి దుందుడుకుతనాన్ని ఎలా క్షమిస్తారు? ‘రామా నాకు వేరే గతి లేదు’ అని శరణాగతుడైనట్లుగా ఈ ఆవేదన సూచిస్తుంది.

“తొలుత దుష్కృతముల అణచే నీ బిరుదిలను దడుచుకొనెనే” అని వేరే కీర్తనలో తన పాపాల తీవ్రతను నివేదించుకుంటాడు. ‘దొర’ అనగా ప్రకాశించువాడు; ‘రాజు’ అన్న రాజ్యాలేలేవాడు అనే అర్థం. నరులలో ప్రకాశించే వాడు ‘నరపతి’యే గదా. దొరయు వాడు దొర. తమిళంలో ‘దొరై’ అంటారు.

అనుపల్లవి:

‘కడు దుర్విషయాకృష్టుఁడై గడియ గడియకు నిండారు’

విషయ సుఖాలు మానవుని వివేకాన్ని మందగింప చేస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలకు మనస్సును ఆకర్షించే శక్తి ఉంది. అవి అశాశ్వతాలని గుర్తించడం వివేకం. ఈ వివేకం లోకాలోకనం వల్ల, సత్సంగత్యం వల్ల, ఆత్మ పరిశీలనం వల్ల కలుగుతుంది. నిత్యానిత్య వివేచన వల్ల విషయమై ముఖ్యం క్రమంగా అలవడుతుంది. మనసు కుదట పడుతుంది. విషయాలను సేవిస్తూ ఉండడం వల్ల నివృత్తి కలుగదు. నిగ్రహం వల్లనే నివృత్తి కలుగుతుంది. శమం(శాంతి) కల్గుతుంది.

విషయాసక్తి గడియ గడియకు పెరుగుతుంది అదే దాని స్వభావము. ‘గీత’ ఇలా చెబుతుంది.

“ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగత్సం జాయతే కామః కామత్ క్రోధోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి”
(గీత అధ్యాయం 2, 62-63 శ్లోకాలు)

విషయాసక్తి వల్ల సంగము (attachment) దాని వల్ల కామము, అది తీరనప్పుడు క్రోధము, క్రోధం వల్ల మోహం, మోహం వల్ల విస్మృతి, విస్మతి వల్ల బుద్ది నాశనం క్రమంగా కలుతాయి. బుద్ది నశించిన వాడు పూర్తిగా పతితుడే అవుతాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము శాంతికి ఆవశ్యకం. అలాగ నిగ్రహం లేని నన్ను ఏ దొర కొడుకు కాపాడగలడు? అంటాడు త్యాగయ్య. ఈ విషయాకర్షణ దుస్సాంగత్యం వల్ల లభిస్తంది, సహజంగా కొన్ని పశులక్షణాలు మనిషిలో వున్నా వివేకం వల్ల నిగ్రహంచే శక్తి కూడా మనుష్యులలోనే వుంది. ఆ వివేకాన్ని సత్సాంగత్యం వల్ల పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు పాశవికమైన జంతు ధర్మం తగ్గుతూ ఆత్మ ధర్మం వికసిస్తుంది.

‘గడియగడియ నిండారు దుడుకు’ను ఎలా అదుపులో పెట్టాలి. పరిగెత్తే మనస్సుని బుద్ది అనే పగ్గంతో కట్టివేయాలి. అప్పడది ఆత్మ వశమవుతుందీ. ‘ఈ శక్తి యుక్తులను కూడా ఆ రాముడే ప్రసాదించాలి గదా!’ అని ఆయనకే విన్నవించుకున్నాడు. సదా భగవద్ధ్యానము వల్ల ఈ పట్టు చిక్కుతుంది. సత్సంగం వల్ల నిస్సంగం ఏర్పడుతుంది. ఆ సత్సంగం లభించడానికి గూడా రామానుగ్రం కావాలి. కాబట్టి నీదే భారం అనే ధోరణిలో తన వేదనంతా నివేదిస్తున్నాడు. తనవి దుడుకులని పరితపించడం కూడా భగవంతుని కరుణ లభించడానికి ఒక మెట్టే కదా. ఇది ఒక సంఘర్షణ. ఆత్మకు, మనస్సుకు. ఈ రెండు ఏకమైతే అదే యోగం. యోగేశ్వరుడైన ఆ పరమాత్మకే తన ఆర్తిని తెలుపుకోవడం శరణాగతుని లక్షణం.

“ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య కటకట నా చరితము కర్ణకఠోరమయ్య” అంటూ త్యాగయ్య వేరొక కీర్తనలో చక్రవాక రాగంలో జాలి తెలిపాడు.

చరణం1:

‘శ్రీవనితాహృత్కుముదాబ్జావాఙ్మానసగోచర’

హృదయాన్ని కలువతోను. కమలంతోను పోలుస్తుంటారు కవులు. కలువలకు చంద్రుడు, కమలాలకు సూర్యుడు ఆప్తులు. చంద్రోదయముతో కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో కమలాలు వికసిస్తాయి. రెండు రకాల పుష్పాలు దివ్యమైనవే. సూర్యచంద్రులిద్దరూ జగత్తుకు శ్రేయస్సు కలగించే వారే. భక్తుల హృదయాలు కూడా కలువల వలె కుసుమకోమలములైతే భగవంతుడు చంద్రుని వలె ఆ హృత్కుముదాలను సంతోష పెడతాడు. అంటె ఆప్తుడై వికసింప చేసి శోభినట్లు చేస్తాడు. జగజ్జనని అందరికి తల్లి ఆదిలక్ష్మి. ఆదినారాయణుడు తండ్రి. ఆ ఆదిలక్ష్మియే శ్రీవనిత, శ్రీసతి, శ్రీదేవి, శ్రీమాత – ఎలాగైనా పిలువవచ్చు.

ఆ శ్రీకాంత హృదయం కలువ వలె చల్లదనంతో లోకాలనెల్లా చల్లాగ చూస్తుంది. ‘శ్రీ’ అంటే కేవలం ధన దాన్యాలే గాదు మోక్షలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి. అన్ని విధాల సంపదను ‘శ్రీ’ అనే పేరు తోనే వ్యవహరించడం జరుగుతున్నది. సంపదలన్ని శ్రీదేవి ప్రసాదాలే. ఆ శ్రీదేవి హృదయ కుముదానికి (కలువకు) అబ్జుడు (చంద్రుడు) శ్రీహరి. అబ్జమంటే కమలం అనే అర్థం గూడా ఉంది. నీటి నుండి పుట్టింది గాన అబ్జమని పేరు. చంద్రుడు కూడా నీటి సారమే. ఈ ‘అబ్జుడు’ అనే మాట చంద్రుని పరంగా ఎక్కువ మంది కవులు వాడడం లేదు.

త్యాగయ్య ఇలాంటి పదాలెన్నింటినో వాడుకలోకి తెచ్చాడు.

లక్ష్మీ హృదయం అనే కలువకు చంద్రుని వంటి శ్రీహరిని త్యాగరాజు సంబోధించి కీర్తిస్తున్నాడు. లక్ష్మిదేవి చంద్రసహోదరి. ఇరువురు పాల సముద్రంలోనే ఉద్భవించారు. ఆ చంద్రసహోదరి విష్ణు వక్షస్థలం పై సదా విరాజిల్లుతూ ఉంటుంది.

“ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్”

నిత్యము విష్ణు వక్షస్థలం పై ఉండే లక్ష్మీదేవి నారాయణుని సాన్నిధ్యం వీడకుండా ఆ పరాత్పరుని సేవిస్తూ ఉంటుంది. అలా నిత్యలక్ష్మీ నిలయుడైన పురుషోత్తముడు.

అవాఙ్మానస గోచరుడు. ఆ పరాత్పరుని వాక్కుతోగాని మనసుతోగాని వర్ణించడానికి, ఊహించడానికి సాధ్యం కాదు. ఆనంద స్వరూపుడైన నారాయణుని ధ్యానం వల్ల మాత్రమే ప్రసన్నుడిని చేసుకోగలం. ఆత్మ స్వరూపుడై ఆ శ్రీహరి ప్రతి ప్రాణి హృదయంలో నివసిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడో వెదకితే దొరకడు. అంతరంగ నాథుడిని బహింరగంగా వెదకి ప్రయోజనము లేదు. ఆ భావనారాయణుడు భావంలో ఉండగా మాటలకు అందుతాడా? కాగా అంతర్ముఖులై ఆ అవాఙ్మానస గోచరుణ్ణి గోచరుడిగా చేసుకోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారము. ఈ ఆత్మను గురించి ఎంత చెప్పినా, ఎంత విన్నా, ఎంత వెదికినా, ఎంత చూచినా, ఫలించదు.

“ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్”
(భగవద్గీత, అధ్యాయం 2, శ్లోకం 29)

చూచి, వర్ణించి, విని గ్రహించడానికి వీలు లేని ఆ పరమాత్మను ధ్యానావస్థితులై తెలుసుకోవాలి. ధ్యాన యోగంలో గీతా చార్యుడు ఇలా ఉపదేశిస్తాడు.

“యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే
నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా”
(భగవద్గీత, అధ్యాయం 6, శ్లోకం 18)

ఇహ పరములకు రెంటికి సంబంధించిన తృష్ణ నుండి విడివడి నిస్పృహుడైన యోగి మనస్సు ఆత్మ యందే వెలయునప్పుడు అతడు యోగసిద్ధుడై అవాఙ్మానస గోచరమైన బ్రహ్మతత్త్వమును అనుభవించును. కేవలం తెలివితేటల వల్ల గానీ, వాక్చతుర్యం వల్లగానీ సర్వేశ్వరుని కృప సంపాతించ వీలుపడదు. భక్తి చేత, ధ్యానం చేత మాత్రమే ఆత్మ జ్ఞానం కలుగుతుంది.

చరణం 2:

‘సకలభూతములయందు నీవైయుండగ మదిలేకబోయిన’

“చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర చెలగి యుండే” (కీర్తన: రామ నన్ను బ్రోవ రావేమెకో?; హరికాంభోజి రాగం).

పరబ్రహ్మ రాముడు. అతడు సర్వాంతర్యామి. ‘సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం’ అని సుప్రభాతం ఈ సర్వవ్యాపకత్వాన్ని తెలుపుతుంది. అనాదిగా పెద్దలు ఈ సత్యాన్ని చెబుతునే వున్నారు. జనం వింటునే వున్నారు. అనుభవంలోకి తెచ్చుకుని ఆత్మజ్ఞానం సంపాదించుకొనే వారు మాత్రం కోటికొక్కరు మాత్రమే. ఇది లోక రీతి. ఇది విన్న విషయంగానే నిలిచిపోతున్నది. ఈ చెవున బడి ఆ చెవున వెళ్ళిపోతున్నది. హృదయంలో నాటుకోవడం లేదు. ఇదే జీవుని వేదన. ఈ వేదనే ఈ కీర్తన.

సకల భూతాల్లో ఉండేది నీవె అనే కనువిప్పు నాకు కలగడం లేదే అనే వేదన త్యాగయ్య చెప్పారు. వేదశాస్త్ర పురాణాలన్నీ ఈ సత్యాన్ని అడుగడుగునా జ్ఞాపకం చేస్తుంటాయి.

“యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి”

“సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే”
(భగవద్గీత, అధ్యాయం 6, 30-31 శ్లోకాలు)

(అర్జునా! సర్వభూతాలలో నన్ను, నాలో సర్వభూతాలని చూచు వానికి నేను సాక్షాత్కరిస్తూనే ఉంటాను. అతడు నా కటాక్షానికి పాత్రుడవుతూ ఉంటాడు. సర్వభూతాలలో వెతికే నన్ను భజించే యోగి ఏ పని చేయచున్నను నా యందే వర్తించుచుండను.)

అనగా భక్తుడైనవాడు తన నిత్య కృత్యమమందు భగవంతుని తత్త్వాన్నే అనుభవిస్తూ జీవయాత్రను ఆత్మయాత్రగా మార్చుకుంటాడు. అలాంటి బుద్దిని దయచేయ వలసినదిగా త్యాగయ్య రాముడిని వేడుకుంటున్నాడు. శాస్త్రంలో మాటలు అనుభవానికి రావాలి. ఆచరణ లేని శాస్త్ర పరిజ్ఞానం వ్యర్థం. అంతరాత్మ సరియైన మార్గమేదో సూచిస్తూనే ఉంటుంది. కాని మనస్సు దానికి విధేయంగా మసలుకోదు. ఇంద్రియాల వెంట పరుగులు తీస్తూ ఇంటికి దూరంగా వెడుతుంది. దారి తప్పిపోతుంది. జీవితం వ్యర్థమవుతుంది.

త్యాగయ్య సదా ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ మసలుకొన్న విజ్ఞాని. ‘అన్నీ నీ వనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసి కొంటినయ్యా. నిన్ను గాని పరుల నెన్నజాల మదిని. నన్ను బ్రోవవయ్యా. త్యాగరాజనుతా, మరుగేలరా’ అని సాధనా సామర్థ్యాన్ని రామునికి తెలియజేశాడు. (జయంతశ్రీ రాగం)

ఎంతటి నిగ్రహం కలవాళ్ళనైనా ఇంద్రియాలు మోసం చేయడానికి పొంచి చూస్తుంటాయి. కాబట్టి భక్తుడు, సాధకుడు ఏమరుపాటుతో అదమరచి ఉండరాదంటూ ఒక చోట గానం చేస్తాడు.

“ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనసా
క్షేమకరుడు త్యాగరాజు చిత్త హితుడు జగమునిండి” (హరికాంభోజి)

“సగుణములలో విగుణములలో సతతము
సాధు త్యాగరాజార్చితుఁ డిలలో
పరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె”

అంటూ సాధకులను హెచ్చరిస్తాడు. ఈ జగమంతా ఆ పరమాత్ముని లీలా సృష్టియే. అంతటా పరబ్రహ్మ సృష్టియే గోచరిస్తుంది. మన దృష్టిలో లోపాలేగాని, తెలుసుకుంటే అంతా లీలా విగ్రహుని సృష్టియే.

“ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి” అని ప్రహ్లాదుడు తన తండ్రికే బోధించాడు.

అని వేరే కీర్తనలో ఇదే భావాన్ని విస్తరించాడు త్యాగయ్య. ఇందుకు ఉత్తమ మార్గాన్ని కూడా సూచిస్తున్నాడు అదే కీర్తనలో

“సాధు సజ్జనుల బోధ చేత భవ
బాధ మాన వలె సాధకంబుతో
రామనామ భజరే మానస”

సాధించాలి, సాధన లేకుండా ఏది సిద్ధించదు. సాధుసజ్జనుల బోధ వినాలి. విన్నది ఆచరించాలి. ఈ చరణం సర్వవేదాంత సారం. కాబట్టి ఎంత విచారించినా అది అనంతమైన ఆత్మ విచారమే అవుతుంది.

చరణం 3:

‘చిరుత ప్రాయమునాఁడె భజనామృత రసవిహీన కుతర్కుఁడైన’

భక్తికి ఒక వయస్సు అనే నిర్ధారణ లేదు. అది గృహ వాతావరణం వల్ల, గురువుల బోధన వల్ల, జన్మతః సుకృతం వల్ల అలవడే దైవచింతన. కొందరు పసితనం నుండి మహాభక్తులుగా జీవితం కొనసాగిస్తారు. వీరు ఆగర్భ భక్తులు, ప్రహ్లాదుడు, మార్కేండేయుడు, ధ్రువుడు మొదలైనవారు. త్యాగయ్య కూడా ఆగర్భ భక్తుడే.

‘తల్లి దండ్రులు భక్తి నొసగి రక్షించిరి’ అని కీర్తనలో చెప్పుకుంటాడు. భక్తి వెన్నతో బెట్టిన విద్యగా వస్తేనే దృఢంగా ఉంటుంది. ఐదేండ్ల వరకు జీవితం వ్యర్ధమైంది అని ప్రహ్లాదుడు చింతిస్తాడు. త్వరగా శ్రీహరిని చేరవలెనని పరితపిస్తాడు. బాల భక్తుడైన త్యాగరాజు ఆ కోవకు చెందినవాడే. ఆ భక్తి చిరుత ప్రాయం నాడే వారికి కుదిరింది. అది మహా వృక్షంగా మారి అద్భుతమైన ఫలాలను లోకానికి ప్రసాదించింది. ఆ ఫలాలు వారి సాహిత్య సంగీత కళాఖండాలు.

‘కుతర్క లోకం’ అనేది చరణంలో విరివిగా కనబడుతుంది. భక్తులను గురించి, భక్తిని గురించి, పురాణాలను గురించి వాద తర్కాలు చేస్తూ భక్తి మార్గాన్ని విమర్శించే వారు అనేకులు వున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి మాత్రమే త్యాగయ్య తన ఆవేదనను వెలిబుచ్చాడు.

ఆయన భజనామృత రసపానం చేసిన ధన్యుడే. భక్తి రస విహీన కుతర్కుడు ఎంత మాత్రం కాదు.

“మోదకర శరీర మెత్తి ముక్తి మార్గమును దెలియక
వాద తర్కమేల శ్రీమ దాది త్యాగరాజనుతుని
భజన సేయవే మనసా పరమ భక్తితో
రామ భజన సేయవే” అంటాడు త్యాగయ్య.

ఆత్మ విద్య అనుభవైక వేద్యమేగాని వాద తర్కాలతో సాధించగలిగింది కాదు. శ్రద్ధా భక్తులు ప్రధానం. అంతః కరణ శుద్ధికి నామస్మరణ, ధ్యానం సత్సాంగత్యం, సాధుసేవ – ఇవన్నీ దోహదం చేసి, మన అంతరంగాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతాయి. ఆ వెలుగులో మనకు పరమాత్మ దర్శనం లభిస్తుంది. చీకట్లు చెదరిపోతాయి.

చరణం 4:

‘పర ధనములకొరకు నొరుల మదిని కరఁగ బలికి కడుపునింపఁ దిరిగినట్టి’

ఒక దుడుకు మరొక దుడుకుకు దారి తీస్తుంది. చౌర్యం, అసత్యం, హింస, ఒక దానికొకటి దోహదం చేస్తాయి. ఇహ సుఖాలకు ధనం ముఖ్యసాధనం. అది లేనినాడు ఇతరుల నుండి ఆ ధనం సంపాదించాలి. కష్టపడి సంపాదించే వాడికి కోరికలు ఎక్కువ వుండవు. సోమరికి కోరికలు ఎక్కువ. అందుకు ఇతరులను పొగడి, వాళ్ళ మనస్సు కరిగించి, డబ్బు తీసుకోవాలి. తన కడుపు నింపుకోవాలి. ఇందుకు ఎన్నెన్నో చోట్లకు తిరగాలి. నానా త్రిప్పటలు పడాలి. డబ్బు కలవాళ్ళను శ్లాఘించాలి. లేని సద్గుణాలు వాళ్ళలో ఉన్నట్లు అబద్ధం ఆడాలి. ఆ అసత్యపు కూటితో కడుపు నింపుకోవాలి. అసత్యం ఈ దుడుకు ప్రపంచంలో వీర విహారం చేస్తూ వుంటుంది. వీరిని ‘ఉదరశయనులు’ అని త్యాగయ్య వేరొక చోట నిందిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ వుండం వల్ల సంఘ విద్రోహశక్తులుగా తయారవుతారు. చివరకు జీవితాలు నికృష్టంగా ముగిస్తారు. అలాంటి వారిని చూసి జాలిపడి త్యాగయ్య రామునితో ఈ లోక రీతిని విన్నివించుకుంటున్నాడు.

“వట్టి గొడ్డురీతి భక్షించి తిరిగితి
పుట్టులోభులను పొట్టకై పొగడితి
దుష్టులతోఁ గూడి దుష్కృత్యములు సల్పి
ఱట్టుబడిన త్యాగరాజుని దయతో
ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య
కటకట నా చరితము కర్ణకఠోరమయ్య” (చక్రవాక- చాప)

ఈ చరణంలోని వాక్యానికి కీర్తన వ్యాఖ్య లాంటిది.

చరణం 5:

‘తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి’

ఈ లోకంలో అనుభవించిన విషయ సుఖములే పరమావధి అనుకొని రోజులన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు చాలామంది. ఇది అసుర సంపత్తి. పాపపుణ్యాలు అనేవి ఉన్నాయని పాప భీతితో రోజులు జాగ్రత్తగా గడపడం దైవ సంపత్తి.

ఇహం తప్పతే సాధిచాల్సిందేమీ లేదు అనేవారిని గూర్చి త్యాగయ్య నొచ్చుకుంటున్నాడు.

భగవద్గీతలో ఇలాంటి మనస్తత్వాన్ని బాగా వివరించడం జరిగింది.

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్

ఇద మద్య మయా లబ్ధం ఇదం సాప్ఫ్యే మనోరథమ్‌
ఇదమస్తీ దమపి మే భవిష్యతి పునర్ధనమ్‌

అనేక చిత్త వింభాంతాః మోహ జాలసమావృతాః
ప్రసక్తాః కామ భోగేషు పతంతి నరకే శుచో
(భగవద్గీత అధ్యాయం 16; 8, 13,16 శ్లోకాలు)

“ఈ జగత్తునకు ఎవడు అధికారి లేడు. ఇది తాత్కాలికం. దీనికి సర్వేశ్వరుడనే వాడు లేనే లేడు. స్త్రీ పురుష సంయోగం వల్లనే ఈ సృష్టి జరిగింది. ఎవడు కర్త లేడు. ఎవడికి వాడే అధికారి. ఇదిగో ఇది నేను గడించాను. ఇంకా ఈ కోరికలు తీర్చుకోబోతున్నాను. ఉండేదంతా నాది. ఇంకా ధనం సంపాదిస్తాను” అంటు పెక్కు సంకల్పాలతో కొందరు చిత్తం భ్రమించి మోహంలో పడి విషయసుఖాల ఊబిలో చిక్కుకొని కడకు నరకంలో పడిపోతారు. పరమాత్మను గురించి వీరు ఆలోచించరు. పరంధాముడొకడున్నాడని తెలియదు. జీవితంలో భోగాల వెంట పరుగులు తీస్తూ రోగాలు తెచ్చుకొని శాంతి లేక దీనావస్థతో ప్రాణాలు వదులుతారు. వీరికి హరి ప్రబోధములంటవు. ప్రహ్లాదుడంటాడు –

“అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిం
చెచ్చెర పుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్చనైన నే
మిచ్చిన నైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్”

పరలోక చింతన తమంతట తాము చేయరు. ఒకరు బోధించినా వినరు. ఇదే దుడుకుతనం. దీన్ని నీవే తొలగించి నా బిడ్డలను కాపాడవలెను రామా అని త్యాగయ్య ప్రార్థిస్తున్నట్లు మనం భావించాలి.

(సశేషం)

Exit mobile version