[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 5 త్యాగరాజు – పంచరత్నములు – గౌళ రాగం 3వ భాగము
చరణం 6:
‘తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుపదేశించి’
కొందరు భక్తుల వలె నటిస్తారు. మనస్సు మాత్రం విషయాదుల వెంట పరుగెడుతూ వుంటుంది. మాటల్లో వైరాగ్యం సూచిస్తూ ఉంటారు. అలాంటి వారి క్షుద్రులు. భద్రులు కారు. వీరిలో ముఖ్యంగా గాయకుల గూర్చి త్యాగయ్య ఆక్రోశిస్తున్నాడు. తమ నాద విద్య చేత ఆకర్షింపబడే స్త్రీలను వశం చేసుకోవడానికి గాయకులు తహతహ పడుతుంటారు. సంగీత రహస్యాలన్నీ తామే తెలుసుకున్న వారమని డంబాలు పలుకుతారు. ఉత్తమ గాయకులుగా మిమ్మలను తీర్చిదిద్దుతామని ఆశలు చూపి మోసం చేస్తారు. స్త్రీలోలురు అవుతారు. బలహీనులు వీరి వలలో పడతారు. ఉభయలు చివరకు మోసపోతారు. ఆత్మవంచన వల్ల శిలాత్ములు అవుతారు.
ఆత్మ వికాసం లేని వారే శిలాత్ములు. ‘ఎక్కడ వేశావు గొంగళి, వేసిన చోటునే ఉన్నాను’ అనే సామెత సార్థకం అవుతుంది.
సంగీత విద్యకు భక్తి వల్లనే సార్థకత సిద్దిస్తుంది. భక్తి లేని చోట సంగీతం ఊసర క్షేత్రంలో నాటిన విత్తనమే. ‘సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె’ అని త్యాగయ్య ఉద్బోధిస్తున్నాడు. సంగీతం మోక్ష మార్గంగా సాధించాలి. సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము గలదా? అని కూడా హెచ్చరించాడు (ధన్యాసి రాగం).
కవిత్వంగాని, గానం గాని పరమాత్మను ఉద్దేశించిందిగా ఉండాలి. ఇది చమత్కార విద్య గాదు. సంస్కారంతో సాక్షాత్కారం కొరకు ఉపయోగించేది మోక్ష విద్య. మిథ్యాచారం వల్ల విద్య సుఖమివ్వడానికి బదులు నరకంలో పడవేస్తుంది. భక్తి వల్ల అన్ని విద్యలు సద్గతిని ప్రసాదించగలవు. భగవంతుడు సామగాయనుడు. నాద స్వరూపుడు. చిత్తశాంతి నాదోపాసన లక్ష్యం. శ్రీహరి శుచిశ్రవుడు. పవిత్రమైన వీనులు గలవాడు.
‘రుద్రో బహుశిరా భభ్రుః’, ‘విశ్వ యోనిః శుచి శ్రవః’. ఆ నారాయణుని చెవులు పవిత్రమైనవి. మనం వినిపించే గానం అశుచిగా ఉండరాదు. భక్తి వల్ల గానానికి శౌచం ఏర్పడుతుంది. శ్రుతి సాగరుడు కాబట్టి అది శ్రుతి పక్వంగా ఉండాలి. సుస్వరము, భక్తి ఈ రెండు ఉత్తమ గాయకుని ప్రధాన గుణాలు.
“శుద్ధమైన మనసుచే సుస్వరముతో
పద్దు తప్పక భజియించే భక్త పాలనము సేయు” (కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు)
పరంధాముడు మన గానానికి మెచ్చి మనకు మోక్షం ప్రసదించాలి.
‘ఊరకయే కల్గునా రాముని భక్తి’, ‘తెలియలేరు రామ భక్తిమార్గమును’, ‘అది కాదు భజన, మనసా’, ‘భక్తుని చారిత్రము వినవే మనసా’ మొదలగు కీర్తనల్లో త్యాగయ్య భక్తిని విస్తారంగా ప్రస్తావించాడు. త్రికరణ శుద్ధిగా భజన చేయాలి. ఇతరులు తనను భక్తుడని పొగడాలి అనే తాపత్రయం వదలాలి. మనం చేసే కర్మలు, దానాలు, గానాలు అన్నీ ఈశ్వరార్పణంగా చేయాలి. చేయించేవాడు, చేసేవాడు, చేసే పని ఫలితం, ఫలం అనుభవించే పాత్ర అంతా బ్రహ్మ స్వరూపుడైన ఆ రాముడే అనే భావనతో చేస్తే అదే భక్తి భావం అవుతుంది. అహంభావం. సోహం భావంగా మారాలి. అదే తత్త్వదర్శనం. అంతా ఈశ్వర ప్రసాదంగా భావించాలి. తీర్థ ప్రసాదాల్లో అంతరార్థం ఇదే.
చరణం 7:
‘దృష్టికి సారంబగు లలనాసదనార్భకసేనామిత ధనాదులను దేవ దేవ’
దృష్టికి ఆకర్షణీయంగా కనబడే భార్యబిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, ధనదాన్యాలు పరిచారకులు ఇవన్నీ శాశ్వతంగా పొత్తు పెట్టుకొని ఉండవు. మన తోటి రావు.
“అస్థిరం జీవనంలోకి అస్ధిరం యోవవం ధనం
అస్థిరం దారపుత్రాని, ధర్మకీర్తి ద్వయం స్థిరం”
అని పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఈ మాట సంపూర్ణత్వం అని మనకు అనుభవంలో తెలుస్తూ ఉన్నది. కాని వాటిపై భ్రమ తొలగడంలేదు. యక్షుడు ధర్మరాజును వేసిన ప్రశ్నలలోని ‘ఆశ్చర్యం’ ఇదే. లోకంలో కెల్లా ఆశ్చర్యం ఏది అని యక్షుడు ప్రశ్నిస్తే ధర్మజుడు “నిత్యము తనను వదలి వెళ్ళె స్వజానాన్ని చూస్తూ తనకు కూడా ప్రాణత్యాగం ఒకనాటికి తప్పదని తెలిసి కూడా శాశ్వతంగా ఇక్కడ తిష్ట వేసుకొని చిరాయువుగా ఉండాలని మానవులు కోరుకుంటారు. ఆ భ్రమతోనే జీవితం అంతా గడుపుతారు. ఇదే అన్నింటిలోకి ఆశ్చర్యం” అని సమాధానమిస్తాడు. బొందిలో గాలి వున్నంత వరకు వ్యక్తిని కుశలం అడుగుతారు. గాలి నిలిచి పోగానే ఆ కట్టెను చూసి భార్య కూడా భయపడుతుంది. సాధ్యమైనంత త్వరగా ఇల్లు దాటించాలని చూస్తారు. ధనం చుట్టు భజన చేసే వారే గాని తనను చావు నుండి తప్పించేవారు గాన, ప్రేమతో తనతో బాటు వచ్చేవారు గాని గాదు. ఆదిశంకరుల భజగోవింద శ్లోకాలు విన్నాం గదా. ఈ రెండు శ్లోకాలు పై విషయాన్ని వివరిస్తాయి.
“యావత్-పవనో నివసతి దేహే తావత్-పృచ్ఛతి కుశలం గేహే।
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే॥” (6)
“అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యమ్।
పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః॥ (30)
భజగోవిందం భజగోవిందం”
తరింపదలచుకున్న సాధకుడు ఈ సంసార విషయాలను చక్కదిద్దుకుంటునే తన లక్ష్యం మాత్రం పరమాత్ముని నిలిపి అంతా రాముని లీల అనే సృహతో జీవితం గడపాలి. సంసారంలో కలిగే బాధలను, సుఖాలకు బద్దుడు కాకూడదు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్మించేవారు అధికులు. అందుకు తార్కాణం పట్టుకొమ్మ శ్రీరామ పదాబ్జ భజనము. అది మరవకుండా ఉండే వానికి తాత్కాలిక దుఃఖాలు మంచుతెరల వలె తొలిగిపోతు ఉంటాయి. అవి తెరలే. తెర వెనుక మూల విరాట్టు సత్య స్వరూపుడు. తెర మీద కన్పించేవి జీవితంలో కష్టసుఖాలు. అవి రెండు క్షణికాలు. అసలు జగన్నాటక సూత్రధారిని చూడాలి కాని, తెరలను చూచి అవే నాటకంగా భావించరాదు.
గీతా శాస్త్రం ఇలా హెచ్చరిస్తుంది.
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః॥
(భగవద్గీత 5-22)
(ప్రాపంచిక సుఖాలన్నీ స్పర్శ సుఖాలే. దుఃఖ మూలాలు ఆద్యంతములు కలవి. అనగా నశించేవి కాబట్టి ఓ అర్జునా వివేకం గలవారు వానితో రమించరు.)
రమిచడం వేరు. అనుభవిచడం వేరు. తెలివితో అనుభవించేవాడు ఈ సుఖాలు తాత్కాలికములు అనుకుంటూ దానిలో చిక్కుకొనడు. ఇదే వైకుంఠం అనుకొని అనుభవించడం, రమించడం.
దృష్టికి సారంగా (రుచిగా) కనిపించే ధన, దారా, పుత్ర, గ్రహాదులను నమ్మితే దుడుకులు పెరుగుతూపోతాయి. అలాంటి దుడుకు నుండి తప్పించి, నీ భజన వైపు మరలించి మమ్ములను కృతార్ధులను చేయవయ్య. రామయ్య. అని త్యాగయ్య లోకుల పక్షాన వేడుకుంటున్నాడు.
రాముని పదాబ్జములపై భక్తులు తుమ్మెదల వలె వ్రాలాలి. అప్పుడు ఆ పాదకమల మధువు రుచి తెలుస్తుంది. రుచి చూసినవానికి శ్రీహరి పదాబ్జములు వీడే మనసు కలుగదు. ఇందుకు సత్సంగం ఆవశ్యకం. భక్త కూటములలో భాగవతులు శ్రీహరి నామ స్మరణం ద్వారా ఆనందానికి అలవాటు పడతారు. ఇలాంటి వాతావరణం త్యాగయ్య గృహంలో సదా వెల్లివిరుస్తూ ఉండేది. భక్తులు ఎందరో వారి భజన సమావేశాలను తిలకించి, ఆనందించి భక్తిని అలవరుచుకొని ఉంటారు. వారెంత ధన్యులో. గుంటూరు జిల్లాకు చెందిన తూము నరసింహ దాసుగారు త్యాగయ్య సన్నిధిలో కొన్ని రోజులు గడిపిన ధన్యులు. వారు త్యాగరాజు భక్తిని గూర్చి వ్రాసిన పద్యం ప్రతి వారు వల్లె వేయవలసినది.
సీ.:
“కేశవానంద సంకీర్తనావళి వింటి భావసిద్ధియు శుద్ధ భక్తీ గంటి
భక్తులు, శిష్యులు బలసి కొల్వగా గంటి వాఙ్మాదురీ వైభవంబు గంటి
వినయ, సత్సంపద్వివేకంబు గంటి శ్రీ రామ పదభక్తి చెలువు గంటి
అజు కంద రాని అనుభవమును గంటి తన్మయత్వంబాత్మ తనరగ గంటి”
తే.గీ.:
రామ పద భక్త త్యాగయార్య వరునికిని
సమముగా నేర రేవ్వారీ క్ష్మాతలమున
ప్రేమ నా ఘనుడొక సారి పిలిచే నేని
రాముడు ‘ఓహో’ యనుచును మార్పలుకు నంట.
ఇటువంటి త్యగరాజును తలచుకొన్న యెడ భక్తి కుదురుతుందనడంలో సందేహం లేదు.
చరణం 8:
‘చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ’
శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహాన్ని వాల్మికి మహర్షి ఎన్న విధాల శ్లాఘించాడు.
“సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్।
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః॥”
(ఎక్కడా లోపం లేని విధంగా చక్కగా అమరినట్లున్న అంగములు, శ్యామసుందర వర్ణము, ముఖంలో ప్రతాపం ఉట్టిపడే తేజస్సు, విశాల వక్షస్థలం, కమలాల వంటి విశాల నేత్రాలు, లక్ష్మినిలయం వంటి శృంగారం, సర్వలక్షణ సమేతమైన మధర మంజుల మంగళమూర్తి రాముడు).
త్యాగయ్య శ్రీరాముని జగన్మోహన రూపాన్ని చాలా కీర్తనలలో వర్ణిస్తాడు.
“రూపము ప్రతాపము శరచాపము సల్లాపముగల నినువినా సుఖముఁగాన” (తోడి)
“ముద్దుమోము యేలాగు చెలంగెనో? మునులెట్లు గని మోహించిరో?” (సూర్యకాంతం)
“నా మనస్సు నీ సొగసు నీ దినుస వేరే లావణ్య రామ” (పూర్ణషడ్జము)
“మోహనరామ మొదటి దైవమా మోహము నీపై మొనసియున్నదిరా” (మోహన)
“కనులకు నీ సొగసెంతో గ్రమ్మి యున్నది గనుక నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరిహరి” (నవరస కన్నడ)
“నిగనిగమనుచుఁ గపోలయుగముచే మెఱయు మోము సొగసుఁ జూడఁదరమా” (కన్నడ గౌళ)
“ఎంతముద్దో ఎంత సొగసో ఎవరివల్ల వర్ణింపఁ దగునే” (బిందుమాలిని)
త్యాగరాజు వర్ణించిన రాముని సౌందర్యం చవిచూచిన వారి రామభక్తి సామ్రాజ్యంలో పెద్ద పదవి లభిస్తుంది. ఆ పదవి శాశ్వతం. అది అమృతం. తరుగు తిరుగు లేనిది. ఇలాంటి రాముని స్మరణ లేకున్నచో చెడు సహవాసం ఏర్పడును. అందువల్ల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు వ్యక్తిని ఆకట్టుకుంటాయి.
ఒక చోట కూర్చోనీయవు, నిలుచోనీయవు. మనసు మనదిగాదు. ఇక పతనంగాక మరేమవుతుంది? పొరపాట్లు అలవాట్లుగా మారతాయి. అవి అపరాధాలు. తెలిసి చేసినవి. కావున క్షంతవ్యములు గావు. వ్యసనాలకు అంతు ఉండదు. చిత్త చాపల్యం, తెరచాప లేని నావను గాలి తన ఇష్టం వచ్చిన దీశలో లాక్కొని పోయినట్లు వ్యక్తిని పరిగెత్తించి చివరకు నరకంలో పడవేస్తుంది. ఇటువంటి ప్రమాదాల నుండి తప్పించవలసినదని త్యాగ్యయ్య ప్రజా ప్రతినిధిగా రాముడిని వేడుకుంటున్నాడు. తనని భక్తి మార్గంలో పెట్టమని వేడుకుంటున్నాడు.
“భక్తి బిచ్చమియ్యవే.. భావుకమగు సాత్వీక భక్తి బిచ్చమియ్యవే!”
చరణం 9:
‘మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద’
‘జంతూనాః నరజన్మ దుర్లభం’ అన్నారు. ప్రాణికోటిలో నరజన్మ ఎంతో పుణ్యం చేస్తే గాని లభించదు. ఈ విషయం క్షణ క్షణం ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి. నేను సాధించవలసిందే ఆనందం అనే లక్ష్యం మరవరాదు. ఈ శరీరం అశాశ్వతమైనది గదాని నిరుత్సాహపడకూడదు. మూడు నాళ్ళ ముచ్చటకు ఎలా ప్రవర్తిస్తే ఏమి? నియమాలు ఎందుకు? ఇష్టం వచ్చినట్లు బ్రతికి వెళ్ళిపోతే సరిపోతుందని అనకుకోవడం అసుర లక్షణం. నిరాశావాదం. యథేచ్ఛావాదం. ఈ శరీరం మోదకరమైనది.
ఎన్ని ఖేధాలు ఎదురైనా మోదం కూడా ఉంది. అదే ఆనందం. శాశ్వత వస్తువు. బ్రహ్మపదార్ధం.
“మోదకర శరీర మెత్తి ముక్తి మార్గమును దెలియక
వాద తర్కమేల శ్రీమ దాది త్యాగరాజనుతుని
భజన సేయవే మనసా పరమ భక్తితో రామ భఝన సేయవే”
ఆయన ఆశావాది. శుష్కవైరాగ్యం బోధించడు. మనుష్యులకు మాత్రమే ఆనందానుభూతి సాధ్యమవుతుంది. అలాంటి ఆనందానికి నోచుకోకుండా మదమత్సర కామలోభమాహదులకు దాసుడు కావద్దని హెచ్చరిక.
నా కులం గొప్ప. నేను బ్రాహ్మణుడను నాకు ఎలాగు ముక్తి ఖాయం అని విర్రవీగి మోసపోవద్దు.
“చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః” అని గదా గీతాచార్యుని తీర్పు. గుణాన్ని బట్టి నీవు బ్రాహ్మణుడవు కావాలి గాని జన్మను బట్టి కాదు. బ్రహ్మజ్ఞానం లేని వాడు పుట్టింది బ్రాహ్మణుల వంశఁలో అయినా అతనికి బ్రాహ్మణుడని చెప్పుకునే నైతిక అధికారం లేదు.
జన్మనా జాయతే శూద్రః అనేది ఆర్యోక్తి.
జన్మతః ప్రతి వ్యక్తి శూద్రుడే. కర్మ వల్ల జ్ఞానం వల్ల బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణుడు కావాలి. బ్రాహ్మణుడనిపించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. విశ్వామిత్రుడు రాజుగా ఉండి రాజర్షియై క్రమంగా బ్రహ్మజ్ఞానం వలన బ్రహ్మణుడైనాడు గదా. గుణములే పూజించవలసినవి. జాతి వయోభేదాలు కాదు.
“గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయః” అని ఆర్యోక్తి. కామమోహ దాసులైనవారు నరాధములను ఆశ్రయిస్తారు. దుర్యోధనుడు శకునిని ఆశ్రయించినట్లు. ఆ పాపుల మతములు భయంకరములై హింసాదులతో కూడి ఉంటాయి. ఆ విషవలయంలో చిక్కుకొని తారుమారు పనులు చేస్తూ బుద్ది నశించి జీవితం అంధకారమయం అయిపోతుంది. ఈ విషయాదుల చక్రవ్యూహంలో చిక్కుకోకుండా ఉండవలసినదని లోకానికి త్యాగయ్య హెచ్చరిక చేస్తున్నాడు.
చరణం 10:
‘సతులకై కొన్నాళ్లాస్తికై సురులకై కొన్నాళ్లు ధన’
కాంతా కాంచన కాంక్ష లోకంలో విరివిగా తాండవిస్తూ ఉంటుంది. ఈ రెండు ఒకే నాణానికి రెండు వైపులు. కామం మూలం. ఇది తీరడానికి కాంచనం కావాలి. ‘సంసారం’ అంటే తమిళంలో ‘భార్య’ అని అర్థం. గృహస్థ జీవన పరిణామం సంతానం. కొడుకులు కలిగి, కూతుళ్ళు లేకపోయినా; కేవలం కుతూళ్ళే ఉన్నా కొరవే. ఆ తాపత్రయంతో సంసార విస్తారం జరుగుతుంది. ఈ సంసార నిర్వహణకు ధనరాశులు కావాలి. ఎంత కావాలంటే దీనికి జవాబు ఎవ్వరి వద్దా లేదు. ఎంత ఉన్నా ఇక చాలు అనే వారు ప్రపంచంలో లేనే లేరు. ప్రాణం విసిగిపోతుంది. కూడబెట్టినది కాపాడటం కష్టం. చోర భయం. కాపుదల యందొక దుఃఖము. దుఃఖముతో గడపాలి. దారి తెన్నూ కనబడదు.
“నానాటి బ్రతుకు నాటకము.. కానక కన్నది కైవల్యము” అన్నాడు అన్నమయ్య.
“మన వెంట వచ్చేది సంస్కారంగాని సంసారం కాదు” అని చమత్కరించారు బాగ. దానిలో ఎంతో గూఢార్ధం వుంది. ఇంతకి మనకి సంసారం నుండి బయటపడే మార్గం లేదా, ఉంది. ఆ మార్గం అన్వేషించాలి. సంసారం మోక్షం లేదు అని చెబితే దేవుడిని కొలిచే వారెవరూ ఉండరు. అందుకే త్యాగయ్య జీవిత బీమా హామీ యిచ్చాడు. అదే ముక్తి భీమా. దారా పుత్రాదులను కూడా భగవంతునికి పరిచారకులను చేసి, వారితో పాటు నీవు కూడా తరించు అంటారు.
“సంసారులైతే నేమయ్య, శిఖిపింఛావతంసు డెదుట నుండగ
క్రూరపు యోచనలు దూరుజేసి తన
దారపుత్రులఁ బరిచారకుల జేసి
సారరూపుని పాదసారస యుగముల
సారె సారెకు మనసార పూజించువారు
సంసారులైతే నేమయ్య” (సావేరి ఆది)
అన్ని దుడుకులు తీరడానికి భక్తిమార్గము ఒక్కడే చక్కని రాజమార్గము.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
