Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-13

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 5 త్యాగరాజు – పంచరత్నములు – గౌళ రాగం 4వ భాగము

గౌళ – ఆది – ‘దుడుకుగల నన్ను’ కీర్తన సంగీత సాహిత్య విశ్లేషణ:

మొదటి కృతిలో పరమాత్ముని ఉత్తమ గుణములను ఉదాత్తంగా దర్శింప చేసిన త్యాగయ్య ఈ రెండవ కృతిలో మానవుని యందు  సహజ అవగుణములను ఎత్తి చూపుతారు. పరమమాత్మ గుణాలను ‘నాట’ కృతి ద్విగుణీకృతం చేస్తే సామాన్య జీవియైన మానవునులో వుండే షడ్గుణాలను దీనంగా, జాలిగా చూపుతుంది. ‘గౌళ రాగము’. పరమాత్మకు జీవాత్మకు ఎంత ‘అంతరమో’ ఆ భావాలు అంత దూరమైనవి. ఇటు వీర రస భావం. అటు కరుణరస భావం. త్యాగయ్య గారి సాహిత్యంలో తగు రాగ నిర్ణయం చక్కగా పరిశీలించవచ్చు. జీవికి ‘మానవత’ లభించిన తరి హరి దరిచేరె మార్గం కావాలి. దైవస్థితికి గల  సంబంధం అంతరం స్ఫురింప చేసి, ‘భగవద్గుణ గానమే’ కర్తవ్యమని తెలియచేస్తారు త్యాగయ్య. ఇది ఉపదేశ కృతి.

త్యాగయ్య రోజు ఉంఛ వృత్తి చేసి, లభ్యమైన వస్తువులతో నియమబద్ధమైన జీవితం గడిపారు. రామ పూజ కైంకర్యము తప్ప ఇతర విషయాల కోసం తాపత్రయ పడలేదు. సమాజంలో నీతి, రీతులను, మంచి చెడులను గమనించిన వారై ప్రజలకు మేలు కూర్చవలెననే సాభిప్రాయంతో సమాజ సేవా దృష్టితో అనేక దుడుకు (నేరము) తనములను తాను చేసినట్టుగా తనయందు ఆరోపించుకొనినారు. ఎంతటి త్యాగబుద్ధి? ఇన్ని నేరములను చేసిన నన్ను ప్రజలను, ఏ దొర కొడుకు రక్షించుతాడయ్యా అంటూ బాధపడతారు.  అనేక అవగుణ పరంపరలను తెల్పి వాటిని గురించి దైవ చింతనే మేలు అని తెలుపుతారు. గౌళ రాగం ఈ సాహిత్య భావానికి చాలా నప్పినది. రిషభ స్వరం ఆందోళిత గమకం చేయడం వల్ల భావం.

పల్లవి, అనుపల్లవి స్థాయి అంతరం. 1వ స్వర సాహిత్యం మంద్ర రిషభం, ప్రత్యేకత కల్గినది. 3,4,5,6 చరణాలు గాంధార ప్రమోగం లేదు.

ఆ చరణం ఆరంభంలో సమ యతి.

7లో గాంధారం హ్రస్వం, 8వ చరణం గాంధార దీర్ఘం. 2వ చరణంలో ని స రి గ మా స రి గా మ రి రి స – హ్రాస్వ దీర్ఘంగా గాంధార ప్రయోగం. 9వ చరణంలో నాలుగు ఆవర్త నిడిని కలిగిన స్వరం, సాహిత్యం ఆవర్త. ఆవర్తానికి క్రమంగా భావోద్వేగం, స్వరస్థాయి, అభివృద్ధి కలిగి నాలుగో చరణంలో తీవ్రమై, అవరోహణకు వచ్చి చేరుతుంది. 6వ చరణంలో ని మ ప సా ని – స ని స రీ లు – రి స ని సా సి  మ రీ రి స ని రి సా స ని ప – స నీ ప మ రి – ని పా మ రి స

6వ చరణంలో స్వర కూర్పు అందమైనది. దీనికి తగిన చక్కని విరుపుగల 5 అక్షరాల పదాల సాహిత్యం గమనించండి.

ఉపదేశించి – సంతసిల్లి – స్వరలయంబు – లెఱుఁగకను

శిలాత్ములై సుభక్తులకు – సమానమను

1, 2, 3,4 చరణాలు నిర్మాణం పంచమి స్వరం లోపు అవడం వల్ల హృదయగత భావం మీద మిక్కిలి భావపూర్ణంగా చెప్పబడినది.

ఇక సాహిత్యంలో రణా, వగుణా, సురగణా, మదహరణ – ‘ణ’ ఆవృత్తి – వృత్యానుప్రాస.

9వ చరణం సా సా స అనటంలో ఉల్లసిత గమకం ఓం కారాన్ని స్పురింప చేస్తుంది. చరణాల ఆరంభంలో అనేక చోట్ల స్వరాక్షరాలున్నాయి.

***

ఈ కృతిలో శ్రీరాముడు సమస్త కళ్యాణ గుణాభి రాముడయితే, మానవుని ప్రకృతి దురాచరములే. ఈ రెండవ కీర్తనలో మానవుని విషయ వాంఛాలోలత. ఈషణత్రయము, దేహాత్మాభిమానము మొదలైనవి పేర్కొనబడ్డాయి. వీటికి మానవుడు దాసుడైతే రాముని దయ రాదు. ‘కనుక ఓ నరుడా నిన్ను నీవు శుద్ధి చేసుకో. లేకపోతే నీకు దుర్గతే రా’ అని ఒక హెచ్చరిక ఇచ్చినట్లుగా వుంటుంది ఈ రచన.

రాగ లక్షణం:

ఆరోహణ – స రి మ ప ని స

అవరోహణ – స ని ప మ రి గ మ రి స

పాపాంధకారం చేత పతితుడైతే చెడు సహవాసముల చేత స్వరూప నాశనం జరుగుతుంది. భక్తిని అలవరచడం సాధకుని కర్తవ్యం. విద్యాగంధం ఆర్జించాలి. రెండో దశలో భక్తి వశపురుష అన్నారు. 3వ దశలోనైనా తెలివితో, చెలిమితో, భక్తి ప్రవీణ పోషణ విలువలు చెప్పాలి ఆచార్యుడు. నాల్గవదశ లోనైనా భగవత్ భక్తికి నోచుకోకపోతే జీవితం తారుమారు అగుట తథ్యం. యోగశిఖోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు  బృహదారణ్యకోపనిష్తుత లందు భావములు ఈ కృతి యందు సుభితము.

సాహిత్యం – గౌళ:

పల్లవి:

దుడుకు గల న న్నేదొర కొడుకు బ్రోచురా యెంతో

అనుపల్లవి:

కడు దుర్విషయా కృష్ణుడై గడియ గడియకు నిండారు

1వ చరణం:

శ్రీవనితాహృత్కుముదాబ్జావాఙ్మానసగోచర

2వ చరణం:

సకలభూతములయందు నీవైయుండగ మదిలేకబోయిన

3వ చరణం:

చిరుత ప్రాయమునాఁడె భజనామృత రసవిహీన కుతర్కుఁడైన

4వ చరణం:

పర ధనములకొరకు నొరుల మదిని కరఁగ బలికి కడుపునింపఁ దిరిగినట్టి

5వ చరణం:

తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపెడి

6వ చరణం:

తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుపదేశించి

సంతసిల్లి స్వరలయంబు లెఱుఁగకను

శిలాత్ములై సుభక్తులకు సమానమను

7వ చరణం:

దృష్టికి సారంబగు లలనాసదనార్భకసేనామిత ధనాదులను దేవ దేవ

నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన

8వ చరణం:

చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ

జేయక దుర్మదాంధ జనులఁ గోరి పరితాపములచే దగిలి

నొగిలి దుర్విషయదురాసలను రోయలేక సతత

మపరాధియై చపల చిత్తుఁడైన

9వ చరణం:

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద

మందలేక మదమత్సరకామలోభమోహములకు దాసుఁడై

మోసబోతి గాక మొదటి కులజుఁడగుచు భువిని శూద్రుల

పనులుసల్పుచును యుంటినిగాక నరాధములను గోరిసార

హీనమతములను సాధింప తారుమారు

10వ చరణం:

సతులకై కొన్నాళ్లాస్తికై సురులకై కొన్నాళ్లు ధన

తతులకై దిరిగితినయ్య త్యాగరాజాప్త యిటువంటి

(సశేషం)

Exit mobile version