Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-14

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 6 -3వ పంచరత్న కీర్తన ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – ఒకటవ భాగం

భగవంతుని మహిమలు వేదంలో వర్ణించబడతాయి. భాగవతాదులలో లీలలు వర్ణించారు. ఈ లీలలు ఆధారంగా చేసుకొని భక్తులు – “భగవంతుడు మాయలోడు, ఒకటి చెప్పి ఒకటి చేస్తాడు. తనను భజింపమని చెప్పి  భజించిన వాళ్ళను కన్నెతి చూడడు, దూర దూరంగా పోతాడు” అని ఎత్తి పొడుస్తారు. ఇది భగవంతుని ఎడబాటును సహించలేని ‘ఆర్త ప్రపత్తి’ అని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఈ కృతిలో భవన్మహిమలు చాలా చక్కగా మర్ణించారు. ఇంత వర్ణించి తుదకు ‘ఇటువంటి వాడవు నన్ను సాధించావు’ అంటారు త్యాగయ్యగారు. దానిని ఆలంకారికులు ‘నిందాస్తుతి’ అని అంటారు. అనగా నిందవలె కనబడే స్తుతి అన్నమాట.

3వ పంచరత్న కీర్తన – ఆరభి – ఆది:

పల్లవి:

సాధించెనే ఓ మనసా

అర్థం:

కీర్తన ఈ పల్లవిలో శ్రీరాముని పరంగా భావిస్తూ అనుపల్లవిలో తెలియపరిచినట్లు, శ్రీరాముడు సన్మార్గ వచనంగా నాటి పండితులు త్యాగయ్యగారిని సాటి విద్వాంసునిగా అంగీకరించనందున వారి మాటలను (అబద్దం అంటూ) బొంకు చేస్తూ, త్యాగయ్యగారిని విద్వాంసునిగా గుర్తించి పట్టుదలతో నిరూపణం చేయడం అనుకోవచ్చు. దీనినే శ్రీకృష్ణుని పరంగా ఆలోచిస్తే త్యాగరాజ స్వామి నిందాస్తుతుల రూపంలో తాను ఇంతకు ముందు బోధించిన సుభాషితాలను ప్రక్కకు త్రోసి అతిక్రమణ చేయడం అని భావించవచ్చు, మొదటి నాల్గు చరణాలు శ్రీకృష్ణుని పరంగా ఉన్నందున.

అనుపల్లవి:

బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తాఁ బట్టినపట్టు

అర్థం:

శ్రీకృష్ణావతారంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను నిర్దేశించిన, మంచి మాటలను, తను చేసిన బోధనలకు భిన్నంగా తాను ధృడంగా నిశ్చయించుకొన్నట్లుగ.

విశేష అర్థాలు – త్యాగయ్య తన భక్తుడు, విద్వాంసుడు అనే అర్థంలో 3వ చరణంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలోని తన బోధనలకు విరుద్దంగాను, శ్రీరాముని పరంగా అయితే నాటి సాటి  పండితుల భావనలను, 4వ చరణంలో అబద్దాలుగా నిశ్చయించడం అనుకోవచ్చు.

1వ చరణం:

దేవకి వసుదేవుల నేగించినటు

అర్థం:

ఇక్కడ త్యాగరాజు స్వామి భగవంతుని సొగసుగా నిందిస్తూ, స్తుతించారు. అవతార చర్యాలను ఎత్తిపొడుపులుగ సామాన్యుని మనస్సులో హత్తుకొనేట్లు తమ మనస్సును సంబోధిస్తూ బోధ సలిపారు. ప్రపంచం అంతా భగవంతుని క్రీడారంగం. భగవానుని అవతార లీలలను, జీవుల అభిరుచులను, కర్మ విశేషాలను బట్టి ప్రవర్తింప చేస్తూంటారు. ఒక్కక్క లీల బయటకు ఒక రకంగాను, అంతరంగికంగా మరో దానిగాను కనబడుతుంది.

శ్రీకృష్ణ పరమాత్మ తన తల్లి తండ్రులైన దేవకీ వసుదేవులకు, నందయశోదలకు పరమార్ధ సత్యాన్ని మరుగు పరచి నటించాడు. ఈ పరోక్ష నటనలో దైవ విభూతి కనబడుతుంటుంది.

ఈ సత్యానికి అనుగుణంగానే త్యాగరాజస్వామి భగవానునిపై ఏదో నేరం ఆపాదించి ముచ్చటిస్తున్నట్లు దైవీ గుణాలను స్తుతిస్తున్నారు. శ్రీకృష్ణావతార ఫలితంగ కన్నవారు కారాగార బద్దులవడం, అనేక కష్టాల పాలు అవవలసి వస్తుందనే త్యాగరాజుగారి ఎత్తి పొడుపు గోచరిస్తుంది. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు తాను బోధించిన భగవద్గీత బోధలకు భిన్నంగా  తన మొండి పట్టును నెరవేర్చుకున్నాడు.

2వ చరణం:

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు

అర్థం:

భూలోకం అనే రంగస్థలం మీద జగన్నాటకాన్నే సూత్రధారిగ నిర్వహిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ, పవిత్ర గంగానది ఆవిర్భావానికి మూలం అయిన తండ్రి, తన దివ్య వేణు గానంతో సంగీత శాస్త్రానికి నిబద్దత ఏర్పరచి అందరను సమ్మోహనపరుస్తూ పోషిస్తున్నాడు. ఇదొక సమయానుకూల లక్షణం.

3వ చరణం:

గోపీ జన మనోరథ మొసంగ లేకయే గేలియుఁ జేసెడువాఁడు

అర్థం:

గోకులంలోని వారందరు శ్రీకృష్ణుని ప్రేమించి ఆరాదించే వారే. వీరంతా శ్రీరామావతార కాలంలో మహర్షులు. ఆ సమయంలో వీరంతా శ్రీరాముని ఆలింగనము అభిలషించగా, అది ఆ అవతార సమయంలో సాధ్యపడదని, వారి కోరిక శ్రీకృష్ణావతార కాలంలో సిద్ధిస్తుందన్నారు. శ్రీకృష్ణావతార కాలంలో భగవానుడు ఈ వాగ్దనాన్ని నెరవేర్చలేక, వారిని అపహాస్యం చేస్తూ, సమయానికి తగినట్లు మాట్లాడుతూ, తన పట్టును సాధించుకొన్నాడని త్యాగరాజ స్వామి నిందాపూర్వక స్తుతి చేస్తున్నారు. శ్రీరామావతార కాలంలో శ్రీరాముడు ఒకే మాట మీద నడచాడు.

4వ చరణం:

వనితల సదా సొక్కఁ జేయుచును మ్రొక్కఁ జేసె పరమాప్తుఁడదియుగాక యశోద తనయుఁడంచు ముదంబునను ముద్దుఁ బెట్ట నవ్వుచుండు హరి

అర్థం:

శ్రీకృష్ణుడు తాను అనాది బ్రహ్మచారి అయి మరో ప్రక్క స్త్రీలోలునిగా కనబడుతూ గోపికల వస్త్రాలను దొంగిలించడం మున్నగు అల్లరి పనులు చేస్తూ తాను యశోద కుమారుడు కాదనీ తెలిసి కూడా తనను యశోద స్వంత కొడుకు అని భావిస్తూ ముద్దుపెట్టుకోగా ఆమె అమాయక స్థితికి నవ్వేవాడు. ఆమె ముంగిట తన ముగ్ధభావాన్నే ప్రదర్శింప చేసే వాడేగాని, అసలు రహస్యాన్ని బయటపెట్టలేదు. ఇలాంటివే శ్రీకృష్ణుని మోసాలు ఇలా సమయానికి తగ్గట్టు మసలుతూ అవతార ప్రయోజనాన్ని సాధించారు.

5వ చరణం:

పరమభక్తవత్సలుఁడు సుగుణ పారావారుం డాజన్మ మనఘఁడీ కలి బాధల దీర్చువాఁడనుచు నే హృదాం బుజమున జూచుచుండగ

అర్థం:

శ్రీ కృష్ణ పరమాత్మ సుగుణాల ప్రోగు అయి తన భక్తులను బిడ్డలలాగ ప్రేమతో సాకుతున్నాడు. అన్ని అవతారాలలో పుణ్యాన్ని పంచినవాడు. ఈ కలికాలంలో ప్రకృతి సిద్ధ బాధలను తొలగించువాడు అని మనమందరము  నమ్ముతుండగ, ఆ నమ్మకానికి భిన్నంగా తనను కాపాడడం లేదని త్యాగయ్య గారు శ్రీ కృష్ణుని నిందిస్తూ స్తుతిస్తున్నారు.

6వ చరణం:

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరనారీ సోద రాజవిరాజ తురగ రాజ రాజనుత నిరామయాపఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తాఁ బ్రోవకను

అర్థం:

జనుల పాపాలను హరించి, చల్లని చంద్రుని వెలుగులకు సాటి అయిన ఆనందాన్ని అందిస్తూ, రఘువంశానికి నాయకుడై, మృదుభాషిత్వంతో, శేషతల్పమున పరుండుతూ, పుట్టక లేని సనాతనుడగా ఉంటూ, ఎల్లరు స్త్రీల పట్ల సోదర భావంతో మెలగుతూ గరుడ పక్షిపై తేజోవంతంగా విహరిస్తూ, రారాజుల స్తుతులను అందుకొంటూ కలువరేకల వంటి కన్నులు ఉన్న నిన్ను శరణు కోరుతున్నాను. నన్ను కరుణించకుండ సాధిస్తున్నావు.

7వ చరణం:

శ్రీవేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధర లస న్మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుఁడు మానవేంద్రుఁ డైన రామచంద్రుఁడు

అర్థం:

శ్రీరామా, నిన్ను కలియుగంలో పాపాలను హరించే వేంకటేశ్వరుని గాను, దివ్య జ్ఞానంతో ప్రకాశించే వానిగాను, సర్వోన్నతునిగాను, మంచివారి మనస్సులలో ఎల్లప్పుడు ఉండే వానిగాను, బంగారు వస్త్రాలు ధరించిన వానిగాను, ప్రకాశమానమైన కిరీటం, కుండలాలతో విరాజిల్లే వానిగాను, హరీ అని కీర్తిస్తున్నా తనను కరుణించక శ్రీరాముడు సాధిస్తుండడం పట్ల త్యాగరాజు వాపోతున్నారు.

అనుబంధం:

సమయానికి తగుమాటలాడెనె సద్భక్తుల నడత లిట్లనెనే యమరికగా నాపూజఁ గొనెనే యలుగ వద్దనెనే విముఖులతోఁ జేరఁ బోకు మనెనే వెత గలిగిన తాళు కొమ్మనెనే దమశమాది సుఖదాయకుఁడగు శ్రీ త్యాగరాజ నుతుఁడు చెంతరాకయే

అర్థం:

త్యాగరాజుగారు, తనకు శ్రీరాముడు సాక్షాత్కరించకుండానే, దూరంగా ఉంటూ పలు నీతులను బోధిస్తూ, త్యాగరాజుగారి ప్రవర్తనను మెచ్చుకుంటూ తనను సద్భక్తుడు అనీ, కోపగించరాదనీ, నాస్తికులతో సహావాసం చేయరాదనీ, శాంతంతో ఇంద్రియనిగ్రహం కలిగి ఉండాలనీ, కష్టాలను ఓర్చుకొనమనీ, తాను త్యాగరాజుగారి పూజలను స్వీకరించాననీ, స్వయంగా శ్రీరాముడు ఈ విషయాలను తనకు తెలియజేసినట్లు త్యాగయ్యగారు భావిస్తున్నారనేది ఈ చరణపు సారాంశము. దీనినే భగవానుని సమయానుకూల ప్రవర్తన అంటున్నారు త్యాగరాజస్వామిగారు.

(సశేషం)

Exit mobile version