Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-15

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 6 -3వ పంచరత్న కీర్తన ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – 2వ భాగం

ఆరభి – ‘సాధించెనే ఓ మనసా’ సాహిత్యం:

ఎన్.సి.హెచ్. కృష్ణమూర్తి గారి విశ్లేషణ:

ఆరభి పంచరత్నకృతిలో ఏఏ విభాగములు వున్నాయి అంటే అందరు ఏకగ్రీవంగా చెప్పే సమాధానం పల్లవి ఒక భాగం, అనుపల్లవి ఒక భాగం, ‘సమయానికి’ అన్న ఒక ఆవృత్తము ఒక విభాగం, స్వర సాహిత్యములు వేరే ఒక విభాగం, తరువాత, సద్భక్తుల వద్ద నుండి చివరి వరకు ఒక విభాగం అని చెప్పిరి. సంగీతజ్ఞులు నిర్ణయించుకొన్న విభజనను బట్టి ‘సమయానికి’ అనే ఆవృత్తము స్వరసాహిత్యములకు ముందటి భాగం అని తేలినది. అపుడు ‘సద్భ’ అను దారికి అనుగుణంగా తక్కిన ఆవృత్త విభాగాలలో హృద్భావ, ఉద్బవ, ఉద్బట, చిద్భాస వంటి పదాలతో ప్రాస గూర్ప వలసియున్నది. అట్లుగాక ‘సద్భక్తుల’ అనే ఒక ఆవృత్తాన్ని విడదీస్తే ‘అమరిక, విముఖల, దమశము’ అని మకార ప్రాసతో మూడు విభాగాలున్నవి. ఈ విభాగములు రెండావృత్తముల కల్గియున్నవి. రెండవ ఆవృత్తమున ‘యతి’ కూర్చబడినది. అమరికలోని ‘అ’కు అలుగవద్దు లోని ‘అ’కు యతిమైత్రి ‘విముఖల’ లోని ‘వి’కి వెతగల్గిన ‘వె’కి మైత్రి – దమశము లోని ‘ద’కు త్యాగరాజు లోని ‘త్యా’కు మైత్రి. మరి మూడు విభాగములకు సలక్షణముగా యతి ప్రాసలతో రెండు ఆవర్తములుండి మొదటిదని భావింపబడిన ‘సద్భక్తుల’ అనే మైత్రి తక్కిన భాగములలో (లేక) వేరుగా ఉండుట ఏమిటి అనే ప్రశ్నలు పుట్టును.

స్వర సాహిత్యములన్నియు అయిన తరువాతనే – సమయానికి వద్ద నుంచి వేరు భాగమని భావింప వలెను. స్వర సాహిత్యము వరకు పూర్వార్ధమని – సమయానికి వద్ద నుండి ఉత్తరార్ధమనియు భావింప వలెను. అపుడు సత్యము సమంజసమే అగును. సమయానికి – లోని – సమ –ను బట్టి యే – అమ – విమదమి – ను తక్కిన మూడు ఖండములుక ప్రాసకూర్పబడినది. సమయానికి  – సద్భక్తుల – అను రెండు ఆవర్తములు తక్కిన మూడు ఖండములు వలెనే రెండా వృత్తముల ఖండమై అవి అన్నము మొత్తం నాలుగు ఖంములై గేయమున కాక సంపూర్ణత వచ్చింది.

శ్రీ కల్లూరి వీరభవ్రశాస్త్రిగారు:

శ్రీ కల్లూరి వీరభవ్రశాస్త్రిగారి గ్రంథం ప్రకారం ‘సమయానికి’ ముందు పాడి తరువాత స్వరసాహిత్యములు పల్లవితో ముడి పడివుండడం స్వరసాహిత్యముల తరువాత పల్లవి ఎత్తుకొనుట ఒక్కటే సమంజసము. సమయానికి ముందుగా వ్రాయునవసరం లేదు. స్వరసాహిత్యముల పిదపనే ఒక్క పర్యాయము వ్రాసియుండిన బాగుండేదని ఒక ఆలోచన. త్యాగయ్య గారి రచనలలో సాధారణంగా అనుపల్లవి, చరణం ఉండే స్వరసాహిత్యములు పల్లవికే వ్యాఖ్యాన ప్రాయములై ఉంటుట సంప్రదాయం. ఈ పంచరత్నాలలో నాట గౌళ, శ్రీరాగ, వరాళి కీర్తనలలో కూడా ఇదే లక్షణం. ఇది అనివార్యం. పల్లవి అంత అర్థవంతమైనదన్న మాట.

ఇక అర్ధవిచారణ చేసినా సాధించెనే అనునదే చక్కగా పొసగును. అర్ధవిచారణ చేయునపుడు యోగ్యత, సన్నిధి, ఆకాంక్ష ఇట్లుండును. సాధించినాడు (పల్లవి) దేనిని సాధించినాడు, అనుపల్లవి అయిన బోధించిన ..తాపట్టిన పట్టు సాధించినాడు. ఎట్లు సాధించినాడు?

ఒకటవ స్వరసాహిత్యం:

దేవకీ వసుదేవుల నేగించినట్లు సాధించినాడు. ఈ అర్థమందు యోగ్యత యున్నది. కాని దేవకీ వసుదేవులను ఏచినట్లు సమయానికి తగు మాటలాడినాడు అను అర్థమున యోగ్యత తక్కువగ యున్నది. త్యాగయ్యగారి దృష్టిలో సాధించుట అనునది ముఖ్యోద్దేశము. అందుకే దానిని పల్లవిగా గ్రహించుట జరిగినది. ఈ సాధించినది ఎవరు?

రెండవ స్వరసాహిత్యం:

“రంగేశుడు సంగీత సంప్రదాయకుడు”. ఇది కర్తృ పదము, ఇప్పటికి సాధించిన రీతి ఎట్లో కొంత తేలింది. సాధించినది ఎవరో తేలినది. ఇంతటితో ప్రధానార్ధమంతయు ముగిసినట్లే.

చివరి సాహిత్యమున ఉన్న రామచంద్రుడు ‘కర్త’ పదముగా ఊహించి తక్కిన వన్నియు ఆ పదానికి విశేషణగా భావించవచ్చు. (లేదా) ఏ స్వరసాహిత్యమునకు ఆ స్వరసాహిత్యమునందే కర్తృ భావము చేయవచ్చు. ఆ పదములన్నియు విశేషణ విశేష్యభావము కల్గినవి.

అయిదవ స్వరసాహిత్యం:

“పరమభక్తవత్సలుఁడు సుగుణ పారావారుం డాజన్మ మనఘఁడీ కలి బాధల దీర్చువాఁడనుచు నే హృదాంబుజమున జూచుచుండగ” ఏమి చేసినాడు? నాకు దర్శన మీయక సాధించినాడనిన బాగుగ ఉండును. కాని చూచుచుండగా సమయానికి తగుమాటలాడినాడనిన అర్థం సరిగా కుదరవు.

ఆరవ స్వరసాహిత్యం:

“హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరనారీ సోద రాజవిరాజ తురగ రాజ రాజనుత నిరామయాపఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తాఁ బ్రోవకను”, ఏమి చేసినాడు, సాధించినాడు. సాధించినాడు. అంతే కాని బ్రోవకను సమయానికి తగు మాటలాడినాడనిన బాగుగనుండదు. చరణం చివరగల త్యాగరాజనుతుడు చెంతరాకనె సాధించినాడనే కదా ఉన్నది.

నన్ను తా త్రోవకను సాధించెనాడనిన ఈ అర్థం బిగింపుగా ఉన్నది కదా!

 ఏడవ స్వరసాహిత్యం:

‘శ్రీవేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధర లస న్మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుఁడు మానవేంద్రుఁడైన రామచంద్రుఁడు’ ఈ అర్థము లెస్స.

‘సాధించుట’ అనునది సూత్రప్రాయమై అల్పాక్షరమై, అసందిగ్ధమై, విశ్వతోముఖమైన క్రియా పదము. ఎన్ని భావములు చెప్పినా అవన్నియు ఆ పదమునందే పర్యవసింపవలెను. ఏ కోణం నుండి చూచినా స్వరసాహిత్యములు పాడి పల్లవినే పాడుట ఉదితమని తోచక మానదు. త్యాగయ్య, వారి శిష్యులు తప్పక ఉచిత రీతిలో పాడియుందురు. కాలానుక్రమమున ఎవరో మార్చుట చేత, అదే శిరోధార్యమై యుండవచ్చును. (లేదా) ఇంకొక కారణం కావచ్చును. సాధించెనె వంటిదే ఆరభిలో ‘చాల కల్లలాడు కొన్న’ అన్న కృతి కలదు. దానిని దీనికి ఎక్కువ పోలిక కలదు. దాని చరణము ‘ఇలలో’లోని సంగీతమే ‘సమయానికి’ కలదు. దానితో స్వరకల్పన చేసి ‘ఇలలో’ అందుకొనుటలోనున్న మక్కువ నిందు ఎవరయినా ప్రవేశపెట్టియుండవచ్చు. ఇలా ఎన్నో విషయాలు వారి తరువాతి విద్వాంసుల చేతిలో మారుట కలదు. ‘ధన్యాసిలో సంగీత జ్ఞానం’ కాల ప్రమాణం మీరనిది. ఆరభి ‘నాద సుధారసంభు’ అను  గ్రహస్వరము మారినది. ‘చిత్తరంజని నాదతను మనిశం’ స్వరస్థానములు మారినవి.

పంచరత్నములలో నాట కృతిని పరిశీలిస్తే దానిలో పల్లవి, అనుపల్లవి స్వరసాహిత్యములు మాత్రమే కలవు. స్వరసాహిత్యమునే చరణములు వచ్చును. ఆ స్వర సాహిత్యంలో త్యాగరాజాంకిత మూడు చరణములలో కన్పిస్తుంది. ఆయన మనఃస్థితి ఊహించవచ్చును. అంటే త్యాగయ్య ఎప్పటి కప్పుడు ఆ చరణంలోనే ముగిందామనుకోవడం, అంకిత ముద్ర వేయుట, తరువాత ఇంకను ఊహలు కొనసాగుట కొన్న చరణములు పెరుగుట జరిగినది. తరువాత కేవల సాహిత్యమే కల చరణాన్ని రచింప దలచలేదని మనం ఊహింప వచ్చును. ఆరభి పంచరత్నాలలో కూడా అలాగే జరిగింది.

ఏడవ స్వర సాహిత్యంలో – ‘శ్రీవెంకటేశ’లో చివరకు ‘త్యగరాజ గేయుడు’ అని అంకితము వచ్చనది. అనగా అంతటితో ఆ కృతిపూర్తి చేయదలచినారు. కాని తరువాత భావములు పురోగమించుట చేత ‘సమయానికి’ అనుదావు నుంచి పెరిగింది. యతి ప్రాసలను బట్టి దాని నుండి ఉత్తరార్ధమని తేలింది.

ఏడవ స్వరసాహిత్యం అయితే వెంటనే, ‘సాదించెనే’ పాడవలసి వుంటుంది. ‘సమయానికి’ అనునది అప్పటికి పుట్టవలసి లేదు. పుట్టిన దానిని పాడుట ఉండదు. పుట్టిన తరువాత పాడవచ్చును కదా అంటే అడ్డము లెన్నో వచ్చును. నాట ఆరభి కృతులలో ముందుగా వచ్చిన అంకిత భావాన్ని ఆయన తుడిచి వేయదలచుకోలేదు. సాగిన చరణాలు ఆపదలచలేదు. చివరకు మరల ముద్రాప్రయోగం జరగింది. గౌళ, వరాళి, శ్రీరాగ, కృతులతో మాత్రం అభిప్రాయం కుదుటబడి నిర్ణీత పద్దతిలో సాగింది.

అనిర్ణీత పద్ధతి ఆరభి – పంచరత్నంతో వచ్చింది. నాట కృతి స్వరసాహిత్యాలతోనే పూర్తి అయింది. అలాంటిదే మరోక్క ఉదాహరణ – శ్రీరంజిని ‘బ్రోచేవారెవరే’. వర్ణం ఎత్తుగడ వలె పల్లవి, అనుపల్లవి చరణం వుండను. కాని చిట్టస్వరాలకు సాహిత్యం వుండదు. కాని దీనిలో సాహిత్యం వుంది. చరణం ఒక ఆవృత్తం. 4 ఖండములు –  8 ఆవృత్తములు. చరణంలో ముగియుట. ఇందు చరణం తరువాత పల్లవితో ముగియుట. ఇట్లు లక్షణ భేదములున్నవి. కాబట్టి వర్ణంతో సరిచూడరాదు.

సారాంశం పల్లవి ముగించి ‘సమయానికి’ వదిలి వేసి స్వరసాహిత్యములు పల్లవితో పాడి తరువాత ‘సమయానికి’ నుండి యథా పూర్వకం.. పాడవలసి యున్నది. ఇది దీని పద్ధతి. ఆచరణ యోగ్యమయినా కాకపోయిన విషయ పరిజ్ఞానం కొరకు విశ్లేషించిన విషయ విశేషం.

(సశేషం)

Exit mobile version