Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-16

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 6 -3వ పంచరత్న కీర్తన ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – 3వ భాగం

ఆరభి – ‘సాధించెనే ఓ మనసా’ సాహిత్యం:

ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రిగారి విశ్లేషణ:

భక్తి వైరాగ్యాలను ప్రబోధించే గేయ సృష్టి కావించిన సంగీత వాగ్గేయకార త్రయంలో శ్రీ త్యాగరాజు ఒకరు. ఆయన శ్రీరామభక్తుడు. కర్ణాటక సంప్రదాయ సంగీతంలో మహోన్నత శిఖరాలను అధిరోహించి జీవబ్రహ్మను సంధానం చేసికొని పునర్జన్మ రాహిత్యాన్ని సాధించిన అఖండ నాదోపాసకుడు. “రసో వై సః, న స పునరా వర్తతె” అను శ్రుతులకు లక్ష్యమైన మహనీయుడు.

వీరి కృతులలో భగవంతుని సంభోదిస్తూ కొన్ని, త్రికరణాలలో ప్రధానమైన మనస్సును జాగృతం చేస్తూ మరికొన్ని ఉన్నాయి. బంధ మోక్షాలకు కారణమైన మనస్సును స్వాధీనం చేసుకొన్నవాడే దన్యజీవనుడు గదా! కృతిలో శ్రీకృష్ణుని ఎత్తిపొడుపు మాటలతో నిందాస్తుతి చేసి శ్రీరామచంద్రుని కూడ మెత్తగ పొగడినట్లే పొగడినాడు.

శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉభయులు శ్రీమన్నారాయణుని అవతారాలే. శ్రీరాముడు మాయామానుష విగ్రహుడు. శ్రీకృష్ణుడు లీలా మానుష రూపుడు. వీరిద్దరి సమ్మేళనం చేసి మనస్సుకు స్ఫూర్తి కలిగించటం ఈ కృతి విశిష్టత. అయితే ద్వాపరయుగ స్వామి లీలలను ముందు చెప్పి త్రేతాయుగ ప్రభవును తరువాత చెప్పటం ఒక విశేషం.

“సంభవామ్ యుగే యుగే”, “మామేకం శరణం వ్రజ” అంటూ పూతనా సంహారం. గోవర్దనోద్ధరణం, విశ్వరూప సందర్శనం లాంటి అతి మానుష శక్తులు (super human powers) ను ప్రదర్శించి మానవ కోటిని ఆకట్టుకొన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీరాముడు అటువంటి పనులు చేయకుండా ధర్మమూర్తిలాగా తోటి మానవులతో పాటు కష్టసుఖాలు అనుభవించాడు. ఏవో కొన్ని వింతలు చేసి ప్రాణకోటి వంతలు బాపినవాడు శ్రీకృష్ణుడు గదా.

పల్లవి:

సాధించెనే ఓ మనసా!

అర్థం:

మనస్సు నపుంసక లింగ శబ్దం. సంస్కృతంలో “హే” అను సంబోధన వాచకానికి తెలుగులో ఓ ఓయి, అని అర్ధం. “మనస్” శబ్దం ఏ లింగమైనా బహుచంచలమైనది.

“నపుంసక మితి జ్ఞాత్వా ప్రియామై ప్రేషితం మనః

తత్తుతత్రైవ రమతే హతాః పాణి వినావయమ్”

అన్నట్లు ఎక్కడా దానికి నిలకడ లేదు. పోనీ మనస్సు నపుంసకమే కదా అని ప్రియురాలి కడకు పంపిస్తే అదీ అక్కడే క్రీడిస్తూ వున్నదట. క్రీడకు చలనం అసహజం కాదు. శబ్దాలకు లింగ నిర్దేశం చేసిన సూత్రకారుడు ఎంత పని చేసినాడు? ఓ మనసా! శ్రీకృష్ణుడు మొత్తం మీద సాధించాడు తెలుసుకో అని బోధ. అయితే లోకంలో కార్యసాధకుడు ఉత్తముడే. ప్రజ్ఞానిధులైన వారెవరైనా తమకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి వాటిని అధిగమించి పనిని సాధించి తీరుతారు. అది ఉత్తముల లక్షణం. ఇక పురుషోత్తముని విషయంలో వేరే చెప్పనవసరం లేదు. “ఓ” అనుసంబద్ద వాచకం లేకుండా “మనసా” అనవచ్చు కాని “ఓ మనసా” అనటంలో కృతి కర్త ఆత్రుత వ్యక్తం అవుతుంది. “సాధించటం” అనే పదాన్ని పీడించటం, వెంటాడటం అనే అర్థంలో వాడుతారు కాని ఇక్కడ అది వర్తించదు.

అనుపల్లవి:

బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తాఁ బట్టినపట్టు

అర్థం:

పరోపదేశం సులభం, ఆచరణ దర్లభం. అందుకే “వచనే కా దరిద్రతా” అన్నారు పెద్దలు. “మాటలకు పేదరికం లేదు కదా”. “నుడువు నీతులందు నూరింట నొకటైన చేయలేని వాడు చెప్పనేల” అన్న వేమన మాట రతనాల మూట. స్వవచన వ్యాఘ్రతం మంచివారి లక్షణం కాదు. “సత్యంవద” అని ఉపనిషత్తు ఘోషిస్తున్నది.

“యతి ర్యోగి బ్రహ్మచారీ శతాయుస్సత్య వాక్ సతీః

సత్రీ వదాన్య శ్శూరచ్చ నిత్య వంద్యా మహీతలే”

అన్నట్లుగా జగత్తులో సత్యవాక్కు నిత్యవద్యుడు. సత్య భూషణం ఆ స్వామికి మేలిమి భూషణం. హరిశ్చంద్ర చక్రవర్తి ఇచట స్మరణీయుడు. శ్రీకృష్ణుడు బొంకరి గదా. ఇచ్చట ఒక ధర్మసూక్ష్మం ఉంది. ధర్మోద్ధరణం అవతారలక్ష్యం. దాని సాధనకు ఒక పట్టు పట్టినాడు. ఆ పట్టు విడిస్తే అవతార ప్రయోజనమే దెబ్బతింటుంది. ఆ విధంగా జరగదు. పైగా భాగవతంలో పోతన్న

“వారిజాక్షులందు వైవాహికము లందుఁ బ్రాణ విత్త మాన భంగమందుఁ

జకిత గోకు లాగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు నఘము పొందఁ దధిప!”

అని ఖచ్చితంగా చెప్పాడు. “నూరు కల్లలాడియైనా సరే ఒక్క యిల్లు నిలుప” అనే సామెత తెలుగులో వుంది. లోక రక్షణ అనే పరమ ప్రయోజనాన్ని సాధించటానికి శ్రీకృష్ణుడు బొంకి ఉండవచ్చు.

చరణాలు:

సమయానికి తగు మాటలాడెనే

చరణాలు అన్నిటిని పాడి, దానిని పాడుట సంప్రదాయం, దీనికి ఇదొక ప్రత్యేకత.

మృదువుగా మధురంగా మాట్లాడటం ఒక వరం. యశోద శ్రీకృష్ణునికి ఆ గుణాన్ని ఉగ్గుపాలతోనే రంగరించి పోసి వుంటుంది. సమయాన్ని సందర్భాన్ని విడిచిపెట్టి అప్రస్తుత ప్రసంగం చేయటం అరణ్యరోదనయే. శ్రీకృష్ణుడు ఆచి తూచి ఎదుటి వారి మనుస్సులను నోప్పించకుండా భావ బృంహితంగా మాట్లాడగల్గ వాక్చాతుర్యం గలవాడు. “మాటలాడెనే, సాధించెనే” అనువానిలో “ఏ”కారము త్యాగయ్య తన మనస్సు బ్రతిమిలాడుకొనటాన్ని సూచిస్తున్నది.

1వ చరణం:

దేవకి వసుదేవుల నేగించినటు

అసలు శ్రీకృష్ణుని జన్మమే బహువిచిత్రమైనది. ఆ స్వామి పుట్టింది జైల్లో. దేవికి అష్టమ గర్భంలో అవతరించాడు. “మాతృదేవోభవ, పితృదేవోభవ” అని వేదాంగాలు చెబుతూ వుంటే, ఈ వేదోద్దారకుడు కన్న తల్లి తండ్రులను ఏగించేశాడు. అంటే వారికి బాగా మనస్తాపం కల్గించాడని అర్థం. కడుపార కన్న బిడ్డ ముద్దు ముచ్చటలను చూచుకొనే భాగ్యం వారికి లేకపోయింది. అది వారి కర్మం. దాని అనుభవం ఎవరికైన తప్పదు.

“యదాధేను సహశ్రేషు వత్సోవిందతి మాతరం

తధా పూర్వకృతం కర్మ కరార మనుగచ్చతి”

మరియు

“ప్రారబ్ధం భోగతో నశ్సీత్” అన్నట్లు ప్రారబ్ధం అనుభవిస్తే కాని పోదు. కన్నవారిని చిన్నబుచ్చినవాడు కన్నయ్య.

2వ చరణం:

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు

అర్థం:

కావేరీ తీరంలో వున్న శ్రీరంగ మహాక్షేత్రానికి అధిష్ఠాన దేవత శ్రీరంగేశ్వరుడు. ఆయన శ్రీకృష్ణుడు. కేళి విలాసలోలుడు. “పూలరంగడు”. ‘అలంకార ప్రియా విష్ణుః’ అని ఆర్యోక్తి. గంగ చాల పవిత్రమైనది. “గ” కార చతుష్ఠయంలో “గంగ” ఒకటి. అది సుధా సౌందర్యమైన సలిలం కలది. “గీతా గంగాచగాయత్రీగోవిందో” – “గ” చతుష్టయమ. ఈ నాలుగు “గ” కారములు మోక్షసాధకములు, మరియు,

“గంగా గంగీతి మాం బ్రూయా ద్యా జనానం రతైరః

ముచ్యతే సర్వపాపే భ్యో విష్ణులోకం న గచ్ఛతి”

మనం ఎంత దూరంగా వున్నా చిత్త శుద్ధితో “గంగా గంగా” అంటే పాపాలు పోయి మనకు విష్ణు లోకం వస్తుంది. అంతటి గంగకు జనకుడు శ్రీకృష్ణుడు. “శబ్దం” అనే అర్థాన్ని ఇచ్చే “గై” ధాతువు పై ఏర్పడిన పదం గీతం. దానికి “సమ్” అనే ఉపవర్గ చేరిస్తే “సంగీతమ్” అయింది. పూర్వీకులు తాము చెబుతూ ఆచరిస్తున్న పద్ధతే సంప్రదాయం. అట్టి వీనుల విందుగా వేణుగానం చేసే సంగీతజ్ఞుడు శ్రీ కృష్ణుడు.

3వ చరణం:

గోపీ జన మనోరథ మొసంగ లేకయే గేలియుఁ జేసెడువాఁడు

అర్థం:

గోవులను పాలించేవారు గోపకులు. వారి వనితలు గోపి జనం. గోవు మన భారతీయులకు సాధు, పవిత్ర జంతువు. “గవా మంగేషు తిష్ఠన్తి భువనాని చతుర్ధశ”. గోవు శరీరంలో పదునాల్గు భువనాలు ఉండటం వల్ల అది మనకు పూజనీయమైనది. దాని పాలకుల గూర్చి చెప్పవలసినేమి యున్నది. గోపికలు త్రేతా యుగంలో మునీంద్రులు. వారే ద్వాపర యుగంలో గోపస్త్రీలు. గోపికా కృష్ణులకు ఉన్న సంబంధం జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానమే కాని కేవలం కామినీ కాముక ప్రవృత్తి కాదు.

భవతరణమే వారి మనోరథం. దానిని తీర్చలేని వాడు కాదు శ్రీకృష్ణుడు. గేలి చెయ్యటం అంటే ఎద్దేవా చెయ్యటం. ఇది కొందరికి అలవాటు. అది నీ తత్వ్తం అని కృతికర్త స్వామిని నిందాస్తుతి చేసినాడు. గేలి “యు” అను సముచ్ఛయం. కోరిక తీర్చకపోగా ఎగతాళి కూడ చేస్తాడట. ఇందులో గొప్ప ధ్వని వుంది.

4వ చరణం:

వనితల సదా సొక్కఁ జేయుచును మ్రొక్కఁ జేసె పరమాప్తుఁడదియుగాక యశోద తనయుఁడంచు ముదంబునను ముద్దుఁ బెట్ట నవ్వుచుండు హరి

అర్థం:

 ‘పరమాత్మ’ అనే పేరు శ్రీకృష్ణునికే ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు. ‘శ్రీరామ పరమాత్మ’ అను వాడుక లేదు. జీవులకు ప్రాణదానం చేయటం, పారవశ్యం కల్గించటం, ప్రశాంతతను సమకూర్చటం సామవేదం నుండి పుట్టిన సంగీతానికి ఉన్న లక్షణాలు. The music has given me peace అన్న మహాత్ముని వాక్యం అర్థవంతం. సంగీతం కేవలం కలకంఠ కంఠులకే సృజింపబడినది కాకపోయినా శ్రవణేంద్రియం ద్వారా విని సొక్కి పోవటానికి పనికి వస్తుంది. “ఏది మరోక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరింపుగా నూదగ దోయి ఊదగిదపోయి” అని కరుణశ్రీ వ్రాసినట్లు గోపికలు కొసరి కొసరి ఆ స్వామి మురళీ నాదాన్ని విని విని సొక్కి సోలిపోయేవారు. అంతగా సొక్కిన వారు మ్రెక్కుకుండా వుండలేరు గదా.

ఇంత అదృష్టం అంతా ఆ యశోదమ్మదే. తాను కన్న బిడ్డ కాకున్నా కన్నయ్యను మిక్కిలి మక్కువతో సాకింది. ఔరస పుత్రుని యందు ఉందగిన రీతిలో మమకారాన్ని పెంచుకుంది. పొంగిపోరలి వచ్చె అనురాగాతిశయంతో ఆ చిన్నకన్నయ్యను గుండెలకు హత్తుకొని వాని నునులేత బుగ్గలు ముద్దు బెట్టుకొని బ్రహ్మానందాన్ని పొందింది. ఆ బుల్లి కృష్ణుడు బుగ్గలు గుంటలు పడేటట్లు నవ్వుతూ వుంటాడు. ఆ నవ్వుకి రత్నాలు రాలతాయి. దాంట్లో ఒక మహార్థం ఇమిడి వుంది. ‘అమ్మా నీ వెంత అమాయకురాలవు, నా బొజ్జలో చరాచర జగత్తు వుంది’ అని ఆ నవ్వుకు అంతరార్థం. “ముద్ద బెట్టు” అనే శబ్ద పల్లవం చదువురుల ఉల్లములను పల్లవింప చేస్తుంది. “హరి” అనే ప్రయోగం ఆ స్వామి శైశవత్వానికి ప్రతీకగా భావించవచ్చు.

(సశేషం)

Exit mobile version