Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-17

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 6 -3వ పంచరత్న కీర్తన ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – 4వ భాగం

ఆరభి – ‘సాధించెనే ఓ మనసా’ సాహిత్యం:

ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రిగారి విశ్లేషణ:

5వ చరణం

‘పరమభక్తవత్సలుఁడు సుగుణ పారావారుం డాజన్మ మనఘఁడీ కలి బాధల దీర్చువాఁడనుచు నే హృదాం బుజమున జూచుచుండగ’

‘సేవ’ అనే అర్ధాన్ని తెలిపే ‘భజ’ ధాతువుపై ఏర్పడిన శబ్దం భక్తి. భగవంతుని యందు భక్తి కలవారు భాగవతులు. అనగా దైవసేవకులు అని పిండితార్థం. ‘పరమ’ శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఆ పరమ భక్తురాలు ఎవరు? ప్రహ్లాద నారద పరాశర పుండరీకులు, వ్యాసాంబరీష శుక శౌనక భీష్ములు, రూక్మాంగదార్జున విశిష్ఠ విభీషణులు ఇంకను ఎందరో మహానుభావులు. వారి యందు స్వామికి అపారమైన వాత్సల్యం వుండటంలో ఆశ్చర్యం లేదు. ‘సుగుణ పారావారుడు’ అనుటలో స్వామివారి గుణాలను అంచనా వేయటం సముద్ర జలాన్ని కొలవటం వంటివి అని తాత్పర్యం. పుట్టిన రోజు నుండి పాపం తెలియని వాడు పరమాత్మ. కలి పురుషుని విజృంభణ చేత ప్రాణులు సంసారం వల్ల సంతాపం పొందుతూ వున్నారు. ఆకలి బాధలను పరిహరించేవాడు శ్రీకృష్ణుడేయని కృతికర్త తన హృదంలో ఆ స్వామిని చూస్తూన్నాడు. అంటే, చర్మ చక్షువులతో కాదన్న మాట. మనః పద్మం వీక్షించే శక్తి వున్న భక్తుడు సాధించలేనిది లేదు.

6వ చరణం

‘హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరనారీ సోద రాజవిరాజ తురగ రాజ రాజనుత నిరామయాపఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తాఁ బ్రోవకను’

అర్థం:

ఈ చరణంలో త్యాగయ్య శ్రీరాముని ప్రశంసిస్తూ అనేక సంబోధనలతో పిలిచినా నన్ను రక్షింపక పోయావని నేరం మోపుతున్నాడు. ‘రామ చంద్ర’ అను సంభోదనలో ‘చంద్ర’ అను పద ప్రయోగం వల్ల శీతాంశునిలో శైత్య, ఆహ్లాదకరత్వాది ధర్మాలు నీ యందున్నవని చెప్పక చెప్పినాడు. ‘రఘుకులేశ’ అనుటం వల్ల రఘుకులం వారి ఘనతా ధార్మికతా వ్యక్తమవుతూ వున్నాయి. మహాకవి కాళిదాసు ‘రఘువంశ’ కావ్యంలో –

“త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణామ్
యశసే విజిగీషూణాం ప్రజాయై గృహ మేధినామ్” అని అన్నాడు.

అంటే, రఘువంశ మహారాజులు త్యాగమునకై ధనార్జన చేసెడువారు, సత్యమునకై మితంగా మాట్లాడేవారు, కీర్తికి యుద్ధాలు చేసేవారు. ‘ధర్మప్రజాసంపత్త్యర్థం స్త్రియ ముద్వహే’ అన్నట్టు ‘సంతానేచ్ఛతో గృహస్థులయ్యే’ వారు. అంతటి వాడివి రామా నన్నేల రక్షింపకపోతివని అడుగుచున్నాడు.

‘రామో విగ్రవాన్ ధర్మః’ అన్నట్లు శ్రీరాముడు ధర్మమూర్తి. పరనారీ సోదరుడు. కన్నుదోయి కన్యకాంత లడ్డంబైన మాతృభావన చేయు మహితా మూర్తి. ఈ సంభోధన రాముని పట్ల సార్ధకమయింది.

రాజరాజ వినుతుడు అనటం వలన చక్రవర్తులు సార్వభౌములూ శ్రీ రాముని గుణగణాలను శ్లాఘించేవారని తెలుస్తున్నది. సరసీరుహ దళాలనగా తామర రేకులు అట్టి కన్నుల నుండి వెలువడే చూపులు భక్తరక్షా దక్షములైనా నన్ను బ్రోవయకే ‘ఏవో మాటలు చెప్పావయ్యా’ అని ఆక్షేపం.

7వ చరణం

‘శ్రీవేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధర లస న్మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుఁడు మానవేంద్రుఁడైన రామచంద్రుఁడు’

అర్థం:

పై చరణంలో శ్రీరాముడు తన ప్రశంసను పెడచేవిన పెట్టి సమయోచితంగా ఏదో కబుర్లు చెప్పి వెళ్ళినాడని త్యాగయ్య మనోభావం. ‘వేం’ పాపమిత్యహః

‘కట దాహ ఇదే రితః’ అన్నట్లు పాపనాశకుడు వేంటేశ్వరుడు సుప్రకాశుడు. మంచి కాంతి పుంజంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నవాడనీ భావం. జ్ఞానకాంతి భక్తుల అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేస్తుందని కవి హృదయం.

“నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయన్తి తత్ర తిష్ఠామి నారదా”

అన్నట్లు తనను పొగడే సజ్జనుల మనస్సులే తానుండు తావులనే విషయాన్ని సజ్జన మానస నికేతన అన్న సంభోధన తెల్పుతూ వున్నది. తాను కనకాంబరధరుడు దిగంబరునికి మిత్రుడు. శ్రీయఃపతి చీనీ చీనాంబరాలు కట్టుడంతో ఆశ్చర్యమేమి లేదు. రామచంద్రుడు మానవేంద్రుడే. అంటే పృధీవీపతి అని అర్థం. ‘నా విష్ణుః పృధీవీ పతిః’ విష్ణ్వాంశ లేనివాడు రాజు కాలేడు. ఇక సాక్షాత్తుగా శ్రీమహావిష్ణుని విషయంలో అనుమానానికి ఆస్కారం లేదు. కావున శ్రీ మహా విష్ణువును అన్వేషించువాడు సజ్జన మానసముల వెదకవలెనని తాత్పర్యం.

చివరగా శ్రీరాముడు సద్భక్తులకు ఉండవలసిన శీల సంపదను ప్రవర్తనా నియమములను తనకు చెప్పనాడనీ. తాను చేసిన పూజను స్థిరుడై వరదుడై సుముఖుడై సుప్రసన్నుడై పరిగ్రహించినాడనీ అలుగవద్దనినాడని ‘దుష్టం దూరేణ వర్ఝయేత్’ అన్నట్లు దుర్జన సాంగత్యము వద్దన్నాడనీ కష్టాలు కలిగిపుడు సహనంతో వ్యవహరించాలని చెప్పాడనీ, క్రియాసిద్ధిస్సత్యేభవతి మహాతాం నాపకరణే అన్నట్లు శాంతము సౌఖ్యదాయకమనీ బోదించినా, నా చెంతకు చేరక సమయోచిత సంభాషణం చేసి వెళ్ళాడని కృతికర్త తలపోత.

రామకృష్ణావతారముల లీలా విశేషములతో నిండి యున్న ఈ పంచరత్న కృతి ఆకృతి చిన్నదయు, అనల్ప భావభరితమై అటు సంగీతజ్ఞులను ఇటు సాహితీవేత్తలను అలరిస్తూ భక్త సౌధానికి మూల స్తంభంగా వుంది.

“సరః పతిత కామోపి యశః కామేన జీవతి” అన్నట్లు శ్రీత్యాగరాజ స్వామి భౌతిక దేహం మనకు కన్పించక పోయినా వారు సజీవులే. వారి భక్తి రస వాహని ఆచంద్రతారార్కం వట్టిపోక జీవనది లాగా ప్రవహిస్తూనే వుంటుంది.

“న కర్మణాన ప్రజయా ధనేన
త్యాగే నై కే అమతత్వ మానసుః”

***

ఆరభి – ‘సాధించెనే ఓ మనసా’ సాహిత్యం:

కొమండూరి వారి విశ్లేషణ:

నిందాస్తుతి కృతి. ఉదాత్త భావం వుంది. ప్రార్ధనా పూర్వకృతి. రాముడే పరబ్రహ్మము. సర్వ భావములు రాముని యందే లగ్నం. కారణం ఒక మాట ఒక బాణం. ఏక పత్నీవ్రతుడు రాముడు మరియు శరణాగత రక్షణము, సత్య వాక్పరిపాలనము. కృష్ణ పరమాత్మ అలా వుండడు. లీలావిభూతి సంరక్షణ చేస్తాడు. ప్రసాదగుణ సంపన్నుడు. అయితే కొంత నెమ్మదితోగాని రక్షణ చేయడు. రాజకీయ చతురుడు. సాధించుతాడు. సమయానికి తగు మాటలాడుతాడు. ఒక యెడ బొంకుతాడు జన్మనిచ్చిన దేవకీవసుదేవులకి పరితాపాన్ని; తన యందు మోహమునిడుకొన్న గోపికలకు ఆశపెడ్తాడు. అలుగుతాడు. తుదకు వారికి అలౌకికానందాన్ని యిస్తాడు. బృందావనంలో ఆయన లీలలు అద్భుతాలు. ఏమైనా చతురుడు. ఈ కృతిలో రామకృష్ణాది అవతారముల వైభవములు వర్ణించబడినవి. ఏమైనా త్యాగయ్యకు రాముడే మిన్న. దమశమాది సుఖదాయకుడే అని రామునే పరదైవంగా స్వీకరించుకొని మురిసిపోతాడు. గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞత లక్షణాలు కనబడతాయి.

ఈ కృతిలో అంతరంగానుభవం + భగవద్గీత ప్రభావమే కనబడుతుంది. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని నమ్మని విముఖలతో చేరలేదు. వెత కలిగినా తాళుకున్నానయ్యా రామా పరమాత్మా నీ ఆదేశానుసారం వున్నానయ్యా. సంరక్షించవయ్య అని రాముని ప్రార్థిస్తాడు.

కీర్తన సాహిత్యానికి రాగ భావానికి మించి సమన్వయత వుంది. శృంగార భావం కనబడుతుంది. పల్లవి, పంచమంతో, అనుపల్లవి దైవతంతోను ఆరంభమవుతుది. 1, 2, 7 చరణాలు పంచమంతో; 3, 4 దైవతంతో; 5వ చరణం 8 రిషభంతో; 6వ చరణం షడ్జస్వరంతో ఆరంభమౌతన్నవి.

స స ద ప మ గ రి స అనే అపూర్వ చరణంలో పిపీలిక యతి వుంది.

రాజా – విరాజ – తురగరాజ (అలంకారం).

చక్కటి తాళ శైలిగల పంచరత్నం.

6వ చరణంలో ద ద పా – ద ద పా – స్థాయి అంతరం. భక్తియుత గుణ, గానం వల్లనే కృప కల్గుతుంది. కృతిలో భగవత్ ఘట్టములు రమ్యముగా వున్నాయి.

***

ఆరభి – ‘సాధించెనే ఓ మనసా’ సాహిత్యం:

వెంకట శ్రీరాములు గారి విశ్లేషణ:

భావం: లోకములో యోగము, కర్మము, జ్ఞానము మొదలైనవి పరమేశ్వరుని చేర్చుటకు ముఖ్యమార్గములు అని చెప్పిన సత్పురుషుల వచో రీతులను వంచించి, ‘భక్తి రేవగరీయ’ – భక్తి యొకటే దేవుని చెందు నుత్తమ మార్గము అని భావించి; ‘మామేకం శరణం ప్రజ’ అని చెప్పి దానినే సాధింప చేసినవాడు అని త్యాగరాజు స్వామి మనస్సును సంబోధించి పల్కుచున్నాడు.

‘ఓ మనసా, తాను చెప్పినది చెసెనే, పెక్కు మార్గములలో ప్రవచింపబడిన వానిని వ్యర్థపరచి తాను బట్టిన పట్టును సాధించెనే.’

ఏ సమయమున కేది యవసరమో అట్లు మాటాడేని; దేవకీ వసుదేవులను మాయలో నొకమారు తెలివిలోనొకమారు మంచినట్లుగానే చేయుచుండి సాధించెనే స్వామి రంగనాథుడు. గంగా జనకుడు సంగీత సంప్రదాయ ప్రవర్తకుండు సాధించెనే.

గోపిలకు కోర్కెలు తీర్చక హేళన చేయువాడు సాధించినే.

స్త్రీలను ఎప్పుడు పరవశలను చేయుచూ మ్రొక్కించుకునే పరమాత్మ యశోద బిడ్డడని సంతోషమున ముద్దు పెట్టుకొగా నవ్వుచండు శ్రీహరి సాధించెనే.

మిక్కిలి భక్త వాత్సల్యము గలవాడు, సద్గుణ సముద్రుడు, జన్మము నుండియు వుణ్యుడు, కలికాల బాధల బోగొట్టు వాడు అయిన స్వామి నేను హృదయములో చూచుచుండగనే సాధించెనే.

ఓ హరి, రామచంద్రా, రఘు కులనాధా తియ్యని పల్కులవాడా, శేషుని పై పరుండవాడా, అన్యకాంతలను సోదరీ భావమున చూచువాడా, జననము లేని వాడా, గరుత్మంతుడు వాహనముగా కలవాడా, రాజధీరాజులచే నుతింపబడువాడా, ఆరోగ్యవంతుడైన అవయవములు గలవాడా, పద్మ దళక్షా అని వేడుకొన్నచో దయ చూచువాడు సాధించెనే.

త్యాగరాజుచే పొగడుబడువాడైన రామచంద్రుడు, శ్రీవేంకటేశ్వర ‘మంచి కాలతి గలవాడా’, అందరి కన్నా గొప్ప వాడా సజ్జన హృదయములందుండు వాడా, బంగారు రంగు వస్త్రము దాల్చు వాడా, కాంతివంతములైన కుండలము తోను, కిరీటము తోనూ ప్రకాశించువాడా హరీ యని నేను పొగడగా సాధించెనే.

సమయమునకు తగిన మాటలు చెప్పెనే మంచి భక్తుల ప్రవర్తన లిట్టివే యనెనే. చక్కగా నాపూజను స్వీకరించెనే. కోపపడకుమనెను. భక్తి హీనులతో చేరకుమని బోధించెను. కష్టమును సహింపుమనెను. దమశమాది సుఖముల నిచ్చు వాడునూ, త్యాగరాజు సుతుడునూ అయిన రాముడు చెంతకు చేరకుండగనే సాధించెనే.

(సశేషం)

Exit mobile version