Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-18

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 6 -3వ పంచరత్న కీర్తన ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – 5వ భాగం

ఆరభి – ‘సాధించెనే ఓ మనసా’ సాహిత్యం:

విశ్లేషణ

నిందాస్తుతి పరమైన కీర్తన. ‘సాధించెనే ఓ మనసా’ అని పల్లవిలో “సాధించెనే” అనే పదాన్ని రెండు విధాలుగా వ్యాఖ్యానించుకోవచ్చును. మనసుకు కష్టం కలిగిస్తూ సాధించాడు అని ఒక అర్థం అయితే ఒక మహత్తర కార్యాన్ని సమర్థంగా చేయగలిగాడు అని మరొక అర్థం. భక్తుడైన కవిని (త్యాగరాజునే) దర్శన మీయకుండ లేదు) చెంతకు చేర్చుకోకుండా సాధించాడు అని ఒక అర్థం. అయితే కవి వంటి అమాయక భక్తునికి (పాండిత్యము లేనివాడు) అపారమైన కరుణతో హృదయంతో స్థానమిచ్చి మార్గంలో నడిపించి జ్ఞానాన్ని సిద్ధింప చేసినవాడు అని మరియొక అర్థం.

అను పల్లవి:
బోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తాఁ బట్టినపట్టు

ఆశ్రితులను రక్షిస్తానని, హృదయంలో నిలుపుకుంటానని బోధించిన వచనాలు అన్ని వమ్ము చేస్తూ ఎంతగా ఆశ్రయించిన తనను హృదయంలో నిలుపలేక సాధిస్తున్నాడని కవి పరితపిస్తున్నాడని నిందాపూర్వకమైన అర్థం. మహాభారత యుద్ధ ఘట్టంలో ఆయుధం పట్టనని పలికిన ప్రతిజ్ఞను అబద్ధం చేస్తూ ఆశ్రితుడైన అర్జునుడి కాపాడడానికి భీష్ముని వధించే ప్రయత్నం చేసి తన పట్టు (అర్జునుని గెలిపిస్తాననే పట్టు) సాధించాడు అని స్తుతి పూర్వకమైన అర్థం.

చరణం:
సమయానికిఁ దగు మాటలాడెనే

శ్రీ కృష్ణుని మాటలు ఎంతో గంభీరార్థములతో కూడుకున్నవి. సాధారణ జనులకు లౌకికమైన అర్థంలోనే కన్పిస్తునే జ్ఞానులకు దివ్యత్వం దర్శనమిస్తుంది. అలా మాట్లాడ గలిగే నేర్పు భగవంతుడైన కృష్ణునికి మాత్రమే వుంది.

చరణం 1:
దేవకి వసుదేవుల నేగించినటు

దేవకీ వసుదేవుల కుమారుడై జన్మించిన నంద వ్రజనులో పెరిగి దేవకీ వసుదేవులకు దుఃఖాన్ని కల్గించాడని నిందా పూర్వకమైన అర్థం. దేవకీ వసుదేవులకు పుత్రుడై వారిని కారాగార బందాల నుండేగాక భవబందాల నుండి కూడా విముక్తి చేసి మోక్షాన్ని ప్రసాదించిన పరమాత్ముడని స్తుతి పూర్వక అర్థం.

చరణం 2:

“రంగేశుఁడు సద్గంగా జనకుఁడు

సంగీత సాంప్రదాయకుఁడు

రంగనాథుడు గంగాజనుకుడు. గంగా నది సకల జలరాశికి మాతృక. ఆ గంగ విష్ణు పాదోబ్భవి అని పురాణాలు చెపుతున్నాయి. నూకల చినసత్యనారాయణ అభిప్రాయంలో త్యాగరాజు దృష్టిలో రంగనాధుడు, కృష్ణుడు రాముడు అందరు ఒకడే. ఉత్సవమూర్తులలో పాండురంగని సంగీతంతో ఆరాధించిన భక్తులు మీరాబాయి, గారాకుంభర్ మొదలైనవారు ఎందరో వున్నారు.

శ్రీకృష్ణుడు సంగీత శాస్త్ర పారంగతుడు అని చెప్పే ఐతిహ్యాలు ఎన్నో వున్నాయి. నారదుడు కృష్ణుని ప్రస్తావన కూడా వుంది. నారద తుంబురులు సంగీతంలో ఆధిపత్యానికి పోటీపడ్డారు. అప్పుడు సంగీత శాస్త్రంలో తుంబురుని కంటె ఆధిక్యం సాధించడానికి నారదుడు శ్రీకృష్ణుని ఆశ్రయించాడు. (కళాపూర్ణోదయంలో) ఈ కథ వుంది. శ్రీకృష్ణుని మురళిగానసుధ జగత్ ప్రఖ్యాతమే. అది జీవన గానం.

చరణం 3:

గోపీ జన మనోరథ మొసంగ లేకయే
గేలియుఁ జేసెడువాఁడు

గోపికల లౌకికమైన ప్రేమాభిలాష సఫలీకృతం చేయలేదని నిందార్థం. అలాగే స్నానం చేస్తున్న వారి వస్త్రాలను అపహరించి ఏడ్పించాడు అని కూడా నిందార్థం. గోపికలకు లౌకిక ప్రేమకు అతీతమైన ఆత్మైక్యాన్ని ప్రసాదించాడని ప్రస్తుతి. అలాగే గోపికల వస్త్రాపహరణం చేయడమే గాక వారికి కాత్యాయినీ వ్రతనిష్టులు వివస్త్రులగా స్నానం చేయకూడదనే నియమం బోధించాడని కూడా అంతరార్థం.

చరణం 4:
వనితల సదా సొక్కఁ జేయుచును
మ్రొక్కఁ జేసె పరమాప్తుఁడదియుగాక
యశోద తనయుఁడంచు ముదంబునను
ముద్దుఁ బెట్ట నవ్వుచుండు హరి

గోపికాజనాన్ని పరవశింప చేస్తాడు అనే నింద కన్పించిన వారిలో భక్తికి ప్రబోధించి మ్రొక్కులందుకుంటాడనే మన్నన వుంది. యశోద తన కుమారుడే అని భ్రమించి ముద్దు బెట్టినపుడు నవ్వుతాడు అనే సామాన్య అర్థం వున్నా అంతటి విశ్వాత్ముడు తన మహత్యాన్ని మరుగుపరచి పసిపిల్లవాడిగా యశోదమ్మను తరింప చేసాడని ప్రస్తుతి వుంది.

చరణం 5:
పరమభక్తవత్సలుఁడు సుగుణ
పారావారుం డాజన్మ మనఘఁడీ కలి
బాధల దీర్చువాఁడనుచు నే హృదాం
బుజమున జూచుచుండగ

ఈ చరణంలో నిందలేని పరమ భక్తి ప్రపత్తులు కన్పిస్తున్నాయి. త్యాగరాజుగారి సర్వ సమర్పణ భావం దీనిలో వుంది. వారి హృదయ పద్మంలో భగవంతుడు నిత్యనివాసి.

చరణం 6:
హరే రామచంద్ర రఘుకులేశ
మృదు సుభాష శేష శయన
పరనారీ సోద రాజవిరాజ తురగ
రాజ రాజనుత నిరామయాపఘన
సరసీరుహ దళాక్ష యనుచు
వేడుకొన్న నన్ను తాఁ బ్రోవకను

ఈ చరణంలో త్యాగయ్యగారు అత్యంత భక్తి గౌరవాలతో పరనారీ సహోదర అని ప్రస్తుతించారు. రామ కృష్ణావతరలోని ప్రధాన భేదం యిదే. బహుశః రామ కృష్ణావతారాలలో రాముడే త్యాగరాజునకు ఇష్టదైవం కావడానికి కూడా ఇదే కారణం కావచ్చును.

ఆ రాముడే పరంధాముడని (శేషశయన, విరాజతురగ రాజరాజనుత) ధ్యానించడానికే అని స్తుతించారు.

చరణం 7:
శ్రీవేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన
మానస నికేతన కనకాంబరధర లస న్మకుట
కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా
త్యాగరాజ గేయుఁడు మానవేంద్రుఁ
డైన రామచంద్రుఁడు

కలియుగంలో శ్రీరాముని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేక శ్రీ వేంకడేశ్వరుడే కలియుగ దైవం అని ప్రతీతి. ఆ కారణాన తన ఆరాధ్యుడైన శ్రీరామచంద్రుని కనకాంబరధరుడు, మకర కుండల విరాజతుడు అయిన శ్రీ వేంకటేశ్వరునిగా ధ్యానించి నమస్కరిస్తున్నారు త్యాగయ్య.

***

‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – శ్రీ ఇలపావులూరి కామేశ్వర రావు విశ్లేషణ

అవతారిక:

భగవంతుడు భక్తులను పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షలకు తట్టుకోలేక దైవాన్ని నిందిస్తారు. కొందరు దీనంగా ప్రారబ్ధమని అనుభవిస్తూ దైవ కృప కోసం  ఎదురు చూస్తూ ఉంటారు. భక్తి గాఢంగా లేని వారు విశ్వాసం కోల్పోతారు. మ్రొక్కుబడులు ఎరగా చూపి దైవాన్ని లోబరుచుకోవాలని చూస్తారు. అది నిజమైన భక్తి కాదు. ఏమి కోరికలు పెట్టుకోనక దైవం మీద భారం అంతా ఉంచి తమ కర్మలు నిర్వహిస్తూ సత్యం, ధర్మం తప్పక భజించే కర్మయోగులు నిజమైన భక్తి యోగులు. నిరుపాధికులై అర్పించే త్యాగారాజు రామానుగ్రహం కోసం ఎంతో ఆర్తుడై ప్రార్థించాడు. ఆయన తన జీవితంలో ఎన్నో రకాల బాధలు అనుభవించినట్టు పరంపరగా వినవచ్చే గాథలు చెబుతున్నాయి. అన్నగారి వల్ల ఆతడి శ్రీరామ పంచాయతన విగ్రహాలు మాయం కావడం, భార్య వియోగం ఇత్యాది పరీక్షాలెన్నో ఆయనకు వ్యథ కలిగించాయి. అయినా దైవం పట్ల ఆయన భక్తి విశ్వాసాలు పెరిగాయే కాని తగ్గలేదు. “పంతమేలరా ఓ రాఘవా” అంటూ తన రాముడినే నిలదీసి అడిగే చనువు సంపాదించుకున్నాడు.

ఆ పాట్లు తనకే గాదు, సాక్షాత్తు శ్రీహరిని కన్న తల్లిదండ్రులు, మనసారా హరిని నమ్ముకున్న గోపిజనులకు కూడా తప్పలేదు. తాను బోధించిన ఎన్నో సన్మార్గ వచనాలు తాను నిలబెట్టుకోవడం మానేశాడని అక్కసు వెళ్ళగక్కుతాడు. కష్టాలు వస్తే తట్టుకో, ఓర్చుకో అంటూ సమయానికి తగ్గట్టు మాటలాడి మోహం తప్పించి ఊరుకున్నడే గాని భక్తుల యోగక్షేమాలు చూడలేదట. అదంతా పైకి చూస్తే దైవాన్ని నిర్ణయడుగా నిరూపించడంగా ఉంటుంది.  కాన భక్తుల పరంగా ఆలోచిస్తే తమ అచంచల భక్తిని నిగ్గు తేల్చడానికి దైవము వారిని పరీక్షించడం అవుతుంది.

“బంగారం నిగ్గు తేల్చడానికి అగ్నిలో పుఠం వేయాలిగదా!”

“హేమ్నః సంలక్ష్యతే హ్యాగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా” అని అంటాడు కాళిదాసు (రంఘువంశం). మన బంగారం మంచిది కాకుంటే కంసాలి మాత్రం ఏమి చేయగలడు? అలాంటి అగ్ని పరీక్షలోనే భక్తుని హృదయ సంపూర్ణ భక్తిని ఋజువు చేసుకోవలసి వస్తుంది. ఈ విషయమే త్యాగయ్య దృష్టిలో ఉంది. దైవ లీలలను పేర్కొంటూ, పొగడటం వ్యంగ్య మర్యాదతో భక్తుల సాధనావస్థను అద్దంలో చూపినట్లు ఈ కీర్తన రచించాడు.

సమయానికి తగు మాట లాడి తన పట్టుసాధించుకున్నాడట రాముడు. ఇందుకు తార్కాణంగా కొన్ని సన్నివేశాలు భాగవతంలో నుండి చూపి తనను గూడా వారి కోవలో చేర్చుకుంటూ పరమ భాగవతోత్తముడైన త్యాగయ్య లోకోత్తరమైన రీతిలో భక్తి ప్రబోధం లోకానికి చేస్తున్నాడు.

“లావోక్కింతయు లేదు. నీవే తప్పనితఃపగంబెరగ” అనే  దీనావస్థకు తెచ్చిగాని దైవం ఆదుకోడు. ఆ స్థితి కలిగించడం జగద్గురుడైన రాముని శిక్షావిధానము. “కృష్ణం వందే జగద్గురుం” అనిగదా నమస్కరిస్తాము. ఆ గురుశిష్య సంబంధమే జీవాత్మకు పరమాత్మకు గలదని సనాతనుల మాట వింటునే ఉన్నాం. ఈ భూమికపై ఈ కీర్తన నడిచింది.

పల్లవి – అను పల్లవిలోని “తాపట్టిన పట్టు” అనే మాటలను కలిపి ఈ పల్లవి చదువుకోవలసి యున్నది. తాపట్టిన పట్టుసాదించెనే ఓ మనసా అని చదువుకొని అన్వయించి శ్రీహరి పట్టిన పట్టెమి?  అని విచారించుకోవాలి. దైవం మానుష రూపేణ, లీలామానుష రూపేణ ఎన్నో రకాలుగా నటించాడు. దశరధుని తనయుడుగా, కౌసల్య నందవర్ధనుడిగా మసలుకొని వారికి కూడా ఎన్నో రకాల మానసిక వ్యథలు కల్పించాడు. వారి పుత్రోత్సాహము శ్రీరాముని అరణ్యవాసంతో దుఃఖంగా పరిణమించింది. రాముని పట్టు సత్య ధర్మపాలన. తల్లి దండ్రుల సన్నిధిలో జీవితం అంతా సుఖాలనుభవిస్తూ మెలగడం కాదు  అలాగే దేవకీ వసుదేవులు గూడా.

అను పల్లవి:

తాను బోధించిన సన్మార్గాలేవి? పరమాత్ముడు పరమార్థ సారాన్నంతా భగవద్గీతలో ఇమిడ్చినాడు.

ఉదాహరణకు  – మూడు శ్లోకాలు

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥ (భగవద్గీత 9-22)

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥ (భగవద్గీత 4-8)

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః॥ (భగవద్గీత 18-66)

(ఇలా చింతలన్నీ మాని నన్ను నిత్య భక్తితో కొలిచేవారి యోగ క్షేమాలు నేను వహిస్తాను. సాధువులను కాపాడేందుకు గాను, దుర్మార్గులను నాశనము చేసెందుకుగాను యుగయుగానికి నేను అవతరిస్తూ వుంటాను. అన్ని ధర్మాలను వదలి నన్నే శరణు వేడుము. నిన్ను సర్వ పాపాల నుండి విముక్తుడిని చేస్తాను.)

ఇలాంటి వాగ్దానాలు నమ్మి భజిస్తూ వున్నా శ్రీహరి తన భక్తులను అనుగ్రహించకుండా తలాయిస్తున్నాడు అని త్యాగరాజు ఫిర్యాదు. ఎవరి మటుకు వారు తాము సరియైన మార్గంలో వున్నామనుకోవడం లోక సహజం. తమ లోపాలు సులభంగా తోచవు. ఆత్మపరిశీలన గల భక్తులు తమ భక్తిలో ఏమి లోపం ఉందో వెతుక్కోవడం ప్రారంభించి ఎంత కష్టం వచ్చినా దైవాన్ని దూషించరు. త్యాగరాజు కూడా ఈ కోవకు చెందిన వాడే. అయినా ఏదో ఒక దశలో మానవ సహజమైన నిరుత్సాహంతో ఇలా ఆక్రోశం చెంది వుండవచ్చు.

నీకే  తెలియకపోతే నేనేమి చేయుదురా అన్న ఇదే ధోరణిలో మరొక కీర్తనలో నిష్ఠూరములాడుతారు. ఇందుకు వ్యతిరేకంగా ఒకచోట తనదే తప్పని ఒప్పుకుంటారు. “నిన్ననవలసినదేమి రామ నన్ననవలెగాక” అని ఒక కీర్తనలో తన లోపాలను ఒప్పుకుంటాడు. ఇంతకు ముందు కీర్తనలోనే తన దుడుకులు ఏకరువు పెట్టినాడు. ఇదంతా భక్త మార్గంలో భక్తుని హృదయంలో కలుగుతూ వుండే పరిణామము, పరివర్తనము. భక్తి వికాసంలో ఇదే సహజ ధోరణి. భగవంతుడు ఏమి చేసినా ఎంత సాధించినా భక్తుల శ్రేయస్సు కొరకే అనే దృఢ విశ్వాసం భక్తునిలో కలిగినప్పుడు ఆ పరమాత్మ బోధించిన సన్మార్గ వచనాలన్నీ అర్థవంతంగా కనబడతాయి. భగవంతుని పట్ల ఏకాగ్ర భక్తి అలవడుతుంది. ప్రస్తుతం  ఈ కీర్తనలో  ఉదాహరణ – అన్ని భగవంతుని లీలా విశేషంగా అర్థం చేసుకోవాలి. దేవుడు సాధించెవి భక్తుడిని గాదు. భక్తుని శ్రేయస్సును సాధిస్తాడు. ఔషదం చేదుగా ఉండవచ్చు. కానీ పర్యవసానంలో స్వాస్థ్యం చేకూరుతుంది.

“ఔషధం జగతస్సేతుః సత్యధర్మపరాక్రమః” అని సహస్రనామంలో శ్రీహరి తత్వాన్ని వివరించారు వ్యాసులవారు. భక్తులకు ఔషధం శ్రీమన్నారాయణుడే. జగత్తులకు సేతువు లాంటి వాడు. ఇహపరాలకు వారిధి నిర్మించి భక్తులను తరింపజేస్తాడు. ఈ ప్రక్రియలో సాధించడం, బోధించడం అన్నీ అవసరమే. అందరు ఆయిన బిడ్డలే. ఎవరికీ ఎలా బోధించాలో ఆయనకు తెలుసు. గురువు శిష్యులకు బోధించేటప్పుడు దండించడనేది ఎలాంటిదో, భగవంతుడు సాధించే సాధింపులూ అలాంటివే. సత్యం ధర్మం స్థాపించడం పరమాత్ముని గుణం. అదే ఆయన పరాక్రమం. ఈ దృష్టితోనే అర్థం చేసుకోవాలి.

చరణం 1:

ఆ మాటలు పరిశీలిద్దాం. నాకు ఈ లోకంలో ఏ కర్తవ్యము లేదు. ఈ లోకంలోనే గాని మూడు లోకాల్లో గూడా అని అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. ఈ శ్లోకంలోనే ఉంది తత్త్వ రహస్యమంతా.

“న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి॥” (భగవద్గీత 3-22)

“మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః।
ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత॥” (భగవద్గీత 2-14)

ముల్లోకాల్లో నాకే కర్తవ్యం లేదు, సాధించినది సాధించవలసినది నాకేమి లేదు గాని లోకమున కొక ఆదర్శం నెలకొల్పె నిమిత్తం సర్వదా కర్మ మొనర్చుచున్నాను. కర్మ మార్గంలో శీతోష్ణాలు, సుఖదుఃఖాలు సంభవిస్తూ ఉంటాయి. వీటిని ఎవ్వరు ఆపలేరు. కాబట్టి సహింపుము. ఈ మాటలు చెప్పడానికి భగవంతుడే కావాలా. ఎవరైన చెప్పగలరుగదా అనిపిస్తుంది. ఇదే సమయానికి తగు మాటలు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలిగాని “ఓర్చుకోఅవే తీరిపోతాయి” అని చెప్పడం రక్షకుని ధర్మమా. ఈ ధోరణి తార్కిక బుద్ధికి సరిగ్గా తోచకపోవచ్చు. పారమార్థిక బుద్ధితో ఆలోచిస్తే లోకంలో మనం సుఖాలనుకునేవన్నీ సుఖాలు గావు. అందులో కష్టాలు దాగి ఉంటాయి. దాగుడుమూతలాడుతాయి. సుఖదుఃఖాలు వంతుల ప్రకారం మనలో మనుగడ సాగిస్తాయి. జీవుడు ఈ రెండింటిని సమానంగా భావించడం అలవాటు చేసుకొన్నప్పుడు వికారం తొలగి శాంతి కలుగుతుంది. నిర్లిప్తుడుగా ఉండే స్థితిని అందుకోవడమే భక్తుని లక్ష్యం.

“పాలముంచినా నీట ముంచినా నీ పదములే గతి”

అనే స్థితికి రావాలి. గీతా బోధ సర్వస్వం ఇదే పాట నేర్పుతుంది. లోకేశ్వరుని బోధలు లోక దృష్టితో చూడరాదు. పార లౌకిక దృష్టితో అవగాహన చేసుకోవాలి.

(సశేషం)

Exit mobile version