Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-19

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 6 -3వ పంచరత్న కీర్తన ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – 6వ భాగం

 ‘సాధించెనే ఓ మనసా’ – ఆరభి రాగం – శ్రీ ఇలపావులూరి కామేశ్వర రావు విశ్లేషణ

చరణం 2:

దేవకి వసుదేవులు శ్రీకృష్ణ పరమాత్మను బిడ్డగా కన్నారే గాని పుత్రోత్సాహం అనుభవించలేదు. పుట్టిన బిడ్డను వెంటనే నంద గోకులంలో యశోదకు అప్పచెప్పినాడు. కొడుకు పుట్టినట్లు నలుగురితో చెప్పుకునే ధైర్యం లేదు. ఇంత కంటే ఎలా తెగించాలి. కడుపు తీపుతో అన్ని బాధలు ఓర్చుకొని కంసునికి శ్రీకృష్ణుని జాడ తెలియకుండా ఉండాలని అన్ని దేవుళ్ళకి మ్రొక్కుతూ గడిపారు. వారితో గూడా సమయానికి తగుమాట లాడినాడు.

కం:
“నందనుఁ డనియుం బరమా
నందంబగు బ్రహ్మ మనియు ననుఁ దలచుచు నా
పెందెరువు నొందెదరు; నా
యందలి ప్రేమమున భవము నందరు మీరల్”
(భాగవతం దశమ స్కంధం, ప్రథమాశ్వాసం, 134)

అని దేవికీ వసుదేవులకు పరమ పద ప్రాప్తిని గూర్చి హామీ ఇచ్చి తన దివ్య రూపాన్ని ఉపసంహరించి బాలక దేహుడై నంద గోకులం చేరినాడు.  ఆ దివ్యమంగళ దర్శన భాగ్యం దూరమై వారెంతో వేదన చెంది ఉంటారు. పర్యవసానముతో పరమపదం చేరగలమనే ఆశతో వ్యథలన్నీ చెరసాలలో అనుభవించారు.

చరణం 3:

శ్రీరంగనాథస్వామి భోగవిలాసాలతో తేజరిల్లే పురుషోత్తముడు. కేళి రంగడని అంటారు. రంగ రంగ వైభవంగా  ఉత్సవాలు, వేడుకలు స్నానాలు, నైవేద్యాలు అన్నీ రంగనాయకునికి జరిగినట్టు ఇతర దైవాలకు జరుగవు. ‘చూతాము రారే సుదతులతో రంగపతిని’ అనే కీర్తనలో త్యాగయ్య అలగని సౌందర్య లీలా విలాస విభ్రమాలను ఎంతో మానోహరంగా వర్ణించాడు.

సీతాపతి, పూజ్యుడు, శృంగార శేఖరుడట. సరిగంచు శాలువలట చౌకట్ల పోగులట – పరువంపు ప్రాయమట – పరమాత్ముడుట – రంగని చూతాము రారే, ముఖ నిర్ణిత చంద్రడంట ముద్దు మాటలాడునట. సుఖ మొసంగి బ్రోచునట సుందరాంగుడట. ఆగమసంచారుడ. అఖిల జగత్పాలుడట. త్యాగరాజ సన్నుతుడట. తరుణులార రంగపతిని శ్రీరంగని వైభవము రథోత్సవ సందర్భంలో ఇంకా శోభాయమానంగా వర్ణించాడు (రాజు వెడలె చూతాము రారె). ఇది చక్షువులకు గోచరమయ్యే సౌందర్యంగా కనబడతుంది. సగుణ భక్తి ద్వారా సకల గుణాధారుడైన గుణాతీతుడైన నిర్గుణ పరబ్రహ్మపాసనకు ఇది చక్కని రాజమార్గం. శ్రీరంగనాథుడు ప్రతి వారి హృదయంలో నివసించే సర్వ జీవాంతరంగధాముడు. రంగ + ఈశుడు = రంగేశుడు. విశ్వమంతా ఆయన రంగమే. ప్రతి వారి అంతరంగం ఆయన రంగస్థలమే. ఈ భావనతో ఆయనను రంగేశుడుగా ఆరాధించే వాళ్ళ అంతరంగం ధన్యము. శ్రీరంగం వెళ్ళకుండానే ప్రతి వారు శ్రీరంగక్షేత్రాన్ని అంతరంగంలో దర్శించవచ్చు.

ఆ రంగేశుడు సద్గంగా జనకుడు, గంగ విష్ణు పాదమందు ఉద్భవించింది. మందాకినీ, భాగీరథి, పావనీ అని గంగానదికి పేర్లు. గంగోద్భవం వైకుంఠధాముడైన విష్ణు పాదంలో నైతే, భగీరథుడు తపస్సు చేసినందున భూమి పై భాగీరథిగా దిగింది. పాతాళంలోకి  ‘పావని’గా దిగి భగీరథుని వంశం వారి నందరినీ తన ప్రవాహంతో తరింప చేసింది.

రంగేశుడు సంగీత సంప్రదాయకుడు. ప్రణవం నుండి సంగీతం ఏర్పడింది. ఈ రంగపతియే ప్రణవ స్వరూపుడు. “ప్రణవం సర్వవేదేషు, శబ్దః ఖే పౌరుషం నృఘ”   అని భగవద్గీత బోధిస్తోంది. దీనిని భగవానుడు జ్ఞానవిజ్ఞాన యోగంలో స్పష్టంగా చెప్పినాడు. తానే ప్రణవం, ఆ ప్రణవం నుండి వేదాలు, వేదాల నుండి సంగీత సంప్రదాయము. విష్ణు సహస్రనామంలో గూడా ఇదే రూఢీగా చెప్పబడింది.

“ఆధార నిలయోధాతా పుష్పహసః ప్రజాగరః
ఊర్ధ్వగః సత్సధాచారః ప్రాణదః ప్రణవః పణః” (102)

జగత్తుకంతా ఆధారం తానే. పుష్పహాసునుడు అనగా సదానందరూపుడు. నిరంతర నిర్నిద్రుడై ప్రజాగరుడై ఉంటాడు. మనం అంతా నిద్రించే సమయంలో కూడా మనలో హంసరూపుడై హంసనాదం చేస్తూ ప్రాణాన్ని నిలబెట్టుతూ వెలుగుతూ వుంటాడు. ఆయన గమనం ఊర్ధ్వ గమనం. సద్గతికి చేర్చే సంప్రదాయం. ప్రాణమిచ్చే ప్రణవ స్వరూపుడు. పణం అంటే ధనం. ఆయన భక్తులకు మోక్ష ధనాన్ని ఇస్తాడు. మనలో ఉండే నాద స్వరూపమే సంగీతంగా పరిణమించి మరల ఆ నాదంలోనే లీనమవుతున్నది. ‘సంగీత సంప్రదాయకుడు’ అనే సమాసంలో ఇంత అర్థం ఇమిడి వుంది.

ఇక్కడ వ్యంగ్యంగా కూడా రంగేశుడిని చనువుతో  భావించాడు త్యాగయ్య. నటవిట గాయకులు మోసగాండ్లు అని అని ఒక సామెత వుంది. గాయకులు స్త్రీలోకాన్ని ఆకర్షించి విషయాసక్తులైత ఉంటారన్న ఒక  అపప్రథ ఉంది. కాని అది భక్తి రహితమైనప్పుడే పతనానికి హేతువు అవుతుంది. సంగీత సంప్రదాయకుడు కాబట్టి లోలురైన గాయకుల వలె మోసవు మాటలు చెప్పి సాధించాడు అని రంగేశుడిని చిత్రించి ఉంటాడు. పైగా తాను సంగీతోపాసన చేస్తూన్న భక్తుడి త్యాగయ్య రంగనాథున్ని ఇలా సంబోధించ వచ్చా అనే సందేహం రావచ్చు. మోహ విద్యగా కాక మోక్ష సాధనం గానే తాను సంగీతం ఉపాసిస్తున్నాడు.  “అయినా నన్ను ఇతర గాయకుల వలె సాధిస్తున్నడేమి” అనే ఆవేదన ఇక్కడ కనిపిస్తున్నది.

చరణం 4:

లీలా మానుష విగ్రహుడై శ్రీహరి గోకులంలో విహరిస్తూ ఉండే జన్మాంతర సంస్కారంతో గోపిజనులు అప్రయత్నంగానే బాలకృష్ణుని వైపు ఆకర్షితులౌతారు. వారు ఇల్లు వాకిలి పతులు సుతులు అందరినీ వీడి శ్రీకృష్ణుని వేణుగానానికి ముగ్ధులై హరిని వెదుక్కుంటూ బృందావనంలో విహరిస్తారు. అలాంటి వారిని కూడా ఒక రాగాన అనుగ్రహించ లేదు. గోపికా వస్త్రాపహరణం ఇందుకు ప్రబల ఉదాహరణం. వారు వెదుకుతూ వుండే కనబడకుండా ఎక్కడో పిల్లన గ్రోవి ఊదుతూ, ఆ మురళీ వాదనా వినోదంతో క్రీడిస్తూ ఉంటాడు. వారి పాట్లు ఆ పరమాత్మునికే ఎరుక. ఇటు పతి సుతులను వీడి రావడం అటు కృష్ణుని సాన్నిధ్యం లభ్యం కాకపోవడం వారిని ఎంత తాపానికి గురి చేశాయో వర్ణింపనలవిగాదు. గోవర్ధనోద్ధరణం, పూతనా హరణం, యమళార్జున భంజనం, మొదలైనవి లీలా విభూతులకు ముగ్ధులై  “సర్వం  కృష్ణార్పణం” అని తనను అనుసరించిన గోపికల పాట్లు చూస్తూనే చిరునవ్వుతూ సాక్షీభూతుడై వినోదించే వాడు. కాని అనుగ్రహం కల్గినప్పుడు గోపికల మనస్సుల్లో తానే సన్నిధి చేసి ఏకకాలంలో అందరికి ఆనందానుభూతిని కలిగించేవాడు.

“కలవేణురవా వశ గోపవధూ శతకోటి వృతాత్ స్మరకోటి సమాత్।
ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే॥”

శతకోటి గోపికలకు శతకోటి మన్మథుల రూపంలో వారి అభిమతాలకు తగినట్లు సుఖం కలుగ చేసే వాసుదేవునికి సమానమైన దైవం లేడు. ప్రేమకు విరహం పరీక్ష. అలాగే జీవుని రూపాలైన గోపికలు ఆత్మ స్వరూపడైన కృష్ణుని గేలికి కూడా ఓర్చుకున్నారు. ఆ బాధనే సౌఖ్యంగా ఓర్చుకొని బ్రహ్మానందానికి యోగ్యత సంపాదించుకున్నారు. గోపికల వలె త్యాగయ్య కూడా హరి చిందనతోనే ఈ వేదన గురి అయినాడని భావించాలి.

చరణం 5:

“సారాసారుడు సనక సనందన సన్ముని గేయుడు సకలాధారుడు”

ఇవి మూడు నామాలు.

  1. సారాసారుడు:

అనగా ప్రపంచంలో కనబడే చరా చర సృష్టికంతా సారాభూతం. అనగా మూల ప్రకృతి. ఆద్యంత రహిత్యుడైన పరాత్పరుడు. సృష్టికి, స్థితికి లయకు కారణుడు. ఇది లీలా సృష్టి. ‘అజాయ మానో బహుధా విజాయతే’. పుట్టక లేని వాడయ్యు అనేక రూపాలలో తన విభూతిని ప్రకటిస్తున్నాడు.

  1. సనక సనందన సన్ముని గేయుడు:

వీరిద్దరూ వైకుంఠంలో యధేచ్చగా సంచరిస్తూ పరమానందానికి మూల రూపులై విహరిస్తూండే మహామునులు. మునుల పేర్లతో అగ్రగణ్యులు.

  1. సకలాధారుడు:

సకలానికి ఆధారం. ఇంద్రియ గోచరమైన పాంచభౌతికమైన సృష్టికి మనో గోచరమైన ఊహలకు అన్నిటికి ఆధారమైన రూప భావనారాయణుడు. స్వరూపానికి స్వభావానికి భావానికి ఆది నారాయణుడు ఈ చరణంలో కీర్తించబడినాడు.

చరణం 6:

శ్రీకృష్ణపరమాత్మ గోపకాంతలకు నిత్యానందం కలిగించి కటాక్షించాడు. వారు ఏ పని చేస్తున్నా శ్రీహరి సమర్పణంగానే చేస్తుండేవారు. ఇలాంటి నిరతిశయానంద స్థితిని గురించి భగవద్గీతలో భగవానుడిలా సెలవిచ్చాడు.

“మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః॥”

(పరమశ్రద్ధతో ఏక నిష్ఠులై నా యందే మనస్సు నిల్పి భజించే వారు శ్రేష్ఠులైన యోగులని నా భావము)

గోపికలు అందుకు పరమ తార్కాణం. సర్వకాలాల యందు వారిలో ధ్యానం తప్ప వేరొకటి లేదు. వారెప్పుడు ఆ ఆనందంలో సొక్కిపోతూ ఉంటారు. యశోదమ్మ తన బిడ్డడని కృష్ణుడిని ముద్దు పెట్టుకుంటే ఆయనకు ఎక్కువ నవ్వు వచ్చిందట. ఇందులో తనా, మనా అనే సంకుచిత స్వభావం ఆమెలో ఏ కోశానో ఉంది. ఆ కోశం శుద్ధి కావాలి. విశ్వరూపం చూపినా ఆమెలో మాయ తొలగలేదు. అందుకే నవ్వుతున్నాడు. హరి ఆయన ఇలాంటి మాయా తత్త్వాన్ని తన గీతలోనే విశదీకరించాడు.

“అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామబుద్ధయః।
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్॥” (భగవద్గీత, 7-24)

“నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః।
మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్॥” (భగవద్గీత, 7-25)

(బుద్ధి పరిపాకం లేనివారు నన్ను దేహధారిగా భావించి నా పరతత్త్వాన్ని అర్థం చేసుకోలేరు. యోగ మాయ చేత నా దివ్య తత్వం అందరికీ బోధపడదు. మూఢులైన జనులు మృత్య రహితమగు నా అన్వయ స్వరూపాన్ని గ్రహింపజాలరు).
యశోద పట్ల యోగమాయా వృత్తాంతం గుడా సరిపోతున్నది. కృష్ణుడు తన లీలా వినోద విగ్రహం ద్వారా ప్రకటించే లీలలన్నీ తానే సొంతం చేసికొని ఆనందించాలని లోక సహజమైన మాతృతత్త్వం ఆమెలో వుంది. అందుకే  శ్రీకృష్ణ పరమాత్మ ఆమె తనను ముద్దు పెట్టుకుంటే నవ్వుతూ ఉన్నాడు. ఇది ఒక రకంగా ఆమెను గేలి చేయటమే. నవ్వు అనేక రకాలు గదా! అందునా శ్రీ కృష్ణుని నవ్వు ‘పుష్పహాసం’ అని విష్ణు సహస్ర నామం కీర్తిస్తున్నది.

చరణం 7:

భక్తి వాత్సల్యం పరంధాముని ప్రధాన లక్షణం. గుహుడు, శబరి, ఆంజనేయుడు, విభీషణుడు, శ్రీ రామాయణంలోను, ముచికుందుడు, కుబ్జ, అక్రూరుడు, విదురుడు కృష్ణావతారంలోను ఈ వాత్సల్యానికి నోచుకున్న ప్రసిద్ధ భక్తాగ్రేసరులు. భక్తుని లక్షణాలను గూడా ఆ యోగేశ్వరుడే పేర్కొన్నాడు.

“యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి।
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః॥” (భగవద్గీత, 12-17)

(శుభానికి పొంగిపోక కీడు కలిగితే ద్వేషించక దుఃఖాన్ని కామాన్ని పరిత్యజించిన భక్తుడు నాకు ప్రియుడు)

ఇలాంటి భక్తుల పట్ల అపార వాత్యల్య భావం దైవానికి ఉంటుంది. ఇది ఆయనలోని సుగుణం. సుగుణాలకు సముద్రం వంటి వాడు అంటే అనంత కల్యాణ గుణాభిరాముడు అన్న మాట. ఆయన గుణజాలం బ్రహ్మగూడా గణించలేడు.

“చుక్కల నెన్నగవచ్చును
గ్రక్కున భూరేణువులను గణియింపనగున్
మిక్కిలి వర్షపు ధారల
లెక్క పెట్టనగును గాని కృష్ణా నీ గుణముల్ లెక్క పెట్టనగునా!” (శ్రీమదాంద్ర భాగవతం)

శ్రీహరి సుగుణ పారావారుడు (సముద్రము). సముద్రం బిందువులను లెక్కించలేము. గుణసింధువైన శ్రీహరి గుణాలు లెక్కకు అందేవిగావు. శ్రీహరి ఆజన్మమనషుడు. పాప లేశము లేనిదే జన్మ కలుగదు. ఇది మానవజన్మ ధర్మము. ప్రారబ్ధం వల్లనే జన్మం కలుగుతుంది అని సిద్ధాంతం.

“పాప కర్మపు తనువురా. ఇందు బాధపడనే జాలరా” అని త్యాగయ్య; “బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవనకుమార్” అని తులసీ దాసు అంటారు. శ్రీహరి అవతారాలు కొన్ని మనుష్య రూపంలో జరిగినవి. రాముడు, కృష్ణుడు ఇత్యాది మానుషావతార మర్మం తెలుసుకుంటే అవి మానవ జన్మల వంటివి కావని బోధపడుతుంది. ఈ విషయం శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా తెలియిజేశారు.

“అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా” (భగవద్గీత, 4-6)

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” (భగవద్గీత, 4-8)

“జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున” (భగవద్గీత, 4-9)

(అర్జునా, పుట్టుక చావులేని అవ్యయుండనై సకల భూతాలకు ప్రభుడనైనప్పటికి, మాయా ప్రకృతిని స్వీకరించి లోకంలో జన్మమెత్తుతుంటాను. దేని కందువా? శిష్టరక్షణకు, దుష్ట శిక్షణ కొరకే. ఇది నా దివ్య జన్మ. దీని తత్త్వం తెలుసుకున్న వాడు మళ్ళీ జన్మ మెత్తడు. నా సన్నిధి చేరును)

కాబట్టి జన్మం వల్ల పాపం భగవానునికి అంటదు. అది మర్త్య జాతికి మాత్రమే అన్వయిస్తుంది.

ఆ జన్మము అనఘుడైన సర్వేశ్వరుడు ఈ కలి భాధలు తీర్చగలడు (అలాంటి విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను). కాని సమయానికి తగ్గట్లు ఏదో సాకులు చెప్పి సాధిస్తున్నాడు అని త్యాగయ్య ఆరోపణ. ఓపిక పట్టాలి. నేను ఓర్చుకోగలిగినంత వరకు ఓర్చుకున్నాను అని తనకు తానే ఓర్పరి అనుకుంటే సరిపోతుందా?  ధర్మరాజు అంతటి వాడు తనకు మించిన ఓర్పరి లేడని మార్కండేయ మహామునితో అంటాడు. ఆ ముని రాముడి కథ, హరిశ్చంద్రుని కథ, నలోపాఖ్యానం మొదలైనవి ఎత్తి చూపి వాండ్ల ఓర్పు ముందు నీ ఓర్పు ఆగదు అని ధర్మరాజు కండ్లు తెరిపిస్తాడు.

అలాగే భక్తులు తామే ఓర్పురులమనుకొంటారు. తమ భక్తిని శ్లాఘించుకుంటూ ఉంటారు. ఇలాంటి భక్తి సాధనావస్థ ఈ కీర్తనలో కనబడుతుంది.

చరణం 8:

పరమేశ్వరుడు నామ సంకీర్తన ప్రియుడు. అష్టోతర శత, సహస్ర నామ స్తోత్రాలిందుకే ఏర్పడినవి. ఆ నామం  కీర్తించేటప్పుడు ఆ నామాలలో ఇమిడియున్న దివ్వ చరిత్రం భక్తుల మనస్సులో దివ్యానుభూతి కల్గిస్తుంది. ‘రామచంద్ర’ అనే నామంలో చల్లగా చంద్రునివలె సుధా దృష్టితో కాపాడే వాడనే భావం ఏర్పడుతుంది. రామ శబ్దంలో ఉండే భావం రామో రతికర ప్రియః అనే భావం ఏర్పడుతుంది. రఘువంశ రాజులందరిలో శ్రేష్ఠుడనే దానికి కారణమైన రాముని చరిత్రంతా ఒక్కసారి కండ్లలో మెదులుతుంది.  రామాయణంలో శ్రీరాముడు వివిధ సన్నివేశాల్లో వివిధ పాత్రలలో మాట్లాడిన తీరు ఒక్కసారి గుర్తుకువస్తుంది.

“పలుకండ చక్కెరను గేరునే”; “సుధామయ వచో బృందగోవింద”; “మృదుభాషణ నత విభీషణ” మొదలగు త్యాగరాజు కీర్తనలతో మాట తీయదనం చల్లదానికి సంబందించిన ఎన్నో ఉదాహరణలు జ్ఞాపకానికి వస్తాయి. శేషశయనుడు శ్రీహరి పరనారీ సోదరుడు ఏకపత్ని వ్రతానికి రామునికి మించిన ఉదాహరణ లేదు. పరబ్రహ్మం గరుడవాహనుడు.

రాజులకు రాజైన రాఘవుడు నిరామయుడు. ఆమయం అనగా వ్యాధి. పుట్టుకే లేని పరబ్రహ్మానికి రోగం ఎలా కలుగుతుంది. ఏ రోగం అంటని శరీరంలో తామర రేకుల వంటి కన్నులుగల శ్రీరామచంద్రుని సదా వేడుకుంటున్న త్యాగయ్య కవి బాధలకు తట్టుకోలేక ముక్తికి తొందరపడుతున్నాడు. భగవానుడు చేసె పరీక్షను జాప్యంగా, నిర్దయగా చిత్రిస్తున్నాడు. ఇది ఒక రకమైన ఆర్తి. ఏకాదశ నామావళి ఈ చరణంలో గమనించవచ్చు.

చరణం 9:

ఈ చరణంలో కూడా దశనామాల సంకీర్తనం ఉంది. తిరుమలేశుని స్తుతి ఇందులో విశేషం. శ్రీ వేంకటేశ మంగాళా చరణంలో చాలా అంశాలను ఈ చరణంలో గమనించవచ్చు.

“శ్రీవేంకటేశ సుప్రకాశ సర్వోన్నత” అనే చోట ఈ శ్లోకం జ్ఞప్తికి రాకమానదు.

“శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాం ఘ్రమే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగణం”

సజ్జన మానస నికేతన అనే సందర్భంలో

“శ్రీమత్సుందర జామాతృముని మానస వాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం”

కనకాంబర ధరలసన్మకుట కుండల విరాజిత – అనే చోట

“స్తగ్బూషాం బోహేతీనాం సుషమా వహమూర్తయే

సర్వార్తి శమానా యాస్తు వేంకటేశాయ మంగళం”

మానవేంద్రుడైన రామచంద్రుడు అన్ని శరీరాలలోను ప్రధానుడై ఆత్మరూపలతో వెలిగేవాడు అనే భావం; “స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే” అనే శ్లోకాలు స్ఫురించక మానవు. తిరుమలేశుని దర్శించిన తర్వాతనే ఈ కీర్తన రచించాడేమో అనిపిస్తుంది.

చరణం 10:

తన మనస్సును త్యాగయ్య ఇలా కుదుట పరచుకుంటున్నాడు. ‘నేను ఎన్ని నిష్ఠూరాలాడుతున్న సవ్యంగా నా చేత షోడశోపచార పూజలు పద్దు తప్పకుండా చేయించుకుంటున్నాడు. భక్తుల నడతలన్ని ఇలంటివే సుమా. నీవే కాదు ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ధృవుడు మొదలైనవారు భక్తుల సంగతి విన్నావు కదా వారి కంటే గొప్ప భక్తుడవా నీవు? అని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, నీవు ఆత్మపరిశీలన చేసికో. విముఖులతో చేరవద్దు. నా యందు భక్తి లేని వారి సాంగత్యం చేయవద్దు. సత్సాంగత్యంలో ఓర్పు కలిగి నన్నే ధ్యానం చేస్తుండు. కష్టాలు ఎదురైతే తట్టుకో. ఓర్చుకోనే శక్తి నీకు నేనిస్తాను. నా నామస్మరణ చేస్తూ ఉండు అని రామయ్య నన్ను మందలిస్తున్నాడు. దమశమాది సుఖాలు ఇచ్చే మహాదాత ఆ రామభద్రుడే గదా. చెంతకు రాకుండానే ఇలా పరీక్షిస్తున్నాడు. సరే కానీ మనసా ఏదో ఒక నాటికి నా చెంతకు రాక తప్పదు ఆ రామునికి. భక్తవత్సలుడు అనే మాట అబద్ధమౌతుందా.  ధైర్యంతో ఎన్నాళ్ళయినా వేచి ఉంటాను. మనస్సులోని మర్మం ఎవరికి తెలుస్తుంది. అందరి మనస్సుల్లోని మర్మం తెలిసిన వాడు ఆ అంతరంగ పతియైన రంగేశుడే. అంతఃకరణ శుద్ధికి ఆత్మయే సాక్షి. ఎవరి భక్తికి వారే సాక్షి. జగత్సాక్షియైన రాముడు సర్వజన మనోభిరాముడు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా’ అన్నట్లు అంతర్యం తెలిసిన శ్రీరాముని అనుగ్రహం కొరకు తన మనస్సు అలా  శోధించుకొని త్యాగయ్య తన ప్రాణమయ కోశాన్ని పరిపూర్ణం చేసుకొంటున్నాడు.

(సశేషం)

Exit mobile version