[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 2 సంగీతం – ఆధ్యాత్మిక వికాసం:
జంతు (మానవ) సృష్టికి భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ, కాల, దిక్, ఆత్మ, మనస్సులు అనే 9 ద్రవ్యాలు మూల ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలలో నుండి దిక్కాలముల రెంటినీ వేరే ఉంచుదాం.
ఎందుకంటే ఈ దిక్కున నున్న దాని కంటే నీ దిక్కుననున్నది దగ్గర దూరములని, ఈ కాలమున బట్టి, పుట్టిన దాని కంటె నీ కాలమున పుట్టినది జ్యేష్ఠము, కనిష్ఠమని చెప్పడం కోసమే ఈ దిక్కాలములు. ఈ దిక్కాలముల యువచ్ఛేదమునకు లోబడినది ఒక్క పరమాత్మ తత్వము మాత్రమే. తక్కిన అన్ని తత్వాలు ఈ వ్యవహారానికి లోబడినవే.
దిక్కాలముల మినహాయింపుగా శేషించి, ఈ 7 ద్రవ్యములు చేరికయే మానవుడు (జంతు కోటిలో ఉత్తమమని పరిగణించుటచే ఇచట మానవ వివక్ష).
వానిలో ఆత్మయను ద్రవ్యము తాను ప్రభువై జ్ఞానానంద స్వరూపమై ప్రకాశిస్తుంది. ఆత్మయే క్ష్రేత్రజ్ఞ. పురుష జీవ, కూటస్థ శబ్దములచే వ్యవహరింప బడుతుంది. ఈ దేహమను ఆలయమందు ‘ఆత్మ’ దేవుడై వెలుగుతున్నాడు.
“దేహో దేవాలయః ప్రోక్తః దేవో జీవస్సనాతనః” అనే కదా సూక్తి. పాంచభౌతికమైన దేహము కావలసినదే. శరీరమున 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వుంటాయి. జ్ఞానేంద్రియాల గురించి ఆలోచిద్దాం. ఇంద్రియాలు మూలభూతములైన పంచభూతములతో సంబంధం కలగి వుంటుంది.
- భూగుణమగు- గంధమును గ్రహించు శక్తి ఘ్రాణేంద్రియమునకు.
- జల గుణమగు రసమును గ్రహించు శక్తి – జిహ్వకు.
- తేజోగుణమగు రూపమును గ్రహించు శక్తి – నేత్రమనకు.
- ఆకాశగుణమగు శబ్దమును గ్రహించు శక్తి – కర్ణమునకు.
- వాయు గుణమగు స్పర్శను గ్రహించు శక్తి – చర్మేంద్రియానికి వుంటుంది.
వాటినే జ్ఞానేంద్రియాలు అంటారు.
జ్ఞానము అనగా తెలుసుకోవడం.
ఈ ఇంద్రియాలు ఆయా విషయాలన్ని తెలుసుకుంటున్నాయి. కాబట్టి ఇవి జ్ఞానేంద్రియాలు.
సుఖ దుఃఖములు అనుభవించుటకే సాధనము మాత్రము కాకా మనస్సు ఆత్మ యొక్క బంధ మోక్షములకును కారణం అని గీతలో చెప్పబడింది. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’.
విషయ వాంఛా రాహిత్యము కల్గినపుడు సత్త్వగుణము, సత్సంకల్పము, సదాచారము, నిరంజనత్వము, చివరకు ‘నిరంజనః పరమం సామ్యముపైతి’ అని వేదసూక్తి ప్రకారంగా బ్రహ్మసాయుజ్యము కలుగుతుంది. ఇది ఆత్మకే గాని దేహానికి కాదు.
- దేహమును రక్షించునది – అన్నమయకోశం.
- ఆత్మను రక్షించునది – జ్ఞానమయ కోశం.
- అన్నమును సంపాదించుకునే విద్యలు – కూటి విద్యాలు.
- జ్ఞాననాన్ని సంపాదించుకునే విద్యలు – ఆధ్యాత్మిక విద్యలు.
- మోక్షాధీర్జానం జ్ఞానమునకు మోక్షేచ్ఛ అని ఒక నిర్వచం.
కలి వ్యాపించింది. క్రమ క్రమంగా ఆధ్యాత్మిక జిజ్ఞాస సన్నగిల్లడం మొదలైంది.
ఆళ్వారులు, నాయనారులు అవతరించి కవితామృతాన్ని వర్షించి భక్తి హీన హృదయోసర క్ష్రేత్రములు పండిచారు. గానము సమ్మోహాన కరమయిన విద్య. గానమునకు వశము కాని ఏ జాతియు లేదు. దేవ మానవ తిర్యగ్జాతులు కూడా గానానికి లొంగుతాయి అని శాస్త్రకారుల వచనం. ‘కలౌ గానప్రియో హరిః’ అన్న వచనము – శ్రీమన్నారాయణుడికి కూడా కలియుగమున గానము ఇష్టం అన్న విషయము మనకు తెలుపుతుంది.
త్యాగరాజుగారి శిల్ప రీతి ప్రభావం:
ఆయన రచించిన రచనలలో సంగీత సాహిత్య అక్షరాల విలువ వెల కట్టలేనిది.
భక్తి, రక్తి, శక్తి, యుక్తి ఇన్నింటినీ మేళవించి ఆ గేయ శిల్పి చేసిన శిల్ప చాతుర్యానికి ముగ్ధుడు కానివారు ఎవ్వరు వుండరని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
త్యాగయ్యగారి కృతులలో అటు నాదమా? ఇటు రాగమా? అన్న చర్చ వచ్చినప్పుడు సంగీతము – ఆత్మ, సాహిత్యం – శరీరమా? సాహిత్యము ఆత్మ – సంగీతము శరీరమా? అన్న ప్రశ్నకు సమాదానం దొరకదు.
ఆ రెండికి శరీరాత్మ సంబంధము కన్నా పరస్పరము ‘జీవాత్మ – పరమాత్మల’ వంటి సంబంధం అంటే బాగుటుందేమో.
ఆయన కృతులలో నిక్షిప్తమైన స్వర – రాగ – సంచారములు, మనోలయములు, సాహిత్య భావాలు ఆధ్యాత్మిక వికాసాన్ని కలగచేస్తాయి.
ఒక ప్రక్క సంగీతం ఇహలోకపు పురుషార్థ మాత్ర సాధనంగా, రాజుల మెప్పు కోసం చేసిన వాగ్గేయకారులు కొందరైతే, త్యాగయ్యగారు దైవాన్ని నమ్మి సంగీత భవనాన్ని నిర్మించి, ‘శ్రీరామ చంద్రుని’ ప్రతిష్ఠించారు.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
