Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-20

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 7 -4వ పంచరత్న కీర్తన ‘కన కన రుచిరా కనకవసన! నిన్ను’ – వరాళి రాగం – 1వ భాగం

పల్లవి:

‘కన కన రుచిరా కనకవసన! నిన్ను’

‘కన కన’ అని వర్ణనకి చూడగా చూడగా అని అర్ధం. చూపులతో ఆస్వాదించేది నాలుక మీద రుచి కండె. కంటిని ఆకర్షించే ప్రకాశం. అందుచేత ఈ సందర్భంలో చూసిన కొద్ది బంగారు జరీ వస్త్రాలతో ప్రకాశమానంగా దర్శన మిచ్చి పరమాత్మ అనే అర్థం చెప్పుకోవచ్చును.

అనుపల్లవి:

‘దిన దినమును మనసున చనువున నిన్ను’

ప్రతి దినము మనసున నిన్ను నా వాడవు అను చనువుతో చూడగా చూడగా పరమ రమణీయమూర్తివై ప్రకాశిస్తున్నావు. చనువు అనే ప్రయోగం సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. ఇతరులను అదే పనిగా మనం చూస్తే అమర్యాదగా వుంటుంది. చనువుగల మన వారిని చూస్తే ఆప్యాయత కన్పిస్తుంది.

చరణం 1:

‘పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను’

పాలుగారు పసితనపు అమాయకత్వం ముఖంలో తాండవిస్తున్న (కృష్ణావతార ధ్వని) శ్రీదేవి యొక్క (శ్రీ + అపారమహిమ) సర్వశోభాయమానమైన అంతులేని మహిమని  అంతరంగాన ఇముడ్చుకున్న నిను చూడగా చూడగా (చూసిన కొద్దీ చూడాలనిపించె).

చరణం 2:

‘కలమను ముఖ కళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచు నిన్ను’

కలకలలాడె ముఖ వర్చస్సుతో ప్రకాశించే సీత ఓర కంటితో నిన్ను చూసి ఆనందిస్తుంది. అలాంటి నిన్ను చూసిన కొద్దీ చూడాలనిపించే ప్రకాశం కన్పిస్తుంది. సీతాదేవి తానే అద్భుత సౌందర్యవతి. ఆమె ముఖమే ‘సౌందర్య కళానిలయం. అలాంటి సీతయే ఆకర్షించబడి ఓర కంటితో చూసి ఆనందించే ప్రకాశమని (రామావతార వర్ణన).

చరణం 3:

‘బాలార్కాభిసుచేల మణిమయ
మాలాలంకృత కందర సర
సిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర
సంతతంబు మనసారగ’

హృదయ సూర్యుని కాంతితో సమానమైన మంచి వస్త్రములు ధరించిన వాడా (పితాంబరధారి), మణిమాలలతో అలంకరించబడిన కంఠము కలవాడా (కౌస్తుభమణిని అలంకరించుకున్న వాడా), అందమైన చెక్కిలితో పద్మాక్షుడై ప్రకాశించు మఖము కలవాడా, (కాంతివంతమన మాణిక్య) కిరీటం ధరించిన వాడా – ఎల్లప్పుడు మనసార నిన్నే నా మనస్సు చూడగోరుతుందీ. దీని పై భాగవత ప్రభావం వుంది. భాగవతంలోని భీష్మస్తుతితో శరతల్పగతుడైన భీష్ముడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల..’  అంటారు.

శ్రీకృష్ణుని పైన ఉత్తరీయం ప్రభాత సూర్యుని కాంతితో ప్రకాశిస్తుందని దీని అర్థం.

చరణం 4:

‘సాపత్నిమాతయౌ సురుచిచే
కర్ణశూలమైన మాట వీనులఁ
జురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి
సుఖింపగ లేదా యటు’

ఈ చరణంలో ధ్రువుని కథ వుంది. సవతి తల్లి సురుచి మాటలు సహించ లేక అడవులకు పోయి భగవంతుడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొందిన వాడు ధ్రువుడు.

చరణం 5:

‘మృగమదలలామ శుభనిటల వర
జటాయు మోక్షఫలద పవమాన
సుతుఁడు నీదు మహిమఁ దెల్ప
సీత దెలిసి వలచి సొక్క లేదా యారీతి నిన్ను’

కస్తూరి తిలకంతో అలంకరించబడిన లలాటం కలవాడా (శ్లోకం: ‘కస్తూరీ తిలకం లలాట ఫలకే..’ సుప్రసిద్ధమే); జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించిన వాడా, ఆంజనేయుని ద్వారా రాముని క్షేమవార్త రామ సుగ్రీవుల మైత్రి – యుద్ధ సన్నాహాలు తెలిసి కారడవిలో వున్న తన రక్షణ కోసం శ్రీరాముడు చేస్తున్న ప్రయత్నాలను సీత విని పరవశించి ఆనందించి కదా అలాంటి నిన్ను మరింత దర్శించాలని.

చరణం 6:

‘సుఖస్పద విముఖాంబుధర
పవనవిదేహ మానస విహారా ప్త
సురభూజమానిత గుణాంక చిదా
నంద ఖగతురంగ ధృతరథాంగ
పరమ దయాకర కరుణారస
వరుణాలయ భయాపహార శ్రీరఘుపతే’

సర్వ సౌఖ్యములను కలిగించు వాడా, విముఖత్వాన్ని కల్గిన నాస్తికులను మేఘాలకు వాయువు వంటివాడా, మూర్ఖులలోని విముఖత్వమును చెదర గొట్టువాడా; విదేహ మానస విహార (సీతాదేవి) – మనస్సు నందు విహరించెడి వాడా; యోగుల మనస్సు నందు విహరించెడి వాడా, భక్తులకు కల్ప వృక్షమైన వాడా, మన్నన చేయదగిన గుణములచే (గొప్ప గుణములుగల) ఆనంద స్వరుపుడా, కరుణాకరుడవు,  గరుడ వాహనుడవు. చక్రపాణివి.. భయమును పోగొట్టు వాడా.

చరణం 7:

‘కామించి ప్రేమమీర కరముల నీదు
పాద కమలములఁ బట్టుకొను
వాఁడు సాక్షి రామనామ రసికుఁడు
కైలాస సదనుఁడు సాక్షి
మఱియు నారద పరాశర శుక
శౌనక పురందర నగజా ధరజ
ముఖ్యులు సాక్షిగాద సుందరేశ
సుఖ కలశాంబుధివా సాశ్రితులకే’

స్వార్థరహితమైన ప్రేమయే భక్తి. అలాంటి భక్తితో నీ పాదాలు పట్టుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అనడానికి ఎందరో సాక్షులు కదా. రామనామ రసికుడైన కైలాస సదనుడు శంకరుడు (విష్ణుసహస్రనామాలతో చివర పార్వతి శంకరుని అడుగుతుంది)

శ్లోకం:

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
(పార్వతికి ఉపదేశించిన వాడు శంకరుడు)

నారుదుడు, పరాశరుడు, శుక శౌనక మునులు, పురందర, పార్వతి, సీత మొదలగువారు పూజించే ‘సుందరేశ’ అనగా అందమైన ప్రభువు రాముడు అని అర్థం చెప్పుకోవచ్చు.

మదురై లోని పార్వతీ పరమేశ్వరులను మీనాక్షి సుందరేశ్వరులని వ్యవహరిస్తారు.

ఈ రకంగా సుందరేశ్వరుడు అంటే శివుడు అని కూడా అర్థం వచ్చే అవకాశం వుంది. సౌఖ్యం అనే పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తి ఆశ్రితులైన పరమ భక్తులు ఇందుకు సాక్షులు.

చరణం 8:

‘సతతము ప్రేమ పూరితుఁడగు త్యాగరాజ
నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను’

చంద్రుని మించిన ముఖకాంతి గలవాడా, త్యాగరాజనుత నిన్ను మరల మరల దర్శించాలని నా మనస్సు కోరుకుంటుంది.

‘కన కన రుచిరా’ – వరాళి రాగం – అచ్యుత రామారావు గారి విశ్లేషణ:

వరాళి లాలిత్యమైన మృదు మధురమైన రాగం. భక్తి పారవ్యశంతో ఎంతయినా పాడవచ్చు. త్యాగయ్యగారి మనస్సి రాముని యందు బాగా లగ్నమైంది. చౌకకాలంలో వుంటుంది.

పల్లవి:

‘కన కన రుచిరా కనకవసన! నిన్ను’

ఎన్నిసార్లు చూచినా చూడగా చూడగా ఆనందంగా ఉందిరా. బంగారు వస్త్రము కట్టుకొని చూడముచ్చటగా ఉన్నావురా.

చరణం 1:

‘పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను’

దినదినమును మనస్సులో చనువుతో కౌసల్యమాతను చూచి ఆనందించి – అన్నారు. శ్రీరాముని సౌందర్యము దానిని ఆస్వాదించిన సీతమ్మ  తల్లి గుర్తుకువచ్చింది.

చరణం 2.

‘కలమను ముఖ కళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచు నిన్ను’

పురుషులకు అందలోను మన్మథుని బారిగేరు మునులకు సైతము ఆలింగనం చేసుకోవాలి అని అనిపించేటంత సౌందర్యము రామునిది. పుంసాం మోహన రూపాయ అన్నారు పెద్దలు. రాముని ఆలింగనం ఆ సీతమ్మ తల్లికే కల్గింది. సీతమ్మను లంకలో చూచి వచ్చి సీతమ్మను తిరిగి ఆ విధంగా సాక్షాత్కరింప చేసినందుకు ప్రతిఫలంగా ఆ హనుమంతునికే దక్కింది. ఏకపత్నీవ్రతుడు. ఒక మాట, ఒక బాణం. త్రేతాయుగంలో మునులు, రాముని ఆలింగనం చేసుకోవాలని కోరితే, వారి కోరికను సఫలం చేయటానికి ద్వాపరయుగంలో పదియారు వేలమంది గోపికలుగా వారిని జన్మించమని చెప్పి కృష్ణరూపంలో ఆ ఆలింగన భాగ్యం కల్పించారు.

చరణం 3:

‘బాలార్కాభిసుచేల మణిమయ
మాలాలంకృత కందర సర
సిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర
సంతతంబు మనసారగ’

ఉదయించే సూర్యుని కాంతి గలవాడు. సుచేల – కంఠవర్ణనము. సరసిజాక్ష- నేత్రవర్ణనము. వరకపోల – చెక్కిళ్ళ వర్ణన. సురుచిర కీరీటధర -. కిరిట వర్ణన. సంతతంబు మనసారగ.

చరణం 4:

‘సాపత్నిమాతయౌ సురుచిచే
కర్ణశూలమైన మాట వీనులఁ
జురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి
సుఖింపగ లేదా యటు’

సవతి తల్లి యగు సురుచిచే కర్ణశూలమైన మాట (ధ్రువబాలుని) వీనుల చురుక్కున (ధ్రువుడు) తాళక (తాళలేక) శ్రీహరిని ధ్యానించి సుఖియింపగ లేదా (తపస్సు జేసి నిన్ను ప్రత్యక్షము చేసుకొన్న తరువాత నీ దర్శనమున తరువాత తాను ఎందుకై తపస్సు చేశాడో ఆ కారణం మరచిపోయి, నీ అనుగ్రహ విశేషముచే ధ్రువతారయై వెలగలేదా).

చరణం 5:

‘మృగమదలలామ శుభనిటల వర
జటాయు మోక్షఫలద పవమాన
సుతుఁడు నీదు మహిమఁ దెల్ప
సీత దెలిసి వలచి సొక్క లేదా యారీతి నిన్ను’

పవమాన సుతుడు (ఆంజనేయుడు అశోకవనములో శింశుపావృక్షం క్రింద శోకిస్తున్న సీతకు) నీదు మహిమ దెల్ప  (ఆ) సీత  (రాముని వృత్త్తాంతము) తెలిసి (తెలిసుకొనె) వలచిసొక్క లేదా ఆ రీతి (గా).

చరణం 6:

‘సుఖస్పద విముఖాంబుధర
పవనవిదేహ మానస విహారా ప్త
సురభూజమానిత గుణాంక చిదా
నంద ఖగతురంగ ధృతరథాంగ
పరమ దయాకర కరుణారస
వరుణాలయ భయాపహార శ్రీరఘుపతే’

సుఖస్పద విముఖాంబుధర  (దుర్మారులనెడు మేఘముల పాలిట) పవన  (పెనుగాలి వంటి వాడా);  విదేహ  (సీతమ్మ లేదా జీవన్ముక్తుల) మానస విహర; ఆప్తసుర భుజ  (ఆప్తులయిన వారికి కల్పవృక్షము వలె కోరికలనెల్లను దీర్చువాడా), మానిత గుణాంక, చిదానంద, ఖగ  (గరుత్మంతుడు) తురంగ (వాహనంగా కలవాడా), దృత రథాంగ – చక్రమును ధరించినవాడా పరమ దయాకర కరుణారస, వరుణాలయ భయాపహర, శ్రీరఘుపతే.

చరణం 7:

‘కామించి ప్రేమమీర కరముల నీదు
పాద కమలములఁ బట్టుకొను
వాఁడు సాక్షి రామనామ రసికుఁడు
కైలాస సదనుఁడు సాక్షి
మఱియు నారద పరాశర శుక
శౌనక పురందర నగజా ధరజ
ముఖ్యులు సాక్షిగాద సుందరేశ
సుఖ కలశాంబుధివా సాశ్రితులకే’

రాముని సౌందర్యమునకు సాక్షులను చూపిస్తున్నారు. కామించి (కావాలని కోరుకోని) ప్రేమ మీర కరముల సాదు పాద కమలముల బట్టుకొనువాడు (హనుమంతుడు) సాక్షి. రామ నామ రసికుడు కైలాససదనుడు  (శివుడు) సాక్షి. మరియు నారద పరాశర శుక శౌనక పురందర మొదలగు  భక్తులందరు; నగజ (పార్వతి) ధరజ (సీత) ముఖ్యులు – ఆశ్రితులకు.

చరణం 8:

‘సతతము ప్రేమ పూరితుఁడగు త్యాగరాజ
నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను’

సతతము ప్రేమపూరితుడగు త్యాగరాజనుత –  ముఖజిత కుముద హిత  – (చంద్రుని జయించగల్గిన ముఖము కలవాడా) వరద, నిన్ను.

ఇక్కడ పోతనగారి పద్యం గుర్తుకు వస్తుంది.

“మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు.”

‘కన కన రుచిరా’ – వరాళి రాగం – ఆది తాళం – కొమండూరి శేషాద్రి గారి సంగీత సాహిత్య విశ్లేషణ:

గుణ కథనం, రూప మహిమ ప్రదానాంశములు. పరమాత్మ వాక్కు నిచ్చినపుడు నామస్మరణం చేయడం యుగధర్మం. సర్వాత్మనా భావంతో స్వర సుందరమూర్తిని భజించాలి.  “పుంసాం మోహన రూపాయ” అని ఋషులు సైతం స్వామి లావణ్యాన్ని తనివి తీర చూచి పులకరించారు. అట్టి రాముని ‘కన కన రుచిరా’ అంటారు త్యాగయ్య. మనకు తాను దర్శించిన భావాన్ని పలుకు పలుకులకు తేనెలొలికేటట్లు అందించుతారు. ‘దినదినమును’ అనటంలో కాలవ్యవస్థ లేదు. సర్వదా దర్శించే రుచిరా అనుటం సుందరమనే భావన. సత్యం శివం సుందరం. తీయని సమాసాలతో ఈ కృతిలో ఆ ముఖజిత కుముదహిత వరుదుని దర్శింప చేస్తారు. కైలాస సదనుడు సాక్షి అనటంలో రామనామ తత్పరుడైన శివునికి రామనామరుచి తెలుసునని చెప్తారు. నారద పరాశర శుక పురందర నగజాధరజ ముఖ్యులు, పరమ భాగవతులు. వారి నందరును మన మనోఫలకము ముందరి భగవత స్మరణ యొక్క ఉత్కృష్టతను తెలియ చేస్తారు. ఆ దివ్య లీలా  విగ్రహాన్ని సంభావించుకొన్న మహానీయులను స్మరించడం చాల ఉచితము. అది భాగవత సంప్రదాయం.

సౌందర్యారాధనలో ‘పాలుగారు మోము’ అంటారు. అంటే పలుకు హొయులు. భావుకులం మనకు కూడా త్యాగయ్య తన పలుకులతో రామదర్శనం చేయించారంటే అతిశయోక్తి కాదు.

ఒక చిన్న స్వర సాహిత్యం గమనించండి:

గగ పమ దప ద సని రిరి సని సా
కళ కళ మను ముఖ కళ గలి గిన సీ

రిని సదని పదని  – సాని దప దపమ
తకు లుకుచు నొర కన్ను లను జూచె

నిన్ను అనుటలో చిత్రం సంభవితమౌతుంది. సర్వభావ విన్యాసం పరిశీలించి స్వర విన్యాస విశేషం అయ్యగారికే చెల్లింది. కృతిలో పూర్తిగా నిశ్చలమైన, శాంత వాతావరణం వుంది. కారణం చౌక కాలంలో నిర్మితమైనది. పల్లవి, అనుపల్లవి సంవాది స్వరాలతోను 1, 3, 7 చరణాలు పంచమం తోను; 4, 6 చరణాలు షడ్జమం తోను, 2వ చరణం గాంధారం తోను, 5వ చరణం రిషభం తోను ఆరంభమైనవి. రసోచిత రాగం. భక్తితో ఆవేదన తపన గోచరమౌతున్నది. రామానుగ్రహమే ఫలశృతి. హృదయస్పందన కనబడుతుంది.

(సశేషం)

Exit mobile version