Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-22

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 7 – 4వ పంచరత్న కీర్తన ‘కన కన రుచిరా కనకవసన! నిన్ను’ – వరాళి రాగం – 3వ భాగం

చరణం 5:
మృగమదలలామ శుభనిటల వర
జటాయు మోక్షఫలద పవమాన
సుతుఁడు నీదు మహిమఁ దెల్ప
సీత దెలిసి వలచి సొక్క లేదా యారీతి నిన్ను

అర్థం:
మోమున కస్తూరీ తిలకమున్నట్లు భావింపబడినది. అందమైన మోమునకు  తిలకమ్ము ఇంకెంతో  అందమును చేకూర్చును గదా!   అందుకే స్వామి వారి నుదురు శుభాస్పదమైనదని తలంపబడినది.

ఇంతకు జటాయువు అదృష్టవంతుడు. అవతార పురుషునిచే అంత్యక్రియలు చేయించుకొని  అక్షయ మోక్షఫలము నందినాడు. మోక్షము పునరావృత్త రహితం కదా. పవమానసుతుడైన నందుననే హనుమంతడు నురామడల సముద్రమును దాటగలినాడు. ఆ స్వామి త్రిముర్త్యాత్మక స్వరూపుడు. సకల దేవతావర ప్రసాది. సీతాన్వేషణ పండితుడు. రామకార్య దురంధరుడు. నవ వ్యాకరణ పండితుడు. అసాధ్య పాఠకుడు. మధుర సంభాషణా చతురుడు. కావుననే లంకలో నున్న సీతకు శ్రీరాముని నఖ శిఖ పర్యంతము వర్ణించియు తనివి తీరక రాముని మనస్పను మహిమలో గూడ విప్పజెప్పినాడు. ఆ మారుతి మృదు మధుర సంగీత వాక్యాలకు సీత పారవశ్యమును చెందినది. ఆ విధంగా నిన్ను చూచి సొక్కు చూన్నానని త్యాగయ్య చెప్పాడు.

చరణం 6:
సుఖస్పద విముఖాంబుధర
పవనవిదేహ మానస విహారా ప్త
సురభూజమానిత గుణాంక చిదా
నంద ఖగతురంగ ధృతరథాంగ
పరమ దయాకర కరుణారస
వరుణాలయ భయాపహార శ్రీరఘుపతే

అర్థం:
లోకము లోని వారందరికి కావలసినది సుఖము. అదియు అప్రయత్నముగా లభించినచో మంచిది. కాని అట్టి సుఖము కేవలము తాత్కాలికము. శ్రీరాముడు ఇచ్చు సుఖము శాశ్వతం. రామ నామ సుఖమే సుఖము.

విముఖలనగా శ్రీరామ భక్తిరహితులు. అట్టి వారితో సంగము పరమార్థ విదూరము. అది సజ్జనులకు అభిలషణీయం కాదు. ‘ముఖాంబుధర పవన’ దైవ భక్తి హితులకు మేఘమునకు వాయువు వంటివాడా అని అర్థం. శ్రీరామతత్వము అట్టిదే. ఈ రూపక మెంతయో సహృదయ హృదయ రంజకముగా వున్నది.

విదేహరాజ తనయ సీత. ఆమె మనస్సున ఎల్లప్పుడు విహరించువాడు రాముడు. ఈ సంబోధనము ఆ పుణ్యదంపతల అన్యోన్యతను వెల్లడించుచున్నది. ఆప్తునగా ఆశ్రితులు, శరణు గోరి దరికి చేరినవారు, సన్నిహితులు వారికి కల్పవృక్షము వంటివాడు శ్రీరాముడు.

అనుభవతి హి మూర్ధ్నా పాదపస్తీవ్రముష్ణమ్।
శమయతి పరితాపం ఛాయయా సంశ్రితానామ్॥

అని కాళిదాసు మహాకవి చెప్పినట్లు చెట్టు ఎండను తన యాకులతో భరించి తన నీడకై వచ్చిన భాదితుల తాపము పోగొట్టును. ఎంతటి నిస్వార్ధభావము. ఈ  సంబోధన మెంతయో అర్థవంతము.

శ్రీరాముని గుణములు ధార్మికములు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని కదా సూక్తి. శ్రీరాముని గుణములలో సత్యము ప్రధానము. ‘రామో ద్విర్నాభి భాషతే’ అని ప్రాజ్ఞుల తలంపు.

గోభిర్వేదైశ్చ విప్రైశ్చ
పతివ్రతాభిః సత్యవాదిభిః।
అలుబ్ధైర్దానశీలైశ్చ
సప్తభిర్ధార్యతే మహీ॥

గోవులు, వేదములు, విప్రులు, పతివ్రతలు, సత్యభాషణులు, లోభరహితులు, దానశీలురు అను ఏడుగురు భూమిని ధరించుచున్నారు.

ఖగతురంగడు విష్ణుదేవుడు. ఈ కారణముననే జటాయువునకు శ్రీరాముడు మోక్షమిచ్చెనని  కొందరు చెప్పచున్నారు. దృతరథాంగుడు అనగా చక్రధారి అని అర్థము. ఆ చక్రము శతృవులకు భీతినీ, అర్తులైన ఆశ్రితులకు ప్రీతిని కలిగించును.

పరమ దయాకర అనుటచె శ్రీరాముడు శరణన్న శత్రువునైన జాలితో కాపాడుతాడని భావము. కరుణారస వరుణాలయ అనగా కరుణా సముద్రుడునీ అర్థము. సముద్ర వైశాల్య గాంభీర్యాదులను అణచివేయగల ఉపాంగము. భయము ఒక భావము. ఇది భౌతికము కాదు. జనన మరణ భయమే జీవునకు బాధాకరము. దానిని పొగొట్ట వైద్యులు లేరు. ఆ భయమును బాపగలుగు చికిత్సకుడు శ్రీరాముడు ఒక్కడే సమర్థుడని భావము. శ్రీరఘుపతి అను పదమున కెంతయో అర్థగాంభీర్యమున్నది. రఘువంశ మహారాజులు త్యాగము కొరకు సంపాదించిరి. సత్యము కొరకు మితముగా భాషించిరి. సంతతి కొరకు గృహస్థులయినారు.

అట్టి రఘువంశ రత్నమగు నిన్ను ఆసక్తితో చూచుట మహా భాగ్యమని త్యాగయ్య భావన.

చరణం 7:
కామించి ప్రేమమీర కరముల నీదు
పాద కమలములఁ బట్టుకొను
వాఁడు సాక్షి రామనామ రసికుఁడు
కైలాస సదనుఁడు సాక్షి
మఱియు నారద పరాశర శుక
శౌనక పురందర నగజా ధరజ
ముఖ్యులు సాక్షిగాద సుందరేశ
సుఖ కలశాంబుధివా సాశ్రితులకే

అర్థం:
త్రికరణ శుద్ధిలేక ఏ పనీ చేసినను సిద్ధింపదు. పరమ ధర్మ స్వరూపుడైన రాముని కరుణాంతరంగునికిని ఆర్తి రక్షణమునకు సాక్షులు కావలసి వచ్చినారు. వారిలో శ్రీరామదాసుడు ఆంజనేయుడు, కైలాసవాసుడు పరమేశ్వరుడు, పరమ భాగవతులైన నారదులు సాక్షిభూతులు – వీరందరు ముక్తులే. వీరి సాక్ష్యములకు పూర్వపక్షము చేయువారు లేరు. వారి వాక్కులు వేద ఋక్కులు.

చరణం 8:
సతతము ప్రేమ పూరితుఁడగు త్యాగరాజ
నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను

అర్థం:
శ్రీరాముని ముఖసౌందర్యము చంద్రుని సోయగమును కూడా అధఃకరించునది. కావుననే శ్రీరామచంద్రుడు అనే పేరు వచ్చినది. శ్రీకృష్ణచంద్రుడు అని అనరు గదా. కోట్ల కొలది నయనాలు చంద్ర దర్శనానికి ఎదురుచూచుచుండును. ఆయన అందచందములు, చల్లదనము చూపరుల యుల్లములను పల్లవింప చేయుటయే  దానికి కారణమ. అట్టి నీ రూపు నెంత చూచినను రుచిగా వుండును అని త్యాగయ్య భావము.

ఈ కృతి త్యాగయ్య రచించిన పంచరత్న కృతులలో నొకటి. కాని ఈ కృతిని గురువు శిష్యునకు పాఠము చెప్పరాదనియు. ఒకవేళ చెప్పినచో గురువునకో, శిష్యునకో ప్రమాదము జరుగునను అపప్రధ వున్నది. స్వరజ్ఞానము కలిగిన తరువాత శిష్యుడే స్వయంగా అభ్యసించదగినదని విజ్ఞుల అభిప్రాయం. త్యాగయ్య కృతులలో సంగీతము సాహిత్యములకు సమ ప్రాధాన్యత వున్నది.

త్యాగయ్య శ్రీరాముని కన్నులార చూచి మనసారా ధ్యానించి తరించిన భక్త వరేణ్యుడు. ఆయన నాద యోగి, వేద శాస్త్ర ప్రామాణ్యమును ప్రకటించు వారి కృతులు గాంధర్వ కళామతల్లికి నవనవాలంకృతులు.

నాద బ్రహ్మ స్వరూపాయ
నారదా పరమూర్తయే
స్వర రాగ సుధా పూర్ణ
త్యాగరాజాయతే నమః

~

తేజస్వినావధీతమస్తు. స్వస్తి.

(సశేషం)

Exit mobile version