Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-23

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 7 – 4వ పంచరత్న కీర్తన ‘కన కన రుచిరా కనకవసన! నిన్ను’ – వరాళి రాగం – 4వ భాగం

‘కన కన రుచిరా’ వరాళి –  ఆది – వాఖ్యాత: ఇలపావులూరి కామేశ్వరరావు

అవతారిక:

పరమాత్ముడైన శ్రీరామచంద్రుని గుణాతీత సౌందర్యానికి సంబంధించిన విజ్ఞానం వల్ల మనోమయ కోశం పరిపూర్ణం కావాలి. అనంత కల్యాణ గుణాకరుడైన రామచంద్రుడి నామ రూప గుణధ్యానం ఈ కీర్తనలో త్యాగయ్య చేసికొని ధన్యోస్మి అంటాడు. రాముని సగుణమూర్తిని దర్శించేటప్పుడు గుణాలను సంస్మరించడం వల్ల ఆ సుందరతర దేహం క్రమేణా భావానా రూపంగా మారి రసస్థితిని కల్గిస్తుంది. పరమాత్మ కరుణకు, వాత్సల్యానికి పాత్రులైన నరులు, సురలు, దేవతలు, మునులు ఎందరి ప్రసక్తియో ఈ కీర్తనలో వస్తుంది. వారందరు రామ కటాక్షానికి పాత్రులై ఎలా ధన్యులైనారో తలచుకుంటూ శ్రీరాముని రూపం చూస్తూ వుంటే ఆ రూపం క్షణ క్షణం నూతనంగా, సుందరంగా, లోకోత్తరంగా దర్శనమిస్తుంది. లోకంలో పాంచభౌతిక పంచేంద్రియ సంబంధమైన సౌందర్యం తాత్కాలికంగా కన్పించే తళుకు మాత్రమే. కాలక్రమేణ ఈ సౌందర్యం అదృశ్యమవుతుంది. శాశ్వత సౌందర్యరాశి సత్య స్వరూప శివకరం. ఇదే సత్యం, శివం, సుందరం అయిన పరబ్రహ్మ స్వరూపం. ఈ దివ్య మహిమాతిశయం వల్ల బ్రహ్మానందం అనుభవించి ధన్యులైన సీతా మహాదేవి, బాల భక్తుడైన ధ్రువుడు, జటాయువు, హనుమంతుడు, శివుడు, నారద పరాశర శుకశౌనకాది మునులు. దేవేంద్రుడు, పార్వతి ఇత్యాదులు ఈ కీర్తనలో స్మరింపబడివారు.

ఇందరికి ముక్తిదాతయైన శ్రీరామచంద్రుని సౌందర్య భావన విజ్ఞాన జ్యోతి హృదయ కోశాన్ని ఆనంద పరిపూర్ణ చేస్తుంది. నిరతిశయానంద పారవశ్యంలో త్యాగయ్య నోట ముచ్చటైన భిన్న భిన్న పదాలతో ఈ కీర్తన వెలువడింది. వినగా వినగా రుచి కల్గిస్తూ ఉంటుంది. కవిత్వం యొక్క లక్షణం ఇదే. కల్యాణాత్మకమైన సత్యనిష్ఠయై హృదయ పూర్వకమైన వాక్కు శుద్ధి ఇలాగే విన వినరుచిగా ఉంటుంది.

“క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణియతాయాః” (అనుక్షణం క్రొత్తగా స్పురించేదే రమణీయం) (జగన్నాధ పండితులు)

పల్లవి:

నిత్యానందం కలిగించేదే నిజమైన సౌందర్యం.

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేకంటేశాయ మంగళం (శ్రీ వేంకటేశ మంగళాశాసనం)

రుచి అనగా కాంతి. ఈ కాంతి వల్ల చిత్తాకర్షణ. ఆ ఆకర్షణ చిత్తానికి చాంచల్యం కలిగించేదైతే దానికి విచ్ఛిత్తి కలుగుతుంది. ఇది దివ్యాకర్షణ. ఆరని జ్యోతి, ఎంత కాలమైనా నిలిచి ఉండే వాడని సౌందర్యం.

“అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహం
రజనీచర రాజత మోమిహరం మహానీయ మహాం రఘరామ మమే”
(వేంకటేశ్వర సుప్రభాతం)

సీతా మనోహరుడు చంద్రుని వంటి శోభాకరుడు రాక్షసులనే చీకట్లను తొలగించే సూర్యుడు, మహనీయుడు ఆ శ్రీరాముడు.

“చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ!”
(దాశరధీ శతకం)

ఇలా ఎంత వర్ణించినా రాముని సౌందర్యం వర్ణనకు అందేది గాదు. అవాజ్మనస  గోచరుడు కాబట్టి కనకనరుచిగా ఆ సౌందర్యం సకల లోకాభిరామంగా కీర్తింప బడింది. ఇక ఆయన వసనం (వస్తం) కనకమయమైనది.

“బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల” అంటూ వేరొక కీర్తనలో త్యాగయ్య కీర్తించాడు.

“కనకాంబర ధరసన్మకుట” అని ఇంతకు ముందు కీర్తనలోనే కీర్తించడం జరిగింది. ఆయనే బంగారం. ఇక వస్త్రం ఎలాంటిదై వుండాలి. బంగారు వంటిదే మనసు కూడా.

“వసుర్వసుమనాః సత్యస్సమాత్మా సమ్మితస్సమః”

“స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః” (విష్ణు సహస్రనామం)

సత్య స్వరూపుడై అందరిలో సమానంగా ఆత్మారాముడై సమ భావంతో వెలుగుతూ ఉంటాడు. శ్రీహరి దివ్యమైన కన్నులు, దివ్యమైన రూపంతో ఆనంద జ్యోతి స్వరూపుడై భూత గణేశ్వరుడిగా సకల జగత్తుకు చూచే కొద్ది ఇంకా చూడాలనిపిస్తూ ఉంటాడు.

అనుపల్లవి:

భక్తి ఒకరోజు కార్యక్రమం కాదు. ఒక వారం, నెల, సంవత్సరం పాటు తంటాలు పడి సాధించి వదిలేసేది గాదు. అది అవిరళంగా నిరంతరంగా నిల్పుకోవలసిన జీవనాడి వంటిది. ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా అంతా ఆ పరమాత్ముని దివ్య కళామయంగా భావించాలి. అందువల్ల భక్తి జీవన విధానంగా మారి భగవంతుడితో చనువు ఏర్పడుతుంది. ఆప్తబంధువులతో మనం చనువుగా ఉంటాం. అందరి కంటే ఆప్తుడు నీలో ఉండగా అంత కంటే చనువుగా ఎవరితో మెలగగలవు?

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా” (భగవద్గీత.18-61)

“అర్జునా! అందరి హృదయాలలో తిష్ఠ వేసుకొని ఈశ్వరుడుంటాడు. యంత్రాలను నడుపు చోదకుని వలె భూతజాలన్ని నడిపిస్తూ ఉంటాడు” అని గీతాచార్యుని వాక్యం. ఈ భావం భక్తుడు కల్గి ఉండాలి. అప్పుడు చనువు కలుగుతుంది.

“చనువున నామ కీర్తన సేయూచున్నారా!” అంటూ త్యాగయ్య సీతాలక్ష్మణులను ఒక కీర్తనలో అడుగుతాడు. వారిద్దరు దినదినము చనువుగా రాఘవుని చూచి ఆ సౌఖ్యం అనుభవించిన ధన్యులే. అలాగే త్యాగయ్య నిత్యమూ షోడశోపచారాలో రాముణ్ణి పూజించి చనువు సంపాదించాడు.

‘మరియాద గాదురా! రామా!’ అనేటంత చనువు సంపాదించుకున్నాడు. ‘మానము లేదా తనవాడని అభిమానము లేదా’ అని ఒక చోట అంటాడు. ‘నేను చేయి పాపమో నీకు శక్తి లోపమో’ అని మరొక చోట అన్నారు. ఇంకా..

“చాలా కల్లలాడుకున్న సౌఖ్యమేమిరా”

“అన్ని విన్నపములకు మది ఇనుమా! మాట వినుమా”

“రామాయని మొరలిడ మది రాయా దేవరాయా” ఇత్యాది చనువు పలుకులు ఎన్నో త్యాగయ్య నోట వెలువడ్డాయి.

చరణం 1:

ఆ పరమాత్మ క్షీరసాగరశాయి. అది ఆయన అత్తగారిల్లు. క్షీర సముద్ర రాజ తనయా మనోహరుడాయే. ఇక ఆయన మోము పాలుగారక చెమట కారుతుందా. పాలకు ఆధారమాయెనే గదా. తన ముగ్ద మోహనమురళీ రవం వింటేనే గోపులు పొంగిపోతాయి గదా. క్షీరానికి కొదువ ఏమున్నది. “దోగ్ధా గోపాల నందనః” పాలు పితికే వాడు ఆయనే. పాలతో ఇంత అవినాభావ సంబంధమున్న పరమాత్మ మోము పాలుగారక నీరు కారుతుందా?

ఇక ఆ మోమున సకలైశ్వర్యాలు ఉట్టిపడుతూ వుంటాయి. అష్టలక్ష్మి సమేతుడైన శ్రీహరి మహిమ అపారమైనది గదా. అది మహిమా సముద్రము. లెక్కింపలేనన్ని మహిమలు ఇందు ఇమిడి వున్నాయి. అలాంటి రాముని మోము చూచె కొద్ది సౌందర్యానుభూతి పెరుగుతూనే ఉంటుంది.

“అతృప్త్యా మృత రూపాయ వేంకటేశాయ మంగళం” అనడం అందు వల్లనే. “నీ ముద్దు మోమున జూపలే నా మీద నెనరుంచి నళిన దళనయన” అని మరో కీర్తనలో ప్రార్థిస్తాడు.

“క్షీరసాగర శయననను..”, “క్షీరసాగర విహారా” అనే కీర్తనలు గూడా ఇక్కడ స్మరణకు వస్తాయి.

చరణం 2:

సీతాదేవి జగన్మాత. సౌందర్యానికంతటికి ఆమె మూలము. ఆ సౌందర్య రాశికి త్యాగయ్య ‘మరువంపు మొలక’గా ఒక చోట వర్ణిస్తాడు. “భామా మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక”, “రామా నీ సమాన మెవరు” అంటూ అలాంటి పత్ని దొరికినందుకు రాముడిని అభినందిస్తాడు. మరువంపు మొలక కదలిక కులుకువలె స్నిగ్ధమనోహరమైన సాత్త్విక సౌరభ సమన్వితమై ఉంటుంది. మనోరంజని పూవులాగా వాసన విరుచుకపడదు. చుక్కల రాయని కేరు మోము తళతళలాడుతూ ఉంటుంది. ఆమె ఓర కన్నులలో చూస్తుండగా రాముడు చూడనట్టె ఉండి కొంత తడవు తరవాత ఆ ఓరకన్ను వంపుసొంపుల ఇంపును ఆనందంతో స్వీకరిస్తాడు. అలాంటి సమయంలో నిన్ను చూస్తే ఆ దృశ్యం ఎన్ని జన్మలకైనా మరువగలమా? ఇంకొక కీర్తనలో

“బంగారు మేటి పానపుపై భామామణి జానకి
శృంగారించుకొని చెలువొందగా నిన్ను గని
పొంగుచు మల్లె విరుల పూజించువేళ శ్రీహరి
సంగీతము బాడుమని స్వామి త్యాగరాజితుతో”
(రామభిరామ, ధన్యాసి రాగం) అంటాడు.

ఇలాంటి అనుభవాలు త్యాగయ్యకు మెండు. మురిసి మురిసి చూసే ఓర కనుల చూపు రాముని గాంభీర్యానికి తగిన నారీ తిలకం సీత. ఆ ఇద్దరి సన్నిధిని తన అంతరంగంలో కల్పించుకొని ఆ ఆనందాన్ని ప్రకటించుకొంటున్నారు త్యాగరాజ స్వామివారు.

చరణం 3:

శ్రీరామ చంద్రమూర్తి ధరించిన వస్త్రం బాల సూర్యకాంతి వలె ఎరుపుగాక, తెలుపుగాక అతి మనోహరమైన లేత పసుపురంగు కలది. జగన్మంగళకరంగా భక్తులు భావిస్తారు. కవులు వర్ణిస్తారు. ఇది తీక్షణంగా ఉండని సూర్యుని వెలుగు వలె ఆహ్లాదకరంగా ఉంటుంది. రామచంద్రునిలోని చంద్రాంశము, ఇనకుల మణిలోని తేజస్సు రెండు కలసి హృదయానికి విశిష్టమైన హర్షోల్లాసాలు కలిగిస్తూ ఉంటాయి. ఆ రంగు దిగంతాల వరకు వ్యాపిస్తుంది. దిక్కుల చివరకు రాముని కీర్తి వ్యాపించినందువల్ల ఆ రాఘవేంద్రుని ‘కనకవసనా’ అంటూ వాగ్గేయకారులు కీర్తిస్తూ ఉంటారు. అటువంటి సుచేలక రామునిది. మర్త్యుల శరీరాల వస్త్రాలతో పోల్చడం జరుగుతుంది. అది చినిగిపోయే వస్త్రాల వంటిది కాని రామమూర్తిది. సుచేల. ఆయనది ఆకాశ శరీరం ఆకాశ శరీరం బ్రహ్మ అని గదా శ్రుతి చేసేది.

అది నశించని శరీరం కాబట్టి నశించని వస్త్రం. విన్నతికి జీర్ణం కాని చేలం అది. కుచేలం గాదు. ఈ సందర్భంలో గీతా శ్లోకం ఒకటి స్మరణీయం.

“వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ” (భగవద్గీత 2-22)

మానవులు చినిగిన వస్త్రాలు తీసి వేసి నూతన వస్త్రాలు ధరించినట్లే ఆత్మ జీర్ణ శరీరాన్ని వదిలి దేహాంతరంలో ప్రవేశిస్తుంది. ఇది మానవుల విషయం. భగవంతుడు సర్వశేషి. అన్ని దేహములకు మూలదేహి. అదే ఆకాశ శరీరం. అదే ఆత్మ కూడా. శరీరం, ఆత్మ రెండు ఒకటిగా ఉండడం పరమాత్మ లక్షణం. స్థూల జగత్తు ఆయన రూపం, సూక్ష్మ ప్రకృతి అందలి చైతన్యం. ఈ విషయం ఈ శ్లోకంలో గమనించవచ్చు.

“శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వ లోక
సర్వజ్ఞ శక్త నత వత్సల సర్వశేషిన్” (శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి)

వస్త్రానికి, దేహానికి తేడా లేదు. ఇదియే దివ్య తత్త్వం. ఇక పరమాత్మ కంఠం మణిమయ మాలాలంకృతం. విశ్వరూపుని మెడలో విరాజిల్లుతూ ఉండేవి గ్రహనక్షత్రాది మణిమాలలే గదా. జగత్తులో కనుపించే మణున్నింటికి భూమియే గదా గని. ఆ భూమికి సార్వభౌముడు రాముడే గదా. సూర్యచంద్రులు గ్రహతారకలు ఆ పర బ్రహ్మం రాముని మెడలో శోభాయమానంగా వెలిగిపోయే మణిమాలలు. ఆయన కన్నులు విశ్వ దర్శనం చేయగల సుదర్శన చక్రాల వంటివి. లోకాలలో జీవుల కండ్లకు వెలుగునిచ్చే కాంతి సముద్రాలు. సరసిజాక్షుడని కవులు, గాయకులు కీర్తించడంలో ఔచిత్యం గమనించవలసి యున్నది. కమల పత్రాక్ష అని గూడా అంటారు. కమలాలు లేక సరిసిజాలలో ఉండే మకరందాన్ని భృంగాలు ఆస్వాదిస్తూ ఉంటాయి. ఆయన కన్నులలో ఉండే రసం దయా రసం. ఆ దయారసం సర్వజగత్తుకు ఆనందం రక్షణ కలిగించేది. ఆ సరసిజాలు ఆనందాన్ని జగత్తుకు ప్రసాదిస్తాయి. అవి సంసార తారకాలు. ‘సంసార తారక దయార్ద్ర దృగంచలేన’  అంటూ శ్రీనివాసుని చరణాలు అణ్ణా శరణు వేడుతున్నాడు. ఈ అంశం విష్ణు సరసిజాక్షాల నుండి లభించిన విఘాతి విశేషమే. ఇక శ్రీహరి కపోలాలు వాగమృత పరిపోషితాలై లోకాతీతమైన సౌందర్యంలో పాలుగారు మోమున కాంతులీనుతూ వున్నాయి.

‘రమణీ యానన మకర కపోల’ అని త్యాగయ్య మరో కీర్తనలో కీర్తించాడు. అద్దాల వంటి సుందరమైన చెక్కిళ్ళతో శిరమున సురుచిర కిరీటం ధరించాడు రాముడు. ఆ కిరీటం దేనికి చిహ్నంగా ధరించాడు? శరణాగత రక్షణం, సత్య  పరాక్రమం, ధర్మపాలన వీటికి ఆ కిరీటం ప్రతీక. అందుకే అది సురుచిరమైనది. ఇటువంటి నిన్ను సదా మనసార తనివి తీరేటట్లు చూడాలనిపిస్తున్నది. చూచే కొద్ది ఇంకా చూడాలనే ఉంది కాని ఇక చాలును అనిపించడం లేదు.

“అకాల తత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళం”
అనడంలో ఇదే భావం.

చరణం 4:

ఇక్కడ ధ్రువుడు అనే పేరు లేదు గాని చరణం అంతా ధ్రువునికి సంబంధించినదే. ధ్రువుడనే నామకరణంలో నారాయణమూర్తి ప్రమేయం కన్పిస్తుంది. బాల్యంలో సవతి తల్లి ఈసడింపుకు గురియై తండ్రి తొడ మీద కూర్చోబోయినాడు. అంతకు ముందు ఒక తొడ మీద సవతి తమ్ముడు ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. రెండవ తొడ ఖాళీగా ఉందని చూచి తాను తండ్రి అంకంపై కూర్చోడానికి ఉవ్విళ్ళూరుతూ వెళ్ళినాడు. సవతి తల్లి సురుచి అతడిని కసిరి లాగేసింది. పాపం దాదాపు కూర్చున్న వాడిని క్రిందికి లాగి తరిమి వేసింది. పైగా “నీకు ఆ అర్హత లేదు. పోయి తలక్రిందులుగా తపస్సు చేసుకో” అన్నది. వెళ్ళి తన తల్లి సునీతితో చెప్పి ఏడ్చినాడు. ఆమె మహా సాధ్వి. “ఆ నారాయణుడే నీకు ఊరట కల్గిస్తాడు” అన్నది. తపస్సు చేయడానికి వెళ్ళాడు. దారిలో నారదుడు దర్శనమిచ్చి ఆశ్వీరదించాడు. చివరకు నారాయణాంకమున చేరి ధ్రువ కీర్తి గడించాడు. గీతాచార్యుని వాక్యం అక్షరాల ధ్రువుడు ఆచరించి ధ్యానించి తరించాడు.

“యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమః” (భగవద్గీత 8-21)

“యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే” (భగవద్గీత 6-22)

శ్రీహరిని ధ్యానించి సుఖించిన ధ్రువుడు త్యాగయ్య హృదయంలో సుప్రతిష్ఠుడై యున్నాడు. ధ్రువుని విషయం తలచుకొని పురుషోత్తముడైన శ్రీమన్నారాయణమూర్తిని చూచే కొద్దీ చూడాలనిపిస్తుందని భావం.

(సశేషం)

Exit mobile version