[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 7 – 4వ పంచరత్న కీర్తన ‘కన కన రుచిరా కనకవసన! నిన్ను’ – వరాళి రాగం – 5వ భాగం
‘కన కన రుచిరా’ వరాళి – ఆది – వాఖ్యాత: ఇలపావులూరి కామేశ్వరరావు
చరణం-5:
త్యాగయ్య హృదయంలో శ్రీహరి నామములు ఒకదాని వెంట మరొకట పరంపరగా మెదలుతున్నాయి. ఆ భావ భూమిక తన ఇష్టదైవాన్ని తిలకిస్తూ ఉంటే ఆ సుందరరాముని తేజస్సు అమందానందలహరిగా భక్తుని హృదయ కేదారంలో ప్రవహిస్తున్నది.
ప్రస్తుతం జటాయువు స్మరణకు వచ్చాడు. జటాయువు రామునికి, రావణుని విషయం తెల్పిన మొదటివాడు. సీతాపహరణాన్ని నిరోధించడానికి ప్రయత్నించి తన ప్రాణాలను ఒడ్డి దశరథుని ఋణాన్ని తీర్చుకున్నవాడు. దాశరథి అతడిని పితృసమానుడుగా భావించి అంత దుఃఖంలో గూడా దహన సంస్కారం చేసి ధర్మ విగ్రహుడని నిరూపించుకున్నాడు. అతనికి మోక్ష ఫలాన్ని ఇచ్చినాడు. కస్తూరీ శోభితాననుడు శ్రీరాముడు జగత్తుకంతా కస్తూరి వంటివాడు. రెండవ ఆప్తుడు పవమాన సుతుడు హనుమ. లంక దాటి అశోక వాటికలో ప్రవేశించి సీతకు రాముని వార్త వినిపించాడు. ‘రాక్షస మాయ’గా శంకించి భయం చెందిన ఆ తల్లికి అనేక దాఖలాలు చెప్పి రామాంకిత అంగుళీయకాన్ని ఇచ్చి విశ్వాసం కలుగ చేసినాడు. అప్పుడు ఆమెకు తెలివి వచ్చింది. అప్పటి వరకు ఆమె మూర్ఛతో సమానమైన రామ వియోగ బాధను అనుభవిస్తునే ఉంది. రామ నామాంకితాంగుళీయకాన్ని చూచి రామ మహిమను తెలుసుకొని ఆనందంతో పొంగిపోయింది. భర్త సాన్నిధ్య సృహ కలిగింది. పరవశమైనది. హనుమంతుడు కృతకృత్యుడైనాడు. ఇలా హనుమంతుడిని జానకినీ ఇద్దరినీ స్మరిస్తూ ‘నిన్ను చూస్తూ ఉంటుంటే ఆ రుచికి అవధులు ఉంటాయా రామా’ అని త్యాగయ్య కీర్తిస్తున్నాడు. రామ సౌరభం ముందు మృగమదం (కస్తూరి) సౌరభం ఏపాటి?
చరణం-6:
సుఖం రెండు విధాలు – క్షణికం, శాశ్వతం. ఇహ సుఖాలు క్షణికాలు. తాత్కాలికాలు. స్పర్శ సుఖాలు దేహాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరస గంధాలకు సంబంధించినవి. ఆధ్యంతాలు కలిగినవి. పుట్టిన వెంటనే శరీరానికి అందిస్తునే ఉంటాయి. దుఃఖ మూలములైన సుఖాల శాశ్వతములు గావు. ఇక ఆనందం ఒకటే పరమ సుఖం. ఇది ఆత్మ విచారం వల్ల. ఆత్మ జ్ఞానం వల్ల కలిగె పరతత్త్వ దర్శనం.
సుఖ మాత్యంతికం యత్తతి బుద్ది గ్రాహ్యమతీంద్రియమ్
వేత్తి యత్రనచై వాయంస్థితశ్చలతి తత్త్వతః (భగవద్గీత. 6-2)
దీనికి తిరుగులేదు. ఇది అనంతమైన జ్ఞాన జ్యోతి. ఆరని వెలుగు. దేహం నశించినా జీవుని వెంట వచ్చే మార్గదర్శకమైన కరదీపిక. ఐహికాముష్మిక సుఖాలు రెండు ఈశ్వర మూలకములే. మాయా కల్పితం. ఐహిక సుఖం నిజమైన సత్వజ్ఞానానంత బ్రహ్మ స్వరూపానుభవం. శాశ్వతం. ఈ సుఖానికి ఆస్పదం పరమోశ్వరుడే. శ్రీరామ పరబ్రహ్మ ముందు దృష్టి నిలిచిన వారిని సుముఖులని, నిలవని వారిని విముఖులనీ అంటారు.
సుఖి యెవ్వరో రామనామ సుఖి ఎవ్వరో – అంటాడు త్యాగరాజు. రామనామ సుఖియె నిజమైన సుఖి. కామ సుఖి విముఖుడు. రామముఖి సుముఖి.
“జహాఁ రామ్ వహాఁ కామ్ నహి జహాఁ కామ్ నహీ తహరామ్”
రాముడున్న హృదయంలో కామునికి ప్రవేశము లేదు. కాముడున్న హృదయంలో రాముడు ప్రవేశించడు. రాముడు ధర్మ విగ్రహుడు గదా. ధర్మబద్ధమైన కాముడున్న హృదంలో రాముడు ప్రవేశిస్తాడు. ధర్మం రెండు తత్వాలకు సయోధ్య సాధిస్తుంది. అప్పుడు రామ తత్త్వ జిజ్ఞాసయే కామంగా మారుతుంది. కోరికలు తనను బాధిస్తూన్నాయని తెలుసుకొన్న వ్యక్తి గురుకటాక్షం వల్ల, సత్సంగతి వల్ల భక్తుడై తన విముఖత్వాన్ని తొలగించమని రామచంద్రుని వేడుకుంటాడు. అటువంటి విముఖులనే మేఘాలను పటాపంచలు చేసే పవనం వంటి వాడు భగవానుడు. దేహం గురించిన స్పృహ వదలి ఆత్మ విచారమే జీవనంగా గల జీవన్ముక్తులు విదేహులు. ఇలాంటి వాండ్లలో జనకుడు అగ్రణ్యుడు. అటువంటి వారి మనస్సులో హరిచింతన తప్ప వేరే స్పృహ ఉండదు. వీరే భగవంతునికి ఆప్తులు. ఈ ఆప్తులకు కల్పవృక్షం వంటివాడు శ్రీరామచంద్రుడు. సర్వగుణోపేతుడు. ఆ రాఘవుడు, ఆయన గుణాలు మానితములు. ఎల్లలోకాలలో ప్రశంసించబడి మాన్యములైనవి. అందువల్ల మానిత గుణాంకుడు. చిదానందస్వరూపుడు. ఖగతురంగుడు. అనగా గురుడ వాహనుడు. గరుత్ముంతుడు వేదస్వరూపుడు. వేద విహారుడు శ్రీహరి. అందు వల్ల ఖగతురంగ అనే పదం సార్థకం, చక్రధారి, శ్రీహరి చక్రం పేరు సుదర్శనం. పాపము అజ్ఞానం, అధర్మం అనే చీకట్లను తొలగింప చేసి సత్య దర్శనము చేయించేది సుదర్శనం. రథాంగం అంటే రథచక్రం. ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితం ఒక రథం. అన్ని రథాల చక్రాలు పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే కదలవు. అందరు హృద్దేశాలతో ఉండి అన్ని మనోరధ చక్రాలను ఆయనే కదిలిస్తాడు. ఇష్టం వచ్చినప్పుడు తటాలున అపేస్తాడు.
రథాంగపాణి శబ్దంలోని ఆంతర్యం ఇదే. అతని దయా దాక్షిణ్యాల వల్ల నడుస్తుంది విశ్వమంతా. కరుణా సముద్రుడైన శ్రీహరి భయాన్ని తొలగిస్తాడు. చావు అంటే కలిగే భయం ఇంతా అంతా కాదు. చావు అంటే చచ్చేటంత భయం. అజ్ఞానం వల్లనే ఈ భయం. సత్యం ఎన్నడు అసత్యం కాదు. సత్యనికి దూరంగా వెళ్ళినా అది నిన్ను వెంటాడుతుంది. దాన్ని ఆహ్లాదంతో స్వీకరించాలి. దేహానికే గాని జీవునికి మరణం లేదు. కాబట్టి ఈ జ్ఞానం కల్గించే భయహరుడైన ఓ రఘఫతీ! నిన్ను దర్శించే కొద్ది సుందరంగా కనపడుతున్నావయ్యా! అని కీర్తిస్తున్నాడు.
చరణం-7:
హనుమంతుని కామము రామదాస్యం. రామనామం జపం. రామకార్య నిర్వహణ. ఈ కామమే రామ ప్రేమగా విస్తరిల్లి నిరంతర పాదారవింద సేవన భాగ్యంగా పవమాన సుతునికి దక్కంది. ఇక కైలాసవాసుడు రామనామ రసికుడు. గౌరికి కూడా రామ తారకమంత్రం ఉపదేశం చేసిన వాడు శివుడు. నారదుడు సదా నారాయణ నామామృతపానమే చేస్తూ వీణా వాదన తత్పరుడైన దేవర్షి. ఇతిహాస పూరణాదులన్ని నారదుని వల్లనే లోకంలో అవతరించాయి. పరాశరుడు వేదవ్యాసుని తండ్రి. శుకమహర్షి భాగవత ప్రవక్త. శౌనకుడు పురణాలన్ని సూతుని వలన విన్న ఋషిగణానికి అంతటకి అగ్రగామి పురందరుడు. అంటే ఇంద్రుడు. ఇంద్రుడు రాక్షస బాధలు కల్గినప్పుడల్లా బ్రహ్మ ద్వారా శ్రీహరిని దర్శించి రక్షింపబడేవాడు. పార్వతి, సీత. సరస్వతి, ఒకరేమి సకల దేవతల శ్రీమన్నారయణ స్వరూపుడైన శ్రీరామ పరబ్రహ్మ దర్శనం చేత పునీతులు అయిన వారే. ఆయన సుందరేశ్వర సౌందర్యానికి అధిపతి. ఏ సౌందర్యమైనా ఆ అభిరాముని అంశమే. ఆ జగన్మోహన రాముని దర్శనం, నామ స్మరణం, కథాశ్రవణం అది ఒక సుఖ కలశాంబుధి. అనగా బ్రహ్మానందసాగరము. అలాంటి సుఖం అనుభవించే వారికి ఆ దివ్య రాముని దర్శనం చేసే కొద్దీ సుందరతరంగా, కాంతివంతంగా, తేజోరాశిగా అనుభూతి కల్గిస్తుంది.
చరణం-8:
నిరంతరం పరిపూర్ణమైన దైవానురాగంతో తారక జపం చేసే శివుడు త్యాగరాజేశ్వరుడనే పేరుతో తిరువారురులో వెలసి యున్నాడు. ఆ త్యాగరాజేశ్వరుని వర ప్రసాదం వల్లనే ఈ త్యాగయ్య జన్మించాడు. శివుని వలెనే రామ తారక జపంలో సిద్ది పొందిన స్వామివారు శ్రీరాముణ్ణి ‘త్యాగరాజనుత’ అంటూ ఉభయ తారకంగా సంబోధించి కీర్తిస్తున్నాడు. శ్రీరాఘవుని ముఖం కుముద హితుడైన చంద్రుని జయించినదట. చంద్రునిలో మచ్చ ఉంది. రామునిలో ఆ మచ్చ లేదు. కుముదం అనగా కలువ. కలువలకు మాత్రమే చంద్రుడు హితుడు. ‘కు’ అంటే భూమి. పృథ్వికెల్ల ముదం కల్గించేవాడు రాముడు. భూకాంతుడు. అందుచేత చంద్రుణ్ణి జయించినవాడు రాముడు అనటంలో ఎంతో ఔచిత్యం ఉంది. రాముని ముఖం సూర్య చంద్ర నయనాలతో విలసిల్లుతుంది. పరాక్రమం సూర్యునికి ప్రతీక. దయ చంద్రునికి ప్రతీక. ఈ రెండు ధర్మాలు రూపుదాల్చి రాముడు భూపాలుర కెల్ల ఆదర్శప్రాయుడు. ఇటువంటి విభూతిని మనస్సులో దినదినము భావిస్తూ ఆ మహానుభవుని దర్శనం చేస్తూ ఉంటే రుచి పెరుగుతూనే ఉంటుంది. రాముని రామణీయకం రూపంలో ఉందా, నామంలో ఉందా, చివరకు నామమే రూపం దాల్చి లోకాలను తరింప జేస్తున్నది. రాముని రూపం ఆనాటి అయోధ్యానగరవాసులకు, ఆనాటి మునులకే దక్కింది. మరి నామమో ఈనాటికి సకల జీవరాశులను తరింప జేస్తున్నది. అందుకే రామనామ రసికుడు. శివుడు ప్రబలమైన సాక్షి – అని ఈ కీర్తనతో త్యాగయ్య కీర్తించాడు. రామతత్త్వ సారం రామనమమే – అని త్యాగయ్య అన్నాడు.
“మేలు మేలు రామ నామ సుఖమీ ధరలో మనసా
ఫాల లోచన వాల్మీకాది బాలానిలజాదులు సాక్షిగ”
అని మరొక కీర్తనలో ఈ భావాన్ని సమర్థించారు.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
