[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 8 – 1వ భాగం
5వ పంచరత్న కీర్తన ‘ఎందరో మహానుభావులు’ – శ్రీ రాగం – ఆది తాళం – సాహిత్యపు విశ్లేషణ
సాధు ప్రశంస ఈ కృతి ముఖ్యాంశం. మహా భక్తులైన వారి నందరిని త్యాగయ్య గారు మనసారా సందర్శించి మనకును ఆ భగవత కోటిని వారి వారి కైంకర్య భవములను తెలియ చెప్పి ఆ పరమ భాగవతులకు మనసారా కైమోడ్చు చేస్తారు. ఆచార్య పరంపర గమనించండి.
శశి – విభాకర – సనక – సనందన – నారద – తుంబురు- – ఆంజనేయ శివ – బ్రహ్మ మరియు భూసురవరులు.
“పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి” అని వాచ్యోక్తి. అందువల్ల భాగవత స్మరణ శ్రేయోదాయకం. రాముడు పరబ్రహ్మ. స్వరలయ లెరిగి భావ రాగ లయాది సౌఖ్యము తెలియుటయే కావలసినది.
“చందురు వర్ణుని” అనుటలో ‘చంద్రుని అతిశయించు కళ కలిగిన’ అనే గాన చంద్రుని అతిశయించిన తెలుపుదనము గాదు. అన్ని ఆనందముల కంటే బ్రహ్మానందమే ఉత్తమమని; జన్మ సార్థకతకు బ్రహ్మనందమే అనుభవింపవలసినదని, దానికి స్వర లయములను తెలిసికొని భక్తి చేయుట మార్గము అని త్యాగయ్యగారు సూచిస్తారు.
ముగింపు కృతి అయినందున మంగళప్రదమైన శాంతి ఆనందాది భావములకు అనుకూలమైన శ్రీ రాగము అయ్యగారిని ఆకర్షించినది. ఉదాత్తమైనది, ప్రశాంతతను కూర్చు స్వర ప్రవృత్తి కలిగిన రాగము. ఇందు పల్లవి, ఆనుపల్లవి సంవాది భావము.
- 1వ చిట్టతాను ప్రస్థారాన్ని – సౌమగాన భావాన్ని స్పురింప చేస్తుంది.
- 2వ చిట్టతానము ‘ఘనము’ ఓ హటిని స్పురించుతుంది.
- 3వ స్వర విన్యాసం – నిపానిపమ – రూపాపమరి – విన్యాసం.
- 4వ శ్రోతోవహయతి – ససనిపా – రిసనిపా – గరిసనిప. అలాగే సనిపా – రిసనిపా – గరీసనిప –
- 5వ చిట్ట పమమప – రిరిగరి – నిసరిగ – రిరిసరి – సమయతి
- 6 గరీసని – పసనీపమరి – పమపరిగరి – అందమైన ముగింపు
- 7 రిమ, రిప, మని, పస, – స్వరాలు రక్తిగా వుంటాయి.
- 8 పనిస – పాప – రీగరిస – పాపమరి – సంవాది సంబంధం సర్వచిత్రణ గరీ – రిసాసనీ – నిపమ – ప్రత్యాహుత గమకము.
- 9 గరి – రిగ – రిరీ –రిరీ – గరి – రిగ – రిరీ – రి స్థాయి సంబంధ సాససా – పాపపా – రీరిరీ. ససా – పపా – రిరీ.. వంటి సంవాది శిల్పం మనోజ్ఞమైనది. ఈ లాంటి కూర్పు అమరులకే సాధ్యం. త్యాగయ్య గంధర్వుడు.
‘స్వరలయంబు లెరుగుకను’ అనటం మద్దెల తాళగతు తెలియక సోక్క చేయుట సాధ్యము కాదని – స్వర లయం తెలియవలెనని సూచిస్తారు.
***
ఐదవ పంచరత్న కీర్తన ‘ఎందరో మహాను భావులందరికి వందనములు’ రాగం – శ్రీ, తాళం ఆది.
ఈ కీర్తనలో సాంప్రదాయానుసారం త్యాగరాజుగారు పరమ భాగవత పరంపరకు వందనాలు సమర్పించుకొన్నారు. భాగవత భక్త సాంప్రదాయంలో ఆనాది భక్త శిఖామణులకు, వారి వారి జీవిత సాఫల్యానికి వందనము చేయుట తప్పనిసరి. సమగ్ర భావంతో ఉత్కృష్టమైన శ్రీరాగం లోని ఈ కీర్తన త్యాగరాజుగారి కీర్తనలన్నిటిలో తలమానికమైనది.
పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము ఎం..
ప్ర:
1. ఆజ్ఞాతంగ, జ్ఞాతంగ ఉన్న సనాతన, సమకాలీన ఉన్న అందరు, 2. మహాభక్తులు, మహాత్ములు, పుణ్యాత్ములు, మహార్షులు, 3. వారందరికి, 4. నా ప్రణామాలు.
తా:
మహాత్ములు, మహాభక్తులు, మనకు తెలిసిన, మనకు తెలియని మహానుభావులందరుకు నా ప్రణామాలు.
అనుపల్లవి:
చందురు వర్ణుని యంద చందమును హృదయార
విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా రెం..
ప్ర:
1. చంద్రునిలా చల్లగా ఉంటూ సంతోషం కలిగించే శ్రీరాముని, 2. సౌందర్య సుగుణ సంపత్తులున్న శ్రీరాముని, 3. (హృదయ + అరవిందము) హృదయ కమలంలో 4. ఉన్న మనస్సులో చూడగలిగి, 5. పరమానందాన్ని 6. పొందేవారెందరో
తా:
పున్నమ చంద్రునిలా సంతోషాన్ని , చల్లదనాన్ని, అందాన్ని కలిగి ఉన్న శ్రీరాముని తమ తమ హృదయాల్లో దర్శించి, నిల్పుకొన్న మహాభక్తులైన మహానుభావులందరకు నా ప్రణామాలు.
చరణం 1:
సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం..
ప్ర:
1. >సామవేదం నుండి పుట్టిన, 2. గానమును వినడంలో ఆసక్తులైన, 3. (మనస్సు నుండి ఉద్భవించినట్టి) మన్మథుని 4.సొగసు ఉన్న శ్రీరాముని యొక్క 5. ధన్య పొందడం అనే 6. యోగ్యతను పొందేవారికి.
తా:
సామవేదం నుండి పుట్టిన సంగీతాన్ని వినడంలో ఆసక్తుడు, మన్మథునితో పోటీపడే అందం ఉన్నవాడు అయిన శ్రీరాముని దర్శనం కలిగే యోగ్యత ఉన్న మహానుభావులందరకు నా భక్తి పూర్వక ప్రణామాలు.
చరణం 2:
మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగఁ బొడగనెడు వా రెం..
ప్ర:
1.మనస్సు అనే, 2. అడవిలో చరించే కోతిలాగా, 3. చంచల స్వభావాన్ని 4. విడిచి పెట్టి 5. శ్రీరాముని 6. చక్కగా, 7. చూడగలిగే వారు.
తా:
కోతి స్వభావం లాంటి చంచలత్వాన్ని మనస్సు నుండి పారద్రోలి శ్రీరాముని దివ్యదర్శనాన్ని తనివితీరా పొందే మహానుభావులందరకు నా ప్రణామాలు. (దీని భావం యోగనిష్టతో ప్రాణాయామం మొదలైన యోగ సాధనలతో మనస్సును అదుపులో ఉంచుకొని నిశ్చల సమాధిలో భగవద్దర్శనాన్ని పొందేవారని సూచిత మోతోంది.)
చరణం 3:
సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వా రెం..
ప్ర:
1.ఆలస్యం చేయకుండ వెంటనే, 2. శ్రీరాముని పాదాలకు, 3. అంతఃకరణం అనే 4. కమలం అనే పుష్పాన్ని 5.పూజించే, 6. వారు అయిన మహోత్ములందరకు.
తా:
ఆలసించక మరో ఆలోచన లేకుండ, వెనువెంటనే శ్రీరాముని పాదకమలాలపై తమ తమ మనస్సులను నిలిపి పూజలు చేసే భక్తులందరకు నా నమస్కారాలు (ఇందు మూలంగ సర్వస్వాన్ని శ్రీవారి పాదపద్మాలకు సమర్పించడం అనే పరమ భాగవత ధర్మం సూచించబడింది).
చరణం 4:
పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగములఁ దెలియు వా రెం..
ప్ర:
1.పతనం చెందిన దీనులను, 2. ఉద్ధరించువాడు, 3. అయినట్టి, 4. శ్రీరాముని, 5. గురించి, 6. ప్రయోజనకరమైన, 7. మంచి నడవడితో, 8. పాడి కీర్తిస్తూ 9. ఆనందంతో, 10 స్వరము, లయ, రాగము మొదలైన వాటి పరిజ్ఞానంతో, 11. (తెలిసి) ఉన్నవారు.
తా:
పతనం చెందిన వారిని లేవనెత్తే దయాళువు, ఆశ్రిత బాంధవుడు ఆయిన శ్రీరాముని పరమార్థ పూర్వకంగ, మంచి నడవడితో భక్తి కలిగిన వారై, సంగీతం ఎడల కలిగిన అవగాహనతో స్వరాన్ని, లయను, రాగం మున్నగు వాటిని జోడించి, కీర్తిస్తూ భజనలు చేసే వారందరకు నా అంజలులు.
చరణం 5:
హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం..
ప్ర:
1.శ్రీరాముని కల్యాణగుణములచే కూర్చబడిన కీర్తనలు, 2. నవరత్నయుత 3. కంఠహారాల్లాగున, 4. కంఠసీమపై 5. ప్రకాశిస్తూండగా, 6. భూలోకంలోని భక్తుల బృందాలు 7. ఆధ్యాత్మిక జ్ఞానంలో 8. స్నేహ పూర్వకంగ 9. దయాపూర్వకంగా 10. ప్రపంచం అంతటిని 11. సాత్త్విక మనస్సులో 12. కరుణించే వారు.
తా:
నవరత్న సాదృశమైన శ్రీరాముని సద్గుణాలతో కూర్చబడిన కీర్తనలు అనే హారములను కంఠసీమలందు గానంతో ప్రకాశింప చేసుకొంటున్న భక్త బృందాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో, సమస్త భూతాలపట్ల సుహృద్భావము కలిగి, దీనుల ఎడ కరుణ లాంటి మంచి లక్షణాలతో, ప్రపంచాన్నింతటిని అమృతమయంగ చూసి కాపాడే మహనీయులందరకు వందనములు తెల్పుతున్నారు.
చరణం 6:
హొయలుమీర నడలు గల్గు సరసుని
సదాకనులఁ జూచుచును పులక శ
రీరులై యానందపయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల వా రెం..
ప్ర:
1.వయ్యారంతో, 2. అతిశయించిన, 3. నడకలు ఉన్న 4. సహృదయుడైన, 5. ఎల్లప్పుడు 6. మనస్సు అనే నేత్రంలో చూస్తూ, 7. గగుర్పాటు చెందిన శరీరము కలవారై 8. సంతోష సముద్రంలో 9. మునిగిపోయి 10. ఆనందంతో 11. కీర్తిని పొందే.
తా:
వయ్యారపు నడకలు కల్గి సున్నిత మనస్సు ఉన్న శ్రీరాముని సర్వకాల సర్వావస్థల్లో మనస్సు అనే నేత్రంలో దర్శించుకొంటూ తాము చెందిన అనుభవాలను పులకరిస్తూ ఎల్లప్పుడు సంతోషిస్తూ ఘనత పొందిన వారందరకు ప్రణామాలు తెలియజేస్తున్నారు.
చరణం 7:
పరమ భాగవత మౌనివర శశి
విభాకర సనక సనందన
దిగిశ సుర కింపురుష కనకకశిపు
సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక
సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక ఎం..
ప్ర:
1.భక్తులైన భగవత్స్వరూపులు, 2. మహార్షులు, 3. చంద్రుడు. సూర్యుడు. 4. సనక సనందన మహర్షులు 5. దిక్పాలకులు 6. దేవతలు. 7. కింపురుషులు 8. (కనక + కశిపు + సుత) హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు 9. నారదుడు 10. తుంబురుడు 11. (పవన + సూన) వాయుపుత్రుడైన హనుమ, 12. (బాలచంద్ర + ధర ) చంద్రకళను ధరించిన శిశువు. 13. శుకమహర్షి. 14. (సరోజ + భవ) కమలము నందు పుట్టిన బ్రహ్మ, 15. (భూసుర + వరులు) బ్రాహ్మణ శ్రేష్ఠులు, 16. పరమ పవిత్రులు, 17. గొప్పవారు, 18. శాశ్వతమైన వారు 19. (కమల + భవు+సుఖము) బ్రహ్మానందమును, 20. (సదా + అరుభవులు) సర్వకాల సర్వావస్థలలో సంతోష అనుభవాన్ని పొందేవారు, 21. వీరందరు గాకుండ ప్రపంచమెరిగిన రామ భక్తులెందరో ఉన్నారని వారికి నమస్కరించారు త్యాగయ్య.
తా:
రామ భక్తులందరి పేర్లను ఇచట ఉందహరించమే కాకుండ, ఇంకా తనకు తెలియని వారు ఊన్నారని, ఊంటున్నారు అని తెలుపుతూ, అట్టి వారందరకు త్యాగరాజుగారు అంజలి ఘటింస్తున్నారు.
చరణం 8:
నీ మేని నామ వైభవంబులను
నీ పరాక్రమ ధై
ర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమున రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సంతతంబునను గుణ భజనా
నంద కీర్తనము జేయు వా రెం..
ప్ర:
1.శ్రీరామా! నీ శరీర సౌందర్యం, సౌష్టవం 2. నీ నామ స్మరణ, 3. విభవములను 4. నీ శౌర్యము, 5. ధైర్యాన్ని 6. ప్రశాంతమైన నీ మనసు 7. (ఈవులు + అను) నీ దాతృత్వాన్ని 8. అన్ని తెలిసిన నీ మాటలను 9. రఘువంశ శ్రేష్ఠుడయిన శ్రీరామ, 10. నీ పట్ల 11. దృఢమైన భక్తి 12. కలుగకుండానే 13. చెడు నమ్మకాలను 14. అసత్యం అయినట్టి 15. నీ మనస్సును తెలుసుకొని 16. సంతోషంతో, 17. నీ సద్గుణాలను వర్ణించు 18. భజన చేయడం పట్ల సంతోషంతో 19. కీర్తిస్తూ 20. గానం చేసే వారందరు.
తా:
శ్రీరామా! నీ శరీర సొగసు, నీ నామ జపము, నీ పరాక్రమము, నీ ధైర్యము, నీ నిశ్చల మనస్సు, నీ ధాతృత్వం, నీ వాక్కులు మొదలైనవి నీ ఎడల భక్తి లేకుండ చేయలేవు. అపారమైన భక్తిని కలుగజేస్తాయి. నాస్తికులను ఆస్తికులు గాను, రామభక్తులుగాను మారుస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న నీ గుణగణాలను పొగడి పాడుతూ, భక్తి పారవశ్యంతో భజన చేయడం వలన వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ సంతృప్తి లౌతున్న వారందరకు నా ప్రణామాలు.
చరణం 9:
భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మముల\న్ శివాది షణ్మతముల
గూఢముల\న్ ముప్పదిముక్కో
టి సురాంతరంగముల భావంబుల
నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య
ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా రెం..
ప్ర:
1. శ్రీకృషుని కథ అయిన భాగవతము, 2. శ్రీరాముని కథ 3. (గీత + ఆది) భగవద్గీత మొదలైన పవిత్ర గ్రంథములు, 4. నాల్గు వేదాలు 5. ఆరు శాస్త్రాలు 6. (పదునెనిమిది పురాణాలు), 7. వీటిలో ఇమిడి ఉన్న పరమార్థ రహస్యాలు 8. (శివ + ఆది) శైవము (శివుని గురించిన), శైక్తేయము (శక్తి స్వరూపిణి అంబను గురించి), కౌమారము (కుమారస్వామి అయిన సుబ్రహ్మణ్యుని గురించి), గాణపత్యము (గణేశుని గురించి) వైష్ణవము (విష్ణుని గురించి) సూర్యమతము (సూర్యుని గురించి) అనే ఆరు మతములు, 9. వాటిలో నిక్షిప్తమయిన నిగూఢ పరమార్థాలు, 10. ముప్పది మూడు కోట్లు 11. దేవతల మనోభావాలను తెలుసుకొని 12. (భావ + రాగ + లయ + ఆది) సంగీతంలోని భావం, రాగం, లయల వలన కలిగే 15. ఎడతెగని, 16. ఆనందంతో నిండిన మనస్సున్న వారై, 17. త్యాగరాజునకు దగ్గర వారైన, 18. అటువంటి మహోత్ములందరకు వందనాలు అంటున్నారు, త్యాగయ్యగారు.
వివరణలు:
(4) ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము.
(5) బ్రహ్మము, పద్మము, వైష్ణవము, శైవము, భవిష్యోత్తరము,
(6) నారదీయము, మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మము, వైవర్తము, లింగము, వరహాము, స్కాంధము, గారుడము, వామనము, మత్స్యము, కూర్మము, బ్రహ్మాండము.
తా:
మోక్షసాధనలకు భక్తియే అత్యుత్తమమైనది. భక్తి సాధనకు ప్రమాణ గ్రంథములుగ భాగవతము, రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు మున్నగు శాస్త్రాలు చెప్పబడ్డాయి. భక్తి కలగడాని శ్రవణ, కీర్తనాదులతో ప్రారంభించాలి. భక్తి ఆవరణ స్వరూప అనుసంధాన రూపమగు ఆత్మనిష్ఠ వరకు ఉంది.
ఇలాంటి భక్తి శైవ, వైష్ణవ, శాక్తీయది ఆరు మతాలలోను చక్కగా సమన్వయం అవుతుంది. దీనిచే ముప్పది మూడు కోట్ల దేవతలూ వశులౌతారు. దీనికి స్వర, భావ, రాగ లయాదులను మేళవించినట్లయితే ఆ దివ్యగానంతో శ్రీపారిని కీర్తించడం వలన అవధిలోని బ్రహ్మానందాన్ని పొందిన వారై, చిరంజీవులై, సుఖిస్తు ఉంటారని, అలంటి మహానీయులే త్యాగరాజుగారికి ఆత్మీయులు అవుతారు అంటూ వారికి వందనములు సమర్పించి దివ్యభవంతో ఈ కీర్తనను ముగిస్తున్నారు.
చరణం 10:
ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచువారు
రామభక్తుఁడైన త్యాగ
రాజనుతుని నిజదాసులైన వా రెం..
ప్ర:
1. (ప్రేమ+ ముప్పిరి) ప్రేమ మూడు పురులు లేక మూడు పాదలుగ అయిన (అభిమానము, సుగణము, వాత్సల్యము/భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు) 2. అయిన వేళల్లో 3. శ్రీరామనామాన్ని 4. స్మరణ చేసే వారు 5. శ్రీరామునకు భక్తుడైన, 6.శివునిచే నుతింపబడిన శ్రీరాముని, 7.నిజమైన భక్తులు అయినారు.
తా:
గత చరణంలో పొందుపరచిన ఉత్తమ భక్తి భావాలు ఊరకే సిద్దించవు. కేవలం సాధన మాత్రమే రక్తినిస్తుందని భావించరాదు. ప్రేమ భక్తి రూపంలో ఉంటుంది. ప్రేమ మూడు పాయలుగ శ్రీరాముని ఎడల వెల్లి విరిసేటట్లు నామజపం చేస్తూ శంకరునిచే నుతింపబడిన శ్రీరామునకు దాసులై ఉండి, శ్రీరాముని దయకు ప్రాత్రులు అయ్యే ఉత్తమలక్షణాలు ఉన్న వారందరకు వందన సమర్పణ చేస్తున్నారు త్యాగయ్య.
ముఖ్య గమనిక:
ఈ ఐదవ ఘనరాగ పంచరత్న కీర్తన అనుపల్లవి లోని ‘చందురు వర్ణుని’ అనే పదానికి ఆధ్యాత్మిక భావం కేవలం శుద్ధ సత్త్వ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపం. అంతే కాని సీతమ్మ భర్త అని భావించరాదు.
కూర్పు, రచన:
ప్రొఫెసర్ M. V. సుబ్రహ్మణ్య శాస్త్రి
1-10-6/2, మేడ మీద,
రైల్వే స్టేషన్‌కు మొదటి రోడ్, (ప్రకాష్ స్ట్రీటు)
శ్రీరామనగర్,
కాకినాడ – 533003 (ఆ.ప్ర)
ఫోను: 0884-2361097.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
