[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 8 – 2వ భాగం
5వ పంచరత్న కీర్తన ‘ఎందరో మహానుభావులు’
ఈ రాగంలో ఈ కీర్తనలో సాంప్రయాదాయానుసారం త్యాగయ్యగారు పరమ భాగవత పరంపరకు వందనాలు సమర్పించుకొన్నారు. భాగవత భక్త సాంప్రదాయంలో అనాది భక్త శిఖామణులకు, వారి వారి జీవిత సాఫల్యానికి వందనము చేయుట తప్పనిసరి. సమగ్ర భావం ఉత్కృష్టమయిన శ్రీరాగంలోని ఈ కీర్తన – అన్ని కీర్తనలలో తలమానికమైనది అని చెప్పచ్చు.
పల్లవి:
‘ఎందరో మహానుభావులు – అందరికీ వందనములు’
అర్థం:
మహాత్ములు, మహా భక్తులు, మనకు తెలిసిన మనకు తెలియని మహానుభావులందరకు నా ప్రణామాలు.
అనుపల్లవి:
‘చందురు వర్ణుని యంద చందమును హృదయార
విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వారు’
అర్థం:
పున్నమి చంద్రునిలా సంతోషాన్ని, చల్లతనాన్ని అందిస్తూ, అందంగా ఉన్న శ్రీరాముని తమ తమ హృదయాల్లో దర్శించి, నిల్పుకొన్న మహా భక్తులైన మహానుభావులందరకు నా ప్రణామాలు. ‘చందురు వర్ణుని’ – అనే పదానికి ఆధ్యాత్మిక భావం కేవలం శుద్దస్త్వ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపం. అంతే కానీ సీతమ్మ భర్త అని భావించరాదు.
చరణం 1:
‘సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యులు’
అర్థం:
సామవేదం నుండి పుట్టిన సంగీతాన్ని వినడంలో ఆసక్తుడు, మన్మథునితో పోటిపడే అందం ఉన్నవాడు అయిన శ్రీరాముని దర్శనం కలిగే యోగ్యత ఉన్న మహానుభావులందరకు నా భక్తి పూర్వక ప్రణామాలు.
చరణం 2:
‘మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగఁ బొడగనెడు వారు’
అర్థం:
కోతి స్వభావం లాంటి చంచలత్వాన్ని మనస్సు నుండి పారద్రోలి శ్రీరాముని దివ్యదర్శనాన్ని తనినితీర పొందే మహానుభావులందరకు నా ప్రణామాలు. (దీని భావం యోగ నిష్టతో ప్రాణాయామం మొదలైన యోగ సాధనలతో మనస్సును అదుపులో ఉంచుకొని నిశ్చల సమాధిలో భగవదర్శనాన్ని పొందే వారని సూచితమౌతుంది.)
చరణం 3:
‘సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వారు’
అర్థం:
ఆలసించక మరో ఆలోచన లేకుండ, వెనువెంటనే శ్రీరాముని పాదకమలాలపై తమ తమ మనస్సులను నిలిపి పూజలు చేసే భక్తులందరకు నా నమస్కారాలు. ఇందుమూలంగ సర్వస్వాన్ని శ్రీహరి పాద పద్మాలకు సమర్పించడం అనే పరమ భాగవత ధర్మం సూచించబడింది.
చరణం 4:
‘పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగములఁ దెలియు వారు’
అర్థం:
పతనం చెందిన వారిని లేవనెత్తే దయాళువు, ఆశ్రిత బంధవుడు, అయిన శ్రీరాముని పరమార్థపూర్వకంగా మంచి నడవడితో భక్తి కలిగిన వారై, సంగీతం ఎడల కలిగిన అవగాహనతో స్వరాన్ని లయను, రాగం మున్నగు వాటిని జోడించి, కీర్తిస్తూ భజనలు చేసె వారందరకు నా అంజలులు.
చరణం 5:
‘హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారు’
అర్థం:
నవరత్న సాదృశమైన శ్రీరాముని సద్గుణాలతో కూర్చబడిన కీర్తనలు అనే హారములను కంఠసీమ లందు గానంతో ప్రకాశింప చేసుకుంటున్న భక్తబృందాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో, సమస్త భూతల పట్ల సుహృద్భావము కలిగి, దీనుల ఎడ కరుణలాంటి మంచి లక్షణాలతో ప్రపంచన్నంతటిని అమృతమయంగా మర్చి కాపాడే మహానీయులందరకు వందనములు తెల్పుతున్నారు.
చరణం 6:
‘హొయలుమీర నడలు గల్గు సరసుని
సదాకనులఁ జూచుచును పులక శ
రీరులై యానందపయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల వారు’
అర్థం:
వయ్యారపు నడకలు కల్గి సున్నిత మనస్స ఉన్న శ్రీరాముని సర్వకాల సర్వావస్థలలో మనస్సు – అనే నేత్రంలో దర్శించుకొంటూ, తాము పొందిన అనుభవాలకు పులకరిస్తూ, ఎల్లప్పుడు సంతోషిస్తూ ఘనత పొందిన వారందరకు ప్రమామాలు తెలియ జేస్తున్నారు.
చరణం 7:
‘పరమ భాగవత మౌనివర శశి
విభాకర సనక సనందన
దిగిశ సుర కింపురుష కనకకశిపు
సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక
సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక’
అర్థం:
ప్రపంచమెరిగిన రామభక్తులందరి పేర్లను ఇచ్చట ఉదహరించడమే కాకుండ ఇంకా తనకు తెలియని వారు ఉన్నారని, ఉంటున్నారని తెలుపుతూ, అట్టి వారందరికి అంజలి ఘటిస్తున్నారు త్యాగయ్య.
పరమ శ్రేష్ఠముని వాల్మీకాదులు చంద్ర సూర్య – సనక –సనందులు బిక్కుకు ఈశ్వరుడైన ఇంద్రుడు, సుర – కింపురుషులు – (దేవతావర్గము), ప్రహ్లాదుడు (కనకకశిపుసుతుడు), నారద – తుంబురు హనుమ – శివ – ఘనులు – గొప్పవారు భగవదను భూత గల వారు ద్రువ – మార్కండేయాదులు శాశ్వతులు – బ్రహామానంద సుఖం అనుదిన – అనుభవీయులు (సదానుభావులు).
చరణం 8:
‘నీ మేని నామ వైభవంబులను
నీ పరాక్రమ ధై
ర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమున రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సంతతంబునను గుణ భజనా
నంద కీర్తనము జేయు వారు’
వివరణ:
శ్రీ రాగం ‘ఎందరో మహాను భావులు’ కీర్తనలో ‘నీ మేని నామ వైభవములను’ అనే దానిలో ‘నీవులను’ అని పాడటానికి బదులుగా ‘నీవు అను’ అని పాడుతున్నారు. అది సరికాదు.
ఓ రామా! నీ మేను (దివ్యమంగళ విగ్రహమును) నామ వైభవములను నీ పరాక్రమమును, ధైర్యమును, శాంత మానసమును, ఈవులను పై రెండు కలిసి సంధిలో మానసము ‘నీవునను’ అయినది సంధి విడదీస్త ఈవులను, అంటే దానములు అని అర్థం. తరువాత వచన సత్యమును ఇవిన్నీ ఎరిగి అని అర్థం. విభీషణ అభయ ప్రదానము, రాజ్యదానము సుగ్రీవునకు రాజ్యదానము, కాకాసురనకు ప్రాణదానము; రావణుడే వచ్చి ఆశ్రయిస్తే వానికి తన అయోధ్య నిచ్చెదననెడి మాట. ఇవన్నియు రాముని దానములు. వీటి నెరిగి అని అర్థం. ఏతావాతా ‘శాంత మానసము నీవులను’ అని పాడుట ఒప్పు. దీనిలోని రామ భక్తుడైన నీ ‘సా; + రిసా’ త్యాగ // రాజ అని పాడుట సమంజసముగా ఉండును. ‘త్యా’ అనే దానిని 8 మాత్రలకు లాగి ఆవృత్తం మీద ఆ జాగాలో ‘గ’ అనే దానిన లాగి పాడటం కన్నా ‘త్యాగ’ అనే దానితో ఆవృత్తం పూర్తి చేసి ఆ జాగాలో విరామం ఇవ్వడం ఉచితం. ‘యతి విశ్రమ విరతి’ అని త్యాగయ్యగారు వ్రాసిన దాని ప్రకారం విశ్రమ విరతులు పాటించుట న్యాయం కదా.
అర్థం:
శ్రీరామా, నీ శరీర సొగసు, నీ నామ జపము, నీ పరాక్రమము, నీ ధైర్యము, నీ నిశ్చల మనస్స, నీ దాతృత్వం, నీ వాక్కులు మొదలైనవి నీ ఎడ భక్తి లేకుండ చేయలేవు. అపారమైన భక్తిని కలుగజేస్తాయి.
నాస్తికులను ఆస్తికులుగాను, రామ భక్తులుగాను, మారుస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న నీ గుణగణాలను పొగడి పాడుతూ, భక్తి పారవశ్యంతో భజన చేయడం వలన వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ సంతృప్తు లౌతున్న వారందరకు నా ప్రణామాలు.
చరణం 9:
‘భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మముల\న్ శివాది షణ్మతముల
గూఢముల\న్ ముప్పదిముక్కో
టి సురాంతరంగముల భావంబుల
నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య
ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వారు’
అర్థం:
మోక్ష – సాధనలకు – భక్తియే అత్యుత్తమమైనది. భక్తి సాధనకు ప్రమాణ గ్రంథములుగ, భాగవతము, రామాయణం, భగవద్గీత, ఉపనిషత్తలు మున్నగు శాస్త్రాలు చెప్పబడ్డాయి. భక్తి కలగడానికి శ్రవణ, కీర్తనాదులతో ప్రారంభించాలి. భక్తి ఆవరణ స్ఫరూప అనుసంధాన రూపమగు ఆత్మనిష్ట వరకు ఉంది.
ఇలాంటి భక్తి, శైవ, వైష్ణవ, శాక్తేయాది ఆరు మతాలలోను చక్కగ సమన్వయం అవుతుంది. దీనిచే ముప్పది మూడు కోట్ల దేవతలు వశులౌతారు. దీనికి స్వర భావ, రాగ లయాదులను మేళవించినట్లైతే ఆ దివ్యగానంతో శ్రీహరిని కీర్తించడం వలన అవధిలేని బ్రహ్మానందాన్ని పొందినవారై, చిరంజీవులై, సుఖిస్తూ ఉంటారని, అలాంటి మహానీయులే త్యాగయ్యగారికి ఆత్మీయులు అవుతారు అంటూ వారికి వందనములు సమర్పించి దివ్య భావంతో ఈ కీర్తనను ముగిస్తున్నారు.
***
అనుబంధం:
‘ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచువారు
రామభక్తుఁడైన త్యాగ
రాజనుతుని నిజదాసులైన వారు – ఎందరో’
అర్థం:
ఉత్తమ భక్తి భావాలు ఊరకే సిద్ధించవు. కేవలం సాధన మాత్రమే రక్తినిస్తుందని భావించరాదు. ప్రేమ భక్తి రూపంలో ఉంటుంది. ప్రేమ మూడు పాయలుగా శ్రీరాముని ఎడల వెల్లివిరిసెటట్లు నామ జపం చేస్తూ శంకరునిచే నుతింపబడిన శ్రీరామునకు దాసులై ఉండు, శ్రీరాముని దయకు పాత్రులు అయ్యే ఉత్తమ లక్షణాలు వున్న వారందరికి వందన సమర్పణ చేస్తున్నారు త్యాగయ్యగారు.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
