Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-28

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 8 – 4వ భాగం

ఎందరో మహానుభావు లందరికి వందనము – శ్రీ రాగం – ఆది తాళం – ఇలపావులూరి కామేశ్వరరావు గారి విశ్లేషణ:

అవతారిక:

పరమ భాగవతులైన దేవతలు, మునులు, నరులు, కిన్నరులు, కింపురుషులు. రాక్షసులు ఎందరినో ఈ కీర్తనలో స్మరించి వారికందరికి వందనాల్పించాడు త్యాగయ్య. వీరు జ్ఞానధనులు. వీరు ఆనందానుభవం చేత విజ్ఞానమయ కోశాన్ని పరిపూర్ణం చేసికొన్న మహానుభావులు. వీరి భక్తి భావం స్థిరమై అనుభవంగా మారింది. అది మహానీయమై భగవత్సాక్షాత్కారానికి దోహదం చేసింది. అందువల్ల వారందరు మహనుభావులైనారు. వీరందరు త్యాగరాజు హృదయంలో నిత్యము మెదులుతూ ఆయన జీవితాన్ని దేదీప్యమానమైన భక్తి జ్యోతితో వెలిగించారు. వారి గుణగణాలు సవిస్తరంగా ఈ కీర్తనలో వర్ణించడం జరిగింది.

నిత్యమూ పోతన భాగవతం పారాయణం చేసే త్యాగయ్యకి ఈ మహానుభావ శబ్దం మనస్సులో కుదురుకొని ఎందరో మహానుభావులను స్మరింప జేసింది. చంద్రుడు మొదలు చంద్రధరుని వరకు; దిక్పాలు నుండి వాక్పతి వరకు – అందరికి వందనాలు అర్పించాడు. తుంబురు నారదాది గానమూర్తులు, ప్రహ్లాదాది బాల భక్తులు, ఇంకా ఘనులైన వారిని ఎందరినో స్మరించాడు. మహావిజ్ఞాన ధనులైన మహానుభావుల కోవలో తాను కూడా స్థిరమైన పదవి సంపాదించాడు.

ఈ కీర్తన త్యాగరాజు కీర్తన లన్నింటితోను మకుటాయమానంగా వెలిగిపోతున్నది. దక్షిణ భారతావనిలో ‘ఎందరో మహానుభవులు’ అని పల్లవి వినబడని చోటు లేదు. వినని చెవి లేదు. ఉత్తర భారతీయులు గూడా ఈ పల్లవిని ఉపన్యాసాలతో వాడుకంటూ ఉంటారు.

అచ్చ తెలుగు పలుకుబడితో పాటు సరళమైన సంస్కృత ధారతో ఈ కీర్తన మహా మధుర కావ్యం వలె, సంగీత ప్రబంధం వలె, భక్తి రసవాహిని వలె సంగీత లోకంలో ఆరాధింపబడుతున్నది. ‘శ్రీ రాగ’ వైభవానికి ఈ కీర్తన మహోన్నత సౌధమై నాద సుధారస తరుణాలయం వలె శోభిల్లుతుంది.

పల్లవి:

భక్తి మార్గాలు 9 గా భాగవతంలో వ్యాస భగవానుడు పేర్కొన్నాడు.

‘శ్రవణం కీర్తనం విష్ణోరి స్మరణమ్ పాదసేవనమ్।
అర్చనం వందనం దాస్యం సుఖ్యమాత్మ నివేదనమ్॥’

అని నవవిధాలు.

ప్రస్తుతం వందనం ద్వారా త్యాగయ్య భక్తులకు నివాళులు అర్పిస్తున్నారు.

“నాకు మేలు గోరు నాభక్తుఁ డగువాఁడు
భక్తజనుల కేన పరమ గతియు;
భక్తుఁ డెందు జనినఁ బఱతెంతు వెను వెంట
గోవు వెంటఁ దగులు కోడె భంగి” (భాగవతం, 9వ స్కంధం, 120)

అలాంటి పరమ భాగవతులకు వందనం చేయడం త్యాగరాజు ప్రథమ కర్తవ్యముగా భావించి ఈ కీర్తనలో వారి భక్తి విధానాన్ని ఒక్కొక్క చరణంలో వివరిస్తున్నారు. హరి భక్తుల అనుభవాలు దివ్యములు. శ్రీహరి నామ, గుణ కథా లీలల్లో మనస్సు లగ్నం చేసి, అంతర్ముఖులై నిర్గుణంగాను, రూప కల్పనతో సగుణంగాను ధ్యానించి, తరించిన మహానుభావులందరికీ నా వందనాలంటూ పల్లవితో ఉపక్రమించడం జరిగింది.

అనుపల్లవి:

ఆ పరమాత్మ అందము యొక్క చందము వేరు. అది చంద్రుని వర్ణము అమృతాయామానము. స్వచ్ఛమైన జ్ఞానబింబము. అది పూర్ణ స్వరూపం. దానిని హృదయార విందమున దర్శింపవలసినదే గాని బాహ్యవస్తు సహాయం చేత దర్శింప సాధ్యపడదు. “అమృతంతువిద్య” అన్నారు. ఆ అమృత స్వరూపమే పరమాత్మ తత్త్వము ధ్యానం వల్ల సాధింప వలసినది.

“లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్ధ్యాన గమ్యం।
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం॥”

యోగులు ధాన్యం వల్ల చందురు వర్ణుని పొడగాంచి ఆనందం అనుభవించి తరిస్తారు. హృదయం అరవిందం. అందునిలిచి యుండేది ఆ శ్రీహరియే. అది అద్దం. ఆ అద్దంలో శ్రీహరి అంద చందాన్ని చూడాలి. వేరే సాధనం ఉపయోగించదు. ఆ విధంగా, యోగాభ్యాసం చేసి పరమ యోగులు పరమాత్మని సాన్నిధ్యం అనుభవిస్తారు. అలాంటి మహానుభావులకు వందనాలు అర్పిస్తున్నాడు త్యాగయ్య. ఆ బ్రహ్మానందం ఎన్నిటికి తరిగేది కాదు. ఇతరులు బలవంతంగా లాక్కో కలిగింది కాదు. అక్షరం, అక్షయం, అమృతం, అవికల్పం.

చరణం 1:

పరమాత్ముడు సామగానలోలుడు. తాను వేద స్వరూపడనని గీతలో చెప్పినాడు “వేదానాం సామవేదోస్మి” (10-22). ఆ సామగాన లోలుని లావణ్యం మనసిజ లావణ్యం అనగా మన్మథుని వంటి సౌందర్యం. మన్మథునికి తానే జనకుడు గదా. కామ జనకుని సౌందర్యం శతకోటి మన్మథ లావణ్యంగా ఉంటుంది. విశ్వ సౌందర్యానికే ఆధారం.

నాద సౌందర్యం కంటే మించిన సౌందర్యం విశ్వంలో లేదు. నాదం అక్షరం, అవ్యయం. ఆ సౌందర్యం గూడా అవ్యయం. ఇలాంటి పరమాత్ముని సౌందర్యం చూచి ధన్యులైన భక్తాగ్రగణ్యులెదంరో ఉన్నారు. భృంగి, నటేశ, నారద, తుంబురు, అగస్త్య. మతంగాది ధన్యులు ఎందరో ప్రసిద్ధులు. వారందరికి త్యాగయ్య వందనాలు అర్పిస్తున్నాడు. వేదాలను విడమరచిన వ్యాసుల వారు వీరిలో అగ్రశ్రేష్ఠుడు. వీరి మాట ప్రత్యేకించి ఎక్కడా ఎత్తకపోయినా సామగానం ప్రస్తావన వల్ల వేదవ్యాసుని ప్రసక్తి ఇక్కడ వచ్చినట్లే. భక్తులలో గానం ద్వారా ఉపాసించిన వారికి ప్రత్యేకస్థానం భగవంతుడిచ్చాడు.

“మద్భక్తాః యత్రగాయంతి తత్రతిష్ఠామినారద”
(నారద, నా భక్తులు గానం చేసే తోట నేను తప్పక ఉంటాను)

శ్రీహరి గానలోలుడు అని నిర్ధారణ. ఈ కీర్తనలో గాన మహిమ ఎక్కువగా కొనియాడడం జరిగింది.

చరణం 2:

మనస్సు అతి చంచలంగా ప్రవర్తిస్తుంది. ఇది కోతి వలె శాఖాచంక్రమణం చేస్తూ, ఒక కొమ్మ మీద నిలకడగా ఉండదు. అర్జునుడు సైతం ఈ మనస్సును కట్ట వేయలేక కృష్ణుని మరపెట్టుకున్నాడు.

“చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్॥” (భగవద్గీత, 6-34)

(ఓ కృష్ణా, ఈ మనస్సు చంచలమై క్షోభను కలిగించుచున్నది. దీనిని నిరోధించడం వాయువును నిరోధించడం వలె అసాధ్యంగా నాకు తోచుచున్నది.)

ఇటువంటి మనస్సను ఇతర చింతల నుండి మరల్చి శ్రీహరిపై లగ్నం చేసినచో ఆదిత్య స్వరూపం పొడగట్టుతుంది. అనగా ఆత్మతత్వంపై గురి ఏర్పడుతుంది. ఆ గురియే దర్శనం. ఆ అక్షర పరబ్రహ్మమూర్తిని బాగా దర్శించి ఆనందించవచ్చు. నిరంతరానుసంధానం చేత తరింప వచ్చు.

చరణం 3:

మనస్స చాంచల్యం వదిలినప్పుడు హృదయం పరిశుద్ధమవుతుంది. అది హృదయ కమలం. కమలం నిర్మలమైనది. హృదయం కమలం వలె అమ్లానమై స్వచ్ఛంగా వుటుంది. అదే స్వాంతం అనే సరోజం. దానిని పరమాత్మకు సమర్పణం చేయాలి. మరొక వ్యాపకానికి హృదయం చోటివ్వ గూడదు. కరచరణద్యావయవాలతో ఏ పని చేస్తున్నా హృదయంలో మాత్రం పరంధామునికే చోటు. మన పనులన్నీ ఆ మూర్తికే నివేదించాలి. అప్పుడా కర్మయజ్ఞం అవుతుంది. యజ్ఞమనగా విష్ణువే. “యజ్ఞో వై విష్ణుః” అనే వేదాలు నిర్వచించాయి.

“యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్।
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్॥” (భగవద్గీత, 9-27)

ఓ కౌంతేయా! నీ పనులు, నీ తిండి, నీ యజ్ఞాలు, నీ తపస్సు అన్నీ నాకు అర్పించు. నీవు నిర్దోషివి అవుతావు. యద్భావం తద్భవతి. భావం ఎలా వుంటే ఫలితం అలా ఉంటుంది. అంతస్సు అనగా హృదయం. ఇది భగవంతునిదే అనుకొని భగవదాయత్తం చేయడం అవసరం. అప్పుడు నీకు, భగవంతునికి తేడా వుండదు. భక్తి ద్వారా యుక్తి. ఇది ఒక రాగాన కుదిరే సమాధానం గాదు. అనేక రాగాల ద్వారా సాధించాలి. ఈ రాగాలే సాధనా మార్గాలు. ‘అనురాగాత్ విరాగః’ అన్నారు. ‘సరగున’ అంటే శ్రీఘంగా. ఈశ్వర భక్తిలో జాప్యం పనికి రాదు. మరుక్షణం మనది కాదు. మంచికి తొందరపడాలి. కాలం శర వేగంతో పోతూ వుంటుంది. కాబట్టి త్వరగానే స్వాంతాన్ని భగవంతుని చరణాలపై అర్పించు. కేవలం చెట్ల పూలు నీకు ముక్తి నీయజాలవు. నీ హృదయ పుష్పం అర్పించాలి.

‘మటుమాయ భవమును మనదని యెంచక
వటపత్ర శయనుని పాదయుగములందు’

‘ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే మనసా’ అని త్యాగయ్య మరొక కీర్తనలో అంటారు. లోకులు విషయ సుఖాలకు తొందరపడతారు. కానీ అక్షయ సుఖమిచ్చే ఆ రాముని కృపకు తొందరపడరు. ‘అధ్యాత్మికమైన సాధనకు ప్రాధాన్యం ఇయ్యరు’ అని సారాంశము.

చరణం 4:

ఈ చరణంలో త్యాగయ్య దృష్టి నాదోపాసకులపై ప్రసరించింది. స్వరం, రాగం, లయ, ఈ సంగీతపరమైన అంశాలన్నీ ఆ పరాత్రరుని తేజోంశములే. పరబ్రహ్మం నాద రూపుడు. ఆకాశ శరీరుడు. ఆకాశ తత్వం నాదమే. నాదమయుణ్ణి నాదం ద్వారనే ఆరాధించాలి. ఓంకారం అన్నీ స్వరాలకు మూలం. స్వరాల సారం, రాగం, అన్ని రాగాలకు శృతి మూలం. ఆ నారాయణుడు శ్రుతి సాగరుడు. ఆ శృతిలో యుండే రాగాలు స్వరాలు ఏర్పడ్డాయి. భాష వికసించింది. కాలతత్త్వము నుండి లయ ఉద్భవించింది. ఈ దృష్టితో గాయకులు పరాత్పరుని గురించి ధ్యానించాలి. పరమాత్మ పతిత పావనుడు. జనుల దోషాలన్నింటినీ క్షమించి వారిని సక్రమ మార్గంలో పావనం చేసేవాడు. ఈ విషయం తెలుసుకోవడమే పరమార్థం. సల్లాపం అనగా సంభాషణం. భక్తులు సత్సంగంలో పరాత్పరుణ్ణి గుర్చి పవిత్రమైన కథలు చెప్పకోవటం, వినడం ఇది సల్లాపం. ఉబుసుపోని లోకాభిరామాయణం వల్ల కాలం వృథా అవుతుంది. గీతలో భగవానుడు భక్తుల సల్లాపాలను గురించి వివరించాడు.

‘మచ్చిత్తా మద్గతప్రాణాః బోధయంతః పరస్పరమ్।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ॥’ (భగవద్గీత, 10-9)

(మనస్సులను ప్రాణాలను నాకు అర్పించిన వారు అన్యోన్యముగా నా కథా ప్రసంగములను చేయుచు సంతోషమును ఆనందాన్ని పొందుచున్నారు. ఇలాంటి కథా ప్రసంగాలకు తోడు స్వరలయాది రాగముల జ్ఞానము కల్గి ఆ శ్రీహరి భజన చేయు వారి భాగ్యం వర్ణింపశక్యం గాదు. అలాంటి మహానుభావులందిరికి వందనాలు సమర్పించాడు త్యాగయ్య. పతిత పావనుడనే బిరుదు వహించిన శ్రీరామచంద్రుని నిజ మార్గంలో పాడి వేడాలి. నిజరూపం అనగా నిరుపాధికమైన భక్తి. ఏదీ ఆశించక ఆనందమే లక్ష్యంగా భజించడమే పరమ భక్తి. నిజస్వరూపం ఆత్మ. ఆత్మ సాక్షాత్కారం కోసం పాడడం ఆవశ్యకం.

“జ్ఞానముతో రామ ధ్యానముతో మంచి
గానముతో మేను దాన మొసంగుచు
హరిదాసులు వెడలె ముచ్చట కని
ఆనందమాయె దయాళో” (యమన్ కల్యాణి, దివ్యనామ సంకీర్తన)

అంటూ ఇలాంటి అనుభవాన్ని స్వానుభవం చేసుకున్నాడు త్యాగయ్య.

చరణం 5:

ఇష్టదైవాన్ని అష్టోతర శతనామావళితో గానీ, సహస్రనామావళితో గాని పూజించడం పరిపాటి. ఒక్కక్క నామం ఉచ్చరిస్తూ ఓంకార పూర్వకంగా ఒక పుష్పమో, అక్షతతో సమర్పించడం జరుగుతూ వుంటుంది. ఇలా సగుణోపాసన చేసేవారికి ఆ నామావళిలోని అంతరార్థం తెలుసుకోవాలనే కోరిక సహజంగానే కలుగుతుంది. పరమార్థాన్ని సులువుగా ఆకళింపు చేసుకోగలుగుతారు. ఒక్కొక్క గుణం ఒక్కొక్క మణిపూస వంటిది. అవన్నీ కలిపితే మణిహారం రూపొందుతుంది. ఆ హరిగుణాలే మణులనీ, వాటితో గ్రుచ్చిన దండనే భక్తులు మెడలో ధరించాలని త్యాగయ్య సందేశం. హరిదాసులు మెడలో ధరించే మాల అలంకారప్రాయం గాదు. ఆ మాలలోని ప్రతి పువ్వు శ్రీహరి యొక్క అనంత కల్యాణ గుణాలతో ఒక్కోక్కటిగా భావించాలి. అప్పుడే ఆ పూలదండతో హరిదాసు పునీతుడవుతాడు. త్యాగయ్య ప్రస్తుతం వందనాలు సమర్పించే మహానుభావులు అలాంటి హరిగుణ మణిమయ సరములు ధరించినవారే. అది వారికి పరమశోభ చేకూరుస్తుంది. ఆ మాల యొక్క అంతరార్థాన్ని భావించిన భక్త శిఖామణులు మహాజ్ఞానులు అవుతారు. తెలివి అనే మాట చిన్న మాట గాదు. తెలిసికోవలసిన విషయాన్ని సారభరితంగా తెలుసుకోవడమే తెలివి. జ్ఞాన విజ్ఞాన యోగాలలో గీతాచార్యుడివి స్పష్టం చేశాడు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో దీని సారాంశం తెలిపిన వాడు.

మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ।
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః॥

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః।
ఏతత్‌క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్॥

(భగవద్గీత: అధ్యాయం 13, 5, 6)

(అర్జునా! పంచ సూక్ష్మ భూతాలు వాటికి కారణమైన అహంకారము తత్కారణమైన బుద్ధి. ఆ బుద్ధికి కారణమైన మూల ప్రకృతి దశేంద్రియాలు. మనస్సు శబ్ద స్పర్శ రూపక గంధములగు ఇంద్రియ విషయాలు. ఇచ్ఛాద్వేషాలు, సుఖదుఃఖాలు, శరీరము, చైతన్యం, ధైర్యం ఇవన్నీ కల్సి క్షేత్రమనబడును. అహింస, క్షమ, ఓర్పు, ఋజువర్తనం, గురుసేవ, శుచిగా నడుచుకొనుట, స్థిరబుద్ధి, ఆత్మ నిగ్రహ ఇంద్రియ విరక్తి, అనహంకారము, జన్మ, మృత్యు జరా వ్యాధులు దుఃఖములను గుర్తెరిగి ఉండుట, పుత్రధార గృహాదుల యందు అనాసక్తి, శుభాశుభములందు తొణకకుండుట, నాయందు అనన్య భక్తి, జనసమ్మర్ధము నుండి దూరంగా, ఏకాంతంగా వుండుట. ఆత్మ జ్ఞాననిష్ట. మోక్షము నందు బుద్ధి. ఇదంతా జ్ఞానం. దీనికి భిన్నమైంది అంతా అజ్ఞానం.)

ఇటువంటి తెలివి గల మహానుభావులు ప్రపంచంలో ప్రతి వారిలో చెలిమి కని ఉంటారు. వారికి ద్వేషులే ఉండరు. సర్వ భూతాల యందు కరుణ గల్గి అమృతంతో సమానమైన చూపుతో విశ్వన్నంతా చూస్తారు. అలాంటి మహానుభావుల తపోబలం మీదనే ఈ భూమి ఆధారపడి నడుస్తున్నది. వారికి మన తన అనే తేడా లేదు. అందరు స్వజనులే. ఇదే సుధాదృష్టి. భర్తృహరి సుభాషితంలోని ఈ శ్లోకం గమనార్హము.

“మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః
త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః।
పరగుణ పరమాణూన్పర్వతీకృత్య నిత్యం
నిజహృది వికసంతః సంతి సంతః కియంతః॥” (నీతి శతకం 70వ శ్లోకం)

తెలుగు సేత (ఏనుగు లక్ష్మణకవి)

“హృదయవచశ్శరీరముల నెంతయుఁబుణ్యసుధాపూర్ణులై
ముదము బహూపకారములు మూఁడుజగంబులకు ఘటించుచున్
వదలక సాధుసద్గుణల వంబుల గొండలు సేసి మెచ్చుచున్
మదిని వికాసయుక్తు లగు మాన్యులు గొందఱు వొల్తు రిద్దరన్.”

(మనో వాక్కాయముల శుద్ధి కల్గి అమృత హృదయులై త్రిలోకాలకు మేలు చేస్తూ సజ్జనుల కొద్దిపాటి సద్గుణాలను గూడా కొండంతలు మెచ్చుకుంటూ ఆత్మానందంతో గడిపే మహానుభావులు కొందరుంటారు)

ఇలాంటి వారికి త్యాగయ్య సవినయంగా వందనాలు అర్పిస్తున్నాడు.

(సశేషం)

Exit mobile version