Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-29

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 8 – 5వ భాగం

ఎందరో మహానుభావు లందరికి వందనము – శ్రీ రాగం – ఆది తాళం – ఇలపావులూరి కామేశ్వరరావు గారి విశ్లేషణ:

చరణం 6:

రాముడు శివధనుర్భంగం చేయిడానికి పూనుకున్నప్పుడు ఆ సుందర రఘువీరుని సౌందర్యానికి విశ్వమిత్రుడే ముగ్ధుడైనాడట.

‘ఆ రాణ్ముని ఎటు పొంగెనో’ అని త్యాగయ్య ‘అలక లల్లాడగ’ అనే కృతి రచించాడు.

“పుడమిలో జనులెల్ల పొగడ – పూజితుడౌ మునితో గూడి వెడలెను కోదండపాణి..” అన్నాడు.

వాల్మీకి శ్రీరాముని హోయులు వర్ణింన ఒక్క శ్లోకం చాలు:

“మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః।
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః॥”

“సువిక్రమ” అనే పదంతో ఈ హోయలు అన్నీ ఇమిడియున్నాయి. ఇందు ఆంగిక, ఆహర్యక, సాత్విక.. మూడు రకాల అభినయాలు ఇమిడి ఉన్నాయి. “సువిక్రమః” అనగా చక్కని నడక గలవాడు. ఈ చక్కదనం కేవలం అవయవ సౌష్టవం వల్ల ఏర్పడేది గాదు. అంతరికమైన ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడి వుంటుంది. ఈ శ్లోకానికి ముందు శ్లోకములోనే ఆ సంపద వివరించబడి వుంది.

“బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః।
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః॥”

(మేధశక్తి, నైతిక నిష్ఠ ప్రభావం గల వాక్కు ఐశ్వర్యము శత్రు దుమనము విస్తారమైన మూపు, ఆజానుబాహుత్వము, శంఖం వంటి మెడ, గొప్ప గండ స్థలములు గలవాడు).

బుద్ధిబలం, నీతివర్తనం, మధుర వాక్కు, త్రికరణ శుద్ధిగల శ్రీరాముని సౌందర్యము వర్ణించడానికి ఎందరో కవులూ, గాయకులు, చిత్రకారులు, శిల్పులు ప్రయత్నించారు. ఇంకా యత్నిస్తూనే ఉన్నారు. ఆ సౌందర్యం ఎన్నటికి నూతనంగానే లోకంలో ఆరాధించబడుతూ ఉంటుంది. త్యాగరాజుకు రాముని సౌందర్యం ఎంత వర్ణించినా తనివి తీరదు. “నీ సొగసు, నీ దినుసు వేరే రామా” అంటే గాని త్యాగయ్యకు తృప్తి గలుగదు.

“ఎంతనుచు వర్ణింతునే యీ – యిందిరా రమణుని నే
కరుణామృతము చల్లగ యోగుల దహరములు ఝల్లనఁగ వేంచేసిన
యీ – యిందిరా రమణుని నేనెంతనుచు వర్ణింతునే”
(ప్రహ్లాద భక్తి విజయం, యక్షగానములు, సౌరాష్ట్ర, చాపు)

“రూపము ప్రతాపము శరచాపము సల్లాపముగల నిను వినా సుఖముగాన” (తోడి రూపకం)

“రఘువీర సుకుమార మ్రొక్కేరా రామా రారా మా ఇంటి దాకా”

“ముద్దుగారు నీ మోమును జూచుచు వద్దని నిలిచి వారము పూజించెద రారా ఇంటిదాకా”

సౌంర్యము గమనంతో తెలుస్తుంది. ‘హోయలుమీరు నడలు’ అనగా ఇట్టివే. దానిని ఆంగ్ల భాషలో gait అంటారు. Paragon of gait. ‘ముందువెనుక ఇరుప్రక్కలతోడై’ అనే దర్బారు రాగ కీర్తనలో “ఎందుఁగాన నీయందమువలె రఘునందన వేగమే రారా” అంటు ఉప్పొంగి పోతాడు.

ఆ రామచంద్రుడు ఆగమ సంచారుడు. అఖిల లోకాధారుడు. రాగాది సంహరకుడు. కారుణ్య పారావారుడు. ఆ శ్రీమన్నారాయణుని గమనంలోని హోయలు వర్ణించడం బ్రహ్మకైనా సాధ్యం గాదు. అలాంటి రాముని విగ్రహం హృదయంలో ప్రతిష్ఠింపజేసికొన్న త్యాగయ్యలాంటి మహానుభావుల శరీరంలో ఎల్లప్పుడు రామ హర్షణం జరుగుతూనే ఉంటుంది. పులక శరీరులై ఆనంద సాగరంలో నిమగ్నులైపోతారు. బాహ్య ప్రపంచాన్ని మరచిపోతారు. లోకాలోకనం వారికి ఇష్టం ఉండదు. ఇంద్రియ సుఖాల జోలికి వారి మనస్సు పోదు. ముదము (బ్రహ్మానందం) అనుభవించి లోకంలో ధన్యులుగా కీర్తి గడిస్తారు. అలాంటి మహానుభావులను తలచుకొని వారికి త్యాగయ్య వందనం అర్పిస్తున్నాడు.

చరణం 7:

కమలభవ సుఖం అనగా బ్రహ్మానందము. కమలభవుడు బ్రహ్మ (కమలమునందు పుట్టిన వాడు). ఆ కమలం శ్రీమహావిష్ణు నాభియందున్న కమలమే. దేనిని పొందిన తరువాత ఇతర సుఖాల మీదికి మనసు రాదో అదే కమలభవ సుఖం. ఇది ఎల్లప్పుడు అనుభవిస్తూ పావనులై, ఘనులై, శాశ్వత కీర్తులైన మహానుభావుల ఎందరినో త్యాగయ్య ఈ చరణంలో స్మరించి నమస్కరిస్తున్నాడు. వాండ్లలో దేవతలు, రాక్షసులు, ఋషులు, కిన్నెరులు, కింపురుషులు, ఒకరేమి అన్ని రకాల భక్తులు ఉన్నారు.

మొదటి వాడు వ్యాసమహర్షి. ‘పరమ భాగవత మౌని’ ఇతడే. భాగవతాన్ని ప్రసాదించిన మౌని వ్యాసుడే గదా. ఒక భాగవతమేల, వేద విజ్ఞానాన్ని విడమరచి లోకానికి ప్రసాదించిన విష్ణుసన్నిభుడు వ్యాస భగవానుడే గదా. పంచమ వేదమైన మహా భారతాన్ని ప్రసాదించిన పరాశరాత్మజుడు ఆ కృష్ణద్వైపాయనుడే గదా. అర్ష విజ్ఞానానికి వ్యాస వాల్మీకులే గదా రెండు కండ్లు. భారతీయ సంస్కృతి అనే నాణెంలో వ్యాస వాల్మీకులు బొమ్మాబొరుసు లాంటి మహానీయులు. త్యారాజస్వామి వారు వ్యాసుని పేరు గుప్తంగా, ‘పరమ భాగవత మౌనివర’ అనే మాటలో నిక్షిప్తం చేశాడనిపిస్తుంది. వ్యాసుని తరువాత ఉదహరించిన జాబితా దీర్ఘమైనదే. చంద్ర సూర్యులు, సనకసనందులు, అష్ట దిక్పాలకులు, దేవతలు, కింపురుషులు, కనకశిపు సుతుడైన ప్రహ్లాదుడు, నారదుడు, తుంబురుడు, హనుమంతుడు, శివుడు, శుకుడు, బ్రహ్మ, బ్రహ్మజ్ఞానం గల నరులు వీరంతా పరమ పావనులు. దేని వల్ల పావనులైనారు? ఆనందం అనుభవించడం వల్లనే. ఆనందం ఎలా కలిగింది. ఒక్కొక్కరికి ఒక్కక్క మార్గం. అందరికి భక్తియే గమ్యస్థానం. ఇందు ప్రహ్లాదుడు ప్రధానంగా పేర్కొనదగినవాడు. రాక్షస బాలుడై తండ్రికే హరి భక్తిని గురించి బోధించిన ఆగర్భ హరిభక్తుడు. నారద తుంబురులు మధుర వీణా గానం చేసి హరిని ఉపాసించిన వారు. హనుమంతుడు శ్రీరామ నామం పాదసేవ చేసిన మహా ధన్యుడు. శివుడు సదా రామతారకం జపించేవాడు. శుకుడు ఆజన్మ విరాగి. భాగవతాన్ని ఏడు రోజులలో వినిపించిన పరమ పౌరాణికుడు. బ్రహ్మసాక్షాత్తు సృష్టి కర్త. వీరేగాక బ్రహ్మజ్ఞానం గల కుచేలుడు, అంబరీషుడు. అక్రూరుడు మొదలైన వారెందరో త్యాగయ్య మనస్సులో మెదిలి ఉంటారు.

“ప్రహ్లాద నారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్పుణ్యాన్ ఇమాన్ పరమభాగవతాన్ స్మరామి”

అని నారాయణ తీర్థులవారు భక్త సంస్మరణ చేసినట్లుగానే త్యాగయ్య పై చరణములో మహానుభావుల నెందరినో స్మరించాడు.

వీరందా శాశ్వత కీర్తి గడించిన ఘనులు, పావనులు. వీరందరినీ నిత్యం స్మరించినంత మాత్రం చేతనే గంగాస్నాన ఫలం దక్కుతుంది. వారి అంశం మనలో లవలేశం ప్రవేశించినా ధన్యులు కాగలము.

చరణం 8:

శ్రీరామ చంద్రుని తారకనామం కల్యాణ సుందరూపం పరాక్రమ వైశిష్ట్యం మేరు సమానధీరత్వం. శాంత గంభీర స్వభావం, ఔదార్యము సత్య పరాక్రమము ఇవన్నీ రాముని యందు భక్తి కలిగించే లోకోత్తర గుణాలు. అందచందాలను గురించి లోగడ చరణంలో వివరించడం జరిగింది. నామవైభవం పూర్తిగా అనుభవించిన వారు పార్వతీపరమేశ్వరులు. శివాంశమున జన్మించిన హనుమంతుడు, లక్ష్మీదేవి అంశంలో ఉన్న సీత. వీరంతా రామనామ రుచి తెలిసిన అగ్రగణ్యులు. వీరి కరుణ చేత తరించిన మహా భక్తులు ఎందరో ఉన్నారు. రాముని యందు అనురాగం కలగడానికి అతని గుణవైభవమే గదా కారణం.

‘స చ సర్వగుణోపేతః కౌసల్యానంద వర్ధనః’ అని గదా వాల్మీకి వర్ణించింది. గుణోపేతుడు కాబట్టి కౌసల్యకు ఆనంద వర్ధనుడైనాడు. ఆ గుణాలన్నీ ఈ చరణంలో వివరించాడు. నామ వైభవం హరి హర తత్త్వ సమన్వయంతో గూడి యున్నది. శివమంత్రానికి జీవం ‘మ’కారం. మాధవ మంత్రానికి ‘ర’ కారం జీవం. ఈ రెండు కలసి ‘రామ’ శబ్దం ఏర్పడిందని త్యాగయ్య సృష్టికరించాడు (ఎవరని నిర్ణయించిరిరా) పరాక్రమాన్ని గురించి రావణుడే ప్రశంసించాడు. సాక్షాత్తు నారాయణుడే ఈ రాముడు అని ఆశ్చర్యపోయినాడు. ధైర్యంతో మేరు సమానుడు, దాతృత్వంలో కుబేర సమానుడు.

‘ధనదేన సమః త్యాగే సత్యే ధర్మ ఇవాపరః’

త్యాగంలో కుబేరుడు, సత్య పాలనలో ధర్మ దేవత వంటివాడు. ఇవన్నీ మనసులో భావించిన మహానుభావుల హృదయంలో పాషాండ మతాలేవి ప్రవేశించవు. రాముడు భక్త వత్సలుడు. క్షుద్రోపాసనలకు వశమయ్యేవాడు గాదు. ఈ విషయం గ్రహించిన మహా భక్తులు నిత్య సంతోషులై శ్రీరామ గుణ భజనానంద కీర్తనంతో ధన్యులైనారు. అవుతున్నారు. అలాంటి వారికి అందరికీ త్యాగయ్య వందనం సమర్పిస్తున్నారు.

చరణం 9:

భాగవత, రామాయణాలు, భారత సారమైన గీత మొదలైనవి గ్రంథాల సారము భక్తి రసాయనమే. భగవద్భక్తికి మించిన తరుణోపాయము లేదు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు –

‘భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఽర్జున
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప’

అని అర్జునునకు స్పష్టంగా తేల్చి చెప్పినాడు.

(అర్జునా అనన్య భక్తి చేతనే నేను వశుడనౌతాను. అలాంటి భక్తివల్లనే నన్ను గురించిన జ్ఞానం కలుగుతుంది. నా స్వరూపం దర్శన మిస్తుంది. నాలో ప్రవేశించడం సాధ్యమవుతుంది.).

శివ వైష్ణవాది మతములన్నీ భక్తినే భోధిస్తున్నాయి.

‘సర్వధర్మాన్ పరిత్యజ్యమామేకం శరణం వ్రజ’ అని గీతాచార్యుడు శరణాగతిని సూచించాడు. ఆనాడు పార్థునికి సారథి రూపంలో ఇచ్చిన సందేశమే ఈ లోకానికంతటికి అన్వయిస్తుంది.

ముప్పది ముక్కోటి దేవతలకు కూడా ఆ చరణాలే దిక్కు. ఆ దేవతల అంతరంగాలలోని భావాలు గూడా నారాయణ చరణ భజన మందే సదా లగ్నమై ఉంటాయి. ఈ సత్యమున గ్రహించి భక్తి భావంతో రాగ, తాళాలను గూర్చి ఆనందంతో రామ నామ సంకీర్తనం చేస్తూ తరగని ఆనందం అనుభవించే వారు ఎందరో మహానుభావులు త్యాగరాజు హృదయంలో మెదలుతూ ఉన్నారు. వారంతా త్యాగరాజుకు ఆప్తులు. తన రక్త సంబంధమైన వారు. శరీరం ఉన్నంత వరకే ఆప్తులు. తర్వాత వారు ఆర్తులు. తనను చూచి భయపడేవారు భగవద్భక్తులు. వైరాగ్య సంపన్నులు. సాధువులు. లోకంలో అందరికి ఆప్తులే. త్యాగరాజు మనందరికి ఆప్తుడు. ఒక్క సారి గట్టిగా ఆలోచించండి. ఇంత పరమాందాన్ని మనకు ప్రసాదించే త్యాగరాజు మనకు ఆప్తుడు కాదా, తాత్కాలికంగా మనం ఆ మహానీయుని దివ్య వ్యక్తిత్వం అనుభవిస్తున్నాం. ఇది మనస్సులో స్ధిరమైపోవాలి. సుడిగాలికి కొట్టుకోని పోకూడదడు. అలాంటి నిశ్చల భక్తి త్యాగరాజులో ఉండబట్టే ఈ మహానుభావులను తనకు ఆప్తులుగా కీర్తించాడు. నేడు ఆయన మనకు కూడా ఆప్తుడైనాడు. మహానుభావులలో కెల్ల మహానుభావుడుగా పూజలందుకుంటున్నాడు.

చరణం 10:

శ్రీరామచంద్రుని వైభవాన్ని, మహాభక్తుల గాథలను మనసుకు తెచ్చుకున్న భక్తులకు ప్రేమ ముప్పేటలుగా గట్టిపడుతుంది. మూడు + పరులు ముప్పరి. అనగా త్రికరణములు పెనవేసుకుంటాయి. మనో వాక్కాయములు ఏకీభవించి భక్తి భావం, భక్తి సంకీర్తన, భక్తితో కూడిన నడత ఈ మూడు రకాలైన సిద్ది ఏర్పడుతుంది. భక్తి, మాటల వరకే పరిమితం గాకుండా నిత్య జీవితంలో పెనవేసుకొని పోతుంది. తనకు కనిపించే సృష్టి అంతా రామమయం అనే స్పృహ కలగడమే నిజమైన భక్తి.

భక్తుడు ముప్పరిగొన్న ప్రేమతో రాణిస్తాడు. అలాంటివారు రాముని యందలి అనురాగంతో జేసే నామకీర్తన ఆనంద సాగరమే. అలాంటి రామభక్తులైన వారెందరో మహానుభావులు. వారందరికి వందనాలు సమర్పిస్తున్నాడు త్యాగరాజు.

(సశేషం)

Exit mobile version