Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-30

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 8 – 6వ భాగం

శ్రీ రాగం – అచ్యుత రామశాస్త్రి గారి విశ్లేషణ:

పల్లవి:

సంగీత పాటవము, సత్ప్రవర్తన బోధనం, భగవంతుని ప్రతిజ్ఞాపాలన, భక్తి తన్మయత్వం 4 కీర్తనలలో తెలుస్తుంది. అయ్యవారికి ఏ మాత్రం గర్వం లేదని, అందరి మాదిరిగా విద్వాంసుడని వీర్రవీగి పోవడం లేదని ఆయన పాడిన పల్లవిలో మనకు అర్థం అవుతుంది. ఆయన అందించిన నీతి శిరోధార్యమయింది. ఏ విద్యలోనైనా, ఏ కళలోనైనా, నిష్ణాతత్వమును సంపాదించుట –   “మనుష్యాణాం సహస్రేషు” అని భగవద్గీతలో అన్నట్లుగా వెయ్యికొకరికి మాత్రమే సాధ్యం. అట్టి నిష్ణాతులలో “విద్యా దదాతి వినయం” – విద్య మొనగ వినయము అని భర్తృహరి చెప్పిన రీతిగా వినయసంపన్నులుగా ఉండేవారు బహు అరుదుగా ఉంటారు.

ఈ కీర్తనల ప్రాదుర్భావం జరిగడానికి కారణం వినయ సంపద లోని సంగీత విద్వాంసుల మాటల మూలంగానే. అందుకే ఎందరో మహానుభావులున్నారు నేనే కాదు, అని త్యాగయ్య చెప్పారు.

అనుపల్లవి:

లౌకికమైన కళానైపుణ్యం  ‘మహానుభావులు’ అని పిలిపించుకోవటానికి అర్హతయే కాదనము, కానీ ఆయన దృష్టిలో మహానుభావులు అని పిలిపించుకోవటానికి ‘ఏ అర్హత’ ఉండాలో తెలుస్తుంది. పారమార్థిక జీవనంలోని నైపుణ్యం చెప్పారు. బ్రహ్మానందమును అనుభవించుట ఈ అర్హత అన్నారు.

వివరణ:

లోకంలో అనుభవించే అనందాన్ని సామాన్య ఆనందం అనాలి. మనస్సు అనే అంతరిద్రియమును, అంతఃకరణమును భగవంతుడు మనకు ప్రసాదించాడు. మనస్సు పనిచేయకపోతే ఆనందానుభవం మనకు కలుగదు. ఈ మనస్సుకు అనుభవాన్ని సరఫరా చేసే అయిదు ఇంద్రియములను సూక్ష్మశరీరంలో ప్రసాదించాడు. ఈ ఇంద్రియములు శక్తివంతమగుటకు స్థూల శరీరంలో 5 గోళములను (లేక) కరణములను అమర్చాడు.

  1. సంగీతం, సాహిత్యం, కోకిలారవము వంటి ధ్వని విశేషమును విని ఆనందాన్ని అనుభవించుటకు ‘శబ్ద’ ఇంద్రియమును ‘చెవులు’ అనే కరణములనూ.
  2. ఇష్టమైన వస్తువులను తాకిగాని ఆనందాన్ని అనుభవించుటకు ‘స్పర్శ’ ఇంద్రియమును, త్వక్ (చర్మము) అనే కరణమునూ.
  3. మనకు ఇష్టమైన రంగులను రూపములను చూచి ఆనందించుటకు ‘రూప’ ఇంద్రియమును, నేత్రములు అనే కరణములనూ
  4. మనకు ఇష్టమేన ఆహారం తిని, పానీయములు తాగి ఆనందాన్ని పొందుటకు ‘రసన’ ఇంద్రియము నాలుక అనే కరణమునూ
  5. మనకు ఇష్టమైన వాసనలను అనుభవించటానికి ‘గంధం’ అనే ఇంద్రియమునూ, ‘ముక్కూ’ అనే కరణమును భగవంతుడు మన సూక్ష్మ స్థుల శరీరాలతో అమర్చిపెట్టాడు.

సుషుప్తి అవస్థలో ఈ మూడు పని చేయవు. అపుడు ఏ అనుభవము ఉండదు.

ఈ విషయానందం, పరిమితమై, అనిత్యమై, అశాశ్వతమై, సాపేక్షమై దేశకాలవస్తు అధీనమై ఉంటుంది.

ధార్మిక వైదిక మార్గంలో వేద విహిత కర్మానుష్ఠానపరులై వర్ణాశ్రమ ధర్మాలను గౌరవిస్తూ జీవనం సాగిస్తుండే భక్తులకు చిత్తము శుద్ధి అవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేవి పోతాయి. పూర్వకల్యాణిలో ‘నీ నామముచే నా మది నిర్మలమైనది. జ్ఞాన మొసగరాదా’ అనే కృతి ఇందుకు ఉదాహరణ.

చిత్త శుద్ది అయిన తరువాత, భగవంతుని దర్శనము లభిస్తుంది. ఈ జగమంతా రామమయం అని తెలుస్తుంది. అండకోట్ల నిండిన కోదండపాణి ముఖమును హృత్ పుండరీకమున జూచి, పూజ సల్పు (సురటిలో ‘భజనపరులకేల’ అనే కీర్తన చరణం); ‘ఎంతవేడుకొందు రాఘవ’ అనే కీర్తన చరణంలో త్యాగయ్యగారు “చిత్తమందు నిన్ను జూచు సౌఖ్యమే ఉత్తమంబునుచు ఉప్పొంగొచు భక్తులు ఉంటారు” అన్నారు.

ఉపనిషత్తులలోని రహస్య విషయాలు వారికి అర్థం అవుతాయి. ‘ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనసా’; ‘తమసాది గుణరహితడు ధర్మాత్ముడు సర్వసముడు, క్షేమకరుడు త్యాగరాజు చిత్తహితుడు’ అని పాడుకుంటూ ఆనందిస్తారు. ‘భోగాను భవములందు, బాగుగ బుద్ధి నాయందు, త్యాగరాజుని హృదయమందు, వాగీశ నందమందు’ (బ్రహ్మానందమందు) అని పాడుకొంటూ బ్రహ్మానందములో మునిగి పోతారు.

ఇదే బ్రహ్మానందం అనుభవించుట అంటే. ఇట్టి బ్రహ్మానందాన్ని అనుభవించేవారు ఎందరో. వారందరు మాహానుభావులు అన్నారు.

ఈ బ్రహ్మానందము అపరిమితమై నిత్యమై, శాశ్వతమై నిరపేక్షమై దేశకాల వస్తు అధీనం గాకుండా హృదయారవిందమందు భావిస్తూ ఉంటుంది. చిట్టస్వర సాహిత్యాలు గమనిస్తే ఆయన దృష్టిలో మహానుభావులు ఏ విధంగా బ్రహ్మనందాన్ని అనుభవించారో తెలుసుకోవచ్చు.

***

ఎందరో మహానుభావులు – సాహిత్య భావం – వెంకట శ్రీరాములు గారి విశ్లేషణ:

పరమేశ్వరుని దర్శించి బ్రహ్మానందము పొందు వారెందరో ఉన్నారు. వారి  ఆనంద ప్రాప్తికి పెక్కు మార్గములున్నవి. ఏ మార్గమున సాగినను చిదానంద బ్రహ్మమును గాంచుట అన్నది ఒక్కటే ముఖ్యము. అది గన్న వారెందరో. వారందరూ నమస్కరింపదగిన వారే. కనుకనే వారందరికి నమస్కారములు. లోకమున మహానుభావులు పరమేశ అనుభవ గల వారెందరో. అందరికి వందనములే.

హృదయ పద్మమున చంద్రుని పోలిన అందములు గల దివ్య తేజమును చూచి బ్రహ్మానందము అనుభవింపు వారెందరో అట్టివారి కందరికి.. వందనములు.

సామగానలోలుడు, మన్మథుని వలె సొగసుగాడు అయిన స్వామిని దర్శించగలిగే యోగ్యత ఉన్న  అదృష్టవంతులైన వారెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

కోతి వలె మిక్కిలి చంచల స్వభావము గల మనస్సును అరికట్టి స్వామి మూర్తిని బాగుగా చూచే వారెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

వేగముగ స్వామి పాదములకు మనస్సు అను పద్మమును అర్పించి దాస భావమున నుండే వారెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

పతిత పవనుడు పరాత్పరుడొక్కడే యని  వీనిని గూర్చి పరమార్థమైన తమ పద్ధతిలో పాడుచూ పదములతో స్వర లయాది రాగముల తెలియువారు ఎందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

హరి గుణములను మణిమాలలు కంఠమున శోభిల్లుచుండు భక్తులు పుడమి పైన జ్ఞానముతో స్నేహముతో దయ గలిగి లోకము నంతను అమృత ధారలలే బ్రోచు వారెందరో..  అట్టివారి కందరికి.. వందనములు.

వయ్యారములు లొలుకు నడకలు సరసుడైన స్వామిని సదా కనుల చూచుచూ పులకలెత్తిన దేహములతో ఆనందాబ్ధిలో మునిగి మోదముతో కీర్తిగన్న మహానుభావులెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

పరమ భాగవోత్తములైన మునివరులు, సూర్యచంద్రులు, సనకసనందులు, దిక్పాలురు, సురలు, కింపురుషులు ప్రహ్లాద నారద తుంబరులు, హనుమంతుడు, శివుడు, శుకుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు, పరమ పవిత్రులు, ఘనులు శాశ్వతులు వుండువారు, ఎప్పుడునూ బ్రహ్మానందమును ఎప్పుడును అనుభవించు వారు గదా. ఇట్టి ఘనులెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

రాఘవా నీ మోని వైభమూ, నీ ఘన వైభవమూ నీ పరాక్రమమునూ, నీ దైర్యమునూ నీ శాంత గుణమునూ, నీ మనస్సును, నీ దాన గుణమునూ, నీ సత్య వాక్యమును తెలిగి, నీ యందు  భక్తి జనించి తోడనే నాస్తిక మతములను త్రుంచి నా మనసును తెరిసి సంతతము గుణములను ఆనందముగా కీర్తంచు పుణ్యంలెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

భాగవతము, రామాయణము, గీత మొదలైన వాని యొక్కయు వేద పురాణ శాస్త్రముల యొక్కయు, మర్మములను శైవ మాతాది షణ్ణతముల రహస్యములను, ముప్పది మూడు కోట్ల దేవతల అంతరంగములలోని భావములను ఎరిగి భావమూ రాగము, లయ మొదలైన వానిచే తన్మయ సౌఖ్యమునంది. చిరాయువులు గల్గి నిరవధిక సుఖానుభావులై త్యాగరాజున కాప్తులైన వారెందరో.. అట్టివారి కందరికి.. వందనములు.

ప్రేమ ముప్పిరిగా పొంగి అల్లుకొను వేళ నామస్మరణము చేయుచుండు వారు, రామ భక్తుడైన త్యాగరాజు సుతుడగు స్వామికి దాసులైన వారెందరో మహానుభావులు.. వారందరికి నమస్కారములు.

ముగింపు:

త్యాగయ్యగారికి రాముడు పరదైవము. భాగవతులు పరమ బాంధవులు. దానితో  “ప్రహ్లాద నారదాది” పరమ భాగవతులను స్మరించి వారి గుణములను పేర్కొని వారికి వందన సమర్పణ చేసి వానితో పంచరత్న   ప్రణాళికను సంపూర్తి చేసిన మహోన్నతుడు త్యాగయ్యగారు. సంగీత జగత్తులో విశిష్ట స్థానం కలిగి, ఆధ్యాత్మిక జ్యోతులు విరజిమ్ముతూ  హరిగుణ మణిమయ సరములై భాగవతుల కంఠసీమను అలంకరిస్తూ ఉంటాయి.

ముగింపు కృతి అయినందున మంగళప్రదమైన, శాంతి, ఆనందాది భావములకు అనుకూలమైన ‘శ్రీ రాగం’ అయ్యగారిని ఆకర్షించింది. ఉదాత్తమైనది. ప్రశాంతను కూర్చు స్వర ప్రవృత్తి కల్గిన రాగం ఇందు పల్లవి అనుపల్లవి, సంవాది భావము.

చిట్ట తాన ప్రస్థారాన్ని సామగాన భావాన్ని స్పురింప చేస్తూ స్వరవిన్యాసాలు, శ్రోతావహ యతి, సమ యతి, సంవాది సంబంధ సర్వచిత్రణగా, ప్రత్యాహత గమకాలు, స్థాయి సంబంధాలు మనోజ్ఞులైన కూర్పులు అమరులకే సాధ్యం. త్యాగయ్యగారు గంధర్వుడు.

‘స్వరలయంబు లెరుగకను’ అనటం (మద్దెల) మృదంగ – తాళగతులు, తెలియక సొక్క చేయుట సాద్యము కాదని స్వరలయం తెలియ వలెనని సూచిస్తారు.

త్యాగ వందనం

శ్రీమత్కాకర్ల వంశాబ్ది చంద్రాయ

మల తేజసే పూర్ణాయ పుణ్యశీలయ  త్యాగరాజాయ వందనం

రామబ్రహ్మ సుపుత్రాయ రామనామ సుఖాత్మనే

రామచంద్ర స్వరుపాయ  త్యాగరాజాయ వందనం

నారదాచార్య కరుణా పాత్రా అద్భుత కీర్తయే

ధీరాయ నిర్వికారాయ త్యాగరాజాయ వందనం

యోగి పుంగవ మిత్రాయ యోగానంద

స్వరూపిణే రాగలోభ విముక్తాయ త్యాగరాజాయ వందనం

గానశాస్త్ర ప్రవీణాయ కలికల్మష నాశినే

శరణాగత పోషాయ త్యాగరాజాయ వందనం

కావేరి తీర వాసాయ కరుణామృత వర్షిణే

అవని సురరాజాయ త్యాగరాజాయ వందనం

శ్రీగురు బ్రహ్మణే భక్త్యే నాగరత్నార్చితాంఘ్రమే

యోగ యుక్తాయ ముక్తాయ త్యాగరాజాయ వందనం

(సమాప్తం)

Exit mobile version