[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 4 త్యాగరాజు – పంచరత్నములు – 2వ భాగము
నాటరాగం:
ఆరోహణ: స రి గ మ ప ద ని స
అవరోహణ: స ని ప మ రి స
36 చలనాటలో జన్యం
- షడ్జ, పంచమము, షట్ శృతి రిషభం; అంతర గాంధార శుద్ధ మధ్యమం. షట్ శృతి దైవతము, కాకలి నిషాదము
- సంపూర్ణ, ఔడవము, ఉషాంగము
- షట్ శృతి రిషభము, దైవతం – కంపిత స్వరాలు
- వీర రస ప్రధాన రాగం
- గాంభీర్యోదాత్త రాగం – కచేరీలలో మొదటగా పాడబడుతుంది.
పల్లవి:
జగదానందకారక – జయ జానకీ ప్ర్రాణనాయక.
అర్థం:
లక్ష్మియే సీత. ఆమెయే జానకి. అతడు ప్రాణనాయకుడు. సర్వలోకానందకారునికి ఈ కృతి మంగళ శాసన పూర్వక ప్రార్థన. సీతకు ప్రాణమిచ్చేవాడు, సీత వలె సకలమానవ కోటి భూజాతలే.
అనుపల్లవి:
గగనాధిప – సత్కులజ – రాజ రాజేశ్వర – సుగుణాకర – సుజనశ్సేవ్య – భవ్య దాయక – సదా సకల.
అర్థం:
సురసేవ్య అన్న పదానికి ప్రాతిపదిక పురుష సూక్తమందు గలదు. – బ్రహ్మ, ఇంద్రాది, దేవతలచే స్తుతి గొనువాడు. జానకి ప్రాణనాయకుడు అయినందుకే అతనికి ఇట్టి వైభవము.
గగనం సమున్నమైనది. దానికి ప్రభువు సూర్యదేవుడు. జగత్ సాక్షి. లోకమంతా సంచరించే వెలుగు ఇచ్చేవాడు సూర్యుడు. అలాంటి కులమున జనించి పిదప రాజై, రాజరాజైన ఈశ్వరుడు – అతను లోకపూజ్యుడు, మహా యోధుడు, సుగుణ నిధి, ధనవంతుడు, గుణవంతుడు, అనుగ్రహకారకుడు, ఎల్లప్పుడు కూడా.
1వ చరణం:
అమర – తారక – నిచయ – కుముద హిత – పరిపూర్ణానఘ – సురసురభూ – దధి పయోధి – వాస హరణ – సుందరతర వదన – సుధామయ – వచో బృంద గోవింద సానంద – మా వర -అజర – ఆప్త – శుభకర – అనేక.
అర్థము:
నక్షత్ర సమూహానికి చంద్రుని వంటి వాడు.
పరిపూర్ణుడు, పాపరహితుడు, కల్పవృక్షము వంటి వాడు (దేవతలకు) అమృతపమయ వాక్ ప్రవాహము కలిగిన గోవిందుడు.
ఆనంద దాయకుడైన లక్ష్మిధవుడు. సకల దేవతాగణ మిత్రుడు.
శుభాలు, ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు. వకార పంచకీలుడు.
2వ చరణం:
నిగమ నీరజ – అమృతజ పోషక – అనిమిషవైరి – వారిద – సమీరణ – ఖగతురంగ – సత్కవిహృదాలయా – అగణిత – వానరాధిప – నతాంఘ్రి – యుగ.
అర్థము:
ఓంకార సాధనచే లభించే మోక్షము ఇచ్చేవాడు. వేదములనెడి కమల పుష్పాలకి అమృత తత్త్వము ఇచ్చు ఘనుడైనవాడు – సుగ్రీవాది వానరులచే స్తుతించబడ్డవాడు.
3వ చరణం:
ఇంద్రనీలమణి సన్నిభ – అపఘన – చంద్ర సూర్యనయన అప్రమేయ – వాగీంద్ర జనక – సకలేశ – శుభ్ర నాగేంద్రశయన – శమనవైరి – సన్నుత.
అర్థము:
స్వామి మేని మెరుగులు ఇంద్రనీలమణి సన్నిభములు. ఘన అనుటలో మేఘం స్పురిస్తుంది. నేత్రపర్పమైనవి. మరకత మాణిక్య కాంతులనే తలదన్నే కాంతిరూపుడు. చంద్ర, సూర్యులు నేత్రములై, అప్రమేయుడై బ్రహ్మనే సృష్టించినవాడు. సర్పేశుడు, శేష శయనుడు, శత్రువుల చేత స్తుతింపబడు మహోన్నతుడు.
4వ చరణం:
కరధృత శరజాలా – అసురమదాపహరణా – అవనీసుర సురావన- కవీన బిలజమౌని కృత చరిత్ర – సన్నుత శ్రీ త్యాగరాజనుత.
అర్థము:
హస్త భూషణములైన బాణ పరంపరచే రాక్షసుల గర్వమును నశింపజేసి భూసుర దేవాదుల చేత నమస్కరించబడువాడు. కవిశ్రేష్టుడు వాల్మీకి రామాయణ గాథను రచించాడు. సుందర చరిత్రుడు త్యాగరాజు చిత్తహితుడు.
5వ చరణం:
సృష్టి స్థిత్యంతకారక – అమిత కామితఫలద – అసమానగాత్ర శచీ పతినుత – అబ్దిమదహర అనురాగ – రాగ రాజిత – కథా సారహిత.
అర్థము:
సృష్టి, స్థితి, లయలతో భక్తులను అనుగ్రహించువాడు. అంగసౌష్టవ పుష్టి గలిగిన వాడు. దేవేంద్రాది నుతుడు, సముద్రుని బంధించి గర్వమణచిన వాడు. రాగ అనురాగాలతో శోభించేవాడు. ఐతిహాసిక శ్రేష్ఠడు. పురాణ గాథా శోభితుడు.
6వ చరణం:
పాద విజిత మౌని శాప – సవ పరిపాల – వరమంత్ర – గ్రహణలోల.
అర్థము:
గౌతముని శాపంతో శిలగా మారిన అహల్యను తన పాదస్పర్శచే శాపవిముక్తి కలిగించాడు. యక్షరక్షకుడై, వేదరూపుడై, బ్రహ్మాదులను అనుగ్రహించాడు.
7వ చరణం:
పురాణ పురుష- నృవరాత్మజ – ఆశ్రిత పరాధీన – ఖర – విరాధ – రావణ విరావణ – అనఘ – పరాశర మనోహర – అవికృత – త్యాగరాజ సన్నుత.
అర్థము:
రాజశేఖరుడు, పురాణపురుషుడు. అందరి భక్తులకు అభీష్టుడు. ఖర విరాద రావణాదులను సంహరించినవాడు. పాపరహితుడు, పరాశరమునికి ఇష్టుడు, నిర్వికారుడైన త్యాగరాజ సన్నుతుడు.
8వ చరణం:
సజ్జన మానసాబ్ధి – సుధాకర – కుసుమ – విమాన – సురసా -రిపు కరాబ్జ లాలిత చరణ – అవగుణా – సురగణ – మహారణ – సనాతన – అజనుత.
అర్థము:
సజ్జనులు అనే మానస సరోరమున చంద్రుని వలె మనోహరుడు. శ్రీఘ్ర గమనము గలవాడు. సురస రాక్షసిని నిర్జించిన, ఆంజనేయుని పద్మమును బోలు (కరాబ్జములచే) చేతులతో పూజితుడైనవాడు. అజ్ఞాన ధనులైన రాక్షసుల మదమును భంగపరచి సనాతుడై బ్రహ్మాదులచే నుతించబడిన వాడు.
9వ చరణం:
ఓంకార పంజర కీర – పురహర – సరోజ – భవ – కేశవాది రూప – వాసవ – రిపు – జనకాంతక – కలాధర – కళాధరాప్త – ఘృణాకరం – శరణాగత జనపాలన – సుమనో రమణ – నిర్వికార – నిగమ సారతర.
అర్థము:
ఓం అనునది మధ్య షడ్జమందుండి ‘కార’ తార షడ్జమానికి అవిరామ నాదంతో పాడతారు. అచట ఓంకారము వలె స్పురించినది ఓం కారమున బంధింపబడిన చిలుక అట. రాముడు బహుశః – త్యాగయ్యగారి భావన అయివుండవచ్చు. అ = రాముడు, ఉ = సీత, మ = లక్ష్మణుడు, సీతా లక్ష్మణ సహితుడగు రాముని ప్రణవ పంజరంలో బంధించారు. కేవలం ప్రణవ పంజరంలోనే ఆ విధంగా వుంచితే స్వామికి స్వేచ్ఛారమణము లుండవని తమ హృదయాన్ని రమణ స్థానముగా చేసారని భావించవచ్చు.
ఓంకారమనెడి పంజరమందు వసించు చిలుక వంటి వాడై త్రిపురాసురవైరి యైన శివునిచే, పద్మభవుడైన బ్రహ్మచే స్తుతించబడు విష్ణు స్వరూపుడు. ఇంద్రశత్రులైన మేఘుని తండ్రిని రావణుని భంజించినవాడు. షోడశ కళాత్ముడైన చంద్రుని శిరమున ధరించిన శివుని మిత్రుడై అపూర్వ గ్రహణ శక్తితో శోభిస్తూ, దీనజనోద్ధారుడై, దేవతా ప్రియుడైన, వేద రూపుడు శ్రీరాముడు.
10వ చరణం:
అగణిత – గుణ – కనక చేల – సాల విదళన – అరుణాబ్జ – సమాన – చరణ – అపార మణిమాద్భుత – సుకవిజన – హృతసద – సుర మునీగణ – విహత – కలశ – నీర నిధిజా – రమణ – పాపగజ – నృసింహ వర – త్యాగరాజాధినుత.
అర్థము:
గణించ శక్యము గాని సద్గుణ శోభితుడు బంగారు వస్త్రాలతో శోభిల్లువాడు. ఒక బాణముచే ఏడు మద్ది చెట్లను పడగొట్టి పరాక్రమము చాటినవాడు.
ఎర్రని ప్రకాశించు చరణములు (ఆజాను బాహుడు) గలవాడు.
అనేక కవిజన హృదయములందు నర్తించువాడు. దేవాది వర్గ పూజితుడు.
పాల కడలి నుండి పుట్టిన లక్ష్మికి భర్తయై పాపరాశి అనెడి ఏనుగులకు సింహం లాంటి వాడు.
త్యాగరాజాది భక్త సంసేవితుడు.
భావ కవితావేశ రసమయ సంకలిత ఉద్దీపనకు ప్రకర్ష అని చెప్పవచ్చు.
సంగీత పరంగా:
- 3వ చరణం – పా ని పా ని ప మ – (ఇంద్రనీలమణి) చతుర (స స్వర జాతి మేళనం) (ధీంత ధీం తకిట)
- 4వ చరణం – ప మ రి స – ని ప సా సా (కరధృత) (శ్రోతోవహయత, త్రిశ్ర, ఖండలయాత్మకం)
- 5వ చరణం – (సృష్టిస్థితిలయ)
- మ ద హ ర – అనురాగ – రాగరాజత – కథా – సారహిత – తాకర, రకారాల – ప్రయాగ సంచారాలు.
- 8వ చరణం – లాలితచరణా, అవగుణా సురగణా మదహరణ – ‘ణ’ కారం అనుప్రాసగా నర్తించింది. బిలజమౌని అనే పద ప్రయోగం అపూర్వం.
- 10వ చరణం – ఉల్లసిత గమకం – మనోహరంగా వాడారు. కళాధర కళాధరా అనే యమక ప్రయోగం.
- 4, 7,10 చరణాలలో వాగ్గేయకార ముద్ర మూడు పర్యాయాలుగా రావడం త్యాగయ్యగారి రచనా శిల్పానికి తార్కాణం.
సాహిత్యాన్ని ముందు వ్రాసి – తర్వాత స్వరాల కూర్పు జరిగివుంటుంది.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
