[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 4 త్యాగరాజు – పంచరత్నములు – 3వ భాగము
రాగం: నాట; తాళం: ఆది
‘జగదానందకారక’
ఈ కీర్తనలో రాముడిని కథానాయకుడుగా గాక, పరబ్రహ్మ స్వరూపంగా చిత్రించడం కన్పిస్తుంది. రామ పరతత్వం నిరూపణతో త్యాగరాజు అపారమైన శాస్త్ర పురాణాది పాండిత్యతత్త్వ పరిజ్ఞానం మనకు అర్ధం అవుతుంది.
తత్వజ్ఞులు రామాయణ గాథ ప్రతీకాత్మం అని చెపుతారు. రాముడు ‘రమయాతీతి రామః’ అని సర్వజన హృదయాల్గను రమింప చేసె అనగా ఆనందంతో ఓలలాడించే పరబ్రహ్మ తత్వానికి ప్రతీక అంటారు. అలాగే భూగర్భం నుండి జనించిన సీత సకల జీవకోటికి ప్రతీక. ప్రాణికోటి మొత్తం భూగర్భం నుండి ఆవిర్భవించినదే కదా.
పల్లవిలో “జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక” అంటున్నారు. సకల జీవకోటికి ప్రతీకమైన జానకికి ప్రాణనాయకుడు కాబట్టి, బ్రహ్మానందదాయకుడైన శ్రీరాముడు జగదానంద కారుడయ్యాడు. రామాయణ కథ ప్రధానంగా మూడు తత్వాలు చుట్టూ అల్లుకుని వుంది.
1. జీవతత్త్వం 2. పరతత్త్వం 3. జీవతత్త్వాన్ని ఉద్ధరించే ఆచార్యతత్త్వం (లేక) యోగితత్త్వం.
మొదటిదైన జీవతత్త్వానికి సీత; రెండవదైన పరతత్త్వానికి రాముడు; మూడవదైన (ఆచార్య) యోగితత్త్వానికి – శ్రీఆంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అనుపల్లవి:
గగనాధిప! సత్కులజ! రాజ రాజేశ్వర!
సుగుణాకర! సుజనశ్సేవ్య! భవ్య దాయక! సదా సకల
ఇందులో రాముని పరతత్త్వ నిరూపణ స్పష్టమవుతుంది.
“సత్కులజ” అనడంలో సూర్యవంశ ప్రభువని స్పష్టమవుతుంది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రాణికోటి ఆవిర్భావానికి అంతకు సూర్యకిరణాలే ఆధారం. ప్రాణశక్తిని నిలిపేవి అవే (అనగా సూర్య కిరణాలే). ఆ రకంగా ఆలోచిస్తే మానవ జాతి అంతా సూర్యవంశజులే. అందుకే నరజన్మ ఎత్తినందుకు ఆత్మ సాక్షాత్కారాన్నిపొంది పరబ్రహ్మతత్వంలో ఐక్యం కావడమే జన్మ సార్థక్యము అని తత్త్వజ్ఞులు అంటారు. నరుడై జన్మించి నారాయణ తత్త్వాన్ని తనలో నిలుపుకొని దుష్టరాక్షస తత్త్వాలను నాశనం చేసిన దివ్య పురుషుడు శ్రీరాముడు.
1వ చరణం:
అమర – తారక – నిచయ – కుముద హిత – పరిపూర్ణానఘ – సురసురభూ – దధి పయోధి – వాస హరణ – సుందరతర వదన – సుధామయ – వచో బృంద గోవింద సానంద – మా వర -అజర – ఆప్త – శుభకర – అనేక.
రాముడిని వర్ణించేటప్పుడు చంద్రుడితో పోల్చడం పరిపాటి. చంద్రుడు అమృతానికి నిలయం అని (సుధాకరుడు), అమృతమే దేవతలకి ఆహారం అని పురాణోక్తి.
యోగులు తమ ధ్యాన మహిమ చేత మూలాధారంలోని కుండలినీ శక్తిని మేల్కొపుతారని అది క్రమంగా సహస్రారం చేరుకుంటుందని; అక్కడ చంద్రస్థానం నుండి యోగ శక్తి వల్ల అమృతం స్రవిస్తుందని ఆ అమృతపానం వల్లనే యోగులు అన్నపానాదులతో నిమిత్తం లేకుండా సమాధిలో వుండిపోగలుగుతారని యోగశాస్త్రం వివరిస్తుంది.
ప్రతి మానవునిలోని సహస్రారంలోని చంద్రస్థానియుడే శ్రీరామచంద్రుడు.
జ్ఞానేంద్రియాలకు అధిదేవతలే మనం చెప్పకునే – సూర్యచంద్రాగ్నివరుణాది దేవత సముదాయం. జ్ఞానేంద్రియాలకు సహస్రారంలోని అమృత సమానమైన జ్ఞానేంద్రియాలకు సహస్రారంలోని అమృత సమానమైన ప్రామశక్తి అధారమైనట్లే దేవతలకు చంద్రునిలోని అమృతం ఆధారం ఇది యోగరహస్యం.
యోగ శాస్త్రంలో ఇచ్చిన వివరణ. అందుకే ఇక్కడ శ్రీరాముని “అమర తారక నిచయ”, “కుముద హితుడు” అని అన్నారు. దేవతలకి, తారకకు చంద్రుని వంటి వాడు రాముడు. అనుఘుడు, పాపములు లేని వాడు కనుకనే పరిపూర్ణుడు. ఈ సంద్రభంలో ఉపనిషత్తులో చెప్పి శాంతి పాఠం –
“పూర్ణమిదః పూర్ణ మిదం పూర్ణాతే పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం స్పురిస్తుంది.
వర్ణించేది రాముడినే అయినా భక్త కవులందరికి రామకృష్ణాది అవతారాల మధ్య అబేధమే. ఈ ధోరణి భక్తకవులందరిలో కన్పిస్తుంది. శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావైలలో కూడా కన్పిస్తుంది. శ్రీరాముని వర్ణిస్తున్న ఈ సందర్భంలో కృష్ణావతార ఘట్టమైన దధీక్షీరాది అపహరణాలను వర్ణించడం భక్తకవి హృదయంలో అనౌచిత్యం కాదు.
ఆ మూర్తి అమృతపూర్ణమైన వాక్కు సముదాయంతో నిండిన వేద వేద్యుడు.
“మా” అంటే లక్ష్మి అని, తల్లి అని రెండు అర్ధాలు వున్నాయి. లక్ష్మికి భర్త కనుక (లేదా) తల్లికి భర్త కనుక శుభకరుడు దేవతలకు ఆప్తుడు అందుకే ఇక్కడ త్యాగయ్య దృష్టిలో రాముడు పరతత్వం అని చెప్పుకున్నా బ్రహ్మ సృష్టికి కారకుడు.
2వ చరణం:
నిగమ నీరజ – అమృతజ పోషక – అనిమిషవైరి – వారిద – సమీరణ – ఖగతురంగ – సత్కవిహృదాలయా – అగణిత – వానరాధిప – నతాంఘ్రి – యుగ.
ఆవిర్భానికి, బ్రహ్మకు వేదరాశి లభించడానికి కూడా పరతత్త్వమైన రాముడే కారకుడు. ఇక్కడ రాక్షస సంహారం రామ జన్మ ప్రయోజనాలలో ప్రధానమైనది. “సమీరణ” పదప్రయోగం ద్వారా వాయు సుతడైన ఆంజనేయస్వామిని ధ్వనింప చేస్తున్నారు.
రామరావణ యుద్ధంతో నాగపాశబద్దులైన రామలక్ష్మణులను గరుత్మండే విడిపించాడు. కారణం శ్రీమహావిష్ణువుకు గరుడత్ముండు వాహనం కావడమే. శ్రీరామునికి శ్రీమహవిష్ణువునికి అభేదాన్ని స్థిరపరుస్తున్నాడు. రాజైన రాముడు గుర్రాల మీద శ్రీమహావిష్ణువు పక్షి మీద పయనిస్తారు. రాముడే శ్రీమహావిష్ణువు కనుక ఆయనకు పక్షి గుర్రమయింది కాబట్టి ఖగతురంగుడు.
త్యాగరాజు దృష్టిలో సత్కవులు అంటే భక్తకవులే. భక్తకవుల హృదయాలలో నివసించేది భగవంతుడే కదా. అందులో ప్రధానంగా భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామి నిరతము అర్చించే పాదపద్మములు కల భగవంతుడు రాముడు.
3వ చరణం:
ఇంద్రనీలమణి సన్నిభ – అపఘన – చంద్ర సూర్యనయన అప్రమేయ – వాగీంద్ర జనక – సకలేశ – శుభ్ర నాగేంద్రశయన – శమనవైరి – సన్నుత.
ఇంద్రనీలమణితో సమానమైన సాటి లేని ప్రకాశం కల్గిన వాడు శ్రీమహావిష్ణువు. స్థితి కారకుడు. భూమండలం కాంతి నీలం అని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. స్థితికారకుడు కాబట్టి సూర్యచంద్రులు ఆ మహాతత్వానికి నేత్ర ద్వయం. వీరే గదా కాల గమనానికి మూల కారకులు. కాలస్వరుపానికి మూలమైన ఆదిశేషుడు మహతత్త్వానికి శయనం. అంటే ఆద్యంతాలు లేని అనంతమైన కాలానికి కేంద్ర స్వరూపుడు శ్రీమహావిష్ణువు. ఆదిశేషునికి అనంతుడు అనే పేరు కూడా వుంది. ఇంతటి శ్రీమహావిష్ణుతత్వాన్ని భావిస్తున్నారు త్యాగయ్య.
సృష్టి చక్రం యొక్క పరిభ్రమణానికి అనుకూలంగా సాగుతాయి శివ, విష్ణువు కథావాఙ్మయాలు.
4వ చరణం:
కరధృత శరజాలా – అసురమదాపహరణా – అవనీసుర సురావన- కవీన బిలజమౌని కృత చరిత్ర – సన్నుత శ్రీ త్యాగరాజనుత.
ఇందులో మొదట అంతా విష్ణుతత్వాని ప్రస్తుతించినా ముద్రాంకిత చరణంలో రామచంద్రుని మూర్తిని ప్రత్యకించి ప్రస్తుతించాడు. వాగ్గేయకారుడైన త్యాగయ్య, వాల్మీకి సృష్టించిన రామునిలో విశ్వరూపుడైన అంతర్యామినే దర్శిస్తు గానం చేసాడు.
5వ చరణం:
సృష్టి స్థిత్యంతకారక – అమిత కామితఫలద – అసమానగాత్ర శచీ పతినుత – అబ్దిమదహర అనురాగ – రాగ రాజిత – కథా సారహిత.
సృష్టి స్థిత్యంత కారకుడు అంటే బ్రహ్మవిష్ణుమహేశ్వరాత్మకుడైన తత్వమూర్తి. ఆ మూర్తినే రామునిగా ప్రార్ధిస్తున్నాడు త్యాగరాజు. భక్త కవులందరు రాముని ప్రార్థించినా, కృష్ణుని ప్రార్థించినా రామ కృష్ణగాథలు రెండు కలగలసి కన్పిస్తాయి.
శచీపతి, కృష్ణుడు ప్రస్తావన పౌరాణికంలో వివరిస్తాను.
6వ చరణం:
పాద విజిత మౌని శాప – సవ పరిపాల – వరమంత్ర – గ్రహణలోల – పరమ శాంత – చిత్తజనకజాధిప – సరోజ భవ వరద – అఖిల.
రామ కథాంశాలను తలచుకుంటు గానం చేస్తున్నారు కవి. ఈ చరణంలో అహల్య శాప విమోచనం, విశ్వామిత్ర యాగ సంరక్షణ మొదలైన ఘట్టాలు స్మరించగలం.
‘పరమశాంత చిత్త..’ రామతత్వాన్ని వివిధ రీతులలో దర్శించిన త్యాగరాజు ఆరాధనామూర్తి శాంతచిత్తుడైన శ్రీరాముడే. ఆ శాంత స్థిర చిత్తమే త్యాగరాజు ధ్యేయం.
ఉదాహరణ: ‘శాంతము లేక సౌఖ్యం లేదు..’ అన్న కీర్తన.
సరోజ భవవరదుడు అన్న దగ్గర కృష్ణ కథ స్పురిస్తుంది.
7వ చరణం:
పురాణ పురుష- నృవరాత్మజ – ఆశ్రిత పరాధీన – ఖర – విరాధ – రావణ విరావణ – అనఘ – పరాశర మనోహర – అవికృత – త్యాగరాజ సన్నుత.
రామచంద్రమూర్తి సహజంగా పురాణ పురుషుడై, ఆశ్రిత వత్సలుడై, నరుడై, నృపతనయునిగా జన్మించాడు. ఖర, విరాద, రావణాది రాక్షసులను సంహరించినా ఎవ్వరిపైన కోపముగాని ద్వేషముగాని లేక ఏ విధంగా వికారమునకు లోనుగాని మనసుసుతో స్థితప్రజ్ఞుడై మెలిగినవాడు.
8వ చరణం:
సజ్జన మానసాబ్ధి – సుధాకర – కుసుమ – విమాన – సురసా – రిపు కరాబ్జ లాలిత చరణ – అవగుణా – సురగణ – మహారణ – సనాతన – అజనుత.
సత్పురుషుల మనస్సనెడి సంద్రానికి చంద్రుడైన వాడా (రూపకాలంకారం) ఉపమానం యొక్క భావాన్ని ఉపమేయం నందు ఆరోపించడమే రూపకాలంకారం. ఇక్కడ సత్పురుషుల మనస్సునకు శ్రీరాముడు ఉపమేయము. సముద్రానికి చంద్రుడు అనేది ఉపమేయం. సత్పురుషుల మనస్సులకు రాముడు సముద్రనకు చంద్రుని వంటివాడు అని చెబుతున్నారు ఇక్కడ. పోలిక స్పష్టంగా లేకుండా మానసాబ్దీ, సుధాకరుడు (శ్రీరాముడు) అనటం వల్ల ఇది రూపకాలంకారం.
భూమి నుండి చంద్రుడు ఉపగ్రహంగా ఏర్పడ్డాడు. ఆ కారణం వల్ల భూమి చంద్రున్ని ఆకర్షించుకుంటుంది. చంద్రుడు భూమిలో ఐక్యం కావాలని భూమి చుట్టు తిరుగుతూనే వుంటాడు. అలాగే సకల ప్రాణుల పరతత్వం నుండీ ఆవిర్భవించాయి. తిరిగి ఆ పరతత్వంలో ఐక్యం కావటానికే పరిభ్రమిస్తున్నాయి.
ఈ చరణంలో రావణ సంహారం తర్వాత తిరిగి వస్తున్న శ్రీరామమూర్తిని దర్శిస్తున్నారు త్యాగయ్య. అవగుణాలు నిండిన రావణాసురుని సంహరించి అతడి పుష్పక విమానాన్ని అధిరోహించి సుర సారిపుడైన అంజని తనయుడు ప్రస్తుతించుచుండగా అయోధ్యానగరికి చేరుకొంటున్న శ్రీరామచంద్రమూర్తి దర్శనమిది.
9వ చరణం:
ఓంకార పంజర కీర – పురహర – సరోజ – భవ – కేశవాది రూప – వాసవ – రిపు – జనకాంతక – కలాధర – కళాధరాప్త – ఘృణాకరం – శరణాగత జనపాలన – సుమనో రమణ – నిర్వికార – నిగమ సారతర.
ఇక్కడ (తిక్కన భారతం) శ్లోకం ఉదహరిస్తున్నాను.
కం:
ఓంకారవాచ్యునకు, నన- హంకార
విరూఢ భావనారాధ్యునకున్,
హ్రీంకారమయ మనోజ్ఞా
లంకారోల్లాస నిత్య లాలిత్యునకున్
కం:
త్రిభువన శుక దృఢ పంజర
విభవ మహితునకు సమస్త విష్టప నిర్మో
క భుజంగమపతికిని జగ
దభిన్న రూపునకు భావనాతీతునకున్.
ఓంకార పంజర శుకీం.. ఉపనిషదుద్యానకేళి కలకంఠీమ్.. (దుర్గాస్తుతి, ఆదిశంకరాచార్యుల) పద్య ప్రభావం ఓకారం పంజర కీర అనే చరణం పైన కన్పిస్తుంది. నిగమ సారతరగా ప్రయోగించాడు.
రాముని పరతత్త్వాన్ని నిరూపిస్తూ పరాక్రమాన్ని వర్ణిస్తూనే (రావణ వధ) నిర్వికార తత్వానికి త్యాగరాజు పట్టం కట్టడం గమనార్హం.
10వ చరణం:
అగణిత – గుణ – కనక చేల – సాల విదళన – అరుణాబ్జ – సమాన – చరణ – అపార మణిమాద్భుత – సుకవిజన – హృతసద – సుర మునీగణ – విహత – కలశ – నీర నిధిజా – రమణ – పాపగజ – నృసింహ వర – త్యాగరాజాధినుత.
ఈ ఘట్టంలో కృష్ణావతార కథా ఘట్టాలను వర్ణిస్తూ శ్రీరాముని యథా ప్రకారం సుజన సేవ్యునిగా, భక్తవత్సలునిగా ప్రార్థించాడు త్యాగయ్య. ఈ చరణంలో కృష్ణ కథాఘట్టాలు వున్నాయి.
***
7వ చరణంలో ‘ఓంకార పంజర కీర పురహర..’ వివరణ – ఓంకార ప్రత్యేకత:
ప్రయత్నపరుడగు మానవుని నోటి నుండి తొలుత వెలువడినది ఓంకరమే. ఓంకారమనగా ‘ఓం’ అను అక్షరం. దీనిని అన్నిటికి మూలమనిరి. ఇందు అ, ఉ, మ అను మూడక్షరములున్నవి. సృష్ట్యాదిలో ఏమియు నెరుగని మానవుడు నోరు తెరచినాడు. తెరచిన ఆ నోటి నుండి ‘అ’ అను అక్షరం ప్రయత్నరహితంగా వచ్చింది. పిదప నోరు మూయుటకు చేయు ప్రయత్నంలో ఆ నాదము ‘ఉ’ అయినది. నోరు పూర్తిగా మూసిన తరువాత ఆ నాదము ‘మ్’ అయినది. ‘మ్’ అను అక్షరం ‘మ’ కారమనిరి.
వివరణము – తెరచుట. వివరణ ప్రయత్నం – మూయుటకు చేసిన ప్రయత్నం, సంవరణము – మూయుట. వీటిలో క్రమముగా అ, ఉ, మ్ అను అక్షరములయి ఈ మూడింటినీ సంధిస్తే ‘ఓం’ అయనది. వర్ణమాల ఏర్పడక ముందు పుట్టినది. అదే మూలాక్షరమైనది.
మాటలు రాని శిశువుకు తల్లిని ‘అమ్మ’ అనవలెనని అర్థము. ఆ ప్రయత్నములలో వెలువడినవే అక్క, అప్ప, అబ్బ, అయ్య మొదలైనవి. ఎన్ని పదాలకు ఇవి మాతృకలు. అమ్మ, మాతృవాచకం. అప్ప, అబ్బ, అయ్య, పితృవాచకాలు. ఓంకారమున నున్న మూడక్షరములలో ‘అ’ మొదటిది అకారమునకు, ‘నారాయణుడ’ని అర్థము. మొదటి అక్షరము అకారం, మొదటి దేవుడు నారాయణుడు. ‘అల్లా’ మహమ్మదీయుని దేవుడు.
వర్ణమాలలోని ప్రథమాంత్యక్షరములతో ‘ఓం’కారం ఏర్పడినది. మ కారమునగా ‘మ్’ అని గ్రహించాలి. ఈ మకారము వర్గాంత్యక్షరమగుటచే ‘ఓం’ అని నోరు మూసికొనినను నాదము అవిరామంగా కొనసాగుతూ వుంటుంది. అకారమును గూర్చి వేదములో “అకారోవై సర్వావాక్” అని చెప్పారు. ఏ వాక్కయినా అకారమే. ఓంకారం స్వయంభువైనది. దీనికి ఇంకోక పదం తారము. ఊర్ధ్వాకాశమున ఎక్కడో మ్రోగు వీణ, దాని సూక్ష్మానుకరణమే ఓంకారం. అవ్యక్తములయిన నాదములన్నియు ఓంకారము వలె వినబడును. సర్వత్రా వ్యాప్తమయినది. దీనికి మరియొక నామం ప్రణవము. అనగా మిక్కిలి కొనియాడబడునది.
“ఓంకార ప్రభవాః వేదాః
ఓంకార ప్రభవాః స్వరాః
ఓంకార ప్రభవం సర్వం
జగత్ స్థావర జంగమం” అని శాస్త్రం.
భగవద్గీతలో ‘అక్షరాణామాకారోస్మి’ – అక్షరములలో నేను అకారమును అని పరమాత్మ వాక్యం.
ఉపనిషత్తులో
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః।
తస్య ప్రకృతి లీనస్య యః పరస్సమహేశ్వరః॥
అని ఉంది.
వ్యాహృతులు అనగా మాటలు అని అర్థం. అవి ‘భుః’, ‘భువః’, ‘సువః’. వీటిని మథిస్తే అకార, ఉకార, మకారములుగ తగిలినవట. వీటిని బ్రహ్మ గుచ్చి ఎత్తితే ‘ఓం’ అయినదట. ఇది బ్రహ్మమట. “ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” అంటుంది భగవద్గీత. సర్వవైదిక కర్మలందును ప్రాధాన్యం వహించింది. గాయత్రి మంత్రానికే కాక అన్ని మంత్రములు ఓంకార పురస్సరములయినప్పుడే ఫలప్రదములు. హోమములలో చివరకు సర్వలోప పరిహారార్థముగా “ప్రణవేన ఏకాహుతిం జుహ్యత్” అని ఓంకారోచ్చరణముతో ఆజ్య పాత్రమందున్న నేతి నంతయును ఆహుతి చేయుదురు. తుదకు లౌకిక వ్యవహారంలో కూడా తాము వ్రాయు లేఖలో ముందు ‘ఓం’ వ్రాయుదురు.
ఈ రకంగా చాలా అర్థాలు చెప్పవచ్చును.
అకారమునకు విష్ణువర్ణమని, ఉకారానికి లక్ష్మీ అని దానికి ప్రమాణం. ఉకారేమోచ్యతే లక్ష్మీః. ఓంకారముందు త్రిమతముల అర్థసారం వుంది. (వైదిక మతములు 3 అవి ద్వైతాద్వైతవిశిష్టాద్వైతములు).
అకారాని బ్రహ్మరుద్రులు వాచ్యులే.
అ అంటే – శివుని పేరు
అ, ఉ, మ లలో అ-శివుడు, ఉ-పార్వతి
ఓంకారమున శివపార్వతులున్నారు. శివుడు బ్రహ్మ, పార్వతి జీవుడు. ఉమ – రెండు వస్తువులందువున్నాయి.
ఇది ద్వైతము.
ఇక అద్వైతము పరబ్రహ్మము మాయా సంవృతమైన జీవుడనుచున్నది.
ఉ – మాయ చేత సంవృతమై – మ జీవుడైనది. అదే అద్వైతం.
ఇక విశిష్టాద్వైతం. వీటిలో తత్త్వములు మూడు. ఈశ్వరుడు, జడమనబడు ప్రకృతి, జీవుడు.
అ = ఈశ్వరుడు. ఉ = జడప్రకృతి (ఇది లక్ష్మివాచకమగుటచే విష్ణు పత్నిత్వము చేత భూమికి ఉపలక్షణం. భూమియే అచిత్తు అని చెప్పబడినది). మ = జీవుడు (చిత్).
ఈ విధంగా విశిష్టాద్వైతం.
అలాగే కొన్ని చిత్రములు చెప్పవచ్చు.
అ – సృష్టి, ఉ – స్థితి, మ – లయం
అ – నాదసృష్టి, ఉ – నాదస్థితి, మ – నాదలయం
అందుకే ప్రణవం సర్వోత్తమము.
ఒక ఉపనిషద్ వాక్యం ఇట్లున్నది.
“ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే।
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్॥”
ఓంకారం ధనస్సు. ఆత్మ, శరము. లక్ష్యం బ్రహ్మం. అప్రమత్తతతో గురి చూసి కొట్టినచో ఆత్మ బ్రహ్మమయమగును. బ్రహ్మసాక్షాత్కారమగునన్నమాట. తమ తమ ఉపాస్య దైవమును ప్రవణమందు ప్రతిష్ఠించుకొని యోగులు దర్శింతురు. అందుచేతనే దేవి భక్తులు ‘ఓంకార పంజర శుకీం’ అని గౌరిని ఓంకారమను పంజరమున్న చిలుకగా భావించిరి.
దీక్షితులు నవారణ కృతిలో “కాంత తార పంజర శుకీ” అనీ, నారాయణ తీర్థులు ఒక తరంగంలో “సత్యమితి మాం ఓమ్” అని మకుటం చేసి 20 చరణాలు రచించారు. దీక్షితులు “వాతాపిగణపతి” కృతిలో “ప్రణవ స్వరూప వక్రతుండ” అని చెప్పారు. గణపతి పెట్టిన తొండపు మెలిక ‘ఓం’ వలె ఉన్నదట. దీక్షితులకు గణపతి తుండం ఓంకారమైతే, త్యాగయ్య గారికి శ్రీరాముని కోదండము ఓంకారం వలె కన్పబడినది.
***
నాట పంచరత్న కృతితో ‘ఓంకార పంజార కీర’ అని సంబోధించినారు. అందులో ‘ఓం’ అనునది మధ్య షడ్జమందుండి, ‘కార’ తార షడ్జానికి అవిరామ నాదంతో కలిపి పాడుదురు. అచట ఓంకారమువలె స్పురించినది. ఓంకారమున బంధింపబడిన చిలుక యట రాముడు. బహుశః త్యాగయ్యగారి భావన ఇట్లుండ వచ్చును. ఆ – రాముడు, ఉ-సీత, మ-లక్ష్మణుడు. సీతా లక్ష్మణ సహితుడగు రాముడిని ప్రణవ పంజరంలో బంధించారు. కేవలం ప్రణవ పంజరంలోనే ఆ విధంగా వుంచితే స్వామికి స్వేచ్చా రమణములుండవని తమ హృదయాన్ని రమణ స్థానముగా చేసి ‘భవనుత’ నా హృదయమున రమింపుము అని చెప్పారు. హృదయం కూడా ఓంకార పంజరమే.
అక్షరముల ఆనందం అనగా కవిత్వమున అక్షరముల పునః పునారావృత్తములయినపుడు కల్గు ఆనందమే ‘యమకం’ అందురు. శబ్దపునారావృత్తి చేత ఆనందింతురు.
- నాట పంచరత్న కృతిలో అనురాగ రాగరాజిత కథాసారహిత – ఉదా.
- శాస్త్రపురాణం వల్ల కల్గిన ఆనందం అనుభవించు ఆనందకర శరీరము నరునిది. కాని త్యాగయ్యగారి హృదయమున వీటి అన్నింటికంటే రామ భజనానందం మిన్న ఆయినది. ఏ ఆనందమునను దీని యందే పర్యవసింప వలెను. శాస్త్ర పఠనం వల్ల వృథా తర్కము చేసి కాలం వెళ్ళబుచ్చక, వేద శాస్త్ర పఠనాదుల సారమయిన రామ భజనం చేయుమని మానస బోద చేయబడింది. అదే పరమార్థం. వృథా తర్కములను పలుచోట్ల ఆయన నిరసించిరి.
- ఉదా – గౌళపంచరత్నకృతి “చిఱుత ప్రాయణులనాడే భజనామృత రసవిహీన కుతర్కుడయిన”
- “విద్యా వివాదాయ” అనుసరించి వేదశాస్త్రాది జ్ఞానము వాద తర్కములకే దారి తీస్తుంది. అది త్యాగయ్యగారికి పడదు. కాని వేదశాస్త్రపరిజ్ఞానం కావాల్సిందే.
- ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇయ్యవు కృతిలో – ‘వేద శాస్త్రతత్త్వార్ధము తెలిసి’ అని అంటాడు. “భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు”, “పరమా భాగవత మౌని వర శశి విభాకర సనకాదులు” మొదలగు వీరందరు నాదలోలురు, రామ భజనపరులు, నిజభగవతాగ్రేసరులు.
ఈయన కృతులు “నైగమ షట్ఛాస్త్ర పురాణాగమార్థ స్వభావము” సహితమట.
ఈ విధంగా త్యాగయ కీర్తనలు సింహావలోకనం చేస్తే ఆయన గేయములు ఇతిహాస పురాణములకు, ఇతిహాస పురణాములు వేదములకు, వేదము ఓంకారమునకు ఉపబృంహణములనవచ్చును గదా. ఇట్లు సర్వము ఓంకారమున బుట్టి ఓంకారమమందే పర్యవసించినది.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
