[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]
అధ్యాయం 4 త్యాగరాజు – పంచరత్నములు – 4వ భాగము
నాట – క్లుప్త – రాగ లక్షణం
- చలనాట 36 మేళ లో జన్యం.
- వివాది రాగం. 72 మేళకర్త రాగాలలో 40 వివాది రాగాలు. అంటే వికృతి స్వరాలు. D- Sharp, A – Sharp స్వరాలు వస్తాయి (గానమూర్తి, ఝంకార ధ్వనీ, నాగనందినీ, మానవతి, శూలిని.. ఇంకా ఇలాంటి రాగాలు).
- ఆరోహణ – స రి గ మ ప ద ని స; అవరోహణ – స ని ప ను గ మ రి స. స్వరస్థానాలు – షట్ శృతి రిషభము ; అంతర గాంధారం; శుద్ధ మధ్యమము; షట్ శృతి దైవతం, కాకలి నిషాదం.
- షట్ దైవతమ్ – మూర్ఛన వుంటుంది. పాటలో రాదు.
- వీరరస ప్రధాన రాగం
- 108 నామావళి రాముని గురించి. ఉదా: ఓం జగదానంద కారకయ నమః – అలాగా అన్నిటికీ ఓం, నమః – అన్వయిస్తూ.
ఇది ఒక మినీ రామాయణం అని చెప్పవచ్చు.
1. బాలకాండ:
రాముడు పుట్టడం, సీతతో వివాహం, గురుకృపాకటాక్షం, ప్రకృతి పై ఆధిపత్యం.
ఉదా:
- (అ) జగదానందకారక;
- (ఆ) గగనాధిప; సుందర తరవదన; సుధామయ; వచోబృందం; వరమంత్ర గ్రహణలోల; సుపరిపాల.
- (ఇ) పాదవిజిత; మౌని -శాప; జానకీ ప్రాణనాయక; అవనీ సూరా సురావన; అపార మహిమ
2. అయోధ్యకాండ:
రాముడి పట్టాభిషేకం, కైక వరాలు కోరడం, రాముడు అరణ్యాలకు వెళ్ళడం, విజయయాత్రకి నాంది; ధీరోదాత్తుడు;
ఉదా:
- (అ) పరమ శాంత చిత్త
3. అరణ్యకాండ:
దేవతలను రక్షించడం
ఉదా:
- (అ) అవనీసుర; సురావన; అసుర గణ మదహరణ
4. కిష్కిందకాండ:
వానరుల, ఆది జాతుల మైత్రి
ఉదా:
- (అ) పరమశాంత అగణితవన; నూధిప చిత్త; శాల; విదళన
5. సుందరకాండ
అన్వేషణ (పోయినది వెతకడం)
ఉదా:
- (అ) సురసా రిపు
6. యుద్ధకాండ:
రామ రావణ యద్ధం
ఉదా:
- (అ) వాస వారిపు జనకాంతక; శరణాగత జన పాలన,
- (ఆ) పరమ శాంత చిత్త; అబ్ధి మదహర, కుసుమ విమాన
7. ఉత్తరకాండ:
లవకుశులు, రామాయణ అద్భుతగానం. Rama takes the form as Vishnu.
ఉదా:
- (అ) అనురాగ, రాగ, రాజిత కథ, శుభ్ర, నాగేంద్ర శయనా
***
మధ్యమ కాల రచన.
సంసృత రచన.
3, 4, 5 – మృదంగ జాతులు త్రిశ్ర, చతురస్ర, ఖండ గతులు.
అతి తీవ్ర స్వరాలువుంటాయి.
ధీరోదాత్త – ధీర లలిత రచన.
సంగీత పరంగా, సాహిత్య పరంగా విరుపులు కూడిన రచన అని చెప్పవచ్చు. ఉదా: అమర తా – రక నిచయ కుముద హిత (సంగీత పరంగా); అమర – తారక – నిచయ – కుముద హిత (సాహిత్య పరంగా)
ఈ విధంగా 1, 2, 3, 4 రెండవసారి 5, 6, 7; మూడవ సారి; 8, 9, 10 చరణాలలో త్యాగయ్య ముద్ర ఉంది. 4, 7, 10 లా పాడతారు మరికొంతమంది.
***
నాట – ఆది – ‘జగదానంద కారక’ ఘనరాగ పంచరత్న కీర్తనల భావాల వివరణ:
మొదటి ఘనరాగ పంచరత్న కీర్తన, నాట, ఆది తాళంలో రచించబడిన, ‘జగదానందకారక’ వీర రసాన్ని పెంపొందించే నాట రాగంలో వ్రాసారు. ఈ కీర్తనలో శ్రీరాముని 108 నామాలు, సంక్షిప్తంగా శ్రీమద్రారామాయణం గోచరిస్తాయి.
పల్లవి: ‘జగదానందకారక జయజానకీ – ప్రాణనాయక’
స్థావర జంగమాల్లో ఉన్న ఆనందమే శ్రీరాముని అంశ. అడగకుండానే అన్ని ఐశ్వర్యాలను ప్రసాదించే వానిగా త్యాగయ్యగారు శ్రీరాముని భావిస్తూ ‘జయ’ శబ్ద ప్రయోగంతో తనకు విశ్వ శ్రేయస్సుకు పాటుపడడానికి అవసరం అయిన ఆత్మ శక్తిని కలిగించమని వేడుకొంటున్నట్లు భావించవచ్చు.
అనుపల్లవి: ‘గగనాధిప – సత్కులజా – రాజరాజేశ్వర సుగుణాకర – సురసేవ్య – భవ్యదాయక – సదా సకల’
అర్థం: ఉత్తమైన సూర్యవంశంలో జన్మించిన శ్రీరాముడు అందరు రాజులకు ప్రభువై, ఎల్లప్పుడు శ్రేయస్సును కలుగచేస్తూ, అందరినీ సంతోషింపచేసేవానిగా త్యాగయ్య కీర్తిస్తున్నారు.
1వ చరణం:
అమర – తారక – నిచయ – కుముద హిత – పరిపూర్ణానఘ – సురసురభూ – దధి పయోధి – వాస హరణ – సుందరతర వదన – సుధామయ – వచో బృంద గోవింద సానంద – మా వర -అజర – ఆప్త – శుభకర – అనేక.
అర్థం: నక్షత్రాలు అనబడే దేవతల రాజు అయిన చంద్రునిలా, పూర్ణ పురుష లక్షణాలతో, దేవతల అసురుల పూజలను అందుకొనే కల్పవృక్షం లాగ వుంటూ, గోపాలుర పాలు, పెరుగులను, గోపికల వస్త్రాలను దొంగిలిస్తూ, అసామాన్య అందం, మృదు భాషిత్వంతో, గోగణాలను లాలిస్తూ, రక్షిస్తూ, నిత్య యవ్వనంతో లక్ష్మీదేవికి భర్తగా ఉంటూ, సకల జీవరాశులకు హితమును, శుభాలను పంచి పెట్టే, ఆనందం కలిగించేవానిగా శ్రీరాముని తన మనస్సులో భావిస్తున్నారు త్యాగయ్య.
2వ చరణం:
నిగమ నీరజ – అమృతజ పోషక – అనిమిషవైరి – వారిద – సమీరణ – ఖగతురంగ – సత్కవిహృదాలయా – అగణిత – వానరాధిప – నతాంఘ్రి – యుగ.
అర్థం: తాగయ్యగారు శ్రీరాముని, తన మనస్సులో, వేదముల నుండి పుట్టిన వేదాంతాన్ని పోషించేవానిగాను, దేవతలకు శత్రువులయిన రాక్షసులు అనే మేఘాలను చెదరగొట్టే వాయువుగాను, గరుడపక్షిని వాహనంగా చేసుకొనే విహరించేవాని గాను, విద్వాంసుల మనస్సులను నివాసముగ చేసికొనినవాని గాను; ఎవరి అదుపు, ఆజ్ఞలను లెక్క చేయని చంచల మనస్కులైన వానరుల నాయకులైన సుగ్రీవ హనుమలచే భక్తి పూజలు అందుకొనేవానిగా భావిస్తున్నారు.
3వ చరణం:
ఇంద్రనీలమణి సన్నిభ – అపఘన – చంద్ర సూర్యనయన అప్రమేయ – వాగీంద్ర జనక – సకలేశ – శుభ్ర నాగేంద్రశయన – శమనవైరి – సన్నుత.
అర్థం: శ్రీరాముని ప్రకృతి యొక్క ఎరుపు, నలుపు, తెలుపు, వర్ణాల మిశ్రమం – నీలకాంతి – ఛాయ గలవానిగాను (సత్త్వ, రజస్, తమో గుణాల) పూర్ణ బ్రహ్మ వస్తువై నిర్వికార, నిరుపాధికమైన ఉపాధిగల భగవానునిగా; సూర్యచంద్రులను కన్నులుగ చేసికొన్నవానిగా, బ్రహ్మదేవునకు తండ్రిగా ఉంటూ, ఆదిశేషునినే పర్యంకముగా కలవానిని గాను, మార్కండేయుని కారణంగా యమధర్మరాజుకు శత్రువైన శివుని స్తుతులు అందుకొంటున్న వానినిగాను త్యాగయ్య భావిస్తున్నారు.
4వ చరణం:
పాద విజిత మౌని శాప – సవ పరిపాల – వరమంత్ర – గ్రహణలోల – పరమ శాంత – చిత్తజనకజాధిప – సరోజ భవ వరద – అఖిల.
అర్థం: ఈ చరణంలో శ్రీమద్రాయణంలోని బాలకాండ చివరన ఉన్న సీతా కల్యాణం వరకు ఉన్న రామకథ విదితమౌతుంది. శ్రీరాముని పాద స్పర్శతో గౌతమ ఋషి భార్య, అహల్య శాపవిమోచనం పొందడం, యాగ సంరక్షణ సమయంలో విశ్వామిత్ర ఋషి నుండి, బల, అతిబల మంత్రాలను శ్రీరాముడు పొందడం; పొందిన బలంతో రాక్షస సంహారం చేయడం. సీతానాయకునిగాను, బ్రహ్మదేవునికి తండ్రిగా ఉంటూ, ప్రశాంతతతో అన్ని లోకముల వారి కోరికలను నేరవేర్చువానిగాను, త్యాగయ్యగారు శ్రీరాముని దర్శింప చేస్తున్నారు.
5వ చరణం:
సృష్టి స్థిత్యంతకారక – అమిత కామితఫలద – అసమానగాత్ర శచీ పతినుత – అబ్దిమదహర అనురాగ – రాగ రాజిత – కథా సారహిత.
అర్థం: సృష్టి స్థితి అంతకారక అనడంలో త్రిమూర్తులు, శ్రీరాముడు ఒకడే అని తెలుస్తుంది. పుట్టించడం, పోషించడం, నశింప చేయడాలను సమర్థవంతంగా నెరవేరుస్తూ, సేతుబంధన సమయంలో సముద్రుని అహంకారాన్ని అణచి, దయ, అభిమానం మొదలైన మంచి గుణాలతో ఉంటూ, రామాయణ మహాకావ్యానికి మూలమై, అందరకు మంచినే కలుగచేసే శ్రీరాముని త్యాగయ్యగారు దర్శిస్తున్నారు.
6వ చరణం:
సజ్జన మానసాబ్ధి – సుధాకర – కుసుమ – విమాన – సురసా – రిపు కరాబ్జ లాలిత చరణ – అవగుణా – సురగణ – మహారణ – సనాతన – అజనుత.
అర్థం: మంచి మనసులకు చంద్రునిలా చల్లని వెలుగులు ఇచ్చేవాని గాను, లంకా విశోషణం తర్వాత అయోధ్య చేరడానికి పుష్పక విమానాన్ని పొందినవాని గాను, సీతాన్వేషకై లంకకు వెళ్ళే త్రోవలో, ‘సురస’ అనే రాక్షస స్త్రీని నిర్జించిన ఆంజనేయుని చేతులతో పాదాలను అర్చించబడేవానిగాను, దుశ్శీలురైన రక్కసి మూకలను అణచినవాని గాను, అనాది నుండి ఉన్న బ్రహ్మచే నుతులు అందుకొనేవాని గాను శ్రీరాముని లక్షణాలను త్యాగయ్యగారు తెలియజేస్తున్నారు.
7వ చరణం:
ఓంకార పంజర కీర – పురహర – సరోజ – భవ – కేశవాది రూప – వాసవ – రిపు – జనకాంతక – కలాధర – కళాధరాప్త – ఘృణాకరం – శరణాగత జనపాలన – సుమనో రమణ – నిర్వికార – నిగమ సారతర.
అర్థం: శ్రీరామున్ని లోకాలన్నిటికి ఆధారమైన ప్రణవ నాద స్వరూపుగాను, జగత్తు అనే పంజరంలో చిలుకగా ప్రకాశిస్తున్న పరమాత్మగాను, ‘పర’ అనే రాక్షసున్ని నిర్జించిన శివుని గాను, బ్రహ్మ, విష్ణువు మొదలైన రూపాలున్నవాని గాను, ఇంద్రునికి శత్రువు, ఇంద్రజిత్తు తండ్రి అయిన రావణుని అంతమొందినవాని గాను, సర్వకళా మయునిగాను, చంద్రుని జటాజూటంలో ధరించిన శివునకు స్నేహితునిగాను, దయామయునిగాను, శరణు వచ్చిన వారికి ఆశ్రయం కల్పించేవానిగా; అందరిని కాపాడువానిగాను, సుగుణాలు కల దేవతలకు, నాయకునిగాను, వికృత లక్షణాలు లేనివానిగాను, వేదసారాలకు మించిన ప్రజ్ఞగలవాని గాను త్యాగయ్య భావిస్తున్నారు.
8వ చరణం:
కరధృత శరజాలా – అసురమదాపహరణా – అవనీసుర సురావన- కవీన బిలజమౌని కృత చరిత్ర – సన్నుత శ్రీ త్యాగరాజనుత.
అర్థం: త్యాగరాజస్వామి శ్రీరాముని, రాక్షసులను బాణపరంపరలతో చీకాకుపెట్టి ఓడించడాన్ని, బ్రాహ్మణులను, దేవతలను కాపాడువాని గాను, వాల్మికి ఋషిచే రచించబడిన శ్రీమద్రామాయణం మహా కావ్య నాయకునిగాను, శంకరునిచే స్తుతించబడువాని గాను, మనస్సులో దర్శిస్తున్నారు.
9వ చరణం:
పురాణ పురుష- నృవరాత్మజ – ఆశ్రిత పరాధీన – ఖర – విరాధ – రావణ విరావణ – అనఘ – పరాశర మనోహర – అవికృత – త్యాగరాజ సన్నుత.
అర్థం: ఈ చరణంలో త్యాగరాజు గారు ఖర, విరాధ, రావణుల ప్రస్తావన తెచ్చినందున రామాయణ కావ్యంలోని కథను బాలకాండ నుంచీ, రావణ సంహారం వరకు ఉన్న చరిత్రను క్లుప్తంగా సూచిస్తున్నారు. ‘నృవరాత్మజ’ అనడంలో ఉద్దేశ్యం రాముని దశరథమహారాజు కుమారునిగా చూపడం మరో విశేషం. శ్రీరాముని భక్త పరాధీనతను, భక్త వాత్సల్యాన్ని తెలియజేస్తూ కళంకరహితునిగ, పరమపావనునిగ, మంచి లక్షణాలు కలవాడై, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా ఉంటూ శివుని స్త్రోత్రాలు అందుకొంటు, పరాశరమునికి (పరాశరుడు రఘువంశకుల గురవైన వశఇష్టన పౌత్రు శివారాధకుడు, మత్స్యగంధి వలన వ్యాసుని పుత్రునిగా పొందినవాడు) సన్నిహితుడు అంటున్నారు.
10వ చరణం:
అగణిత – గుణ – కనక చేల – సాల విదళన – అరుణాబ్జ – సమాన – చరణ – అపార మణిమాద్భుత – సుకవిజన – హృతసద – సుర మునీగణ – విహత – కలశ – నీర నిధిజా – రమణ – పాపగజ – నృసింహ వర – త్యాగరాజాధినుత.
అర్థం: శ్రీరామున్ని సర్వ సద్గుణ సంపదలతో – బంగారు వస్త్రాలు ధరించిన వానిగాను. వాలి సంహార సమయంలో సాలవృక్షాలను భేదించింన వానిగాను; అరుదైన ఎర్రని కాంతులీను పాదములున్న వానిగాను, అద్భుత శక్తిమంతుడుగాను, మంచి హృదయాల్లో భావించబడేవాని గాను, దేవతలకు ఋషులకు ఎల్లప్పుడు పాతము గల్గించే వానిగాను; ఫాల సముద్రంలో పుట్టిన లక్ష్మేదవికి భర్తగాను, పాపము అనే ఏనుగుకు సింహస్వప్నమైనవాని గాను, పవిత్రమైన శివుడు మొదలగు దేవతులచే స్తుతించబడువాని గాను త్యాగయ్య భావిస్తున్నారు.
ఈ చరణంలో ఇంకొక అర్థం కూడా గోచరిస్తుంది. “సుర – ముని- గణ – విహిత కలశ” అనడం వలన శ్రీరామ పట్టాభిషేక సమయాన దేవమునులు స్వర్ణకలశాలతో వేదోక్తంగా అభిషేకం చేయడం గోచరిస్తుంది. ఈ కీర్తనలో సర్వదేవతామూర్తిగా శ్రీరాముని కీర్తించుటచే విఘ్నేశ్వరుడు, సరస్వతి మున్నగు ప్రారంభ సమయంలో చేసే దేవతా స్తుతులన్నీ ఇందు ఇమిడినట్లు తోస్తుంది.
సాల విదళన గురించి సంక్షిప్త వివరణ:
రాజ్యభ్రష్టుడైన సుగ్రీవుని కోరిక మేరకు శ్రీరాముడు వాలిని సాలవృక్షం చాటునుండి బాణం వేసి చంపాడు. వాలితో ఎవరైనా ఎదురుగా నిలబడి పోరాడితే, పోరాడినవారి బలంలో సగము వాలికి చేరేట్లు వారికి వరం ఉంది. ఈ కారణంగా శ్రీరాముడు వాలిని చాటు నుండి చంపాడు.
సీతాన్వేషణ సమయంలో ఋష్యమూక పర్వతంపై హనుమ, జాంబవంతుడు, మున్నగు మంత్రులతో వానరరాజు సుగ్రీవుడు ఉన్న సమయంలో అటుగా వచ్చిన శ్రీరామ లక్ష్మణులతో స్నేహం చేయగా శ్రీరాముడు సుగ్రీవుని అన్న వాలిని సంహరించి, సుగ్రీవునికి తాను పోగొట్టుకొన్న రాజ్యాన్ని ఇప్పిస్తాను అనగా సుగ్రీవుడు శ్రీరాముని బలపరాక్రమాలను సందేహించాడు. సుగ్రీవునికి విశ్వాసం కలిగించడానికి ఏడు సాలవృక్షాలను ఒకే బాణంతో ఛేదించి సుగ్రీవుని సందేహాన్ని తీర్చాడు.
(సశేషం)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
