Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-9

[త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.]

అధ్యాయం 4 త్యాగరాజు – పంచరత్నములు – 5వ భాగము

నాట:

త్యాగయ్యగారి ఘనరాగ పంచరత్నములని ప్రసిద్దికెక్కిన వాటిలో మొదటి రత్నము  ‘జగదానంద కారక’ అనునది. ఇది అంతయు ప్రగల్బ సంస్కృతమయము. ఇందు వృత్యానుప్రాసాది శబ్దాలంకారములు మెండు. “సుధామయ – వచో బృంద గోవింద సానంద – మా వర -అజర – ఆప్త – శుభకర;  సృష్టి స్థిత్యంతకారక – అమిత కామితఫలద అబ్దిమదహర అనురాగ – రాగ రాజిత; సురసా – రిపు కరాబ్జ లాలిత చరణ – అవగుణా – సురగణ – మహారణ – సనాతన – అజనుత” ఇట్టి శబ్దాలంకారములు శ్లోకమందుగాని గద్యమందు గాని యుండిన వాటి స్థితి సామాన్యముగా వుండును. ఇచ్చట గేయమగుటచే రాగ తాళాది ప్రక్రియలతో మరింత ఈ అలంకారములు మృదంగ ధ్వనుల వలె చెవికి తాకును. ఈ రత్నమునందు త్యాగయ్యగారి చేసిన ప్రయోగములు కొన్ని ప్రత్యేకంగా వుండును.  “అమర – తారక – నిచయ – కుముద హిత” దేవతలందు నక్షత్రములు, ఆ నక్షత్రములతో రాముడు చంద్రుడట. ఈ ఔపప్యము సాధారణమే కాని పదముల కూర్పునందు ప్రత్యేకత కలదు. ఇందే ‘దధిప మోదిహస హరణ’  శబ్దమున అర్థము పెరుగు పాలకుండలు హరించిన వాడా (కృష్ణావతారమున) అని; దధి – పెరుగుకు పయరి – పాలకు అధివాస – నివాసము లయినవి. అనగా కుండలు వాటిని హరించిన వాడా. అని చిన్న మాటలో చెప్పాలంటే – “నవనీతచోరా” అంటే చాలు. దానిని తగినంతగా సాగదీయట చేత నది ఫలనపూర్వ ప్రయోగమయినది.

ఈయన సంస్కృత రచనలన్నియు గానానుగుణముల సరళత్వంతో భావ సంపదతో అంత్యానుప్రాసాది నియమములతో అలరారు చుండును.

ఇవి కాక సంస్కృత చూర్ణిక ఒకటి త్యాగయ్యగారిది కలదు.

చూర్ణికా: సకల నిగమాగమ, కిన్నర, కింపురుష, సకల సురముని, నికర, భక్తజన నిచయ హృదయ జగదానంద మొదలైన పదాలు.

నాట: పంచరత్నంలో మొదటి స్వరము (చరణం)

 “ససనిపా, మపససరిస సమమరి

అమర తారక నిచ యకుముదహాత”

అని పాత కాలం నుంచి అంతా పాడుతూ వస్తున్నారు. ఇందులో ఒక దోషం ఉంది. సాహితీపరమైంది. ‘అమరతారక’ అనే దానిలో ‘క’ను హ్రస్వంగా పాడుతున్నాం అది తప్పు. ‘అమరతారకాని చయా’ అని ఉండాలి. దీని అర్థం – అమరులనే నక్షత్రములలో చంద్రుడా అని సంబోధన. ‘తారకా’ శబ్దం ఆకారాంత స్త్రీలింగం. అప్పుడు హ్రస్వం పాడితే తప్పు. ‘కా’ అని దీర్ఘమే పాడాలి. సంగీతంలో ఎలా అయితేనేల అనుకోకూడదు. ఎవరో ఎప్పుడో పాడటంలో ప్రమాదం చేతనో క్రొత్త ప్రయోగమనో ‘తా’లో మూడు మాత్రలు  వేశారు. దానితో ‘క’ హ్రస్వం చేసుకోవలసి వచ్చినది. అది సంప్రదాయం అయి ‘శతాంధాః కూపం ప్రవిశం’ అన్నట్లు పాడేస్తూ ఉన్నాం. సంగీత శాస్త్రంలో ఛందస్సు విషయంలో అహోబల పండితుడు ఇలా చెప్పాడు – పాటలో తాళనుసారంగా హ్రస్వాక్షరం దీర్ఘం కావచ్చు కాని, దీర్ఘాక్షరం హ్రస్వం కాకూడదు. అని దీనిని అనుసరించి మన పాటలతో హ్రస్వాలు దీర్ఘాలుగా అవటం చాలా కృతులలో ఉంది. కాని దీర్ఘం హ్రస్వం కావటం లేదు. మరి త్యాగయ్యగారు ‘తారకా’ అనే దానిని ‘తారక’ గా ప్రయోగించాడు. అప్పుడు లక్షణ భంగం కాని శబ్దవేత్త కాడని అనుకోవలసి వస్తుంది. అది న్యాయమా? మరి పరిష్కారమేల – ఇలా ‘ససనిపాప – మపససరిససమమరి’, అమరతార కా నిచయకుముదహిత – అనే పరిష్కారం యుక్తం. ఈ పరిష్కారంతో ఆ మొదటి దాన లయం బిగివుంది. ‘కా’ అని దీర్ఘాక్షరం అయినది, దోషం తొలగినది.

***

నాట రాగం ‘జగదానందకారక’ – సంగీత – సాహిత్యపు విశ్లేషణ

సంబోధనా రూప కృతి. ఆహ్వాన కృతి. స్త్రోత్రరూప కృతి. సాంప్రదాయానుసారంగా అది నాటతో ఆరంభించేరు. సాహిత్యం అంతా విశేషణాలే. ఈ లక్షణాలతో భావయుక్తంగా ప్రకటించడానికి వీరరస భావాన్ని పోషించే ‘నాట’ రాగాన్ని ఎన్నుకొన్నారు. రాముడు సర్వలక్షణ సమన్వితుడు. అనంత కల్యాణ గుణ పరిపూర్ణుడు. జగదానందకారుడు. జగత్పిత, జగత్పతియైన అభిరామ రాముని పరమాత్మునిగా సంభావించుకొనినారు త్యాగయ్య. ఇట్టా ఉదాత్త గంభీర భావనలను ద్విగుణీకృతం చేయడానికి ‘నాట’ రాగం అన్ని విధాలా సరిపోయింది. ఈ కృతికి సాహిత్యం, సంస్కృతం. అది దేషభాష కదా. అన్ని విశేషణాలను దేవభాష అర్థవంతంగా మధుర గాంభీర్యంగా పోషించగలదనే సాంప్రదాయపు నమ్మికతో అదీగాక పంచరత్న కృతులలో మొదటి కృతి అనే భావంతో ఈ కృతికి మాత్రం సంస్కృత భాషను మాతువుగా ఎన్నుకున్నారు. ఇందులో అర్థవంతమైన సమాసాలు కొన్ని గమనించవచ్చు.

గగనాధి సత్కులజ, నిమగమనీరజ, బిలజమౌని సత్కని హృదయాలయా మనోజ్ఞామైన విశేషణాలు.

సుర – సుర – భూజ – కామిత, కామిత, రావణ – విరావణ – కలాధర – కలాధరాప్త – చక్కని అలంకారాలు.

 ఈ కృతిలో ప్రతి పదానికి ముందు ‘ఓం’, చివర ‘నమః’ అని చేర్చితే అష్టోతర శతనామావళి అవుతుంది.

ఉదాహరణ:

ఓం జగదానంద కారకాయై నమః

ఓం జయ జానకీ ప్రాణనాయకాయై నమః

రాగములో మధ్యమం తప్ప మిగిలిన స్వరాలు తీవ్రమైనవి. కనుక గంభీర భావాలని ఉదాత్తంగా చూపినవి. షడ్జ – పంచమం – పైషడ్జములపై – రచనా విభాగాలు ఆరంభమయ్యయి.

4, 7, 10 ముద్ర చరణాలు. 1, 5, 8, 9 షడ్జమంతో; 3, 4, 6, 7, 10 పంచమంతో; 2వ చరణం పైషడ్జమంతో ఆరంభించబడినది. పల్లవికీ, అనుపల్లవికి సంవాది సంబంధం.

1,2 చరణాలు స్థాయి ఆ తరంతో ఆరంభం

3వ చరణంలో ‘పా ని పా ని ప మ మా ప మా ప మ గ’ అనటంలో గా మ గామ రిస – నిసగామపా- లయ చిత్రం.

4లో మరిససా – పమరిసా – నీపాపమరిసా గోపుచ్ఛయతి.

5లో మరీ- పమరీ – నిపమరీ – సనిపమరీ- గోపుచ్ఛయతి.

7వ చరణంలో పపాని – పమనిప – మమాప – మగమరి – సరిస – మరిపమ – నిపావు గమపనితో  swinging. ఊపు రాగ భావం – లయ సోగసు.

8వ చరణంలో నిపా – సనిపా రిసనిపా మరిసనీపా – శ్రోతవహ యతి.

ఘనరాగ పంచరత్న కీర్తనలు సాహిత్య భావం  – Venkata Sree Ramulu

Nata- జగదానందకారక – ఆది

పల్లవి భావం:

నాదబ్రహ్మ త్యాగయ్యగారు ‘సీతాప్రాణవల్లభుడు, లోకముల కానందము కల్గించువాడు అయిన శ్రీరామచంద్రునికి ‘జయ’ అని మంగళాశాసనము చేస్తున్నాం.

అనుపల్లవి భావం:

రామచంద్రుడు ఎట్ట ఎదుటకు వచ్చి నిలుచున్నాడు. వానిని ఇలా తన్మయుడై సంబోధిస్తున్నాది. సూర్య వంశ సంజాతా రాజాధిరాజా! సద్గుణాలయ! దేవతలచే సేవింపబడువాడా! మంగళదాతా! ఎప్పుడు చిత్కళతో గూడినవాడా!

1వ చరణం భావం:

దేవతా నికరములనెడి నక్షత్రములకు చంద్రుడైన వాడా! పరిపూర్ణరూపా! పుణ్యాత్మా! దేవతలకు కల్పవృక్షమైన వాడా! పెరుగుకుండలు, పాల కుండలు దొంగిలించువాడా!

2వ చరణం భావం:

అందమైన ముఖము గలవాడా! అమృతమైన వాక్కులు గలవాడా గోవిందుడా! ఆనందముతో గూడిన వాడా! లక్ష్మీనాథా! ముసలితనము లేని వాడా! ఆప్తులకు శుభములు గూర్చువాడా! అనేక వేదములను పద్మముల యందలి పారామృతము పోషించువాడా!

రాక్షసులను మేఘములకు వాయువు వంటి వాడా!   గరుత్మంతుడు రాహనుగా కలవాడా ! సత్కరేశఅవరుల హృదయమందు ఉండువాడా! అనేక వానరులకు నాయకుడైన సుగ్రీవునిచే నమస్కరింపబడిన పాద ద్వంద్వము గలవాడా!

3వ చరణం భావం:

ఇంద్రనీలమణుల కాంతితో సమానమైన కాంతిగల ఇంద్రియములు గలవాడా! చంద్రసూర్యులు నేత్రములుగా గలవాడా! అమోఘమన ప్రభావము గలవాడా! బ్రహ్మకు తండ్రియైన వాడా! సర్వధినాయకా! పవిత్రుడా! ఈశ్వరనుతా!

6వ చరణం భావం:

పాదముచే గౌతమి శాపమును జయించినవాడా! యజ్ఞమును రక్షించినవాడా! ఉత్తమములైన మంత్రములు గ్రహించటం అందు ఆసక్తి గలవాడా! మిక్కిలి శాంతమైన మనస్సుగలవాడా, సీతా నాయకా! బ్రహ్మకు వరకు విచ్చెన వాడా! సృష్టి, స్థితి సంహారముల కన్నింటిని చేయువాడా! అనేకమైన కోరిలను తీర్చువాడా! సాటి లేని శరీరము గలవాడా! ఇంద్రునిచే నుతింపబడువాడా! గుణ సముద్రా! పుష్పక విమానము గలవాడా! హనుమంతునిచే పూజింపబడు  పాదముల గలవాడా! రాక్షసుల మదము హరించువాడా! ఆదిపురుష బ్రహ్మచే స్తుతింపబడువాడా!

9వ చరణం భావం:

ఓంకారమును పంజరమున నుండు చిలుకా! శివ బ్రహ్మ కేశవాది రూపములు గలవాడా! ఇంద్రజిత్తు తండ్రి యగు రావణుని చంపినవాడా! శివునికి హితుడైనవాడా! దయానిధీ! శరణు పొందిన వారిని పాలించువాడా! దేవతలకు హితుడా! వితృతి లేనివాడా! వేదసారమైన వాడా!

10వ చరణం భావం:

చేతబట్టిన బాణ పరంపరంచే రాక్షసుల గర్వమును హరించిన వాడా! బ్రహ్మణులను దేవతలను కాపాడు వాడా! కవీశ్వరుడైన వాల్మీకిచే రచింపబడిన చరిత్ర కలవాడా! సజ్జనులచే సుతింప బడువాడా! శ్రీ త్యాగరాజుచే సుతింప బడువాడా!

ఆది పురుషా! దశరథతనయా! ఆశ్రితులకు వశమైనవాడా! ఖరునీ, విరాధుని రావణుని చంపినవాడా! పుణ్యాత్ముడైన పరశురునీవలె మనోహరుడైన స్థిరుడైన త్యాగరాజుచే స్తుతింపబడువాడా!

అనేక గుణములు గలవాడా! బంగారు రంగు వస్త్రముదాల్చిన వాడా! సప్తసాలములను ఛేదించిన వాడా! ఎర్రని పాదముల వాడా! అనంత మహిమలచే అబ్బరమైన వాడా  సుకవుల హృదయము లందుండు వాడా! దేవతలకు మునులకు హితవు కోరు వాడా! క్షీర సాగర కన్యమైన లక్ష్మికి నాధుడు పాపములను ఏనుగులకు సింహము వంటి వాడా!త్యాగరాజుచే స్తుతింపబడు రామచంద్రా! జయము.

***

Nata – Adi -Meaning by Hari Achyuta Ramasastry

Pallavi:

Jagada Nanda karaka, Jaya Janaki prana Nayaka –

సీతమ్మ భర్త అయిన రామా! జగత్తుకు ఆనందం సౌఖ్యం జేకూర్చు రామా!

అనుపల్లవి:

గగనాధిప – సత్కులజా – రాజరాజేశ్వర  సుగుణాకర – సురసేవ్య – భవ్యదాయక – సదా సకల

సూర్యవంశంలో జన్మించిన రామా!  రాజులకు రాజైన ఈశ్వరా రామా! సుగుణాల అలవాలమైన రామా! దేవతలచే చేవింపబడిన రామా! ఎప్పుడు మంగళములిచ్చువాడా!

1వ చరణం:

అమరతారక, నిచయ, కుమదహిత – దేవతలనే నక్షత్ర సముహానికి చంద్రుడైన వాడు

పరిపూర్ణ – స్వసంపూర్ణమైన వాడు, అంతటా నిండినవాడు

అనఘ – పాపరూపుడు; పాపాలు హరించువాడు, పుణ్యపురుషుడు

సుర, సుర భూజ – దేవతలకు కల్పవృక్షమైన  వాడా, కోర్కెలు తీర్చేవాడా

దధి, ఫయోధి, వాస హరణ – పెరుగు, పాల కుండలను దొంగిలించేవాడా (కృష్ణా)

సుందరతరవదన – మిక్కిలి అందమైన ముఖము కలవాడా

సుధామయ వచో బృంద – అమృతమయమైన వాక్కులు కలవాడా (తీయని మాటలు చెప్పువాడా)

గోవింద – వేదాలలో తెలియదగిన వాడు

సానంద – సర్వదా ఆనందంతో గూడివాడా

మావర – లక్ష్మీ దేవికి భర్త,

అజరాప్త – ముసలితనం లేని దేవతలకు ఆప్తుడైనవాడా

శుభకర – సర్వదా శుభములు కలిగించువాడు మంగళకరుడు

2వ చరణం:

నిగమ నీరజామృతజ పోషక – వేదరాశియే ఒక పద్మం, అమృతం నుండి పుట్టిన బ్రహ్మను పోషించేవాడా (జనకుడు)

అనిమిష వైరి, వారధ, సమీరణ- దేవతలకు విరోధులైన రాక్షసులనే మేఘాలను చెదరగొట్టే వాయువు అయినవాడా.

ఖగ తురంగ – గరుడ పక్షి వాహనంగా కలవాడా,

సత్కవి హృదయాలయ – మంచి కవుల హృదయాలే నిలయంగా

అగణిత వానరాధిప  నతాంఘ్రియంగ – లెక్కలేని వానరుల కధిపతులైన వాలి, సుగ్రీవ, హనుమదాదులచే  సేవింపబడిన పాదయుగమం కలవాడా.

3వ చరణం:

ఇంద్రనీలమణి సన్నిభాప ఘన – ఇంద్రనీలమణులతో సమానమైన కాంతి గల శరీరము గలిగినవాడా.

చంద్రసూర్యనయన – చంద్రసూర్యులిద్దరు కన్నులుగా కలవాడా

అప్రమేయ – ఇంత అంత అని చెప్పనలవికానివాడా,

వాగింద్రజనక – సరస్వతికి భర్త అయిన బ్రహ్మకు తండ్రి అయిన వాడా.

సకలేశ – సమస్తలోకాలకు ప్రభువైన వాడా

శుభ్ర – నాగేంద్రశయన – స్వచ్చమైన ఆదిశేషుడే పాన్పుగా కలవాడా

శమనవైరి – సన్నుత – (మార్కండేయుని విషయంలో) యమునికి వైరి అయిన శివునిచే స్తుతింపబడినవాడా.

4వ చరణం:

కరధృత శరజాలా – చేత ధరించిన అనేక బాణములు కల్గినవాడా

అసురమదాపహరణా – రాక్షసుల ఉక్కడగించిన వాడా

అవనీసుర సురావన – భూసురులను, సురులను రక్షించువాడా

కవీన బిలజమౌని కృత చరిత్ర సన్నుత – ఆదికవి వాల్మీకిచే రచించబడిన రామాయణ చరిత్రలో పొగడబడిన వాడా ఓ రామా

శ్రీత్యాగరాజనుత – త్యాగరాజు చే స్తుతింపబడిన రామా

5వ చరణం:

సృష్టి స్థిత్యంతకారక – సృష్టి స్థితి, లయములను చేయవాడా

అమిత కామితఫలద – అంతు లేని కోర్కెలను తీర్చువాడా

అసమాన గాత్ర – సాటి లేని శరీరము కలవాడా

శచీ పతినుత – ఇంద్రునిచే స్తుతింపబడిన వాడా

అబ్దిమదహర  – సముద్రుని గర్వమణచిన వాడా

అనురాగ రాగ రాజిత – కథా సారహిత – వాత్సల్య ప్రేమలచే ఒప్పుచున్న సారవంతమైన చరిత్రచే హితుడయిన వాడా.

6వ చరణం:

పాద విజిత మౌని శాప – అహల్యకు తన పాదరజము చేత గౌతమ శాపము పోగొట్టిన వాడా.

సవ పరిపాల – యజ్ఞరక్షకుడా, విశ్వామిత్రుని యజ్ఞమును రక్షించినవాడా.

వరమంత్ర – గ్రహణలోల – ఇతరుల ఆలోచన, సంప్రదింపులను స్వీకరించుట యందు ఆసక్తి కలవాడా. (లేదా) బల, అతి బలాది మహా మంత్రములను గ్రహించుటలో ఆసక్తి కలవాడా

పరమ శాంతచిత్త – మిక్కిలి ప్రశాంతమైన మనసు కలవాడా.

జనకజాధిప – జనకపుత్రిక సీతమ్మకు భర్త అయిన వాడా.

సరోజ భవ వరద – పద్మభవుడైన బ్రహ్మకు వరములిచ్చువాడా.

7వ చరణం:

పురాణ పురుష – ఆద్యంతాలు లేని ఆత్మ స్వరూపుడు.

నృవరాత్మజ – దశరథమహారాజా పుత్రుడా.

ఆశ్రిత పరాధీన – నిన్నాశ్రియించిన వారికి కొంగు బంగారమైన వాడా.

ఖర – విరాధ – రావణ విరావణ -ఖర, విరాద, రావణాదులను వధించినవాడా.

అనఘ – పుణ్యపురుషుడా

పరాశర మనోహర – పరాశరుని మనస్సు ఆకర్షించిన వాడా

అవికృత – ఎలాంటి షట్ వికారములు (మార్పులు) లేనివాడా.

త్యాగరాజ సన్నుత – త్యాగరాజుచే నుతింపబడిన వాడా.

8వ చరణం:

సజ్జన మానసాబ్ధి – సుధాకర – సత్పురుషుల మనస్సునెడి సముద్రానిక చంద్రుడైన వాడా

కుసుమ విమాన – పుష్పక విమానం కలవాడా.

సురసా – రిపు కరాబ్జ లాలిత చరణ – సురసకు శత్రువైన హనుమంతుని కరారవిందాలచే గౌరవించబడిన పాదములు కలవాడా.

అవగుణా – సురగణ – మహారణ – చెడుగుణముల మదమణచువాడా

సనాతన – ఆద్యంతాలు లేని పురాతనుడా.

అజనుత – బ్రహ్మచే స్తోత్రము చేయబడు వాడా

9వ చరణం:

ఓంకార పంజర కీర – ఓంకారమనెడి పంజర మందుండు చిలుక అయిన స్వామి, ప్రణవమే పరబ్రహ్మ అనే పంజరం పంజరంలో వున్న చిలుకయే ఆత్మ. అదే ఆత్మ.

పురహర – సరోజ – భవ – కేశవాది రూప – శివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన సర్వరూపములు తానయిన వాడా.

వాసవ – రిపు – జనకాంతక – ఇంద్రుని శత్రువైన ఇంద్రజిత్తు యొక్క తండ్రియగు రావణుని అంతమొందించినవాడా.

కళాధర – సర్వకళలను ధరించాడు

కళాధరాప్త – శివునికి ఆప్తుడైన వాడు.

ఘృణాకరం – కరుణాకర

శరణాగత జనపాలన – శరణువేడిన వారిని కాపాడెడివాడా.

సుమనో రమణ – వేదముల యొక్క సారభూతమైన ఉపనిషత్తు స్వరూపుడు.

10వ చరణం:

అగణిత గుణ – లెక్కలేనన్ని సద్గుణములు కలవాడు

కనకచేల – బంగారు వస్త్రం ధరించినవాడా.

సాలవిదళన – మద్ది చెట్లను విరుగగొట్టిన వాడా (కృష్ణుడు)

అరుణాబ్జ సమాన చరణ – అరుణని కాంతితో సమానమైన కాంతి గల పాదములు కలవాడా.

అపార మహిమాద్బుత – అంతు లేని మహిమలచే అద్భుతమైన వాడా.

సుకవిజన – హృతసద – సత్కవుల హృదయమే నిలయంగా కలవాడా

సుర మునీగణ – విహత – దేవ, ఋషి, బృందము చేత సేవింపబడువాడా.

కలశ – నీర నిధిజా –  రమణ – పాలసంద్రంలో పుట్టిన లక్ష్మిని చేపట్టిన వాడా.

పాపగజ – నృసింహ – పాపాలనెడి ఏనుగుల పాలిట నరసింహమైన వాడు.

(సశేషం)

Exit mobile version