“ఇవాళ నువ్వు మాకు మందుపార్టీ ఇవ్వవలసిందే!” అంటూ స్నేహితులు పట్టుపట్టడంతో, “ఫెయిల్యూర్‌కి పార్టీ ఏమిట్రా, ఇడియట్స్?” అన్నాడు బుచ్చిబాబు విసుగ్గా.
“ఫెయిల్యూర్‌కి కాదు గురూ! సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్. నీ పెళ్ళిచూపుల రజతోత్సవం!” అన్నాడు ఓ స్నేహితుడు. బుచ్చిబాబుకు ఒళ్ళు మండిపోయింది. “దుర్మార్గులారా! పాతికవ పెళ్ళిచూపులు కూడా హుళక్కి అయిపోయిందని నేను ఏడుస్తూంటే… మీరు సెలెబ్రేట్ చేసుకుంటారా?” కోప్పడ్డాడు.
“పెళ్ళిచూపుల సిల్వర్ జూబ్లీ అంటే ఆషామాషీ కాదు” అన్నాడు రెండో మిత్రుడు.
“నువ్వు కాదంటే, ఈ సమాచారం ఇప్పుడే గిన్నీస్ బుక్‌కి పంపించేస్తాం” బెదిరించాడు మూడోవాడు.
“పార్టీయా, గిన్నీస్ బుక్లో ఎంట్రీయా? డిసైడ్ ఫాస్ట్…” అల్టిమేటమ్ ఇచ్చేసాడు నాలుగో మిత్రుడు.
నుదురు బాదుకున్నాడు బుచ్చిబాబు. “నేను మందు త్రాగను కదురా!”
“మేం త్రాగుతాం కదా!” ముక్తకంఠంతో అన్నారంతా.
బుచ్చిబాబు లొంగక తప్పలేదు. స్నేహితులు జోక్ చేసుకుంటూ చేపల్లా త్రాగుతూంటే, తాను మాత్రం దిగాలుగా సాఫ్ట్ డ్రింక్ సిప్ చేస్తూ కూర్చున్నాడు.
“అలా దేవదాసు ఫేస్ పెట్టకు. ఆముదం త్రాగుతూన్న ఫీలింగ్ వస్తోంది మాకు,” అని ఒకడంటే,
“డోంట్ వర్రీరా. బెటర్ లక్ నెక్ష్ట్ టైమ్!” అన్నాడు మరొకడు.
“గోల్డెన్ జూబ్లీ ఇంతకంటే ఘనంగా ఉండాలి సుమా. ఇప్పుడే చెప్పేస్తున్నాను!” అన్నాడు ఇంకొకడు.
వారి వంక గుర్రుగా చూస్తూంటే, బుచ్చిబాబు మదిలో క్రితంరోజు జరిగిన ఇరవయ్ ఐదవ పెళ్ళిచూపుల ప్రహసనం మదిలో మెదిలింది…..
*
“పెళ్ళిచూపులు మీ హాబీయా?” అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది ఉమాదేవి.
“అదేమిటండీ, పుసుక్కున అలా అడిగేసారు?” అన్నాడు బుచ్చిబాబు తెల్లబోతూ.
“మీకు ఇది ఇరవై ఐదవ పెళ్ళిచూపులటగా! అందుకే అలా అడిగాను” అందామె.
“మనం షాపింగుకు వెళ్ళామంటే నాలుగురకాలూ చూసి మనకు నచ్చిందీ ముచ్చటపడిందే కదండీ సెలెక్ట్ చేసుకుంటాం?” అన్నాడు బుచ్చిబాబు, తెలివిగా మాట్లాడాననుకుని మనసులోనే భుజం చరచుకుంటూ.
“అంటే… ఆ ఇరవై నలుగురు అమ్మాయిలూ మీకు నచ్చలేదన్నమాట!?” అందామె. “అంతమంది అమ్మాయిలు మీకు నచ్చలేదంటే… మీలో ఏదైనా లోపం ఉందేమో ఆలోచించారా?”
“అబ్బేఁ…అందరూ నాకు నచ్చలేదని కాదు…” తడబడ్డాడు.
“అంటే, వాళ్ళకే మీరు నచ్చలేదన్నమాట!” అంది గడుసుగా.
జవాబు చెప్పలేక ఉక్కిరిబిక్కిరయిపోయాడు బుచ్చిబాబు.
“మీకు గాళ్ ఫ్రెండ్ ఉందా?” అని అడిగింది.
తల నిలువుగానూ అడ్డంగానూ ఊపేసాడు బుచ్చిబాబు.
ఫక్కుమందామె. “మీ వాలకం చూస్తేనే తెలుస్తోంది లెండి, దద్ధోజనం అని!”
“కమ్ ఎగైన్…” అన్నాడు అర్థంకాక.
నవ్వేసిందామె. “పెళ్ళిచూపులకు ఇలా కాజ్యువల్స్‌తో వచ్చారంటే, మీకు డ్రెస్ సెన్స్ లేదని తెలుస్తోంది. ఆఫీసు, ఇల్లు తప్ప ఇతరత్రం తెలియదంటున్నారు. అమ్మాయిలు కనిపిస్తే తల దించుకుంటారు. ఆకాశంలోని మబ్బులు తప్ప క్లబ్బులు, పబ్బులూ ఎరగనంటున్నారు. మందు అలవాటుందా అనడిగితే, ఎప్పుడైనా తలపోటుగా ఉంటే శారిడాన్ మాత్రలు మింగుతానంటున్నారు. సిగరెట్ బ్రాండ్స్ అసలే తెలియవు…ఇన్ని అవలక్షణాలు ఉన్న మిమ్మల్ని పెళ్ళి చేసుకునేందుకు ఏ మోడర్న్ గాళ్ ముందుకు వస్తుందండీ?!…”
బుర్ర గోక్కున్నాడు బుచ్చిబాబు. అవన్నీ అవలక్షణాలన్న సంగతి అంతవరకూ ఎరుగడు.
“నేను ఆల్రెడీ ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను…” చల్లగా మెల్లగా చెప్పిందామె.
2
బుచ్చిబాబు ముప్పయ్యోపడిలో పడి మూడేళ్ళయింది. చూపులకు బాగానే ఉంటాడు. ఎమ్.టెక్. చదివాడు. ఓ కార్పొరేట్ కంపెనీలో దాదాపు లక్షరూపాయల జీతం. తండ్రి లేడు. తల్లి ఉంది. వారి యోగక్షేమాలను విచారించే మేనమామా ఉన్నాడు. బుచ్చిబాబుకు అన్ని అర్హతలూ ఉన్నా, కట్నం కోరకపోయినా, ఒక్క సంబంధమూ కుదరకపోవడం ఆశ్చర్యం గొలుపుతోంది.
బుచ్చిబాబు కొలీగ్ ఆనందలక్ష్మికి ఇంచుమించు అతని వయసే ఉంటుంది. అతను పెళ్ళిచూపులకు వెళ్ళొచ్చిన ప్రతిసారీ ఆమే చూసే జాలిచూపులూ, చేసే కామెంట్లూ తట్టుకోలేక ఆ రోజంతా ముఖానికి ఫైల్ ఫోల్డర్ అడ్డుపెట్టుకుని తిరుగుతుంటాడు.
బుచ్చిబాబు బాస్ ఎందుకో సెక్షన్‌కి వచ్చాడు. “ఏమోయ్, బుచ్చిబాబూ! నీ ట్వెంటీఫిఫ్త్ ఎటెమ్ట్ కూడా ఫట్ మందటగా! డోంట్ వర్రీ. దేరీజ్ ఆల్వేస్ ఎ నెక్స్‌ట్ టైమ్…” అంటూ ఫకాలున నవ్వేసి, అతని భుజం తట్టి వెళ్ళిపోయాడు.
ఆనందలక్ష్మికి అమ్యూనిషన్ దొరికినట్టయింది. “ఏం, బుచ్చిబాబూ! పాతికో పెళ్ళికూతురు కూడా రిజెక్ట్ చేసేసిందా ఏమిటీ?” అనడిగింది, ఏమీ ఎరుగనట్టు.
“ఆమె నన్ను రిజెక్ట్ చేయలేదు. నేనే తనను ఇజెక్ట్ చేసేసాను నా ప్రపోజల్ లోంచి,” అన్నాడు హాటీగా.
“ఏ రాయి అయితేనేంలే, పళ్ళూడగొట్టుకోవడానికి!” వ్యంగ్యంగా అందామె. “నా మాట విని…నువ్వు లింగమార్పిడి చేయించేసుకో. కుర్రాళ్ళు ఎగబడి నిన్ను పెళ్ళాడకపోతే నన్నడుగు” అంది వస్తూన్న నవ్వును ఆపుకుంటూ.
“నేను కాదు, మీ ఆయనకు చేయిస్తాను…లింగమార్పిడి!” కసిగా అన్నాడు.
“ఓరి దుర్మార్గుడా! నీకు పెళ్ళవడంలేదని, కుళ్ళుతో నా కాపురం కూలదొయ్యాలనుకుంటున్నావా!” అందామె కోపంగా. “ఇదే నా శాపం! ఇంకో పాతిక పెళ్ళిచూపులు జరిగినా నీకు పెళ్ళి అవదుగాక!”
“ఏడ్చావులే! ఐ పిటీ యువర్ హస్బెండ్. పాపం, నీలాంటి పిశాచిని ఎలా భరిస్తున్నాడో మానవుడు!” కోపం ఆపుకుంటూ అక్కణ్ణుంచి తప్పుకున్నాడు బుచ్చిబాబు.
‘సచ్చినోడు!’ అని తిట్టుకుందామె, మెటికలు విరుస్తూ.
*
టీవీలో ఏదో యాడ్‌ని చూస్తూన్న బుచ్చిబాబు బుర్రలో హఠాత్తుగా లైట్ వెలిగింది… మ్యారేజ్ బ్యూరోలు చూపించిన సంబంధాలు కలసిరావడంలేదు తనకు. గూగుల్‌లో ‘పాలపీక నుండి పడచుల’ వరకు లభిస్తాయంటారు. ‘వధువు కూడా దొరకవచ్చునేమో!’ అనుకుంటూ, గూగుల్ సెర్చ్‌కి పూనుకున్నాడు.
‘ట్వెంటీ-ఫిఫ్త్ సెంచురీ జాకల్స్’ అన్న వెబ్ సైట్ తగిలింది. ‘మెయిల్ ఆర్డర్ బ్రైడ్’ పోర్టల్ అది! కోరుకున్న వధువులను ‘సెట్’ చేయడం కోసం ఔత్సాహిక యువకులు కొందరు ‘జాకల్స్’ పేరుతో ఆ వెబ్ సైట్‌ని సృష్టించడం జరిగింది. స్పెసిఫికేషన్స్‌కి తగ్గ వధువును ‘సప్లై’ చేయడం వారి ప్రత్యేకత! ఫీజు మాత్రం కొంచెం ఎక్కువే! ఏడువేల డాలర్స్ – అంటే, ఐదు లక్షల రూపాయలన్నమాట.
వెంటనే ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి, తాను కోరుకునే వధువు యొక్క స్పెసిఫికేషన్స్‌తో ఆర్డర్ ప్లేస్ చేసేసాడు బుచ్చిబాబు. ఇరవయ్ నాలుగు గంటలలో ఓ యువతి ఫొటో అతనికి మెయిల్ చేయబడింది. ఆమెను ఓకే చేసేసాడు.
నెల తిరక్కుండానే బుచ్చిబాబుకు బ్రైడ్ ‘డెలివర్’ చేయబడింది… గులాబిరంగు మేనిచాయతో, ముట్టుకుంటే కందిపోయే సుకుమార శరీరంతో, అచ్చు అతను కోరుకున్నట్టే అందంగా ఉందామె. మోడర్న్ డ్రెస్‌లో, బాబ్డ్ హెయిర్‌తో క్యూట్ గా ఉంది. ఆంగ్లంలో మాట్లాడుతోంది…బుచ్చిబాబుకు తెగనచ్చేసింది.
“మనం వెంటనే పెళ్ళి చేసుకుందాం” అన్నాడు.
“సారీ, డేటింగ్ తరువాతే మ్యారేజ్” అందామె.
‘వెస్టర్న్ ప్రోడక్ట్ కదా! ఇదేదో బాగానే ఉంది’ అనుకున్నాడు.
“ఐ వాంట్ ఎ సిగరెట్” అని ఆమె అడగడంతో, “వాట్? నువ్వు స్మోక్ చేస్తావా!” అనడిగాడి తెల్లబోతూ.
“వై నాట్?” ఎదురు ప్రశ్న వేసింది.
నూతనవధువు. ఇప్పట్నుంచే ఆంక్షలు పెడితే బెదిరిపోవచ్చును. అప్పటికప్పుడు షాపుకు వెళ్ళి సిగరెట్ పెట్టె, లైటరూ తెచ్చిచ్చాడు. త్రాగడానికి బిస్లేరీ వాటర్ తెచ్చిస్తే, “వాటీజ్ దిస్? నేను బీరే త్రాగుతాను” అందామె.
ఉలికిపడి ఆమె వంక తేరిపారజూసాడు. ఆమె సుందరవదనం తిలకించగానే ఫిదా అయిపోయి, అప్పటికప్పుడే బీర్ బాటిల్స్ క్రేట్ తెప్పించాడు. ఇంత అందమైన అమ్మాయికి ఈ పాడు అలవాట్లు ఏమిటా అని ఆలోచిస్తూంటే, ‘ఈమె మెయిల్ ఆర్డర్డ్ బ్రైడ్. మోడర్న్ గాళ్. అలవాట్లన్నీ మోడర్న్‌గా ఉండడంలో వింతలేదు’ అనిపించింది.
రూపురేఖల విషయంలో స్పెసిఫికేషన్స్ ఇచ్చిన తాను – హిందూ సంస్కృతి, సంస్కారమూ గురించి పేర్కొనడం మరచిపోయాడు. పెళ్ళయ్యాక మన ఆచారాలను, అలవాట్లనూ మెల్లగా నేర్పించవచ్చునులే అనుకున్నాడు.
డేటింగ్ పేరుతో ఆమెతో కలసి క్లబ్‌లూ, పబ్‌లూ, పబ్లిక్ ప్లేసెసూ తిరుగుతూంటే సరదాగా, హుషారుగా గడచిపోయింది. ఎక్కడికి వెళ్ళినా అందరి కళ్ళూ తమవైపే ఉండడంతో గర్వంగా ఫీలయ్యేవాడు. అంత అందమైన భార్యను పొందినందుకు అంతా తనపట్ల అసూయ చెందుతున్నట్లు అనిపించేది.
డేటింగ్ అనంతరం వారి వివాహం అయిపోయింది. శోభనపు రాత్రి – హంసగమనంతో, బీరుపాత్రతో, గదిలో అడుగిడిన ఆమెను అమాంతం కౌగలించుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేసాడు బుచ్చిబాబు.
“బీరు త్రాగు, మ్యాన్!” అందామె, గ్లాసు అందిస్తూ.
“ఇప్పుడు మనం మొగుడూపెళ్ళాలం. నువ్వు నన్ను మ్యాన్ అనడం మానేయాలి” అంటూ ఆమెను అమాంతం మంచం పైకి లాగాడు.
అతన్ని త్రోసేసి క్రిందకు ఉరికిందామె. “సారీ, ఆ ఒక్కటీ అడక్కు!” అంది.
“వై నాట్?” అన్నాడు తెల్లబోతూ.
ఎందుకో ఆమె చెబుతూంటే అతని మెదడు మొద్దుబారిపోయింది –
‘ఆమె – ఓ రోబో! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నిష్ణాతులైన ‘ట్వెంటీ-ఫిఫ్త్ సెంచురీ జాకల్స్’ – సింథెటిక్ బ్లడ్, స్కిన్, ఫైబర్ బోన్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ హ్యూమన్స్‌ని తయారుచేస్తారు. శరీరంలో ‘చిప్స్’ పెట్టి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌తో కోరిన రూపం, లక్షణాలు, భావోద్వేగాలు, స్పందన-ప్రతిస్పందనలు, మాట్లాడడం, పనులు చేయడం, వగైరాలతో అచ్చు మానవులలాగే మెలగేటట్లు చేస్తారు. అలా కోరిన విధంగా బ్రైడ్స్‌ని రూపొందించి విక్రయిస్తుంటారు…ఐతే ఆ రోబోయువతి మానవకాంతలా కాపురానికి మాత్రం పనికిరాదు!!…’
పిచ్చిగా జుత్తు పీక్కున్నాడు బుచ్చిబాబు. “నో…! దిసీజ్ చీటింగ్!!” అంటూ పెద్దగా అరిచాడు…
3
“ఒరేయ్, బుచ్చిబాబూ! ఏమిట్రా ఆ కేకలు?” అంటూ తల్లి తట్టిలేపడంతో, చటుక్కున కళ్ళు తెరచాడు బుచ్చిబాబు. ఎదురుగా తల్లి, మేనమామాను!
“ఇరవయ్ అయిదవ నంబరు పెళ్ళికూతురు కూడా నిన్ను కాదన్నట్టు కలేమైనా వచ్చిందా ఏమిటి కొంపదీసి!” నవ్వాడు మేనమామ.
గుర్రుగా చూసాడు బుచ్చిబాబు. ఆ రోజు ఆదివారం కావడంతో లంచ్ కాగానే మంచం మీద నడుం వాల్చాడు తాను. గతరాత్రి నెట్‌లో చూసిన ‘మెయిల్ ఆర్డర్ బ్రైడ్’ ఆఫర్ గురించే ఆలోచిస్తూంటే తెలియకుండానే నిద్రపట్టేసింది. నిద్రలో ఆ తమాషా కల!
“సరే, సరే…లేచి త్వరగా తయారవ్వు. దుర్ముహూర్తం రాకముందే ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి బైలుదేరాలి,” అంటూ తొందరచేసాడు మేనమామ.
“ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎవరికీ?” నిరాసక్తంగా అడిగాడు.
“ఎవరికేమిట్రా, బుచ్చిసన్నాసీ! నీకే” అంది తల్లి మురిపెంగా.
“ఔన్రా అబ్బాయ్! ఆ ఉమాదేవితోనే నీ ఎంగేజ్మెంట్” అన్నాడు మేనమామ.
“తాను వేరెవరినో ప్రేమిస్తోంది, మావయ్యా!” అన్నాడు బుచ్చిబాబు నిరుత్సాహంగా.
“ఆ పిల్ల ప్రేమిస్తున్నది నిన్నేనటరా, బుచ్చీ!” అంది తల్లి నవ్వుతూ.
అయోమయంగా చూసాడు. మేనమామ చెబుతూన్నది ఆలకిస్తూంటే తన చెవులను తానే నమ్మలేకపోయాడు…’ఉమాదేవి కొన్ని నెలల క్రితం ఓ ఫంక్షన్లో బుచ్చిబాబును చూసిందట. తొలిచూపులోనే నచ్చేసాడట. పెద్దలతో తన మనసులోని మాట చెప్పి ఆ పెళ్ళిచూపులను ఏర్పాటుచేయించింది. కావాలనే అతన్ని ఆట పట్టించింది. పెద్దలు సంబంధం ఖాయంచేసుకున్నా, ఆమె కోరిక మేరకు చివరివరకు బుచ్చిబాబుకది రహస్యంగానే ఉంచబడింది. ఆ విషయం అతని ఫ్రెండ్స్‌కూ తెలుసును. అందుకే మందుపార్టీ డిమాండ్ చేసారు…’
ఎందుకైనా మంచిదని, మేనమామ చేతిని గట్టిగా గిల్లాడు బుచ్చిబాబు. ఆయన కెవ్వుమనడంతో…అది కలా కాదు, కల్లా కాదని నిర్ధారణ చేసుకున్నాడు.
‘అమ్మ ఉమాదేవీ! నీ నాటకానికి తెర నేను లేపుతాను, శోభనంరాత్రి. సిద్ధంగా ఉండు…’ అనుకుంటూ హుషారుగా లేచాడు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి తయారేందుకు.
‘తిరుమలశ్రీ’ అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. ఆలిండియా సర్వీసెస్ కి చెందిన వీరు, భారతప్రభుత్వపు జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’ కలం పేర్లు.
తెలుగులో – అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. 190 నవలలు పుస్తకరూపంలోను, పత్రికలలోను, సీరియల్స్ గానూ ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలకు బహుమతులు లభించాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ఎడిటింగులో అనుభవం. పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ‘కలహంస’’ పురస్కార గ్రహీత. ‘కథాకిరీటి’, ‘కథా విశారద’, ‘బాలకథాబంధు’ బిరుదాంకితులు.
ఆంగ్లంలో – కథలు, వ్యాసాలు వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘కేరవన్’, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’, ‘ఆడమ్ అండ్ ఈవ్’, ‘సాజిత్’, ‘చందమామ’ (ఆంగ్లం), ‘గోకుల్’, మున్నగు ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం రాసారు. 20 ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి. స్టోరీమిర్రర్ (మల్టీ-లింగ్యువల్ పోర్టల్) యొక్క ‘లిటరరీ కల్నల్’ మరియు ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు…‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2019’ నామినీ. ‘ఆథర్ ఆఫ్ ద మంత్’ (సెప్టెంబర్ 2020) టైటిల్ (& బహుమతి) గ్రహీతలు. ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ (1st రన్నరప్)(రీడర్స్ ఛాయిస్), మరియు, 2nd రన్నరప్ (ఎడిటర్స్ ఛాయిస్) టైటిల్స్ అండ్ ట్రోఫీస్ గ్రహీతలు.
హిందీ లో – అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.