[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘మలిసంధ్య’ అనే కవితని అందిస్తున్నాము.]
దినకరుడు పడమటి దిక్కున
దిగిపోతున్న సమయాన..
నింగిని మెరిసే
ఆ వర్ణ చిత్రం.. ఎంత మనోహరం!!
అది..
చిత్రకారుడి కుంచెకు
చిక్కని కళాఖండం..
ప్రకృతి గీసిన అద్భుత సౌందర్యం!!
అది చూపరులకు ఇచ్చే ఆహ్లాదం
అనిర్వచనీయం..
పొద్దు వాలుతున్న ఆ క్షణం..
అందరికీ ఎందుకో అంత ఇష్టం!!
జీవిత చరమాంకాన్ని తలచి తలచి
భయపడతాం.. బాధపడతాం..
అస్తమించే సూర్యునిలో అగుపించే అందం
మలివయసులో మనిషిలో మాత్రం కనలేమా!!
మరెందుకా అలజడి! జీవనగమనంలో
అలసి సొలసిన ఈ దేహం..
విశ్రాంతి కోరే చివరి అంకం వృద్ధాప్యం
బరువు.. బాధ్యతలు తీరిపోయి..
తమకంటూ మిగిలి.. చేజిక్కిన
అరుదైన అదృష్టాన్ని అందుకుని..
తన కోసం వాడితే..
సూర్యాస్తమయంలోని మెరుపులు
మలివయసులోనూ మెరిసిపోవా!!
ముసలితనం శాపం కాదు.. మన కోసం..
ప్రతీ మనిషి కోసం.. దేవుడిచ్చిన దివ్యవరం..
అప్పుడెప్పుడో కన్న కలలకు రూపమివ్వడానికి
చేతికందిన మహత్తర అవకాశం.. అందుకే..
మలిసంధ్యను స్వాగతిద్దాం..
మనసారా ఆస్వాదిద్దాం..
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
