Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మళ్ళీ తాకిన పరిమళం..!

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అవ్వారు శ్రీధర్ బాబు గారి ‘మళ్లీ తాకిన పరిమళం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“అంజన్ రావు చనిపోయాడంట. నీకు తెలియదా”, అని ఫోన్ చేశాడు రమేష్.

ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి “ఎలా జరిగింది. నాకు తెలియదు”, అన్నాను.

“హార్ట్ ఎటాక్ అట”, చెప్పాడు.

“వీలైతే అపర్ణతో కలిసి మాట్లాడొచ్చుగా” అన్నాడు.

“వద్దురా. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కలవడం బాగుండదు. అసలు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో వివరాలు ఏమి తెలియవు”, అన్నాను.

“అదేంటి మీకు దగ్గరలోనే కదా వాళ్ళ ఇల్లు”.

“కానీ ఎప్పుడూ చూసింది లేదు”, చెప్పాను

“సరే నీ ఇష్టం వీలైతే వెళ్ళేసిరా”, అని ఫోన్ పెట్టేసాడు. ‘అవును దగ్గరే.. రెండు కిలోమీటర్లు దూరమే కానీ రెండు వేల కిలోమీటర్ల దూరమయ్యాం’ మనసులో అనుకున్నాను బాధగా.

మూడ్ చెడిపోయింది. అప్పుడు కూడా అంతే అపర్ణ పెళ్లి అన్నప్పుడూ మూడ్ బాగాలేదు.

ఫ్రెండ్స్ అందరూ “పెళ్లికి పోదాం రా, స్నేహితులందరినీ కలవచ్చు. చాలా సంవత్సరాలయిందిగా పోదాం” కొందరు హుషారుగా అన్నారు.

ఏమో నాకు తెలీదు కానీ నాకు పోవటం ఇష్టం లేదు. ఆ మాట చెప్తే వీళ్ళ ముందు బతకలేం. అందుకే నేను.. “నాకు క్యాంపు పని పడింది రా నేను రాలేను” అని తప్పించుకున్నాను.

పరిశీలనగా చూస్తోన్న రమేష్‌ను చూసి, “అంత సీన్ లేదు. అది ఎప్పుడో డిగ్రీ స్టేజి.. నిజంగా క్యాంప్ పని పడింది” అని చెప్పాను.

ఎప్పుడో డిగ్రీలో జరిగిన విషయం ఇప్పటికీ వెంటాడుతూ ఉండటమే విచిత్రం. ఆ గ్యాంగులు, తగువులు, బ్యాచిలేసుకుని తిరగడం, అపర్ణతో విభేదాలు, ఇష్టాలు, అయిష్టాలు, మనస్పర్ధలు, మళ్ళీ తిరిగిరాని తీపి, చేదు, వగరు లాంటి గుర్తులు.

అయినా అతను చనిపోయాడు అనగానే మనసులో ఎక్కడో బాధగా ఉంది. ఈ మధ్యకాలంలో విన్నాను తనకో పాపని.. ఇంటరో.. ఏదో చదువుతుందని. అప్పుడు అభావంగా విన్నాను. ఇప్పుడు బాధతో విన్నాను.

ఎలాగైనా ఒకసారి అపర్ణని కలవాలి. తన భర్త చనిపోయిన విషయం నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పాలని మనసు గట్టిగా చెపుతుంది.

డ్యూటీ నుండి వచ్చి.. మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగి, వెంటనే రెడీ అయ్యాను. రాగానే కాసేపు పేపరు తిరిగేయడం, కాసేపు టీవి పైపు కన్నేయడం, ఆ తర్వాత వాకింగ్‌కి వెళ్లడం చేసే నేను.. వెంటనే తయారై.. బయటికి అడుగేయడాన్ని వింతగా చూస్తున్న భార్య వైపు తిరిగి, “ఫ్రెండును కలిసే పనుంది” అని చెప్పి బయటకు వచ్చాను.

బండి అపర్ణ ఉండే వీధిలోకి తిరిగింది. ఆ వీధిలోనే కుడివైపు సన్న సందులో అపర్ణ వాళ్ళ ఇళ్ళు. ఆ వీధి మలుపు తిరగగానే పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు తిరిగాయి. ఆమె వెనకాలే ఆ వీధి వరకు రావడం. ఆమె వీధి నుండి ఆ సన్న సందులో తిరిగేటప్పుడు.. వెనక్కి తిరిగి నా కళ్ళల్లోకి చూడటం. ఒక్కోసారి నాలుక బయటపెట్టి వెక్కిరించటం.. అన్నీ ఒక్కసారి మదిలో మెదిలి చిరునవ్వు ఉదయించింది. అలాగే ఆ సందులో అబ్బాయిలు మమ్మల్ని ఆపడం. వారితో తగువులు అన్నీ గుర్తుకొచ్చాయి.

బండి తన ఇంటి ముందు ఆపి, కాసేపు అలానే ఉండిపోయాను. ఇలానే వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను. లోనికి వెళ్ళాలి అన్న మనసును అదిమిపెట్టి కాసేపు బయటే ఆగాను. నాకే గిల్టీగా ఉంది. భర్త ఉన్నప్పుడు కలవకుండా.. చనిపోయినప్పుడు వెళ్తున్నానే అని.

కానీ మనసుకు సమాధానం చెప్పుకున్నాను. బాధలో ఉన్న వారిని పలకరించడం తప్పు కాదు, దీనిలో ఎటువంటి చెడు ఆలోచన లేదు అని సర్ది చెప్పుకున్నాను.

ఇంట్లోంచి ఇరవై సంవత్సరాల అమ్మాయి బయటకు వస్తూ కనిపించింది. అప్రయత్నంగా బండి దిగాను.

ఆ పాప నావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ “ఎవరు కావాలి అంకుల్?” అడిగింది.

“అపర్ణ గారు ఉన్నారా” గొణిగాను.

“మా అమ్మ లోన ఉంది అండి” అంటూ చేతిలోని సంచితో బయటికి వెళ్ళింది.

లోపలికి అడుగు పెట్టాను.

మళ్ళీ అదే ఆలోచన.. వెనక్కి వెళ్ళిపోదామా అని. కానీ కాళ్లు వెనక్కి పడటం లేదు. అప్పుడే ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చి “ఎవరు కావాలి నాయనా?” అంది.

“అపర్ణ గారి కోసం వచ్చాను” అని చెప్పాను.

“లోపలికి రండి” అంటూ హాలులోకి తీసుకెళ్ళింది “నీ కోసం ఎవరో వచ్చారే” అంటూ బెడ్ రూమ్ లోకి తొంగి చూస్తూ చెప్పింది ఆవిడ.

నా గుండె వేగంగా కొట్టుకుంటుంది.

పడుకుని ఉందేమో వెంట్రుకలను సర్దుకుంటూ బయటికి వచ్చింది. ఆశ్చర్యపోయి చూస్తోంది నన్ను. ఆ కళ్ళ వెనుకగా ఒక మెరుపు అలా తచ్చాడి వెళ్ళిందని నా అనుమానం.

నాకు ఏమి మాట్లాడాలో తోచలేదు. తనే.. “ఎలా ఉన్నారు?” అని అడిగింది. బాగున్నానంటూ తల ఆడించాను.

నాకు తెలీదు గొణిగినట్లు చెప్పాను. “రమేష్ నిన్న ఫోన్ చేశాడు. వాడికి ఈమధ్యనే తెలిసిందట. ఎలా జరిగింది..?” మనసులో ఉన్న మాటలు గడగడా అడిగేసి తన మొహంలోకి చూశాను.

“సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్లేలోగా..” కంటి నుండి చుక్క చేతి మీద పడింది.

“సారీ, బాధపడకండి. బ్యాడ్‍ లక్. అలా జరిగి ఉండకూడదు”. ఎలా వచ్చాయో తెలియదు అనేసాను.

ఈలోపల తను సర్దుకుంది.

తల పైకెత్తింది, నవ్వినట్లు పెదాలు విడివడ్డాయి.

“మీరెలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు”, అడిగింది. చెప్పాను.

“ఇప్పుడు నీవు.. మీరు ఏం చేస్తున్నారు?”

“అయనకి పంచాయితీ ఆఫీస్‌లో ఉద్యోగం.. వారు పోయాక నాకు అక్కడే.. ఆ ఆఫీస్ లోనే ఉద్యోగం ఇచ్చారు”.

“ఆఫీస్ ఎక్కడ?”

చెప్పింది.

“పాప ఏం చేస్తుంది?” అడిగాను.

“ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది.”

ఇంతలో పెద్ద ఆవిడ కాఫీ పట్టుకొచ్చింది.

కాఫీ తాగుతూ అపర్ణ వైపు తదేకంగా చూశాను.

కాస్త ఒళ్ళు చేసింది. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు.. అయినా ముఖంలో కళ అలానే ఉంది. ఇక ఏం మాట్లాడాలో తోచలేదు.

“వెళ్ళొస్తాను” అంటూ లేచాను. తను కూడా లేచింది.

తలొంచుకొని బయటికి వచ్చేసాను.

***

మనసంతా గజిబిజిగా ఉంది. తను ఏడవటం గుర్తొచ్చింది. ఇది రెండోసారి తన ముందు ఏడవడం. ఇద్దరి పేర్లు ఎవరో బోర్డు మీద రాసినప్పుడు చూసి కన్నీళ్లు పెట్టుకుంది. వాడెవడో కనుక్కొని వాడు పని పడతానంటూ ఆవేశంగా అన్నాను.

“అలా చేస్తే నా మీద ఒట్టే. అదేం వద్దు ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం” అంది.

ఆడవారికి ఆలోచన ఎక్కువ. మనకు ఆవేశం ఎక్కువ.

ఆ తర్వాత ఒకసారి టౌన్ బస్సులో కనబడింది. డ్యూటీకి వెళ్తున్నట్టు ఉంది. నన్ను చూసి నవ్వింది. వెనక సీట్లో ఖాళీ ఉంటే కూర్చున్నాను. డ్యూటీకా అడిగాను. అవునంటూ తలూపింది.

మీరెంత వరకు నవ్వుతూ అడిగింది. తనకి నవ్వుతూ మాట్లాడటం అలవాటు.

మొదట్లో నాతో తగువు వేసుకున్నప్పుడు తప్ప. ఎప్పుడూ.. ఎవరితో మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడుతుంది.

నేను డిగ్రీలో అడుగు పెట్టినప్పుడు నాతో పాటు ఒక బ్యాచ్ ఉండేది. చైన్ బ్యాచ్ అనే వాళ్ళు అప్పుడు మా బ్యాచ్‌ని.

క్లాస్ జరిగేటప్పుడు లేటుగా లోనికి రావటం, లెక్చరర్స్‌ని కామెంట్ చేయడం, ఆటలు.. పాటలు.. తగువులు.. అబ్బో ఆ హుషారే వేరు.

ఇంతలో క్లాస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ వచ్చాయి. మా చైన్ బ్యాచ్‌కి బై బ్యాడ్ లక్ నేనే లీడర్‌ని. కాబట్టి నన్నే నిలబడరా అని మా వాళ్ళు ఒత్తిడి చేశారు. సరే అన్నాను. క్లాసులో మాకు కొంత ఫాలోయింగ్ ఉంది.

మాది రౌడీ బ్యాచ్ అని మా క్లాస్ ఆడవారి అభిప్రాయం. ఆడవారి బ్యాచ్‌కి అపర్ణ లీడర్. తనను నిలబడమని వాళ్ళు అడిగారు. అలా ఇద్దరు నిలబడ్డాం. ఎలక్షన్ రోజు వచ్చింది. మా మగాళ్లు ఎక్కువమంది ఉన్నా కూడా ఆడవాళ్లు అడిగేసరికి కొందరు అటువైపు తిరిగారు. దాంతో రెండు ఓట్ల తేడాతో నేను ఓడిపోయాను. నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాను. కానీ మా చైన్ బ్యాచ్ ఒప్పుకోలేకపోయింది. ఫలితం ఇద్దరి మధ్య వార్.

ప్రతి విషయంలో అభిప్రాయాలు వేరుగా ఉండేవి. నేను అమ్మాయి చెప్పినవి కొన్ని నచ్చితే ఒప్పుకునేవాణ్ణి. కానీ మా వాళ్ళు పడనిచ్చే వాళ్ళు కాదు. పైగా కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు కాలేజీకి వెళ్లేటప్పుడు దారి కాచి ఏడిపించేవాళ్ళు. నేను వద్దురా అని మొత్తుకున్నా వినేవారు కాదు. వారు ఏం చేసినా.. నేను వాళ్ళ లీడర్ కాబట్టి.. నేను చేసినట్టే అయ్యేది. ఆ తగువులతోనే మొదటి సంవత్సరం గడిచిపోయింది.

“ఏంటి ఆలోచనలో పడిపోయారు..? ఎంతవరకు వెళ్తున్నారు..? అని అడిగాను” అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. తను వెనక్కి తిరిగి అడుగుతోంది. అదే నవ్వు. పనేంటో చెప్పాను.

ఆ తర్వాత తన స్టేజి రాగానే వస్తానంటూ చెప్పి.. దిగేసింది.

‘ఫోన్ నెంబర్ అడిగి ఉండాల్సింది..’ అనుకొని వద్దులే ఏమైనా అనుకోవచ్చు అయినా తను నన్ను ఫోన్ నెంబర్ అడగలేదు కదా.. నేను అడిగితే ఏం బాగుంటుంది.. మరి ఇలాగే తను అనుకొని ఉంటే..! తల విదిలించి ఆ విషయానికి మంగళం పాడాను.

మరోసారి ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్లాను. అక్కడ తను లైన్‌లో చివరన నిలబడి ఉంది. క్యాజువల్‌గా వెనక్కి తిరిగిన తను, నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. ఎర్రటి బార్డర్‍౬తో చిగురాకు పచ్చ చీరలో హుందాగా కనిపిస్తుంది. తను అప్పుడూ అంతే. పైట పావడా వేసినా.. చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడిలా అప్పుడు చుడీదార్లు, జీన్స్‌లు అసలు లేవు కదా.

నేను నవ్వి “డబ్బులు డ్రా చేయడానికి వచ్చారా?” అని నాలిక కర్చుకున్నాను. తను నవ్వింది. ఒకసారి ఇలానే కాలేజీ లైబ్రరీలో కనపడితే “ఏంటి పుస్తకాలు కోసమా?” అంటే తను “కాదు సమోసాల కోసం” అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు అలా అనలేదు కానీ..

అసలు ఆ విషయాలన్నీ గుర్తున్నాయా లేవా? తనకి పాత విషయాలు గుర్తు లేవేమో.. అదే మంచిదేలే.. కొన్ని మర్చిపోవడమే లేదు.

ఆ పోట్లాటలు.. వాదించుకోవడాలు, పోట్లాట నుండి ఇష్టం వైపు మళ్ళిన కొన్ని సందర్భాలు గుర్తుకు వచ్చాయి.

మేము కాలేజీలో క్లాసులకు వెళ్ళేది తక్కువ. క్రికెట్ ఆడటం ఎక్కువ. ఎప్పుడు క్రికెట్ ఆడడమే పని.

ఓ రోజు కాలేజీలో డిగ్రీ మొదటి, రెండు, మూడు సంవత్సరాల వారి మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి.

మాకు సెకండియర్ వాళ్లతో పోటీ. ఎట్లా పోటీలప్పుడు క్లాసులు జరగవు కాబట్టి, అందరూ మ్యాచ్ చూస్తున్నారు.

మేము టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాము. దీని కోసమని వారం.. పది రోజులు బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నాం.

నేను బ్యాటింగ్‍కి వెళ్లి ఆఫ్ సైడ్.. ఆన్ సైడ్ ఫోర్లు కొట్టడం. మా వాళ్ళు చప్పట్లు.. విజిల్స్ వేయడం అంత జోష్‌గా జరిగిపోయింది. మ్యాచ్ అయిపోగానే ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి “రేయ్ మామా నువ్వు ఫోర్లు కొడుతుంటే అపర్ణ చప్పట్లు కొట్టింది రా” సంతోషంగా చెప్పాడు. “బాగా ఆడుతున్నాడే అని కూడా పక్క వాళ్ళతో అనడం విన్నాను”, అన్నాడు.

“అవునా..” ఆశ్చర్యపోయి అడిగాను. “కావాలంటే లక్ష్మణ్ గాడిని అడుగు చెప్తాడు” అన్నాడు.

అడగలేదు కానీ.. తను అలా అన్నదంటే చాలా ఆనందంగా అనిపించింది.

దారిలో కనపడినప్పుడు నా దగ్గరికి వచ్చి “బాగా ఆడావు విజయ్ కంగ్రాట్స్” అన్నది.

ఇంకేముంది డామ్మని పడిపోయే పరిస్థితి. ముఖమంతా వెలుగు నింపుకుని థాంక్స్ అన్నాను. అది మొదటి సారి నాతో పోట్లాడకుండా మాట్లాడటం క్రికెట్‌కి థాంక్స్ చెప్పాను.

ఎంత ఆటలు, సరదాలు, గలభాలు ఉన్నా.. చదువు దగ్గర ఎప్పుడు ముందే ఉండేవాడిని. మా తెలుగు లెక్చరర్ గిరిజా మేడం ఒక పాఠం ‌ఇచ్చి రేపు మీ తరగతి వారు క్లాస్ తీసుకోవాలి అని చెప్పేది. అప్పుడు నేను క్లాస్ తీసుకునేవాడిని. నచ్చుతుందో ఏమో.. చెబుతుంటే ఆసక్తిగా వినేది.

మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయి రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఇలా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరి కొరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి.. వారికి నిఘంటువులు బహుమతిగా ఇచ్చారు. మా తరగతిలో నాకు వచ్చింది. మరలా రెండోసారి తను నాకు కంగ్రాట్స్ చెప్పింది. తను చనువుగా “మీరు క్లెవర్స్ అండి.. అప్పుడప్పుడు మాకు డౌట్ వస్తే తీర్చండి” అంటూ నవ్వింది. అలా మనోహరంగా నవ్వటం తనకే సాధ్యమేమో..!

తమాషాకు అలా అన్నది అనుకున్నాను. కానీ ఒకసారి నిజంగా కామర్స్‌లో డౌట్ అడిగింది. చెప్పాను.

“లెక్చరర్స్ కూడా ఇలా చెప్పలేదు” అన్నది.

“అమ్మో పొగడొద్దు.”

“లేదు నిజమే మనసులో మాట అన్నాను”.

మేము అలా అన్ని సబ్జెక్టులు డిస్కషన్ చేసే వాళ్ళం సందేహాలను తీర్చుకునేవాళ్ళం. ఒక్కోసారి కాలేజీ వదలగానే మేమిద్దరమే నడుచుకుంటూ.. చర్చించుకుంటూ వెళ్ళేవాళ్ళం.

మా చైన్ గ్యాంగ్‌ని మళ్ళీ కలిసి సారీ చెప్పేవాణ్ణి వాళ్ళతో కలవలేనప్పుడు.

“కానీ రా ఇక మాతో ఏం పని..” అనేవారు.

“అదేం లేదురా మేము సబ్జెక్టుల గురించే మాట్లాడుకున్నాం” అంటే..

“ఆ కొయి కొయి కోతలు” అనేవారు మావాళ్లు .

అప్పుడప్పుడు అలా ఎక్కడికో వెళ్ళిపోతారేంటి అన్నమాట విని మరలా ఈ లోకానికి వచ్చాను. క్యూ ముందుకు కదిలింది. తన వంతు రాగానే ఏటీఎం కార్డ్ ఇచ్చి “పదిహేను వేలు తీయాలి. ఏదో ఓటిపి వస్తుందంట కదా, పాప చెప్పింది, మీరు చూస్తారా విజయ్” అంది, లాక్ తీసి సెల్ ఇస్తూ.

నేను ముందుకు వచ్చి కార్డ్‌ని మిషన్‌లో ఉంచి, పిన్ తనను టైప్ చేయమని చెప్పాను.

చేసింది. నేను అమౌంట్ టైప్ చేయగానే తన సెల్‌కి ఓటిపి వచ్చింది. దానిని టైప్ చేసి అమౌంట్ ని తీసి ఇచ్చాను.

నేను అమౌంట్ తీసుకునేంత వరకు ఉండి, మళ్ళీ తన సెల్ నాకిచ్చి మీనెంబర్ ఫీడ్ చేసి ఇవ్వమని చెప్పింది.

నేను నా నెంబర్ ఫీడ్ చేసి నా సెల్‌కి రింగ్ ఇచ్చాను.

“నన్ను.. మీరు అని పిలవాలా?” అన్నాను చిన్నగా.. తన్ను నవ్వేసింది. అది కాలేజీలో నవ్వినట్లుగా అనిపించింది.

“మనం చదివేటపుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు ఇది మనకు మింగుడు పడటం కష్టమే.. ఇంత చదువు చదివినా ఇప్పుడు ఇంకా వీటి విషయంలో నిరక్షరాస్యులమే..” అంటూ నవ్వి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లి పోయింది.

ఇలా రెండు మూడు సార్లు కలవడం జరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత అపర్ణ నుండి ఫోన్ వచ్చింది.

“హలో అపర్ణ ఎక్కడ నుండి” అడిగాను.

“హలో అంకుల్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది మిమ్మల్ని రమ్మంటుంది”, చెప్పింది అపర్ణ పాప వినయ.

“ఏం జరిగింది.. ఎక్కడ హాస్పిటల్..” ఆందోళనగా అడిగాను.

అడ్రస్ చెప్పింది.

వెంటనే బయలుదేరాను. ఎప్పుడూ తొణకని అపర్ణ మొహంలో బాధ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. చేతిలో ఫైల్ పట్టుకొని, డాక్టర్ ఛాంబర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని ఉంది.

“ఏం జరిగింది”, అని చేతుల్లో ఉండే ఫైల్‌ని సందేహంగా చూస్తూ అడిగాను. ఫైల్ చేతికి ఇచ్చింది. దానిలోని కాగితాలను చూసి.. పాలిపోయిన ముఖంతో ఆమె వైపు అయోమయంగా చూశాను.

అపర్ణ అమ్మ పెద్ద పెట్టున ఏడుస్తూ “దీని రాత ఇలా కాలింది. ఒక్కగానొక్క కూతురు అని వైభవంగా జాతకాలు చూసి మరి పెళ్లి చేస్తే అలా అయింది. ఇప్పుడేమో ఇలా.. ఏం చేయను రా భగవంతుడా. పెళ్లి చేసి ఆయన వెళ్లిపోయారు. సుఖంగా ఉందిలే అనుకుంటే అల్లుడేమో ఆకస్మాత్తుగా కాలం చేసాడు. ఇప్పుడు దీనికేమో ఇలా..” అంటూ గొల్లుమంది. అక్కడ కూర్చున్నవారు ఇదంతా నిర్లిప్తంగా చూస్తున్నారు. వారు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉండి ఉంటారు. అలాంటి మాటలు విని విని ఆ హాలు నిస్తేజంగా మారిపోయి ఉన్నట్లుంది.

పాప బిక్క మొఖం వేసుకొని ఉంది. పెద్దామెను ఊరుకోబట్టి , అపర్ణ వైపుకు తిరిగి

“ఇప్పుడు క్యాన్సర్ అంత పెద్ద విషయం కాదు. పూర్తి వివరాలు కనుక్కుందాం. కేన్సర్ మొదటి దశలో ఉంటే ఏమి భయపడాల్సిన పనిలేదు” అన్నాను.

ఈ లోపల కాస్త తేరుకుంది. సరేనంటూ తలూపి “ఓ రెండు రోజులు ఇన్-పేషెంట్‌గా ఉండమన్నారు ఇంకా కొన్ని పరీక్షలు చేయాలట”, చెప్పింది.

“పర్లేదు డాక్టర్ చెప్పినట్లే చేద్దాం నీవు దేనికి భయపడకు.. నేనున్నాను..” అని చెప్పి, ఎప్పుడు చేరాలో వివరాలు కనుక్కొని వస్తాను అని అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.

డాక్టర్‌తో మాట్లాడి బయటికి వచ్చాను. “ప్రస్తుతానికి మందులు వాడమన్నారు మీకు వీలు చూసుకుని చేరితే పరీక్షలు చేసి ట్రీట్మెంట్ మొదలు పెడతారని అన్నారు. ప్రస్తుతం ఇంటికి వెళ్దాం” అంటూ ఆటో మాట్లాడి అక్కడనుండి బయలుదేరదీసాను.

రెండు రోజుల తర్వాత డాక్టర్ చెప్పినట్లు పరీక్షల నిమిత్తమై హాస్పిటల్లో చేరింది అపర్ణ. చూడటానికి నేను వెళ్ళాను. బెడ్ మీద పడుకుని ఉంది. నన్ను చూసి వినయ.. “అంకుల్ వచ్చారు” అని చెప్పింది.

బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు తదేకంగా చూస్తున్న అపర్ణ, నన్ను చూసి లేచి దిండు నానుకుని కూర్చుంది.

“ఏమన్నారు డాక్టర్?” అడిగాను.

“ఈ రోజు రెస్ట్.. రేపటి నుండి పరీక్ష లేవో చేస్తారట. ఈరోజుకు ప్రస్తుతానికి ఇలా బెడ్ మీదే..” నవ్వుతూ అంది. కానీ ఆ నవ్వులో ఉత్సాహం లేదు. వినయని చూపిస్తూ, “ఇది చూడు కాలేజీ ఎగ్గొట్టి నా దగ్గరే ఉంది. నాకు ఇంకా అంత ప్రమాదం ఏమి మొదలవలేదు కదా..” నవ్వడానికి ప్రయత్నించింది.

“ఏంటి నీవు? అలా అనకు వినయ భయపడుతుంది” అంటూ చిన్నగా అని.. టాపిక్ మారుద్దామని “అమ్మ ఇంట్లోనే ఉందా?” అని అడిగాను. “మరి మధ్యాహ్నం వంట చేసి తీసుకురావాలిగా” అంది.

నేను తలూపి వినయ వైపు తిరిగి “వినయా! నేనిక్కడ ఉంటాను, ఈ లోపల నీవు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయిరా.. ఏమీ ఆలోచించకు. అమ్మకు ఏమీ కాదు. నీకు వెళ్లాలనిపిస్తే కాలేజీకి వెళ్లు, నేను ఉంటాను,” చెప్పాను.

“లేదు అంకుల్ నేను వెళ్లి అమ్మకు క్యారియర్ తీసుకువస్తాను”. అని చెప్పింది.

“అయ్యో నీకు ఎందుకమ్మ శ్రమ నేను బండిలో పోయి వస్తాను,” అని అన్నాను.

“వద్దు అంకుల్ ఎలాను నేను ఇంటికి పోయే పని ఉంది, స్కూటీలో పోయేసి వస్తాను”, అంటూ బయలు దేరింది.

ఇద్దరమే మిగిలాము. కాసేపు మౌనంగా ఉండి పోయాము. ఏం మాట్లాడాలో తెలియలేదు. తను తన గోళ్ళ వైపు చూస్తూ కూర్చుంది.

ఉన్నట్టుండి తలపై పైకెత్తి.. “విజయ్” అంది. చెప్పమన్నట్లు చూశాను

“నాకేమైనా అయితే.. వాళ్లు పాపం ఇద్దరూ ఆడవాళ్లే.. వినయకు గార్డియన్‌గా ఉంటావా?” గొంతు గద్గదమైంది.

“అపర్ణ ప్లీజ్ అలా మాట్లాడుకు. నీకు ఏమీ అవదు. మొదట ఆ ఆలోచనలు వదిలేయ్. ఇప్పుడు క్యాన్సర్‌కి భయపడాల్సిన అవసరం లేదు. ఈమధ్య చూశాంగా.. సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ ఆడేవారు ఇలా ఎందరో దాని నుండి సురక్షితంగా బయటపడి, మామూలుగా జీవిస్తున్నారు. అందులో నీది ఇనిషియల్ స్టేజినే. అంత కలవరపడాల్సిన పనిలేదు”.

తన మొహంలో కాస్త రిలీఫ్ ని చూసి, మరలా కొనసాగించాను.

“ఇలాంటప్పుడు మనసుని స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. నాకు ఏమి కాదు అని గట్టిగా అనుకోవాలి. ఇలాంటివి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి.”

“కాలేజీలో చెప్పావుగా మరలా ఇక్కడ కూడా క్లాసులు చెబుతావా” అంటూ పూర్వపు చలాకీతనంతో నవ్వింది.

తను మామూలుగా మారడం చూసి నాకు సంతోషం వేసింది. నేను కూడా అదే చెప్పేది కాలేజీలో ఉన్న ధైర్యాన్ని ఇప్పుడు కూడా ఉంచుకో అంటూ నవ్వాను.

“నేను ఎక్కడ ధైర్యంగా ఉన్నాను విజయ్. బోర్డు మీద రాయబడిన మన పేర్లు.. నా ధైర్యాన్ని అంతా పీల్చేశాయి. నాన్న కళ్ళముందు మెదిలారు. నాన్నకు తెలుస్తుందని వణికిపోయాను. తనసలే సాంప్రదాయాల పట్ల కఠినంగా ఉంటారు. మనం ఇంతకు ముందులాగా కలవద్దు.. మాట్లాడొద్దు అని నీచేత ఒట్టేయించుకున్నాగా.. అప్పటినుండేగా మనమసలు కలవలేదు..”

ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటూ కాసేపు నిశ్సబ్దంగా ఉండి పోయాము.

ఉన్నట్టు ఉండి నేనున్నాను.. “ఆ రాసిన వాడెవడో తెలిసింది. నీకు తెలియదు కదా..?”

ఎవరు అన్నట్లు చూసింది.

“గిరిజా మేడం క్లాసులు తీసుకోమని చెప్పేటప్పుడు నాకు పోటీగా క్లాసు చెప్పేవాడే రవీంద్ర.. వాడే రాసింది. మా బ్యాచ్ కనిపెట్టేసింది‌. వాడే అని ఒప్పుకున్నాడు. మా వాళ్లు కొట్టబోతుంటే నేనే ఆపి వదిలేయండి అని చెప్పాను”

“అయినా మీ గ్యాంగ్ ఏమైనా తక్కువ తిన్నాదా మమ్మల్ని ఎంత ఏడిపించారని.. అది సరే కాని వార్షికోత్సవం జరిగేటప్పుడు స్టేజ్ మీద ఎవరో డ్యాన్స్ వేస్తుంటే వెనకాల మీ ఎగురులెంటి..” నవ్వు బిగబడుతూ అంది

“అవన్నీ మా వాళ్ళు చేశారు.. నేను చేయలేదు” ఉడుక్కున్నాను.

పకపక నవ్వింది.

“అన్నట్లు.. ఎప్పుడూ నీ పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా.. ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు?”, అడిగాను.

“ఉష ఎక్కడుందో తెలియదు కానీ లక్ష్మి మాత్రం మొన్నీమధ్య ఒక పెళ్లిలో కలిసింది. బాబు.. పాప అట.  అయినా కాంటాక్ట్‌లో ఉండడానికి ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్లు ఏమన్నా ఉండేవా..! సెల్‍ఫోన్ మాట దేవుడెరుగు.. ల్యాండ్ ఫోన్ అయినా ఉండేది కాదుగా..” నవ్వుతూ అంది.

మళ్లీ తనే అంది “ఆ రోజులు తలుచుకుంటే గమ్మత్తుగా ఉండేటివి. మళ్లీ తిరిగిరాని తీపి గుర్తులు”. ఆ రోజుల తీయదనాన్ని ఆస్వాదిస్తున్నదేమో నిశ్శబ్దంగా ఉండిపోయింది.

నేను చిన్నగా చెప్పటం మొదలుపెట్టాను – “అప్పుడు మన మధ్య ఏముందో మనకే తెలియదు అపర్ణా.. కానీ ఇప్పుడు చెప్తున్నా.. మన మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంటుంది. ఇక నువ్వు చెప్పావుగా వినయకు గార్డియన్‍గా ఉండమని, ఆ పాపను నా పాపగా చూసుకుంటాను. ఇక నువ్వు దేనికి భయపడకు..”

మనసులో ఉన్న మాటను చెప్పాననేమో.. నాకు తెలియని హుషారు వచ్చింది.

“ఓయ్ డైనమిక్ గర్ల్.. నీతో పోట్లాడటంలో.. నీ ధైర్యాన్ని చూసి ముచ్చటపడ్డాను. నీవు అలా ఉండటమే నాకిష్టం. అలానే ఉండు జీవితాంతం. నిన్ను ఈ క్యాన్సర్లు గీన్సర్లు ఏమీ చేయలేవు. నేనున్నాను” స్థిరంగా చెప్పాను.

కిటికీలోంచి చల్లగాలి ఇద్దరినీ తాకి హాయినిచ్చింది.

Exit mobile version