Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హాయిగొలిపే, తృప్తినిచ్చే కథాసంపుటి ‘మల్లెలూ – మందారాలు’

[గోళ్ళమూడి కిరణ్మయి గారి ‘మల్లెలూ – మందారాలూ’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

గోళ్ళమూడి కిరణ్మయి గారు వృత్తి రీత్యా బ్యాంక్ ఉద్యోగిని. వచన కవితలు, కథలు, పాటలు, గజల్స్ వ్రాస్తారు. అవధానాలలో ఆశుకవిగా, పూరణకవిగా పాల్గొన్నారు. లలిత కళలంటే ఆసక్తి. తొలి కథా సంపుటి ‘పారిజాతాలూ-పసిడిపూలు’ తరువాత, ఇటీవల, ‘మల్లెలూ – మందారాలూ’ అనే రెండవ కథాసంపుటిని వెలువరించారు. ఇందులో 39 కథలున్నాయి. చాలా వరకూ చిన్న కథలే. మొదలుపెడితే, ఆపకుండా చదివించే కథలే.

~

ఈ కాలం పిల్లలు బాగా తెలివైనవాళ్ళు. తమ సందేహాలను తీర్చుకునే క్రమంలో, కావాలని కాకపోయినా, ఒక్కోసారి తల్లిదండ్రులు ఇరుకున పడేలా చేస్తారు. అలాగే ఓ కుటుంబంలో జరిగిన చిన్న సంఘటనని, సమస్యగా మారకుండా చేస్తాడు ఆ బిడ్డ తండ్రి ‘అమ్మా! నాన్న! నేను..’ కథలో. న్యూక్లియర్ కుటుంబాలలో పిల్లలకి తాతయ్యలు, నాయనమ్మల ప్రేమని ఎలా పంచాలో ఈ కథ చెబుతుంది.

వేళకాని వేళ ఇంటికొచ్చినవారికి వండి వడ్డించటం అంత సులువు కాదు.  ఇటీవలి కాలంలో అతిథులు కూడా సమయం దాటిపోతే, బయటే భోం చేసి రావడం, అతిథేయి కుటుంబాలని ఇబ్బంది పెట్టకూడదనుకోడం జరుగుతోంది. అయితే ఇంకా కొందరు, ఒకప్పట్టి పద్ధతులని పాటిస్తూ, కాస్త ఆలస్యమైనా వచ్చిన అతిథి కోసం శ్రద్ధగా వండి, ఆప్యాయంగా వడ్డించటం జరుగుతోంది. స్నేహం బలపడిన ఇరుగుపొరుగుల వారిలో ఒకరి ఇష్టాల గురించి ఒకరు ఏవో మాటల్లో తెల్సుకున్నప్పుడు, ఎదుటివారు గుర్తుంచుకుని, వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ పదార్థం వీరి కోసం తీసుకురావడం; ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తికి బయట తింటి సయించదని అతిథేయి గుర్తు తెచ్చుకుని, అప్పటికప్పుడు మళ్ళీ వంట చేయడం ఆ స్నేహితుల మధ్య ఆప్యాయతని పట్టిస్తాయి. ‘విజయవాడ కబుర్ల ప్రవాహం మొదలయితే అంతెక్కడ’ అనే ఈ వాక్యం నాకు స్వానుభవమే. ఈ కథలో అతిథి కోసం సుప్రియ మళ్ళీ వంట చేస్తున్నప్పుడు కుక్కర్‌ని, ప్యాన్‌ని, ఆలుగడ్డల్ని చిన్న చిన్న పదాలలో, గొప్పగా వర్ణించారు రచయిత్రి. ‘అతిథి దేవోభవ’ కథ మంచి అనుభూతిని మిగుల్చుతుంది.

ఆధునిక వస్త్రధారణలో వస్తున్న వింతపోకడలను కళ్ళకు కడుతుంది ‘అబ్బబ్బ! ఏమి నాగరికత’ కథ. చిన్న పాపకి పుట్టిన రోజు కానుకగా ఓ డ్రెస్ కొందామని వెళ్ళి, షాప్ వాళ్ళు చూపిస్తున్న ఏ డ్రెస్ నచ్చక, చివరికి ఉన్నవాటిలో కాస్త మెరుగనిపించిన డ్రెస్‌కి ఒక స్లీవే ఉంటే, దాన్ని తీసేయించి, నీట్‌గా సెట్‌ చేసి తీసుకెళ్ళిన ఆవిడ – స్టేజ్ మీద తల్లీకూతుర్లని చూసి విస్తుపోతుంది. వాళ్ళిద్దరూ ట్రెండీగా ఉన్నారని పార్టీకి వచ్చిన జనాలు అనుకుంటూంటారు. పిల్లకే అటువంటి డ్రెస్ నప్పదని భావించిన ఈవిడ – స్టేజ్ మీద తల్లి కూడా అలాంటి డ్రెస్సే వేసుకునేసరికి జీర్ణించుకోలేకపోతుంది.

ప్రతిఫలం ఆశించిక చేసిన, ఓ చిన్న సాయం, అవసరానికి ఎలా ఆదుకుందో ‘ఆఠాణా! కథా కమామీషు’ కథ చెబుతుంది. ఒకప్పటి కలకత్తా నేపథ్యంగా సాగిన కథ ఇది. “రెండు విచ్చిన కల్హార సరస్సుల వేదనకు తెరపడుతుండగా” అంటూ కళ్ళలోంచి బయటకు ఉబకబోయిన నీటిని ఆపిన వైనాన్ని గొప్పగా రాశారు.

“నా అక్కాచెల్లెళ్ళకు నేను నిచ్చెనలాంటివాడిని” అంటూ ఓ పొడగరి గురించి చెప్పడం ఎంత బావుందో కదా! తన పొడుగు వాళ్ళకి ఉపయోగపడిందన్న అర్థమూ, వాళ్ళ ఎదుగుదలకు తాను దోహదపడ్డానన్న సూచన ఇందులో ఇమిడిపోయాయి. అంతటి పొడగరికి ఓ ప్రయాణంలో ఎదురైన ఓ చేదు అనుభవం తన పొడుగు మీద అతనికున్న కించిత్ గర్వాన్ని పటాపంచలు చేస్తుంది ‘ఆరడుగుల బుల్లెట్’ కథలో.

కలకత్తా మెట్రో రైలు ప్రయాణం నేపథ్యంగా అల్లిన కథ ‘ఊరించే అమ్మాయి’. ఇంతకు ముందు ప్రస్తావించిన కథలో అతను పొడగరి అయితే, ఈ కథలో ఆమె పొట్టి. రద్దీగా రైల్లో, సపోర్ట్ కోసం పైన రాడ్ అందుకోలేక ఇబ్బందిపడుతుంది. ఆ ప్రయత్నంలో ఆమె వేసుకున్న డ్రెస్, కాస్త పైకి పోవడంతో మగవాళ్ళ ‘చూపు’ మారుతూంటుంది. శరీరం పొట్టిదైనా, మనసు విశాలమని చాటుకుంటుందామె.

ఎడబాటు’ కథ ఇతివృత్తం బాగా నలిగినదే. “వాస్తవానికి చిరుకల్పన జోడించి వ్రాసిన కథ” అంటూ ఈ కథ నేపథ్యమేమిటో రచయిత్రి సంచికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

పెద్దవాళ్ళు ఒక్కోసారి యాదృచ్ఛికంగా అన్న మాటలు, తరువాతి కాలంలో నిజమైతే ఎలా ఉంటుందో ‘గులాబీ అత్తరు’ కథ చెబుతుంది. మామగారి అవసరాన్ని గుర్తించి, ఆయన అభిమానం దెబ్బతినకుండా, ఆ అవసరం తీర్చిన అల్లుడి వైనం ‘చెప్పవే చిరుగాలి’ కథ వివరిస్తుంది.

ఎదుటివారికి ఎదురవ్వచ్చన్న ఇబ్బంది/అసౌకర్యం తనకే ఎదురైతే ఎలా ఉంటుందో ‘జోడూ.. గోడూ..’ కథ చెబుతుంది. రోజూ తను ఆ దారిలో వెళ్తున్నప్పుడు తనను ఉద్దేశించే పాటలు పెడుతున్నాడని ఓ షాప్ యజమానిని తిట్టబోయి, తన పొరపాటు గ్రహిస్తుందామె. కనబడేవన్నీ నిజాలు కావని ‘పరదేశి’ కథ చెబుతుంది.

పేరులో నేముందీ’ కథ హాస్యంగా సాగినా, ఒక జీవన సత్యాన్ని చాటుతుంది. రెండు పువ్వులు ఒకదానితో ఒకటి తమ ఈతిబాధలు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ‘మల్లెలూ – మందారాలూ’ కథ చెబుతుంది.

మీరా-కొత్తిమీర’ చక్కని కథ. పల్లెవాసుల ప్రేమాభిమానాలను చాటిన కథ. ‘శ్వేత ఎవరు’ కథ కొద్దిపాటి ఉత్కంఠను కలిగించినా, చదువరులు గ్రహించేస్తారు శ్వేత ఎవరో.

నిజాయితీకి చక్కని కానుక దక్కితే ఎలా ఉంటుందో ‘సంత బొమ్మాళి’ కథ చెబుతుంది. ఈ కథ గురించి రచయిత్రి ఏం చెప్పారో వారి ఇంటర్వ్యూలో చదవచ్చు. ‘సీతమ్మ మాయమ్మ’ ఆర్ద్రమైన కథ. ఈ సంపుటిలో రచయిత్రికి నచ్చిన కథ ఎందుకయిందీ వారి ఇంటర్వ్యూలో చదవచ్చు.

జెండర్ తెలియని పేర్లు పెట్టుకుంటే ఎదురయ్యే ఇబ్బందిని హాస్యంగా చెబుతుంది ‘సింహాచలం’ కథ. పేదవారి బ్రతుకుల్లోని వెలితిని ప్రదర్శిస్తుందీ కథ. కొత్త దంపతుల కాపురాన్ని ఉగాది పచ్చడితో పోలుస్తూ, సంసారం సజావుగా సాగడానికి చక్కని సలహాలిస్తారో బామ్మగారు ‘సంసారంలో సరిగమలు’ కథలో.

~

చాలా కథల్లో చివరి వాక్యమో, లేదా లాస్ట్ బట్ వన్ వాక్యమో తెలుగు/హిందీ సినిమా పాటల పల్లవో లేక పాటలోని ఓ వాక్యమో అయి, రచయిత్రికి పాటలపై ఉన్న పట్టుని నిరూపిస్తాయి. అయితే ఆయా పాటలని కథల్లో చేర్చడం అలవోకగా జరిగింది తప్ప, బలవంతానా జొప్పించినట్టు ఉండదు. అలాగే చాలా కథలు రచయిత్రి పరిశీలనా శక్తిని పట్టిస్తాయి. తన చుట్టూ జరిగేవాటిని ఆమె ఎంత శ్రద్ధగా గమనిస్తారో, అవసరమైన చోట ఎలా కథల్లో వాడుకుంటారో గ్రహించినప్పుడు రచయిత్రిగా ఆమె ప్రతిభ అవగతమవుతుంది.

~

కథల లోని సంభాషణలు, వర్ణనలు, ప్రయోగాలు హాయిగొలిపితే, రచయిత్రి ఎంచుకున్న ఇతివృత్తాలు, నేల విడిచి సాము చేయని ధోరణి, కథన శైలి, క్లుప్తత, సున్నితమైన హాస్యం వంటివి పాఠకులకు తృప్తినిస్తాయి.

***

మల్లెలూ – మందారాలూ (కథా సంపుటి)
రచన: గోళ్ళమూడి కిరణ్మయి
ప్రచురణ: జెవి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 192
వెల: ₹ 200/-
ప్రతులకు:
జి.వి.ఎన్. చంద్రమోహన్,
ఫోన్: 9866372149
~
గోళ్ళమూడి కిరణ్మయి
ఫోన్‌: 9000017269 (వాట్సప్ మాత్రమే)
~

 

ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/dp/939472835X

~

గోళ్ళమూడి కిరణ్మయి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-gollamudi-kiranmayi/

Exit mobile version