Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపు

[శ్రీ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ‘మలుపు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“పేషెంట్‌కి ఎలావుంది?” అడిగాడు రాయుడు.

“రికవర్ అయ్యే లక్షణాలు కొద్దిగా కనిపిస్తున్నాయి” చెప్పారు డాక్టర్.

“సరే. ఒకవేళ అవసరమనుకుంటే స్పెషలిస్టులను పిలిపించండి. డబ్బు కోసం ఆలోచించకండి. ట్రీట్మెంట్ బాగుండాలి. థాంక్స్ డాక్టర్” అని ముందుకు కదిలాడు రాయుడు. గుమాస్తా అతన్ని అనుసరించి వెళ్ళాడు.

ఇదంతా పేషెంట్ ఉన్న రూమ్ బయట వరండాలో జరిగింది. రాయుడి ప్రవర్తనకు విస్తుపోతూ, అతను వెళ్ళిన వైపే చూసాడు డాక్టర్. గదిలో మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మ, రాయుడు లోపలకు వచ్చి తనని పలకరిస్తాడెమోనని చాలా ఆశగా చూసింది. కానీ రాయుడు లోపలకు రాకుండా వరండాలోంచే వెళ్ళిపోవడం ఆమెకి చాలా బాధ కలిగించింది. నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది.

రాయుడిని సాగనంపి, గుమస్తా రాఘవయ్య, డాక్టర్ గదిలోకి వచ్చాడు.

“అమ్మగారికి మందులు ఏమైనా తేవాలా సార్?” వినయంగా అడిగాడు రాఘవయ్య.

“అవసరం లేదు నిన్న తెచ్చినవే ఉన్నాయి” అన్నారు డాక్టర్.

“అవునూ, మీ రాయుడు గారు ఏం బిజినెస్ చేస్తారు? తల్లి దగ్గర ఉండకుండా అలా వెళ్ళిపోతున్నారు?” అడిగారు డాక్టర్.

“బిజినెస్ ఏం లేదండి. వ్యవసాయం, చేపల చెరువులు ఉన్నాయండి. దగ్గరుండి వాటిని చూసుకుంటారు” నెమ్మదిగా చెప్పాడు రాఘవయ్య.

‘సరే, మీరు వెళ్ళవచ్చు’ అన్నట్టు సైగ చేసారు డాక్టర్. గదిలోంచి బయటకు వచ్చిన రాఘవయ్య వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కాసేపటికి శివపురం సర్పంచ్ చంద్రమౌళేశ్వర రెడ్డి వచ్చాడు రాఘవయ్య దగ్గరికి. “శాంతమ్మ గారికి ఎలావుంది?” ఆదుర్దాగా అడిగాడు సర్పంచ్.

“ఇప్పుడు ఫరవాలేదు సార్. కొంచెం కళ్ళు తెరిచి చూస్తున్నారు. రెండు రోజులు అసలు సృహలోనే లేరు” నెమ్మదిగా చెప్పాడు రాఘవయ్య.

“నేను మా అమ్మాయి గారింటికి హైదరాబాద్ వెళ్లాను. పొద్దున్న రాగానే, శాంతమ్మ గారికి వంట్లో బాగుండలేదు, రాజమండ్రి హాస్పిటల్‌లో చేర్చారు, అని చెప్పారు. వెంటనే ఇలా వచ్చేసాను. అసలేం జరిగింది?” అడిగాడు సర్పంచ్.

“మూడు రోజులు కిందట బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయారు శాంతమ్మ గారు. గోడకి ఉన్న కుళాయి స్టీల్ నాబ్ తలకు బలంగా తగిలి గాయం అయ్యింది. చాలా రక్తం పోయింది. అసలే నీరసంగా ఉన్న శాంతమ్మ గారు స్పృహ తప్పిపోయారు. కాసేపటికి పనిమనిషి చూసి, నాకు ఫోన్ చేసింది. నేనూ, పనిమనిషి జాగ్రత్తగా శాంతమ్మ గారిని హాలులోకి తీసుకువచ్చి దివాన్‌ఫై పడుకోబెట్టాం. నేను రాయుడు గారికి ఫోన్ చేసాను. ఆయన పంపిన కారులో శాంతమ్మ గారిని రాజమండ్రి తీసుకువచ్చి ఈ హాస్పిటల్‌లో చేర్చాను” చెప్పాడు రాఘవయ్య.

“అయినా రాయుడు చేపల చెరువులనీ, పిల్లల చడువులనీ, తణుకు మకాం మార్చడం ఏం బాగాలేదు. తల్లిని శివపురంలో ఒంటరిగా వదిలేసాడు. తను తల్లి దగ్గరకు రాడు. తల్లిని తనతో తీసుకెళ్ళడు. ఈ వయసులో శాంతమ్మని ఇలా బాధపెట్ట్టడం తప్పు కదూ” అన్నాడు సర్పంచ్.

రాఘవయ్య ఏం మాట్లాడలేదు.

“అవునూ, రాయుడు తల్లితో మాట్లాడి ఏడేళ్ళు అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. అసలు వాళ్ళ ఇద్దరి మధ్యా ఏం జరిగింది? చెప్పు రాఘవయ్య. నువ్వు రాయుడికి చాలా నమ్మకమైన గుమాస్తావి. పైగా వాళ్ళు నిన్ను తమ మనిషిగానే చూస్తారు. ఆస్తి కోసం ఏమైనా గొడవ పడ్డారా” అడిగాడు సర్పంచ్.

“నాకేం తెలియదండి” వినయంగా అన్నాడు రాఘవయ్య. సర్పంచ్ కాసేపుండి, గదిలోకి వెళ్లి శాంతమ్మని చూసాడు. ఆమె నిద్రపోతోంది. బయటకు వచ్చి రాఘవయ్యతో “అవసరమైతే నాకు ఫోన్ చేయి. నేను వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు సర్పంచ్.

వరండాలోంచి వెళ్తున్న డాక్టర్ రఘు, సర్పంచ్ రాఘవయ్య మాటలు విన్నారు. ఆయన మరోసారి ఆశ్చర్యపోయారు. రాయుడు తల్లితో మాట్లాడి ఏడేళ్ళు అయ్యిందా? అంటే వారిద్దరి మధ్యా ఏదో గొడవ జరిగి ఉంటుంది. అందుకనే తల్లి ప్రాణాపాయస్థితిలో ఉన్నా కూడా, దగ్గరకు రాకుండా వరండాలోనే ఉండి వెళ్ళిపోతున్నాడు. తల్లి బాధ్యత గుమాస్తా మీద పెట్టి, తప్పించుకు తిరుగుతున్నాడు. ఏమిటో రాను.. రానూ రక్త సంబంధాలు కూడా పలచబడిపోతున్నాయని నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయారు డాక్టర్ రఘు.

***

రాయుడు రాజమండ్రి నుండి తిన్నగా ఆలమూరు వచ్చి చేపల చెరువులని ఓ సారి చూసి పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లోకి వెళ్ళాడు. అతని మనసు కుదురుగా లేదు. చాలా చికాకుగా ఉంది. ఏడేళ్ళ క్రితం జరిగిన సంఘటన మరలా కళ్ళ ముందు కదలాడింది.

***

శివపురం గ్రామంలో ఎనభై ఎకరాల మాగాణి, పది ఎకరాల కొబ్బరితోట ఉన్న భూస్వామి వేంకటాద్రి రాయుడు. పెళ్లి అయిన పది ఏళ్లకు పుట్టాడు నీలాద్రి రాయుడు. కొడుకు పుట్టిన పది ఏళ్ళకి గుండె జబ్బు వచ్చి చనిపోయాడు వెంకటాద్రి రాయుడు. తండ్రి లేని పిల్లాడని శాంతమ్మ కొడుకుని ఏమీ అనేదికాదు. దానితో నీలాద్రి రాయుడు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. వసుంధర ముప్ఫై ఎకరాల కట్నం, మూడు వందల కాసుల బంగారంతో రాయుడి ఇల్లాలిగా వచ్చింది.

రాయుడికి శివపురంలో తూర్పున అరవై ఎకరాలు, ఉత్తరాన ఇరవై ఎకరాల్ల మాగాణి పొలం ఉంది. తూర్పు పొలం కిందన కొంతమంది సన్నకారు రైతుల పొలాలు ఉన్నాయి. పెదరాయుడి గారి కాలంలో వీరి పోలాలకు నీరు పంట కాలువ ద్వారా సక్రమంగా అందేది. కానీ చిన రాయుడి పెత్తనం వచ్చాకా, కింది పొలాలకు నీరు అందకుండా, కాలువకు అడ్డుకట్ట వేసి ఇబ్బంది పెడుతున్నాడు రాయుడు. రైతులు ఇరిగేషన్ అధికారులకు నీటి ఇబ్బంది గురించి చెబితే, “పెద్దవాళ్ళతో గొడవలు పడకండి. సామరస్యంగా పరిష్కరించుకోవాలి” అని చెప్పారు గానీ, వారికి న్యాయం చేయలేదు.

వారంరోజులు చూసాడు అప్పలనాయుడు. నాట్లు వేసినప్పుడు పెట్టిన నీరే కానీ, మరలా చుక్క నీరు కాలువ కిందకు రాలేదు. రాయుడు పోలాల లోని వరి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. కింది పొలాల లోని వరి మొక్కలు తలలు వాల్చేయదానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షం జాడే లేదు. కింది పొలాల రైతులు అందరూ, వడదెబ్బ తగిలిన బాటసారుల్లా మొహాలు వేలాడేసి కూర్చున్నారు.

రాయుడు చెరువు గట్టున ఉన్న మామిడి చెట్టు కింద మడత కుర్చీలో కూర్చుని విలాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు. ఆయన్ని అలా చూసి కోపంతో రగిలి పోయాడు అప్పలనాయుడు. చేతిలో బాణాకర్రతో విస విసా నడిచి రాయుడు దగ్గరకు వచ్చాడు.

“రాయుడు గారూ, మీ పద్ధతి ఏం బాగా లేదండి. మీ పొలాలకు కావాల్సినంత నీరు వచ్చినదిగా. ఇంక కాలవకు వేసిన ‘అడ్డుకట్ట’ తీసేయండి. మా పొలాలకు నీళ్ళు వస్తాయి” అన్నాడు అప్పలనాయుడు కోపాన్ని దిగమింగుకుని.

“ఇంకో రెండు రోజులు ఆగితే నా పొలాలకు పూర్తి నీరు వస్తుంది. అప్పుడు అడ్డుకట్ట తీస్తాను” అన్నాడు రాయుడు సిగరెట్ పొగ విలాసంగా గాలి లోకి వదులుతూ.

“రెండు రోజులు ఆగితే, మా వరి మొక్కలు పూర్తిగా తలలు వాల్చేస్తాయి. ఇది చాలా అన్యాయం రాయుడు గారూ” అన్నాడు అప్పలనాయుడు.

“ఏమిటీ న్యాయం గురించి మాట్లాడుతున్నావ్. మీ పొలాలు నాకు అమ్మండి. ఇక్కడ ఫ్యాక్టరీ పెడతానంటే ఏమన్నారు? ‘ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. భూదేవినే నమ్ముకున్నాం. మేం మీకు అమ్మం’ అన్నారు. అలాగే బతకండి” అన్నాడు వ్యంగ్యంగా రాయుడు.

“ఆ సంగతి మనసులో పెట్టుకుని మమ్మల్ని బాధపెట్టడం మీకు భావ్యం కాదు. మేం ఒకరికి ఉపకారం చేసిన వాళ్ళమే కానీ, మీలా పక్కవాళ్ళని కష్టపెట్టిన వాళ్ళం కాదు” అన్నాడు బాధగా అప్పలనాయుడు.

“అంటే మీరు అందరూ ‘పరోపకారి పాపన్నలు’ అన్నమాట. నీ కాకమ్మ కథలు ఎక్కడైనా చెప్పు” అన్నాడు రాయుడు వెటకారంగా. ఆ మాటలకు అప్పలనాయుడు రగిలిపోయాడు.

“రాయుడుగారూ, మీరు ఈరోజు ఇలా ఉన్నారంటే కారణం మా అమ్మే” అన్నాడు రోషంగా అప్పల నాయుడు. అతని మాటలకి పెద్దగా నవ్వాడు రాయుడు.

“ఏంట్రోయ్, మీ అమ్మ ఏదో పెద్ద డాక్టర్ అయినట్టూ, నన్ను రోగం నుంచి కాపాడినట్టూ మాట్లాడుతున్నావ్. మీ అమ్మ కూలీయేగా. ఎవరికీ తెలియకుండా డాక్టర్ పరీక్ష ఎప్పుడు పాస్ అయ్యిందీ?” అని బిగ్గరగా నవ్వాడు రాయుడు.

“రాయుడుగారూ, మీ వెటకారాలు ఆపండి. మా అమ్మ కూలీయే. కానీ ఏమీ ఆశించకుండా, ఆకలితో అల్లాడిపోతున్న మీ ఆకలి తీర్చి మిమ్మల్ని కాపాడింది. మీరు పుట్టినప్పుడు మీ అమ్మగారి దగ్గర పాలు లేవు. మా అక్క పుట్టి నెల అయ్యింది. మీ అమ్మగారు, మా అమ్మకి కబురు చేసి బతిమాలితే, మా అక్కకి ఇవ్వకుండా మీకు పాలు ఇచ్చింది మా అమ్మ. మా అక్క డబ్బా పాలు తాగింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, మీ అమ్మగారు మా అమ్మ దగ్గర ‘మాట’ తీసుకున్నారు. మా అమ్మ చనిపోయేటప్పుడు ఈ సంగతి నాకు చెప్పి, ‘రాయుడు బాబుతో సఖ్యతగా ఉండు బిడ్డా’ అని నా చేత ఒట్టు వేయించుకుంది ఇప్పుడు చెప్పండి. మా అమ్మ గొప్పది కాదా?” రాయుడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు అప్పలనాయుడు.

అతని మాటలు వినగానే రాయుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. మనిషి ఆవేశంతో ఊగిపోయాడు.

అప్పల్నాయుడి చొక్కా కాలర్ పట్టుకున్నాడు. “ఒరేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? అవాకులూ, చెవాకులూ పేలితే నీ ప్రాణాలు తీస్తాను” అన్నాడు రాయుడు.

“అలాగే. మీరు ఇంటికి వెళ్లి మీ అమ్మగారిని అడగండి, ఈ సంగతి. ఆవిడ ఇది అబద్ధం అంటే, మీ ఎడమకాలి చెప్పుతో నా రెండు దవడలూ వాయించండి. మీ ఇష్టం వచ్చిన శిక్ష వెయ్యండి, భరిస్తాను” అన్నాడు అప్పలనాయుడు. రాయుడు, చెరువుగట్టు నుండి రోడ్డు దగ్గరకు వచ్చి మోటార్ సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చాడు. సావిట్లో ఉన్న తల్లిని చేయి పట్టుకుని తల్లి బెడ్ రూమ్ లోకి తీసుకువచ్చాడు. తలుపు గడియ వేసాడు. శాంతమ్మ, కొడుకు చేష్టలు అర్థం కాక అతని కేసి అయోమయంగా చూసింది.

“అమ్మా, నా చిన్నప్పుడు నువ్వే పాలిచ్చి పెంచావా? లేక డబ్బా పాలతో పెంచావా?” ఆత్రుతగా అడిగాడు రాయుడు. కొడుకు ప్రశ్నకి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. తర్వాత ‘ఇదేదో తుఫాన్‌కి దారి తియ్యదు కదా?’ అని ఆందోళన పడింది. వెంటనే సర్దుకుంది.

“ఆ విషయం ఇప్పుడు ఎందుకు నాయనా?” నెమ్మదిగా అంది శాంతమ్మ.

“అది చాలా అవసరమమ్మా చెప్పు” అన్నాడు రాయుడు ఆత్రుతగా. శాంతమ్మకి అర్థం అయ్యింది, ఈ విషయంలో ఏదో చర్చ జరిగిందని.

“రాయుడూ, నీకు ముందు ఇద్దరు పిల్లలు పుట్టి వెంటనే చనిపోయారు. మీ నాన్న చాలా బెంగ పెట్టుకున్నారు, తన తర్వాత వంశం నిలుస్తుందా? లేదా? అని. మూడోసారి నేను కడుపుతో ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్లకు చూపించుకుని చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎన్నో దేవుళ్ళకు మొక్కుకున్నాం నేనూ, మీ నాన్నా. మా నోముల ఫలంగా నువ్వు జన్మించావు. వంశం నిలబడింది. కానీ నా దురదృష్టం ,

నీకు పాలిచ్చి పెంచే అదృష్టం నాకు దక్క లేదు” శాంతమ్మ కన్నీరు కారుస్తూ చెప్పింది.

“నా దగ్గర పాలు లేకపోవడంతో నీకు డబ్బాపాలు పట్టే ప్రయత్నం చేసాం. అవి నీకు పడలేదు. ఆవుపాలు పడితే అవీ నీకు పడలేదు. వాంతులూ, విరేచనాలూ అయ్యి నీవు బాగా చిక్కిపోయావు. డాక్టర్లకి చూపిస్తే ‘తల్లిపాలు పట్టండి, అదొక్కటే మార్గం’ అన్నారు” అని ఒక్క క్షణం ఆగింది శాంతమ్మ. ఆమె ఏం చెబుతుందా? అని కళ్ళు పెద్దవి చేసుకుని, చెవులు రిక్కించి తల్లికేసే చూసాడు రాయుడు. అతన్ని అలా చూసి ‘నిజం చెప్పడమే మంచిదని’ నిర్ణయించుకుంది శాంతమ్మ.

“అప్పుడు మన పొలంలో పనిచేసే సింహాచలానికి ఆడపిల్ల పుట్టిందని తెలిసింది. ఆమెకి కబురు చేసి డాక్టర్లు నీ గురించి చెప్పిన మాట చెప్పాను. ఆమె సంతోషంగా అంగీకరించి, మూడు నెలలు నీకు తన పాలు ఇచ్చి పెంచింది. అయినా ఈ విషయం ఎవరకీ చెప్పవద్దని నేను సింహాచలం దగ్గర మాట తీసుకున్నాను. నీకు ఎలా తెలిసింది?” అంటూ ఇంకా ఎదో చెప్పబోయింది శాంతమ్మ. అప్పటికే రాయుడు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.

బయటకు వచ్చిన రాయుడి తలలో సముద్రపు హోరు ధ్వని చోటుచేసుకుంది. గమ్యం తెలియని బాటసారిలా నడవసాగాడు. ‘ఒరేయ్, రాయుడు మా అమ్మ దగ్గర పాలు తాగి పెరిగాడు తెలుసా?’ అని అప్పలనాయుడు గాంధీ బొమ్మల సెంటర్లో పరిహసిస్తున్నట్టు అనిపించింది. రెండు చెవులూ మూసుకున్నాడు. టాక్సీ ఎక్కి రాజమండ్రి వచ్చి హోటల్‌లో దిగాడు. రెండు రోజులు తాగుతూ ఆస్థిమితంగా గడిపాడు. మూడవ రోజు గుమాస్తాకి కబురు చేసి, ‘శివపురంలో పొలాలు అన్నీ మీరే జాగ్రత్తగా చూడండి, మీ శాంతమ్మ గారిని కూడా’ అని చెప్పాడు. భార్యా పిల్లలతో తణుకులో మకాం పెట్టాడు. ఆలమూరు దగ్గర చేపల చెరువులు తవ్వించి వాటిని చూసుకుంటున్నాడు. మరలా శివపురంలో అడుగు పెట్టలేదు, తల్లి మొహం చూడలేదు.

***

మర్నాడు శాంతమ్మని చూసిన డాక్టర్ రఘు, ఆమెకి బి.పి. పెరగడం చూసి ఆశ్చర్యపోయాడు. సిటీ లోని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శైలజని పిలిపించి, శాంతమ్మకి టెస్టులు చేయించారు. రిపోర్టులు వచ్చాకా, వాటిని చూసింది డాక్టర్ శైలజ. “ప్రస్తుతం శాంతమ్మ గారి పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆమె దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనల నుండి ఆమెని బయటకు తీసుకురావాలి. లేకపోతే బి.పి. పెరిగి, తలకి తగిలిన గాయం నుండి రక్తం కారే ప్రమాడం రావచ్చు. వాళ్ళ బంధువులకు చెప్పండి” అని డాక్టర్ శైలజ వెళ్ళిపోయారు.

డాక్టర్ రఘు, గుమాస్తా రాఘవయ్యని పిలిచి “రాయుడు గారికి అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయండి” అని చెప్పారు. అదే సమయానికి శాంతమ్మ తమ్ముడు వెంకట్రావు, పాలకొల్లు నుండి వచ్చాడు అక్కయ్యని చూడటానికి. డాక్టర్ శైలజ చెప్పిన విషయం వెంకట్రావుకి చెప్పారు డాక్టర్ రఘు. రాఘవయ్య, రాయుడికి ఫోన్ చేస్తే ‘అర్జెంటు పని మీద కాకినాడ వెళ్లానని, మధ్యాహ్నం వస్తాన’ని చెప్పాడు.

వెంకట్రావు, శాంతమ్మ రూమ్ లోకి వెళ్ళాడు. తలకు కట్టుతో బెడ్ మీద పడుకుని ఉన్న అక్కని చూడగానే అతని మనసు బాదగా మూలిగింది. ‘అక్కా’ అని పిలవగానే, కళ్ళు తెరిచి చూసింది. కొద్దిసేపటికి ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రాలాయి. అది చూసి “బాధపడకు అక్కా, నీకు తగ్గిపోతుంది. నేను రాయుడితో మాట్లాడతాను” అని అన్నాడు వెంకట్రావు. అతను అన్న చివరిమాటలకి, శాంతమ్మ కళ్ళు కొద్దిగా మెరవడం గమనించాడు వెంకట్రావు.

రెండు గంటలకు రాయుడు హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్ రఘుని కలిసాడు. ‘మీ అమ్మగారి మానసిక ఒత్తిడి తగ్గించకపొతే, ప్రమాదం జరగవచ్చని’ హెచ్చరించాడు డాక్టర్ రఘు.. గది బయటనుండే తల్లిని చూసి వచ్చిన రాయుడిని, హాస్పిటల్ ఆవరణలో ఉన్న చెట్టు కిందకు తీసుకువచ్చాడు వెంకట్రావు.

“చూడు రాయుడూ, తల్లితో మాట్లాడటం మానెయ్యడం గొప్ప ఘనకార్యం అని అనుకుంటున్నావు. మీ అమ్మ మూడోసారి గర్భం ధరిస్తే, ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా వినలేదు. నేను పోయినా ఫరవాలేదు. వంశం నిలబడాలని ప్రాణాలకి తెగించి నీకు జన్మ నిచ్చింది. నీకు పాల సమస్యే కాదు. పుట్టినప్పటి నుండీ అన్నీ రోగాలే. ఒకసారి టైఫాయిడ్ వస్తే, మరోసారి పొంగు జ్వరం. రాత్రింబవళ్ళు మేలుకుని, నీకు మందులు వేస్తూ సేవలు చేస్తూ, తానూ అనారోగ్యం తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీ కోసం మనిషిని పెడతానని మీ నాన్న అంటే మీ అమ్మ ఒప్పుకోలేదు. ‘నా బాబుని నేనే చూసుకుంటాను’ అని చెప్పింది. నీ ఆరోగ్యం కోసం పీర్ల పంజా దగ్గర ‘నిప్పుల గుండం’లో నడిచింది మీ అమ్మ. ఏ తల్లీ ‘నీ కోసం నేను ఇంత కష్టపడ్డాను’ అని బిడ్డకు చెప్పదు. అది తల్లుల గొప్పదనం. నీ ప్రాణం నిలబడటానికి, నీకు సింహాచలం దగ్గర పాలు ఇప్పించి నిన్ను మనిషిని చేసింది, అది తప్పా?

రాయుడూ, ఒక విషయం గుర్తు పెట్టుకో. వాళ్ళు కింది వాళ్ళు, మనం పై వాళ్ళం అనే అహంకారం విడిచిపెట్టు. వాళ్ళు ఎండనకా, వాననకా కష్టపడితేనే మనం ‘లక్షలు’ బ్యాంకులలో వేసుకుంటున్నాం. అది తెలుసుకో. కులం ముఖ్యం కాదు. మనిషికి మానవత్వం ఉండాలి. ఇప్పటికే శివపురంలో అందరూ నిన్ను చీదరించుకుంటున్న్నారు. ఇప్పుడైనా మారు. నీ తల్లిని బతికించుకో. లేదంటే నేను కూడా నిన్ను అసహ్యించుకోవలసి వస్తుంది” అని విస విసా నడుస్తూ వెళ్ళిపోయాడు వెంకట్రావు.

సాయంత్రం శాంతమ్మని చూడటానికి రూమ్ లోకి వచ్చిన డాక్టర్ రఘు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. రాయుడు తల్లి మంచం దగ్గరే స్టూల్ మీద కూర్చున్నాడు. అతని చేతిలో తల్లి చేయి ఉంది.

శాంతమ్మ కళ్ళు ఆనందభాస్పాలు రాలుస్తున్నాయి. డాక్టర్ రఘు పెదవులపై దరహాస కుసుమం విరిసింది.

Exit mobile version