Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపు ఉన్నది జాగ్రత్త

[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘మలుపు ఉన్నది జాగ్రత్త’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్పటి దాకా భోరున కురిసిన వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో, బజారులోని బిల్డింగులు పంచనా, షాపుల ముందరి రేకు చూరుల క్రిందా తలదాచుకున్న జనం బయటకు వచ్చి, తమ తలలు దులుపుకునీ, వాహనాల సీట్లు తుడుచుకుని ఎవరి త్రోవను వాళ్ళు బయలుదేరారు. ఆ టౌన్ నుంచి బైపాస్ రోడ్ దాటాకా పదిహేను కిలోమీటర్ల తర్వాత వచ్చే పిఠాపురం మీదుగా వెళ్లే ఆ రోడ్‌ను పిఠాపురం రోడ్ అంటారు. టౌను మధ్యలోంచి వెళ్లే రైల్వే ట్రాక్‌పై రెండు మూడు చోట్ల ఫ్లైఓవర్లు కట్టడడంతో ఇవతలి ప్రాంతం అంతా కొత్త సిటీగా అభివృద్ధి చెందింది. రోడ్లు, డ్రైన్లు సరిగా వెయ్యక పోవడంతో గట్టిగా వర్షం వస్తే చాలు దారులన్నీ కాలువలుగా మారతాయి.

‘కొండంత ఎండైనా పర్లేదు, సిన్నంత సినుకుతో సెడ్డ సిక్కే’ అనుకుంటూ పైటకొంగుతో తలతుడుచుకుంది అచ్చియమ్మ. రోడ్ వారగా బల్ల మీదున్న ఆకుకూరలపై వేగంగా వెళ్తున్న వాహన చక్రాల నుండి ఎగజిమ్మే బురదనీళ్ళు పడకుండా కవర్లు కప్పుతూ ప్రయాస పడుతోంది. “ఆక్కూరలండి! ఆక్కూరలమ్మా!” అంటూ దారినపోయే వాళ్లకు చూపిస్తోంది. ఆ ఆక్కూరలన్నీ చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుండి తెచ్చి ఆమె దగ్గర వేస్తాడు గోవిందు. సాయంకాలం దాకా అమ్మగా వచ్చిన డబ్బులో ఆమెకు కొంత ఇస్తాడు గోవిందు. అదే అచ్చియమ్మకు భుక్తి మార్గం.

ఆ రోడ్డు ప్రక్కన ఉన్న గుడిసెలో ఒంటరిగా ఉంటుంది అచ్చియమ్మ. ఆ ప్రాంతమంతా పొలాలుగా ఉన్నప్పుడు వాటిలో పనిచేసే నర్సయ్యను పెళ్లి చేసుకోవడంతో అక్కడికొచ్చింది. నర్సయ్య బల్ల రిక్షా తొక్కేవాడు. ఓ ఏడాది ముక్కనుమనాడు రాత్రి పూటుగా తాగి ఆ రిక్షా బల్లమీదే ప్రాణాలు వదిలేసాడు. కొడుకు ఊరికి దూరంగా ఉన్న ఫ్యాక్టరీలో పని చేస్తూ పెళ్లి చేసుకుని అక్కడే కాపరం పెట్టుకున్నాడు. కూతురుకి పొరుగూరు సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆమె ఆ ఊరు వెళ్ళిపోయింది.

అచ్చియ్యమ్మ గుడిసెకు ఎదురుగా రోడ్డవతల ఓ అన్నీ షాపులూ, ఆఫీసులూ ఉండే ఓ ఐదు అంతస్థుల పెద్ద బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ పై కాస్త ఎత్తులో డి.ఎస్.ఎన్. బిల్డర్స్ అనే కళాయి స్టీలు అక్షరాలు తళతళా మెరుస్తుంటాయి. పొద్దున కురిసిన వర్షం తెరిపివ్వడంతో సాయంకాలపు ఎండకు ఆ బిల్డింగ్ నీడ రోడ్ దాటి అచ్చియమ్మ గుడిసెపై పడగలా పరుచుకుంటోంది.

“మీ బిల్డింగ్ మాస్టర్ ప్లాన్ రోడ్ మార్జిన్ దాటి పది అడుగులు ముందుకు వచ్చిందండీ!” చెప్పాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ప్లాను చూపిస్తూ. వింటున్న డి.ఎస్.ఎన్. తన వెంట వచ్చిన ఇంజినీరు వైపు చూసాడు ఏం చేద్దాం అన్నట్టు.

ఆయన వస్తున్నట్టూ, అడిగిన పని చేసిపెట్టాలని స్థానిక ఎమ్మెల్యే నుండి అప్పటికే ఫోన్ వచ్చింది టౌన్ ప్లానింగ్ ఆఫిసరుకు. డి.ఎస్.ఎన్.గా పేరు పొందిన అతని పూర్తి పేరు దిండి సత్యనారాయణ. ఒక తాపీమేస్త్రిగా జీవితం ప్రారంభించిన అతను అంచెలంచెలుగా టౌన్‌లో ప్రముఖ బిల్డరుగా ఎదిగాడు. ఊళ్ళో శక్తిలేని వాళ్ళ స్థలాలూ, తగువులలో ఉన్న స్థలాలూ, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి బిల్డింగులు కట్టి బాగా గడించాడు.

పిఠాపురం రోడ్ లోని తన బిల్డింగ్ గానీ నిబంధనల ప్రకారం కొట్టేయాల్సి వస్తే చాలా నష్టం వస్తుంది తనకు. అంతే కాదు ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుంది. ఆలోచిస్తున్నాడు డి.ఎస్.ఎన్. “రోడ్ కాస్త అవతలి వైపు జరిపి వేస్తే మా బిల్డింగ్ పోకుండా ఉంటుంది కదా సార్!” అన్నాడు డి.ఎస్.ఎన్. ఇంజినీరు. “అవతలి వైపు కూడా చిన్న షాపులూ, ఎప్పటినుంచో ఉంటున్న వాళ్ళ గుడిసెలూ ఉన్నాయి. అయినా అలా రోడ్ వేస్తే అలైన్మెంట్ మారిపోతుంది. హఠాత్తుగా మెలిక తిరుగుతుంది.” చెప్పాడు టౌన్ ప్లానింగ్ ఇంజినీరు.

“ఆ గుడిసెల్నీ, చిన్న షాపుల వాళ్ళనీ నా పలుకుబడి ఉపయోగించి ఖాళీ చేయిస్తాను. ఇక మలుపుకు జనం కొన్నాళ్ళకు అలవాటుపడిపోతారు లెండి. ఆ అలైన్మెంట్ మార్చి రోడ్ వేయించడానికి ప్లాన్ చెయ్యండి సార్!” చెప్పాడు డి.ఎస్.ఎన్.

కాసేపు బేరసారాలు పూర్తయ్యాకా ఒప్పందం కుదిరింది. రోడ్‌కు అవతలి వైపు ఉన్న వాళ్ళను ఖాళీ చేయించి రోడ్ వేయడానికి నిర్ణయమైంది.

ఓ రోజున మున్సిపల్ అధికారులొచ్చి పిఠాపురం రోడ్ వెంబడి ఉన్న రేకు షెడ్లూ, గుడిసెలు వేసుకుని ఉంటున్న వాళ్ళను ఖాళీ చెయ్యమని చెప్పేసి వెళ్లారు. వాళ్ళందరూ గగ్గోలుపెడుతూ ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో, కొంతమంది కాంట్రాక్టరుతో మాట్లాడి కొద్దో గొప్పో ఇప్పించడంతో సర్దుకుని వెళ్లిపోయారు. కొన్నాళ్ళకు కాంట్రాక్టరు యంత్రాలతో వచ్చి షెడ్లనూ గుడిసెలనూ, కూల్చివేశారు. అచ్చియమ్మ గోడూ వేదనా పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఆమెను తీసుకెళ్లి ఓ గోడ వార కూర్చోపెట్టి ఆమె గుడిసె కూడా కూల్చివేశారు. ఆ గోడ నీడలో దిక్కు తోచక బిక్కుబిక్కుమంటూ అలా కూర్చుని ఉండిపోయింది అచ్చియ్యమ్మ. తమ బిల్డింగ్ లోంచి అంతా గమనిస్తున్న డి.ఎస్.ఎన్. రోడ్ అవతల అంతా ఖాళీ అవడంతో తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

కొన్నాళ్లకు ఆ రోడ్ కొత్తగా, మరింత వెడల్పుగా వేశారు. డి.ఎస్.ఎన్. బిల్డింగ్ వద్ద హఠాత్తుగా వచ్చే ఆ మలుపును మాత్రం జనం తిట్టుకుంటుంటారు “ఎవర్రా ఈ రోడ్ వేసింది, బుద్ధిలేని ఎదవలు” అని.

అచ్చియ్యమ్మ, కొడుకూ కూతురూ వచ్చి కాస్త సాయం చేయడంతో అక్కడే ఉంటూ కూడలి దగ్గర నిలిచిన వాహనాల వద్దకు వెళ్లి పూలూ, పళ్ళూ అమ్ముతూ జీవితం సాగిస్తోంది. రాత్రుళ్ళు ఏ మోసిన షాపు ముందో పడుకుంటుంది.

ఒకరోజు డి.ఎస్.ఎన్.కు హఠాత్తుగా హైదరాబాద్ వెళ్లాల్సిన పనిపడింది. టౌను నుండి 60 కిలోమీటర్ల దూరంలో గల విమానాశ్రయం నుండి ఉదయం 5 గంటలకే విమానం ఉండడంతో డ్రైవర్‌తో 3 గంటలకే రమ్మని చెప్పాడు. ఆ సమయానికి లేచి తయారయ్యి “కాస్త స్పీడుగా వెళ్ళాలి ప్రసాదూ! టైం సరిపోదు” అన్నాడు డ్రైవర్‌తో కారు ఎక్కుతూ.

ఫ్లై ఓవర్ దిగి వేగంగా వెళ్తోంది కారు. డి.ఎస్.ఎన్. బిల్డింగ్ వద్ద మలుపు తిరుగుతుండగా రోడ్డుపై నిలిచివున్న లారీని హఠాత్తుగా చూసిన డ్రైవర్ కంగారుగా బ్రేక్ వేసాడు. దాంతో కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి అవతలివైపు పడి పల్టీలు కొడుతూ రోడ్ ప్రక్కన పల్లపు ప్రాంతంలో పడిపోయింది. డ్రైవర్ స్టీరింగ్‌కు సీటుకు మధ్య నొక్కుకుపోయాడు. వెనుక సీట్లో కూర్చున్న డి.ఎస్.ఎన్. తలకు బలంగా ఏదో దెబ్బ తగలడంతో బాధతో అరిచాడు. కాలు డోరులో ఇరుక్కుని విపరీతమైన నొప్పి పెడుతుండగా కళ్ళు మూతలు పడిపోయాయి.

“డాక్టరు గారూ! పేషేంట్‌కు స్పృహ వచ్చింది” అన్న మాటలను వినబడి మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. ఎదురుగా డాక్టరు. తన భుజం మీద చేతిమీద చెయ్యివేసి “ఎలా ఉంది? నారాయణ గారూ!” అడుగుతున్నాడు. కాళ్ళూ చేతులూ కదపబోయాడు. కదల్లేదు. ఒంటి వైపు చూసుకున్నాడు. ఒళ్ళంతా ఏవో కట్లూ, గొట్టాలతో నిండిపోయివుంది. డాక్టరు చెప్పాడు “కంగారేం లేదు మీరు బాగానే ఉన్నారు” అని. ఇంతలో భార్యా, కొడుకూ వచ్చారు. భార్య కన్నీళ్లు ఆపుకుంటూ చూస్తోంది. లేవబోతుంటే వారించి చెప్పాడు కొడుకు “మీ కాళ్ళకూ, తలకూ ఆపరేషన్ చేసారు నాన్నా! కొన్నాళ్లదాకా కదలకూడదు మీరు” తన కాళ్లు అసలు ఉన్నాయో! లేదో సందేహం వచ్చి భయం వేసిందతనికి. మత్తు మాత్రల ప్రభావం తగ్గేసరికి కాళ్ళూ చేతులూ తలా విపరీతమైన నొప్పి పెడుతుండడంతో బాధగా కళ్ళు మూసుకున్నాడు.

“ఎవరో ముసలమ్మ చూసి దారినపోయేవాళ్లతో ఫోన్ చేయించడంతో సరైన టైముకు హాస్పిటల్‌కు తీసుకురాగలిగాం. ప్రాణాలతో దక్కారు. అదే అదృష్టం.” భార్య పరామర్శకు వచ్చిన వాళ్ళతో చెబుతోంది. “పాపం డ్రైవర్ చనిపోయాడట కదా!” అంటున్నారు వాళ్ళు సానుభూతిగా.

పదిహేను రోజుల తర్వాత కట్లు విప్పిన కళ్ళను చూసుకున్నాడు. మోకాలి క్రింద పిక్క పోవడంతో వంకరగా కనిపిస్తోంది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి నడక సాధన చేయించాడు. కొన్నాళ్ళకు నడవగలిగాడు కాస్త కుంటుతూ..

ఒకరోజు తనకు ఆక్సిడెంట్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఫోన్‌లో చూపించాడు. అది పిఠాపురం రోడ్ లోని తమ బిల్డింగ్ ముందున్న కెమెరాలో రికార్డు అయినదే. లారీని తప్పించపోయిన కారు డివైడర్‌ను గుద్ది రోడ్డు పల్టీలు కొడుతూ రోడ్డు అవతల పల్లంలో పడిపోవడం కనపడింది. లారీ డ్రైవర్ భయపడి తన లారీ స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. చీకటి, రోడ్డుకు నుంచి బాగా పల్లపు ప్రాంతంలో పడిన ఆ కారును రోడ్ మీద వెళ్లే వాహనాల వాళ్లకు ఎవరూ గమనించే అవకాశం లేదు. ఇంతలో ఓ ముసలమ్మ పరుగులాంటి నడకతో అక్కడకు చేరుకుంది. శబ్దం ఆమెకు వినపడి వచ్చినట్టుంది. రోడ్ దిగి చీకట్లోకి వెళ్ళింది. కారు దగ్గరకు వెళ్లి చూసినట్లుంది. తిరిగి రోడ్డు మీదకు వచ్చి గుండెలు బాదుకుంటూ, చేతులు ఊపుతూ అడపాదపా వెళ్తున్న వాహనాలను ఆపడానికి ప్రయత్నిస్తోంది. కారు పడిన వైపు చూపిస్తూ దణ్ణాలు పెడుతోంది. అందరూ ఆపకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. చివరకు ఒక మోటార్ సైకిల్ మీద వస్తున్న వాళ్ళు ఆపి దిగి ఆమె చూపించిన వైపు వెళ్లి చూసి వచ్చి ఎవరికో ఫోన్ చేసాడు. కాసేపటికి పోలీసులు, అంబులెన్సు వచ్చి డ్రైవర్ మృతదేహాన్ని, స్పృహ కోల్పోయిన తనను అంబులెన్సులో ఎక్కించారు. ఆంబులెన్సు కదిలింది. అక్కడే నిలుచుండిపోయిన ఆ ముసలమ్మను మరోసారి పరీక్షగా చూసాడు డి.ఎస్.ఎన్. అప్పుడు గుర్తొచ్చిందటానికి. తాను ఖాళీ చేయించిన గుడిసెలలో ఉండే ముసలమ్మని. ఆ తర్వాత కూడలిలో కార్ల వద్ద పళ్ళూ పూలూ అమ్ముతూ చాల సార్లు కనబడుతూ ఉండేది. తన స్వార్థంతో ఇళ్లలోంచి వెళ్లగొట్టించిన వాళ్లలో ఒకామా!, తన ప్రాణాలను కాపాడిన ముసలమ్మ. అపరాధభావంతో మనసంతా నిండిపోయిందతనికి.

తదుపరి రోజున ఆ ముసలమ్మకు ఏదైనా ఆధారం కల్పించి ఆడుకుని తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు డి.ఎస్.ఎన్. కొడుకుని పిలిచి చెప్పాడు “ఆ జంక్షన్‌లో వుండే ఈ పెద్దావిడని పట్టుకుని మన బిల్డింగ్ వాచ్‌మన్ క్వార్టర్‌లో ఉంచు. ఆమెకు ఏ లోటూ రాకుండా ఏర్పాటుచెయ్యి” అని.

“అలాగే నాన్నా!” అన్నాడతడు.

ఓ రోజు అచ్చియ్యమ్మను చూసి కృతజ్ఞతలు చెప్పి రావాలని డ్రైవర్‌ను తీసుకుని కారులో బయలుదేరాడు. కారు ఫ్లైఓవర్ దిగి నెమ్మదిగా వెళుతోంది. తన బిల్డింగ్ సమీపిస్తుండగా, మలుపుకు కాస్త ముందు కొత్తగా ఓ బోర్డు కనిపిస్తుండంతో దానిపై వ్రాసినది చదివాడు. “మలుపు ఉన్నది జాగ్రత్త”. అక్కడ ప్రమాదాలు జరుగుతుండంతో వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తీసుకున్న చర్య అయివుంటుంది. నివ్వెరపోయాడతను. స్వార్థపరులయిన అధికారులు, నాయకులూ, తన లాంటి వ్యాపారులూ ఉన్న ఈ వ్యవస్థలో అంత కంటే మంచిని ఎలా ఆశించగలం, అనుకున్నాడు సిగ్గుతో తల దించుకుంటూ దిండి సత్యనారాయణ గారు.

Exit mobile version