Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మాన్వేషణ దిశగా సాగే మూడు నవలలు

[నారపరాజు కిషోర్ కుమార్ గారి ‘మలుపుల దారుల్లో’, ‘ప్రభాతం లోకి’, ‘నాలోని నేను’ అనే నవలలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

బిట్స్ పిలానీ, హైదరాబాద్ బ్రాంచ్‍లో గణిత శాఖలో బోధకులుగా ఉన్న శ్రీ నారపరాజు కిషోర్ కుమార్ ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. ఉన్నత ఆశయాలున్న వీరు తమ రచనలలో పాత్రలకు ఉత్తమ విలువలు కల్పించి – సమాజంలో రావల్సిన మార్పును ప్రతిబింబించేలా చేస్తారు.

ఈ సమీక్షలో వీరివి మూడు నవలల గురించి ప్రస్తావిస్తాను. ‘మలుపుల దారుల్లో’ వీరి ఐదవ పుస్తకం. ‘ప్రభాతం లోకి’ నాల్గవది, కాగా ‘నాలోని నేను’ మూడవది. ఈ మూడు పుస్తకాలు వరుసగా 2023, 2024 సంవత్సరాలలో ప్రచురితమయ్యాయి.

రచయిత వృత్తిరీత్యా రీసెర్చ్ ఓరియెంటెడ్ కాబట్టి, నవల నిర్మాణం కూడా ఒక థీసిస్ వ్రాసినట్టే చేశారు. ప్రతి నవలలోనూ తన ముందుమాటలో – కథ ఏమిటో, అది ఎలా ముందుకు సాగుతుందో, ఏయే అధ్యాయాలున్నాయో వివరించారు. దీనివల్ల పాఠకుడికి ఇతివృత్తం, నవల నడక ముందే అవగతమవుతాయి. రచయిత అంతరంగం స్పష్టమవుతుంది. తికమకకి తావుండదు. ఈ మూడు పుస్తకాల శీర్షికలు కూడా రచయిత చెప్పదలచుకున్నదాన్ని ప్రతిఫలిస్తున్నాయి.

~

మొదటగా తాజా నవల ‘మలుపుల దారుల్లో’ గురించి చెప్పుకుందాం. మొదటి అధ్యాయం పేరు ‘దైవభూమి’. హిమాలయ పర్వత ప్రాంతాల వర్ణనతో నవల ప్రారంభమవుతుంది. వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల ఒత్తిడి నుండి బయట పడదామని ఉత్తరాఖండ్ ప్రాంతంలో సంచరిస్తూ అనుకోని ప్రమాదానికి లోనవుతాడు కథానాయకుడు రాహుల్. స్థానిక కుర్రాడు భువన్, లోయలో పడి ఉన్న రాహుల్‌ని గమనించి, తన తాత లాలా సాయంతో ఊర్లోకి తీసుకొచ్చి, స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాడు. కోలుకోడానికి పట్టే సమయంలో రాహుల్ లాలా గురించి, భువన్ గురించి తెలుసుకుంటాడు. భువన్ లాలా సొంత మనవడు కాదని, తప్పిపోయి దొరికాడనీ తెలుస్తుంది. లాలా వ్యక్తిత్వం అతన్ని ఆకర్షిస్తుంది. అక్కడున్న కాలంలో తనని తాను విశ్లేషించుకుంటాడు రాహుల్. డబ్బుందన్న తన అహంకారం, తన మాటే నెగ్గాలన్న పట్టుదల వల్ల తానేం కోల్పోయానో అతనికి అర్థం అవుతుంది. యాత్రికుడిలా తిరగడం వల్ల అంతరంగంలో క్షాళన జరిగి పరిశుద్ధమవుతుంది.

రెండవ అధ్యాయం ‘కొత్త బంధం’లో రాహుల్ ఉత్తర్ ప్రదేశ్‌లో తిరుగాడుతాడు. కన్నౌజ్ అనే ఊరికి వెళ్తూ దారిదోపిడికి గురై ఫోన్, డబ్బు పోగొట్టుకుంటాడు. దైపూర్ అనే ఊర్లో రాత్రికి ఆగుదాం అనుకుంటాడు. ఆ ఊర్లోని రాం ప్రకాష్ దంపతులు రాహుల్‌కి ఆతిథ్యమిస్తారు. ఓ కొడుకు చనిపోయి, మరో కొడుకు ఆశీష్ ఇంట్లోంచి వెళ్ళిపోయి – ఎంతో మానసిక వేదనని అనుభవిస్తుంటారా దంపతులు. అయినా కూడా తాము నమ్మిన విలువలని విడువకుండా పాటిస్తుంటారు. రామ్ ప్రకాశ్ ఫోన్ నుంచి తన ఆఫీసుకు ఫోన్ చేసి, తనకో కొత్త ఫోన్, కొంత డబ్బు తెప్పించుకుంటాడు. తరువాత వారికి వీడ్కోలు పలికి వారణాసి చేరుతాడు. అతనిలో మథనం కొనసాగుతుంది. మూడవ అధ్యాయం ‘అంతర్మథనం’లో తనకీ భార్య శశికీ పొరపొచ్చాలు రావడానికి తన ప్రవర్తనే కారణమని గ్రహిస్తాడు. ఒక్క క్షమాపణ చెప్పిఉంటే తన జీవితం ఇలా అయ్యేది కాదు కదా అనుకుంటాడు. తండ్రికి ఫోన్ చేసి భార్య గురించి, అత్తమామల గురించి అడుగుతాడు. వాళ్ళ ఫోన్‍లు కలవకపోతుంటే, ఎక్కడున్నారో ఏమిటో తెలుసుకోమంటాడు. ఢిల్లీ మీదుగా తిరిగి లాలా ఊరికి వస్తాడు. తన భార్య గురించిన వివరాలు లాలాతో పంచుకుంటాడు. లాలా అతన్ని ఓదారుస్తాడు. భువన్‌ని తీసుకుని వెళ్ళి డెహ్రాడూన్‌లో ఓ బోర్డింగ్ స్కూల్‍లో చేర్పిస్తాడు. అక్కడ సందీప్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. ఇంతలో రామ్ ప్రకాశ్ నుంచి ఫోన్ రావడంతో సందీప్ బల్ల మీదున్న ఫోన్‍ని తెచ్చి రాహుల్‍కి ఇస్తాడు. రామ్ ప్రకాశ్ గారి కాల్‍లో ఆశీష్ ఫోటోని చూసి గుర్తుపట్టి ఆశీష్ తన స్నేహితుడని చెప్తాడు సందీప్. ఆశీష్ గురించి సందీప్ చెప్పిన వివరాలు రాహుల్‌ని ఆశ్చర్యపరుస్తాయి. అతని ఆచూకీ కనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. నాలుగో అధ్యాయం ‘ఐదు ఉత్తరాలు’లో రాహుల్ ఆశీశ్ ఇల్లు, అతని మెకానిక్ షెడ్ వెతికితే, కొన్ని ఉత్తరాలు, ఫోటోలు దొరుకుతాయి. భువన్ ఆశీష్ కొడుకని అర్థమవుతుంది. ఐతే, ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో భువన్ తల్లిదండ్రులు కొట్టుకుపోయారని లాలా చెప్పిన సంగతి గుర్తొస్తుంది. రామ్ ప్రకాశ్ దంపతులకి ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళకి ఫోన్ చేసి, కారు పంపుతున్నాననీ, కేదార్‌‍నాథ్ రమ్మని చెబుతాడు, తాను గౌరీకుండ్ వద్ద కలుస్తానని అంటాడు. అయిదవ అధ్యాయం ‘హరహరమహాదేవ’లో ఓ తెలుగు కుటుంబం కేదార్ వైపు వెళ్తూ, లాలా వాళ్ళ ఊరివద్ద కారు చెడిపోయి నిల్చిపోతుంది. లాలా భువన్ మాటల్లో వాళ్ళకి రాహుల్ గురించి తెలుస్తుంది. ఆ కారులో ఉన్న యువతి ప్రియ.. శశిప్రియ.. రాహుల్ భార్య. అందరూ ఒకచోట కలుస్తారు. కథ సుఖాంతం!!

~

రచయిత నాల్గవ పుస్తకం ‘ప్రభాతం లోకి’. ఈ పుస్తకంలో మనసులోని సానుకూల ఆలోచనలే ప్రభాతం అనీ, ప్రతికూల ఆలోచనలే నిశీధి అని చెప్తారు రచయిత. స్నేహితులు, ఆత్మీయత, చంచలం, వివాహం, పరివర్తన అనే అయిదు అధ్యాయాలుగా సాగుతుంది నవల. జగన్నాధరావు గారి కొడుకు తేజ. తండ్రిలా రాజకీయాల్లోకి వచ్చి ఎం.ఎల్.ఎ. అవ్వాలనుకుంటాడు. కథలోని ప్రతి మలుపులో కథానాయకుడి మనసులోని అంతర్మథనాన్ని విశదీకరిస్తారు రచయిత. ‘స్నేహితులు’ అధ్యాయంలో తేజ బాల్యం, ప్రభాత్, నిశిత్‌లతో పరిచయం కావడం, అది కాస్తా స్నేహంగా మారడాన్ని వర్ణిస్తారు. రెండవ అధ్యాయం ‘ఆత్మీయత’లో తల్లి లేని తేజ రత్తమ్మ, కోటయ్య దంపతులకు దగ్గరవుతాడు. రత్తమ్మని చిన్నమ్మా అని పిలుస్తాడు. కోటయ్య జగన్నాధరావుకి అనుచరుడవుతాడు. తేజ పదో తరగతిలోకి వస్తాడు. ప్రభాత్ అతనికి మంచిమాటలు చెబుతుంటే, నిశిత్ మాత్రం సులభంగా అందలం ఎక్కే ఆలోచలు చేయమంటాడు. చదువక్కరలేదు, రాజకీయాలు వంటబట్టించుకోమంటాడు. ఈ క్రమంలో అసలు చదువెందుకన్న సందేహం కలుగుతుంది తేజకి. లెక్కల మాస్టారుని అడిగితే, ఆయన అద్భుతమైన రీతిలో తేజ సంశయాలు దూరం చేస్తారు. రాజకీయాల్లోకి వెళ్ళాలన్న తన ఆలోచనని మాస్టారుకి చెప్తే, ముందు బాగా చదువుకోమని, చదువు రాజకీయాలకి అవసరమైన వివేకం నేర్పుతుదని చెప్తారాయన. మూడవ అధ్యాయం ‘చంచలం’లో కాలేజీ చదువుల్లోకి వస్తాడు తేజ. ఓ రోజు ఓ కుర్రాడితో గొడవపడి బాగా కొడతాడు. అతను ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేస్తాడు. ప్రిన్సిపాల్ జగన్నాధరావుకి కబురుపెడతాడు. ఆశ్చర్యంగా ఆయన కొడుకునేమీ అనడు. ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పిస్తాడు. తన కొడుకు ఇకపై అలా ప్రవర్తించడని హామీ ఇస్తాడు. కొడుకుని కార్లో ఎక్కించుకుని తన అనుచరుల ఇళ్ళకి తిప్పితాడు. హింసా రాజకీయాల వల్ల జరుగుతున్న నష్టం తేజకి అర్థమవుతుంది. తన తప్పూ తెలుస్తుంది. తండ్రికి క్షమాపణ చెబుదామంటే ఆయన అందుకు అవకాశమివ్వడు. చివరికి రత్తమ్మకి మనసు విప్పు తన బాధ చెప్తాడు. పిల్లాడిలో మార్పు వచ్చిందని, ఇంకేమీ అనద్దని రత్తమ్మ అయ్యగారికి చెబుతుంది. ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరుతాడు. సంయుక్త అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెని ప్రేమిస్తున్నానంటూ వెంటబడతాడు. ఆమె అతన్ని దూరం పెడుతుంది. నాల్గవ అధ్యాయం ‘వివాహం’లో సంయుక్తతో ప్రేమ సఫలమవుతుంది. తండ్రికి తెలుస్తుంది. తాను వారసత్వంగా ఎం.ఎల్.ఎ. పదవికి పోటీ చేస్తానంటాడు తేజ. అలా కుదరదంటాడు తండ్రి. సంయుక్త తన రాజకీయ ప్రత్యర్థి జోగయ్య కూతురని తెలుసుకుంటాడు జగన్నాధరావు. తాను ఆ దఫా ఎన్నికలలో పోటీ చేయకుండా విరమించుకుని, జోగయ్య షరతు ప్రకారం అతనికి పోటీ చేసే అవకాశం కల్పించి, తేజకీ, సంయుక్తకీ పెళ్ళి జరిపిస్తానంటాడు జగన్నాధరావు.

ఐదవ అధ్యాయం ‘పరివర్తన’లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అమర్ అనే యువకుడు హఠాత్తుగా రంగంలోకి వచ్చి జోగయ్యకి వ్యతిరేకంగా ఎన్నికలలో నిలబడి పోటీ చేసి, గెలుస్తాడు. జోగయ్య తన కూతురు సంయుక్తని మరో రాజకీయ నేత కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని చూస్తాడు. తేజ దాన్ని భగ్నం చేస్తాడు, సంయుక్తని పెళ్ళి చేసుకుంటాడు. ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని తండ్రి వ్యతిరేకించగానే, తేజ భార్యతో సహా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ అనుకోని సంఘటనలు జరిగి తండ్రి మనసుని గ్రహిస్తాడు. తేజలో రావల్సిన మార్పు వస్తుంది.

~

కిషోర్ కుమార్ గారి మూడవ నవల ‘నాలోని నేను’. మృత్యువుకి దగ్గరవుతున్న విఠల్ గతాన్ని, ఆయన ఆత్మకథ చదువుతూ తెలుసుకుంటాడు కొడుకు మనోజ్. తండ్రిని అర్థం చేసుకోవాలన్న అతని తపనే ఈ నవలకు కథా వస్తువు. ఇందులో చాలా కథలున్నాయంటూ రచయిత తన ముందుమాటలో ఇలా చెప్పారు: “వృద్ధాప్యంలో అందరినీ కోల్పోయినా మనవడి కోసం నిలబడిన ఓ తాత కథ!! ఊతమివ్వవలసిన వ్యక్తిని పోగొట్టుకున్న ఓ కుటుంబాన్ని అన్నీ తానై నిలబెట్టిన ఓ స్నేహితుని కథ! వివాహబంధం విలువ తెలియక ఉద్వేగాలకు లొంగిన ఓ దంపతుల కథ! తల్లిదండ్రుల అనవసరపు ఆవేశాలకు నలిగిన ఓ చిన్నపిల్లవాడి కథ! నైరాశ్యం నుండి బయటపడి బాధ్యత గల వ్యక్తిగా ఎదిగిన ఓ యువకుడి కథ! బాధ్యతలన్నీ సమర్థవంతంగా నిర్వర్తించిన ఓ గృహిణి కథ! దారితప్పిన మిత్రుడ్ని మంచిమార్గంలో నడిపిన ఓ కుర్రవాడి కథ! స్ఫూర్తి నింపే కథ! మంచిని పంచే కథ! స్నేహం విలువ తెలిపే కథ! అనుబంధాల్ని వివరించే కథ!”.

ఇది ఆరు ఆధ్యాయాలుగా సాగింది. మొదటి అధ్యాయం ‘వ్యక్తిత్వం’ మనోజ్ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. రెండవ అధ్యాయం ‘మిత్రుడు’లో విఠల్ ప్రస్థానం, ఆయన స్నేహాలను వివరిస్తారు రచయిత. దారి తప్పిన తన స్నేహితుడు ఏడుకొండలరావుని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు విఠల్. మూడవ అధ్యాయం ‘నిష్కమ్రణం’ విఠల్ మరణాన్ని, అతని గతాన్ని తెలుసుకోవాలనుకున్న మనోజ్ ఆసక్తిని వివరిస్తుంది. నాల్గవ అధ్యాయం ‘వసంతం’ లక్ష్మితో విఠల్ పెళ్ళి గురించి వివరిస్తుంది. కోరా అనే మిత్రుడి స్మృతిలో చేపట్టిన కార్యక్రమాలను లక్ష్మి నడుపుతుంది. ఐదవ అధ్యాయం ‘గ్రహణం’లో ఛిద్రమైన విఠల్ బాల్యపు వైనాన్ని వెల్లడిస్తారు రచయిత. ఆరవ, చివరి అధ్యాయం ‘తేజోమయం’లో విఠల్ అన్ని రకాల ఇబ్బందులని అధిగమించి, ఆత్మన్యూనతను జయించి తన మనసుని ప్రకాశవంతం చేసుకున్న వివరం ఉంది.

చివరగా తండ్రి ఆత్మకథని ‘నాలోని నేను’ పేరుతో ప్రచురిస్తాడు మనోజ్.

~

ఈ మూడు నవలలోనూ – ప్రధాన పాత్రలలో ఆత్మాన్వేషణ జరుగుతుంది. ‘మలుపుల దారుల్లో’ నవలలో నేపథ్యం పర్వతాలైతే, ‘ప్రభాతం లోకి..’ నవలకి మైదాన ప్రాంతం నేపథ్యం. ‘నాలోని నేను’ నవలకి సముద్రం నేపథ్యం. భిన్నమైన ప్రాకృతిక శక్తులను పాత్రలకు అనుసంధానిస్తూ, వివేచన చేయిస్తూ, మథనానికి దోహదం చేస్తూ పాఠకులను ఆలోచింపజేస్తారు రచయిత. చక్కని వర్ణనలు, కవితాత్మక సంభాషణలు ఈ మూడు నవలలో ఔచితీమంతంగా నిలిచాయి. ఈ మూడు నవలలోని అధ్యాయాలకు రచయిత పెట్టిన శీర్షికలను గమనిస్తే, ఎంత సూక్ష్మంగా ఆలోచించారో అనిపిస్తుంది. మనిషి మనిషిగా బ్రతకాలంటే ఏం చేయాలో ఈ మూడు నవలలు సూచిస్తాయి. ఇవి చదవడం పూర్తి చేసాకా, ఓ రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది పాఠకులకు.

***

మలుపుల దారుల్లో (88 పేజీలు, ₹ 100/-),
ప్రభాతం లోకి (128 పేజీలు, ₹ 120/-),
నాలోని నేను (128 పేజీలు, ₹ 120/-),
రచన: నారపరాజు కిషోర్ కుమార్
ప్రతులకు:
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు,
~
నారపరాజు కిషోర్ కుమార్
హెచ్ 5, 502,
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్,
జవహర్ నగర్,
షామీర్‍పేట
హైదరాబాద్ 500078
ఫోన్: 8019574354

~

శ్రీ నారపరాజు కిషోర్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-naraparaju-kishore-kumar/

Exit mobile version