[గుడ్లదొన సరోజినీదేవి గారి ‘మమకారాల మార్పిడి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆధునిక కాలంలో మనిషికి ఏది కావాలన్నా కొనుక్కునే సదుపాయం వచ్చేసింది. చివరకు ‘జ్ఞాపకాలను’ కూడా!
‘హిప్పో చిప్’ అనే ఒక చిన్న పరికరం ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఉంది. మన మెదడులోని ఒక జ్ఞాపకాన్ని డిజిటల్ రూపంలోకి మార్చి ఈ చిప్‌లోకి ఎక్కించవచ్చు. ఆ చిప్‌ను వేరొకరు తమ మెడ వెనుక ఉన్న ‘న్యూరో-నోడ్’కు తగిలించుకుంటే, ఆ జ్ఞాపకం వారి సొంతం అయిపోతుంది.
ఉదాహరణకు, మీరు ఎప్పుడూ విమానం ఎక్కకపోయినా, ఎక్కిన వారి జ్ఞాపకాన్ని కొనుక్కుంటే.. ఆ ఆకాశ ప్రయాణ అనుభూతి, ఆ భయం, ఆ సంతోషం అన్నీ మీ మెదడులో నిజంగా జరిగినట్టే ముద్ర పడిపోతాయి. కానీ ఒక నిబంధన – మనం ఒక జ్ఞాపకాన్ని వేరొకరికి ఇచ్చేస్తే, మన మెదడు నుండి అది శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది. ‘ఒకరికి లాభం, ఒకరికి నష్టం’ అన్నట్టుగా ఇది ఒక వర్తకం.
నేను ఆన్లైన్ ఫోరమ్‌లో ఆ ప్రకటన చూసినప్పుడు నా కళ్లు ఆనందంగా మెరిసాయి.
“కావాలి: అమ్మతో గడిపిన ఒక జ్ఞాపకం. బదులుగా: నా జీవితంలో గెలిచిన ఒక అద్భుత క్షణాన్ని ఇస్తాను.
జి. శారద
ఫోన్ నెంబర్.. 814______87.”
అప్పుడే ఫోన్లో అమ్మతో వాదించి, “నీకేం తెలియదు ఊరుకో” అని విసుక్కుని ఫోన్ పెట్టేశాను. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కోపంలో, నా దగ్గర అమ్మ జ్ఞాపకాలు కట్టలు తెంచుకున్న గోదావరిలా ఉన్నాయి, ‘ఒకటి ఇస్తే పోయేదేముంది?’ అనిపించింది. ఆ పోస్ట్ పెట్టిన ‘శారద’కు మెసేజ్ చేశాను.
ముందుగా ప్లాన్ చేసుకొన్నట్లు మేము హిమాయత్ నగర్ ‘కాఫీ డే’లో కలుసుకున్నాం.
శారద చూడటానికి చాలా హుందాగా, నాకు పెద్దక్కలా ఉంది. తన ముందు టేబుల్‌పై ఆ మెమరీ చిప్ సిద్ధంగా ఉంది.
“నా ప్రకటన చూసి స్పందించినందుకు థాంక్స్” అంది శారద.
నేను కాస్త అయోమయంగా, “అమ్మ జ్ఞాపకం అంటే ఏదైనా పర్వాలేదా? నా దగ్గర చేదు జ్ఞాపకాలు ఉన్నాయి” అన్నాను.
శారద నవ్వి, “అల్లం అయినా బెల్లం అయినా అమ్మ అమ్మే! అమ్మ జ్ఞాపకం ఏదైనా సరే అమూల్యమే. మీ ఇష్టం వచ్చిన జ్ఞాపకాన్ని ఇవ్వండి” అంది.
నా మనసులో ఒక జ్ఞాపకం మెదిలింది. డిగ్రీలో ఉన్నప్పుడు నేను జుట్టుకు రంగు వేసుకుని, చిరిగిన జీన్స్ వేసుకుంటే.. అమ్మ నిప్పులు చెరిగింది. “నువ్వు ఆడపిల్లవా? అడవి మనిషివా? నిన్ను చూస్తే పదిమంది నవ్వుతారు. నిన్నిట్లా తయారుచేసినందుకు వెక్కిరిస్తారు.” అని గయ్యిమంది.
ఆ చేదు జ్ఞాపకాన్ని చిప్‌లోకి ఎక్కించి శారదకు ఇచ్చాను. బదులుగా ఆమె నాకు తన ‘స్టేట్ లెవెల్ డిబేట్ విన్నర్’ మెమరీని ఇచ్చింది.
ఆ జ్ఞాపకం నా మెదడులోకి ఎక్కగానే.. వేలాది మంది చప్పట్ల మధ్య నేను షీల్డ్ తీసుకుంటున్నట్టు, నేను గెలుపు గుర్రం మీద పరుగు తీస్తున్నట్టు అనిపించింది. గెలుపంటే ఎరగని మనిషిని, ఆ అనుభూతి అద్భుతంగా ఉంది.
అక్కడితో ఆగలేదు మా బార్టరు విధానం. ఆ తర్వాత వరుసగా మార్పిడులు జరిగాయి.
శారద నాకు ‘మొదటి విదేశీ ప్రయాణం’, ‘ఉద్యోగంలో ప్రశంసలు’, ‘తయ్యని ఫస్ట్ లవ్’ వంటి మధుర జ్ఞాపకాలను ఇస్తూ వచ్చింది. బదులుగా నేను అమ్మ నా చిన్నప్పుడు దెబ్బలు కొట్టినవి, నేను తప్పు చేస్తే మందలించినవి, పొద్దున్నే లేపడం కోసం గొడవ పడినవి.. ఇలాంటివన్నీ వదిలించేసుకున్నాను.
శారద నుంచి సంపాదించిన అనుభూతులతో కాలం ఎలా గడిచి పోతుందో గమనించనేలేదు.
మెల్లమెల్లగా అమ్మకు ఫోన్ చేయడం మానేశాను. అమ్మతో మాట్లాడటం అంటే గోడకు కొట్టిన సున్నంలా వ్యర్థం అనిపించేది. “శారద ఇచ్చిన గొప్ప జీవితం ఉండగా, ఈ పాత గొడవలు ఎందుకు?” అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. నా కన్నతల్లి కంటే శారద ఇచ్చిన కృత్రిమ జ్ఞాపకాలే నాకు ప్రాణప్రదంగా మారాయి.
ఒక ఆదివారం సాయంత్రం శారదతో కలసి పార్కులో కూర్చున్నా ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ.
గాలి చల్లగా వీస్తోంది. దూరం నుండి ఒక ఆవిడ వడివడిగా మా వైపు రావడం గమనించాను. ఆమెను ఎక్కడో చూసినట్లుంది కానీ ఎక్కడో గుర్తుకు రావటం లేదు.
“లక్ష్మీ! ఎక్కడున్నావే? ఇన్ని రోజులుగా ఒక్క ఫోన్ లేదు, జాడ లేదు. నీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను” అంటూ ఆ ఆవిడ నా దగ్గరకు వచ్చి ఆర్తిగా చేయి పట్టుకుంది.
లక్ష్మి! గతంలో ఎన్నడూ చూడని ఈమెకు నా పేరు ఎలా తెలుసు? నేను చెయ్యి విదిలించుకుని వెనక్కి జరిగాను.
“ఎవరమ్మా నువ్వు? నన్నెందుకు పట్టుకుంటున్నావు?” అన్నాను భయంగా.
ఆవిడ కళ్లలో నీళ్లు తిరిగాయి. “నేను నీ అమ్మను కదే.. మర్చిపోయావా?” అని ఏడుపు లంకించుకొంది. ఆమె ఇలా ఏడుస్తూ సీన్ క్రియేట్ చేయడం ఇబ్బందిగా ఉంది నాకు.
అప్పటి దాకా మౌనంగా ఉన్న శారద ఆ వృద్ధురాలి చేతులు పట్టుకుని ప్రేమగా నిమిరుతూ నావైపు అదోలా చూసి నవ్వింది. ఆ పెద్దావిడవైన దగ్గరకు తీసుకుంటూ “చూశావా అమ్మా! నీ కన్నకూతురు నిన్ను పూర్తిగా మర్చిపోయింది. తన దగ్గర ఇప్పుడు నీ జ్ఞాపకాలు ఏవీ మిగిలి లేవు. ఆ జ్ఞాపకాలు నాకు అమ్మేసుకుంది. నీ జ్ఞాపకాలన్నీ నా మెదడులో భద్రంగా ఉన్నాయమ్మా! ఇకపై నేనే నీ కూతురిని. నువ్వు కొట్టినా తిట్టినా నా మంచి కోసమే అని తెలుసు. ఎందుకంటే లోకంలో చెడ్డ అమ్మలు ఎక్కడా ఉండరు! చిన్నతనంలో నేను పోగొట్టుకున్న అమ్మే నీ రూపంలో మళ్ళీ వచ్చింది. రా! మన ఇంటికి పోదాం!” అంటూ శారద ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది.
శారద అమ్మను తీసుకుని వెళ్లిపోతుంటే నేను నిశ్చేష్టురాలినై పోయాను.. మెదడు నిండా విలువలేని కొన్ని కృత్రిమ విజయాల మెమరీ చిప్స్ పెట్టుకుని!
