సూర్యోదయం అయిన తరవాత ఆ భారీ కాయురాలు అయిన నడివయసు స్త్రీ పాదాలు ఇంట్లో ముప్ఫై నిమిషాల కన్నా ఎక్కువ సేపు స్థిరంగా ఉండవు. అప్పటికే చాలా ఆలస్యం అయింది. పెద్ద, పెద్ద పాదాలు మఖో ఖోబా నేలను గట్టిగా బాదుతూ అడ్డదిడ్డంగా నడుస్తూ హాల్లోకి వచ్చింది. ఆమె భుజానికి పెద్ద హ్యాండ్ బాగ్ వేళ్లాడుతోంది.. ఖాళీగా ఉన్న ఆ బాగ్ భారీ భుజాల మధ్య నిర్దయగా నొక్కుకుపోతోంది.
ఇప్పుడు ఆమె కొత్త, కొత్త వార్తలు అర్జంట్‌గా సేకరించాలి. ఆ వార్తలకి అర్థం ఉండదు.. వాటిలో నిజాలు ఉండవు.. అలాంటి నిరాధారమైన విషయాలెన్నో ఎంతో ముఖ్యమైన వార్తలుగా మార్చి వాళ్లకి, వీళ్ళకి చేరవేస్తూ ఉంటుంది. అలా చేరవేసేముందు యథాతథంగా చేరవేసేకన్నా కొంచెం ఉప్పు, మిరియాల పొడి బాగా దట్టించి కథలు, కథలుగా చెప్తుంది. ఆ కథల్లో తనని తాను నాయకురాలిగా భావించుకుంటూ మరీ చెబుతుంది. ఆమె చూడ్డానికి వింతగా ఉంటుంది. పెద్ద శరీరం చిన్న తల భాగం. ఆ తలను పెద్దగా చూపించడానికి తెల్లని టోపీ సదా ఆమె తల మీద ఉంటుంది. ఆ చిన్న మెదడులో అనేక పెద్ద, పెద్ద రహస్యాలు దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఏ రహస్యమూ దాగదు.. ఆమె మెదడులో టౌన్‌షిప్ చరిత్ర, లవ్ స్కాండల్, ఇతరుల పట్ల అనవసరమైన అభియోగాలు నిండి ఉంటాయి. ఆమెకి వార్తాహరురాలు అనే ఒక నిక్ నేం ఉంది. అదే మంఫోజు – ఉనాకా సేన్జేని.. మంగోభోజి…
ఆరోజు ఆమె ఇంటికి సమీపంలో ఉన్న ఒక వ్యక్తి తన ఇంటి ప్రవేశ ద్వారం నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుంటూ ఆ లావాటి స్త్రీ పెదవులు సాగదీసి విశాలంగా నవ్వుతూ గేటు లోపలికి రావడం గమనించాడు. ఆమెని చూడగానే కారు విండో కిందకి చేసి కొంచెం ఒంగబోతుండగా బారీకాయం ఊపుకుంటూ వచ్చి తన తల లోపలికి పెడుతూ నవ్వింది.
“గుడ్ మార్నింగ్ మంఫోజు లివుకే ఇంజాని” అతను ఎంతో వినయంగా విష్ చేసాడు. కారు వెనక సీటులో ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్ బాక్స్ గురించి చాలా బిగ్గరగా అరుస్తూ దెబ్బలాడుకుంటున్నారు. అతను వారిని గట్టిగా మందలించాడు.
ఆమె అదోరకంగా నవ్వుతూ. “గుడ్ మార్నింగ్ థెంబా!” అంటూ తన బొంగురు గొంతులో మర్యాద పలికించే ప్రయత్నం చేసింది….
అతను ఆమెవైపు అసహనంగా చూసి “నేను ఆఫీస్‌కి వెళ్ళాలి… ముందు పిల్లలను స్కూల్లో దింపాలి, టైం అయింది.. మీరు నా భార్య కోసం వచ్చినట్టున్నారు” అన్నాడు ఇంకా గట్టిగా తన తమ్ముడితో గొడవ పడుతున్న చిన్న పిల్లని సున్నితంగా మందలిస్తూ.
“అవును ఆమె లోపల ఉందా” అడిగింది మంపోజు థెంబా వైపు ఓరగా చూస్తూ.
“అవును ఎవొన్నే ఇంట్లో ఉంది.. మీరు వెళ్ళండి తలుపు కొట్టండి, తీస్తుంది.. నేను వెళ్ళాలి” అంటూ యాక్సిలేటర్ బలంగా నొక్కాడు.. సిల్వర్ కోరోల్లా ముందుకు కదిలింది. కారు అదృశ్యం అయి రోడ్డు మలుపు తిరిగే వరకు చూసి తనలో తను గొణుక్కుంటూ లోపలికి నడిచింది మంఫోజు.
భర్త వెళ్ళిపోగానే తిరిగి మంచం మీద వాలి బ్లాంకెట్ మీదకి లాక్కుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో ఎవోన్నే విసుగ్గా చూసింది. ఆమె ద్వేషించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి రాజకీయాల గురించి చర్చించడం ఒకటి, రెండు దోమలు… అన్నిటికన్నా ముఖ్యమైంది ఉదయాన పని సమయంలో పక్కింటి వాళ్ళు వచ్చి తన సమయాన్ని వృథా చేయడం. ఆమె తిరిగి బెడ్ మీదకు వెళ్లి పడుకుని బ్లాంకెట్ మీదకు లాక్కుంటూ ఉండగా తలుపు తట్టిన శబ్దం అయింది. ఆ శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది.. ఆ శబ్దం ఆమెకి చిరపరిచితం. అది ఎవరిదో ఆమెకి తెలుసు.
“ఆవూ బకితి” అని తిట్టుకుంటూ బలవంతంగా బెడ్ మీద నుంచి దిగింది. డోర్ తీయడానికి వెళ్తూ ఈ మహాతల్లికి వేరే పనేముంది తన బుర్ర తినడం తప్ప అనుకుంది.
“నగరం మొత్తం లేచి తన దినచర్య మొదలుపెడితే నువ్వింకా పడుకున్నావా అమ్మాయ్…. ఏంటి అలిగావా” మొహం నిండా నవ్వు పులుముకుని లోపలికి అడుగుపెట్టింది.. ఆమె అడుగుల శబ్దం చెవులు దద్దరిల్లేలా అనిపించింది ఎవోన్నేకి… ఆమె వ్యంగ్యంగా నవ్వినా ఆ నవ్వులో అర్థం తెలిసిన ఎవొన్నే అయిష్టంగానే గుమ్మం పక్కనే ఉన్న సోఫా చూపించింది కూర్చోమన్నట్టు.
సోఫా కంపిస్తున్నట్టు కదిలింది. ఆమె కుదుపుకి. “స్కూల్స్ తెరిచారు కదా! ముగ్గురు మగపిల్లలకు స్నానం చేయించి తయారు చేసి స్కూల్‌కి పంపించే సరికి ఊపిరిపోయింది.. బాగా అలసిపోయాను.. ఎంత కష్టం అయిన పని కదా!” జోక్ లాగా నవ్వుతూ అంటున్న ఆమె మాటలకి ఎవెన్నే బలవంతంగా నవ్వింది.
కాసేపు వాళ్ళ మధ్య పరస్పర అభినందనలు, స్త్రీ సహజమైన సంభాషణ దగ్గర నుంచి వాతావారణం గురించిన చర్చ సాగింది. అకస్మాత్తుగా మంఫోజు ఇరుగుపొరుగు వారి వ్యక్తిగత విషయాల వైపు మాట మార్చింది. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెబుతూ సుమారు పదిహేను నిమిషాల కబుర్లు తరవాత తను వచ్చిన పని చల్లగా బయట పెట్టింది మంఫోజు.
“నీకో విషయం తెలుసా!” ఎవొన్నే ఇచ్చిన టీ చప్పరిస్తూ అంది. “నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, కొద్ది నిమిషాల క్రితం నేను చూసిన విషయం” అంది ఆ విషయానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ.
ఎవొన్నే నైట్ గౌను స్ట్రాప్ కొంచం గట్టిగా బిగించుకుంటూ సోఫాలో కొంచెం ముందుకు ఒంగింది ఆమె చెప్పబోయే మరో రూమర్ వినడానికి సిద్ధంగా.. “నువ్వు ఎప్పుడూ కొత్త, కొత్త విషయాలు గమనిస్తూ ఉంటావు అవునా”! నవ్వుతూ అంది. “ఇంతకీ ఏమిటది.”
” నీ భర్త థెంబా గురించి” అంది ఆమె.
మంఫోజు టీ సిప్ చేసిన సన్నని శబ్దం తప్ప అక్కడ పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడింది.
మంఫోజు ఎవొన్నే మొహంలో భావాలు గమనిస్తూ చెప్పసాగింది. ఎవొన్నేకి ఆమె గురించి తెలుసు.. ఆమె నోటినుంచి వచ్చే ఏ ఒక్క విషయంలోనూ నిజం ఉండదని ఏది కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలుసు. కానీ, ఇప్పుడు ఆమె చెప్పబోయేది తన భర్త గురించి అవడంతో అప్రయత్నంగానే ఆమెలో కుతూహలం చోటు చేసుకుంది.. కారణం ఆమెకే తెలియని ఒక అభద్రతా భావం. ఆమె మరింత ముందుకు ఒంగి మంఫోజు మొహం లోకి నిశ్చలంగా చూడసాగింది.
“ఏంటి ఏం చెప్తావు థెంబా గురించి” అడిగింది. ఎవరైనా అనవసరంగా తనపైన ఫిర్యాదు చేస్తుంటే అసహనంగా ఖండించే పిల్లల స్వరంలా ఉంది. మంఫోజు తన చేతి వేళ్ళతో టీ కప్పు మీద శబ్దం చేస్తూ తనకి మరికొంత టీ కావాలి అన్నట్టుగా శబ్దం చేస్తూ కిచెన్ డోర్ వైపు చూసింది… ఎంతసేపు టీ తాగితే అంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు కదా. అది ఆమె ఐడియా.. ఆమెకి ఇలాంటి సమయాలు వినోదాన్ని, కాలక్షేపాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా అవతలి వ్యక్తిలో తను చెప్పే కధలో సస్పెన్స్ భరిస్తూ చివరికి ఏమవుతుందో అనే ఉత్కంఠ కలిగించడం ఆమెకి చాలా ఇష్టం. పిల్లలకి అందకుండా ఒక కుకింగ్ జార్ పైన షెల్ఫ్‌లో పెట్టి అది అందుకోడానికి పిల్లలు చేస్తున్న ప్రయత్నాలను ఆటగా చూడడం ఆమెకి ఇష్టం. ఇప్పడు ఎవెన్నో విషయంలో అలాంటి ఆనందమే ఆమె పొందబోతోంది.
ఎవోన్నే అన్యమనస్కంగా రెండు టీ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళ్తుంటే విజయం చేయగలిగానన్న తృప్తితో ఆమె వైపు చూసింది మంఫోజు్. ఎవోన్నే టీ నింపిన కప్పులు తీసుకుని వచ్చి ఆమె చేతికి ఒక కప్పు ఇస్తూ అసహనంగా అడిగింది. “చెప్పు థెంబా గురించి ఏమిటో చెప్తానన్నావు.”
ఆమె వైపు ఒక వెకిలి నవ్వు విసిరుతూ చూసి టీ కప్పు చేతులోకి తీసుకుని సన్నని స్వరంతో రహస్యం చెబుతున్నట్టుగా చెప్పసాగింది.
“అతని గురించి కాదు మకోటి… ఎవరో నీ భర్త మీద కన్నేశారు..” టీ చప్పరిస్తున్నట్టుగా చప్పరిస్తూ అంది. ఎవోన్నే ఉలిక్కిపడి చూసి, తనని తను సర్దుకుంటూ టీ కప్పు చేతిలోకి తీసుకుంది.
“మంఫోజు ప్రతి ఒక్కరి కన్ను ఈ రోజుల్లో ఇతరుల భర్తలపైనే ఉంటోంది. ఇందులో బాధపడదానికి ఏముంది?”
మంఫోజు ఏ మాత్రం నిరాశ పడకుండా తిరిగి చెప్పసాగింది “నిజమే నువ్వన్నది కరెక్ట్ కానీ నేను చెప్తున్నది చాలా సీరియస్ విషయం… గుర్తుంచుకో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆమె పథకం ఏమిటో నీకు చెబితే నమ్మవు”
ఎవొన్నేకి చిరాకుగా అనిపించింది.. ఆమెకి ఆ విషయం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, మంఫోజు మీద కోపం వచ్చిందని ఎర్రబడిన కళ్ళు ముడతలు పడిన మొహం చెబుతున్నాయి. ఆమెకి అసహనంగా ఉంది. కానీ మంఫోజు ఆమె హావభావాలు ఖాతరు చేయడం లేదు.. పట్టు వదలని విక్రమార్కుడిలా చెప్పసాగింది. “చూడు నాకు తెలుసు నీకు బాధగా ఉందని.. అయినా చెప్పక తప్పదు… ఎవరైతే నీ దగ్గర మెయిడ్‌గా పని చేసిందో, థెంబి సెలె… ఆమె క్రౌదర్ పార్క్‌లో బిజినెస్ ప్రారంభించింది అని విన్నావు గుర్తుందా!”
ఎవోన్నే అభావంగా చూసింది.
మంఫోజుకి అర్థం అవుతోంది తన ట్రిక్స్ ఏవి కూడా ఎవోన్నే దగ్గర వర్క్ అవుట్ అవడం లేదని.
అయినా కొనసాగిస్తూ అంది “నీకు నమ్మాలనిపిస్తే నమ్ము ఎవొన్నే.. నేను కేవలం నీకు సాయం చేయాలనుకుని చెప్పాను. ఆమె రోజూ స్టేడియం చివర డుస్క దగ్గర ఎందుకు ఉద్దేశపూర్వకంగా నిలబడుతుందో నేను గమనిస్తున్నా. అదే దారిలో థెంబా కారు వెళ్తుంది. అతను ప్రతిరోజూ ఆమె ఉండే దగ్గరకు వెళ్లి పిక్ అప్ చేసుకుని తిరిగి ఇంటి దగ్గర దింపుతాడు. వాళ్ళు అక్కడ ఆనందంగా ఉంటే.. ఇక్కడ నువ్వు ఒంటరిగా… అన్నట్టు ఏ విషయంలో కూడా థెంబా బాధ్యత నువ్వు తీసుకోనవసరంలేదు ఇంక.. అతను ఆమెని అనుక్షణం కనిపెట్టి ఉంటున్నాడు” ఎవెన్నో మనోభావాలు గమనించకుండా కొనసాగిస్తూ అంది “నేనసలు ముందు నీకివేమి చెప్పద్దు అనుకున్నా కానీ నిన్న మా పక్కింటి ఆవిడ చెప్తోంది ఆమె ల్యాండ్ యజమాని.”
ఎవోన్నే కొంచెం భయంగా చూసింది. నిజానికి అలాంటివన్నీ వినే మనిషి కాదు ఎవోన్నే. కానీ ఇప్పుడు మంపోపు తన జీవితం, తన సంసారం ప్రమాదంలో పడుతున్నాయని చెప్పడంలో ఆలోచిస్తోంది. తనలో కలుగుతున్న సంఘర్షణ అణచుకుంటూ “నేను నమ్మను” అంది.
మంఫోజు మొహం మీద క్రమంగా చిరునవ్వు పాకింది.. బలవంతంగా నవ్వుతూ తన భారీ కాయాన్ని సోఫాలోంచి లేపడానికి ప్రయాసపడుతూ ఎవోన్నే మొహంలో మారుతున్న రంగులు కనిపెడుతూ, తన విజయానికి తనలో తను నవ్వుకుంటూ అంది. “నమ్మకు కానీ నీ శ్రేయోభిలాషిగా చెప్పవలసింది చెప్పాను. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి… లేదంటే కూతురు లాంటి దానివని అనుకో.. ఇప్పుడు నువ్వు ఆమెని డిస్మిస్ చేయాలి అనుకుంటున్నావా! నువ్వు డిస్మిస్ చేస్తే థెంబి సెలె నిజంగా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా.. అయినా ఆమె నమ్మకస్తురాలు అయినప్పుడు ఎందుకు డిస్మిస్ చేయడం? ఆమె దొంగ, నేరస్థురాలు అనుకుంటే, ఎంత ప్రయత్నించినా నీ భర్తను మాత్రం దొంగిలించే ప్రసక్తి లేదు. నీ భర్త చాలా ఉదారస్వభావం కలవాడు..” ఆగ్నిలో ఆజ్యం పోస్తూ అంది.
ఎవోన్నే నిశ్శబ్దంగా ఉండిపోయింది.
ఆమెకి తెలిసి థెంబె సెలె ఆమె దృష్టిలో అంత ఉదాత్తురాలు కాదు. అలాగని తన భర్తను తన నుంచి లాక్కునేంత నీచురాలు మాత్రం కాదని ఆమె విశ్వసిస్తుంది. ఇప్పుడు మంఫోజు పెడుతున్న శాపనార్థాలు వినడానికి ఆ యువతి ఇక్కడ లేదు.. అందుకే మంఫోజు త్వర,త్వరగా తను చెప్పాల్సిన మిగతా మాటలు చెప్పేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
ఆ రోజు మధ్యాహ్నం మంఫోజు ఒంటరిగా బాక్ యార్డ్‌లో అటూ ఇటూ తిరుగుతోంది. ఎవరో గట్టిగా పిలిచినట్టు వినిపించింది. ఆమె వెంటనే చేతులు చాచి కళ్ళు విశాలం చేసి చూసింది. ఎత్తైన పర్వతం మీద నుంచి వస్తున్నట్టు బిగ్గరగా పిలుస్తూ దగ్గరగా వచ్చింది థెంబె సెలె.
మంఫోజు ఆనందంగా ఆమెకి ఎదురు అయి “థెంబె సెలె నువ్వా. నువ్వు ncubes లో పని మానేసిన దగ్గర నుంచి ఇప్పుడే చూస్తున్నాను” షేక్ హ్యాండ్ కోసం చేయి చాపుతూ అంది .
“అవును మంఫోజు నేనే… కౌడ్రి పార్క్ ప్రాజెక్ట్ పనిలో నేను బిజీగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు? మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు..” అడిగింది ఆ యువతి.
“భగవంతుడి దయవలన మేము బాగున్నాం” మంఫోజు సమాధానం చెప్పింది.
మళ్ళీ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు “అన్నట్టు నీకో విషయం చెప్పనా.. నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావో ఆమె నీ గురించి ఏం చెప్పిందో తెలుసా… అయినా ఆ మాటలు నువ్వు నమ్మవులే” అంది పెదవుల మధ్య విచిత్రమైన ధ్వని చేస్తూ.
“ఏం చెప్పింది” అడిగింది థెంబె సెలె కుతూహలంగా.
మంఫోజు ఎవరన్నా వింటున్నారా అన్నట్టు అటు, ఇటూ తిరిగి చూసినది.
“పద అలా మీ ఇంటి వైపు నడుస్తూ చెప్తాను… నా కూతురు సేన్జేని నువ్వు ఉంటున్న ఇంటికి దగ్గరగా ఉంటుంది. ఎలాగా ఆమెని కలుసుకోడానికి వెళ్తున్నా” ఆ స్త్రీ నోటి గుండా చల్లని అబద్దం చల్లగా వచ్చింది.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, మధ్య, మద్య ఆగుతూ నడుస్తున్నారు.
అప్పుడు సాయం సమయం అయింది… మంఫోజు కుర్చీ మీద కూర్చుని టేబుల్ మీద కాయిన్స్ లెక్కపెడుతోంది. ఆమె కూతురు సేన్జేని ఆయాసపడుతూ “అమ్మా అమ్మా ఇలా రా చూడు ఏం జరుగుతోందో” అని అరుస్తూ అక్కడికి రాబోతు ఉండగా కుర్చీ తగిలి అలమర వైపు ఎగిరి పడబోతూ గట్టిగా ఒక టేబుల్ తగిలింది. ఆ విసురుకి ఆమె స్కర్ట్ గాల్లోకి పైకి లేచింది.. ఆమె నిగ్రహించుకుంటూ లేచి నిలబడి రెండు చేతులూ గట్టిగా రుద్దుకుని గట్టిగా దులపడంతో ఆమె నుదుటికి అలమరా హేండిల్ తగిలింది.
“ఏమైంది?” మంఫోజు అడిగింది. తనకు దెబ్బ తగిలిన విషయం దాచడానికి ప్రయత్నిస్తూ “ఏమి లేదు” అంది ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకుంటూ.
“పోలీస్…. పోలీస్ … మిసెస్ క్యూబ్ ఇంట్లో పోలీసులు” సేన్జేని గట్టిగా అరిచింది.
ఆ మాట వినగానే మంఫోజు గబుక్కున లేచింది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఇంట్లో నుంచి ఒక్క పరుగులో బయటకు వచ్చారు వాళ్లకి వినోదం కలిగించే సంఘటన ఏదో జరుగుతున్నదన్న ఆనందంతో. ఆ వీధిలో థెంబా ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగి ఉంది. ఒక చిన్న గుంపులా చాలా మంది అవమానించే పదాలతో శాపనార్థాలు పెడుతూ చూస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కారులో నుంచి చేతులకు సంకెళ్ళలో ఎవోన్నే కనిపించింది.
“ఏం జరిగింది?” అక్కడ దృశ్యాన్ని వినోదంగా చూస్తూ అడిగింది మంఫోజు సేన్జేనిని.
“ఎప్పటిలాగా థెంబి సెలె కౌడ్రి పార్క్‌కు వెళ్తూ స్టేడియం దగ్గర నిలబడి ఉంది.. మిసెస్ క్యూబ్ ఆమెతో గట్టిగా దెబ్బలాడుతూ ఉండడం చూసాను”అంది సేన్జేని.
“ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా తిట్టుకుంటూ ఉండగా థెంబె సెలె లాగి పెట్టి క్యూబ్‌ని కొట్టింది. వెంటనే క్యూబ్ పెద్ద రాయి తీసుకుని థెంట్ సెలెని గాయపరిచింది. అప్పుడు థెంబ్ సిలె అచేతనం అవడం నేను చూసాను” తను చెప్తున్నా కథకి తనే ఆనందిస్తూ చెప్పింది సేన్జేని.. ఆమె కూడా తల్లి లాంటిదే ఊళ్ళో వాళ్ళ విషయాల పట్ల ఆమెకెంతో ఆసక్తి.
మంపోజు షాక్ అయినట్టు రెండు చేతులతో తల పట్టుకుంది.. “లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసి రా” అని కూతురికి చెప్పింది. ఇంతలో అటుగా ఒక స్త్రీ తల మీద ఎండిన పొగాకు కట్టలు పెట్టుకుని వస్తూ ఇంకా వాన్ వైపు చూస్తున్న మంఫోజుని పలకరించింది.
“మంగోభోజి, ఇక్కడేం జరుగుతున్నది.. నీ చుట్టూ ఏం జరుగుతోందో నీకు తెలియకుండా ఉండదు కదా! పోలీస్ కార్ ఎందుకు వచ్చింది?” అక్కడ జరిగిన సంఘటన తను మిస్ ఆయానన్న అసంతృప్తితో అడిగింది.
మంఫోజు కూతురిని పిలిచి తన శాండిల్ తెమ్మని చెప్పింది.
“ఇక్కడేం జరిగిందో ఇలా చెబితే నమ్మవు మంగానే… పద నీకు తోడుగా ఆ చివరి దాకా వస్తూ మొత్తం కథ చెబుతాను” అంది ఆ చిన్న తల కలిగిన భారీ కాయురాలు మరో కథకి విషయం దొరికిందన్న ఆనందంలో.
***
మూలం: Nqobizwe Malinga
తెలుగు: అత్తలూరి విజయలక్ష్మి