[జానీ క్యాష్ పాడిన ‘మాన్ ఇన్ బ్లాక్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జానీ క్యాష్ – ‘మాన్ ఇన్ బ్లాక్’
- ఆల్బమ్ – మాన్ ఇన్ బ్లాక్ (1971)
- రచన, నిర్మాత – జానీ క్యాష్
~
‘మాన్ ఇన్ బ్లాక్’ జానీ క్యాష్ రాసి, రికార్డ్ చేసిన ఒక నిరసన గీతం. ఆయన వేదినపై ఎప్పుడూ నల్లటి దుస్తులతోనే కనిపించేవారు. నలుపు రంగు ఆయన వ్యక్తిత్వంలో భాగం అయిపోయింది. ఆయన అభిమానులూ అయన్ని మాన్ ఇన్ బ్లాక్ గానే పిలుచుకునేవారు. నలుపు రంగును ఎంచుకుని, దాన్ని సమాజం పట్ల తన నిరసనగా మలచుకుని ఆ నిరసన నినాదాన్ని అనునిత్యం మోస్తున్న సైనికుడిలా తనను తాను ప్రకటించుకుంటూ ఈ పాటను రాసారు క్యాష్.
ధనిక రాజకీయ నాయకులు పేదల పట్ల ప్రవర్తిస్తున్న విధానానికి, సామూహిక జైలు శిక్షలకు, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఈ నల్ల దుస్తులు ధరిస్తున్నాన్నంటూ వివరణ ఇచ్చే పాట, నిరసన గీతాల సరసన సగౌరవంగా చోటు సంపాదించుకుంది. పల్లవి, చరణంల బాటలో కాకుండా ఈ పాట ఒక కవితలా సాగిపోతుంది. ఏ వాక్యం కూడా తిరిగి పాడరు జానీ. ఆయన గంభీరమైన గొంతు ఈ నిరసన గీతాల్ని అతి పెద్ద బలం. ఆయన గాన శైలికి, వాచకానికి, గొంతులో సహజంగా ద్వనించే గంభీరత్వానికి ఈ పాట ఒక గొప్ప ఉదాహరణ.
Well, you wonder why I always dress in black
Why you never see bright colors on my back
And why does my appearance seem to have a somber tone
(నేను ఎప్పుడూ నల్లని దుస్తులే ఎందుకు ధరిస్తానోనని మీరు ఆశ్చర్యపోతుంటారు. నా ఒంటి మీద ఎప్పుడూ ప్రకాశవంతమైన రంగులు ఎందుకు కనిపించవో అని, నా రూపం ఎందుకింత నిస్తేజంగా ఉంటుందో అని అనుకుంటూ ఉంటుంటారు)
నలుగు ప్రకాశవంతమైన రంగు కాదని చాలా మంది సాధారణంగా అనుకునే విషయమే ఎప్పుడు నల్ల దుస్తులలోనే కనిపించే జానీ ఎందుకు ప్రకాశవంతమైన రంగులకు దూరంగా ఉంటాడా అని కొంత మంది విమర్శిస్తూ ఉంటారు. దాన్ని గుర్తు చేస్తూ ఆ విమర్శలకు జానీ ఇలా సమాధానం చెప్తున్నాడు.
Well, there’s a reason for the things that I have on
I wear the black for the poor and the beaten down
Livin’ in the hopeless, hungry side of town
I wear it for the prisoner who is long paid for his crime
But is there because he’s a victim of the times
ప్రపంచంలో ఎటు చూసినా ఉన్నవి విషాద గాథలే.. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం మరి. అందుకే పీడితులు, అసహాయులు, కఠిన రాచరికపు పాలనలో మగ్గిపోతున్నవాళ్ళ జీవితాలలోని దుఖాన్ని గమనిస్తూ, వారి పరిస్థితులు మానవులు సృష్టించినవే అని అర్థం చేసుకుంటూ ఆ విషాద జీవితాలకు కారణాలు వ్యవస్థ నిర్మాణాలని నమ్ముతూ ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా, దానిపై నిరసన ప్రకటిస్తూ తాను నలుపును ధరిస్తున్నానంటున్నాడు జానీ.
I wear the black for those who’ve never read
Or listened to the words that Jesus said
About the road to happiness through love and charity
Why, you’d think He’s talking straight to you and me
(ప్రేమ, దానధర్మాల ద్వారా లభించే ఆనంద మార్గం గురించి, ప్రభువు పలికిన మాటలను ఎన్నడూ చదవని, వినని వారి కోసమే నేను నల్లని దుస్తులు ధరిస్తాను. ఆయన నేరుగా మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నట్లు అనిపించట్లేదా)
ప్రభువు చేసిన బోధనలను మనుషులు మర్చిపోయారు. ఆయన మనతో నేరుగా మాట్లాడుతున్నది ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రేమ, స్నేహం, కలిసి మెలిసి జీవించడం అనే విలువలకు అందరూ తిలోదకాలిచ్చేసారు. ఈ పరిస్థితులలో దెవున్ని సైతం మరచిపోయిన మనుష్యుల మూర్ఖత్వానికి నిరశనగా నేను నల్లని దుస్తులను ధరిస్తున్నాను అంటున్నాడు కవి.
Well, we’re doin’ mighty fine, I do suppose
In our streak of lightnin’ cars and fancy clothes
But just so we’re reminded of the ones who are held back
Up front there ought to be a man in black
(మెరుపు వేగంతో దూసుకెళ్లే కార్లు, ఆడంబరమైన దుస్తులతో మనం బాగానే రాణిస్తున్నాం అనుకుంటా, కానీ వెనుకబడిపోయిన వారిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆ వరుసలో ముందు భాగంలో ‘నల్లని దుస్తులు ధరించిన వ్యక్తి’ ఒకరు ఉండాలి.)
తాను నల్లని దుస్తులను కేవలం కోపంతో ధరించట్లేదని, అది తన బాధ్యతగా భావిస్తున్నానని జానీ చెప్పుకుంటున్నాడు. చాలా మంది తమకు లభించిన సౌకర్యాల మత్తులో పడిపోయి బలహీనులను, దోపిడికి గురవుతున్న వాళ్ళను మర్చిపోతున్నారు. ఇది ఒక రకంగా స్వార్థమే. మనుష్యులుగా తోటి వారి కష్టాలను విస్మరిస్తే అది బాధ్యతారాహిత్యం అవుతుంది. తాను అది చేయలేడు కాబట్టే ఒక ఒంటరి వ్యక్తిగా అందరినీ మార్చలేడు కాబట్టి వారి బాధ్యతారాహిత్యాన్ని వారికే గుర్తు చేయడానికి ముందు వరసలో అన్ని సౌకర్యాలు పొందగలిగే స్థితిలో ఉంటూ కూడా నలుపే ధరించడానికి నిశ్చయించుకున్నానని చెప్తున్నాడు.
I wear it for the sick and lonely old
For the reckless ones whose bad trip left them cold
I wear the black in mournin’ for the lives that could have been
Each week we lose a hundred fine young men
And I wear it for the thousands who have died
Believin’ that the Lord was on their side
I wear it for another hundred-thousand who have died
Believin’ that we all were on their side
(అనారోగ్యంతో, ఒంటరితనంతో బాధపడే వృద్ధుల కోసం నేను నల్లని దుస్తులు ధరిస్తాను. అవివేకపు పనుల వల్ల విషాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి కోసం ధరిస్తాను. జరగాల్సింది జరగకుండా ఆగిపోయిన ఆ జీవితాల పట్ల సంతాపంగా నేను నలుపును ధరిస్తాను. ప్రతి వారం మనం వందలాది మంది ఉత్తమ యువకులను కోల్పోతున్నాం. దేవుడు తమ పక్షాన ఉన్నాడని నమ్మి ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది కోసం నేను దీనిని ధరిస్తాను. మనమందరం తమ పక్షాన ఉన్నామని నమ్మి మరణించిన మరో లక్ష మంది కోసం కూడా నేను నలుపును ధరిస్తాను)
ఈ వాక్యాలు కేవలం అమెరికా దేశమే కాదు ప్రపంచంలో నియంతృత్వపు పాలనలో మగ్గిపోతూ తాము ప్రగతి బాటలో ప్రయాణిస్తున్నామనే అపోహలో జీవిస్తున్న ప్రతి దేశపౌరుడికి, యుద్దం దేవుని చిత్తమని భావించే విధంగా మలచపడిన దేశభక్తి అనే మత్తుకు జవాబుగా చెప్పుకోవాలి. వృద్దులను పట్టించుకునే స్థితి అభివృద్ది దేశాలలో ఉండదు. ఇప్పటి మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ది పేరుతో తల్లి తండ్రులను అనాథలుగా వదిలేసే సంస్కృతి పెరిగిపోయింది. అలాంటి అభివృద్ధి సంస్కృతి పట్ల నిరసన ప్రకటిస్తున్నాడు జానీ. తప్పులు చేసి జీవితాన్నివిషాదమయం చేసుకున్న అవివేకులను సక్రమ మార్గంలో పెట్టలేకపోయిన వ్యవస్థ పట్ల నిరసన ప్రకటిస్తున్నాడు అతను. ఆ సమయంలో అమెరికా వియత్నాంల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ యుద్దం వెనుక ఉన్న స్వార్థాన్ని గమనించిన అమెరికా పౌరుడిగా దేశభక్తి పేరుతో, దేవుడు తమ పక్షాన ఉన్నాడన్న భ్రమతో వందలాది యువకులు యుద్దభూమిలో మరణిస్తూ ఉంటే ఆ ప్రాణ నష్టానికి నిరసనగా నలుపు ధరిస్తున్నానని చెప్తున్నాడు. నిజానీకి ఇది సామ్రాజ్యవాదం పట్ల ఓ కళాకారుడి నిరసన కూడా. అమెరికా ప్రజలందరూ సైన్యం పక్షానే ఉన్నారని, తాము చేస్తున్నదాన్ని సమర్థిస్తారనే అపోహతో యుద్దాంలో అర్ధరహితంగా మరణించిన లక్ష మంది పట్ల బాధతో, వారిని అలా మృత్యుపాలు చేసిన రాజ్యం పట్ల నిరసనతో తాను నలుపును ధరిస్తున్నానంటున్నాడు జానీ.
Well, there’s things that never will be right, I know
And things need changin’ everywhere you go
But ‘til we start to make a move to make a few things right
You’ll never see me wear a suit of white
(ఎప్పటికీ సరిచేయలేని విషయాలు కొన్ని ఉంటాయని నాకు తెలుసు. మనం ఎక్కడికి వెళ్లినా కొన్ని విషయాలు మారాల్సిన అవసరం ఉంటుంది. కానీ, కొన్ని విషయాలనైనా సరిదిద్దే దిశగా మనం అడుగులు వేయడం మొదలుపెట్టేంత వరకు, నేను తెల్లని సూట్ ధరించడం మీరు ఎప్పటికీ చూడలేరు.)
చాలా గొప్ప ప్రకటన ఇది. జీవితంలో అన్నిటిని మార్చలేమని, ఎక్కడకు వెళ్లినా, అన్ని సక్రమంగానే ఉండవని తెలిసినా, కొన్నిటినైనా సరిదిద్దే ప్రయత్నంలో మనుష్యులుగా బ్రతుకుతున్న మనం పాలు పంచుకోకపోతే మనిష్యులుగా చనిపోయినట్లే. అందుకే ఆ దిశగా ప్రజలంతా అడుగులు వేసే దాకా తాను తలుపు ధరించనని, నల్ల దుస్తులతోనే కనిపిస్తానని చెప్తున్నాడు జానీ.
Ah, I’d love to wear a rainbow every day
And tell the world that everything’s okay
But I’ll try to carry off a little darkness on my back
‘Til things are brighter, I’m the man in black
(అవును, ప్రతి రోజూ ఇంద్రధనస్సును ధరించాలని, అంతా బాగుందని లోకానికి చాటాలని నాకు ఎంతగానో ఉంటుంది. కానీ పరిస్థితులు మెరుగుపడేంత వరకు, కొంత చీకటిని నా భుజాలపై మోయడానికి ప్రయత్నిస్తాను నేను ‘నల్లని దుస్తుల మనిషి’గానే ఉండిపోతాను.)
తనకూ ఇంధ్రధనస్సు రంగులు ధరించాలని ఉంటుందని, కాని పరిస్థితులు చక్కబడేంతవరకు కొంత చీకటిని మోయక తప్పదని, ఆ బాధ్యతను తన భుజాలపై తానువేసుకున్నానని, వ్యవస్థలో మార్పు రానంతవరకు తాను ‘మాన్ ఇన్ బ్లాక్’ అంటే నల్ల దుస్తులు ధరించే వ్యక్తిగానే ఉండిపోతానని ప్రకటిస్తున్నాడు.
జానీ రాసిన వందలాది పాటల్లో చాలా వాటికి అవార్డులు, లభించాయి. కాని ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తీకరిస్తూ రాసిన ఈ నిరసన గీతానికి ఏ అవార్డు రాలేదు. ఉత్తమ కంట్రీ గీతంగా గ్రామీ నామినేషన్ వరకు మాత్రమే ఇది వెళ్లగలిగింది. కాని జానీ అభిమానులు ఈ పాటకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. యుఎస్. బిల్బోర్డ్ హాట్ కంట్రీ సింగిల్స్ లోనూ మూడవ స్థానం వరకే పరిమితమైన ఈ పాట ద్వారా కళాకారుడిగా తన సామాజిక బాధ్యతను నెరవేర్చిన జానీ పట్ల నాలాంటి విదేశీయులలోనూ ఎంతో అభిమానం, గౌరవం ఏర్పడింది.
జానీ పాటలన్నిటిలో నన్ను ఎంతగానో కదిలించి ఆలోచింపజేసిన ఈ పాట అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.
‘మాన్ ఇన్ బ్లాక్’ పాటను ఈ క్రింది లింక్ లో వినండి.
https://www.youtube.com/watch?v=JbOCwlC1kdE

