[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం-1
ఆకాశం మేఘావృతం.. జగతి (భూమి) పై కారు చీకట్లు.. గగన మార్గాన ఉరుములు.. మెరుపులు..
తీవ్రమైన గాలి, వడగళ్ళ వాన..
వార్తల్లో యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రగాలి, వాన, తుఫాను. విశాఖపట్నం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద నగరం. బంగాళాఖాతం (సముద్రం) ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు నాల్గవ పెద్ద ఓడరేవు ఉంది.
దేశంలోని అతిపెద్ద పురాతన నౌకా నిర్మాణ కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి ఓడ అయిన జల ఉష, ఇక్కడ తయారు చేయబడి, అప్పటి దేశ ప్రధానమంత్రి గారైన, జవహర్ లాల్ నెహ్రూ చేతులు మీదుగా జల ప్రవేశం (సాగరంలోకి) జరిగింది. ఈ మహా నగరానికి విశాఖ, వైజాగ్, వాల్తేరు అనే పేర్లు కూడా కలవు.
నెల్లూరు జిల్లా ప్రాంతం ఆ తుఫాను తాకిడికి తల్లడిల్లిపోయింది. ఆ జిల్లాలో అతి ముఖ్య పెద్ద గ్రామ బుచ్చిరెడ్డిపాలెం. ప్రముఖులు శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డి గారు (కాంగ్రెస్ పార్టీ నాయకులు), శ్రీయుతులు పుచ్చలపల్లి సుందరయ్య (కమ్యూనిస్టు పార్టీ) జన్మభూమి అది. దొడ్లా వారి సంస్థాన నిలయం అది. అక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో రేబాల గ్రామం. అదే ప్రస్తుతంలో లండన్లోని St. George’s University సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ గారి జన్మభూమి. రాత్రి పదిగంటల వరకూ టివిలో ఆంధ్ర వార్తలను విని పడకపై వాలాడు శ్రీరామ్.
సముద్రపు పొంగు రాక్షస అలలు తీరం వైపుకు వికారమైన శబ్దంతో పరుగిడుతున్నాయి. సాగరం, ఆకాశం రంగు ఒకేలా వుంది. తుఫాను ప్రభావానికి ఎన్నో చెట్లు, కొన్ని పాత ఇళ్ళు, నేలకూలాయి. పూరి గుడిసెలు గాలికి ఎగిరిపోయాయి. బీదవారు తమ పిల్లలతో వూర్లో గుళ్ళు వున్న ప్రాంతానికి, కలవారి భవంతుల వైపుకు ఆ జోరుగాలి వానలో పరుగెత్తి తలదాచుకున్నారు. పంచభూతాలు ఐదు. నీరు, గాలి, అగ్ని, ఆకాశం, భూమి. ఆకాశం, భూమిలకు స్థిరత్వం. కదలవు. కానీ.. మిగతా మూడు నీరు, గాలి, అగ్ని వక్రించినచో ప్రజా జీవితం దుర్భరమౌతుంది. ఇప్పుడు అదే జరిగింది.
ఉన్నవారు, వారి సురక్షిత గదుల్లో తలకు మఫ్లర్స్, శరీరాలపై ధరించిన దుస్తులు కాకుండా ఖరీదైన బెడ్ షీట్లను (దుప్పట్లు) కప్పుకొని కదలకుండా వారి వారి శయ్యలపై (మంచాలు) పడుకొన్నారు.
నిరుపేదలు, చలికి వణుకుతూ గుడి మండపాల్లో, కలవారి పశువుల కొట్టాలలో ఓ మూలగా ఒదిగి కూర్చుని, బ్రతుకు జీవుడా అని ఆ దైవాన్ని తలచుకొంటూ కన్నీరు కారుస్తున్నారు. వాన, గాలి తగ్గుముఖం పట్టే సూచనలు లేవు.
పశువులు గడగడ వణుకుతూ ఇండ్ల చూర్ల క్రింది గోడకు ఆనుకొని నిలబడిపోయాయి.
పెద్ద మెరుపు..
గగనాన వికారశబ్దం.. అర్జునుని రథం అంటారు పెద్దలు. ఆ రథసారథి శ్రీ కృష్ణ పరమాత్మ. ‘పాప ప్రక్షాళనకు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి’ అనేది పెద్దల వాక్కు.
ఈ కలియుగంలో నేడు పాపం పెరుగుతూ వుంది. మనషుల్లో దైవ నమ్మిక, ప్రకృతి ఆరాధనా భావాలు సన్నగిల్లాయి. కృత, త్రేతా ద్వాపర యుగాల్లో వుండినవారు, రెండు వర్గీయులు. వారు.. దేవతలు, దానవులు.. 1. దేవతలు – దైవం మీద నమ్మిక కలవారు. వారిలో రెండు తెగలు. హర (శివుడు) భక్తులు, హరి (విష్ణు) భక్తులు. వారిరువురి మధ్యన వైరభావం. రెండవ వర్గం దానవులు. వారు శివ భక్తులు. కానీ ఈ కలియుగంలో మరో వర్గం ప్రభలింది. వారే నాస్తికులు. ఆ నాస్తికులకు హర అన్నా, హరి అన్నా గిట్టదు. దేవుడే లేడు అనేది వారి వాదన. అదంతా కలి (శనిదేవుడు) ప్రభావం అంటారు పెద్దలు.
పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆ పిడుగు శ్రీరామ్ వారి ఇంటి మీద పడింది..
వారి ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నది, అక్క శాంతి, ఆమె భర్త ఆనందరాయుడు, వారి కుమార్తె భారతి, తమ్ముడు చలపతి. కొడుకు నరసింహరాయుడు, అతని భార్య కవిత. ఆనందరాయుడు ఆ ఇంటికి ఇల్లరికం.
తన అక్క శాంతి వివాహ విషయంలో తనకు (శ్రీరామ్) తండ్రి కోటేశ్వరయ్యకు మధ్యన జరిగిన తర్కం కారణంగా తనకు ఆ ఇంట (తన పుట్టింట) గౌరవం లేదని అందరినీ వదలి రాత్రివేళ వైజాగ్ వాసి, దినకర్ అతని ప్రాణ స్నేహితుడు, బంధువు అతన్ని కలిశారు. దినకర్ సాయం (ఆర్థిక)తో శ్రీరామ్ లండన్ చేరాడు.
శ్రీరామ్ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచాడు.
అతను అంతవరకూ వున్నది కన్నది కల..
‘ఏమిటీ కల!.. ఇది అబద్ధమా..!.. నిజమా.. వార్తల్లో విన్నది నిజం. తుఫాను ఆంధ్ర ప్రాంతాన్ని భీబత్సం చేసింది. చాలా మంది ఎన్నో విధాల నష్టపోయారు. పేదలు నిరాశ్రయులు. కొందరు మరణించారు. అది వాస్తవం..
మరి కలలో.. తాను కన్నది, తన ఇంటిపై పిడుగు పడటం, తన భవంతి కూలిపోవడం వాస్తవమా, అవాస్తవమా!.. మనస్సున కల్లోలం..
కలలన్నీ నిజాలు కావు. కల్లలు అంటారు పెద్దలు. నాకు వచ్చిన కల నిజమా!.. అబద్ధమా!!..
తాను భారత్‌ను వీడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు..
తనవారంతా గుర్తుకు వచ్చారు.
బ్రతికి వున్నారో లేదో!..
ఆనాడు, ఇల్లు విడిచే రోజుకు తన వయస్సు ఇరవై సంవత్సరాలు. స్నేహితుడు దినకర్ సాయంతో లండన్ చేరాడు. ఒక్క సంవత్సరం సెకండరీ స్కూల్లో సైన్స్ టీచరుగా పనిచేశారు. PH.D చేయాలనే తాన కోర్కెను తీర్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆ స్కూలు హెడ్ మాస్టర్ కాశ్వప్ సాయంతో St. George’s University లో ఎం.ఎస్.లో చేరి గోల్డ్ మెడలిస్టుగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు.
ఆ యూనివర్శిటిలోనే లెక్చరర్‌గా చేరాడు. తన కర్తవ్య పాలనలో యూనివర్శిటి పెద్దల మన్ననలను పొందాడు. ప్రమోషన్స్ లభించాయి. సీనియర్ ప్రొఫెసర్ లెవల్‌కు ఎదిగాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదించుకొన్నాడు.
ఆ కల కారణంగా వయస్సు రీత్యా తన వారినందరినీ చూడాలనే భావన మనస్సున కలిగింది. పంతం సడలింది.
‘నాలో ఈనాడు కలిగిన మాతృదేశ సందర్శన ఆలోచన నా వారినందరినీ చూడాలనే భావన, కోరిక.. బహుశా నా వయస్సు రీత్యా నాలో కలిగిన మార్పు.’
‘అవును అదే నిజం. వెళ్ళాలి నా భారత్‌కు. చూడాలి నా వారందరినీ. నాలోని విద్వత్తును నా దేశ వాసులకు, నా ప్రాంతీయులకు పంచాలి. అక్కడ నేటి సమాజంలో వున్న సమస్యలను సమ్మూలంగా నాశనం చేయాలి. నావారిని ప్రగతి పధంలో నడపాలి’ అనుకొన్నాడు శ్రీరామ్.
అతని మనో ఫలకంపై తాను ఈ మధ్యన టి.విలో చూచిన భారతి రూపురేఖలు, ప్రసంగాలు..
ఆ భారతి.. ఎవరో కాదు. తన అక్క శాంతి కూతురు. తన మేనకోడలు. తన తండ్రి కోటేశ్వరయ్యలా ప్రజాసేవ చేసేదానికి పూనుకొంది. వారి మనస్సుకు మహదానందకరమైన విషయం అది..
తాను ఇంటికి వీడిననాడు జరిగిన సంఘటన కళ్ళముందు ప్రతిబింబించింది.
“నాన్నా!..”
“ఏంటి శ్రీరామ్!..”
“శాంతి వివాహ విషయం!..”
“విషయం?..” తండ్రి కోటేశ్వరయ్య గారి ప్రశ్న.
“లో.. నాకు ఎలాంటి సంబంధం లేదా!..” శ్రీ రామ్ ప్రశ్న.
“అని నేను అనలేదుగా!..” తండ్రి జవాబు.
“మీ నిర్ణయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు?”
“నేను నీ తండ్రిని!.. ఏది మంచో ఏది చెడో నా కూతురు విషయంలో నేను నిర్ణయించుకోగలను. నాకు ఒకరి సలహాలు, సంప్రదింపులూ అనవసరం.”
“నేను ఆమె పెద్ద తమ్ముడిని కదా నాన్నా..”
“అయితే..! నేను నిన్ను సలహా అడగాలా? నీ సలహా ఏమిటో నే చెబుతా విను. దినకర్ నీ స్నేహితుడు, శాంతిని వాడికిచ్చి పెండ్లి చేయండి నాన్నా అంటావ్! అదేగా నీవు నాకు చెప్పాలనుకొన్నది?”
“అవును నాన్నా!.. దినకర్ బాగా చదువుకొన్నవాడు. చాలా మంచివాడు. అక్క శాంతి అంటే వాడికి ఎంతో ఇష్టం. వాడితో ఆమె వివాహం జరిగితే శాంతి జీవితం ఎంతో బాగుంటుంది నాన్నా!..” నచ్చచెప్పాడు శ్రీరామ్.
“దినకర్ నాకు నచ్చలేదు!”
“ఆనందరాయుడు?” అడిగాడు శ్రీరామ్.
“నాకు బాగా నచ్చాడు..” తండ్రి గారి జవాబు.
“నాన్నా!..”
“ఏమిటి?..”
“శాంతి నిర్ణయాన్ని తెలుసుకొన్నారా!”
“శాంతీ!.. శాంతీ!..” బిగ్గరగా పిలిచాడు కోటేశ్వరయ్య. కొన్ని క్షణాల్లో శాంతి వచ్చి వారి ముందు నిలబడింది. “అడుగు!..” అది ఒక శాసనం లాంటి పలుకు!? కోటేశ్వరయ్యగారిది.
“అమ్మా శాంత?”
“ఏమిటి శ్రీరామ్?”
“నా స్నేహితుడు దినకర్ గురించి నీ అభిప్రాయం?”
“నాకు వారి విషయంలో ఎలాంటి అభిప్రాయం లేదు!..”
“నాకుంది!”
“ఏమిటది?”
“వాడు నీకు అన్నివిధాలా తగినవాడక్కా చాలా మంచివాడు.”
“వారి మంచి చెడ్డల గురించి నాతో ఎందుకు చెబుతున్నావ్?”
“నీ వివాహం వాడితో జరపాలని నా కోరిక!”
“అలాంటి కోరిక నాకు లేదు. నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం” వేగంగా శాంతి లోపలికి వెళ్ళిపోయింది.
అంతా వింటున్న చలపతి శ్రీరామ్ తమ్ముడు..
“రేయ్!.. అన్నా!.. నీ కోర్కె నెరవేరదు. నాన్నగారు నీ మాటను వినరు. ఎందుకురా అనవసరంగా ఆవేశపడతావ్. వూరుకో!..” అనునయంగా చెప్పాడు.
ఆ ముగ్గురి మాటలూ శ్రీరామ్ మనస్సుకు ఎంతో బాధ కలిగించాయి. ఆనందరాయుడు తండ్రి వెంకటరామయ్య పరమ నీచుడని శ్రీరామ్‌కు తెలుసు. అందుకే ఆ సంబంధం అంటే అతనికి ఇష్టం లేదు.
తన మాటను తండ్రి, అక్క, తమ్ముడు లెక్కచేయనందున అతని మనస్సు ఎంతో బాధ. తండ్రి తనతో గౌరవాన్నివ్వకుండా ఆక్షేపించి తన మాటను కాదన్నందుకు విచారం.. రోషం.. అవమానం.
ఆ కారణంగా ఆ రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదలి వైజాగ్‌లో వున్న తన స్నేహితుడు దినకర్ వద్దకు వెళ్ళిపోయాడు.
దినకర్ ఆర్థిక సహాయంతో లండన్ వెళ్ళిపోయాడు. తాను లండన్‌కు వచ్చి ఇరవైఎనిమిది సంవత్సరాలు. మాస్టర్స్ చేసివున్నందున St. George’s University లో PH.D చేసి అక్కడే లెక్చరర్‌గా చేరి నాలుగేళ్లలో ప్రొఫెసర్ అయ్యాడు. డీన్ జార్జికి శ్రీరామ్ అంటే ఎంతో అభిమానం. కారణం శ్రీరామ్ యొక్క సాత్విక గుణం, సదా చిరునవ్వు ముఖం, అతను విద్యను బోధించే విధానం. తోటి లెక్చరర్లు, ప్రొఫెసర్స్ కూడా శ్రీరామ్‌ను ఎంతగానో అభిమానిస్తారు. గౌరవిస్తారు. ప్రస్తుతంలో శ్రీరామ్ సీనియర్ ప్రొఫెసర్.
అధ్యాయం-2
మరుదినం యూనివర్శిటీకి వెళ్ళగానే డీన్ జార్జిగారిని కలిసి, తన స్వదేశ ప్రయాణ నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీరామ్. డీన్ తొలుత అంగీకరించలేదు.
శ్రీరామ్, అక్కడి తన పరిస్థితులను గురించి, తన బిడ్డ భవిష్యత్తును గురించి, తన మనోభావాలను గురించి, వివరించిన తరువాత డీన్ శ్రీరామ్ రిజిగ్నేషన్‍ను ఆమోదించారు.
మరుదినం.. ఒక పార్టీ ఏర్పాటు చేశాడు శ్రీరామ్.
తనకు ఎన్నో విధాల సాయం చేసిన పెద్దలకు డేన్ గారికి, ప్రొఫెసర్స్ కు ధన్యవాదాలు తెలిపాడు. శిష్యులకు శుభాశీస్సుల పేరుపేరునా పంచాడు.
“నేను నా స్వదేశానికి.. నావారి వద్దకు వెళుతున్నాను. మరలా తిరిగి రాను. పెద్దలందరికీ హృదయ పూర్వక వందనాలు. పిన్నలకందరికీ నా దీవెనలు. శుభాశీస్సులు” వినయంగా చేతులు జోడించాడు శ్రీరామ్. వేదికను దిగాడు.
తన కూతురు గంగ వున్న హాస్టల్‌కు వెళ్ళాడు. అతని భార్య రోజీ.
కూతురు గంగ వయస్సు ఒకటిన్నర సంవత్సర ప్రాయంలో ఆమె తల్లి రోజీ మరణించింది.
ఇప్పుడు ఆమె వయస్సు పది సంవత్సరాలు. ఐదవ తరగతి చదువుతూ ఉంది.
“నాన్నా!..” నవ్వుతూ పిలిచింది గంగ.
శ్రీరామ్ చిరునవ్వుతో గంగను సమీపించాడు.
“అమ్మా!.. మనం మన దేశానికి వెళుతున్నాము” అన్నాడు.
“ఎప్పుడు?”
“వీకెండ్లో టికెట్స్ బుక్ చేయమని చెప్పాను.”
“తిరిగి ఇక్కడికి వస్తామా నాన్నా!”
“రావాలని లేదురా. మన వాళ్ళంతా అక్కడే వున్నారు కదా!.. నీకు రావాలని ఉందా!”
“నాన్నా!.. నాకు నావారు అవసరం లేదా!.. అమ్మ ఎటూ..” గంగ పూర్తిచేయకముందే..
“గంగా ఆపరా!.. మనం మరలా ఇక్కడికి తిరిగి రాము. మనవాళ్ళ దగ్గరే వుండి పోదాము. నా చదువు, సంస్కారాలను, నేను సంపాదించిన సంపాదనను మన ప్రాంతంలో మన వారి కోసం వినియోగిద్దాం సరేనా!..”
“ఓకే నాన్నా!.. మీ మాటలు వినేదానికి చాలా ఆనందంగా వున్నాయి” సంతోషంగా చెప్పింది గంగ. ఆ తండ్రి కూతుళ్ళు వారి ఇంటికి చేరారు.
శ్రీరామ్ తన ఇంటిని, కారును కో-ప్రొఫెసర్ అశోక్‌కు అమ్మేశాడు.
రేపు భారత్‌కు వారి ప్రయాణం.
ఆ సాయంత్రం వారు గంగ తల్లి సమాధి వద్దకు వెళ్ళారు.
పుష్పగుచ్ఛాలను సమర్పించారు. అగరువత్తులను కొన్ని తీసి వెలిగించారు. చేతులు జోడించారు. గంగకు తన తల్లి ఎలా ఉంటుందో తెలియదు ఫొటోలో చూడ్డం తప్ప. ఇప్పుడు ఆమె వయస్సు పది సంవత్సరాలు. ఐదవ తరగతి పాసయ్యింది. క్లాస్ ఫస్ట్.
‘అమ్మా!.. నీవు ఏ లోకంలో వున్నావో!.. నీతో నేను గడిపిన కాలం నాకు గుర్తులేదు. నీవు నాపట్ల చూపిన ప్రేమానురాగాలు నాన్న మాటల్లో విన్నాను. నేను నా జీవితంలో నిన్ను మరచిపోలేనమ్మా. నాన్న నేను మన దేశానికి వెళుతున్నాము. ఇక మరలా తిరిగిరాము. కానీ, నీ గురించి నాన్న చెప్పిన నీ జ్ఞాపకాలను నేను నా మదిలో నా జీవితాంతం పదిలంగా దాచుకొంటానమ్మా’ ఎంతో భావావేశంతో అనుకొంది మనస్సున గంగ.
ఆ క్షణాల్లో ఆమె కళ్ళల్లో కన్నీరు.
“రోజీ, మై లవ్!.. నీ జ్ఞాపకాలు నా హృదయం నిండా వున్నాయి. నీవు మరణించలేదు, నాలోనే వున్నావు. నీవు నాకు చెప్పిన ఆదర్శాలు నా గుండె నిండా వున్నాయి. నీవు మన భారత్‌లో నిర్వహించాలనుకొన్న నీ ఆశయాలను నేను నెరవేరుస్తాను. నీ ఆత్మకు ఆనందాన్ని కలిగిస్తాను. పదేళ్ళ ముందు గంగ పుట్టిన తరువాత, నీవు.. ‘మన దేశానికి వెళ్ళిపోదామండీ!.. అన్నావు. కానీ, నేను నీ కోర్కెను కాదన్నాను. మరి కొంతకాలం తరువాత వెళదాం రోజీ’ అన్నాను. కానీ, నేడు నీవు నా చెంత లేవు. నీతో గంగతో కలిసి, మన భారతావనికి పయనించే యోగం నాకు లేదు. ఒకవేళ, నీవు కోరిన ఆనాడు మనం మన భారతావనికి వెళ్ళి వుంటే, నీవు మరణించేదానివి కావేమో!.. నేను దురదృష్టవంతుణ్ణి, నీ కోర్కెను నెరవేర్చలేకపోయాను, రోజీ నన్ను క్షమించు. నన్ను క్షమించు” ఆ రీతిగా తన అర్ధాంగి పట్ల తనకు ఉన్న మమతానురాగాలని కన్నీటితో మనస్సున ఆమెకు తెలియజేశాడు శ్రీరామ్.
తండ్రి కూతుళ్ళు ఒకరినొకరు చూచుకొన్నారు. ఇరువురి హృదయం వేదనకు కారణం ఒక్కటే.. రోజీ నిర్యాణం..
మెల్లగా కారును సమీపించారు. కూర్చున్నారు. శ్రీరామ్ కారును స్టార్ట్ చేశాడు. అరగంటలో ఇంటికి చేరారు.
ఇరువురూ కలిసి ఎనిమిది గంటలకు భోజనం చేశారు. “గుడ్‌నైట్ నాన్నా” చెప్పి గంగ తన గదికి వెళ్ళిపోయింది.
శ్రీరామ్ తన మిత్రులందరికీ ఫోన్ చేసి, రేపటి తన భారత్ ప్రయాణం గురించి తెలియజేశాడు. వారంతా వారు బెస్ట్ విషెస్‌ను శ్రీరాము తెలియజేశారు. సమయం రాత్రి తొమ్మిదిన్నర.
శ్రీరామ్ తన బెడ్‌పై వాలాడు.
మనస్సున రోజీతో తన తొలి పరిచయ జ్ఞాపకాలు.
***
ఆ రోజే ఆ యూనివర్శిటీలో లెక్చరర్‍గా జాయిన్ అయ్యింది రోజ్. ఆమె డిపార్ట్‌మెంట్ హెడ్ శ్రీరామ్.
అతని గదికి సమీపించి డోర్‌ను నాక్ చేసింది.
“ప్లీజ్ కమిన్” శ్రీరామ్ ఆహ్వానం.
రోజీ గది తలుపులు తెరుచుకొని లోన ప్రవేశించింది.
“గుడ్ మార్నింగ్ సార్. డీన్ గారు మిమ్మల్ని కలవమన్నారు.” చిరునవ్వుతో చెప్పింది రోజీ.
తెలుగువారి సాంప్రదాయబద్ధంగా చీర, జాకెట్, తల్లో మల్లెపూలు, నొసటన ఎర్ర తిలకం బొట్టు, అప్సరసలా గోచరించింది రోజ్ శ్రీరామ్ కళ్ళకు.
కొన్ని క్షణాలు ఆమెను పరీక్షగా చూచాడు శ్రీరామ్.
‘ఎంత అందం!.. బ్రహ్మదేవుని చిత్రకళానైపుణ్యం అమోఘం, అద్వితీయం’ అనుకొన్నాడు శ్రీరామ్. “కూర్చోండి”
రోజీ వారి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది.
“మీ పేరు?”
“రోజీ థామస్”
“నా పేరు శ్రీరామ్!”
“డీన్ గారు చెప్పారు సార్!” చిరునవ్వుతో రోజీ జవాబు.
వారి సంభాషణ తెలుగులో సాగింది.
“మీరు తెలుగును ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?” ఆశ్చర్యంతో అడిగాడు శ్రీరామ్.
“మా అమ్మ దుర్గ ఆంధ్ర యువతి. అమ్మా, నాన్నలది లవ్ మ్యారేజీ. అమ్మ నాకు తెలుగును నేర్పించింది.”
“ఓ.. అలాగా!”
“అవును సార్!..” అందంగా నవ్వింది రోజ్.
“మరి మీ పేరు!”
“అది నాన్న థామస్ గారి సెలక్షన్. వారికి రోజాపూలు అంటే గులాబీలు అంటే వారికి ఎంతో ఇష్టం. వారే నాకు ఆ పేరును సెలక్ట్ చేశారట, అమ్మ చెప్పింది” చిరునవ్వుతో చెప్పింది రోజ్.
తరువాత వారి సంభాషణ రోజ్ విధులను గురించి జరిగింది. ఆమె నిర్వహించవలసిన ఉద్యోగ విధులను శ్రీరామ్ వివరంగా రోజు తెలియజేశాడు. చివరగా..
“మిస్ రోజీ!.. పిల్లలకందరికీ క్రమశిక్షణను బాగా నేర్పాలి. కాలం విలువను గురించి విశదీకరించాలి. అందరు విద్యార్థి విధ్యార్థినీలను సమదృష్టితో చూడాలి. కొందరి తెలివితేటలు అధికంగా వుండవచ్చు. కొందరు దానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. మనదృష్టి ఆ రెండవ వర్గంపైన అధికంగా వుండాలి. వారు మన లెక్చర్స్ విని మొదటి వర్గీయులుగా మారే రీతిగా, వారిని మనం జాగ్రత్తగా చూడాలి. అవసరమైన సలహాలను ఇవ్వాలి. విద్యార్థులందరిలో కుల మత దేశ బేధాభిప్రాయాలు లేకుండా సఖ్యతను పెంపొందించాలి” శ్రీరామ్ చెప్పడం ఆపాడు.
రోజీ తదేకంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఆమె మనస్సున.. ‘వాట్ ఏ గ్రేట్ జంటిల్‌మన్. గొప్ప ఆదర్శవాది, సూపర్’ అనుకొంది.
ఆమె పెదవులపై చిరునవ్వు. దాన్ని గమనించిన శ్రీరామ్..
“నా ప్రసంగం మీకు బోర్ అనిపించిందా!”
“నో.. నో సార్!.. మీరు చెప్పిన ప్రతి అక్షరం సత్యం. నా బాధ్యతను గురించి మీరు చాలా బాగా వివరించారు. ధన్యవాదములు” చేతులు జోడించింది రోజ్.
“మీరు మా భారత్‌ను సందర్శించారా!”
“లేదు సార్!..” విచారంగా చెప్పింది రోజ్.
“ఓకే!.. డోంట్ వర్రీ!.. నేను చూపిస్తాను” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“ఎలా!..” అడిగింది రోజ్.
“నాతో తీసుకొని వెళతాను.”
“మీరు ఇండియాకు వెళుతున్నారా!”
“ఇప్పుడు కాదు!”
“ఎప్పుడు?”
“మరికొంత కాలం తరువాత!”
“ఓకే థాంక్యూ సార్!”
“ఆల్ ద బెస్ట్. ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా సందేహం కలిగితే నిర్భయంగా నన్ను కలిసి అడగండి” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“ధన్యవాదములు సార్” చేతులు జోడించి అందంగా నవ్వింది రోజ్.
“క్లాస్‌కు వెళుతున్నాను సార్!” అంది.
“ప్లీజ్..” ఎడం చేతిని పైకెత్తి ‘వెళ్ళండి’ అనే సంకేతాన్ని తెలియజేశాడు శ్రీరామ్.
రోజీ తలాడించి చిరునవ్వుతో గదినుండి బయటికి నడిచింది.
శ్రీరామ్ వెళుతున్న రోజు పరీక్షగా చూచాడు.
‘జీవితంలో వయస్సు వున్నప్పుడు యువకులు ఎందరో ఆడపిల్లలను చూస్తారు. కొందరి అందచందాలు వారికి నచ్చుతాయి. పరిచయం చేసుకొంటారు. మిత్రులుగా మారుతారు. ప్రేమించుకొంటారు. వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. అప్పుడు వారి ముందు నిలిచే సమస్య కుల, వర్గ, మత తేడాలు. కొందరు తల్లిదండ్రులు వారి నిర్ణయాన్ని కాదంటారు. వారి ప్రేమ విఫలమౌతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాన్ని అంగీకరిస్తారు. వారికి వివాహం జరిపిస్తారు. వారి ప్రేమ సఫలమౌతుంది. మరి రోజీ విషయంలో నా భావన?..’ రోజీని గురించిన ఆలోచన శ్రీరామ్ మదిలో..
ఆ రాత్రి భోంచేసి పడకపై వాలిన శ్రీరామ్‌కు రోజీకి తనకు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.
ఆ యూనివర్శిటీలో రోజీ వయస్సు వాళ్ళు దాదాపు ఇరవై మంది. లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా వున్నారు. వారు ఎవరిని గురించి శ్రీరామ్ ఏనాడూ ఆలోచించలేదు. కానీ.. ఈ రోజు అతని కళ్ళముందు రోజీ నిలిచింది. మనస్సున ఆమెను గురించిన మధురమైన తలపులు, నిద్రపట్టలేదు.
“ఏరా శ్రీరామ్!.. నిద్రపోలేదా!!..”
“రావడం లేదురా!..”
“కారణం?”
“మనస్సు నిండా రోజీ!”
“అంటే!..”
“అదే ఏమిటో అర్థం కావడం లేదు!”
“ఆమె నీకు అంతగా నచ్చిందా!”
“అవును..”
“అయితే పడ్డావన్నమాట!”
“పడడమేమిటిరా!”
“ఆ.. అదీ నేనే చెప్పాలా!”
“చెప్పరా ప్లీజ్!”
“అది అదేరా!”
“అదేరా అంటే?”
“జగతికే ఆధారమైన పదం”
“అంటే!”
“రెండే అక్షరాలు!”
“ఏమిటవి?”
“ప్రేమ..”
“ఆఁ..”
“అవును ఇంతకాలం ప్రవరాఖ్యుడిలా వున్న తమరు ప్రేమలో పడ్డారు”
“అవునా!”
“సందేహమా!”
“తెలీడం లేదు”
“అవునురా చిన్నా!.. నీవు ఆమెను ప్రేమిస్తున్నావు. కొనసాగించు. స్నేహం చెయ్యి. సమయం చూచుకొని నీ మనస్సులోని మాటను చెప్పు. ఆమె ఓకే అంటుంది. నీ కోరిక తీరుతుంది. వివాహం చేసుకొని సంసారిగా మారి జీవితాన్ని ఆనందంగా గడపరా!”
అది ఆత్మ.. అంతరాత్మల మధ్యన జరిగిన సంభాషణ.
శ్రీరామ్ పెదవులపై చిరునవ్వు..
“అవును రోజ్ నా అర్ధాంగి కావాలి.” ఆనందంగా నవ్వుకొంటూ కళ్ళు మూసుకొన్నాడు శ్రీరామ్.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
