Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-10

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[శ్రీరామ్ తన గురువుగారైన సాంబశివం మాస్టారు గారింటికి వెళ్తాడు. అతను వెళ్ళేసరికి మాస్టారు ఇంట్లో, పిల్లలకి చరిత్ర పాఠాలను చెబుతూంటారు. శ్రీరామ్ వరండాలోని ఓ బెంచీపై కూర్చుని మాస్టారు గారు చెప్పేది వింటుంటాడు. ముందు నాలుగు యుగాల గురించి చెప్తారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని పిల్లలకి చెప్తారు. అ తర్వాత మహమ్మదీయులు ఏ విధంగా భారత్‌పై దండెత్తి, ఇక్కడి రాజులను మోసంతో ఓడించి, దేశంపై అధికారం సాధించారో చెప్తారు. ఆ తరువాత పోర్చుగీసువారు, డచ్ వారు, ఆఖరికి బ్రిటీష్ వారు వచ్చి మన రాజులను ఏమార్చి దేశాన్ని తమ అధికారం లోకి తెచ్చుకున్న తీరుతెన్నులను పిల్లలకి చెప్తారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుబావుల గురించి ప్రస్తావిస్తూ.. రాణీ రుద్రమ, మహారాణి పద్మిని పద్మావతి, మహారాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ, శ్రీహర్షుడి గురించి చెప్తారు. ఆ రోజుకి సమయం ముగియడంతో పిల్లల్ని పంపేసి, వరండాలోకి రాగానే శ్రీరామ్ కనబడతాడు. గుర్తు పట్టని మాస్టారు ఎవరని అడిగితే, తనని తాను పరిచయం చేసుకుంటాడు శ్రీరామ్. లోపలికి రమ్మని పిలిచి, శ్రీరామ్ గురించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటారాయన. విశాఖలోనూ, నెల్లూరులోనూ విద్యాసంస్థలు స్థాపించదలచినట్టు చెప్తాడు శ్రీరామ్. మాస్టారు గారు తాను వ్రాసిన ‘మన భారత అవని’ అనే చిన్న పుస్తకాన్ని శ్రీరామ్‌కి ఇచ్చి, వీలైతే దాన్ని ముద్రించి, పిల్లలకి పంచమని అడుగుతాడు. శ్రీరామ్ సరేనంటాడు. ఆయనకు వీడ్కోలు పలికి ఇల్లు చేరుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-11

ఆ రాత్రి భోజనానంతరం శ్రీరామ్ తన గదికి చేరి మంచంపై వాలి సాంబశివం మాస్టారు ఇచ్చిన పుస్తకాన్ని చేతికి తీసుకొని చదవడం ప్రారంభించాడు.

6. కట్టా బ్రహ్మన్న (వీర పాండ్య) (1760 to 1790 – 39 సంవత్సరాలు):

వీరు పాంచాలన్ కురిచి. తమిల్నాడు ప్రాంతపు వారు. తండ్రి జగవీర కట్టా బొమ్మన్. తల్లి అరుముగత అమ్మాల్. ఆంగ్లేయుల నిరంకుశ పాలనను వ్యతిరేకించి వారిని విమర్శించి ఎదిరించిన మహావీరుడు. కిరాతకులు వారిని 16 అక్టోబర్ 1799 నాడు కయత్తార్ అనే ప్రదేశంలో నిర్బంధించి ఉరితీశారు.

7. మంగళ్ పాండే (సైనికుడు, గూడాచారి) (జననం 19 జూలై 1827 – మరణం 8 ఏప్రిల్ 1857):

వీరు మన భారత సైనికుడు. బెంగాల్ (కలకత్తా) ప్రాంతానికి చెందినవారు. ప్రజల్లో స్వాతంత్య భావాలను రేకెత్తించి, ఆంగ్లేయులకు ఎదురు తిరిగి పోరాడేలా చేశారు. దేశభక్తి పరుడు. ముఫ్ఫె సంవత్సరాల ప్రాయంలో బ్రిటీష్ రాక్షసులు రాజద్రోహిగా పరిగణించి ఉరితీసి చంపేశారు.

8. లాలా లజపతిరాయ్:

వీరి జననం 28 జనవరి 1865, నిర్యాణం 17 నవంబర్ 1928. వీరి మాతృభాష పంజాబీ. వీరి తండ్రి ఉపాధ్యాయుడు మున్షీ రాధాక్రిషన్, తల్లి గులాబ్ దేవి. గొప్ప రచయిత. రాజకీయ నాయకుడు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకరుగా చరిత్రలో నిలిచిపోయిన మహోన్నతులు. వీరికి పంజాబ్ కేసరి అనే బిరుదు ఉంది.

9. చంద్రశేఖర్ ఆజాద్:

వీరి తండ్రి సీతారామ్ తివారి, తల్లి జాగ్రణి దేవి స్వాతంత్య అభిలాషతో రామప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్రనాధ్ లహిరి మరియు అషీఫ్ కుల్లాఖాన్ కలిసి హిందుస్థాన్ రిపబ్లిలెన్ అసోసియేషన్‌ను స్థాపించారు. ఫౌండర్ రామప్రసాద్ బిస్మిల్ ఇంగ్లీషు సిపాయిల కలహంతో మరణించారు. 1919లో ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ దారుణ మారణకాండను చూచిన ఆజాద్ చలించిపోయారు. విప్లవ నాయకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ అసోసియేషన్‌లో (HSRA) చేరారు. బ్రిటీష్ పాలకుల చర్యలను తీవ్రంగా ప్రతిఘటించారు.

HSRA యొక్క కమాండర్-ఇన్- చీఫ్‌గా జారీ చేయబడిన కరపత్రాలపై సంతకం చేసినప్పుడు వారు తరుచుగా ‘బాల్‌రాజ్’ అనే మారుపేరును ఉపయోగించారు. 1922లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆంగ్లేయులు సస్పెండ్ చేసిన తరువాత ఆజాద్ తమ ప్రయత్నాల విషయంలో నిరాశ చెందారు. వారు గొప్ప ఆశావాది. స్వాతంత్ర్య సమర యోధుడు. 27 ఫిబ్రవరి 1931 అలహాబాద్ లోని CID పోలీస్ అధికారి. సర్ JRH నాట్ బోవర్‌కి ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్‌లో ఉన్నాడని ఎవరో తెలియజేశారు. దాన్ని నమ్మిన బోవర్ పోలీసులతో పార్కులో ప్రవేశించారు. అక్కడ అజాద్ తన హితుడు రాజ్‌తో ప్రసంగిస్తున్న సమయంలో పోలీసుల రాకను గ్రహించిన ఆజాద్ అతనికి కవర్ ఫైర్ ఇచ్చాడు. రాజ్ సురక్షితంగా పార్కు నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆజాద్ ఆత్మరక్షణ కోసం ఒక చెట్టు చాటున దాక్కొని ఎదుటి వైపున వున్న పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు ఎదురు కాల్పులు తీవ్రంగా సాగించారు. సుదీర్ఘ కాల్పుల తరువాత ఎప్పుడూ ఆజాద్ లానే ఉంటానన్న తన ప్రతిజ్ఞకు కట్టుబడి వారి చేతిలో చావడం ఇష్టంలేక.. అతను తన తుపాకీలోని చివరి బుల్లెట్తో తలపై కాల్చుకున్నాడు. ఆ మహా విప్లవ వీరుని జీవితం ఆ రీతిగా ముగిసింది.

10. అల్లూరి సీతా రామరాజు (జననం 1897 జూలై 4 – మరణం 1924 మే 7):

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. వారి తండ్రిగారిది పశ్చిమ గోదావరి కోనసీమకు చెందిన రాజోలు తాలూక కోమటిలంక. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడం వలన తరువాత సూర్యనారాణమ్మ గారి స్వస్థలమైన పాండ్రింగి చేరారు. రాజుగారు అప్పనపల్లికి వలస వెళ్ళారు. తరువాత గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో కొంతకాలం గడిపారు. రాజుగారి తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రిగారు వెంకట రామరాజు 1908 గోదావరి పుష్కరాల సందర్భంలో ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజమండ్రిలో (రాజుగారి తండ్రి) మరణించారు. అప్పటికి రాజుగారు ఆరవ తరగతి 1909లో పినతండ్రి రామకృష్ణరాజు గారి సాయంతో భీమవరం మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి ఫారం (ఆరవ తరగతి) చేరి ప్రతిరోజు కొవ్వాడ నుండి భీమవరం నడిచి వెళ్ళేవారు. చదువు సరిగా సాగక ఆ సంవత్సరం పరీక్ష తప్పారు. ఆ కాలంలో నర్సాపురం దగ్గర చించినాడ అనే గ్రామంలోని స్నేహితుని ఇంట్లో గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. 1911న రాజమహేంద్రవరం ఆరవతరగతి 1912, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఏడవతరగతి ఉత్తీర్ణుడై 1912న, కాకినాడ పిఠాపురం రాజు పాఠశాలలో మూడవ ఫారం (ఎనిమిదవ తరగతి) లో చేరాడు. ప్రముఖ కాంగ్రెస్ నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ వారికి సహాధ్యాయి. తల్లి చెల్లి తమ్ముడు తునిలో ఉండేవాడు. తరువాత వారు పాయకరావు పేటకు నివాసం మార్చారు. రామరాజుకు 14వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న తాతగారింటికి పాండ్రంగి వెళ్ళిపోయారు. నాల్గవఫారం విశాఖపట్నంలో చేరాడు. అక్కడ సరిగా చదవలేకపోవడం వల్ల, కలరా వ్యాధి సోకడం వల్లనూ పరీక్ష తప్పాడు. తిరిగి చిన్నాన్నగారు రామ కృష్ణంరాజు ఆర్థిక సాయంతో రాజుగారిని స్కూల్లో చేర్పించారు. కానీ.. తండ్రి లేని కారణంగా సీతారామరాజు చదువు సరిగా సాగలేదు. స్కూలుకు వెళ్ళకుండా చుట్టు ప్రక్కల ప్రదేశాలు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు సీతారామరాజును కొట్టారు. ఆ తరువాత శాశ్వతంగా చదువును మానేశారు. చదువును మానేసిన తరువాత తెలుగు, సంస్కృతం, హిందీ మరియు ఆంగ్ల భాషల సాహిత్యంపై మంచి పట్టును సంపాదించారు. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడు అడవులు, కొండలు మరియు పరిసర ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు జీవించే విధానాన్ని గమనించేవారు. చిన్నతనం నుంచే దైవభక్తి ఎక్కువగా ఉండేది. మరియు నాయకత్వ లక్షణాలు కూడా ఉండేవి. పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో సన్యాసి కాకముందు జోతిష్యం, మూలికా శాస్త్రం, హస్త సాముద్రికం మరియు గుర్రపు స్వారీలను నేర్చుకున్నారు.

స్కూల్లో వున్నంత కాలం తన చిన్నాన్న వద్ద ఉన్న గుర్రాలపై సవారి చేస్తూ అడవులలో మరియు కొండలలో నివశిస్తున్న వారి వద్దకు వెళ్ళేవారు. బ్రిటీష్ ప్రభుత్వం వల్ల, వారు పడే కష్టాల గురించి అడిగి తెలుసుకొనేవారు. 1916వ సంవత్సరంలో సీతారామరాజు ఉత్తర భారతదేశంలో పలు తీర్థ యాత్రలను చేశారు. బెంగాలు, లక్నో, కాశీ, బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదిరీనాథ్, బ్రహ్మకపాలం ప్రాంతాలలో ప్రయాణం చేశారు. కాశీలో ఉన్నప్పుడు సంస్కృత భాషను అధ్యయనం చేశారు. బ్రహ్మ కపాలంలో ఉన్నప్పుడు సన్యాస దీక్షను చేసి యోగిగా మారారు. ఆయా యాత్రలలో పలు భాషలు, మరియు పలు విద్యలు కూడా నేర్చుకున్నారు. కృష్ణదేవిపేటకి దగ్గరలో ఉన్న ధారకొండపై కొన్ని రోజులు తపస్సు కూడా చేశారు. 1918 సంవత్సరంలో రెండవసారి ముంబై, నాసిక్, మైసూరు బస్తర్ లాంటి ప్రదేశాలను తిరిగి చూచి కృష్ణదేవి పేట వద్దకు చేరుకున్నారు. తన ప్రయాణంలో బ్రిటీష్ ప్రభుత్వం వల్ల తన ప్రజలు పడుతున్న కష్టాలను చూచి బ్రిటీష్ ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని నిర్ణయించుకొన్నారు. ఆహార నియమాలలో మార్పు – పండ్లు మరియు తేనెనే ఎక్కువగా తినడానికి ఇష్టపడేవారు. తనకు ఆహారాన్ని ఇచ్చిన గిరిజనులను తన దీవెనలతో ఆశీర్వదించేవారు. అక్కడి ప్రజలు తనను పవిత్ర శక్తులు కలవాడు మరియు మహాపురుషుడు అని నమ్మేవారు. ఆంగ్లేయులు పల్లె అటవి ప్రజలను బానిసలుగా చూస్తూ వెట్టి చాకిరీ చేయిస్తూ – అటవీ సంపదలను ఆ అటవీకులు అనుభవించకూడదని శాసించి చేసిన పనికి తగిన కూలీ ఇవ్వకుండా, దళారులను తమ చేతిలో ఉంచుకొని పల్లె అటవీ జనాలను నీచాతి నీచంగా చూస్తూ ఆడవారిని శరీరాలను దోచుకొంటూ పరమకిరాతక చర్యలను అహంకారంతో అధికార బలంతో ఆంగ్లేయులు వర్తించినందున అల్లూరి సీతారామరాజు మదిలో విప్లవాగ్ని రగిలింది.

1922 ఆగష్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్ దోపిడికి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. రంపచోడవరం ఎజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషనుపై మూడువందల మంది విప్లవవీరులతో దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు మందుగుండు సామాగ్రిని తీసుకొని వెళ్ళిపోయారు. (పదకొండు తుపాకులు, ఐదు కత్తులు, 1390 తుపాకీగుళ్ళు, పద్నాలుగు బానెట్లు తీసుకొని వెళ్ళిపోయారు). తీసుకొని వెళ్ళిన వాటి వివరాలను పుస్తకంలో వ్రాసి రాజుగారు సంతకం చేశారు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న పోలీసులకు ఏ అపాయమును తలపెట్టలేదు. ఆ మరుసటి రోజున కృష్ణదేవుపేట పోలీస్ స్టేషన్లను, మందుగుండు సామాగ్రిని వశపరుచుకొని వెళ్ళిపోయారు.

మన్యం వీరుడు గంటం దొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోబి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు అగ్గిరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు సీతారామరాజుగారి ఆజమాయిషీలోకి చేరారు. ప్రభుత్యోద్యోగి అయిన ఫజులుల్లాఖాన్ రాజుగారిని చాలా అభిమానించి సహాయం చేసేవాడు. ఆ కారణంగా రాజు ఫజలుల్లాఖాన్ బ్రతికి వుండగా తాను ఆంగ్లేయులతో తిరగబడనని రాజుగారు మాట ఇచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజులుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఆ తర్వాత తన విప్లవ మార్గానికి మిత్రుల సాయంతో ఉద్యక్తుడయ్యాడు. వారించిన తల్లి క్షేమం కోసం నరసాపురం పంపేసేశాడు. పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను ఎత్తుకెళ్ళడంతో విప్లవాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకొన్నారు. బ్రితీష్ ప్రభుత్వం విప్లవదళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. అల్లూరి సీతారామరాజు గెరిల్లా యుద్ధరీతిలో వారిపై దాడిచేసి ఇద్దరు అధికారులను అంతం చేశారు. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగా ఉండే ఆదర్శభావం ఆ సంఘటనల కారణంగా మరింత పెరిగింది. అక్టోబర్ 15న అడ్డతీగల స్టేషన్‌పై దాడి జరుపనున్నామని ఆ స్టేషన్‌కు ముందుగా తెలియజేసి దాడిచేశారు. ఆంగ్లేయ ప్రభుత్వం విప్లవదళాన్ని ఎదిరించలేకపోయింది. ఐదు గంటల సేపు పోలీస్ స్టేషనులో వుండి పారిపోగా మిగిలిన పోలీసులను బంధించారు. అక్కడ ఆసుపత్రి పుస్తకంలో అల్లూరి సీతారామరాజు తేదీ వేసి సంతకం చేసి వెళ్ళారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి, ముట్టడి చేయడంలో వారికి లభించిన విజయాల వలన వారి ప్రతి‍ష్ఠ ఇనుమడించింది. కొన్నిసార్లు రాజుగారు తాను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని ఆంగ్లేయులకు సవాలు పంపేవారు.

వీరిని పట్టుకొనేటందుకు బ్రిటీష్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేకమైన దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేనాని దళంతో రాజుగారి దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలం లేవని సాండర్స్ వెనుదిరిగాడు. క్రమంగా గూఢాచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరుల వలన ప్రభుత్వాధికారులు రాజుగారి కదలికలను నిశితంగా అనుసరించసాగారు.

1924 ఏప్రిల్ 17న మన్యానికి కలెక్టర్ (స్పెషల్ కమీషనర్) రూధర్‌ఫర్డ్ నియమితుడైనాడు. రాజు బృందంలో వెంగిరాజు సత్యనారాయణ రాజు శత్రువుల గుడారాలకు నిప్పు పెట్టి వారిని హడలుకొట్టే మహాసాహసిగా వారికి అగ్గిరాజు అనే పేరును విప్లవ బృందం ఇచ్చింది. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయం అయింది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని నేల ప్రాకుతూ వారు వెళుతుండగా ఆంగ్ల సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే వారు మరణించారు. ఆ రాత్రి రాజుగారు మంప గ్రామానికి వచ్చారు. అంతకు ముందు రూధర్ ఫర్డ్ కృష్ణదేవపేటలో ఒక సభ నిర్వహించి సీతారామ రాజును పట్టి వారికి అప్పగించవలసినదిగా ఆ పేట మునసబు చెప్పాడు. ఆ సభకు మంప, మునసబు హాజరైనారు. రాజును పట్టి ఇచ్చిన వారికి పదివేలు బహుమానం ఇస్తామని.. వారంరోజుల్లో పట్టి ఇవ్వని పక్షంలో గ్రామాల ప్రజలను కాల్చివేస్తామని రూధర్‍ఫర్డ్ ప్రకటించాడు.

మంప మునసబు చెప్పిన పై సమాచారాన్ని విన్న సీతారామరాజు మునసబుతో తనను పట్టి వారికి అప్పగించవలసినదిగా కోరాడు కానీ.. ఆ మునసబు తాను అంతటి నీచుడను కానని, ఆ పనిని తాను చేయనని చెప్పాడు. 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామం సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తాను ఉన్న చోటును పోలీసులకు తెలియజేశారట. ఏటిలో స్నానం చేయు సమయాన పోలీసులు చుట్టు ముట్టి రాజుగారిని బంధించారు. కొయ్యూరులో, విడిదిచేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజుగారిని హాజరుపరిచారు. బంధీగ ఉన్న అల్లూరి సీతారామరాజుగారిని ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా కాల్చి చంపాడు. వారి తల్లికి కూడా రాజుగారి మరణవార్త తెలియజేయలేదు.

మే 8వ తేదీన రాజుగారి దేహాన్ని ఫొటో తీయించి తరువాత దహనం చేశారు. వారి చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహనదిలో కలిపారు. ఆ రీతిగా 27 ఏళ్ళ ప్రాయాన్నే దేశం కోసం తన ప్రజల కోసం ప్రాణాలను తృణంగా భావించి మరణించిన మహనీయుడు శ్రీ అల్లూరి సీతారామరాజుగారు. వారు అమరవీరులు. కృష్ణవేణి పేట (కె.డి. పేట)లో వారి సమాధి ఉంది.

11. భగత్ సింగ్ (జననం 27 సెప్టెంబర్ 1907 – మరణం 23 మార్చి 1931):

భగత్ సింగ్ భారతదేశపు స్వాతంత్య్ర సమరయోధుడు మరియు విప్లవకారుడు. వారు చేసిన పోరాటానికి గాను షాహిద్ భగత్ సింగ్ అని మనవారు కొనియాడారు. వీరి జననం ప్రస్తుతం పాకిస్తాన్‌లో వున్న లాయల్ జిల్లా, బంగా పట్టణంలోని ఖత్కర్ కలాన్ గ్రామం. తండ్రి సర్దార్ కిషన్ సింగ్, తల్లి విద్యావతి. ప్రాథమిక విద్య సొంత వూరులో తరువాత లాహోర్లో ఉన్న దయానంద్ ఆంగ్లో – వేద పాఠశాలలో చేరారు. 1923 లాహోర్ లోని నేషనల్ కాలేజీలో చేరారు.

సహాయ నిరాకరణ ఉద్యమం లాలా లజపతిరాయ్ ద్వారా స్థాపించబడింది. మహాత్మాగాంధీ దానికి మూలం. ఆ కాలేజీని స్థాపించిన ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులు బ్రిటీష్ ప్రభుత్వపు కాలేజీలలో చేరి చదవకూడదని. 1927వ సంవత్సరంలో లాహోర్‌లో బాంబు దాడులు జరిగాయి. ఆ క్రియ వెనుక భగత్ సింగ్ వున్నాడని అనుమానంతో 1927 సంవత్సరంలో, బ్రిటీష్ వారు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తర్వాత ఉరితీసి చంపారు. 24 సంవత్సరాల కాలం మాత్రమే జీవించిన అసాధారణ దేశభక్తుడు, అమరజీవి.

(ఇంకా ఉంది)

Exit mobile version