[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తన గురువుగారు రాసిన పుస్తకాన్ని చదువుతుంటాడు శ్రీరామ్. హైందవజాతిని మేల్కొల్పిన స్వామి వివేకానంద గురించి, పొట్టి శ్రీరాములు గురించి ప్రేరణాత్మకంగా రాస్తారు సాంబశివం మాస్టారు గారు. తెలుగు భాష పుట్టుపుర్వోత్తరాల గురించి, మన దేశంలోని నదుల గురించి, వాటి జన్మస్థానం, సముద్రంలో కలిసే చోటు, వాటి పొడవు తదితర వివరాలను వెల్లడిస్తారు. మన దేశంలోని ప్రసిద్ధ పర్వత శిఖరాల వివరాలను, ప్రధానమంత్రులు వారి పార్టీ, పాలనాకాలం జాబితాను, ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి వివరాలను సంక్షిప్తంగా అందిస్తారు. చివరగా భారతీయుల కర్తవ్యం ఏమిటో బోధిస్తారు. పుస్తకం చదవడం పూర్తి చేస్తాడు శ్రీరామ్. గురువుగారి సందేశం బాగా నచ్చుతుంది. ఆ పుస్తకాన్ని అచ్చు వేయించి విద్యార్థులకు పంచాలని నిర్ణయించుకుంటాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-15
శ్రీరామ్ ప్రక్క వూర్లో వున్న తన అక్క శాంతి ఇంటికి చేరాడు. పోర్టికోలో కారును ఆపి దిగాడు.
వరండాలోకి గంగ చలపతి వచ్చారు.
“నాన్నా!..”
“ఏంటి తల్లీ..”
“పిన్ని, మామయ్యలు వచ్చారు. వారు చాలా మంచివారు నాన్నా!” నవ్వుతూ చెప్పింది.
“అన్నా! ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? ఎవరికీ చెప్పకుండా..”
“ముకుందరావు అన్నయ్యను చూచేదానికి వెళ్ళాను.”
“వారు నీతో మాట్లాడారా!”
శ్రీరామ్ నవ్వాడు.
“ఎందుకన్నా నవ్వుతున్నావు?”
“నీ ప్రశ్న విని.. చూడు చలపతి, ఎవరైనా, ఎప్పుడైనా, మన వారికి ఇచ్చే గౌరవాన్ని అనుసరించి, వారు మనలను గౌరవిస్తారు” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“భారతి, బావగారు వచ్చారన్నా.. నీవు వచ్చావని అక్క చెప్పగానే ఇరువురూ చాలా సంతోషించారు.”
చలపతి ఆ మాటలు చెబుతున్న సమయంలో శాంతి, ఆనందరాయుడు, భారతి వదనాల్లో చిరునవ్వు. శ్రీరామ్ ధర్మరాయుడు గారిని భారతిని పరీక్షగా చూచాడు.
“శ్రీరామ్!.. రాయ్యా!..” నవ్వుతూ చేతులు సాచాడు ఆనందరాయుడు.
శ్రీరామ్ మెల్లగా ధర్మారాయుడిని సమీపించి వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొని..
“బావగారు! నమస్కారాలు” చేతులు జోడించాడు.
ధర్మారాయుడు నవ్వుతూ శ్రీరామ్‌ను కౌగలించుకొన్నాడు.
“జీవితంలో, నిన్ను నేను చూడలేనేమో అనుకొన్నాను. నిన్ను చూచిన నా మనస్సుకు ఎంతో ఆనందంగా వుంది శ్రీరామ్!..” పరవశంతో పలికాడు ఆనందరాయుడు.
ఇరువురి నయనాల్లో కన్నీరు.
“బావా!.. మిమ్మల్ని చూచిన నాకు చాలా ఆనందంగా ఉంది” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
శ్రీరామ్ భుజంపై తట్టి శాంతి..
“రామా!.. నీ మేనకోడలు భారతి!” నవ్వుతూ చెప్పింది శాంతి.
“పెదమామయ్యా!.. నమస్కారం” చిరునవ్వుతో శ్రీరామ్ ముఖంలోకి చూస్తూ చేతులు జోడించింది భారతి.
శ్రీరామ్ భారతి ముఖంలోకి ప్రీతిగా చూచాడు.
భారతి అందంగా నవ్వుతూ.. “మామయ్యా!.. ఏం అలా చూస్తున్నారు?” అడిగింది.
“అమ్మా!.. నిన్ను నేను తొలిసారి చూస్తున్నాను కదా!.. నా మనస్సులో ఏవేవో భావాలు. ఆనందం. మాటలు రావడం లేదమ్మా!.. లండన్‌లో నీ గురించి న్యూస్‌లో విన్నాను. నీ రూపాన్ని చూచాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాగా! చాలా ఆనందంగా వుంది అందుకే!” ఆనందంగా చెప్పాడు శ్రీరామ్.
“అన్నా!.. అందరూ లోపలికి పదండి” నవ్వుతూ చెప్పాడు చలపతి.
ఆనందంగా అందరూ హాల్లోకి ప్రవేశించారు. సోఫాల్లో కూర్చున్నారు. హాల్లో వున్న పనిమనిషి ముత్యాలు అందరినీ చూచింది.
“అమ్మా!.. కాఫీ తీసుకొస్తా!” అంది.
“ఆఁ..” అంది శాంతి.
క్షణం తర్వాత.. ముత్యాలమ్మ వంట ఇంటివైపుకు వెళ్ళింది.
“రామా!..”
“చెప్పక్కా!..”
“ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా!” అడిగింది శాంతి.
“అక్కా!.. సునంద వదిన వాళ్ళ వూరికి వెళ్ళాను. అన్నయ్య ముకుందరావును కలిసి మాట్లాడి వస్తున్నా! సునంద వదిన ఏదో ఆశ్రమంలో చేరిందట!..”
“ఆ.. ముకుందరావు నీతో బాగా మాట్లాడాడా శ్రీరామ్?” అడిగాడు ఆనందరాయుడు.
“ఆఁ.. మాట్లాడాడు బావా!..”
“వాడికి మన కుటుంబం మీద ఎంతో ద్వేషం.. పగ..” విచారంగా చెప్పాడు ఆనందరాయుడు.
“బావా.. వారి మాటల్లో వారి ఆ భావన నాకు బాగా అర్థం అయింది. వారికి వయస్సు అయింది కానీ.. మనస్సు, మాటల ధోరణి మారలేదు బావా!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
ముత్యాలమ్మ హాల్లోకి వచ్చి అందరికీ కాఫీ గ్లాసులను అందించింది.
“పెదమామయ్యా!..” పిలిచింది భారతి.
“ఏమ్మా!..”
“మీ కూతురు గంగ సూపర్ డూపర్ మామయ్యా!.. గ్రేట్!.. చాలా బాగా పెంచారు” నవ్వుతూ చెప్పింది భారతి.
శ్రీరామ్ ఆనందంతో నవ్వాడు. తలాడించాడు.
“అక్కా!.. భారతి వయస్సు ఎంత?” అడిగాడు శ్రీరామ్.
“మామయ్యా ఇరవై ఎనిమిది” నవ్వుతూ చెప్పింది భారతి.
“రాజకీయాల్లో ప్రవేశించి..”
“ఐదు సంవత్సరాలు కావస్తూ వుంది. ఆరునెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మామయ్యా..”
“మొత్తానికి నీవు ఆంధ్రా రాజకీయాల్లో ఒక సంచలనాన్ని సృష్టించావు అమ్మా.. కంగ్రాచ్యులేషన్స్!..” నవ్వాడు శ్రీరామ్.
శ్రీరామ్ తన చేతిని ముందుకు సాచాడు. చిరునవ్వుతో భారతి తన చేతిని శ్రీరామ్ చేతితో కలిపింది.
“మామయ్యా!..”
“ఏమ్మా!..”
“మీరు తిరిగి లండన్ వెళ్ళిపోతారా!..”
తలాడిస్తూ “వెళ్ళను” అన్నాడు శ్రీరామ్.
“ఇక్కడే వుంటారన్నమాట!..”
“అవును..”
“వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ మామయ్యా!..”
“ఐయాం ఎ సైన్స్ ప్రొఫెసర్. వైజాగ్‌లో, ఇక్కడ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లను స్థాపిస్తాను. రైట్ ఫ్రమ్ ఫ్రికేజి యుకేజిల నుండి ఫిఫ్త్ క్లాసు వరకు, సిక్స్త్ క్లాసు నుండి డిగ్రీ వరకు ఒకే క్యాంపస్‌లో రెండు భాగాలను ఏర్పాటు చేస్తాను. భావి భారత పౌరులైన పిల్లలకు చక్కని విద్యాభ్యాసాన్ని కల్పిస్తాను. ఇదే నా సంకల్పం” చిరునవ్వుతో చూచాడు భారతి ముఖంలోకి శ్రీరామ్.
“పెద మామయ్యా!.. మీ ఆలోచన చాలా బాగుంది. త్వరలో రూపకల్పన ప్రారంభించండి. నేను చేయగల సాయం మీకు చేస్తాను.”
“ఓకే భారతి!.. థాంక్యూ!..”
పోర్టికోలో బి.ఎం.డబ్ల్యూ కారు వచ్చి ఆగింది.
వసంత కారు నుండి దిగి ద్వారాన్ని సమీపించి కాలింగ్ బెల్ నొక్కింది.
చలపతి వెళ్ళి తలుపు తెరిచాడు.
“భారతిగారు వున్నారా సార్..” అడిగింది వసంత.
“ఆ.. వుంది రండి. వసంతగారూ!..” చిరునవ్వుతో ఆహ్వానించాడు చలపతి.
చలపతి ముందు వెనుక వసంత హాల్లోకి వచ్చారు.
వసంత భారతి కన్నా వయసులో రెండేళ్ళు పెద్ద. వసంత కొంతకాలం ఆ వూరి ఆనందరాయుడి గారి హైస్కూల్లో పనిచేసింది. ఆ కారణంగా ఆమె ఆ ఇంటి వారికందరికీ బాగా తెలుసు.
భారతిని చూచిన వసంత చిరునవ్వుతో..
“నమస్కారం మేడం?” అంది.
“ఓ వసంతగారా!.. రండి.. రండి.. కూర్చోండి” సగౌరవంగా చెప్పింది భారతి. వసంత శ్రీరామ్ ముఖంలోకి ఆశ్చర్యంతో చూచింది.
ఆమె చూపులను గ్రహించిన భారతి నవ్వుతూ..
“వసంతగారూ!.. వారు మా పెద్ద మామయ్యగారు. లండన్ నుంచి వచ్చారు” పరిచయం చేసింది భారతి.
“మేడం!.. వారు నాకు తెలుసు. మేము విశాఖ పట్నంలో కాలేజ్‌మేట్స్..” శ్రీరామ్ ముఖంలో క్షణంసేపు చూచి చిరునవ్వుతో చెప్పింది వసంత.
“ఇప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు?”
“విశాఖపట్నం, రాజమహేంద్ర డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. నెల్లూరుకు వస్తూ ఉండగా నా కారు ట్రబుల్ ఇచ్చినందున, మొన్న మీ మామగారే నన్ను నెల్లూరికి వారి కారులో చేర్చారు. మా బంధువుల అమ్మాయి వివాహం నిన్న జరిగింది. మీరు వూర్లో వున్నారని తెలిసి, చూచి మాట్లాడాలని వచ్చాను మేడం!..” చిరునవ్వుతో చెప్పింది వసంత.
“విషయం ఏమిటో చెప్పండి!..” అడిగింది భారతి.
“మా కాలేజీలో ఇంజనీరింగ్ వింగ్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకొన్నారు యాజమాన్య సభ్యులు. మా ప్రపోజల్స్‌ను విద్యామంత్రి గారైన మీకు సబ్మిట్ చేశాము. మా వారితో నేను, మీరు నాకు తెలుసు అని చెప్పాను. వారు నన్ను మిమ్మల్ని కలవమన్నారు. ఆ కారణంగా మీ వద్దకు వచ్చాను మేడం” అనునయంగా చెప్పింది వసంత.
వసంత అభ్యర్ధనగా శ్రీరామ్ ముఖంలోకి చూచింది.
ఆమె మనోభావం శ్రీరామ్‌కు అర్థం అయింది.
“భారతీ!..” పిలిచాడు శ్రీరామ్.
“ఏం మామయ్యా!..”
“వసంత చెప్పిన విషయం అర్ధం అయింది కదా!..”
“ఆ.. అయ్యింది మామయ్యా!..”
“ప్లీజ్ హెల్ప్ హర్!..”
“ఏంది మామయ్యా మీ అభ్యర్ధన. వసంత గారి అభ్యర్థనను నేను నెరవేరుస్తాను. అది నా మంత్రి పదవి ధర్మం కదా! మామయ్యా!..” చిరునవ్వుతో చెప్పింది భారతి.
“థాంక్యూ మేడం..” నవ్వుతూ చెప్పింది వసంత.
క్షణం తర్వాత శ్రీరామ్ ముఖంలోకి చూస్తూ..
“సార్!.. మీరు ఎప్పుడు వైజాగ్ వస్తారు?” అడిగింది వసంత.
“అంటే మీరు వైజాగ్ వెళుతున్నారా!..” శ్రీరామ్ ప్రశ్న.
“అవును సార్!.. నేను వచ్చిన రెండు పనులు ఆనందంగా ముగిశాయి. నేను వైజాగ్ బయలుదేరుతున్నాను.”
“ఎప్పుడు?”
“ఇప్పుడే సార్!..”
“మంచిది జాగ్రత్త!..”
వసంత సోఫా నుండి లేచి అందరికీ నమస్కరించింది.
“వెళ్ళొస్తాను” చెప్పి తన కారువైపుకు నడిచింది. భారతి, శ్రీరామ్‌లు వరండాలోనికి వచ్చారు.
వారికి బై చెప్పి వసంత కార్లో కూర్చుంది. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.
భారతి, శ్రీరామ్‌లు హాల్లోకి నడిచారు.
***
ఆ రాత్రి.. సమయం పదిన్నర ప్రాంతం. అందరూ ఎవరి గదుల్లో వారు పడుకున్నారు.
శ్రీరామ్.. మనస్సులో భారతిని గురించిన ఆలోచనలు.
‘భారతి ఎందువలన వివాహం చేసుకోలేదు?’ అనే ప్రశ్న శ్రీరామ్ మస్తిష్కంలో..
‘అక్కనడిగి తెలుసుకోవాలి!..’ అనే నిర్ణయం.
మంచం నుండి దిగి శాంతి గదివైపుకు నడిచాడు శ్రీరామ్.
మంచినీళ్ళు త్రాగేదానికి శాంతి గదినుండి బయటికి వచ్చింది.
మెట్లు దిగి క్రిందికి వస్తున్న శ్రీరామ్‌ను చూచింది. “రామా!.. ఏం కావాలి?” అడిగింది శాంతి.
“అక్కా!.. నీతో ఒక విషయం మాట్లాడాలి!..”
“అడుగు..!” సోఫాలో కూర్చుంది శాంతి.
ఆమె ప్రక్కన శ్రీరామ్ కూర్చున్నాడు. శాంతి ముఖంలోకి చూచాడు.
“విషయం ఏమిటో చెప్పు రామా!..”
“అక్కా!.. భారతికి ఇంతవరకు వివాహం ఎందుకు చేయలేదు?” అడిగాడు శ్రీరామ్.
శాంతి, శ్రీరామ్ ఆ ప్రశ్నను విని తలదించుకొంది.
“అక్కా!..” శాంతి ముఖంలోకి చూస్తూ అన్నాడు శ్రీరామ్.
శాంతి శ్రీరామ్ ముఖంలోకి చూచింది. ఆమె మనోఫలకంపై గత స్మృతులు నిట్టూర్చింది.. “రామా!.. భారతి వివాహం జరిగింది. అతను వెళ్ళిపోయాడు” విచారంగా చెప్పింది శాంతి.
“ఓ.. సారీ అక్కా!..”
“నీవెందుకయ్యా!.. నాకు సారీ చెప్పడం. అంతా దైవ నిర్ణయం. జరుగవలసింది జరిగిపోయింది. మరో వివాహానికి భారతి అంగీకరించలేదు. నేను మీ బావగారు ఎంతగానో ప్రయత్నించాము. భారతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు” ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు.
“అక్కా!.. బాధపడకు..”
విరక్తిగా నవ్వింది శాంతి. కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా జరిగిపోయాయి.
“మరి నీ సంగతి?”
“గంగ తల్లి మరణించిన తరువాత, నీవు ఎందుకు మరో వివాహం చేసుకోలేదు?”
“ఆ విషయంలో నా నిర్ణయం, భారతి నిర్ణయం లాంటిదే అక్కా!..” మెల్లగా చెప్పాడు శ్రీరామ్.
“గంగకు తల్లి కావాలయ్యా!..” అనునయంగా చెప్పింది శాంతి.
“మీరంతా వున్నారుగా అక్కా!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“ఎందరున్నా నీ భార్యగా, గంగకు తల్లిగా ఒక యువతి నీ జీవిత భాగస్వామి కావాలయ్యా!..”
“నా వయస్సు నలభై ఎనిమిది అక్కా!..” విరక్తిగా నవ్వాడు శ్రీరామ్.
“అయితే ఏం?.. నీవు ముఫ్ఫై ఏళ్ళ యువకుడిలా వున్నావు” నవ్వింది శాంతి.
రెండు క్షణాల తర్వాత.. “వసంత నీ కాలేజీమేటా!..”
“అవునక్కా. నేను ఫైనల్ ఇయర్లో వుండగా, తను సెకండ్ ఇయర్. తను నన్ను పరిచయం చేసుకొని తన సందేహాలను నానుండి తీర్చుకొనేది. కాలేజీలో నీ ఈ తమ్ముడికి ఏకసంథాగ్రాహి అనే పేరు” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“కాలేజీ చదువు ముగిశాక, వసంత జీవితంలో ఏం జరిగిందో నీకు తెలుసా!..”
“తెలిదక్కా!..”
“ఆ పిల్లది చాలా విషాధ గాధ రామా!.. ఎం.ఎస్సీ ముగించి తాను మన హైస్కూల్లో టీచరుగా చేరింది. ఆమె తల్లిదండ్రులు చక్కని బుద్ధిమంతుడైన రైల్వే ఉద్యోగితో ఆమె వివాహాన్ని నిర్ణయించి, నిశ్చితార్థం జరిపించారు. ఆ కార్యక్రమానికి గుంటూరు నుండి వచ్చిన ఆ అబ్బాయి శ్యామ్ ప్రసాద్, అతని తల్లి గౌరి, తండ్రి మాధవరావులు, తిరుగు ప్రయాణంలో లారీ యాక్సిడెంటులో ముగ్గురూ మరణించారు. ఆ విషయాన్ని తెలిసిన వసంత తల్లి పార్వతి, తండ్రి పరమశివం, వసంత ఎంతగానో బాధపడ్డారు. ఆ తర్వాత వసంత తల్లిదండ్రులు వేరే సంబంధాలను ఎన్నో చూచారు. ఇరుగు పొరుగు వారు తొలి సంబంధపు కథను వారికి చెప్పడంతో, పిల్లను చూచి వెళ్ళిన వారినుండి ఎలాంటి జవాబు వచ్చేది కాదు. వసంతకు నష్టజాతకురాలనే పేరు పెట్టారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఆ అవమానాన్ని భరించలేక వసంత మన స్కూలును వదలి వాళ్ళ మేనమామ గారి వూరైన వైజాగ్ వెళ్ళిపోయింది. మనోవేదనతో తల్లి మంచం ఎక్కింది. లోకులు కాకులు. వసంత అవివాహితగానే మిగిలిపోయింది. తల్లి, తండ్రితో వైజాగ్ లో వుంటూ వుంది. వసంత చాలా మంచి అమ్మాయి. చదువు సంస్కారం కలది. ఎప్పుడూ చిరునవ్వుతో ఎంతో సౌమ్యంగా అందరితో మాట్లాడుతుంది. పెద్దలయందు గౌరవం, పిన్నల యందు ఎంతో అభిమానం కలిగి ఉంటుంది.” శాంతి చెప్పండం ఆపేసింది.
శ్రీరామ్ కొన్ని క్షణాలు శాంతి ముఖంలోకి పరీక్షగా చూచాడు.
“ఏం రామా!.. అలా చూస్తున్నావు?” అడిగింది శాంతి.
“అక్కా!..”
“ఆ.. చెప్పు..”
“మన చలపతి ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?”
విరక్తిగా నవ్వింది శాంతి.
“లవ్ ఫెయిల్యూర్..” అంది.
“అలాగా!..”
“అవును..”
“అక్కా.. మరో మాట..!”
“ఏమిటది?”
“ముకుందరావు అన్నయ్యకు మన కుటుంబం మీద చాలా ద్వేషం ఉంది. ఆ విషయం వారి మాటల్లో నాకు అర్థం అయింది.”
“ఆ విషయం మా అందరికీ తెలుసు రామా!.. ఆ మనిషి స్వార్థపరుడు. వయస్సు అయిందే కాని, మంచి, మానవత్వం అతనిలో లేదు. కారణం మొదటిది – అతని కొడుకు చిన్నారావుతో మన భారతి వివాహాన్ని జరుపలేదని. రెండవది – భారతి చిన్నారావును కాల్చి చంపిందని, మూడవది – MLAగా గెలిచి గెలిచి, విద్యాశాఖ మినిస్టర్ అయ్యిందని! ఎలక్షన్ ప్రచారంలో, భారతికి కలిగిన ప్రజాదరణ అభిమానాన్ని చూచి, పోటీగా నిలబడినా తాను ఓడిపోతానని, చిన్నారావు భారతిని కాల్చాడు. భారతి తప్పించుకొంది. చిన్నారావును కాల్చింది. వాడు చచ్చిపోయాడు” చిరునవ్వుతో చెప్పింది శాంతి.
“అక్కా!.. వెళ్ళి పడుకొంటాను” సోఫా నుండి లేచాడు శ్రీరామ్.
“గుడ్ నైట్ రామా!..”
“ఎస్. గుడ్ నైట్ అక్కా!..”
ఇరువురూ వారి వారి గదుల వైపుకు నడిచారు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
