[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మర్నాడు ఉదయం శ్రీరామ్ భారతి గదిలోకి వెళ్ళి ఆమెను పలకరిస్తాడు. తన రాజకీయ ప్రస్థానాన్నీ, లక్ష్యాలను చెబుతుందామె. ఇంతలో కొంతమంది విద్యార్థులు ఆమెను కలవడానికి వస్తారు. వారు తమని పరిచయం చేసుకుని, దేశంలో మత సామరస్యం కోసం తాము తమ తల్లిదండ్రుల సమ్మతితో భారత్ సేవా సమాజ్ BSS అనే సంస్థను స్థాపించామని చెప్తారు. మీ సంస్థ సిద్ధాంతాలేంటని భారతి అడుగగా, తమ 30 సిద్ధాంతాలను వివరిస్తారు వారు. వారిని అభినందించి, లక్షా నూట పదహార్లు విరాళంగా ఇస్తుంది భారతి. శ్రీరామ్ కూడా అంతే మొత్తానికి చెక్ రాసి ఇస్తాడు. ఈ ప్రయత్నంలో మిమ్మల్నెవరూ ఆక్షేపించలేదా అని భారతి అడిగితే, పిల్లల నాయకుడు రహీమ్ తాము ఎదుర్కున్న విమర్శలను చెప్పి, తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్తాడు. ఇంతలో చలపతి, శాంతి, ఆనందరాయుడు ఆ గదిలోకి రాగా, పిల్లలంతా వారికి నమస్కరిస్తారు. భారతి ఆ సంస్థ గురించి తల్లిదండ్రులకి వివరిస్తుంది. తమ బి.ఎస్.ఎస్. సంస్థకు ప్రెసిడెంట్‌గా ఆనందరాయుడిని ఉండమని విద్యార్థులు అడిగితే, అతను శ్రీరామ్ పేరుని సూచిస్తాడు. శ్రీరామ్ అంగీకరిస్తాడు. సంస్థ తదుపరి కార్యచరణ ఏమిటో శ్రీరామ్ పిల్లలకి వివరిస్తాడు. అందరూ సంతోషంగా ఆ గది నుండి బయటకు వెళ్తారు. – ఇక చదవండి.]
అధ్యాయం-17
శ్రీరామ్, చలపతిలు అన్నతమ్ములు తోటకు వెళ్ళి ఏ ప్రాంతంలో ప్రెస్ పేపర్ బిల్డింగ్ నిర్మాణాన్ని చేయ వీలుగా వుంటుందో చూసి, స్థలాన్ని నిర్ణయించుకొని నడిచి వస్తూ వున్నారు.
చిన్నయ్య ప్రస్తుతంలో ముకుందరావు గారి సేవలో బ్రతుకు తెరువుకు ఉంటున్నాడు. ముకుందరావు గారికి, ఆనందరాయుడి గారి కుటుంబాల మధ్యన వున్న వైర భావం కారణం అతనికి తెలుసు. ముకుందరావు రాయుడిగారి కుటుంబానికి ఏ క్షణంలో ఎలాంటి కీడు తలపెడతాడో అని చిన్నయ్య, ముకుందరావు తత్వం నచ్చకపోయిన, తనకు ముకుందరావు దుస్సంకల్పం ఏదైనా తెలిస్తే, ఆ విషయాన్ని ఆనందరాయుడి కుటుంబ సభ్యులకు తెలియజేయాలనే నిర్ణయంతో, ఆ చిన్నయ్య ముకుందరావు దగ్గర ఊడిగం చేస్తున్నాడు. కొంతకాలంగా ముకుందరావు ధనార్జన కోసం అనేక వ్యాపారాలు సాగిస్తున్నాడు. వారికి రూలింగ్ పార్టీ సపోర్టు వుంది. అతని తమ్ముడు సాంబశివరావు అతని కుమారుడు సాగర్ కుమార్ ముకుందరావు చేసే కార్యకలాపాల్లో వారికి ఆదాయం వున్న విషయాల్లో అతనిని సపోర్టు చేస్తారు.
ఈ మధ్య కాలంలో ముకుందరావు భవంతికి ఇంగ్లీషువారు అరేబియా ముస్లిమ్స్ కొందరు రావడం, ఏదేదో చర్చలు జరగడం చిన్నయ్య గమనించాడు.
చిన్నయ్యకు శ్రీరామ్, అతను ఇంటి నుండి వెళ్ళిపోకముందు బాగా పరిచయం. శ్రీరామ్ అంటే, అతని గుణగణాల రీత్యా చిన్నయ్యకు ఎంతో ప్రేమాభిమానాలు. శ్రీరామ్ ఒక రాత్రివేళ ఇంటినుండి తండ్రితో తగాదా వలన వెళ్ళిపోయాడని తెలిసి చిన్నయ్య ఎంతగానో బాధపడ్డాడు.
ఆ శ్రీరామ్ మరలా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడని తెలిసి అతన్ని చూడడానికి శ్రీరామ్ గ్రామానికి వచ్చి అన్నాదమ్ములు తోటకు వెళ్ళారని తెలుసుకొని, వారిని కలవడానికి తోటవైపుకు నడిచారు.
శ్రీరామ్ చలపతులను చిన్నయ్య మార్గమధ్యంలో కలిసికొన్నాడు.
శ్రీరామ్ చిన్నయ్యకు బాగా గుర్తు. చూడ్డంతోటే.. “దండాలు చినబాబుగోరూ.. ఎన్నాళ్ళకెల్లాళ్ళు. ఇంతకాలం యాడ వుంటిరయ్యగోరూ..” ఆత్రంగా కన్నీటితో అడిగాడు. అవి కన్నీరు కాదు శ్రీరామ్‌ను చూచినందున ఆనంద భాష్పాలు.
“లండన్ చిన్నయ్యా!.. నీవు నీవారంతా బాగున్నారా!..” ప్రీతిగా అడిగాడు శ్రీరామ్. “ఆఁ.. సామీ!.. అంతా బాగుండారు!..”
“ఎక్కడ పనిచేస్తున్నావ్?”
“ముకుందరావు గారి దగ్గరండే!!..”
“వారూ, వదినగారూ బాగున్నారా!..”
“వదినగారు శ్రీకాళహస్తి ప్రాంతంలో నున్న శ్రీ శుఖ బ్రహ్మ ఆశ్రమానికి ఎల్లిపోయారండే!..”
“కారణం?”
“ఒకటి చిన్నారావు చావు. రెండోది ముకుందరావు పాడు పనులు”
“పాడు పనులంటే..”
“వారు చాలా మారిపోయారండే.. ఏవేవో పెద్ద పెద్ద యాపారాలు చేస్తా వుండారండే. తమ్ముడు సాంబశివరావు. వారి అబ్బాయి సాగర్ కుమారు కూడా ఆరికి సాయం అండే.. తెల్ల దొరలు. సాయిబులు అప్పుడప్పుడూ వచ్చి వారితో మాటాడి ఎల్లిపోతుంటరండే!..”
“అయితే చేసే వ్యాపారాలు చాలా పెద్దవన్నమాటేగా!..”
“అన్నమాటేందన్న. వున్నమాటే!.. వాడికి మనకు పడదు కాబట్టి మనం ఎవరం వాళ్ళను గురించి పట్టించుకోము!..” విరక్తిగా అన్నాడు చలపతి.
“సామీ!.. ఈరోజు ఎవరెవరో వస్తారని ఇన్నానండే. ముకుందరావును చూట్టానికి, మీరు ఈ రోజు రండి బాబుగోరూ. మీకు ఇసయాలు తెలస్తాయి.”
“అలాగే పద. చలపతి త్వరగా నడువు. నేను చిన్నయ్యతో కలిసి కార్లో ముకుందరావు అన్నయ్య వూరికి వెళ్ళి వస్తా!..” అన్నాడు శ్రీరామ్.
ముగ్గురూ శ్రీరామ్ ఇంటికి చేరారు. తన అక్క శాంతితో చెప్పి శ్రీరామ్, చిన్నయ్యతో ముకుందరావు వూరికి బయలుదేరాడు. ముకుందరావు ఇంటికి కొంతదూరంలో చిన్నయ్య కారునుండి దిగి, అడ్డదారిన, నడిచి వారి ఇంటి ఆవరణంలో ప్రవేశించాడు చిన్నయ్య.
ముకుందరావు ఇంటి ముందు కారును ఆపి, దిగి నడిచి వరండాను సమీపించాడు శ్రీరామ్. చిన్నయ్య శ్రీరామ్‌కు ఎదురైనాడు. తాను వచ్చినట్లు ముకుందరావుకు చెప్పమని, చిన్నయ్యకు చెప్పాడు శ్రీరామ్.
చిన్నయ్య ముకుందరావును కలిసి శ్రీరామ్ వచ్చినట్లు చెప్పాడు. మిత్రులతో మీటింగులో వున్న ముకుందరావు “ఈరోజు అతను నన్ను కలవడానికి వీలుకాదని చెప్పు!..” అన్నాడు ముకుందరావు.
చిన్నయ్య ముకుందరావు మాటను శ్రీరామ్‌కు చెప్పాడు. శ్రీరామ్ వెనుతిరిగాడు. ముకుందరావు చర్యపై శ్రీరామ్‌కు అనుమానం కలిగింది.
***
“అయ్యా!.. నమస్కారాలు..” నవ్వుతూ చేతులు జోడించాడు మంతనాల మల్లయ్య.
“ఏమిట్రా విశేషం?” అడిగాడు ముకుందరావు.
చుట్ట కాలుస్తూ పొగను గాల్లోకి విన్యాసంగా వదులుతున్నాడు ముకుందరావు.
ఆ ఘాటును తట్టుకోలేక మల్లయ్య తనపై పంచను ముక్కుకు అడ్డంగా పెట్టుకొన్నాడు. “చిన్న విశేషం కాదు స్వామి పెద్ద విశేషమే!..”
“ఏమిటది?”
“ఏనాడో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మీ పెద్ద సోదరులు శ్రీరామ్ బాబుగారు తిరిగి వచ్చారట!..”
“ఏందిరా నువ్వనేది?”
“అయ్యా!.. నేను చెప్పింది అబద్ధం కాదు స్వామీ పచ్చి నిజం!..” నవ్వాడు మల్లయ్య.
“ఏందిరా ఆ వికారపు నవ్వు?” కోపంగా అడిగాడు ముకుందరావు.
“మరేం లేదు సామీ!.. తమరి వైర వర్గం పెరిగిందిగా!.. అందుకే నవ్వినా!..”
ముకుందరావు కొన్ని క్షణాలు మల్లయ్య ముఖంలోకి పరీక్షగా చూచాడు.
“ఓరేయ్ మల్లిగా!.. నిన్న వాడు మన కాడికి వచ్చాడు. నేను ఎలౌ చెయ్యలా..” వికటంగా నవ్వాడు ముకుందరావు.
క్షణం తర్వాత.. “ఒరే! మల్లీ!..”
“సామీ!..”
“వాడు ఇక్కడే వుండిపోతాడంటావా?”
“చుట్టపు చూపుగా వచ్చినోడు తిరిగి లండన్‍కి ఎల్లిపోవాల కదా సామీ!..”
“వాడు చుట్టపు చూపుగా వచ్చాడా!.. లేక ఇక్కడే వుండిపోయేదానికి వచ్చాడా!..” సాలోచనగా అడిగాడు ముకుందరావు.
“ఆ విషయం నాకు తెలవదు సామీ!..”
“తెలుసుకోవాలిగా!..
“ఆఁ.. మీరు చెప్పినారుగా, తెలిసికొంటా!.. వచ్చి మీకు చెబుతా.. ఇక నే వెళతా సామీ!..”
“ఆఁ.. వెళ్ళు. విషయాన్ని కనుక్కొనిరా!..”
“తప్పకుండా సామీ వస్తా!..” మల్లయ్య వెళ్ళిపోయాడు.
***
ముకుందరావు మస్తిష్కంలో గతస్మృతులు..
భారతి తండ్రి ఆనందరాయుడి సోదరి సునంద తన భార్య. వారి కొడుకు చిన్నారావు భారతికి వరసైనవాడు.
సునంద ముకుందరావులు భారతి చదువు ముగించి అమెరికా నుండి తిరిగి రాగానే వెళ్ళి.. శాంతి ఆనందరాయులతో, భారతి, చిన్నారావుల వివాహాన్ని గురించి ప్రస్తావించారు.
భారతి, చిన్నారావును వివాహం చేసుకొనేటందుకు అంగీకరించలేదు. తాను రాజకీయాల్లో ప్రవేశించి, పేద ప్రజలకు సాయం, ప్రగతి కలిగించాలని, తన నిర్ణయాన్ని నిర్ణయంగా ఆ పెద్దలకు తెలియజేసింది.
ఆమె నిర్ణయాన్ని, తల్లి శాంతి, తండ్రి ఆనందరాయుడు సమర్థించారు. వారి నిర్ణయం ముకుందరావు సునందలకు నచ్చలేదు. మైత్రీ భావనతో భార్య ఇంటికి వెళ్ళినవారు, వైర భావనతో వారి ఇంటికి తిరిగి వచ్చారు.
భారతి ఎలక్షన్స్‌లో ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా ఎం.ఎల్.ఎ పదవికి నిలబడింది. రూలింగ్ పార్టీ అధినేతతో మాట్లాడి, భారతికి పోటీగా చిన్నారావును రూలింగ్ పార్టీ తరపున ఎం.ఎల్.ఎ పదవికి నిలబెట్టాడు ముకుందరావు.
ప్రజలు భారతి ఉపన్యాసాలను విని ఆమెను అభిమానించారు. భారతి ఎలక్షన్ ప్రచార సభల్లో గుమికూడే జనాన్ని చూచి, చిన్నారావు భారతిపై ద్వేషాన్ని పెంచుకొన్నాడు. ప్రచారపు చివరి సభలో చిన్నారావు భారతిపై తుపాకి కాల్పులు జరిపాడు. ఆమె అనుచరుడు అద్వైత్ ఆమెకు అడ్డుగా నిలిచి భారతిని రక్షించి, చిన్నారావు కాల్పును తాను ఎదుర్కొన్నాడు. ఆ దృశ్యాన్ని చూచిన భారతి తన తుపాకీతో చిన్నారావును కాల్చింది. అతను స్పాట్‌లో మరణించాడు. గాయపడిన అద్వైత్ హాస్పిటల్లో మరణించాడు.
రూలింగ్ పార్టీ మరో క్యాండిడేట్‌ని నిలబెట్టింది. గడువు మారి కొన్ని వారాల తర్వాత ఎలక్షన్ జరిగింది. గొప్ప మెజారిటీతో భారతి గెలిచింది. తనయుడి మరణ కారణంగా ముకుందరావు సునందలకు భారతిపై, ఆమె కుటుంబంపై హద్దులు లేని ఆగ్రహావేశాలు కలిగాయి. ప్రతీకార వాంఛతో ముకుందరావు ఆ కుటుంబా (భారతి) న్ని నాశనం చేయాలనే అహంకారపూర్వక వాంఛ, ద్వేషం, పగ..
తన కొడుకు చిన్నారావు చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచాయి. ఆ సంవత్సరాల్లో ముకుందరావు అనేక వ్యాపారాలు చేశాడు. చేస్తున్నాడు. చాలామంది తన తత్వపు మిత్రులకు నాయకుడైనాడు. ఒక వర్గపు రాజకీయ నాయకులకు పరమమిత్రుడు హితుడుగా మారాడు. పరపతి పేరును సంపాదించాడు. తమ్ముడికి జిల్లా లిక్కర్ వ్యాపార లైసెన్స్ సంపాదించి ఇచ్చాడు. భారతి తన సద్గుణాలతో విద్యామంత్రిగా నియామకమైంది. ఆమె తన నియోజక వర్గాన్నే కాక మిగతా నియోజక వర్గాల గ్రామాలను వీక్షించి, అక్కడ పిల్లల విధ్యావిధానాన్ని మెరుగుపరుస్తూ, టీచర్లతో హెడ్‌మాస్టర్స్ ప్రిన్సిపాల్స్‌తో చర్చలు జరుపుతూ, భావి భారత పౌరులైన పిల్లలను మంచి క్రమశిక్షణ, లక్ష్యాలతో తీర్చి దిద్దాలని పాఠశాల నిర్వాహకులకు తెలియజేసేది. వారి అవసరాలను తీర్చేది. అసెంబ్లీ కార్యక్రమాలు లేని సమయంలో నిరంతరం భారతి గ్రామాలను పాఠశాలలను సందర్శిస్తూ తన లక్ష్యాలను అందరికీ తెలియజేసేది.
ఆమె ప్రసంగాలను, అన్ని టీవీల వారు, ఛానల్స్ వారు ప్రసారం చేసేవారు. ఆ కారణం భారతి కేవలం ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ అభిమానులను సంపాదించుకోకలిగినది.
భారతికి సంక్రమించిన విజయ పరంపర, పేరు ప్రఖ్యాతులు కొడుకు మరణం ముకుందరావుకు, ఆమెపై, ఆ కుటుంబంపై ద్వేషాన్ని మరీ పెంచాయి.
***
“అన్నయ్యగారూ!.. నమస్కారాలు” నవ్వుతూ చేతులు జోడించాడు శ్రీరామ్.
కళ్ళు మూసుకొని గతాన్ని తలపోసుకుంటున్న ముకుందరావు ఆ పిలుపుతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ద్వారం వైపు చూచాడు.
ఎదురుగా శ్రీరామ్ చిరునవ్వుతో నిలబడివున్నాడు.
ముకుందరావు తన నేత్రాలను తానే నమ్మలేకపోయాడు.
“నీ.. వూ..” ఆశ్చర్యంతో ఆగిపోయాడు.
“నేను అన్నయ్యా!.. శ్రీరామ్‌ని, చలపతి అన్నయ్యను” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“ఓ.. నీవా!.. రారా!..” తొట్రుపాటుతో ఆహ్వానించాడు ముకుందరావు.
శ్రీరామ్ వారి గదిలో ప్రవేశించాడు.
“కూర్చో!..” అన్నాడు ముకుందరావు.
మరుక్షణంలో “ఎప్పుడు వచ్చావ్?” అడిగాడు.
“నిన్న!”
“ఇంతకాలం ఎక్కడ వున్నావ్?”
“లండన్”
“అక్కడ ఏం చేసేవాడివి?”
“ప్రొఫెసర్”
“ఆఁ.. ఏంటీ?”
“ప్రొఫెసర్ అన్నయ్యా!”
“అంటే పిల్లలకు చదువు చెప్పడమే కదా!..”
“అవును..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.
“పెండ్లి చేసుకొన్నావా!”
“నాకు ఒక పాప”
“అంటే పెండ్లి అయిందన్నమాటేగా!”
అవునన్నట్లు శ్రీరామ్ తలాడించాడు.
“అందరూ వచ్చేశారా!”
“నేనూ నా కూతురు వచ్చాము.”
“మరి నీ భార్య?”
“గతించింది”
“ఓహో !.. అలాగా!.. నీ అమ్మాయికి ఎంత వయస్సు?”
“పది సంవత్సరాలు!”
“మీ ఆవిడ ఎప్పుడు చనిపోయింది?”
“నా కూతురు ఒకటిన్నర సంవత్సరంలో వున్నప్పుడు..”
“అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రిందటన్నమాట”
అవునన్నట్లు తలాడించాడు శ్రీరామ్.
“వదిన ఇంట్లోనే వున్నారా అన్నయ్యా!”
“లేదు. యాత్రలకు వెళ్ళింది.”
“ఏ ప్రాంతం?”
“కాశీ”
“మీరు వెళ్ళలేదేం?”
“నాకు ఇంట్రస్ట్ లేదు”
“అంటే!.. దేవుడి మీద..” శ్రీరామ్ పూర్తిచేయకముందే.. “నాకు నమ్మకం లేదు. ఆఁ.. ఇక్కడ ఎంతకాలం వుంటావ్?”
“ఈ ఊర్లోనా!.. ఈ దేశంలోనా!..”
ముకుందరావు ఆశ్చర్యంగా శ్రీరామ్ ముఖంలోకి చూచాడు.
“ఏం అన్నా!.. అలా చూస్తున్నారు?” చిరునవ్వుతో అడిగాడు శ్రీరామ్.
“ఆ ఇంటివారికి, మాకు దాదాపు ఆరు సంవత్సరాలుగా మాటలు, రాకపోకలు లేవు. ఈ విషయం నీకు తెలుసా!..”
“ఆ.. తెలుసు. పగలు, ప్రతీకారాలు నాకు నచ్చవు అన్నయ్యా!..” ఎంతో సౌమ్యంగా చెప్పాడు శ్రీరామ్.
“నేను ఎందుకు మిమ్మల్ని చూడాలని వచ్చానో మీరు ఊహించగలరా!..”
“మనకు అంత జ్ఞానం లేదులే, నీవే చెప్పు!.. వింటా!..”
శ్రీరామ్ నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావు?”
“మీ అమాయకపు మాటలకు!.. అన్నయ్యా!.. పగలు, ప్రతీకారాలు మనస్సుకు శాంతి సౌఖ్యాలను ఇవ్వవు. క్షమాగుణం, అన్ని గుణాలలోకి సర్వోత్తమం. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!.. చిన్నప్పుడు చదివి వుంటారు జ్ఞాపకముందా!..” చిరునవ్వుతో అడిగాడు శ్రీరామ్.
“నాకు అంతటి సహనం లేదు. నీ మేనకోడలు భారతి నా కొడుకు చిన్నారావును కాల్చి చంపింది. నా స్థానంలో వుండి నీవు ఆలోచించు. ఆ సంఘటనను నీవు మరిచిపోగలవా!” ఆవేశంగా అడిగాడు ముకుందరావు.
“దాన్ని నేను దైవ నిర్ణయం అంటాను అన్నయ్యా!” చిరునవ్వుతో చెప్పాడు.
వీధి వాకిట ముందు కారు ఆగింది. ముగ్గురు వ్యక్తులు కారునుండి దిగారు. వారిని ముకుందరావు, శ్రీరామ్‌లు చూచారు.
“అన్నయ్యా!.. మీ మిత్రులు వస్తున్నట్లున్నారు. నేను వచ్చిన పని ముగిసింది. ఒక్కమాట.. ఏ పని చేసిన జాతికి రీతికి విరుద్ధంగా చేయడం తప్పు. నేరం, కాలం ఎప్పుడూ ఒకేరీతిగా సాగదు. ఈ నా మాటలను గుర్తుంచుకోండి. వస్తాను” కుర్చీనుండి లేచాడు శ్రీరామ్.
వేగంగా ఆ గది నుండి బయటికి నడిచాడు.
శ్రీరామ్‌కి ఎదురైన ఆ ముగ్గురు అతన్ని పరీక్షగా చూచారు. శ్రీరామ్ కూడా వారిని పరిశీలనగా చూస్తూ ముందుకు నడిచాడు.
ఆ ముగ్గురూ భవంతి వరండాను సమీపించారు. గదినుండి బయటికి వచ్చి ముకుందరావు వారిని సాదరంగా ఆహ్వానించాడు. నలుగురూ గదిలో ప్రవేశించి కూర్చున్నారు. ముకుందరావు తలుపు మూసి తన స్థానంలో కూర్చున్నాడు. ఆ వచ్చినవారు, ఒకరు తెల్లదొర (విదేశీయుడు) మరొకరు దాడీవాలా (ముస్లిం) మూడవ అతను స్థూలకాయుడు (పహిల్వాన్).
కారులో ఎక్కబోయిన శ్రీరామ్‌కు వారిపై ఏదో అనుమానం కలిగింది. వెనుతిరిగి మెల్లగా వరండాలో ప్రవేశించి ముకుందరావు ఆఫీస్ మూసియున్న తలుపును సమీపించాడు. తన సెల్లో వారి వాయిస్ రికార్డు చేయసాగాడు.
“మిస్టర్ ముకుంద్!.. యు హావ్ ఫెయిల్డ్ అన్ యువర్ కమిట్మెంట్. ఇట్ ఈజ్ నాట్ ఫెయిర్..” అన్నాడు తెల్లదొర.
“ఎస్ రిచ్చన్ సార్!.. ప్లీజ్ గివ్ మి టు వీక్స్ టైమ్. హండ్రెడ్ పర్సంట్ ఐ విల్ కంప్లీట్ మై సప్లయ్. సారీ సార్!..” అనునయంగా చెప్పాడు ముకుందరావు.
“ముకుందరావ్!.. అడ్వాన్స్ తీసుకున్నారు. నో కన్సైన్‌మెంట్. అడ్వాన్స్ రిటన్ సేయండీ.. మీ మీద ఫెయితు మాకీ లేద్..” అన్నాడు అరబ్ దాడీవాల ఫకీర్ షేక్.
‘లేదు షేక్.. ఫిఫ్టీ పర్సంట్ రెడీ!.. వారంరోజుల్లో మిగతా ఫిఫ్టీ పర్సంట్ రెడీ అవుతుంది. హండ్రడ్ పర్సంట్ పంపుతాను” అనునయంగా చెప్పాడు ముకుందరావు.
“అన్నా!..” పహిల్యాన్ గోవింద్ పలకరింపు.
“ఏం గోవిందా!..”
“వీళ్ళు నీ మీద చాలా కోపంగా వున్నారన్నా!..”
“నా పొరపాటు నాకు తెలుసు గోవిందా!.. రెండు వారాల్లో అన్ని పూర్తి చేస్తాను. ఇరువురికీ నచ్చచెప్పు.” ప్రాధేయపూర్వకంగా కోరాడు ముకుందరావు.
“సరే అన్నా!.. ఇక మేము వెళతాం. రిచ్చన్ సార్, మే బీ, వుయ్ విల్ గో నౌ!” అన్నాడు గోవింద్. శ్రీరామ్ వేగంగా నడిచి తన కారును సమీపించి కూర్చుని స్టార్ట్ చేశాడు. గది తలుపు తెరువబడింది. గదిలోని నలుగురూ బయటికి వచ్చారు. వచ్చిన ఆ ముగ్గురు తమ కారును సమీపించారు. కార్లో కూర్చున్నారు. ముకుందరావు వారికి టా టా చెప్పాడు. గోవింద్ కారును స్టార్ట్ చేశాడు.
ఆ ముగ్గురి విషయంలో శ్రీరామ్‌కు అనుమానం కలిగింది. తన కారును సైడ్ చేసి, వారి కారును ముందుకు పోనిచ్చి, దాన్ని ఫాలో చేశాడు శ్రీరామ్.
ఒకడు అరేబియన్ వున్నాడు. ఒకడు అమెరికన్‌లా వున్నాడు. మూడవవాడు ఇండియన్. ముకుందరావు అన్నయ్యకూ ఆ ముగ్గురికీ ఏమిటి సంబంధం? ఫిఫ్టీ పర్సంట్ రెడీ అయింది. మిగతా ఫిఫ్టీ పర్సంట్ వన్ వీక్‌లో రెడీ అవుతుంది అన్నాడు ముకుందరావు. ఏమిటా ఫిఫ్టీ పర్సంట్?.. ‘ఇరువురికీ నచ్చచెప్పు’ అన్నాడు. మన ప్రాంతం వాడు ఆ ఇరువురికీ ఏం నచ్చచెబుతాడు? ఏమిటా విషయం? నా ప్రశ్నలకు జవాబు రావాలంటే నేను వీరిని ఫాలో చేయాలి’ అనే నిర్ణయానికి వచ్చిన శ్రీరామ్ వారి కారును అనుసరించాడు.
ఆ కారు నెల్లూరి వైపుకు మరలింది. శ్రీరామ్ తన కారును వారి కారు వెనకాలే నడుపుతున్నాడు.
నెల్లూరు వైపే వెళ్ళే ఒక పోలీస్ జీప్ కొంతదూరంలో శ్రీరామ్‌కు కనిపించింది. రామ్ కారును నడుపుతున్నాడు. ఆ ముగ్గురూ వెళుతున్న కారు పోలీస్ జీపు దాటిపోయింది.
శ్రీరామ్ కారు పోలీస్ జీప్‌ను సమీపించింది.
పోలీస్ అధికారి లిఫ్ట్ సిగ్నల్‌ను చూపించాడు.
శ్రీరామ్ తన కారును పోలీస్ జీప్ ముందుకు పోనిచ్చి ఆపి, దిగాడు. ASP పరశురామ్ శ్రీరామ్‌ను సమీపించాడు.
శ్రీరామ్ అతన్ని పరిశీలనగా చూచాడు. అతని మనస్సులో ఏదో సందేహం!..
“వాట్ సార్!.. లిఫ్ట్ కావాలా!..” అడిగాడు శ్రీరామ్ చిరునవ్వుతో.
పరశురామ్ శ్రీరామ్ ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచి.. “మీ పేరు?!”
“శ్రీరామ్!..” వెంటనే చెప్పాడు శ్రీరామ్.
కోరమీసాలు, గడ్డం కళ్ళకు అద్దాలతో పరశురామ్ రౌడీ పోలీస్ వున్నాడు.
“రేయ్!.. శ్రీరామ్!.. నేనురా పరశురామ్‌ను ASP” నవ్వుతూ చెప్పాడు పరశురామ్.
రెండు క్షణాల తర్వాత “దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనం కలుసుకొన్నాము” నవ్వుతూ చెప్పాడు పరశురామ్. మిత్రుడి చేతులను తన చేతుల్లోకి నవ్వుతూ తీసుకొన్నాడు శ్రీరామ్.
“ఏం పరశూ!.. నీలో చాలా మార్పురా!..”
“నీలోనూ నా కళ్ళకు మార్పు కనిపిస్తూ వుంది శ్రీరామ్!.. ఎక్కడ వుంటున్నావ్?”
“లండన్‌లో.. ఇరవై ఏడు సంవత్సరాలు వుండి మూడురోజుల నాడు భారత్‌కు తిరిగి వచ్చాను.”
“వివాహం.. పిల్లలు!..”
“ఒక కూతురు పది సంవత్సరాలు.”
“అవున్రా!.. నీవు పెద్దా, నేను పెద్దా?..” అడిగాడు పరశురామ్.
“నాకంటే నీవే పెద్ద నాలుగైదు నెలలు. కాలేజ్ డేస్లో అనుకొనేవాళ్ళం” అన్నాడు శ్రీరామ్. క్షణం తర్వాత.. “ఎక్కడికి వెళ్ళాలి?”
“నెల్లూరు..”
“నీ డ్యూటీ ఎక్కడ?”
“నెల్లూరే!..”
“ముకుందరావు పేరు విని వున్నావా?”
“ఆఁ.. వారికి అనేక వ్యాపారాలు. బాగా పరపతి, పలుకుబడి వుండే మనిషి. అవునూ!.. వారిని గురించి ఎందుకు అడిగావు?” అడిగాడు పరశురామ్.
“అతని తాలూకు మనుషులు ముగ్గురు పది నిముషాల ముందు ఒక టొయోటా టాక్‍మతో వెళ్ళారు. గమనించావా?” అడిగాడు శ్రీరామ్.
“అందులో ఒకడు దుబాయ్ షేక్‌లా, మరొకడు అమెరికన్ లేక లండన్ వాడిలా, మూడవవాడు మన ఈ ప్రాంతం రౌడీలా వున్నారు. ముకుంద రావు నాకు అన్నయ్య వరస. వాళ్ళు ముకుందరావు ఓ అరగంటసేపు ఏదో గది తలుపులు బిగించుకొని చర్చించుకున్నారు. ఆ నలుగురూ కలిసి ఏదైనా ఇల్లీగల్ వ్యాపారాలు సాగిస్తున్నారా అనే అనుమానం కలిగింది నాకు. నేను వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చాను. నీవు లిఫ్ట్ అడగ్గానే కారును ఆపాను” అన్నాడు శ్రీరామ్.
“ఆ బండి నెంబర్ నీకు గుర్తుందా?” ఆత్రంగా అడిగాడు పరశురామ్.
“ఆ.. APSH9999” చెప్పాడు శ్రీరామ్.
పరశురామ్ సెల్ తీసి, నెల్లూరులో వుండే తన బృందంలో ఒకరికి ఫోన్ చేసి బండి నెంబర్ చెప్పి “ఆ బండిని ఆపండి” అని చెప్పాడు.
శ్రీరామ్, పరశురామ్‌లు కార్లో కూర్చున్నారు. కారును శ్రీరామ్ నెల్లూరు వైపుకు నడిపాడు..
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
