[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[శ్రీరామ్ తనకు అన్నయ్య వరసయ్యే ముకుందరావు ఇంటికి వెళ్తాడు ధనార్జన కోసం ముకుందరావు ఎన్నో ఆగడాలు చేస్తూంటాడు. ఆంగ్లేయులతోనూ, కొందరు ముసల్మానతోనూ కలిసి కుట్రలు చేస్తూంటాడు. తను అతన్ని కలవడానికి వచ్చానని కబురు పంపితే, మిత్రులతో మీటింగులో వున్న ముకుందరావు ఆపూట తనకి తీరిక లేదని, మరోసారి రమ్మని చెబుతాడు. తన కొడుకు విషయంలో ఆనందరాయుడి కుటుంబం చేసినవన్నీ గుర్తొస్తాయి ముకుందారావుకి. శ్రీరామ్ లోపలికి వెళ్ళి గతాన్ని తలపోసుకుంటున్న ముకుందరావుని పలకరిస్తాడు. తాను చలపతి అన్నయ్యనని గుర్తు చేస్తాడు. ముకుందరావు శ్రీరామ్ వివరాలు అడిగి, ఇక్కడ ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటాడు. ముకుందరావు చేస్తున్న చెడుపనుల గురించి హెచ్చరిస్తాడు శ్రీరామ్. అతను లేచి వచ్చేస్తుండగా, ఒక విదేశీయుడు, ఒక ముస్లిం, ఒక పహిల్వాన్ ముకుందరావుని కలవడానికి వస్తారు. వారిపై అనుమానం కలుగుతుంది శ్రీరామ్‌కి. రహస్యంగా వారి సంభాషణ వింటాడు. కాసేపటికి ఆ ముగ్గురూ బయటకి వచ్చి కారులో బయల్దేరుతారు. శ్రీరామ్ తన కారులో వారిని అనుసరిస్తాడు. ఇంతలో ఒక పోలీస్ అధికారి లిఫ్ట్ కావాలంటూ సంజ్ఞ చేసి శ్రీరామ్ కారుని ఆపుతాడు. కొన్ని క్షణాల తరువాత అతడిని తన మిత్రుడు పరశురామ్‌గా గుర్తిస్తాడు శ్రీరామ్. మిత్రులిద్దరూ ఆనందిస్తారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. తను వెంబడిస్తున్న కారు వివరాలు, అందులోని వారి అనుమానాస్పద ప్రవర్తన గురించి చెప్తాడు. పరశురామ్ సెల్ తీసి, నెల్లూరులో వుండే తన బృందంలో ఒకరికి ఫోన్ చేసి బండి నెంబర్ చెప్పి ఆ బండిని ఆపమని ఆదేశిస్తాడు. శ్రీరామ్ కారుని నెల్లూరు వైపు పోనిస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-18
శ్రీరామ్ కారు నుండి రోడ్డును నేరుగా చూస్తూ నడుపుతున్నాడు. ప్రక్కన కూర్చొని వున్న పరశురామ్ శ్రీరామ్ ముఖంలోకి చూచాడు.
అదే సమయానికి శ్రీరామ్ పరశురామ్ ముఖంలోకి చూచాడు. ఇరువురి చూపులు కలిశాయి.
“దేన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నావ్ శ్రీరామ్!..” అడిగాడు పరశురామ్. “ముకుందరావును గురించి!..”
“అతన్ని కలిశావా?”
“కలిశాను..”
“ఏమనిపించింది?”
“మనిషికి వయస్సు పెరిగింది కాని, మనస్సుకు మంచి మానవత్వం అలవడలేదు. ప్రతి మాటలో అహంకారం. ఎదుటి వారిని నిర్లక్ష్యంగా చూడటం..” విరక్తిగా నవ్వాడు శ్రీరామ్.
“లిక్కర్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. ‘ధనం హెచ్చిన మదం హెచ్చును’ సామెతను విన్నావుగా!.. పైగా ముఖ్యమంత్రికి చాలా ముఖ్యుడు” అన్నాడు పరశురామ్.
“పరశురామ్!..”
“ఏమిట్రా శ్రీరామ్?”
“నీవు ఈ ప్రాంతంలో ఎంతకాలం పనిచేస్తున్నావ్?”
“దాదాపు రెండు సంవత్సరాలుగా!..”
“అంతకు ముందు?”
“విజయనగరం..”
“అక్కడ ఎంతకాలం పనిచేశావు?”
“ఒకటిన్నర సంవత్సరం!.. ఆ తరువాత ఇక్కడికి బదిలీ!.. ముక్కుకు సూటిగా విధ్యుక్త ధర్మాన్ని సాగిస్తే బదిలీలు తప్పవు” విరక్తిగా నవ్వాడు పరశురామ్.
“వివాహం అయిందా!..”
“చేసుకోలేదు.”
“కారణం?”
“నేను పెండ్లి చేసుకొన్న యువతి నాతో ప్రశాంతంగా బ్రతకలేదు!”
“కారణం?”
“నా నిజాయితీ ఆమెకు శాపంగా మారి, సదా అశాంతితో బ్రతకవలసి వస్తుంది. నా కారణంగా ఒక అమాయకురాలు సదా బాధపడకూడదు. నాకు వివాహం మీద ఆసక్తి లేదు. స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఏడు సంవత్సరాలైంది. మత కల్లోలాలు సద్దుమణిగాయి. కానీ కుల వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. కనీస మానవ ధర్మాలను పాటించని కొందరు ప్రబుద్ధులు, మిత్రులు, ప్రజానాయకులు, లంచగొండితనం అంటువ్యాధిలో ఆపాదిస్తూ ఉంది. కాన్వెంట్స్ పెరిగిపోయాయి. విలాసమైన మనుగడ కోసం మూడేళ్ల పిల్లలను శిశుకేర్ సెంటర్లో వదిలి, భార్యాభర్యలు ఇరువురూ ఉద్యోగులౌతున్నారు. పిల్లలను శ్రద్ధగా చాలామంది చూచుకోలేక పోతున్నారు. ఆ ఇల్లాలికి భర్త తల్లి తండ్రులు గిట్టరు. ఆ వృద్ధ తల్లితండ్రులను అర్ధాంగి ఆనందం కోసం అన్నలు వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు. కొందరు పరువు కోసం, భార్యతో గొడవ లేకుండా దానికోసం తాము కన్నతల్లి తండ్రి విషయంలో చేసింది, చేస్తున్నదీ తప్పని తెలిసి కూడా నిస్సహాయులై, మరబొమ్మలుగా మారిపోతున్నారు. మన హైందవ ధర్మాలు, ఆచార వ్యవహారాలు, పురాణ ఇతిహాసాలను గురించి నా చిన్నతనంలో మా నాయనమ్మ, తాతయ్యలు కథలుగా చెప్పేవారు. ఆ వయస్సులో వారి ఆ మాటలు వినసొంపుగా, మనస్సుకు ఆనందంగా వుండేవి. పెరిగే కొద్ది ఆ జ్ఞాపకాల మూలంగా మన జీవిత విధానాన్ని ధర్మాన్ని కర్తవ్యాన్ని తెలుసుకోగలిగేవాళ్ళం. మంచి విద్యార్థి అన్న పేరు తెచ్చుకొనేవాళ్ళం. కానీ నేడు.. చాలామంది పిల్లలకు అలాంటి అవకాశాలు కరువైనాయి. తల్లితండ్రులకు మాతృభాష మీద గౌరవాభిమానాలు సన్నగిల్లుతున్నాయి. ఇక పిల్లలకు జాతి ప్రతిభ, హైందవ సంస్కృతి, జీవిత విధానానికి మంచి లక్ష్యాలు ఎలా ఏర్పడగలవు? నేటి తల్లి తండ్రుల లక్ష్యం, కొడుకు కూతుళ్ళను ఇంజనీర్, డాక్టర్‌గా చదివించాలని. ఆ లక్ష్యసిద్ధికి కావాలి కదా ధనం!.. ఆ ధనం ఎలాగైనా సంపాదించాలనే భావన తప్ప, అక్రమ సంపాదన అనుచితం అనే ఆలోచన చాలామంది వ్యక్తుల మనస్సుల్లో లేదు. స్కూలు అడ్మిషన్కు లంచం, ఎక్కువ ఫీజులు, కాలేజీ అడ్మిషన్‌కు డొనేషన్లు, ఉద్యోగం కోసం లంచాలు, సర్వసాధారణం అయిపోయాయి. అంటే.. మనిషి మానవత్వాన్ని విస్మరించి అవసరాలను తీర్చుకొనేటందుకు విచక్షణా రహితంగా దానవ మనుగడను సాగించవలసిన పరిస్థితులు.
పేదవాడు పూట గడుపుకొనేదానికి ఇల్లాలితో కలిసి రెక్కలు ముక్కలు చేసికొంటున్నాడు. మధ్య తరగతి వ్యక్తి పిల్లల వాంఛలను తీర్చలేక అడ్డదారుల ఆర్థికార్జనను ఆశ్రయిస్తున్నాడు. వున్న గొప్పవారు కోటిని రెండు కోట్లుగా ఎలా చేయాలనే మహా లక్ష్యంతో లంచాలను వెదజల్లి కార్య సాఫల్యాలను పొందుతున్నారు. ఈ ముక్కోణ చదరంగంలో నేరాలు, కోర్టులు, సాక్షాలు, ఋజువులు, శిక్షలు, జైళ్ళు, పగలు, ప్రతీకారాలు, పావులు. స్వాతంత్ర్య సిద్ధికి పోరాడిన ఆనాటి ఆ మహనీయులలో వుండిన సఖ్యత సౌభ్రాతృతం నేటి మన ఈ సముదాయంలో లేదు. అంతా స్వార్థం.. స్వార్థం..” ఎంతో ఆవేశంగా చెప్పుకొచ్చిన పరశురామ్ ఆపాడు.
శ్రీరామ్ ముఖంలోకి చూచాడు.
“సోదరా!.. బోర్ కొట్టించానా.. సారీ బ్రదర్!..” విషాదంగా నవ్వుతూ చెప్పాడు శాంతారామ్.
శ్రీరామ్, పరశురామ్ ముఖంలోకి చూచాడు. పరశురామ్ కళ్ళల్లో కన్నీటి జీరలు.
అతని సెల్ మ్రోగింది.
“ఎస్!..”
“అలాగా!..”
“సరే!.. మీరు ఆ ప్రాంతంలోనే వుండండి. వారి కదలికలను గమనించండి. పదినిముషాల్లో అక్కడికి వస్తాం” అన్నాడు పరశురామ్.
కట్ చేశాడు ఎస్.ఐ విశ్వనాథ్.
“శ్రీరామ్!..”
“ఆఁ..”
“వారి కారు సింహపురి హోటల్లో ప్రవేశించిందట..” అన్నాడు పరశురామ్.
“పరశు!.. నాకు ఆ కార్లో వున్న షేక్, వైట్ మ్యాన్ మీద అనుమానం!..”
“ఏ విషయంలో?”
“ముకుందరావుగారితో కలిసి వారు ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారని నా అనుమానం!..”
“మనవాళ్ళను ఆ పరిసరాల్లోనే వుండి వారి మూమెంట్‌ను వాచ్ చేయమని చెప్పాను.”
“మనం కూడా ఆ హోటల్లో రూమ్ తీసుకొందాం!..”
“అలాగే!..”
“వాళ్ళ ప్రక్కది గాని, ఎదుటిది గాని అయితే మంచిది”
“ఉయ్ విల్ ట్రై..”
శ్రీరామ్ తలాడించాడు.
ఐదు నిముషాల్లో వారి కారు సింహపురి హోటల్లో ప్రవేశించింది.
పరశురామ్, శ్రీరామ్‌లు కారును పార్కింగ్ ఏరియాలో వుంచి, దిగి, రిసెప్షన్ను సమీపించారు.
రిసెప్షనిస్ట్ పరశురామ్‌కు సెల్యుట్ చేశాడు.
పరశురామ్ ఆ ముగ్గురి గురించి చెప్పి, వారి రూముకు ముందు వున్న రూమ్ కావాలని అడిగాడు.
“సార్ అది ఖాళీయే!.. ఇమ్మంటారా!..”
“ఇవ్వండి” అన్నాడు శ్రీరామ్.
రిసెప్షనిస్ట్ చూపిన బుక్‌లో శ్రీరామ్ తన పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ వ్రాశాడు.
పరశురామ్, శ్రీరామ్‌లు ఫస్ట్ ఫ్లోరు చేరారు. రూమ్ బాయ్ గది తాళం తీశాడు. ఇరువురూ గదిలో ప్రవేశించారు. రూమ్ బాయ్ సోపులు, టవల్స్, వాటర్ బాటిల్స్ తెచ్చి టేబుల్పై వుంచాడు.
“సార్.. కాఫీ.. టీ ఏదైనా కావాలా సార్!..” అడిగాడు.
“పరశూ!.. కాఫీయా.. టీయా..”
“కాఫీ!..”
“ఆఁ.. తమ్ముడు రెండు కాఫీ తీసుకురా..”
బాయ్ వెళ్ళి పది నిముషాల్లో ఫ్లాస్క్ కప్పులతో వచ్చి, కాఫీని కప్పులలో పోసి ఇరువురికీ అందించాడు.
“తమ్ముడూ!..” అన్నాడు శ్రీరామ్.
“సార్!..”
“నీ పేరేమిటి?”
“రంగ సార్!..”
“ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నావు?”
“రెండు ఏళ్ళుగా సార్!..”
“మా రూముకు ఎదుటి రూములో ఎవరున్నారు?”
“ముగ్గురు మగవారు అరగంట ముందు వచ్చారు సార్!..”
“వాళ్ళకి టీ ఇచ్చావా?”
“టీ కాదు సార్ డ్రింక్స్..”
“ఏందీ?”
“మందు సార్!” నవ్వాడు రంగ.
“ఏ బ్రాండ్?”
“స్కాచ్ సార్. ఫుల్ బాటిల్ సార్!.. మీకూ కావాలా!”
“వద్దు. కానీ నీవు ఒక పని చెయ్యాలి..”
“ఏమిటి సార్!..”
“ఆ ముగ్గురు ఏ విషయాన్ని గురించి మాట్లాడుకొంటున్నారో గమనించి మాకు చెప్పాలి” అన్నాడు పరశురామ్.
“అలాగే సార్!.. ఆ గదిలోకి వెళ్ళి వస్తా!..” రంగ గదినుండి బయటికి నడిచాడు.
“పరశురామ్!..”
“ఏందన్నా!..”
“ఆ రంగను చూచావుగా చదువుకొనే వయస్సులో లాడ్జిలో వుండి ఎలాంటి పనులు చేస్తున్నడో?”
“దేశంలో ఇలాంటి వాళ్ళు చాలామంది వుంటారన్నా. పేదవారు ఏదో ఒక పని చేసి బ్రతకడం అన్నది వారికి గత్యంతరం.” విచారంగా అన్నాడు పరశురామ్.
రంగ ఎదుటి గది తలుపు తట్టాడు. తలుపు రెండు నిముషాల తర్వాత తెరువబడింది. తలుపును తెరిచింది పహిల్వాన్ గోవింద్.
“సర్!.. ఏమన్నా కావాలా?” అడిగాడు రంగ.
“లోనికి రా!..”
రంగడు ఆ గదిలో ప్రవేశించాడు.
ముకుందరావు గోవింద్‌కు ఫోన్ చేశాడు.
“అన్నా!.. చెప్పండి.”
“నాకు ఫోన్ వచ్చింది”
“ఎక్కడ నుండి?”
“బాలరాజు దగ్గరనుండి. కన్సైన్‌మెంటు పూర్తిగా రెడీ అట. నా ఒక బాధ తీరింది. ఆ విషయాన్ని రిచ్చర్డ్‌కు చెప్పు. నేను పది నిముషాల్లో నెల్లూరు చేరుతాను.”
“సార్!.. పది నిముషాల్లో ముకుందరావు ఇక్కడికి వస్తున్నాడట. రిచ్చర్డ్, సార్!.. మీ కన్సెన్‌మెంటు రెడీ అయిందంట. యువర్ కన్‌సైన్మెంట్ రెడీ!..” నవ్వుతూ చెప్పాడు పహిల్వాన్ గోవింద్.
“ఏం తింటారు?” అడిగాడు ఆ ఇరువురిని..
“పలావ్..” చెప్పాడు రిచ్చర్డ్.
గోవింద్ రంగతో మూడు పలావులు తెమ్మన్నాడు. రంగ తలాడించి గది నుండి బయటికి వచ్చాడు. శ్రీరామ్ గదిలో ప్రవేశించాడు.
“ఏం రంగా, ఏమైనా విన్నావా?” అడిగాడు పరశురామ్.
“విన్నా సార్, ఏదో కన్‍సైన్మెంటు రడీ అంట. పదినిముషాల్లో ఎవరో ముకుందరావు వస్తాడంట. పలావు కావాలన్నారు. వెళ్ళి తీసుకొస్తాను సార్” రంగ గదినుండి బయటికి నడిచాడు.
“పరుశూ!..”
“అన్నా!..”
“నా అనుమానం నిజం అయింది. ముకుందరావు వారితో కలిసి ఏదో రాంగ్ బిజినెస్ చేస్తున్నట్లున్నాడు..”
“అవును అన్నా!.. రంగా మాటలను బట్టి, మీ అనుమానం సహేతుకం అనే నా అభిప్రాయం. వారిని మనం ఫాలో చేయాలి” అన్నాడు పరశురామ్ సాలోచనగా..
శ్రీరామ్ మౌనంగా తలాడించాడు. వేగంగా లేచి తలుపును సమీపించి తెరిచాడు. ముకుందరావు ఆ ఎదుటి గదిలో ప్రవేశించడాన్ని ఇరువురూ మిత్రులు చూచారు.
“పరశురామ్..మీ బృందాన్ని సిద్ధం చెయ్యి. నా అంచనా ప్రకారం వారు భోంచేసి బయలుదేరుతారు. వారిని ఫాలో చెయ్యాలి మీ జీప్‌లో కాదు నా కార్లో.”
“అలాగే అన్నా!.. నేను నా వారికి ఆల్రెడీ ఇన్ఫాం చేశాను.”
“మరోమాట!..”
“ఏమిటన్నా అది?”
“నీవు పహిల్వాన్ గోవింద్‌ను అరెస్టు చెయ్యాలి. ఇప్పుడు కాదు వారు వారి గమ్యాన్ని చేరిన తరువాత..”
“అతన్నే కాదు నలుగురినీ అరెస్ట్ చేస్తానన్నా!..”
“ముకుందరావు పెద్ద తోపు అన్నావుగా!.. అతన్ని అరెస్టు చేస్తావా?” అడిగాడు శ్రీరామ్. “నేరం చేసినవాడు ఎవడైనా సరే అరెస్టు చేయక తప్పదు కదా అన్నా!..” వ్యంగ్యంగా నవ్వాడు పరశురామ్.
“గుడ్ గ్రేట్ పరశూ!..” నవ్వుతూ అన్నాడు శ్రీరామ్.
అరగంట తరువాత ఆ గది నుండి ముకుందరావు, పహిల్వాన్ గోవింద్, రిచ్చర్డ్, షేక్లు బయటికి వచ్చి వేగంగా క్రిందికి వెళ్ళిపోయారు. పరశురామ్ తన బృందానికి వారు బయలుదేరిన విషయాన్ని ఫోన్‌లో చెప్పాడు.
పావుగంట తరువాత శ్రీరామ్, పరశురామ్‌లు గదినుండి బయటికి వచ్చి, శ్రీరామ్ కార్లో కూర్చొని, పరశురామ్ శిష్యుడు ఎస్.ఐ. విశ్వనాథ్ చెప్పిన (ఫోనులో) ఆ నలుగురినీ ఫాలో చేశారు.
సమయం రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతం.
వారి రెండూ కార్లు కృష్ణాపట్నం పోర్టు మార్గంలో ముందుకు పోసాగాయి. నెల్లూరు నుండి కృష్ణాపట్నం ఇరవై ఆరు కిలోమీటర్లు.
శ్రీరామ్ డ్రైవ్ చేస్తున్న కార్లో పరశురామ్ ముందు సీట్లో కూర్చొని యున్నాడు.
ఆ కారుకు వెనుక పరశురామ్ బృందం జీప్ వస్తూ వుంది. ఆ జీప్ ఎస్.ఐ విశ్వనాథ్, ముగ్గురు పోలీసులు మఫ్టీలో వస్తున్నారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ముకుందరావు గ్రూప్ రెండు కార్లు కృష్ణాపట్నం బీచ్‌ని సమీపించాయి.
నలుగురూ కార్లను దిగారు. ఇసుకలో బీచ్ అంచునే రెండు ఫర్లాంగులు నడిచారు.
అక్కడ ఆరుగురు మత్స్యకారులు, ఆరు గాడిదలు వున్నాయి.
ప్రతి గాడిద మీద రెండు బియ్యపు బస్తాలలో ఏదో వస్తువులు మూతి బిగించి వున్నాయి.
ఆ ఆరుగురికి లీడర్ బాలరాజు. ఆ నలుగురినీ చూచిన బాలరాజు పరుగున వారిని సమీపించి ముకుందరావుకు సెల్యూట్ చేశాడు.
“ఏరా బాలా!.. ఎలా వున్నావ్. అంతా రెడీయేనా?” నవ్వుతూ అడిగాడు.
“ఆ సామి బాగుండా. అంతా తమరి దయ. మీరు సెప్పిన మాట ప్రకారం పన్నెండు ఇగ్రహాలు తీసుకొచ్చినా. ఒక్కో బస్తాలో రెండు వుండాయ్!” నవ్వుతూ చెప్పాడు బాలరాజు.
“మిస్టర్ రిచ్చర్డ్.. యువర్ కన్‌సైన్మెంటు రెడీ. ప్లీజ్ చెక్” అన్నాడు ముకుందరావు.
ఆ ప్రాంతానికి సమీపించిన శ్రీరామ్, పరశురామ్, ఎస్.ఐ విశ్వనాథ్ లు తీరానికి దూరంగా వున్న చవక చెట్ల చాటు నుండి ఆ తీర ప్రాంతంలో జరిగే విషయాలను గమనిస్తున్నారు. రిచర్డ్ గాడిదల మీద వున్న బస్తాలను తాకి చూచాడు. అతనికి ఎంతో ఆనందం.
దూరంగా సముద్రంలో వున్న ఒక బోటు తీరాన్ని సమీపించింది. బాలరాజు మనుషులు గాడిదల మీద వున్న బస్తాలను ఆ బోట్లో లోడ్ చేశారు. ముకుందరావుకు రిచర్డ్ షెకెండ్ ఇచ్చాడు.
లోడింగ్ పూర్తి కాగానే పరశురామ్, విశ్వనాథ్, ముగ్గురు పోలీసులు, ముకుందరావు, రిచెర్డ్, షేక్, పహిల్వాన్, గోవింద్‌లను చుట్టు ముట్టారు. బాలరాజు బృందం పారిపోయారు. పరశురామ్ వారిని భయపెట్టేదానికి తుపాకి గాల్లో పేల్చాడు. ఆ నలుగురూ బోట్లో వున్న ఇద్దరు, వీరిపై తిరగబడ్డారు. ఇసుకలో కొంతసేపు ఇరువర్గాల మధ్యన పోరాటం.
“చూడండీ!.. మీరు మమ్మల్ని ఎదిరించి పారిపోవడానికి ప్రయత్నిస్తే అందరినీ కాల్చి పారేస్తాను. మర్యాదగా లొంగిపొండి..” చెప్పి మరోసారి తుపాకిని గాల్లో పేల్చాడు పరశురామ్.
అతని మాటలకు తుపాకి కాల్పులకు ముకుందరావు బృందం భయపడింది. పోలీసులు అందరి ఒక చేతికి బేడీలు తగిలించారు. బోటులోని బస్తాలను బోటు నడిపేవారి చేతి, పహిల్వాన్ చేత జీప్ దగ్గరికి చేర్పించి జీప్‌లో లోడ్ చేశారు. పోలీసులు వారందరి రెండు చేతులకు బేడీలు తగిలించారు. వారి మధ్యన వున్న శ్రీరామ్‌ను చూచిన ముకుందరావు..
“శ్రీరామ్!.. నీవు వీరితో కలిశావా!..” ఆశ్చర్యంతో అడిగాడు ముకుందరావు.
“అధర్మం అనిపిస్తే, ఎదిరించడం నా అలవాటు అన్నయ్యా!.. ఈ డి.ఎస్పీ పరశురామ్ నా క్లాస్‌మేట్. మీలాంటి వారు ఇలాంటి అసభ్యకరమైన పనులకు పాల్పడటం అమానుషత్వం. తగిన శిక్ష అనుభవించక తప్పదు.” ఆవేశంగా అన్నాడు శ్రీరామ్.
“నిప్పుతో చెలగాటమాడుతున్నావ్ శ్రీరామ్. పర్యవసానం ముందు ముందు మహా భయంకరంగా వుంటుంది” వికటంగా నవ్వాడు ముకుందరావు.
ఆ నలుగురినీ బోటు నడిపిన ఇద్దరినీ లాక్కొచ్చి జీప్‌లో ఎక్కించారు పోలీసులు. వారి రెండు కార్లు సముద్రపు ఒడ్డునే వుండిపోయాయి. శ్రీరామ్ కారు, పోలీస్ జీప్ కృష్ణాపట్నం నుండి నెల్లూరు వైపుకు బయలుదేరాయి.
రాత్రి పదకొండున్నరకు నెల్లూరు చేరిన పరశురామ్, గడచిన మూడుగంటల్లో జరిగిన విషయాన్ని తన బాస్ ఏ.ఎస్.పి క్రాంతికి తెలియజేశాడు. ఆరుగురినీ కటకటాల వెనక్కు తోశాడు పరశురామ్.
శ్రీరామ్ తన గ్రామానికి బయలుదేరాడు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
