[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[కారు నడుపుతూ ఆలోచిస్తూంటాడు శ్రీరామ్. దేని గురించి ఆలోచిస్తున్నావని పరశురామ్ అడిగితే, ముకుందరావుని గురించి అని చెప్తాడు. అతన్ని కలిశావా అని అడుగుతాడు పరశురామ్. కలిశానని చెప్పి, జరిగినదంతా మిత్రుడికి చెప్తాడు శ్రీరామ్. కాసేపు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారు. తన నిజాయితీ వల్ల తనకి కాబోయే భార్య ఇబ్బంది పడకూడదని పెళ్ళి చేసుకోలేదని చెప్తాడు పరశురామ్. ఇంతలో ఎస్.ఐ. విశ్వనాథ్ పరశురామ్‌కి ఫోన్ చేస్తాడు. అతనికి తగిన ఆదేశాలిచ్చి ఫోన్ పెట్టేస్తాడు పరశురామ్. తాము ఫాలో చేస్తున్న కారు సింహపురు హోటల్‌లోకి ప్రవేశించిందని చెప్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఆ హోటల్‍కి వెళ్ళి – ఆ విదేశీయుడు, ఆ ముస్లిం, ఆ పహిల్వాన్ దిగిన ఆ రూమ్‌కి ఎదురు రూమ్‌లో దిగుతారు. రూమ్ బోయ్‌ని పిలిచి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని తమకు చెప్పమంటాడు పరశురామ్. సరేనని ఆ గదికి వెళ్ళి ఏమైనా కావాలా అని అడుగుతాడు బోయ్. అదే సమయంలో వాళ్ళకి ఫోన్ వస్తుంది. కన్‌సైన్‍మెంట్ రెడీ అని ఎవరో చెప్తారు. ఆ మాట విని, వెళ్ళి పరశురామ్‌కి చెప్తాడు బోయ్. వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చి కారులో కృష్టపట్నం పోర్టు వైపు వెళ్తారు. శ్రీరామ్, పరశుతామ్ తమ కారులో వారిని అనుసరిస్తారు. తీరానికి కాస్త దూరంలో ముకుందరావు, గాడిదలపై కొన్ని బస్తాలతో నిలబడి ఉంటాడు. వాతిలొ దేవతా విగ్రహాలుంటాయి. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ముకుందరావుని, అతడి అనుచరులని, ఆ ముగ్గురిని అరెస్టు చేస్తారు. పోలీసుల పక్కనే ఉన్న శ్రీరామ్‌ని చూసి ముకుందరావు ఆశ్చర్యపోతాడు. ఇదంతా శ్రీరామ్ పనేనని గ్రహించి, పర్యవసానం మహా భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తాడు. శ్రీరామ్ ఇంటికి బయల్దేరుతాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-19
శ్రీరామ్ గడచిన మూడు గంటల్లో సముద్ర తీరంలో జరిగిన సంఘటనను గురించి ఆలోచిస్తూ కారును నడుపుతున్నాడు.
సమయం రాత్రి పన్నెండుగంటల ప్రాంతం.
‘ముకుందరావు విషయంలో నా అనుమానం నిజం అయింది. అతని వయస్సు దాదాపు డెబ్భై సంవత్సరాలు. ఆ వయస్సులో రామా, కృష్ణా అనుకొంటూ, వున్న ఆస్తిపాస్తులతో తృప్తి చెంది ప్రశాంతంగా బ్రతకకుండా, లిక్కర్ వ్యాపారం, ప్రత్యక్ష సాక్ష్యాలతో చూచిన దేవాలయాల విగ్రహాలను మాయం చేయించి విదేశీయులకు అమ్మడం, అమానుషత్వానికి నిదర్శనం. అనుకొన్న రీతిగా విశాఖపట్నానికి వెళ్ళలేని పరిస్థితి. రేపు పరశురామ్ వారిపై పెట్టబోయే కేసులో నేను ఐ విట్‌నెస్ కావల్సి వస్తుంది. బాంధవ్య రీత్యా పలుకరించడానికి వెళ్ళిన నేను, ముకుందరావు ఇంట ఆ ముగ్గురినీ చూడటం, వారి వాలకాలను బట్టి వారిపై నాకు అనుమానం రావడం, వారి మాటలను వినడం, మార్గ మధ్యంలో పాత స్నేహితుడు పరశురామ్‌ను కలవడం, అతనితో నా అనుమానాన్ని గురించి చెప్పడం, ఇరువురం కలిసి వారిని ఫాలో చేసి నెల్లూరు రావడం, అక్కడి నుంచి కృష్ణాపట్నం బీచికి వెళ్ళడం, నా అనుమానం నిజం కావడం, ముకుందరావు అతని సహచరులు ద్రోహులుగా రుజువుకావడం, పరశురామ్ వారందరికీ బేడీలు తగిలించి నెల్లూరికి తీసుకొని వచ్చి జైల్లో త్రోయడం, ముకుందరావు నన్ను నిప్పుతో చెలగాటం ఆడుతున్నావని బెదిరించడం, అంతా నేను చేచేతులా చేసుకొన్నదని అనుకోవాలా!.. లేక దైవ నిర్ణయం అని భావించాలా!.. నా ఈ చర్య పర్యవసానం, ఎంతోకాలం తరువాత కలిసిన అక్క బావ తమ్ముడు తదితరుల విషయంలో ఆ ముకుందరావు ఏ రీతిగా ప్రవర్తించబోతాడో, నావారికి నాకు ఎలాంటి సమస్యలను సృష్టిస్తాడో, అంతా అయోమయం. ఏది ఏమైనా నేను పాటించింది ధర్మం. ముకుందరావు ఆచరించింది అధర్మం. దానికి తగిన ఫలితం తప్పక ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు బుర్రను వేడి చేస్తున్నాయి. సర్వేశ్వరా!… తండ్రీ త్వమేవ శరణం,’ అంటూ హృదయపూర్వకంగా ఆ దైవాన్ని తలుచుకొన్నాడు శ్రీరామ్.. యాంత్రికంగా చేతులు స్టీరింగ్‍ని పట్టుకొని కారును ముందుకు నడుపుతున్నాడు.
రోడ్లో ఆ సమయంలో..
ఒక స్త్రీ.. ఆమె వెనకాల ఇరువురు మగవారు పరుగిడుతున్నారు.
ఆ స్త్రీ కారును సమీపించింది.
“కాపాడండి.. కాపాడండి..” బిగ్గరగా అరుస్తూ కారును అడ్డంగా నిలబడింది.
శ్రీరామ్ కారు ఆపి దిగాడు.
“ఎవరమ్మ నీవు..” ఆశ్చర్యంతో అడిగాడు.
“నన్ను ముకుందరావు మనుషులు తరుముకొస్తున్నారు. కాపాడండి సార్.. కాపాడండి” భోరున ఏడ్చింది.
ఆ ఇరువురు వ్యక్తులు కారుకు ఇరవై అడుగుల దూరానికి వచ్చారు. కారు బ్యాక్ డోర్ తెరిచాడు శ్రీరామ్.
“అమ్మా!.. నీవు కార్లో కూర్చో.. వారితో నేను మాట్లాడుతాను” అన్నాడు.
ఆమె వేగంగా కార్లో ఏడుస్తూనే కూర్చుంది.
శ్రీరామ్ తలుపును మూశాడు.
ఆ ఇరువురూ కారును సమీపించారు.
“ఎవరు మీరు?”
“మా విషయం మీకెందుకు?” ఒకడు అన్నమాట.
“మర్యాదగా ఆ అమ్మాయిని కారునుంచి దించు!” రెండవవాడి మాట.
“విషయం ఏమిటి? ఆమెకు మీకు ఏమిటి సంబంధం!” ప్రశాంతంగానే అడిగాడు శ్రీరామ్.
“ఆమెను కారునుంచి దించుతావా దించవా!..” మొదటివాడి ప్రశ్న.
“దించను.. “ శ్రీరామ్ జవాబు.
రెండవవాడు డోర్‌ను తెరవబోయాడు.
శ్రీరామ్ అడ్డు నిలబడ్డాడు.
అతను శ్రీరామ్‌ను ప్రక్కకు తోశాడు.
శ్రీరామ్‌లో ఆవేశం..
ఎడంచేత్తో బలంగా అతని ముఖాన ఒక పీకు పీకాడు.
మొదటివాడు శ్రీరామ్ పై చెయ్యి ఎత్తాడు. అతని చేతిని గట్టిగా లాగి పట్టుకొని రెండవ చేత్తో అతనికి ఒకటి తగిలించాడు.
ఆ ఇరువురికి ఆవేశం పెరిగింది. ఇరువురూ శ్రీరామ్‌పై ఎగబడ్డారు.
శ్రీరామ్ కరాటే మాస్టర్.. తన హస్త లాఘవాన్ని ప్రదర్శించాడు. మార్చి మార్చి ఇరువురినీ కొట్టాడు. శ్రీరామ్ ముష్టిఘాతాలకు కరాటే కట్స్‌కు వారు తాళలేక పరుగు తీశారు.
శ్రీరామ్.. బ్యాక్ డోర్ తెరిచాడు.
“అమ్మా!… వాళ్ళు వెళ్ళిపోయారు. భయపడకు, నీ పేరేమిటి? నీవు ఎవరు? ఎక్కడ వుంటావు?” అనునయంగా అడిగాడు శ్రీరామ్.
“సార్ నా పేరు సుశీల. నేను లేడీస్ హాస్టల్లో వుంటూ టెన్త్ క్లాస్ చదువుతున్నాను. నాకు తండ్రి లేడు, తల్లి మంగమ్మ మాత్రం ఉంది. మేము చాలా పేదవారం. మా అమ్మ నాలుగైదు ఇళ్ళల్లో పనిచేస్తూ, నన్ను చదివిస్తూ ఉంది. మా నాయన చనిపోయారు. ముకుందరావు తమ్ముడు సాంబశివరావు. మా అమ్మ వారి ఇంట్లోనూ పనిచేస్తూ ఉంది. సాంబశివరావు భార్య భవాని. వారి అబ్బాయి సాగర్ కుమార్. నేను సెలవు రోజుల్లో మా అమ్మ దగ్గరికి వచ్చేదాన్ని. ఆ రోజుల్లో ఆమెకు సాయంగా నేను, కొన్ని ఇండ్లలో పనికి వెళ్ళేదాన్ని. ఈ దశలో సెలవలో నేను మా ఇంటికి వెళ్ళి అమ్మకు బదులుగా నేను సాంబశివరావు గారి ఇంటికి పనికి వెళ్ళాను. ఆరుగంటలకు పని అంతా ముగించి, నేను భవాని అమ్మగారికి చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. గంట క్రితం ఆ ఇరువురూ మా ఇంటికి వచ్చి, భవాని అమ్మగారి ఒళ్ళు బాగాలేదని, నన్ను రమ్మన్నారని అమ్మతో చెప్పారు. ‘అమ్మ వెళ్ళి సాయం చేయమ్మా!’ అని చెప్పింది. నేను వారితో సాంబశివరావు గారి ఇంటికి వెళ్ళాను. సాగర్ కుమార్ ఇంట్లో నాకు ఎదురైనాడు. ‘అమ్మగారికి ఏమైంది? గదిలో వున్నారు?’ అడిగాను. ‘అమ్మ, అమ్మమ్మగారి వూరికి, నాన్న మా పెదనాన్న ముకుందరావు దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు ఇంట్లో వున్నది మనమిద్దరమే!..’ చెప్పి వికారంగా నవ్వాడు. సాగర్ కుమార్ నన్ను చేయిపట్టుకొని తన గదికి లాక్కొని పోబోయాడు. మనిషి తాగి వున్నాడు. నేను అతని చేతిని విదిలించుకొని బయటికి పరుగెత్తాను. వాకిట్లో వున్న ఆ ఇరువురూ నా వెంట పడ్డారు. నేను పరుగెత్తాను. వారు నన్ను ఫాలో అయ్యారు. సార్!.. నేను ఆపదలో వున్నాను. నన్ను రక్షించండి” ఏడుస్తూ శ్రీరామ్ కాళ్ళు పట్టుకొంది సుశీల.
శ్రీరామ్‌కు విషయం సాంతం అర్థం అయింది. ఆమెను రక్షించాలనుకొన్నాడు. సాగర్ కుమార్‌ను శిక్షించాలనుకొన్నాడు.
“నీవు కార్లో కూర్చో అమ్మా!.. భయపడకు. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను” అనునయంగా చెప్పాడు.
తలాడించి సుశీల కార్లో కూర్చుంది.
శ్రీరామ్ కారువున్న చోటు గ్రావెల్ రోడ్డు. హైవేకి పడమట వైపు. అక్కడికి సాంబశివరావు ఇల్లు రెండు కిలోమీటర్లు. ఆ వూరి నుంచి శ్రీరామ్ వూరికి ముఫ్ఫై కిలోమీటర్లు.
శ్రీరామ్ కారును స్టార్ట్ చేసి పది నిముషాల్లోపలే సాంబశివరావు ఇంటి ముందు ఆపాడు. కారు దిగాడు.
“సుశీలా!.. నీవు కార్లోనే వుండు. నేను పది నిముషాల్లో వస్తాను.” సుశీల జవాబుకు ఎదురు చూడకుండా వేగంగా సాంబశివరావు గారి ఇంటి వరండాను సమీపించి కాలింగ్ బెల్ నొక్కాడు శ్రీరామ్. రెండు నిముషాల్లో బెల్‌ను నాలుగు సార్లు నొక్కాడు. అప్పుడు ఇంటి వెనుక వున్న తోటమాలి చిన్నయ్య వరండాను సమీపించాడు.
“సామీ!.. తమరా!.. అమ్మ అయ్యగారు ఇంట్లో లేరు సామీ!..”
“ఆఁ.. చిన్నయ్యా ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు కాకుండా వేరెవరూ లేరా!..”
“చిన్నయ్యగోరు సాగర్ కుమార్ గారు వుండాడండే!…”
“బెల్ కొడితే తలుపు తెరువడేం?”
చిన్నయ్య నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావ్?”
“నిద్రపోతుంటాడు కదండే!”
“అంత మొద్దు నిద్రనా.. బెల్ నాలుగు సార్లు కొట్టాను. నీవు ఒకసారి ప్రయత్నించు.”
“అయ్యా!….”
“చెప్పు..”
“వారు!..”
“ఆ.. వారు!….”
“కొంచెం పుచ్చుకొని పడుకుంటారండే!..”
“అలాగా!..”
“అవునండే!..”
చిన్నయ్య బెల్ గట్టిగా కొట్టాడు. ప్రయోజనం లేకపోయింది.
“అయ్యా!.. తమరు వారిని ఇప్పుడు కలిసి తీరాల్నా?”
“అవును చిన్నయ్యా!..”
“అయితే నాతో రండి!.”
ముందు చిన్నయ్య, వెనుక శ్రీరామ్ భవంతి వెనక్కు వెళ్ళారు.
చిన్నయ్య బ్యాక్ డోర్ తెరిచాడు. ఇరువురూ భవంతిలో ప్రవేశించారు.
“ఈ తాళం నీ దగ్గర ఎలా వుంది?” అడిగాడు శ్రీరామ్.
“ఇది ఎప్పుడూ నా కాడే వుంటదండే!..”
“సాగర్ కుమార్ ఎక్కడ పడుకొంటాడు?”
“వారి గది మిద్దె మీదండే.!..”
“పద..”
ముందు చిన్నయ్య అతని వెనుక శ్రీరామ్ మేడపైకి నడిచి సాగర్ కుమార్ గదిని సమీపించారు.
చిన్నయ్య తలుపును తోశాడు. గడియ బిగించనందున అది తెరుచుకొంది.
మెట్లమీద గాజుల ముక్కలను గమనించాడు శ్రీరామ్,
‘ఆ గాజు ముక్కలు బహుశా సుశీల చేతి గాజులై వుండవచ్చు!’ అనుకొన్నాడు. సెల్ ఫోనులో ఆ గాజు ముక్కలను ఫోటో తీశాడు.
“సారో!”
“ఆఁ.”
“ఏం చేశారండే!..”
“ఫొటో తీసా!..”
“దేన్ని!”
“మిద్దె మెట్లను. చాలా బాగున్నాయ్!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్. చిన్నయ్య ఆశ్చర్యంతో శ్రీరామ్ ముఖంలోకి చూచాడు.
“మీ చిన్నయ్య గదిలోకి పద!..”
ఇరువురూ సాగర్ కుమార్, గదిలో ప్రవేశించారు.
టీపాయ్‌పై మందు బాటిల్ గ్లాస్ ఐస్ బాక్స్ వున్నాయి.
మంచంపై మత్తులో గాఢ నిద్రలో వున్నాడు సాగర్ కుమార్.
అతన్ని, టీపాయ్ పైని సరంజామానూ చిన్నయ్యను శ్రీరామ్ ఫొటోలు తీశాడు. “చిన్నయ్యా!..”
“సారూ!..”
“మీ ఈ చినబాబు సాగర్ కుమార్ మంచోడా.. చెడ్డవాడా?” అడిగాడు శ్రీరామ్.
“సార్!.. నిజం చెప్పనా? అబద్ధం చెప్పనా?”
“అబద్ధం ఏమిటో చెప్పు”
“చాలా మంచోడండే!..”
శ్రీరామ్ నవ్వాడు.
“నీవు కూడా, చాలా మంచోడివి పద..” గది నుండి బయటికి నడిచాడు శ్రీరామ్.
చిన్నయ్య తలుపు మూసి శ్రీరామ్‌ని అనుసరించాడు.
ఇరువురూ భవంతి బయటికి వచ్చారు.
చిన్నయ్య దొడ్డదారికి తాళం వేశాడు.
“చిన్నయ్యా!…”
“మీ చినబాబు వుదయాన ఎన్ని గంటలకు లేస్తాడు?”
“వారికి నిద్ర లేచేదానికి ఓ పద్ధతంటూ లేదండే.!.. ఏడు కాడ నుంచి తొమ్మిది లోపల ఎప్పుడైనా లేస్తారు!..”
“ఓకే!.. థాంక్యూ. వస్తాను. ఆ!.. మీ సాంబశివరావు ఎలాంటివాడు?”
“పరమ నీచుడండే.. డబ్బు.. డబ్బు.. డబ్బు పిచ్చోడు. కాకికి ఎంగిలి మెతుకు ఇదిలిందడండే..”
“మరి మీ యజమానురాలు?”
“ఆ తల్లి దేవతండే!.. చాలా చాలా మంచిది. ఆ తల్లి చేసే పూజలు పునస్కారాల వల్లే ఆ తండ్రి కొడుకుల ఆటలు సాగుతుండాయి”
చిన్నయ్య మాటలను శ్రీరామ్ ఫోనులో రికార్డు చేశాడు.
“మరో మాట!..”
“అడగండి సారూ!..”
“మీ పెద్దయ్య గారు ముకుందరావుగారు ఎలాంటి వాడు?”
“పరమ కర్కొటకుడు సామీ!.. ఈ తమ్ముడుకి తగిన అన్న!..”
“వారిద్దరూ బాగా పేచీలు లేకుండా పద్ధతిగా ఉంటారా!”
“మా పెద్దయ్యకు ఆ పెద్దయ్యను చూస్తే కోపం. కానీ ఆయన్ని ఈన ఎదిరించలేడు. భయపడతాడు.”
“ఓ.. అలాగా!..”
“అవును..”
“ఓకే!.. చిన్నయ్యా వస్తాను” శ్రీరామ్ వేగంగా తన కారు వైపుకు నడిచాడు.
లోన కూర్చొని, పరశురామ్‌కు ఫోన్ చేశాడు. తాను తీసిన ఫొటోలు రికార్డు చేసిన సంభాషణ పరశురామ్‌కు పంపాడు.
విషయాన్నంతా చెప్పి, పోలీసులను పంపి సాగర్ కుమార్‌ని అరెస్టు చేయమని చెప్పాడు శ్రీరామ్. తన వూరికి బయలుదేరాడు.
పోలీసులు ఆ గ్రామానికి వచ్చి నిద్రిస్తున్న సాగర్ కుమార్‌ని లేపి, అరెస్టు చేసి జీప్ ఎక్కించి నెల్లూరు వైపుకు పోయారు. పెద్దయ్య ఆశ్చర్యపోయాడు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
