Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-19

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[దేవాలయాల విగ్రహాలను విదేశాలకు అమ్ముతూ అక్రమాలకు పాల్పడిన ముకుందరావును తన స్నేహితుడైన పోలీస్ అధికారి పరశురామ్ సహాయంతో జైల్లో పెట్టించి శ్రీరామ్ కారులో తిరుగు ప్రయాణమౌతుండగా, మార్గమధ్యంలో ముకుందరావు మనుషుల నుండి ప్రాణభయంతో పారిపోతున్న సుశీల అనే పేద అమ్మాయి అతనికి ఎదురవుతుంది. ముకుందరావు తమ్ముడైన సాంబశివరావు ఇంట్లో పని చేసే సుశీలను, అతని కొడుకు సాగర్ కుమార్ మద్యం మత్తులో వేధించడానికి ప్రయత్నించాడని తెలుసుకున్న శ్రీరామ్, ఆ గూండాలతో పోరాడి ఆమెను రక్షించి ధైర్యం చెప్తాడు. వెంటనే సాంబశివరావు ఇంటికి వెళ్లి, అక్కడ తోటమాలి చిన్నయ్య సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి, మత్తులో నిద్రిస్తున్న సాగర్ కుమార్ రూమ్‌లోని ఆధారాలను, గాజు ముక్కలను ఫోటోలు తీసి, చిన్నయ్య ద్వారా వారి గురించిన నిజాలను ఫోన్లో రికార్డు చేస్తాడు. తరువాత శ్రీరామ్ ఆ ఆధారాలన్నింటినీ పోలీస్ అధికారి పరశురామ్‌కు పంపించి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వచ్చి నిద్రిస్తున్న సాగర్ కుమార్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. – ఇక చదవండి.]

అధ్యాయం-20

ఊరికి చేరిన శ్రీరామ్ సుశీలను తన అక్క శాంతికి పరిచయం చేసి, జరిగిన విషయాలన్నీ తన వారందరికీ తెలియజేశాడు.

సుశీల చేత, ఆమె విషయంలో సాగర్ కుమార్, ప్రవర్తించిన తీరును వివరంగా రిపోర్టు వ్రాసి, సుశీల ఫొటోను తీసి, రిపోర్టును ఫొటోను పరశురామ్‌కు పంపాడు. సుశీల రక్షణ బాధ్యతను శ్రీరామ్ అక్క శాంతికి అప్పగించాడు. పరశురామ్, సాగర్ కుమార్ మీద కేసు పెట్టాడు. అరెస్టు చేసి సాగర్ కుమార్‌ను జైల్లో త్రోశాడు.

ముకుందరావును, వారి తమ్ముడు సాంబశివరావు జైల్లో కలుసుకొన్నాడు. ముకుందరావు జరిగిన విషయాన్నంతా తమ్ముడికి చెప్పి, వెంటనే తనకు, తన అనుచరులు ముగ్గురికీ బెయిల్ ఏర్పాటు చేయమన్నాడు.

ఆ సోదరులకు రాష్ట్రపాలన వర్గంలో వున్న పరపతి పలుకుబడితో వారికి, సాగర్ కుమార్‌కు బెయిల్ మంజూరైంది.

ఆ సందర్భంలో వారంతా ఆనందంతో వారి ఊర్లో పండగలా మందూ విందులను జరుపుకొన్నారు ఆ ముగ్గురు రాక్షస మూక.

సాంబశివరావు ఇంటి నౌకర్ పెద్దయ్యకు ప్రక్క వూరి వారైన శాంతి, శ్రీరామ్‌ల కుటుంబం పట్ల ఎంతో గౌరవం, విశ్వాసం, కారణం ఆ కుటుంబ సభ్యులందరి మంచితనం మానవతావాదం. ముఖ్యంగా భారతి, ఆ ప్రాంతపు ఎం.ఎల్.ఎ. మినిస్టర్‌గా అన్ని గ్రామాలకు ఆమె చేసిన మంచిపనులు, పేదవారిని ఆమె అభిమానించి, ఆదరించే తీరు.

జరిగిన దుస్సంఘటనలు శ్రీరామ్ మనస్సును చాలా వ్యాకులపరిచాయి. తన అక్క శాంతి తనకు చెప్పిన విషయాలనన్నింటినీ, చిన్నారావు (ముకుందరావు కొడుకు) ను భారతి కాల్చి చంపిన విషయం, ఆ కారణంగా ఆ రెండు కుటుంబాల మధ్యన ఏర్పడిన విభేదాలను గురించి ఆలోచించాడు. దానికి తోడు ప్రస్తుతం తన మూలంగా జరిగిన ముకుందరావు, సాగర్ కుమార్ అరెస్టు కారణంగా వారికి తన కుటుంబంపై ఇంకా తీవ్రమైన పగ, ద్వేషం పెరగవచ్చు. ప్రతీకార వాంఛతో వారు తన కుటుంబ సభ్యులకు కష్టనష్టాలు కలిగిస్తారేమో అనే అనుమానం శ్రీరామ్ మనస్సుకు శాంతి, ప్రశాంతతలను దూరం చేశాయి.

తన కుటుంబ సభ్యులనందరినీ ఒకచోట చేర్చాడు శ్రీరామ్.

“అందరూ నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి. ఆగ్రహావేశాలు మానవుని దానవునిగా మారుస్తాయి. నేను రాకముందే మీకు ముకుందరావు కుటుంబానికి సమస్య వుంది. నేను వచ్చిన తర్వాత నా కారణంగా మరో సమస్య తయారైంది. అంటే ప్రస్తుతంలో ఆ ముగ్గురు ముకుందరావు, సాంబశివరావు, సాగర్ కుమార్‌లు మనకు బద్ధ శత్రువులౌతారు. మనపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకొంటారు. కనుక మనమందరం చాలా జాగ్రత్తగా వర్తించవలసిన సమయం ఇది. కనుక బావా, భారతి, చలపతి, నరసింహరాయుడు, మీరు పబ్లిక్‌లో తిరిగే మనుషులు. చాలా అప్రమత్తతో సంచరించడం ఎంతైనా అవసరం. నేను ఒకటి అనుకొని వస్తే, ఇక్కడ మరొకటి జరిగింది. అన్యాయాన్ని అధర్మాన్ని సమర్థించడం నా చేత కాదు. మీకు చెప్పిన మాటలన్నీ మీకే కాదు, నాకూ వర్తిస్తాయి. కనుక మనమందరం ఆవేశానికి దూరంగా వుంటూ, సహనంతో సత్ చింతనతో ఎల్లప్పుడూ వర్తించాలి” ఎంతో ఆవేశంతో చెప్పిన శ్రీరామ్ తన ప్రసంగాన్ని ఆపాడు.

అందరూ శ్రీరామ్‌ను పరిశీలనగా చూచాడు.

“అక్కా, బావా, భారతి, చలపతీ, మీరు నా నిర్ణయంపై మీ అభిప్రాయాలను చెప్పండి. మరో మాట. నేను మన హైందవ జాతి ప్రగతి కోసం, మన భారత వాసులందరి సఖ్యత కోసం ఒక దిన పత్రికను ప్రారంభించాలనుకొంటున్నాను. దానికి కావలసిన కార్యాలయాలను విశాఖ పట్నంలో, ఇక్కడ నిర్మించాలనుకొంటున్నాను. ఈ విషయంలో అక్కా, బావా మీ అభిప్రాయం ఏమిటి?” అడిగాడు శ్రీరామ్.

“ప్రతి రోజూ ఏఏ ప్రాంతాల్లో మంచి చెడ్డ ఏమేమి జరుగుతున్నాయో, మనకు తెలియజేయడానికి ఆయా ప్రదేశాల్లోని స్థానికులు మనకు ఏజెంట్లుగా వుండి తెలియజేయాలిగా!..” అడిగాడు ఆనందరాయుడు.

“అవును బావా!.. ఏజెంట్లు కావాలి. ఆ హోదాకు యువకులు, విద్యావంతులైన మన B.S.S. సంస్థ కార్యకర్తలు తగినవారు. వారికే ఆ బాధ్యతను (న్యూస్ సేకరణ) అప్పగిస్తాం.”

“ఎస్, మామయ్యా!.. మీ అభిప్రాయం పర్ఫెక్ట్. రైట్.” చిరునవ్వుతో చెప్పింది భారతి.

“అవును రామా!.. భారతి భావనే నా భావన” అంది శాంతి.

“అన్నా!.. ఇంక ఆలస్యం ఎందుకు. వెంటనే బిల్డింగ్ నిర్మాణాన్ని మన తోటలో మనం చూచిన చోట ప్రారంభిద్దాం. నా మిత్రుడు ఒకడు ఆర్కిటెక్చర్, బిల్డర్‌గా నెల్లూరులో వున్నాడు. వారిని రమ్మని పిలవనా?” అడిగాడు చలపతి.

“ఆఁ.. పిలూ!.. మాట్లాడుదాం.”

చలపతి తన మిత్రులు ద్వివేదికి ఫోన్ చేశాడు. అతను రెండు గంటలకల్లా వారి ఇంటికి వస్తానని చెప్పాడు.

సమయం ఒంటిగంట.. భోజనాల సమయం.

“అమ్మ వంట అంతా అయ్యింది అమ్మా! మీరు చెప్పినవన్నీ చేశాను. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను” చిరునవ్వుతో చెప్పింది ముత్యాలమ్మ.

అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు. స్థాపించాలనుకొన్న సంస్థను గురించి మాట్లాడుకొంటూ భోంచేశారు.

“ఆఁ… మామయ్యా!..”

“ఏంటి భారతీ!..”

“ఇంతకీ పత్రికకు ఏం పేరు పెట్టాలనుకొన్నారు?” అడిగింది భారతి.

“నీపేరే!.. భారత అవని. ఎలా వుంది?” అడిగాడు శ్రీరామ్.

“అద్భుతం” అన్నాడు ఆనందరాయుడు గారు.

“మరి ఎడిటర్‌గా ఎవరిని నియమిస్తావు రామా!” అడిగింది శాంతి.

“గొప్ప అనుభవజ్ఞులు పండితులూ అయిన సాంబశివం మాస్టారుగారిని ఎన్నిక చేశానక్కా!..”

“వారిని అడిగావా?”

“లేదక్కా అడగాలి!”

“అన్నా! నే వెళ్ళి మాస్టారు గారిని పిలుచుకొస్తాను.” చలపతి వేగంగా భోజనం ముగించి బుల్లెట్ పై మాస్టార్ ఇంటి వైపుకు వెళ్ళాడు. పావుగంటలో సాంబశివం మాస్టార్ గారితో ఇంటికి తిరిగి వచ్చాడు చలపతి.

ఆ ఇరువురూ భారతి ఆఫీసు గదిలో ప్రవేశించారు. భోజనానంతరం అందరూ ఆ గదిలోనే కూర్చొని వున్నారు. అందరూ మాస్టారు గారికి నమస్కరించారు.

“ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. శతవర్షం సదా సంతోషం ప్రాప్తిరస్తు” చిరునవ్వుతో కుడిచేతిని ఎత్తి అందరినీ దీవించారు మాస్టారు.

“మాస్టారు గారూ!.. కూర్చోండి సార్!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

సాంబశివం మాస్టారు గారు కూర్చున్నారు.

“సార్!..” పిలిచింది భారతి.

“ఏం అమ్మా భారతీ!..”

“మా పెద మామయ్యగారు ఒక దినపత్రికను ప్రారంభించదలిచారు మాస్టారుగారూ!.. దానికి చీఫ్ ఎడిటర్‌గా మీరు వర్తించాలి” చిరునవ్వుతో చెప్పింది భారతి.

“మాస్టారుగారూ!.. తమరు అంగీకరించాలి” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు ఆనందరాయుడు.

“అవును గురువుగారూ!… మీరు ఆ బాధ్యతను తప్పక స్వీకరించాలి” అంది శాంతి.

“సార్!.. సరే అనండి” నవ్వుతూ చెప్పాడు చలపతి.

సాంబశివం మాస్టారు మౌనంగా ఆలోచించసాగాడు.

“సార్!.. మీరు సరే అనాలి” అన్నాడు నరసింహరాయుడు.

అందరూ మాస్టారుగారి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూన్నారు.

“సార్!.. తమరు..” శ్రీరామ్ పూర్తిచేయకముందే..

“శ్రీరామా!.. నీ నిర్ణయం చాలా మంచిది. కానీ.. ఎడిటర్ బాధ్యతను నేను ఈ వయస్సులో సక్రమంగా నిర్వహించలేనేమో అని నా సందేహం!” మెల్లగా చెప్పాడు సాంబశివం మాస్టారు.

“ఆ పదవికి మీకంటే యోగ్యులు వేరెవరూ లేరు సార్!.. మీరు మా కోర్కెను మన్నించాలి” అన్నాడు ఆనందరాయుడు.

“సహాయకంగా మీరు మన B.S.S. సంస్థ సభ్యులలో ఎవరినైనా నిర్ణయించండి. మేమంతా మీ శిష్య వర్గమే కదా!” అన్నాడు శ్రీరామ్.

“B.S.S స్థాపకుడు, నా ప్రియ శిష్యుడు రాంబాబు ప్రస్తుతంలో జైల్లో వున్నాడు. హత్యా నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడు. దానికి కారణం ముకుందరావు.”

“అంటే!.. కాస్త వివరంగా చెప్పండి సార్!..”

“రాంబాబు గొప్ప ఆదర్శవాది. ప్రస్తుతంలో మన దేశంలో వున్న మూడు గొప్ప మతాలు హిందూయిజం, క్రిస్టియానిటీ, క్రైస్తవం, ఇస్లాం ఆ మూడు గొప్ప మతాల సఖ్యత కోసం రాంబాబు అతనిహితులు రాబర్ట్, రహీమ్‌లు B.S.Sను స్థాపించారు. వారి సిద్ధాంతాలు నచ్చని ముకుందరావు తన హితుడైన ఉమర్, ఏసులను B.S.S. కార్యాలయానికి వారి (B.S.S.) చర్యలను అరికట్టేదానికి పంపాడు.

ఉమర్ ఏసులు రాంబాబు, రాబర్ట్, రహిమ్‌లు స్థాపించిన B.S.Sను గురించి విమర్శించారు. ఆ సమయంలో అక్క రాంబాబు తండ్రి శివశర్మ, రాబర్ట్ తండ్రి సత్యయ్య, రహీం తండ్రి సయ్యద్ అక్కడే వున్నారు. శివశర్మ, సత్యయ్య, సయ్యద్లు దాదాపు ఒకే వయస్సువారు. ఆ ముగ్గురూ శివశర్మ తండ్రిగారు, నాకు బావగారైన పరమేశ్వరశర్మ గారి ప్రియ శిష్యులు. ఆ ముగ్గురూ చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. ఇప్పటికీ అలాగే వున్నారు. వారి పిల్లలు రాంబాబు, రాబర్ట్, రహీమ్‌లు B.S.S. సంస్థను స్థాపించడానికి, సిద్ధాంతాలను వ్రాసి వారికి చూపించారు. ఆ ముగ్గురు పెద్దలు ఆ పిన్నల ఆశయం బాగా నచ్చింది. దేశ సమైక్యతకు ఆ మూడు వర్గాలు (హిందూఇజం, క్రిస్టియానిటీ, ఇస్లాం) సంఘీభావనతో పరస్పర సఖ్యతతో కలిసి మెలిసి భారత సమాజ ప్రగతిని సాధించాలనే తమ పిల్లల ఆదర్శ భావాలను మెచ్చి, వారు ముగ్గురూ B.S.S స్థాపనకు కొంత విరాళాలను ఇచ్చి, తమ పిల్లలను ప్రోత్సహించారు. అది నచ్చని ముకుందరావు ప్రేరణతో అతని హితులు ఉమర్, ఏసులు B.S.S కార్యాలయానికి వచ్చి రాంబాబు, రాబర్ట్, రహీమ్‌లతో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయాన ఏసు కుమారుడు జీజస్ అక్కడికి వచ్చాడు. అంతకు ముందు అక్కడ, B.S.S సంస్థలో చేరవచ్చిన కొందరు విద్యావంతులైన ఆడపిల్లలు, మగపిల్లలూ కూడా వుండినారు. వారిలో ముకుందరావు పెంపుడు కూతురు అరుణ, ఉమర్ కూతురు సజ్జాది, ఏసు కూతురు మేరీ కూడా వున్నారు. ఉమర్ వారిని చూచి ‘మీకెందుకమ్మా ఈ అసోసియేషన్, తిన్నది అరక్క ఆ ఎదవలు ఏదేదో వాగుతున్నారు. మీరు వెళ్ళిపొండి’ అన్నాడు.

‘ఉమర్ బాబాయ్!.. మీరు ముకుందరావు పంపగా, మేము ఏం చేస్తున్నామో, చూడాలని వచ్చారు. చూచారుగా!.. ఇక మీరు వెళ్ళండి’ అన్నాడు రాంబాబు.

ఉమర్, అన్న ఎదవలు అన్నమాట కారణం రాంబాబు, రాబర్ట్, రహీమ్‌లకు ఆవేశం కలిగింది. మాటలు పెరిగి వాదన జరిగింది. ఆవేశంతో జీజస్ రాంబాబు చెంపపై కొట్టాడు. రాంబాబు తలను ప్రక్కకు త్రిపడంతో వారి ముందున్న ముకుందరావు పెంపుడు కూతురు అరుణ చెంపకు జీజస్ చెయ్యి బలంగా తగిలింది. ఆమె బాధతో ఏడవసాగింది. రాంబాబు ఆవేశంతో జీజస్ తలపై కొట్టాడు. మిగతా ఆడపిల్లలు అరుణకు మంచినీరు తాగించి ఓదార్చారు. జీజస్ తూలి నేలకు ఒరిగాడు. ఏసు ఆందోళనతో కొడుకు చెంతకు చేరాడు.

ఉమర్ జీజస్‌ను తాకి చూచాడు. అతను స్పృహను కోల్పోయాడు. వేగంగా వీధిలోకి పరుగెత్తి వెళుతున్న ఆటోను ఆపి, ఇంట్లోకి పరుగెత్తి జీజస్‌ను భుజాన వేసుకొని ఆటోలో వుంచాడు. ఏసు పరుగెత్తుకొంటూ వెళ్ళి ఆందోళన, కన్నీటితో, ఆటోలో కూర్చున్నారు. ఉమర్ చెప్పినట్లుగా, ఆటో డ్రైవర్ జీజస్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. కానీ డాక్టర్లు జీజస్ చనిపోయాడని చెప్పారు. ఆ మాట నిజమో.. ముకుందరావు సలహా ప్రకారం ఏసు రాంబాబు పైన కేసు పెట్టాడు. మూడు మాసాలు నాలుగైదు సార్లు ఆ కేసు విచారణ జరిగింది. చివరకు సాక్ష్యాల ఆధారంగా రాంబాబుకు మూడు సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. రాంబాబు మరో సంవత్సరం జైలు శిక్షను అనుభవించాలి కానీ.. అతనికి పడిన ఆ శిక్ష కారణంగా యువతలో మంచి చైతన్యం కలిగింది. చాలామంది యువతీ యువకులు B.S.S.లో చేరారు. ముకుందరావు పెంపుడు కూతురు అరుణ అతన్ని ఎదిరించి తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి B.S.Sలో ప్రముఖ స్త్రీ సభ్యురాలిగా నిలిచింది. ప్రస్తుతం నాకు సబ్ ఎడిటర్‌గా ఆ అరుణను తీసుకోవడం మంచిది. ఆమె చాలా తెలివికలది” అన్నారు సాంబశివం మాస్టారు.

అందరూ వారి ప్రతిపాదనకు ఆమోదించారు.

చలపతి స్నేహితుడు ఆర్కిటెక్ట్ కారు వచ్చి పోర్టికోలో ఆగింది. చలపతి ద్వివేదికి ఎదురు వెళ్ళాడు. నవ్వుతూ కరచాలనం చేశాడు. ఆ ఇరువురూ ఆ గదిలో ప్రవేశించారు, కూర్చున్నారు.

చలపతి తన మిత్రుడిని అందరికీ పరిచయం చేశాడు. త్రిపాఠి సవినయంగా పెద్దలందరికీ నమస్కరించాడు.

చలపతి త్రిపాఠితో తన అన్నగారి నిర్ణయాన్ని తెలియజేశాడు.

“ఒకసారి మనం ఆ భవనాన్ని నిర్మించబోయే స్థలాన్ని చూడాలి” అన్నాడు త్రిపాఠి.

చలపతి, శ్రీరామ్, త్రిపాఠిలు వారి తోటకు కార్లో వెళ్ళారు. త్రిపాఠి సైట్ అంతా చూచుకొని తనకు కావలసిన ఇన్ఫర్మేషన్‌ను నోట్ చేసుకొన్నారు.

“సార్!.. వారంలోపల నేను మీకు బిల్డింగ్ డిజైన్ చూపిస్తాను. మీరు ఏదైనా మార్పులు సూచిస్తే మార్చి ఫైనల్ చేస్తాను. బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాను. నాకు తెలిసిన మంచి కాంటాక్టర్ రాజశేఖర్ వున్నారు. అతనిచేత నిర్మాణాన్ని కొనసాగిద్దాం” అన్నాడు త్రిపాఠి.

“అలాగే సార్.. టూ ఫ్లోర్స్, పదిహేను వందలు ఎస్.ఎస్. టీ.. నిర్మాణకాలం ఎంత అవుతుంది సార్!..” అడిగాడు శ్రీరామ్.

“ఫైవ్ మంత్స్ సార్!..” త్రిపాఠి జవాబు.

“ఓకే సార్!.. వీలైనంత త్వరలో పని ప్రారంభించేలా చూడండి” అన్నాడు శ్రీరామ్.

“అలాగే సార్!..” నవ్వుతూ చెప్పాడు త్రిపాఠి.

ముగ్గురూ వారి ఇంటికి వెళ్ళారు. కూర్చున్నారు.

అందరికీ ముత్యాలమ్మ టీ గ్లాసులను అందించింది.

అందే సమయానికి శ్రీరామ్ స్నేహితుడు DSP పరశురామ్ కారులో వచ్చి దిగాడు. అతన్ని చూచిన శ్రీరామ్ పరుగున అతన్ని సమీపించాడు.

“ఏరా పరశు!.. ఫోన్ చేయకుండానే వచ్చావ్?” ఆత్రంగా అడిగాడూ శ్రీరామ్.

పరశురామ్ చిరునవ్వు నవ్వాడు.

“నాకూ టీ ఇప్పించు”

ఇరువురూ ఆ గదిలో ప్రవేశించారు.

శ్రీరామ్ టీ త్రాగుతూ తన మిత్రుడు పరశురాము అందరికీ పరిచయం చేశాడు. త్రిపాఠి వారితో చెప్పి తన కారువైపుకు నడిచాడు.

ముత్యాలమ్మ పరశురామ్‌కు టీ కప్ను అందించింది.

చిరునవ్వుతో శ్రీరామ్‌ను చూస్తూ టీ త్రాగసాగాడు పరశురామ్.

“అమ్మా!.. మీ పేరేంటి?” నిలబడి తన్నే చూస్తున్న ముత్యాలమ్మను అడిగాడు పరశురామ్. ముత్యాలమ్మ తన పేరును చెప్పింది. టీ త్రాగడం ముగించాడు పరశురామ్.

“టీ చాలా బాగుందిరా!..” నవ్వుతూ చెప్పాడు పరశురామ్.

“సరే!… విషయం ఏమిటో చెప్పు!” అడిగాడు శ్రీరామ్.

పరశురామ్ ఏం చెప్పబోతున్నాడో అని అందరూ అతని ముఖంలోకి చూస్తున్నారు.

“విషయాలు రెండు. ఆడపిల్లలను గల్ఫ్ కంట్రీస్‌కు ఎగుమతి చేసే ముస్తాఫా, విశాఖపట్నం వాసిని పోలీసులు పట్టుకొన్నారు. హార్బర్లో దొరికాడు. జైల్లో వేసి బడిత పూజ చేయడంతో ముస్తఫా ముకుందరావు, మరికొందరి పేర్లు కడప, గుంటూరు, హైదరాబాద్ వాళ్ళను గురించి చెప్పాడు. హార్బర్లో నలభై మంది బాలికలను మావారు రక్షించారు. ముకుందరావును మరలా అరెస్టు చేసి జైలుకు పంపి వస్తున్నాను. ఇక రెండవ విషయం ముకుందరావు ప్రభావంతో నాకు విశాఖపట్నం ట్రాన్స్‌ఫర్ అయింది. రేపే నా విశాఖ ప్రయాణం” చిరునవ్వుతో చెప్పాడు పరశురామ్.

“నేనూ నా కూతురు గంగను స్కూల్లో చేర్పించాలి. అందుకని రేపు ఉదయం వైజాగ్ బయలుదేరుతాను. నీవు రాత్రికి వుంటావా? నెల్లూరు వెళతావా?” అడిగాడు శ్రీరామ్.

“వెళతాను” పరశురామ్ జవాబు.

కుర్చీ నుంచి లేచి అందరికీ చెప్పి బయలుదేరాడు. నెల్లూరికి పరశురామ్. శ్రీరామ్ అతన్ని సాగనంపాడు.

మరుదినం ఉదయం ఏడు గంటలకు శ్రీరామ్, గంగలు కార్లో నెల్లూరులో పరశురామ్‌తో కలసి వైజాగ్ వెళ్ళిపోయారు.

(ఇంకా ఉంది)

Exit mobile version