Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-2

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[లండన్‌లో ఓ ప్రముఖ యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు శ్రీరామ్. అతని సొంతూరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఆ రోజు టివిలో వార్తలు చూస్తూ, ఆంధ్రరాష్ట్రంలో సంబవిమ్చిన పెను తుఫాను గురించి తెలుసుకుంటాడు. నిద్రలో ఓ కల వస్తుంది. ఆ కలలో తమ ఇంటి మీద పిడుగు పడినట్టు అనిపిస్తుంది. ఆ ఇంట్లో ప్రస్తుతం అతని అక్క శాంతి, బావ ఆనందరాయుడు, వాళ్ళు కూతురు భారతి, కొడుకు నరసింహరాయుడు, శ్రీరామ్ తమ్ముడు చలపతి ఉంటున్నారు. ఒక్కసారిగా మెలకువ వస్తుంది శ్రీరామ్‌కి. ఇది నిజం కాకూడదు అని అనుకుంటాడు. తను భారత్ విడిచిపెట్టి వచ్చి  28 ఏళ్ళయ్యాయి. తనవారంతా గుర్తొస్తారు. బ్రతికున్నారో లేదో అనుకుంటాడు. తాను అసలు ఇల్లు వదిలి పెట్టి ఎందుకు లండన్ రావాల్సి వచ్చిందో గుర్తు చేసుకుంటాడు. ఇక లండన్ వదిలి, శాశ్వతంగా భారత్‌లో స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. మర్నాడు యూనివర్శిటీకీ వెళ్ళి డీన్‌కి రాజీనామా సమర్పిస్తాడు. తోటి ప్రొఫెసర్స్‌కి, విద్యార్థులకీ, సిబ్బందికీ ధన్యవాదాలు చెప్తాడు. కూతురు గంగ ఉంటున్న హాస్టల్‌కి వెళ్తాడు. అతని భార్య రోజీ గంగకి ఒకటిన్నర ఏళ్ళ వయసుండగా మరణించింది. ఇప్పుడు గంగకి పదేళ్ళు. భారత్‌కు వెళ్తున్నామని గంగకి చెప్తాడు. మళ్ళీ ఇక్కడికి రామా అని గంగ అడిగితే, రావాలని లేదంటాడు శ్రీరామ్. ఇల్లు, కారుని అమ్మేస్తాడు. సాయంత్రం రోజీ సమాధి వద్దకు వెళ్ళి పుష్పగుచ్ఛాలను ఉంచుతారు. గంగ తల్లిని తల్చుకుని కన్నీళ్ళు పెడుతుంది. శ్రీరామ్ కూడా భార్యని తలచుకుని ఉద్వేగానికి లోనవుతాడు. ఇంటికి చేరి, భోం చేసి, తన గదిలో మంచం మీద వాలాకా, రోజీతో తనకి ఎలా పరిచయమైందో జ్ఞాపకం చేసుకుంటాడు. తన డిపార్ట్‌మెంట్ లోనే రోజీ లెక్చరర్‌గా చేరుతుంది. ఆమె స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు. తన తల్లి తెలుగు మహిళ అనీ, నాన్న బ్రిటీషర్ అనీ, వాళ్ళది ప్రేమ వివాహమనీ చెప్తుంది రోజీ. కొద్దికాలానికే రోజీ అతనికి నచ్చడం మొదలుపెడుతుంది. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-3

యూనివర్శిటీలో ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో రోజీ శ్రీరామ్‌ను కలిసేది. కుశల ప్రశ్నలు వేసేది.

ఒక్కోసారి శ్రీరామ్ గదికి వచ్చేది. సబ్జెక్ట్‌కు సంబంధించిన సందేహాలను అడిగేది.

శ్రీరామ్ చిరునవ్వుతో ఆమెకు సమాధానాన్ని వివరించేవాడు. కృతజ్ఞతాభావంతో రోజీ కళ్ళు ఆనందంతో మెరిసేవి. ఆ కంటి మెరుపులను చూచి శ్రీరామ్ ఎంతగానో సంతోషించేవాడు.

ఒక్కోసారి ఇరువురికి ఫ్రీ టైంలో క్యాంటిన్‌కు వెళ్ళేవారు. కలిసి కాఫీ త్రాగేవారు. దేశ విదేశాల కబుర్లు చెప్పుకొనేవారు.

ఒకనాడు.. ఇరువురూ క్యాంటిన్లో వుండగా..

“రోజీ!..”

“చెప్పండి సార్!”

“మా పవిత్ర భారత..” శ్రీరామ్ పూర్తిగా చెప్పకముందే..

“సార్!..”

“ఏంటి రోజీ!..”

“మా అనేదాని కన్నా.. మన అంటే బాగుంటుంది కదా!” అందంగా నవ్వింది రోజీ..

కొన్ని క్షణాలు రోజీ ముఖంలోకి చూచాడు శ్రీరామ్.

‘ఈమె, మన అనడంలో, తనకు నామీద వున్న ప్రేమ సూచన కాదు గదా!..’ అనుకొన్నాడు.

“సార్!.. తప్పుగా అన్నానా?” ఆశ్చర్యంతో చూచింది రోజీ శ్రీరామ్ ముఖంలోకి.

“లేదు. కరెక్టుగా అన్నావ్!” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

“ఆఁ.. మీరు చెప్పాలనుకొన్నది చెప్పండి సార్!..”

“మన పవిత్ర భారత దేశంలో నేడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వున్నాయి. రాష్ట్రాల పేర్లు మొదటి అక్షరాలను ఒక దోహంలో క్రమంగా పేర్కొన్నారు ఒక మహనీయుడు. అది అత్యంత ఆశ్చర్యకరం. నేను చెప్పబోయే దోహ (క్రమం) లోని అక్షరాల వరుసనూ, రాష్ట్రాల పేర్లను మొదటి అక్షరాలను గమనించు. నేను చెప్పేది శ్రీరామ మంత్రం.

రామ నామ జపతే

అత్రి మత గుసి ఆఉ

పంకమె ఉగోహామి

అహికే ఛబిఝాఓ

జేబు నుండి కాగితాన్ని తీసి ఆ అక్షరాలను వ్రాశాడు శ్రీరామ్. రోజీ ఆ అక్షరాలను చూచింది, చదివింది.

“నీవు చదువుతావా!” అశ్చర్యంతో అడిగాడు శ్రీరామ్.

“యస్ సార్!..” నవ్వుతూ చెప్పింది రోజీ.

క్షణం తర్వాత..

“కానీ.. ఈ అక్షరాలు ఏమిటో నాకు అర్థం కాలేదు సార్” బుంగమూతితో అంది. శ్రీరామ్ ఆమె వాలకాన్ని చూచి నవ్వాడు.

“మీ నవ్వులోని అర్థం షేమ్.. పేమ్ అనా?” ప్రశ్నార్థకంగా చూచింది రోజీ.

“కాదు.. వివరణ చెబుతాను విను.

  1. రా.. అంటే రాజస్థాన్ – జయపూర్ క్యాపిటల్.
  2. మ.. అంటే మహారాష్ట్ర – ముంబై క్యాపిటల్
  3. నా.. అంటే నాగాలాండ్ – కోహిమ క్యాపిటల్.
  4. మ .. అంటే మణిపూర్ – ఇంపాల్ క్యాపిటల్.
  5. జ.. అంటే జమ్మూ కాశ్మీర్ – సమ్మర్‌లో శ్రీనగర్ క్యాపిటల్, వింటర్‍లో జమ్మూ క్యాపిటల్.
  6. ప.. అంటే పశ్చిమ బెంగాల్ – కోల్‌కత్తా క్యాపిటల్.
  7. తే.. అంటే తెలంగాణ – హైదరాబాద్ క్యాపిటల్.
  8. అ.. అంటే అస్సామ్ – డిస్పూర్ క్యాపిటల్.
  9. త్రి.. అంటే త్రిపుర – అగర్తల క్యాపిటల్.
  10. మ.. అంటే మధ్యప్రదేశ్ – భోపాల్ క్యాపిటల్.
  11. త అంటే తమిళనాడు – చెన్నె క్యాపిటల్.
  12. గు.. అంటే గుజరాత్ – గాంధీనగర్ క్యాపిటల్.
  13. సి.. అంటే సిక్కిం – గాంగ్‌టక్ క్యాపిటల్.
  14. ఆ.. అంటే ఆంధ్రప్రదేశ్ – అమరావతి క్యాపిటల్.
  15. ఉ.. అంటే ఉత్తరప్రదేశ్ – లక్నో క్యాపిటల్.
  16. పం.. అంటే పంజాబ్ – ఛండీఘర్ క్యాపిటల్.
  17. క.. అంటే కర్ణాటక – బెంగుళూరు క్యాపిటల్.
  18. మే.. అంటే మేఘాలయ – షిల్లాంగ్ క్యాపిటల్.
  19. ఉ.. అంటే ఉత్తరాఖండ్ – వింటర్‌లో డెహ్రాడూన్ క్యాపిటల్. సమ్మర్‌లో గైర్‌సైన్ క్యాపిటల్.
  20. గో.. అంటే గోవా – పనజీ క్యాపిటల్.
  21. హ.. అంటే హరియానా – చండీఘర్ క్యాపిటల్.
  22. మి.. అంటే మిజోరం – ఐజ్వాల్ క్యాపిటల్.
  23. అ.. అంటే అరుణాచల ప్రదేశ్ – ఈటానగర్ క్యాపిటల్.
  24. హి.. అంటే హిమాచల ప్రదేశ్ – సిమ్లా క్యాపిటల్.
  25. కే.. అంటే కేరళ – తిరువనంతపురం క్యాపిటల్.
  26. ఛ.. అంటే ఛత్తీస్‌ఘర్ – రాయ్‌పూర్ క్యాపిటల్.
  27. బీ.. అంటే బీహార్ – పాట్నా క్యాపిటల్.
  28. ఝా.. అంటే ఝార్ఖండ్ – రాంచీ క్యాపిటల్,
  29. ఒ.. అంటే ఒడిస – భువనేశ్వర్ క్యాపిటల్.

ఆ తొలి అక్షరాలు యదార్థంగా అద్భుతమైన అక్షరాలు. ఆ శ్రీరామ మంత్రం మధురానుభూతిని కలిగిస్తాయి.

“ఎలా వుంది రోజీ!..” నవ్వుతూ అడిగాడు శ్రీరామ్.

“హో!.. గ్రేట్ గ్రేట్ సార్!.. మీరు నాకు తెలియని గొప్ప విషయాన్ని చెప్పారు. మన ‘భారత అవని’ గొప్పతనాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు సార్!..” చిరునవ్వుతో చెప్పి చేతులు జోడించింది రోజీ.

“అవును!.. ఒక ప్రశ్న రోజీ..” అన్నాడు శ్రీరామ్.

“అడగండి సార్!..”

“లండన్లో చూడవలసిన ముఖ్య ప్రదేశాలు నీకు తెలుసా!..”.

“ఆ.. తెలుసు సార్!..”

“చెప్పు..”

“1. వెస్ట్ మినిస్టర్ అబ్బే.. 2. బకింగ్ హోమ్ ప్యాలెస్ 3. బిగ్ బిన్.. 4. లండన్ ఐ.. 5. బ్రిటీష్ మ్యూజియం.. 6. మడమి ట్రసవ్ డస్.. 7. టవర్ బ్రిడ్జ్ 8. సెయింట్ పాల్ కెత్రెడల్.. 9. బొరావుత్ మార్కెట్.. 10. టవర్ ఆఫ్ లండన్..”

“వాటన్నింటినీ చూడాలి రోజీ !..”

“నేను మీకు చూపిస్తాను సార్!”

“ఈ సండే కొన్ని ప్రాంతాలకు వెళదామా?”

“ఆ.. తప్పకుండా సార్!..”

“థాంక్యూ రోజీ!..”

“సార్!.. మీరు నాకు థాంక్స్ చెప్పడమా!.. నేను ఏమి ఘనకార్యం చేశాను సార్!..” ప్రశ్నార్థకంగా శ్రీరామ్ ముఖంలోకి చూచింది రోజీ.

“మనకు తెలియని విషయాలను చెప్పిన వారికి థాంక్స్ చెప్పడం మర్యాద రోజీ” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

ఇరువురూ కాలేజీలోనికి ఎవరి వూహల్లో వారు నడిచారు.

‘శ్రీరామ్ సార్ చాలా మంచివారు. స్త్రీలను బాగా గౌరవిస్తారు. అభిమానిస్తారు. యూనివర్శిటీలోని ఆడ, మగ లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు వారంటే ఎంతో గౌరవం. గౌరవం అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. శ్రీరామ్ సార్ గారు పాటించేది అదే. వారికి ఇంకా వివాహం కాలేదు. కారణం తెలియదు. ఏది ఏమైనా వారికి కాబోయే జీవిత భాగస్వామి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు’ అనుకొంది రోజీ.

‘రోజీ చాలా మంచి యువతి. అందం చందం అణకువ, పెద్దలంటే గౌరవం, అభిమానం. ఆమెలోని ప్రత్యేకత. తన తొలిచూపుతోనే నామదిలో తిష్టవేసింది. రోజులు గడిచిన కొలది ఆమె నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. ఆమెకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలని వుందో లేదో ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహ విషయంలో ఎలాంటి నిర్ణయంతో వున్నారో నా వూహకు అందని విషయం. ఆమె నాకు పరిచయం అయ్యి ఆరుమాసాలు. నా మనస్సు సదా ఆమె సాంగత్యాన్ని కోరుతూ ఉంది. నేను నా మనో అభిప్రాయాన్ని ఆమెకు తెలియజేస్తే తాను ఏమనుకొంటుందో ఏమో!.. తన వివాహ విషయంలో ఆమెకు ఎలాంటి అభిప్రాయాలున్నాయో!.. నేను భారతీయుడను. తను ఇంగ్లండ్ వాసి. తన విషయంలో నాకున్న అభిప్రాయాన్ని ఆమెకు తెలియజేస్తే ఆమోదిస్తుందో లేదో!.. ఆమెకు నా ప్రపోజల్ నచ్చకపోతే, మంచి స్నేహం చెడిపోయినట్లు అవుతుంది. మరికొంత కాలం ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా వుండటం మంచిది, ఆమె వైపునుండి నాకు అలాంటిది సంకేతం ఏదైనా నాకు లభించేటంత వరకు. ఇది చాలా సున్నితమైన విషయం. రెండు మనస్సులకు సంబంధించినది. అవసరంపడి అవమానంపాలు కాకూడదు’ అనుకొన్నాడు శ్రీరామ్.

ఆరోజు శనివారం..

ప్రతిరోజూ శ్రీరామ్ తొమ్మిదిన్నర కల్లా యూనివర్శిటీకి వస్తాడు.

ఉదయ రోజీ యూనివర్శిటీకి రాగానే నేరుగా శ్రీరామ్ రూముకు వెళ్ళింది.

తలుపు తట్టింది.

“మే ఐ కమిన్ సార్!..” హెచ్చు స్థాయిలో అంది రోజీ.

“ప్లీజ్ కమిన్..” శ్రీరామ్ జవాబు.

చిరునవ్వుతో రోజీ గదిలో ప్రవేశించింది.

“గుడ్ మార్నింగ్ సార్!..”

“ఎస్.. ఎస్.. వెరి గుడ్ మార్నింగ్ రోజీ”

“సార్!..”

“ఆ..” ఆమె ముఖంలోకి చూచాడు శ్రీరామ్.

“రేపు సండే..”

“అవును..”

“మీ ప్రోగ్రామ్ ఏమిటి?”

“సాధారణంగా సండే, నేను ఉదయం ఏడుగంటలకల్లా టెన్నిస్ కోర్టుకు వెళతాను. తొమ్మిదిన్నర దాకా టెన్నిస్ ఆడతాను. పది గంటలకు ఇంటికి వస్తాను. భోజనాన్ని ప్రిపేర్ చేసి, స్నానం చేసి, ఏదో పుస్తకాన్ని తీసుకొని ఒంటిగంట దాకా చదువుతాను. ఆపై భోజనం చేసి మూడున్నర వరకూ పడుకొంటాను. లేచి టీ కలుపుకొని త్రాగి నాలుగు గంటల ప్రాంతంలో జాగింగ్‌కు వెళతాను. ఐదు గంటల ప్రాంతంలో ఇంటికి వస్తాను. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. స్నానం చేసి డ్రస్ మార్చుకొని ఎనిమిది గంటల వరకు టి.వి చూస్తాను. దేశ విదేశీ వార్తలను వింటాను. ఆపై భోజనం, పదిన్నరకా పుస్తకపఠనం ఆ తర్వాత నిద్ర. ఇది నా సండే సిలబస్” నవ్వుతూ చెప్పాడు శ్రీరామ్.

“వంట మీరే చేసుకొంటారా!” అడిగింది రోజీ ఆశ్చర్యంతో..

“అవును.. అప్పుడే కదా, నాకు కావలసినదాన్ని నేను తినగలుగుతాను!..”

రోజీ కొన్ని క్షణాలు శ్రీరామ్ ముఖంలోకి పరీక్షగా చూచింది.

“రోజీ!.. ఏం అలా చూస్తున్నావ్?”

“మీలోని సహనశక్తిని గురించి ఆలోచిస్తున్నాను సార్!..”

“రోజీ!.. నీకు ఒక మాటను చెప్పాలని వుంది చెప్పనా?” అడిగాడు శ్రీరామ్.

“చెప్పండి సార్!..”

“నీవు నన్ను శ్రీరామ్ అని పిలువు!”

“సార్!..” హెచ్చు స్థాయిలో అంది రోజీ.

“ఏమిటి రోజీ!.. స్థాయి మారింది!..”

“ఆశ్చర్యం సార్!..”

“ఎందుకు?”

“మీరు నాతో చెప్పిన మాటకు!..”

“నేనేం తప్పుగా చెప్పలేదే!..”

“మీరు..” ఆగిపోయింది రోజీ.

ప్రశ్నార్థకంగా రోజీ ముఖంలోకి చూచాడు శ్రీరామ్. “ఆగిపోయావేం రోజీ!..”

“సార్!..”

“చెప్పు!..”

“నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేను సార్!..”

“కారణం?”

“అది తప్పు!”

“ఎందువలన?”

“మీరు నాకంటే పెద్దవారు. గురువులు. నేను మిమ్మల్ని నా జీవితాంతం పిలవబోయేది సార్.. సార్.. అనే!..” రోజీ ప్రీతిగా శ్రీరామ్ ముఖంలోకి చూచింది.

ఆమె.. ఆ చూపుల్లో శ్రీరామ్‌కు ఆరాధనా భావం కనిపించింది. కొన్ని క్షణాలు చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

‘ఎంతటి అభిమానం. ఎంత ఆరాధనా భావన, ఆ నయనాల్లో.. నేను ఏమని అనుకోవాలి?..’ అనుకొన్నాడు శ్రీరామ్.

“రేపటి నీ ప్రోగ్రాం ఏమిటి రోజీ!..”

“మీ ప్రొగ్రామే నా ప్రొగ్రామ్ సార్!..”

“అంటే..!”

“లండన్ చూడాలన్నారుగా. నేను ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడికి వస్తాను. కలిసి ఏదోవైపుకు వెళదాం.”

చాలారోజులుగా శ్రీరామ్ మనస్సులో రోజీ తల్లిదండ్రులను చూడాలనే కోరిక. ఆ కారణంగా.. “రోజీ!..” అన్నాడు

“సార్!..”

“నేను మీ ఇంటికి ఏడున్నరకల్లా వస్తాను. ప్లీజ్ టెల్ మి అడ్రస్.”

“అలాగా!.. చాలా చాలా సంతోషం సార్!.. మా అమ్మా నాన్నలు మిమ్మల్ని చూడాలని ఎన్నోసార్లు నాతో చెప్పారు. మీరు ఏమనుకొంటారోనని, నేను ఆ విషయాన్ని మీతో చెప్పలేదు సార్!..” సిగ్గుతో తలవంచుకొని చెప్పింది రోజీ.

ఆ సమయంలో ఆమె తల్లోని మల్లెపూల సువాసన శ్రీరామ్ నాసికాపుటలలో ప్రవేశించింది. తనువు పులకరించింది మనస్సున మధుర భావన.

‘ఈ రీతిగా నేను వారి ఇంటికి వెళ్ళడం ఒకందుకు మంచిది. నన్ను ఆమె తల్లిదండ్రులు చూస్తారు. నేనూ వారిని చూడగలుగుతాను. పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం నా మనో అభిలాషకు సేతువుగా మారవచ్చునేమో!.. ఆ దంపతులకు నేను నచ్చుతానేమో!.. నేను నా అభిప్రాయాన్ని ఏర్పడిన పరిచయం ద్వారా, ఒకరోజున వారికి చెప్పవచ్చునేమో!.. రోజీ పై నాకున్న ప్రేమ ఫలించవచ్చునేమో!.. భవిష్యత్తులో రోజీ నా అర్థాంగి కావచ్చునేమో!..’ అనుకొన్నాడు.

ఆ భావాల ఫలితంగా మనస్సున ఆనందం, పెదవులపైన చిరునవ్వు..

“నో ప్రాబ్లం..!”

“దేనికి సార్!..”

“నీవు మీ అమ్మా నాన్నల మాటలను నాకు చెప్పినందుకు. రోజీ దేనికైనా సమయం రావాలి. ఆ సమయం మన ఆధీనంలో లేదు. దాని నిర్దేశకులు భగవంతుడు. సర్వేశ్వరుడు. వారి ఇష్టానుసారంగా సమయం రేపు అన్నమాట” నవ్వుతూ చెప్పాడు శ్రీరామ్.

రోజీ.. అందంగా నవ్వింది. ఆమె నవ్వినప్పుడు పలువరుస మల్లె మొగ్గలవలే మెరిశాయి.

‘రోజీ నవ్వితే ఎంత బాగుంటుంది’ అనుకొన్నాడు శ్రీరామ్.

“ఓకే సార్!.. ప్రోగ్రాం ఫిక్సిడ్!”

“ఎస్ రోజీ!.. రేపు నా రథానికి నీవే సారధివి.” చిరునవ్వుతో రోజీ ముఖంలోకి చూచాడు శ్రీరామ్. శ్రీరామ్ మాటలకు రోజీ బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమెలో ఏదో కలవరం. కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా సాగిపోయాయి.

“సార్!..”

“ఆఁ..”

“ఇక నేను క్లాసుకు వెళతాను సార్!..” మెల్లగా చెప్పింది రోజీ.

“ఓకే రోజీ!..” అన్నాడు శ్రీరామ్.

రోజీ కుర్చీ నుంచి లేచి మెల్లగా ఆ గది నుండి శ్రీరామ్ తలపులతో బయటికి నడిచింది. వెళుతూవున్న రోజు చిరునవ్వుతో చూస్తూ వుండిపోయాడు శ్రీరామ్.

***

ఆ మరుదినం ఆదివారం. ఐదుగంటలకు శ్రీరామ్ నిద్రలేచాడు.

కాలకృత్యాదులు తీర్చుకొని, గంటసేపు యోగ, వ్యాయామంతో గడిపి, స్నానం చేసి, టీ తాగి ఏడుగంటలకు రోజీ ఇంటికి బయలుదేరాడు. అరగంటలో వారి ఇంటికి చేరాడు.

రోజీ తయారై వరండాలో అతని రాకకు ఎదురు చూస్తూ ఉంది. కారు వారి పోర్టికోలో ఆపాడు శ్రీరామ్. కారు దిగాడు.

నవ్వుతూ రోజీ “గుడ్ మార్నింగ్ సార్!” కుడిచేతిని పైకెత్తి విష్ చేసింది.

నవ్వుతూ చేతి వాచీ చూచుకొని..

“రోజీ కరెక్ట్ టైముకు వచ్చానా!” అడిగాడు శ్రీరామ్.

“పదినిముషాలు ముందుగానే వచ్చారు సార్!” నవ్వుతూ చెప్పింది రోజీ.

“ప్లీజ్ కమ్ సార్!..”

చిరునవ్వుతో ఆమెను అనుసరించాడు శ్రీరామ్. ఇరువురూ హాల్లోకి ప్రవేశించారు.

వారి మాటల సవ్వడి విని రోజీ తల్లి దుర్గ తండ్రి థామస్ చిరునవ్వుతో శ్రీరామ్‌కు స్వాగతం పలికారు.

ఆ పెద్దవారికి గౌరవంగా విష్ చేశాడు శ్రీరామ్.

అందరూ హాల్లో సోఫాల్లో కూర్చున్నారు. “బాబూ!.. మీది ఏ వురు?” అడిగింది దుర్గ.

“బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా..”

“ఫాదర్, మదర్ ఏం చేస్తుంటారు?” అడిగాడు థామస్.

“వ్యవసాయం.. మాది రైతు కుటుంబం సార్!..”

“రైతేగా అందరికీ అన్నదానం చేసేది!” నవ్వుతూ చెప్పింది దుర్గ.

“మీరు బయటికి వెళ్ళాలిగా, లేవండి టిఫిన్ తిందాం!” అన్నాడు థామస్, వారు సోఫా నుంచి లేచారు. దుర్గ కూడా లేచింది.

“రండి బాబూ!..” పిలిచింది దుర్గ.

“సార్!.. ప్లీజ్ కమ్..!” చిరునవ్వుతో పలికింది రోజీ.

నలుగురూ డైనింగ్ టేబుల్‌ను సమీపించి కూర్చున్నారు.

రోజీ అందరి ముందు ప్లేట్లను వుంచింది. మంచినీటి గ్లాసులను ప్రక్కన వుంచింది. హాట్ ప్యాక్‌ను తెరిచి, పూరీ, ఆలూకూరను అన్ని ప్లేట్లలో వుంచింది. హాట్ ప్యాక్‌ను టేబుల్‌పై మధ్యకు నెట్టి తను తల్లి ప్రక్కన కూర్చుంది. అంటే శ్రీరామ్‌కు ఎదురుగా.. అందరూ తినడం ప్రారంభించారు.

“బాబూ!..”

“చెప్పండి..”

“పూరీ, కూరా ఎలా వున్నాయి?” అడిగింది దుర్గ.

“చాలా బాగున్నాయండీ!”

“మొహమాటపడకుండా తినండి సార్!..” చిరునవ్వుతో చెప్పాడు థామస్.

“ఓకే సార్!.. ఆహార వ్యవహారాల్లో నాకు మొహమాటం లేదు సార్!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

“కొంచెం కూర వెయ్యనా సార్!..” అడిగింది శ్రీరామ్.

“వుందిగా చాలు రోజీ!..”

“బాబూ!..”

“అమ్మా!..” అప్రయత్నంగా అన్నాడు శ్రీరామ్.

దుర్గ ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూచింది.

“కడుపు నిండా తినండి” అంది చిరునవ్వుతో.

“అలాగే!..” శ్రీరామ్ జవాబు.

“మీరు ఆ యూనివర్శిటీలో చేరి ఎంతకాలం అయ్యింది సార్!” అడిగాడు థామస్.

“అక్కడే పి.హెచ్.డి చదివి, లెక్చరర్ గా ఉద్యోగాన్ని కూడా అక్కడే ప్రారంభించాను. పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

“వావ్ గ్రేట్.. గ్రేట్ సార్!..” క్షణం ఆగి.. “సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా!”

“అడగండి సార్!”

“మా అమ్మాయి రోజీ గురించి మీ అభిప్రాయం?”

థామస్ గారి ఆ ప్రశ్నకు శ్రీరామ్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.

వీరు నన్ను ఆ ప్రశ్న అడగడంలో.. అది నాకు రోజీ వున్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలనా?.. లేక రోజీ తన ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్వహిస్తూ వుందనా?

ఆశ్చర్యంతో రోజీ ముఖంలోకి చూచాడు. రోజీ అందంగా నవ్వి తలను ప్రక్కకు త్రిప్పుకొంది.

“మీ యథార్థ అభిప్రాయాన్ని తెలియజేయండి బాబు!.. కారణం మీరు ఆమె బాస్ కదా!..” చిరునవ్వుతో సౌమ్యంగా అడిగింది దుర్గ.

“ఓ.. రోజీ.. చాలా తెలివైనది. డ్యూటీ కాంక్షస్ గొప్పగా కలది. ఎప్పుడూ తాను నవ్వుతూ అందరి ముఖాల్లో ఆనందాన్ని చూడాలని తనవంతు ప్రయత్నం సిన్సియర్‌గా చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, సార్!.. మేడం!.. రోజీ నాకు చాలా బాగా నచ్చింది” కాస్త ఆవేశంతోనే అన్నాడు శ్రీరామ్. మదిలో.. ‘చివరి మాటను ఆవేశంతో అన్నానుగా.. వారు ఏమనుకొంటారో!..’ దుర్గ, థామస్ ముఖాల్లో చూచాడు.

వారిరువురి వదనాల్లో ఎంతో ఆనందం. ఎదురుగా వున్న రోజీ ముఖంలోకి చూచాడు. అందంగా నవ్వుతూ.. రోజీ ..

“థాంక్యూ సార్!..” అంది.

“మీలాంటి మంచి వ్యక్తి మా అమ్మాయికి బాస్ కావడం, నిజంగా ఆమె అదృష్టం” నవ్వుతూ చెప్పింది దుర్గ.

“ప్రతిరోజూ ఈ డైనింగ్ టేబుల్ ముందు డిన్నర్‌కు కూర్చున్నప్పుడు మీ గురించే తను చెబుతూ ఉంటుంది. మేము ఆనందంగా వింటుంటాం. ఎప్పుడు మిమ్మల్ని చూడగలమా అని నేను దుర్గ అనుకొనేవాళ్ళం. ఆ మా కోర్కె ఈనాటికి నెరవేరింది. వుయ్ ఆర్ సో హ్యాపీ సార్, థాంక్యూ!” నవ్వుతూ చెప్పాడు థామస్.

“సార్!.. నేను మామూలు మనిషిని. మీరు అనుకునే అంత గొప్పవాడిని కాను” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

తినడం పూర్తయింది. బేసిన్ దగ్గర చేతిని కడుక్కొన్నాడు శ్రీరామ్. తడిని తుడుచుకొనేటందుకు రోజీ అతనికి టవల్ అందించింది. తిరిగి అందరూ.. హాల్లోకి సమావేశం అయినారు.

“సార్!.. “ రోజీ పలుకు.

“ఇక మనం బయలుదేరుదామా!”

“ఓకే!..”

దుర్గ, థామస్‌లు ఒకరినొకరు చూచుకొని నవ్వుకొన్నారు.

శ్రీరామ్, రోజు వారికి చెప్పి బయలుదేరారు. ఆ పెద్దలు వరండాలో నిలబడి వారికి బై చెప్పారు. శ్రీరామ్ రోజీ కార్లో వీధిలో ప్రవేశించారు.

(ఇంకా ఉంది)

Exit mobile version