[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[శ్రీరామ్, గంగ, డి.ఎస్.పి వైజాగ్ చేరి, దినకర్ ఇంట్లో బస చేస్తారు. వారు ముగ్గురూ కాలేజీ రోజుల నుంచే స్నేహితులు. తన గ్రామంలోని విశేషాలను శ్రీరామ్ చెప్పగా, విద్రోహ చర్యలకు పాల్పడే ముకుందరావు అరెస్ట్ వివరాలను పరశురామ్ చెప్తాడు. ఇంతలో ఆ రాత్రి పూట దినకర్ మిత్రురాలు, పరశురామ్ చెల్లెలు వసంత వస్తుంది. అన్నయ్య ఎంత పోలీస్ అధికారి అయినా, ఇంత రాత్రి పూట ఒంటరిగా రాకూడదని అంటాడు శ్రీరామ్. తన తండ్రి ఆర్మీలో మేజర్‍గా చేశారని, భయమనేది తమ ఒంట్లో లేదని బదులిస్తుంది వసంత. ఆమెని భోజనానికి రమ్మని పిలుస్తుంది స్వప్న. ముందు లోపలికి వెళ్ళి గంగని పలకరించి వస్తుంది వసంత. మీరెవరని గంగ అడిగితే, పిన్నిని అని చెబుతుంది. భోజనం వడ్డిస్తూ, స్వప్న అడగగా, తాను కాలేజీ రోజులనుంచే శ్రీరామ్‌ను అమితంగా ఇష్టపడి, ఇప్పటికీ వివాహం చేసుకోకుండా అతనిపై ప్రేమాభిమానాలను దాచుకున్నట్లు చెబుతుంది వసంత. గంగని తమ స్కూల్లో చేర్చమని చెబుతుంది వసంత. గంగ తల్లిలేని పిల్ల కాబట్టి, వసంతకీ, శ్రీరామ్‌కీ వివాహం జరిపిస్తే బాగుంటుందని స్వప్న, దినకర్ నిశ్చయించుకుంటారు. ఆ రాత్రి వేళ వసంతను ఆమె ఇంటి దగ్గర దించడానికి శ్రీరామ్ కారులో వెళ్లినప్పుడు వారిద్దరూ కాలేజీ రోజుల నాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటారు. అందరి నిర్ణయం ప్రకారం సోమవారం ఉదయం శ్రీరామ్ గంగను వసంత పనిచేసే పాఠశాలలోనే చేర్పిస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-22
ఆ రోజు మన భారత్ రిపబ్లిక్ డే. అప్పటికి గంగ స్కూల్లో ఆరవ క్లాసులో చేరి ఏడు నెలలు. స్కూల్లో చేరిన కొద్ది రోజులకే గంగ అందరితో కలిసిపోయింది. టీచర్లు ఆమె ప్రతిభను గుర్తించారు. ఆ రోజున టీచర్లు గంగను దేశభక్తి గీతాన్ని పాడమన్నారు. గంగ మైకును సమీపించి ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని ఎంతో శ్రావ్యంగా శ్రద్ధతో పాడింది.
సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా హమారా
సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా హమారా
హమ్ బుల్ బుల్ హై ఇస్ కీ – యే గుల్ సితా హమారా హమారా (సారే)
పరబత్ వో సబ్సే ఊంఛా – హమ్ సాయా ఆస్‌మాన్ కా
పరబత్ వో సబ్సే ఊంఛా – హమ్ సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా – వో పాస్‌బా హమారా హమారా (సారే)
గోదీ మే ఖేలితీహై – ఇస్‍కీ హజారో నాదియా
గోదీ మే భేలీతీహై – ఇస్ కీ హజారో నదియా
గుల్షన్ హై జిసే దమ్ సే – రష్ కే జినా హమారా హమారా (సారే)
మజ్‍హబ్ నహీ సిఖాతా ఆపస్ మే భైర్ రఖనా
మజ్‌హబ్ నహీ సిఖాతా ఆపస్ మే భైర్ రఖనా
హిందీ హై హమ్ హిందీ హై హమ్ హిందీ హై హమ్
వతన్ హై హిందూస్థాన్ హమారా హమారా.. (సారే)
ఈ భారత దేశభక్తి గీతాన్ని వ్రాసిన మహాకవి దేశభక్తి పరాయణులు కవిశ్రీ అల్లమా మహమ్మద్ ఇక్బాల్ గారు.
ఆ పై గీతం తెలుగు అనువాదం:
మాదే స్వతంత్ర దేశం, సొగసైన భారతదేశం (మా)
మత భేదం అంతా మరచి మెలిగాడు భారతదేశం (మా)
పర్వతం మకుటము కలిగి కడలినే మేఖలముగ
విశ్వైక సుందరముగా వెలుగొందు భారతదేశం (మా)
గ్రామాలన్నియు తడిపి బంగారు పంటలొసగే
వేలాది నదులు కలిగున్న భారతదేశం (మా)
కాశ్మీరు నగరి నుండి కన్యాకుమారి వరకు
హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం మరెన్నో.. (మా)
మాదే స్వతంత్ర దేశం, సొగసైన భారతదేశం (మా)
గంగ పాటను ముగించింది. తోటి విద్యార్థి, విద్యార్థులు, స్త్రీ, పురుషులు, టీచర్లు.. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కార్య నిర్వాహక టీచర్లు గంగను అభినందించారు.
టీచర్లు పిల్లలకు చాక్లెట్స్ పంచి పెట్టారు. ఆ ఏడునెలల అనుబంధంలో హెడ్ మిసెస్ (ప్రిన్సిపాల్) వసంతకు గంగ చాలా దగ్గరైంది. గంగ సద్గుణాలు, ఏకసంతగ్రాహి తత్వం, పెద్దలయందు గురువుల ఎడల ఆమెకు (గంగకు) వున్న గౌరవాభిమానాలు వసంతను ఎంతగానో ఆకర్షించాయి. ఆ కారణాల ద్వారా వసంత గంగను ఎంతగానో అభిమానించింది. గంగను ఆమె ఒక తల్లిగా జాగ్రత్తగా చూచుకొనేది. ఆమెను తనతో తన ఇంటికి తీసుకుని వెళ్ళేది. గంగ సందేహాలను తీర్చేది.
గంగకు కూడా వసంత విషయంలో ఎంతో ప్రేమాభిమానాలు కలిగాయి. తన తండ్రి శ్రీరామ్‌తో గంగ, వసంతను గురించి ఎంతో గొప్పగా చెప్పేది. “మా అమ్మ వుండి వుంటే నన్ను మేడమ్ లాగే చూచుకొనేది కదా నాన్న!..” అని అడిగేది గంగ.
ఆమె అలా ప్రశ్నించినప్పుడు రోజ్ జ్ఞాపకాలు అతని మస్తిష్కంలో నిలిచేవి. రోజ్ అతని కళ్ళముందు నవ్వుతూ నిలబడేది. ఆశ్చర్యంతో పిచ్చివానిలా చూస్తూ వుండిపోయేవాడు శ్రీరామ్. అది భ్రమ, ఆ భ్రమలో, ఆ జ్ఞాపకాలతో కొంత సమయం గడిపేవాడు శ్రీరామ్ ఒంటరిగా..
ఈ మధ్యన తన అక్క శాంతి రెండు పర్యాయాలు గంగను చూడటానికి వచ్చింది. ఆమె దినకర్, స్వప్నలతో శ్రీరామ్, వసంత వివాహాన్ని గురించి ప్రస్తావించింది. స్వప్న వసంతకు ఇష్టమేనని చెప్పింది. శాంతికి. శ్రీరామ్‌కు వసంతకు వివాహం జరిపించాలని నిర్ణయించుకొంది శాంతి.
శాంతి వసంతను పిలిపించింది. ఆమె తల్లిదండ్రుల యోగక్షేమాలను గురించి ప్రస్తావించింది. ఆమెతో కలిసి రెండవ పర్యాయం వచ్చినప్పుడు వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె తల్లి భువనేశ్వరి తండ్రి మేజర్ జనరల్ నరసింహం గారితో శ్రీరామ్‌ను గురించి చెప్పి, అతనికి వసంతకు వివాహం జరిపించవలసింది కోరింది. ఆ వృద్ధ దంపతులు పరమానందంగా సరే అన్నారు.
ఆ విషయాన్ని దినకర్, స్వప్నలకు శ్రీరామ్ సమక్షంలోనే చెప్పింది శ్రీరామ్‌తో..
“చూడు రామా!.. సర్వేశ్వరుడి లీలలు చిత్రవిచిత్రాలు. వారి నిర్ణయానికి అతీతంగా ఈ సృష్టిలో ఎవరి విషయంలోనూ ఏదియూ జరుగదు. ఇప్పుడు మన గంగ వయస్సు పది సంవత్సరాలు. ఈ సమయంలో ఆమెకు తల్లి అవసరం ఎంతైనా వుంది. నీకు ముందే చెప్పాను వసంత గుణగణాలు, స్వభావాన్ని గురించి, మీరిరువురూ వివాహ వయస్సు దాటినవారే. అయినా నీకు మరో వివాహం చేసుకోకూడని వయస్సు కాదు. చెప్పానుగా మన గంగకు తల్లి అండ అవసరం. ఆ హోదాకు వసంత అన్ని విధాలా తగినది. నేను వసంత తల్లిదండ్రులతో మాట్లాడాను. వారు ఎంతో ఆనందంగా సమ్మతించారు. వసంతకు నీవంటే ఎంతో ఇష్టం. గంగకు తాను తల్లిలా మారిపోతుంది. బాగా చూచుకొంటుంది. చక్కగా చదివిస్తుంది. నీవు గడచిన ఏడు మాసాల్లో మన వూర్లో ప్రెస్ దినపత్రిక కోసం నిర్ణయించిన బిల్డింగ్. ఇక్కడ నీ కార్యాలయానికి నిర్మించిన బిల్డింగ్ పనులన్నీ పూర్తయినాయి. ఇక నీవు నిశ్చలంగా ప్రశాంతంగా నీ నిర్ణయాలను అమలుపరచవచ్చు. ప్రెస్ వ్యవహారాలు చలపతి, దినపత్రిక వ్యవహారాలు సాంబశివం మాస్టారుగారు చూచుకొంటారు. నీవు పాత విద్యార్థులతో నీ ఇష్టానుసారంగా B.S.S సంస్థ కార్యకలాపాలనూ నెరవేర్చుకోవచ్చు. నీ మనస్సుకు నీకు అన్ని విధాలా ఆనందం కలిగే జీవిత విధానాన్ని నీ ఇష్టానుసారంగా నీవు సాగించవచ్చు. నీకు అండగా నేను, మీ బావగారు, భారతి, దినకర్, డి.ఎస్పీ పరశురామ్ అంతా వున్నాంగా.. గతాన్ని మరిచి మన గంగ యోగక్షేమాల కోసం, ప్రశాంతంగా నీవు నీ ఆశయసిద్ధిని సాధించేదాని కోసం, జీవిత భాగస్వామిగా వసంతను వివాహం చేసుకో. యథార్థంగా చెప్పాలంటే, నా మూలంగా నీవు ఎన్ని కష్టాలు పడి వుంటావు. నా తప్పులను క్షమించురా!.. నా మాటలను విని నాకు ఆనందాన్ని కలిగించరా శ్రీరామా!..” దీనంగా ప్రాధేయపూర్వకంగా కోరింది శాంతి.
చివరి మాటలు పలికేటప్పుడు శాంతి కళ్ళల్లో కన్నీరు. అందరి ముఖాల్లో ఆవేదన.
శ్రీరామ్ అందరినీ పరీక్షగా చూచాడు.
“ఏరా!.. ఇంకా ఏంటిరా నీ ఆలోచన!..” అడిగింది శాంతి.
శ్రీరామ్ తలాడించాడు.
“నీవు ఎందుకు తలాడించావో నాకు అర్థం కాలేదు. ఈ నీ అక్కయ్య ఆవేదన నీకు అర్థం కాలేదా?”
“అర్థం అయింది అక్కా!..”
“మరి మా నిర్ణయానికి నీ సమాధానం?”
శ్రీరామ్ పెదవులపై చిరునవ్వు.
“ఏమిట్రా ఆ నవ్వు?”
“మీ అందరి ఇష్టమే నా ఇష్టం!..” నవ్వుతూ చెప్పాడు శ్రీరామ్.
అందరి వదనాల్లో ఆనందం.
వసంత, గంగ, సుందర్ స్కూలు నుంచి వచ్చారు. వసంత చేతిని గంగ పట్టుకొని వుంది.
“వదినా!… నేనూ గంగ, సుందర్ వచ్చేశాము” నవ్వుతూ చెప్పింది వసంత.
గంగ పరుగున శాంతిని సమీపించింది.
“అత్తయ్యా!.. ఎప్పుడు వచ్చారు?” ఆమె చేతులు పట్టుకొని అడిగింది.
శాంతి గంగ నడుం చుట్టు తన చేతులను వుంచి దగ్గరకు తీసుకొని “అమ్మా గంగా!.. ఎలా వున్నావురా..” గంగ కళ్ళల్లోకి చూస్తూ ప్రీతిగా పలకరించింది శాంతి.
క్షణం తర్వాత.. “స్వప్నా.. ఈ గంగ రూపు అచ్చం మా అమ్మ పోలికే” అంటూ శ్రీరామ్ ముఖంలోకి నవ్వుతూ చూచింది.
“అలాగా!…” అడిగింది స్వప్న.
“అవును ముమ్మూర్తులా!..” నవ్వుతూ చెప్పింది శాంతి.
“ఆ.. ముగ్గురు వెళ్ళి ముఖం కడుక్కోండి. టిఫిన్ తిందురుగాని” అంది స్వప్న. వసంత బేసిన్ వైపుకు నడిచింది.
స్వప్న, సుందర్ మేడమీది గదికి పుస్తకాలతో వెళ్ళారు.
స్వప్న బేసిన్ సమీపించి ముఖం కడుక్కొంటున్న వసంత చంకలో చక్కిలిగింత పెట్టింది.
“వదినా!..” అరిచింది వసంత ఉలిక్కిపడి.
అందరూ బేసిన్, వసంతల వైపు చూచారు.
“స్వప్న.. నీకు ఒక గ్రేట్ గుడ్ న్యూస్ మరదలా” నవ్వుతూ చెప్పింది.
“ఏమిటి వదినా!”
“నీ దేవుడు వరమిచ్చాడు” మెల్లగా చెవిలో చెప్పింది.
“ఆఁ..” నోరు తెరిచింది వసంత.
“అవునే!..” నవ్వుతూ అంది స్వప్న.
“నిజంగా!..”
“నా తోడు..!”
“వదినా!..” స్వప్నను గట్టిగా కౌగలించుకొంది వసంత.
సోఫాల్లో కూర్చొనియున్న దినకర్, శాంతి, శ్రీరామ్‌లు వారిని చూచి ఆనందంగా నవ్వుకొన్నారు.
“మే ఐ కమిన్!….” హాల్లో ప్రవేశిస్తూ నవ్వుతూ అడిగాడు పరశురామ్.
అందరూ అతనివైపు చూచారు.
నవ్వుతూ వచ్చి పరశురామ్ శ్రీరామ్ ప్రక్కన కూర్చున్నాడు.
స్వప్న నవ్వుతూ వసంతను తన గదిలోకి లాక్కెళ్ళింది.
“ఏరా పరశు!.. మూడు వారాలకు పైగా మాయమైనావు?” నవ్వుతూ అడిగాడు శ్రీరామ్.
“డ్యూటీ!.. రాత్రింబవళ్ళు ఒకచోట నుంచి మరో చోటికి పయనం. ఫలితం, దుర్మార్గులందరూ దొరికిపోయారు. అందరూ జైల్లో వున్నారు. గుళ్ళ విగ్రహాల దొంగలు, ఆడపిల్లలని ఆడవారిని మాయం చేసే సమాజ విద్రోహులు పట్టుబడ్డారు. ముకుందరావు అనుచరుడు పహిల్మాన్ గోవింద్ బార్లో వారంరోజుల నాడు పట్టుబడ్డాడు. వాడిని తలక్రిందులుగా వేలాడదీసి లాఠీఛార్జి చేసేటప్పుడు అందరి పుట్టు పూర్వోత్తరాలూ చెప్పాడు. రాత్రి సమయంలో అందరి ఇండ్లపైకి దాడిచేశాము. మా ప్రయత్నం ఫలించింది. ముకుందరావు అతని సోదరుడు సాంబశివరావు, అతని కుమారుడు సాగర్ కుమార్‌లను అరెస్టు చేశాము. వారం రోజుల్లో అందరూ బెయిల్ మీద రిలీజ్ అయినారు. కోర్టుకో కేసులు నమోదు జరిగింది.
పహిల్మాన్ గోవిందు అన్ని విషయాలకు ముఖ్య సాక్షి. అతడు ప్రస్తుతంలో పరారీలో వున్నాడు. మా బృందాలు అతని కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, మహారాష్ట్రాల్లో వెదుకుతున్నారు. వాడికి ఆ రెండు రాష్ట్ర భాషలూ క్షుణ్ణంగా తెలుసు. చక్కగా మట్లాడగలడు. బహుశా వాడు ఆ రెండు రాష్ట్రాలలోనే వుండాలి. త్వరలో మావారు పట్టుకొంటారు. నేను విశాఖకు ట్రాన్స్‌ఫర్ అయినా, నెల్లూరికి సంబంధించిన కేసుల విషయంలో మా నెల్లూరి బృందానికి అవసరం వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి వారికి సాయం చేయాలని మా డి.జి.పి గారి ఉత్తర్వులు.
నేరస్థుల వైపు ప్రజ్ఞావంతులైన క్రిమినల్ లాయర్స్ వున్నారు. కేసులు అంత తొందరగా తేలవు. వాయిదాలతో కాలం జరిగిపోవచ్చు. అలాగని డిఫెన్స్ సైడ్ కూడా సమర్థులైన అడ్వకేట్స్ వున్నారు. అందులో మన అక్కయ్య శాంతి, వారి గురువులు మార్తాండవర్మ ప్రముఖులు. ప్రధాన నిందితుడు ముకుందరావు, తదితరులకు కొన్ని సంవత్సరాలు కారాగార శిక్ష తప్పదు.”
“రేయ్!.. శాంతి నీకు ఇప్పుడు అక్కయ్య కాదు, వదినగారు!..” ఇరువురి ముఖాలని చూస్తూ అన్నాడు దినకర్.
“ఏందిరా నీవనేది?” ఆశ్చర్యంగా అడిగాడు పరశురామ్.
“నిజంరా!.. నీ చెల్లి వసంత మన శ్రీరామ్‌కు కాబోయే భార్య.”
“అవును పరశు!… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.” శ్రీరామ్ ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పింది శాంతి. పరశురామ్ నవ్వుతూ ఆనందంగా శ్రీరామ్ వైపుకు కుడిచేతిని సాచాడు. చిరునవ్వుతో శ్రీరామ్ చేయి కలిపాడు.
స్వప్న.. వసంతలు స్వీట్ను (లడ్డు) చేత పట్టుకొని హాల్లోకి వచ్చారు. వసంత అందరికీ అందించింది.
“ఏంటి విశేషం?” అడిగాడు శ్రీరామ్ అమాయకంగా.
“ఒరే పిచ్చి అన్నా!.. నీ అనౌన్స్‌మెంటే ఈ స్వీట్‌కు కారణం” అన్నాడు దినకర్ నవ్వుతూ.. అందరూ ఆనందంగా నవ్వుకొన్నారు.
నాలుగు లడ్డులను చేత పట్టుకొని వసంత సుందర్, గంగలకు ఇవ్వడానికి పరుగెత్తింది.
ఆమెలోని ఆనందాన్ని, వేగాన్ని చూచిన పరశురామ్.. కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ‘చెల్లీ!’.. యు ఆర్ లక్కీ!..’ అనుకొన్నాడు.
శాంతి ఊరికి వెళ్ళి సదాశివం మాస్టారుగారి చేత శ్రీరామ్, వసంతల వివాహానికి రెండు నెలల తర్వాత మంచి ముహూర్తాన్ని పెట్టించి వారందరికీ తెలియజేసింది.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
