[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[బడిలో, రిపబ్లిక్ డే వేడుకల్లో గంగ దేశభక్తి గీతాన్ని శ్రావ్యంగా పాడి అందరి అభినందనలు అందుకుంటుంది. ఆమె సద్గుణాలు, ప్రతిభను చూసి స్కూల్ ప్రిన్సిపాల్ వసంత ఆమెను తన సొంత కూతురిలా చూసుకుంటూ మరింత దగ్గరవుతుంది. గంగకు తల్లి అండ అవసరమని భావించిన శాంతి, వసంత తల్లిదండ్రులను కలిసి వారి సమ్మతితో శ్రీరామ్-వసంతల వివాహ ప్రస్తావన తీసుకురాగా, శ్రీరామ్ మరియు వసంత ఇద్దరూ సంతోషంగా అంగీకరించడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అదే సమయంలో డ్యూటీ నుండి తిరిగొచ్చిన డి.ఎస్పీ పరశురామ్.. సమాజ విద్రోహులైన ముకుందరావు, సాంబశివరావు, సాగర్ కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు, ముఖ్యాధారమైన పహిల్మాన్ గోవింద్ పరారీలో ఉన్నట్లు క్రిమినల్ కేసుల దర్యాప్తు వివరాలను పంచుకుంటాడు. చెల్లి వసంత జీవితం శ్రీరామ్‌తో ముడిపడుతోందని తెలిసి పరశురామ్ ఎంతో సంతోషిస్తాడు. రెండు నెలల తర్వాత శ్రీరామ్-వసంతల వివాహానికి ముహూర్తం ఖరారవుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-23
స్వార్థం, అహంకారం, స్వాతిశయం ఈ మూడు గుణములూ దానవ లక్షణాలు. పుట్టుకతో బుర్రన పుట్టిన ఈ బుద్ధులు మధ్యలో మారడం అసాధ్యం.
ఆ కోవకు చెందినవారు ముకుందరావు, అతని సోదరుడు సాంబశివరావు, అతని కుమారుడు సాగర్ కుమార్‌లు.
వారు జైల్లో వుండగానే ఉమర్, ఏసులను మారువేషాల్లో ఆనందరాయుడు, శ్రీరామ్‌ల ఉనికిని తెలుసుకొని వారికి తెలియజేసే పద్ధతిలో నియమించారు.
శ్రీరామ్ తన గ్రామంలో ప్రారంభించిన ప్రెస్ దినపత్రికలను గురించి..
శ్రీరామ్‌కు ఒక కూతురు వున్నదని పేరు గంగ్ అనీ, సిక్స్త్ క్లాసు, వైజాగ్‌లో చదువుతున్నదన్న విషయం ఆ గూఢాచారులు ఇరువురూ ఆ ముగ్గురికీ తెలియజేశారు. సుశీల, శాంతి రక్షణలో వున్నదని తెలియజేశారు. కోర్టులో లాయర్ల మధ్యన వాదోపవాదాలు, సాక్షుల విచారణ, మూడు మాసాలు జరిగాయి. చివరకు ముకుందరావుకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా, సాంబశివరావుకు సంవత్సరం జైలు శిక్ష, డెబ్భై అయిదువేల జరిమానా, సాగర్ కుమారుడికి రెండు సంవత్సరాల కారాగార శిక్ష, యాభైవేలు జరిమానా (సుశీల కేసు విషయంలో) జడ్జిగారు వెల్లడిచేశారు.
దానికి వారు.. తమ లాయర్లతో సంప్రదించి రాజధాని నగరంలోని హైకోర్టుకు అప్పీలు చేశారు. హైకోర్టులో కేసుల విచారణ ప్రారంభం కాను గడువు ఉంది. నేరస్థులు బెయిల్లో బయట తిరుగుతున్నారు. తమ మహారాజా బ్రతుకులు ఆ స్థితికి రావడానికి మూల కారణం శ్రీరామ్ అనే నిర్ణయానికి వచ్చిన ఆ ముగ్గురూ శ్రీరామ్‌ను సరైన దెబ్బకొట్టాలని నిర్ణయించుకొన్నారు.
B.S.S సంస్థ నిర్మాణ కర్త రాంబాబును జైలు అధికారులు తొమ్మిది మాసాల జైలు శిక్షను తగ్గించి విడుదల చేశారు. కారణం జైల్లో అతని సత్ ప్రవర్తన. జైల్లో అతను ఖైదీల మనస్తత్వాలను మార్చిన తీరు.
రహీమ్, రాబర్ట్ కొందరు ఇతర B.S.S సభ్యులు జైలుకు వెళ్ళి రాంబాబు మేడలో పూలమాలను వేసి కౌగలించుకొని వారి కార్యాలయానికి తీసుకొచ్చారు.
అదే సమయానికి శ్రీరామ్, దినకర్, పరశురామ్‌లు అక్కడికి రాంబాబును చూడవచ్చారు.
రహీమ్, రాబర్ట్ ఆ ముగ్గురినీ రాంబాబుకు పరిచయం చేశారు. వారు B.S.S సంస్థకు అందించిన ఆర్థిక సహాయాన్ని గురించి కూడా రాంబాబుకు తెలియజేశారు.
రాంబాబు ఆ ముగ్గురికీ కృతజ్ఞతలతో చిరునవ్వుతో చేతులు జోడించాడు.
శ్రీరామ్ తాను ప్రెస్ పత్రిక ‘భారత అవని’ నడుపుతున్నట్లు ఎడిటర్‌గా సాంబశివం మాస్టార్ వర్తిస్తున్నట్లు మాస్టారు గారు వ్రాసిన ‘భారత అవని’ పుస్తకాన్ని పదిలక్షల కాపీలు అచ్చు వేయించి, అన్ని హైస్కూళ్ళకు పంచినట్లు రాంబాబుకు తెలియజేశారు చివరగా.. “రాంబాబూ!.. మన మాస్టారు గారు వారి బాధ్యతలను నీవు కొంత పంచుకోవాలని, నీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. రండి, వారి వద్దకు వెళదాం” అన్నాడు శ్రీరామ్.
రాంబాబు కార్యాలయంలో వున్న మిత్రులందరికీ చెప్పి శ్రీరామ్, దినకర్, పరశురామ్లతో ప్రెస్ వున్న శ్రీరామ్ తోటకు వెళ్ళారు. అక్కడ చలపతి, సాంబశివం మాస్టారు గారు, అరుణ రేపటి పత్రిక శీర్షికలను గురించి మాట్లాడుకొంటున్నారు. రాంబాబు వారిని చూచి..
“మాస్టారుగారు నమస్సుమాంజలి” వారి పాదాలను తాకాడు.
మాస్టారుగారు రాంబాబు భుజాలను పట్టుకొని లేపి ఎంతో ప్రీతిగా తన హృదయానికి కౌగలించుకొన్నారు.
“ఈనాటి నుంచి నీ పేరు ఏకలవ్య” అన్నారు పరమానందంతో.
“కారణం మాస్టారూ!..” మెల్లగా అడిగాడు రాంబాబు.
“కారణం ఇదిగో!.. నీకంటే సీనియర్ శ్రీరామ్ నా శిష్యుడు. ఈ వయస్సులో నా నెత్తి మీద ఎంతటి బాధ్యతను మోపాడో చూచావా!.. మీ ఇరువురినీ పిలవడం నాకు కన్ఫ్యూజన్ వుండకుండా వుండేటందుకు నేటి నుంచి నీ పేరు ఏకలవ్య అర్థం అయిందా!..” నవ్వారు మాస్టారు.
“ఏకలవ్యా!.. మాస్టారు గారి భావన అర్థం అయిందిగా” చిరునవ్వుతో అడిగాడు శ్రీరామ్.
“మాస్టారూ!.. రాంబాబు వచ్చాడుగా!.. ఇకపై మీకు కొంత విశ్రాంతి” నవ్వుతూ చెప్పాడు చలపతి.
“అవును..” ఆనందంగా నవ్వాడు సాంబశివం మాస్టారు.
దినకర్, పరశురామ్‌లు ఆ తోటను, ప్రెస్‌నూ ఇంతవరకూ చూడలేదు. చలపతితో కలిసి వారు తోటను చూడపోయారు.
కాలింగ్ బెల్ మ్రోగింది.
వాచ్‌మన్ చిన్నయ్య వచ్చిన వ్యక్తిని సమీపించి..
“ఎవరండీ మీరు?”
“ముకుందరావు గారి మనిషిని.”
“ఎందుకొచ్చారు?”
“మా అయ్యగారు సాంబశివం మాస్టారుగారిని పిలుచుకు రమ్మన్నారు!..”
లోనికి వెళ్ళి చిన్నయ్య మాస్టారుగారికి చెప్పాడు.
మాస్టారు గారి ముఖంలో ఆశ్చర్యం.
“మాస్టారూ!..”
“చెప్పు శ్రీరామ్!..”
“వెళ్ళి రండి!.. ఎందుకు పిలిచారో తెలియాలిగా..”
“అవును వెళ్ళి వస్తాను. ఇక్కడే వుంటారా ఇంటికి పోతారా?”
“మీరు వచ్చిందాకా ఇక్కడే వుంటా. మీరు మన కార్లో వెళ్ళండి సార్..” అన్నాడు శ్రీరామ్. సాంబశివం మాస్టారు శ్రీరామ్ కళ్ళల్లోకి చూచాడు చిరునవ్వుతో.
“మాస్టారుగారూ!.. నేనూ రానా మీతో!..” అడిగాడు ఏకలవ్య,
“వద్దు ఏకలవ్యా!..”
మాస్టారు ఇరువురి ముఖాల్లోకి చూచాడు.
“మీరు వెళ్ళి రండి మాస్టారూ!..” చిరునవ్వుతో తలాడించాడు శ్రీరామ్.
మాస్టారుగారు శ్రీరామ్ కార్లో ముకుందరావు గ్రామం వైపుకు బయలుదేరాడు. వచ్చిన మనిషి ముకుందరావు కార్లో మాస్టారు గారి కారును అనుసరించాడు.
అరగంటలోపు కారును మస్తాన్ ముకుందరావు కారు పోర్టికోలో నిలిపాడు. మాస్టారుగారు వరండా మెట్లు ఎక్కి కాలింగ్ బెల్ నొక్కాడు. ముకుందరావు ఆఫీస్ గది ఒక రెక్క తలుపు తెరుచుకుంది.
“రండి మాస్టారు గారూ రండి!” ఆహ్వానించాడు ముకుందరావు.
మాస్టారుగారు గదిలో ప్రవేశించారు.
“కూర్చొండి.”
టేబుల్ ముందు ముకుందరావుకు ఎదురుగా కూర్చున్నాడు మాస్టారు.
“కుశలమా!.. ముకుందరావుగారూ!..” చిరునవ్వుతో అడిగాడు మాస్టార్.
“బ్రహ్మాండం. మాకేం తక్కువ?”
‘అన్నీ ఎక్కువే!..’ అనుకొన్నాడు మదిలో సాంబశివం మాస్టారు.
“పిలిపించిన కారణం?” అడిగారు మాస్టారు.
ఆ గదిలో మరో నలుగురు కొత్త వ్యక్తులు కూర్చొని వున్నారు.
“మీకో విషయం చెప్పాలి!”
“చెప్పండి”
“ఈ వయస్సులో మీకు ఆ దినపత్రిక పేరేంటీ?”
“భారత అవని..”
“ఆ.. భారత అవని (వికటంగా నవ్వాడు) దాని ఎడిటర్ హోదా తమరికి అవసరమా!..”
“అవసరమే.. అంతిమశ్వాస వరకు నేర్చుకొన్న మంచి విషయాలను, హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ సంఘీభావనకు అవసరమైన సుప్రసంగాలను ప్రజలకు తెలియజేసి, మూడు మతాల మధ్య మత సామరస్యాన్ని, సఖ్యతా సౌభ్రాతృత్యాలను పెంపొందించడం, భావి భారత పౌరులైన నేటి బాలబాలికలు ఆ సుసందేశాలను గ్రహించి అందరూ ఎలాంటి ద్వేష భావాలూ లేకుండా, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, మన భారతావని ఖ్యాతిని పరులు తెలుసుకొనేలా చేయాలనే మహోన్నత ఆశయం రూపకల్పన ఆ మా ‘భారత అవని’ పత్రిక” ఆవేశంగా చెప్పుకొచ్చిన మాస్టార్ ఆపేశాడు.
ప్రక్క కుర్చీలలో కూర్చొని ఉన్నవారు సాంబశివం మాస్టారు గారి ముఖంలోకి ఆశ్చర్యంతో చూచారు.
ముకుందరావు పగలబడి నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నారు ముకుందరావుగారూ!” అడిగాడు సాంబశివం మాస్టారు.
“మీరు ఎంత పిచ్చివారా అని జాలితో.. నవ్వుతున్నాను”
“నామీద మీకు వున్న అభిమానానికి ధన్యవాదాలు. అయితే ఇక నేను వెళ్ళవచ్చా!.. మీరేమైనా చెప్పవలసింది వుందా!..” నిశితంగా ముకుందరావు ముఖంలోకి చూస్తూ అడిగాడు మాస్టారుగారు.
“నన్ను ఆ శ్రీరామ్ గాడు గెలికాడు. అది వాడికి వాడి కుటుంబానికి మంచిది కాదని చెప్పండి. అంతకు రెండింతలు అనుభవించాల్సి వస్తుందని చెప్పండి. త్వరలో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంట్లో కూర్చొని అక్కాయి వండిపెట్టే పప్పుకూడు తింటూ ‘కృష్ణా రామా’ అనుకొంటూ ప్రశాంతంగా బ్రతక ప్రయత్నించండి. కాదు కుదరదూ, నా దారి నాదే అంటూ ముందుకు సాగితే ఆటను కట్టివేయాల్సి వస్తది. ఆలోచించుకో సామీ!..” వికటంగా నవ్వాడు ముకుందరావు.
“ఈ రోజు చస్తే, రేపటికి రెండు. నేను కానీ, నీవు కానీ.. నాకు ఈ వయస్సులో మరణభయం లేదు. నాలోని జ్ఞానాన్ని పదిమందికి పంచాలనే ఆశ తప్ప!.. వస్తాను” కుర్చీనుండీ లేచి వేగంగా బయటికి నడీచి కార్లో కూర్చున్నాడు.
“సార్!.. వెళదామా!” అడిగాడు డ్రైవర్ మస్తాన్.
“పద మస్తాన్!” అన్నారు మాస్టారు.
మస్తాన్ కారును స్టార్ట్ చేశాడు.
ముకుందరావు, అతని అనుచరులు సాంబశివం మాస్టారును చిత్రంగా చూచారు.
“ఏం బావ!.. ఈ అయ్యోరికీ మనం ముహూర్తం పెట్టాలా!..” వికటంగా నవ్వుతూ అడిగాడు ఆ నలుగురిలో ఒకడూ.
“ఆగు.. ఆగు.. చెప్తా.. చెప్తా..” సాలోచనగా అన్నాడు ముకుందరావు.
సాంబశివం మాస్టారు అరగంటలో ప్రెస్‌కు చేరారు. తనకు, ముకుందరావుకు జరిగిన సంభాషణను శ్రీరామ్‌కు వివరించాడు.
అంతా విన్న శ్రీరామ్.. “మాస్టారు గారూ!.. మీ పిల్లలు ఎక్కడ వున్నారు?” అని అడిగాడు.
“ఒకడు బాంబే షిప్పింగ్ కార్పోరేషన్లో పనిచేస్తున్నాడు. రెండవవాడు ఢిల్లీలో సెక్రటేరియట్లో పనిచేస్తున్నాడు.”
ప్రక్కనే వున్న (రాంబాబు) ఏకలవ్య వైపు చూచాడు శ్రీరామ్.
“ఏం సార్!.. ఏదైనా చెప్పాలా?” అడిగాడు ఏకలవ్య.
“ఏకలవ్యా..”
“సార్!..”
“మాస్టారుగారిని నీవు జాగ్రత్తగా చూచుకోవాలి. నీకు తోడు మరో ఇద్దరిని కూడా నీ దగ్గర వుంచుకొని వారికి ఎడిటింగ్ విషయంలో పత్రిక విషయంలో ట్రైనింగ్ ఇవ్వు. సరేనా!..” అడిగాడు శ్రీరామ్.
“అలాగే సార్!” అన్నాడు ఏకలవ్య.
తోటను, ప్రక్కన ప్రవహించే కాలువను, చుట్టూ వున్న పొలాలను చూచి, కొన్ని ఫోటోలను తీసుకొని దినకర్, పరశురామ్, చలపతి ప్రెస్ బిల్డింగ్ లోకి వచ్చారు.
మాస్టారు, ఏకలవ్యకు చెప్పి, శ్రీరామ్, దినకర్, పరశురామ్‌లు గ్రామం వైపు బయలుదేరారు. అక్క శాంతి, బావ ధర్మరాయుడికి చెప్పి శ్రీరామ్ వైజాగ్ బయలుదేరే ముందు..
“అక్కా, బావా! మీతో ఒక విషయం మాట్లాడాలి..” వారి ఇరువురి కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ అన్నాడు శ్రీరామ్.
“ఏమిటి శ్రీరామా!..” అడిగాడు ఆనందరాయుడు.
“నిర్భయంగా చెప్పు రామా!” అడిగింది శాంతి.
“చూడండి.. మీరు నాకు వసంతకు వివాహ ముహూర్తాన్ని నిర్ణయించారు. కానీ నా మనస్సులో..” శ్రీరామ్ పూర్తిచేయకముందే..
“ఏముందో చెప్పు రామా!..” ఆత్రంగా అడిగింది శాంతి.
“నాకంటే చిన్నవారు చలపతి, భారతి ఈ ఇంటివారు అవివాహితులుగా వున్నారు. నేను వారికంటే పెద్దవాడిని కదా!.. నేను వారిని వదలి..” శ్రీరామ్ పూర్తి చేయకముందే శాంతి.
“వదలి వివాహం చేసుకొంటే లోకులు ఏమనుకొంటారు? సమాజం ఏమనుకొంటుందో, అనే కదా సందేహం?” అడిగింది శాంతి.
“అవునక్కా!..”
“తమ్ముడూ!.. లోకులు కాకులు, ఒకరి విషయంలో ఏవైనా అనుకోవచ్చు. ఎన్నైనా అనుకోవచ్చు. వాటిని మనం ఎన్నడూ లెక్కచేయకూడదు. మనం బ్రతికేది మన కోసం.. మన ఆనందం కోసం.. మనవారి సుఖ సంతోషాల కోసం. గంగకు ఇప్పుడు తల్లి అవసరం చాలా ఉంది. బాగా ఆలోచించు. ఆ అవసరాలు ఏమిటో నీకూ అర్థం అవుతాయి. ఇక చలపతి.. వాడు కాలేజీ రోజుల్లో ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని ప్రేమించాడు. పెండ్లి చేసుకోవాలనుకొన్నాడు. ఉన్నట్టుండి ఆ కుటుంబం ఈ ప్రాంతం నుండి మాయమైపోయింది. వారికి ఆడపిల్లల మీద నమ్మకం పోయింది. వాడికి ప్రాణం నేను భారతి, వాడు మాకు సదా వీర హనుమంతుడు. వాడికి మేమంటే ఎంతో ప్రేమ. వాడంటే మాకూ అంతే. వాడి జీవితం మన మధ్యన ఇలాగే సాగిపోవాల్సిందే. ఇక.. భారతి, ఆమెకు ఆలోచనలు లేవు.. రావు. ప్రజాసేవే దాని పరమావధి. నేను మీ బావ ఎంతో చెప్పి చూచాము. భారతి తత్వంలో మార్పు లేదు. రాదు. కనుక నీవు వారిని గురించి ఆలోచించకుండా, నీ గురించి, నీ కూతురు గురించి ఆమె భవిష్యత్తును గురించి ఆలోచించు. నిర్ణయించిన ముహూర్తానికి వసంతను వివాహం చేసుకొని సంతోషంగా భావి జీవితాన్ని ఆనందమయంగా గడుపు రామా!.. ఈ అక్కా బావల మాటలను కాదనవు కదా!!..” ప్రాధేయపూర్వకంగా అడిగింది శాంతి.
ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు. ఆమె ముఖంలోకి చూచిన శ్రీరామ్.. ఆమెను సమీపించి తనచేతులతో శాంతి కన్నీటిని తుడిచాడు. ‘ఇదే రక్తసంబంధం’ అనుకొన్నాడు.
“అక్కా!.. నీ ఇష్ట ప్రకారంగానే జరగాలి” చిరునవ్వుతో చెప్పాడు.
శాంతి, ధర్మారాయుడుల కళ్ళల్లో ఎంతో ఆనందం..
అందరికీ చెప్పి శ్రీరామ్, దినకర్, పరశురామ్‌లు వైజాగ్ కార్లో బయలుదేరారు.
***
వైజాగ్ రాంబాబు, అతని మిత్రులు సాంబశివం మాస్టారు B.S.S మీటింగు స్టేట్ లెవెల్లో అరెంజ్ చేశారు శ్రీరామ్ నిర్ణయానుసారంగా. అప్పటి B.S.S సభ్యుల సంఖ్య దాదాపు ఐదువేలమంది. ఆ మీటింగులో ఎవరెవరు ఏ ఏ జిల్లాలకు చెందినవారో వారిని ఆ జిల్లా కార్యకర్తలుగా భారత అవని, పత్రికా విలేఖరులుగా నియామకం జరిగింది. తక్కువమంది సభ్యులు వున్న జిల్లాకు, ఎక్కువ సభ్యులు వున్న జిల్లా నుండి ఆ జిల్లా వర్గీయ్యులలో చేర్చడం జరిగింది.
శ్రీరామ్ మాట్లాడుతూ.. “మన B.S.S. సభ్యులందరికీ ఒక విన్నపం. మన సిద్ధాంతాలను ప్రతి గ్రామం, స్కూలు, కాలేజీల్లో ఇంతవరకూ సాగించిన రీతిగా ముమ్మరంగా సాగించాలి. మన ప్రసంగాలను విన్న హిందూ ముస్లిం, క్రిస్టియన్ సోదరులు మన అందరి సమద్దేశం అయిన భిన్నత్వం ఏకత్వ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, మన B.S.Sలో చేరేలా ప్రయత్నించడం అందరి సభ్యుల ప్రథమ కర్తవ్యం. మన లక్ష్య సాధనకు మనకందరికీ వుండవలసినది సహనం, సాభాత్రభావన. మన మాస్టారుగారు వ్రాసిన ‘మన భారత అవని’ పుస్తకాన్ని క్రొత్తవారికి ఇవ్వండి. చదవమని చెప్పండి. మీలో ఎవరి దగ్గరైనా పుస్తకాలు అయిపోతే మాస్టారుగారికి ఫోన్ చేయండి. వారు వెంటనే మీరు కోరినన్ని పుస్తకాలను మీకు పంపుతారు. మనమందరం ఆనందించవలసిన మరో విషయం, అచిరకాలంలోనే మన దినపత్రిక ‘భారత అవని’ రాష్ట్రంలో, అన్ని జిల్లాల్లో లభిస్తూ ఉంది. ప్రజలకు మన పత్రిక మీద ఆదరణ పెరిగింది. కారణం పత్రికలో మాస్టారుగారు ప్రచురించే మంచి విషయాలు. మంచికి సదా మన భారతీయులు స్వాగతం పలుకుతారు. పైవారం నుండి కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో కూడా మన ‘భారత అవని’ పత్రిక ఆయా భాషలలో లభ్యం కాబోతూ ఉంది. అంటే B.S.S ఆ రాష్ట్రాలలో కూడా సభ్యత్వాన్ని సాధించబోతూ వున్నదని అర్థం. మన పత్రిక B.S.S కార్యక్రమాలు సవ్యంగా సాగేదానికి నా బ్రిటన్ మిత్రుల బృందం ఎంతగానో సాయం చేశారు. చేస్తున్నారు. వారి సాయంతోనే నేను అనుకొన్న విషయాలను అనుకొన్నట్లుగా సాధించగలిగాము. వచ్చే ఏప్రిల్ నుండి నెల్లూరులో విశాఖలో విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆ సంస్థల స్థాపన ఉద్దేశ్యం చిన్న వయస్సు నుండి బాల బాలికలు మన ‘భారత అవని’ ని గురించి, మన B.S.S సిద్ధాంతాలను గురించి తెలుసుకొని, వారు పెద్దవారై వున్నత విద్యను అభ్యసించే నాటికి B.S.S సభ్యులుగా మారి సంస్థ కోసం, అందరి సఖ్యత కోసం, మన పవిత్ర భారతావని ప్రగతి కోసం, పాటుపడేవారుగా ఎదగాలన్నదే నా ఆశయం” నమస్కరించి శ్రీరామ్ తన ప్రసంగాన్ని ముగించాడు.
అందరు కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. సాంబశివం మాస్టారు ఆనందంగా శ్రీరామ్‌ను కౌగలించుకొన్నారు. మనసారా దీవించారు. ఇది దేవతల వర్గం..
దానవ వర్గం.. దీనికి వ్యతిరేకం. ఆ వర్గీయులు ముకుందరావు, సాంబశివరావు, వారి తనయుడు సాగర్ బాబు, వారి అనుచరులు. జీవితాంతం వరకూ వారి చింతనలో మార్పు రాదు. ధర్మానికి, న్యాయానికి అన్యాయం, నీతికి అవినీతి, మానవతకు దానవత, మంచికి చెడు, చర్యలు జరిపే దానవ వర్గానికి స్వార్థం, స్వాతిశయం, అహంకారం, అమానుషత్వం తప్ప ఏ మంచి విషయాన్ని వారు హర్షించరు. ఆచరించరు. వినరు.
చెట్టున పువ్వు, పిందె, కాయ, పండులను మనం ఎలా చూడగలుగుతున్నామో, అదే రీతిగా మంచివారి కార్యక్రమాలు కాలగతిలో సుఫలాలుగా మారి తీరతాయి. అందరి ఆదరణకు అభిమానానికి పాత్రం అవుతాయి. అది దైవేచ్ఛ.
అలాగే కాలగతిలో దానవ వర్గం. వర్తమానంలో తమకు తిరుగు లేదని విర్రవీగి సాగించే రాక్షస చర్యలకు ఒకనాడు వారు ఊహించని విషవలయంలో చిక్కుకుని, ఎంతగానో బాధపడవలసి వస్తుంది. ఆ ఆరని తీరని క్లేశంతోనే వారి అవతారం పరిసమాప్తి కాబోతూ ఉంది.
అది యుగయుగాలుగా కాలగతిలో మంచికి చెడ్డకు జరిగిన సంఘర్షణ. చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన నగ్న సత్యం.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
