Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-24

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[శ్రీరామ్ తన కొత్త ఇంట్లోకి మారిన తర్వాత గంగ, సుందర్‌లు తమ తల్లి రోజ్ ఫోటోను చూస్తూ భావోద్వేగానికి లోనవుతుండగా, అక్కడికి వచ్చిన వసంత గంగను ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇంట్లో తనను ‘అమ్మా’ అని పిలవమని చెబుతుంది. వసంత తెచ్చిన చక్కెర పొంగలిని శ్రీరామ్ గుర్తుపట్టడంతో వారి పాత కాలేజీ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇంతలో శ్రీరామ్ నమ్మినబంటు చిన్నయ్య వచ్చి, ముకుందరావు మరియు సాంబశివరావు తమ మనుషులతో ఊరిలోకి వచ్చారని, శ్రీరామ్‌కు ఏదో అపకారం చేయాలని చూస్తున్నారని హెచ్చరిస్తాడు. అనంతరం సాయంత్రం వసంత ప్రిన్సిపాల్‌గా ఉన్న కాలేజీలో జరిగిన స్కూల్ డే వేడుకలకు శ్రీరామ్, దినకర్ కుటుంబాలు హాజరవుతారు. ఆ వేడుకలో గంగ, సుందర్ చదువు, ఆటలలో అనేక బహుమతులు గెలుచుకుంటారు. అయితే కార్యక్రమం చివరిలో అకస్మాత్తుగా కరెంటు పోయి అంతా చీకటిమయం కావడంతో, ఆ గందరగోళంలో దుండగులు గంగను కిడ్నాప్ చేసి పారిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరవుతారు. – ఇక చదవండి.]

అధ్యాయం-25

శ్రీరామ్ ఆవేదనను అదుపు చేసుకొని డి.ఎస్పీ పరశురామ్‌కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తొలుత ఆశ్చర్యపోయిన పరశురామ్..

“బావా!.. నీవు బాధపడకు. మన గంగను ఎవరూ ఏమీ చేయలేరు. నేను సిటీ నుంచి బయటికి వెళ్ళే అన్ని దార్లు మూయిస్తాను. యావత్ వైజాగ్ పోలీస్ ఆ దుండగులను వెంటాడుతుంది. కొన్ని గంటల్లోనే, మన గంగను నీ దగ్గరకు తీసుకొని వస్తాను బావా!.. మరలా చెబుతున్నా!.. నీవు భయపడకు, బాధపడకు. కవి కూడా ఎంతగా ఏడుస్తూ వుంటుంది. దానికి గంగ అంటే పంచ ప్రాణాలు. నీవు ధైర్యంగా వుంటూ కవిని ఓదార్చు బావా!..” పరశురామ్ సెల్ కట్ చేశాడు.

ఎంతో సంతోషంగా వెళ్ళిన శ్రీరామ్, వసంత, దినకర్, స్వప్న, సుందర్‌లు ఏడుస్తూ ఇండ్లకు తిరిగి వచ్చారు.

శ్రీరామ్ వారిని ఇంట వదలి తన కారులో బయలుదేరబోయాడు.

వసంత వేగంగా తనూ కారెక్కి..

“పోనివ్వండి!..” అంది దుఃఖభరిత ఆవేశంతో.

శ్రీరామ్ కారును స్టార్ట్ చేశాడు. వీధిలో ప్రవేశించాడు.

గాలీ, వాన, ఉరుములు, మెరుపులు..

కుండపోతగా వర్షం.. హోర్ అనే నినాదంతో తీవ్రగాలి.. వైపర్స్‌ను ఆన్ చేసి శ్రీరామ్ కారును ముందుకు మెల్లగా నడుపుతున్నాడు. కనబడ్డ ప్రతి కారును పరీక్షగా చూస్తున్నాడు.

ప్రక్కనే ఎంతో ఆందోళనతో కన్నీటితో కూర్చొని వున్న వసంత నయనాలు టార్చి లైట్లవలే కనిపించిన ప్రతి కారు వైపు గంగ అన్వేషణలో నిమగ్నమైయున్నాయి.

పరశురామ్ పోలీస్ బృందం నగరం నుండి బయటికి వెళ్ళే అన్ని మార్గాలకు చేరి, సిటీ నుండి బయటికి వెళ్ళే ప్రతి కారును, వ్యాన్స్‌ను బస్సులను లారీలను తనిఖీ చేసి పంపుతున్నారు..

పరశురామ్ తన జీప్‍లో అన్ని అవుట్లెట్స్‌ను తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ వున్నాడు. వసంత, శ్రీరామ్‌లు కార్లో అదే రీతిగా ప్రతి రోడ్డును గంగ జాడను తెలుసుకోవడానికి ఎంతో ఆతృతతో వెదుకుతున్నారు. వారి భావనలో ఒక క్షణం ఒక యుగంలా భారంగా నడుస్తూ ఉంది. మనస్సున తీవ్ర వేదన, నయనాల్లో కన్నీరు. పిచ్చివాళ్ళలా దిక్కులు చూస్తూ ముందుకు సాగుతున్నారు.

పరమనీచుడు దుర్మార్గుడు అయిన ముకుందరావు ఒక చేత్తో.. మందు బాటిల్‌ను పట్టుకొని త్రాగుతూ, శ్రీరామ్ కారును ఫాలో చేస్తూ, శ్రీరామ్ వసంతలు కారునుండి దిగితే కాల్చాలనే ప్రయత్నంలో కారును నడుపుతున్నాడు.

విశాలమైన వీధిలో ప్రవేశించారు శ్రీరామ్, వసంతలు. వారి కారుకు అరకిలోమీటర్ దూరంలో ముకుందరావు కారు. ఆ రోడ్లో డ్రైనేజ్ పైప్ లైను చేసేదానికి మూడు మీటర్ల లోతున, ఒకటిన్నర మీటర్ వెడల్పున జెసిబి కాలవను త్రవ్వియున్నారు.

మందు మైకంలో ముకుందరావుకు దారి అంతా అస్పష్టంగా కనిపించసాగింది. స్టీరింగ్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. పెద్దగా ఉరుము, చిత్ర విచిత్రంగా మెరుపు. ముకుందరావు కళ్ళకు అంతా అయోమయం. కారు రోడ్డు ప్రక్కన వున్న మూడు మీటర్ల గుంటలో నిలువుగా పడిపోయింది. కారు పూర్తిగా గుంటలోపలికి వెళ్ళిపోయింది. ముకుందరావు స్పృహ కోల్పోయాడు. శ్రీరామ్ కారు నగరం చివరి భాగానికి చేరింది. అక్కడ రోడ్డుకు ప్రక్కన యాభై అడుగుల దూరంలో పద్నాలుగు అంతస్తుల ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతూ వుంది. అన్నతమ్ముల వివాదాలతో మూడు మాసాలుగా భవన నిర్మాణం ఆగిపోయింది. శ్రీరామ్ కారు ఆ మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్‌ను సమీపించింది.

వసంత తన జాకెట్లో దాచి వుంచిన గన్ బయటకి తీసింది. ఆమె చేతిలోని గన్ చూచి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు.

“వసూ!.. ఈ గన్ ఎక్కడిది?” ఆశ్చర్యంతో అడిగాడు.

“నాదే!.. నేను ఒకనాటి మిస్ ఆంధ్రాను, చాలామంది ఎదవల కళ్ళు నాపై నున్నాయి. ఏ క్షణంలో ఎవరి వలన నాకు ఎలాంటి అపాయం రాబోతుందో నాకు తెలియదు కదా!.. అందుకని ఆత్మ రక్షణ లైసెన్స్‌తో ఈ గన్ తీసుకొన్నాను. ఇది ఎప్పుడూ నాతోనే వుంటుంది” చెప్పి అద్దాన్ని దించి గన్‌ను బయటపెట్టి రెండుసార్లు కాల్చింది.

శ్రీరామ్ అదిరిపోయాడు. కళ్ళు పెద్దవి చేసి వసంత ముఖంలోకి చూచాడు.

“వసూ!.. తుపాకిని ఎందుకు పేల్చావు?” ఆశ్చర్యంతో అడిగాడు.

“ఆ భవంతిలో దుండగులు దాగి వుండవచ్చని నా అనుమానం.. నా గన్ శబ్దాన్ని విని వారు భయంతో మనలను చూడ ప్రయత్నించవచ్చు. అంటే వారికి ఎవరో వారిని వెంటాడిన భావన కలుగుతుంది. ఏదో ఒక మూలనుంచి తలను వెళ్ళబెట్టవచ్చు లేదా మనపై వారు కాల్పులు జరుపవచ్చు. అలా జరిగితే మనం ఆ కిరాతకులున్న ప్రాంతానికి వచ్చినట్లవుతుంది. వారిని పట్టుకోవడానికి వీలవుతుంది. మీరు కారును బిల్డింగ్ దగ్గరకు పోనిచ్చి ఆపండి. మనం కారునుండి దిగి, ఈ బిల్డింగ్లో వెతుకుదాం.” ఆవేశంగా చెప్పింది వసంత.

వసంత ధైర్య సాహసాలకు శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. బిల్డింగ్ ముందు కారును ఆపాడు. ఇరువురూ క్రిందికి దిగారు. వసంత మరోసారి తుపాకిని పేల్చింది.

“మీరు పైకి కనిపించే ఫ్లోర్లలో వెదకండి. మీ దగ్గర తుపాకి వుందిగా!..”

“ఆ వుంది”

“మీకు ఎవరైనా కనబడితే.. రెండుసార్లు తుపాకిని పేల్చండి. అంటే దుండగులను మీరు చూచినట్లు. నేను బేస్మెంట్ ఫ్లోర్లను వెదుకుతాను. నాకు ఎవరైనా కనిపిస్తే నేనూ రెండుసార్లు తుపాకిని పేలుస్తాను. మెట్ల మీద మీరు పైకి వెళ్ళి చూడండి.”

శ్రీరామ్ ఫ్లోర్లను లెక్కపెట్టాడు.

“వసు!.. పద్నాలుగు ఫ్లోర్లు!..” ఆశ్చర్యంతో చెప్పాడు శ్రీరామ్.

“ఇరవై అయినా సరే వెదకాల్సిందే!..” ఆవేశంగా అంది వసంత.

“మెట్ల మీదనేగా ఎక్కాలి!..”

“లిఫ్ట్‌ను ఇంకా బిగించలేదుగా!.. మెట్ల మీదనే వెళ్ళాలి!.. పద్నాలుగు ఫ్లోర్లు!” విచారంగా అన్నాడు శ్రీరామ్.

“అవును వెళ్ళండి.”

శ్రీరామ్ మెట్లు ఎక్కసాగాడు.

వసంత బేస్మెంట్ ఫ్లోర్ వన్‌లో ప్రవేశించింది.

వర్షం, గాలీ ఆగలేదు. మధ్య మధ్యన ఉరుములు, మెరుపులు గాఢాంధకారం.

తన దగ్గర స్పేర్‌గా వున్న తూటాలను గన్ లోడ్ చేసింది.

సెల్ లైట్ సాయంతో తొలి బేస్మెంట్ అంతా వెదికింది. ఎవరూ కనిపించలేదు.

రెండవ బేస్మెంటులో ప్రవేశించింది. జాగ్రత్తగా అన్నివైపులా వెదికింది. ఎవరూ కనుపించలేదు. మూడవ బేస్మెంటులో ప్రవేశించింది.

అతి ప్రయాసతో శ్రీరామ్ ఐదు ఫ్లోర్లు ఎక్కాడు. అతనికీ ఎవరూ కనుపించలేదు.

వసంత మూడవ ఫ్లోర్లో.. ఒక మూలన వున్న గదిని సమీపించింది. పదిమంది అమ్మాయిలను చూచింది. వారి చేతులు, కాళ్ళు కట్టేసి వున్నాయి. నోట్లో గుడ్డలను కుక్కి వున్నారు.

ముగ్గురు ధృడకాయులు వారి ముందు నిల్చొని మందు త్రాగుతున్నారు.

అందులో వసంత గంగను చూచింది. మనస్సున చెప్పలేనంత ఆనందం. పరవశంతో ‘గంగ..’ అని అరవబోయింది. అరిస్తే వారు తనపైకి రావచ్చు. ఆ ప్రయత్నాన్ని ఆపి.. వేగంగా పైకి పరుగెత్తి.. శ్రీరామ్‌ను కలిసికొంది. తాను మూడవ బేస్మెంటులో చూచిన దృశ్యాన్ని గురించి శ్రీరామ్‍కు చెప్పింది వసంత.

సంతోషంతో శ్రీరామ్ ఉప్పొంగిపోయాడు. వసంతను గట్టిగా కౌగలించుకొన్నాడు.

“సార్!.. రోమాన్స్‌కి ఇది సమయం కాదు, వదలండి క్రిందికి వెళ్ళి మన బిడ్డను రక్షించుకోవాలి” అంది వసంత.

ఇరువురూ మూడవ బేస్మెంటులో ప్రవేశించారు. శ్రీరామ్ పరశురామ్‌కు ఫోన్ చేశాడు.

“చూడండీ. ఈ ముగ్గురితో మనం పోరాడలేము. వీళ్ళను కాల్చక తప్పదు” ఆవేశంగా చెప్పింది వసంత.

గురిపెట్టి మూడు గుళ్ళు పేల్చింది.

ఆ ముగ్గురికీ ఆ గుళ్ళు, ఒకడికి భుజాన, ఒకడికి తొడకు, మూడవవాడికి వీపునా తగిలాయి.

‘అమ్మా.. అమ్మా.. అమ్మా..’ అంటూ ఒకరి తరువాత ఒకరు, నేలకు ఒరిగారు. వారు ఉమర్, ఏసు, ముస్తఫా.. వారి దగ్గర వున్న ఫోన్స్‌ను, గన్లను వసంత లాక్కుంది. పరుగున ఇరువురూ పిల్లలను సమీపించారు. వారి నోట్లోని గుడ్డలను కాళ్ళకు చేతులకు వున్న దారపు కట్లను విప్పారు.

గంగను బంధవిముక్తిరాలిని చేసి వసంత ఆమెను తన హృదయానికి హత్తుకొంది. శ్రీరామ్ ఆ ముగ్గురి చేతులు కాళ్ళను ఫ్లోర్లో వున్న టెంకాయ నారదారంతో కట్టేశాడు.

“అమ్మా!..” అంటూ గంగ వసంత ఎదపై వాలిపోయింది.

ఆనందంతో శ్రీరామ్ గంగ తలను తన హృదయానికి హత్తుకొన్నాడు.

ఆ మిగతా పిల్లలు వారి చుట్టూ చేరారు. అందరూ ఇరవై సంవత్సరాల లోపు కన్నెపిల్లలు. పేదవారు. పెద్దగా చదువుకోని వారు, గొప్పవారి ఇండ్లలో పని ఇప్పిస్తామని, మంచి జీతం నెలనెలా ఇస్తారని, ఆ పిల్లల తల్లితండ్రులకు చెప్పి వారిని అక్కడికి తీసుకొని వచ్చి బంధించారు ఆ ముగ్గురూ. ఇరవైమందిని చేర్చి, వారిని అరబ్ కంట్రీలకు పంపడం వారి వ్యాపారం. వారి నాయకుడు ముకుందరావు.

అందరూ మొదటి బేస్మెంటు పైకి వచ్చారు.

గాయపడిన వారు కూడా ఏడుస్తూ పైకి చేరారు.

ఆ పరిసర ప్రాంతాల్లో వున్న పరశురామ్, యాంబులెన్స్‌కు వ్యాన్‌కు, తన బలగానికి ఫోన్ చేసి అక్కడికి వచ్చాడు.

జరిగిన కథనంతా వసంత తన సోదరునికి వివరించింది.

“అరే అన్నా!.. విధిలేని పరిస్థితుల్లో నేను ఆ ముగ్గురినీ కాల్చాను.” నవ్వుతూ సగర్వంగా చెప్పింది వసంత.

“కాల్చింది నీవు కాదు నేను!..” అన్నాడు శ్రీరామ్.

మరుక్షణంలో..

“ఓరేయ్ పరశూ!.. నీ చెల్లి..”

“రాణి రుద్రమ బావా!..” నవ్వాడు పరశురామ్.

వ్యాన్, అంబులెన్స్, పోలీసులు వచ్చారు.

ఆడపిల్లలను వ్యాన్లో ఎక్కించారు.

ఉమర్, పశు, ముస్తఫాలను అంబులెన్స్‌లో ఎక్కించారు. వారిని చూడవచ్చిన గంజాయి (opium) నల్లమందు వ్యాపారులు శంభు. సర్దారీలను పట్టుకొన్నారు. పోలీస్ జీప్‌లో ఎక్కించారు. శ్రీరామ్ వసంత గంగలు కార్లో కూర్చొని వారి ఇంటి వైపుకు బయలుదేరారు.

పరశురామ్ వారిని అనుసరించి, ముకుందరావు కారు పడిపోయిన ట్రెంచ్ దిగి చూచాడు. ముకుందరావు ఆటలు ముగిసిపోయాయి. అతన్ని పోస్ట్ మార్టమ్‌కు అంబులెన్స్ ఎక్కించాడు.

సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారం దుష్టశిక్షణ శిష్ట రక్షణ ఆ రీతిగా ఆ ప్రళయరాత్రిలో జరిగింది.

పరశురామ్ తన జీప్‌లో దినకర్ ఇంటికి చేరాడు.

శ్రీరామ్, వసంత, గంగలు ఇంటికి చేరారు. దినకర్, స్వప్న, సుందర్‌లు పరమానందంతో గంగను కౌగలించుకొన్నారు. పరశురామ్ గంగను ముద్దులాడాడు.

“ఈ క్షణంలో మనమంతా ఇంత ఆనందంగా వుండేదానికి ముఖ్య కారణం మన వసంత.” ప్రీతిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పరవశంతో చెప్పాడు శ్రీరామ్.

అందరి వదనాల్లో అనిర్వచనీయమైన ఆనందం.

ఆనాటికి శ్రీరామ్, వసంతల వివాహం జరిగేదానికి వున్న సమయం మూడురోజులు.

శ్రీరామ్ తన అక్క బావలకు ఫోన్ చేసి జరిగిన కథనంతా వివరించారు. వారంతా బయలుదేరి వైజాగ్ వచ్చారు మరుదినం.

దినకర్, శ్రీరామ్, వసంతల వివాహానికి మంగళగిరి ఆలయంలో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయించాడు పరశురామ్ డి.ఎస్.పి.

వివాహపు రోజు ఉదయం ఆరుగంటలకల్లా అందరూ ఒక పెద్ద వ్యాన్‌లో మంగళగిరికి చేరారు. సాంబశివం మాస్టారు, B.S.S ముఖ్య సభ్యులు రాంబాబు, రహీమ్, రాబర్ట్ మరికొంతమంది ముఖ్యులు శ్రీరామ్, వసంత వివాహానికి హాజరైనారు.

శుభ ముహుర్తాన, శ్రీరామ్, వసంతల వివాహం వేదమంత్రాలతో ఎంతో ఘనంగా జరిగింది. వివాహానంతరం ప్రథమంగా ఆ దంపతులు సాంబశివం మాస్టారుగారికి నమస్కరించి, శాంతి ఆనందరాయుడి పాదాలను తాకి వారి శుభాశీస్సులను అందుకొన్నారు.

తరువాత సదాశివం మాస్టారుగారు అందరినీ ఉద్దేశించి..

“ఈనాడు చాలా సుదినం. కారణం భావి భారత పౌర నిర్మాణానికి ఉన్నత భావాలు కల ఒక యువతి, యువకుడు ఆలుమగలైనారు. అది మనందరికీ ఎంతో ఆనందకరమైన విషయం.

77 ఏళ్ళ ఈ మన స్వతంత్ర భారత అవనిలో ఎందరో మహనీయులు సమాజ వున్నతికి పాటు పడేవారున్నారు. అలాగే సమాజ ప్రగతికి గొడ్డలి పెట్టుగా వర్తించే మరో వర్గమూ వుంది. ఆ రెండు వర్గాలకూ నిరంతరం సంఘర్షణ. చివరకు అంతిమ విజయం ధర్మానికే.. ఆధర్మవర్తనులైనవారు ఆ పరమసత్యాన్ని గ్రహించక, పరివర్తన చెందక, సమాజం అనే ఈ సుక్షేత్రంలో కలుపు మొక్కలుగా కొందరు వున్నారు. ఆ కలుపు మొక్కలను పరిసమ్మూలంగా పారవేయడం, విద్యావంతులైన మీరు కర్తవ్యంగా భావించాలని, మీ అందరికీ నా మనవి. విన్నపం. మేము నడిపై భారత అవని పత్రిక B.S.S సంస్థ మహత్తర ఆకాంక్ష, ఆశయం అదే. కులమత రహిత సమసమాజ నిర్మాణం జరగాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ భారతీయులే. ఈ భూమి పరమ పవిత్ర ‘మన భారత అవని’ అతివలను బాలికలను గౌరవించాలి అభిమానించాలి. అందరూ పరస్పర మైత్రీ భావంతో కలిసి ఆనందంగా బ్రతకాలి. దేశమును ప్రేమించాలి, జై జై జయహో భారత అవని. జై జై జయహో ఆంధ్రావని..” సదాశివం మాస్టారు తన ప్రసంగాన్ని ముగించారు. నమస్కరించారు.

అందరి కరతాళ ధ్వనులతో ఆ ఆలయప్రాంతం మారుమ్రోగింది.

హైకోర్టులో తొలి హియరింగ్‌లో ఇరుపక్షాల లాయర్ల వాదనలను విన్న జడ్జిగారు ఆ కేసును కొట్టివేసి, జిల్లా కోర్టు ఆర్డర్‌ను ఖాయం చేశారు. నేరస్థులందరూ జైలు పాలైనారు. ధర్మో రక్షితి రక్షితః..

జైహింద్..

జయ జయ జయహో ‘మన భారత అవని’.

(సమాప్తం)

Exit mobile version