Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-3

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[యూనివర్శిటీలో ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో రోజీ శ్రీరామ్‌ని కలిసేది. కుశల ప్రశ్నలు వేసేది. కొన్నిసార్లు తన సందేహాలకు సమాధానాలు అడిగి తెలుసుకునేది. ఇద్దరూ ఫ్రీ టైమ్‌లో క్యాంటిన్‌కి వెళ్ళి కాఫీ తాగుతూ దేశవిదేశాల కబుర్లు చెప్పుకునేవారు. ఒకరోజు క్యాంటిన్‌లో ఉండగా భారతదేశం గురించి చర్చ జరుగుతుంది. నేడు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరాలతో, ఓ మహనీయుడు వ్రాసిన శ్రీరామ మంత్రాన్ని రోజీకి వివరిస్తాడు శ్రీరామ్. ఆమె భారతదేశపు గొప్పతనాన్ని ప్రస్తుతిస్తుంది. లండన్‌లో చూడాల్సిన ప్రదేశాల గురించి ఆమెను అడిగితే, ఆమె కొన్ని పేర్లు చెప్తుంది. వాటన్నిటినీ చూడాలంటాడు శ్రీరామ్. తాను తీసుకెళ్ళి చూపిస్తానంటుంది రోజీ. ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి అభిమానం పెరుగుతుంది. ఒక శనివారం రోజు రోజీ శ్రీరామ్ గదికి వచ్చి, మర్నాడు అతని ప్రోగ్రామ్ ఏమిటని అడిగి, లండన్ నగరం సందర్శనకి వెళ్దామా అని అడుగుతుంది. మర్నాడు ఉదయం ఏడున్నరకల్లా రోజీ ఇంటికి వెళ్తాడు. రోజీ తల్లి దుర్గ, తండ్రి థామస్ శ్రీరామ్‌ని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆదరంగా మాట్లాడుతారు. టిఫిన్ చేసి, పెద్దలకి చెప్పి, నగర సందర్శనకి బయల్దేరుతారు రోజ్, శ్రీరామ్. – ఇక చదవండి.]

అధ్యాయం-4

1. లండన్ వెస్ట్ మినిస్టర్ అబ్బే:
ఇది ఒక అద్భుత కట్టడం. గవర్నమెంటు ఆధీనం. బకింగ్ హోమ్ ప్యాలెస్కు దగ్గరలో వుంది. ప్రసిద్ధమైన అంగ్లికెన్ చర్చి అక్కడ వుంది. అక్కడ భవంతుల ఆర్కిటెక్చర్ అద్భుతం. లాన్స్, గార్డెన్స్ చాలా బాగుంటాయి. ప్రతి నిత్యం దేశ విదేశీయులు వచ్చి సందర్శిస్తుంటారు.

2. బకింగ్ హోమ్ ప్యాలెస్:
ఈ ప్యాలెస్ నిర్మాణం కడు ప్రశంసనీయం. చరిత్రనాయకుల చిత్రాలు కడు మనోహరం. అది రాయల్ ఫ్యామిలీ (క్వీన్ & కింగ్) నివాసం. అది లండన్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ క్వార్టర్స్. ఇచ్చట వాస్తు శిల్పం కడు రమ్యం.

3. బిగ్ బెన్
బిగ్ బెన్ బ్రిటీషర్స్ యొక్క నాగరీకతకు చిహ్నం. బ్రిటీష్ కల్చర్‌కు ఇది గొప్ప సాక్షి. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌కు, మరియు పార్లమెంటరీ డెమాక్రసీకి నిదర్శనం. కట్టడ నిర్మాణం మహా అద్భుతం.
4. లండన్ ఐ:
ఆ ‘ఐ’, 2000 సంవత్సరంలో ఓపెన్ చేయబడినది. దాని ఎత్తు 135 మీటర్లు (443 అడుగులు).

1999లో దాని నిర్మాణ కాలంలో ప్రపంచంలో కెల్లా అది ఎత్తైన జెయింట్ వీల్.. అది క్యాటిలివరీ చక్రం (Wheel) దానికి దేశ, విదేశాల నుండి 85 అవార్డ్స్ లభించాయి. ఇంజనీర్ల అమోఘ ప్రతిభకు ఆర్కిటెక్చర్ తీరుతెన్నులకు అది లండన్ మహా నగరంలో అద్భుత దృశ్య చిత్రం.

రోజ్, శ్రీరామ్‌లు ఆ నాలుగు ప్రదేశాలను చూచారు. రోజ్ తనకు తెలిసినంత వరకూ వాటి గొప్పతనాన్ని, చరిత్రను శ్రీరామ్‌కు వివరించింది.

రోజ్ మాటలను ఎంతో ఆసక్తికరంగా విన్నాడు శ్రీరామ్. ఇరువురూ కలిసి వారు చూచిన ప్రదేశాలను గురించి చర్చించుకొంటూ లంచ్ చేశారు మూడుగంటలకు.

“రోజ్! తరువాత ఎక్కడికి తీసుకుని వెళతావు?” అడిగాడు శ్రీరామ్.

“Kensington Garden, Best Park ఓకేనా సార్!..”

“ఓకే రోజ్, నీ ఇష్టమే నా ఇష్టం!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

“మీ ఆనందమే నా ఆనందం సార్!..” అందంగా నవ్వుతూ అంది.

‘రోజ్ నవ్వితే చాలా బాగుంటుంది.’ శ్రీరామె పెదాలు అప్రయత్నంగా పలికాయి.

“సార్ ఏమన్నారు?”

“ఏమీ అనలేదే!”

“అన్నారు. నేను చెప్పనా సార్!..”

“ఆ.. చెప్పు చూద్దాం..”

“చెబుతున్నా!” కొంటెగా శ్రీరామ్ ముఖంలోకి చూచింది రోజ్.

“రోజ్ నవ్వితే బాగుంటుంది అన్నారు కదూ!” చిరునవ్వుతో శ్రీరామ్ ముఖంలోకి చూచింది రోజ్.

“అవును” నవ్వాడు ఆనందంగా శ్రీరామ్.

రోజ్ కూడా ఆనందంగా నవ్వింది.

ఇరువురూ పార్కుకు బయలుదేరారు.

కారును శ్రీరామ్ నడుపుతున్నాడు.

రోజ్ అతని ప్రక్కన ముందు సీట్లో కూర్చొని వుంది.

ఆమె మనస్సు నిండా శ్రీరామ్ గురించిన ఆలోచనలు.

‘వీరి సాహచర్యంతో, వీరు నా మనస్సున తిష్ట వేశారు. నా మనస్సు నిండా వీరిని గురించిన ఆలోచనలే. ఆ నా ధోరణి తప్పా, ఒప్పా!.. నేను వారిని గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా!.. నాకు వివాహం కాలేదు. వారికీ కాలేదు. వారు నన్ను ఎంతగానో ఆకర్షించారు. మరి నా గురించి వారి మనస్సున ఎలాంటి భావన ఉందో!.. ఎలా నాకు తెలుస్తుంది?.. నర్మగర్భితంగా అడిగితే తెలుస్తుందిగా!.. అవును.. అడగాలి’ అనుకొంది రోజ్.

శ్రీరామ్ ముఖంలోకి చూచింది.

దృష్టిని రోడ్డుపై నిలిపి నిశ్చలంగా డ్రైవింగ్ చేస్తున్నాడు శ్రీరామ్. కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది.

తరువాత..

“సార్!..”

“ఏమిటి రోజ్!..” శ్రీరామ్ దృష్టి మారలేదు.

“నేను మిమ్మల్ని మీకు సంబంధించిన ఒక ప్రశ్న అడుగనా!..”

“అడుగు.. ఏమిటా యక్ష ప్రశ్న!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

“యక్ష ప్రశ్ననా!..” ఆశ్చర్యంతో అడిగింది రోజ్.

“అవును నేను అన్నది అదే!..” శ్రీరామ్ జవాబు.

“యక్ష ప్రశ్నల గురించి మీకు తెలుసునా సార్!..”

“ఆ.. మరి నీ ప్రశ్న ఏమిటి?”

“నన్ను తప్పుగా అనుకోకూడదు!”

“అనుకోను అడుగు!”

“మీరు ఎవరినైనా ప్రేమించారా సార్!..” ఓరకంట శ్రీరామ్ ముఖంలోకి చూస్తూ అడిగింది రోజ్.

“ప్రేమించాను..” వెంటనే శ్రీరామ్ జవాబు.

“ఆఁ..” రోజ్ ముఖంలో ఆశ్చర్యం.

క్షణం తర్వాత.. “సార్!..” మెల్లాగా అంది రోజ్.

“మరో ప్రశ్ననా!..” అడిగాడు శ్రీరామ్.

“కాదు తొలి ప్రశ్న కంటిన్యూషన్!”

“అడుగు”

“ఆ అదృష్టవంతురాలు ఎవరు సార్!..”

‘ఇదే తగిన సమయం. నా అభిప్రాయాన్ని రోజ్‌కు చెప్పాలి’ అనుకొన్నాడు శ్రీరామ్. స్టీరింగ్ ప్రక్కన వున్న అద్దాన్ని రోజ్ వైపుకు తిప్పాడు.

“రోజ్!..”

“సార్!..”

“చూస్తావా!”

“ఎవరిని సార్!..” ఆత్రంగా అడిగింది రోజ్.

“మై లవ్.. అద్దంలో చూడు కనబడుతుంది” నవ్వుతూ అన్నాడు శ్రీరామ్.

రోజ్ బెదురు చూపులతో అద్దంలో చూచింది. తనకు కనబడింది తన ముఖం. రోజ్ ఆశ్చర్యపోయింది.

“సార్!..” బిగ్గరగా అరిచింది.

శ్రీరామ్ ఆశ్చర్యంతో రోజ్ ముఖంలోకి చూచాడు.

ఆమె సంతోష పారవశ్యంతో తన చేతులతో కళ్ళు మూసుకొంది.

శ్రీరామ్ కొన్ని క్షణాలు ఆమె ముఖంలోకి చూడబోయాడు. ఆమె చేతులు ఆమె ముఖాన్ని కప్పేస్తున్నాయి.

శ్రీరామ్ కారును రోడ్డు ప్రక్కన ఆపాడు.

రోజు దగ్గరగా జరిగాడు. మెల్లగా..

“రోజ్!.. నేను తప్పుగా మాట్లాడానా!.. నా మాటలు నీకు కష్టాన్ని, వేదనను కలిగించాయా!.. రోజ్!.. ఐయాం సో..”

శ్రీరామ్ పూర్తి చేయకముందే..

తన కుడిచేతిని శ్రీరామ్ నీటికి అడ్డుగా పెట్టింది.

వదనంలో సంతోషం, కళ్ళల్లో నీళ్ళు అవి కన్నీరు కాదు ఆనంద భాష్పాలు.

“సార్!.. నేను చాలా అదృష్టవంతురాలిని” నవ్వుతూ చెప్పింది రోజ్.

“అంటే!..” ఆశ్చర్యంతో అడిగాడు శ్రీరామ్.

“ఐ టూ లవ్ యు సార్!” అందంగా నవ్వి తలను దించుకొంది. శ్రీరామ్ కళ్ళల్లో చిత్రమైన మెరుపు. వదనంలో సంతోషం..

“రోజ్!..”

“సార్!..”

“నేనంటే నీకు ఇష్టమేనా!”

“అవును..”

“ఎంత?”

“మాటల్లో చెప్పలేనంత సార్!..” కన్నీటిని తుడుచుకొని నవ్వుతూ కళ్ళు పెద్దవి చేసి శ్రీరామ్ ముఖంలోకి ఆరాధనా భావంతో చూచింది రోజ్.

శ్రీరామ్ నవ్వుతూ తన కుడిచేతిని రోజ్ వైపుకు సాచాడు.

రోజ్ తన కుడి చేతిని శ్రీరామ్ చేతిలో కలిపింది.

ఇరువురూ ఏకభావనతో ఆనందంగా నవ్వుకొన్నారు.

శ్రీరామ్ కారును స్టార్ట్ చేశాడు. పదినిముషాల్లో కారు పార్కులో ప్రవేశించింది.

ఇరువురూ కారు దిగారు. ఆనందంగా అరగంటసేపు పార్కులో తిరిగారు. ఇరువురి మనస్సున వారి భావి జీవితపు మధుర తలపులు. లాన్లో ఒకచోట ఎదురెదురుగా కూర్చున్నారు.

ఇరువురి మనస్సులు ఎంతో ఆనందంగా వున్నాయి. ఒకరినొకరు చూచుకొంటూ నవ్వుకొంటున్నారు. పవిత్ర ప్రేమకు అది మొదటి దశ.

“రోజ్!..”

వంచిన తలను పైకెత్తి ఆశగా అతని ముఖంలోకి చూచింది రోజ్. “సార్!..” మెల్లగా పలికింది.

“నేను నీకు ఒక విషయం చెప్పనా?” చిరునవ్వుతో అడిగాడు శ్రీరామ్.

“చెప్పండి సార్!”

“నేను..”

“ఆ నేను.. అంటే మీరు కదా సార్!..”

“అవును నిన్ను చూచిన..” ఆగిపోయాడు శ్రీరామ్.

“చూచిన?..” ప్రశ్నార్థకంగా శ్రీరామ్ ముఖంలోకి చూచింది రోజ్.

“తొలి చూపులోనే, నీవు నా హృదయంలో నిలిచిపోయావు” ప్రీతిగా చెప్పాడు శ్రీరామ్.

రోజ్ అందంగా నవ్వింది.

“రోజ్!.. నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా?”

“మీకు నేను నచ్చడం అన్నది, నా అదృష్టంగా భావిస్తున్నాను సార్!..”

“సో ఐయాం వెరీ లక్కీ!” నవ్వాడు శ్రీరామ్.

“మీరు కాదు నేను.. నేను వెరీ లక్కీ సార్!..” ఆనందంగా నవ్వింది. “నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతాను.”

“ఎప్పుడు సార్!..”

“నీవు చెప్పినప్పుడు!”

“టు డే టెన్త్. ఎల్లుండి పన్నెండవ తేదీన నా పుట్టినరోజు. ఆ రోజు మాట్లాడండి. వారు తప్పక అంగీకరిస్తారు. కారణం మీరంటే వారికి ఎంతో అభిమానం” నవ్వుతూ చెప్పింది రోజ్.

“అలాగే!..”

కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయింది.

“సార్!..”

“ఏమిటి రోజ్!..”

“చతుషష్టి కళలు అంటే ఏమిటి సార్!..”

“చెప్పనా?”

“చెప్పండి సార్!..”

“చతుషష్టి కళలు అంటే 64 కళలు. అవి..
1.ఇతిహాసము 2. ఆగమము 3. కావ్యము 4. అలంకారము 5. నాటకము 6. గాయకత్వము 7. కవిత్వము 8. కామశాస్త్రము 9. దురోదరము 10. దేశభాషా లిపిజ్ఞానము 11. లిపికర్మము 12. వాచకము 13. అవధానము 14. స్వరశాస్త్రము 15. శకునము 16. సాముద్రికము 17. రత్నశాస్త్రము 18. రథాశ్వ గజకౌశలము 19. మల్లశాస్త్రము 20. సూదకర్మము 21. దోహదము 22. గంధవాదము 23. ధాతువాదము 24. ఖనివాదము 25. రసవాదము 26. జలవాదము 27. అగ్ని స్తంభనము 28. ఖడ్గ స్తంభనము 29. వాక్ స్తంభనము 33. మోహనము 34. విద్వేషణము 35. ఉచ్చాటనము 36. మారణము 37. కాలవంచనము 38. పరకాయ ప్రవేశము 39. పాదుకాసిద్ధి 40. వాక్సుద్ధి 41.ఇంద్రజాలిక 42. ఆంజన 43. దృష్టి వంచనము 44. స్వర వంచనము 45. మణి సిద్ధి 46. చోరకర్మం 47. చిత్ర క్రియ 48. లోహ క్రియ 49 అశ్న క్రియ 50.మృత్రియ 51. దారుక్రియ (వడ్రంగం) 52. వేణు క్రియ 53. చర్మ క్రియ 54. అంబర క్రియ 55. అదృశ్య కరణము 56. దూతీ కరణము 30. వాయు స్తంభనము 31. వశ్యము 32. ఆకర్షణము 57. వాణిజ్యము 58. పాశుపాల్యము 59. కృషి 60. ఆసవకర్మ 61. ప్రాణి ద్యూత కౌశలము 62. జలస్తంభనము 63. మంత్రసిద్ధి (ఈ అరవై నాలుగు చతుష్షష్టి కళలు) 64. ఔషధసిద్ధి.

ఈ 64 కళలను ఎరిగిన మహావక్త శ్రీ కృష్ణ భగవానులు. వారు వారి సోదరులు బలరాము(డు)లు. ఆ కళలను వారి గురువర్యులు శ్రీ సాందీప మహర్షి వద్ద అభ్యాసించారు. లలిత కళలు ఎనిమిది. లలితకళలు:- ఆధునిక విద్యారంగంలో ఎనిమిదిగా విభజించారు.
1. సంగీతము 2. నాట్యము 3. శిల్ప చిత్రికరణ 4. వ్యాస 5. పెయింటింగ్ 6. ఆర్కిటెక్చర్ 7. వకృత్వం 8. సాహిత్యం..”

శ్రీరామ్ తన వాచ్‌ని చూచాడు.

“రోజ్!.. గంట ఏడున్నర. బయలుదేరుదామా!”

“అలాగే సార్!..”

ఇరువురూ లేచారు కారును సమీపించారు. రోజ్ ఇంటికి ఎనిమిది గంటలకు చేరారు. దుర్గ శ్రీరామ్‌కు కలిపి వంట చేసింది. వారి బలవంతం వలన భోజనం చేసి ‘గుడ్ నైట్’ చెప్పి శ్రీరామ్ ఆనందంగా తన ఇంటికి బయలుదేరాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version