Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-4

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రోజీతో కలిసి లండన్ లోని ప్రముఖ పర్యాటక స్థలాలను సందర్శిస్తాడు శ్రీరామ్. ఇద్దరు ఒకరిపై ఒకరి గల ఇష్టాన్ని వ్యక్తపరచుకుంటారు. మీరు ఎవరినైనా ప్రేమించారా అని రోజ్ అడిగితే, స్టీరింగ్ పక్కన ఉన్న అద్దాన్ని రోజ్ వైపుకి తిప్పి, ఆ అమ్మాయిని ప్రేమించాను అని అంటాడు. రోజ్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోతుంది. తానేమైనా తప్పుగా మాట్లాడానా అని అనుకుంటాడు శ్రీరామ్. అందుకని సారీ చెప్పబోతుంటే, రోజ్ ఆపి, ఐ లవ్ యు అని చెబుతుంది. కాసేపు పార్కులో తిరిగి ఇంటికి వెళ్తారు. వాళ్ళింట్లో భోం చేసి తన ఇంటికి వస్తాడు శ్రీరామ్. – ఇక చదవండి.]

అధ్యాయం-5

రోజు రోజ్ బర్త్‌డే..

శ్రీరామ్ రాత్రి పన్నెండు గంటల వరకూ మేల్కొని వుండి పన్నెండు ఐదు నిముషాలకు ‘Wishing you a birthday as Fantastic as you are’ అని బర్తడే విషెస్ పంపాడు.

 అతని విషెస్‌కు ఎదురు చూస్తున్న రోజ్ ఆ విషెస్‌ను చదివి వెంటనే శ్రీరామ్‌కు ఫోన్ చేసింది.

“సార్!”

“ఆ.. రోజ్!.. విష్ యు 120 రిటర్న్స్ ఆఫ్ గ్రేట్ బర్త్ డే డియర్” నవ్వుతూ ఆనందంగా చెప్పాడు.

“నిద్ర పోలేదా!..”

“నీకు విషెస్ చెప్పాలిగా!..”

“అందుకని మేల్కొనే వున్నారా!..”

“అవును. నా విషెస్ నీకు తొలి విషెస్ కావాలని రోజ్!”

“ధన్యవాదములు సార్!..”

“థాంక్యూ డియర్!..”

“పొద్దు పోయింది. ఇక నిద్రపొండి ఉదయాన్నే కలుద్దాం.”

“అలాగే డియర్ గుడ్ నైట్”

“గుడ్ నైట్ సార్!.. థాంక్యూ!” నవ్వుతూ చెప్పింది రోజ్.

ఫోన్ కట్ చేసింది.

మరుసటిరోజు కాలేజీలో ఇరువురూ కలిశారు.

“సాయంత్రం కేక్ కటింగ్ సార్!..”

“కట్ చేయి”

“మీరు రారా?”

“నీవు పిలిచావా!..”

“నా మనిషిని నేను పిలవాలా!..” చిరునవ్వుతో ఓరకంట శ్రీరామ్ ముఖంలోకి చూచింది రోజ్.

“ఏమన్నావ్?”

“నా మనిషి!..”

“ఎవరు?”

“మీరే కదా!!..” ప్రశ్నార్ధకంగా శ్రీరామ్ కళ్ళల్లోకి చూచింది రోజ్, శ్రీరామ్ ఆనందంగా నవ్వాడు. రోజ్ శృతి కలిపింది.

“ఎన్ని గంటలకు?”

“సెవెన్ టు సెవెన్ థర్టీ!”

“ఎవరెవరు వస్తారు?” అడిగాడు శ్రీరామ్.

“మా నాన్న తరపున కొంతమంది. నా ఫ్రెండ్స్ కొందరు వస్తారు. సాయంత్రం చూస్తారుగా!..”

“ఎస్.. ఎస్..”

ఇరువురూ క్లాసెస్‌కు వెళ్ళిపోయారు.

శ్రీరామ్ ఐదుగంటలకు యూనివర్శిటీ క్యాంపస్ వదిలాడు. ఫేమస్ గోల్డ్ షాపుకు వెళ్ళాడు. రోజ్ కోసం ఒక వజ్రపు ఉంగరాన్ని కొన్నాడు. ఇంటికి చేరాడు. స్నానం చేసి డ్రస్ మార్చుకొని ఏడుగంటలకల్లా రోజ్ ఇంటికి చేరాడు.

రోజ్.. ఆంధ్రుల సాంప్రదాయం ప్రకారం చీరా, రవిక, తల్లో మల్లెపూలు, నొసటన సిందూరపు బొట్టుతో ముఖద్వారం వద్ద నిలబడి శ్రీరామ్‍కు నవ్వుతూ స్వాగతం పలికింది.

చిరునవ్వుతో ఆరాధనా భావంతో శ్రీరామ్ రోజ్ ముఖంలోకి చూచాడు. అతని పెదవులు ‘అప్సర’ అని పలికాయి.

తదేకంగా అతన్నే చూస్తూ వున్న రోజ్..

“ఏమన్నారు సార్!..” చిరునవ్వుతో అడిగింది.

శ్రీరామ్ ఆనందంగా నవ్వాడు

రోజ్ తల్లి దుర్గ, నాన్నగారు థామస్ శ్రీరామ్‌ను చూచి ఆనందించారు. ప్రీతిగా స్వాగతం పలికారు.

రోజ్ మిత్రులు ఆడ, మగ, వారి బంధువులు, దాదాపు ముప్ఫై మంది వచ్చారు.

అందరి సమక్షంలో రోజ్ శ్రీరామ్‌ను తన ప్రక్కకు పిలిపి కేక్ కట్ చేసింది. తొలిముక్కను శ్రీరామ్ నోటికి అందించింది. తరువాత..

శ్రీరామ్ కేక్ పీస్ ను రోజ్ నోట్లో వుంచాడు.

జేబు నుంచి చిన్న పాకెట్‌ను బయటికి తీసి, అందులోని వజ్రపు ఉంగరాన్ని చేతికి తీసుకొని రోజ్ ఎడమ చేతి ఉంగరపు వేలికి తొడిగాడు.

రోజ్ తల్లి దుర్గ అందించిన బంగారు ఉంగరాన్ని శ్రీరామ్ చేతికి తొడిగింది రోజ్.

అతిథులందరూ ఆనందంగా కరతాళ ధ్వనులు చేశారు.

గొంతు సవరించుకొని థామస్..

“డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలెటివ్స్.. త్వరలో మిస్టర్ శ్రీరామ్‌కు, నా కూతురు రోజ్‌కు – ముందు, ఈ ప్రాంతంలో వున్న చర్చిలోనూ, తరువాత BAPS SRI SWAMINARAYANA MANDIR లోనూ రెండు మతాల పద్ధతుల్లో వివాహం జరుగనున్నది” ఆనందంగా నవ్వుతూ చెప్పాడు.

శ్రీరామ్, రోజ్ వారి చెవులను వారే నమ్మలేకపోయారు.

ఇరువురి వదనాల్లో పున్నమి వెన్నెల. ఒకరినొకరు చూచుకొని ఆనందంగా నవ్వుకొన్నారు.

తరువాత నైట్ అల్పాహార విందు జరిగింది. గుడ్ నైట్ చెప్పి పావుగంటలో అందరూ వెళ్ళిపోయారు.

“శ్రీరామ్!!.. ఆర్ యు హ్యాపీ!” నవ్వుతూ అడిగాడు థామస్.

“ఎస్ సార్! థాంక్యూ!!..”

“నో సార్ డియర్. సే అంకుల్!” నవ్వాడు థామస్.

“రోజ్!.. ఆర్ యు హ్యాపీ మై డియర్ చైల్డ్?..” నవ్వుతూ అడిగింది దుర్గ.

“అమ్మా!.. అమ్మా!..” ఆనందంగా నవ్వుతూ రోజ్ తల్లిని కౌగలించుకొంది.

తర్వాత.. ఆ నలుగురూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు.

దుర్గ నాలుగు ప్లేట్లలో వడ్డించింది. అందరి మనస్సున ఆనందమయం.

మాటల సందర్భంలో, “అంకుల్ రాబర్డ్ క్లైవ్ సూసైడ్ చేసుకొన్నారా!” అడిగాడు శ్రీరామ్.

“అవును ఆ కథ చెబుతాను వినండి” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు థామస్.

“ప్రప్రథమంగా 1744లో రాబర్ట్ క్లవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుపస్తాగా ఇండియాకు వెళ్ళారు. మేజర్ రాబర్ట్ క్లైవ్ (జననం 29-11-1725 – మరణం 22-11-1774) వారు బెంగాల్ ప్రెసిడెన్స్ కి మొదటి బ్రిటీష్ గవర్నర్ బెంగాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి పాలనకు పునాది వేసినందున క్లైవ్ విస్తృతంగా ఘనత పొందాడు. (జననం స్ట్రెచే, ప్రాప్ ఫైర్, మరణం లండన్, ఇంగ్లండ్, భార్య మార్గరెట్ మాస్కెలిస్) జీవితకాలం నలభై తొమ్మిది సంవత్సరాలు. భారత్‍లో వున్నది (1746-1774) 28 సంవత్సరాలు. చేసిన యుద్దాలు – ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం (గెలుచుకొన్నది మద్రాస్, కడలూర్ పాండీచ్చేరి, తాంజూర్), కర్ణాటక యుద్ధం (గెలుచుకొన్నది తిరుచునాపల్లి); మూడవ యుద్ధం (గెలుచుకొన్నది చింగల్‌పుటీ, ఆర్నీ, చందన్ నగర్, విజయదుర్గ్). పై యుద్ధాల కన్నా ముందు బెంగాల్ నవాబ్ సిరాజ్‌వుద్ దౌలను ప్లాసీ యుద్ధంలో ఓడించి, బెంగాల్ బీహార్, ఒరిస్సా ప్రాంతాలను గెలుచుకొన్నారు. వ్యాపారిగా పోయిన అతడు (గుమస్తా) సైనిక నాయకుడై, పై ప్రాంతాలను జయించి బ్రిటీష్ ఈస్టిండియా (BIC) వ్యాపార వ్యవస్థను రాజ్యాంగా మార్చి వారి పాలనను భారత్లో ప్రవేశపెట్టి, క్లైవ్ మేజర్ రాబర్ట్ క్లైవ్ అయినాడు.

1760 ఫిబ్రవరిలో వారు లండన్‍కు తిరిగి వచ్చారు. జనరల్ జాన్ బ్రుగేని మరియు ఏడ్మండ్ బ్రుకి, చాలామంది ఎం.ప్సీ, క్లైవ్ ఇండియాతో కొల్లగొట్టిన సొమ్ము (డబ్బు, అక్రమ సంపాదన) విషయంగా అతనిపై కేసు పెట్టారు.

ఆ స్థానానికి బ్రిటీష్ మహారాణి క్వీన్ చార్లెట్ పంపగా హెర్రే విరిక్, సక్సెసర్‌గా వెళ్ళాడు ఇండియాకు. అప్పుడు జార్జి III(3) బ్రిటన్ మహారాజు.

మా ఫాదర్ పేరు రూధర్, మా గ్రాండ్ ఫాదర్ ఎడ్మండ్ బ్రుకి. వారు, జాన్ బ్రుగేని కలిసి క్లైవ్ ఇండియాలో చేసిన అల్లకల్లోలాలపై దోచుకొన్న సొమ్ముపై కేసు పెట్టారు. మావారి ఆర్గ్యుమెంట్సుకు క్లైవ్ తల్లడిల్లిపోయాడు. ఆరోగ్యం చెడిపోయింది. మనోవేదనతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మా గ్రాండ్ ఫాదర్ నైంటీ ఫైవ్ ఇయర్స్, ఫాదర్ నైంటీ.. ఇయర్స్ బ్రతికాడు. ప్రస్తుతం నా వయస్సు ఫిఫ్టీ ఫైవ్. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మా ఫ్యామీలీ లోని అందరికీ ఇండియా అంటే, ఎంతో గౌరవం అభిమానం మిస్టర్ శ్రీరామ్.” నవ్వుతూ చెప్పాడు థామస్.

“హో సార్!.. నాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు” వినయంగా చేతులు జోడించాడు శ్రీరామ్.

సమయం రాత్రి పదిగంటలు..

సోఫా నుండి శ్రీరామ్ లేచాడు. తల్లి ప్రక్కన కూర్చొని వున్న రోజ్ కూడా లేచింది.

“అంకుల్.. ఆంటీ!.. ఇక నే బయలుదేరుతాను” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

అందరూ వరండాలోకి వచ్చారు.

‘బై’ చెప్పి శ్రీరామ్ కార్లో కూర్చున్నాడు.

ముగ్గురూ చేతులు పైకెత్తారు.

శ్రీరామ్ కారు వీధిలో ప్రవేశించింది. పావుగంటలో శ్రీరామ్ తన నిలయం చేరాడు.

***

వారంరోజుల తర్వాత ఒక ఉదయం థామస్ శ్రీరామ్ ఇంటికి ఉదయం ఎనిమిది గంటలకు వచ్చాడు.

టీ తయారు చేస్తున్న శ్రీరామ్.. రెండు కప్పుల్లో టీ పోసి, ఒకటి థామస్ గారికిచ్చి, తను ఒకదాన్ని చేత పట్టుకొని..

“కూర్చోండి అంకుల్..” అన్నాడు.

ఇరువురూ హాల్లో సోఫాల్లో కూర్చున్నారు.

“చెప్పండి అంకుల్!”

“మీ వివాహానికి ముహూర్తం పై శుక్రవారం నిర్ణయించాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా!” చిరునవ్వుతో అడిగాడు థామస్.

శ్రీరాము మహదానందం..

“మీ ఇష్టమే నా ఇష్టం అంకుల్!..” నవ్వుతూ చెప్పాడు.

“ఈ విషయాన్ని మీకు చెప్పాలనే వచ్చాను”

“చాలా సంతోషం అంకుల్..” చేతులు జోడించాడు శ్రీరామ్.

సంతోషంగా టీ త్రాగి, కప్పును టీపాయ్ పై వుంచి థామస్ లేచారు.

ఇరువురూ కార్ పోర్టిలోకి వచ్చారు. థామస్ తన కార్లో కూర్చున్నాడు.

“బై అంకుల్!” చెప్పాడు శ్రీరామ్.

కుడిచేతి పైకెత్తి ఆడించి, థామస్ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.

థామస్ నిర్ణయించిన రోజున చర్చిలో, ఆ తరువాత, స్వామి నారాయణ మందిరంలో శ్రీరామ్, రోజ్ వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఆ వివాహానికి విచ్చేసిన యూనివర్శిటీ స్టాఫ్, రోజ్ బంధు మిత్రులు వధూవరులను ఆశీర్వదించారు. కానుకలను సమర్పించారు.

శ్రీరామ్.. రోజ్ వదనాల్లో ఎంతో సంతోషం.. కళ్ళల్లో నీరు. అవి కన్నీరు కాదు ఆనంద భాష్పాలు.

అది శ్రీరామ్, రోజ్ తొలిరేయి. థామస్ శ్రీరామను పడకగదిలోనికి పంపాడు. ఆ గది.. నిండా సీలింగ్ నుండి రంగు రంగుల బెలూన్స్ వ్రేలాడుతున్నాయి. గదికి వున్న నాలుగు కిటికీలకు అందమైన

నైరుతీ మూల దక్షిణపు వైపు తలభాగాన దిండ్లు, పడకనిండా రోజాపూలు, మధ్యన హృదయం ఆకారంలో పూల అమరిక అగరవత్తుల సువాసన, రకరకాల పండ్లు, లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్ అన్ని క్రమంగా మంచం ప్రక్కన ఒకే టేబుల్ పై అమర్చివున్నాయి.

శ్రీరామ్ నయనాలకు ఆ గది ఒక వింత లోకంలా కనిపించింది. ఆనందంగా నవ్వుకొన్నాడు.

‘రేయ్!.. శ్రీరామ్, నీవు నిజంగా చాలా అదృష్టవంతుడివిరా!.. నీ మనసారా కోరిన అమ్మాయి నీ ఇల్లాలైంది ఇలాంటి యోగం ఏ కొందరికో!..’ అనుకొన్నాడు.

గది ద్వారం వైపు చూచాడు. తలుపు తెరువబడింది. గంధర్వకన్యలా తెల్లని వస్త్రాలతో, చేతిలో పాల గ్లాసుతో రోజ్ గదిలోనికి వచ్చింది. పాల గ్లాసును టేబుల్పైన వుంచి తలుపు గడియ బిగించింది.

టేబులు సమీపించి పాల గ్లాసును చేతికి తీసుకొని మంచంపై కూర్చొనియున్న శ్రీరామ్‌ని సమీపించింది. వంచిన తలను ఎత్తి శ్రీరామ్ ముఖంలోకి చిరునవ్వుతో చూచింది.

శ్రీరామ్ తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు.

“రోజ్!..”

“ఆఁ”

“ఇది కలా!.. నిజమా!..” ఆశ్చర్యంతో రోజు చూస్తూ అడిగాడు.

“స్వామీ!..”

“ఆఁ ఏమిటి!..”

“పతిదేవా!”

“రోజ్ ఏంటి భాష?” ఆశ్చర్యంతో అడిగాడు.

“ప్రేమ భాష.. ముందు తమరు ఈ పాలను సేవించండి.” నవ్వుతూ పాల గ్లాసును శ్రీరామ్కు అందించింది.

శ్రీరామ్ ఆనందంగా అరగ్లాసు పాలు తాగి, తన చేత్తో మిగతా పాలను రోజు త్రాగించాడు. గ్లాసును టేబుల్‌పై వుంచాడు. నవ్వుతూ తన చేతులను రోజ్ వైపుకు సాచాడు. రోజ్ పరవశంతో అతని చేతులలో వాలిపోయింది. ఇరువురూ మంచంపై ఒరిగిపోయారు..

(ఇంకా ఉంది)

Exit mobile version