[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[రోజ్ పుట్టినరోజున రాత్రి పన్నెండు గంటలకి ప్రత్యేకంగా విష్ చేస్తాడు శ్రీరామ్. మర్నాడు సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళి కేక్ కటింగ్ సంబరంలో పాల్గొంటాడు. జేబులోంచి వజ్రపు ఉంగరాన్ని తీసి ఆమె వేలికి తొడుగుతాడు. తల్లిదండ్రులు కొన్న బంగారపు ఉంగరాన్ని రోజ్, శ్రీరామ్ వేలికి తొడుగుతుంది. తన కూతురు, శ్రీరామ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు అక్కడికి వచ్చిన వారందరికీ చెప్తాడు థామస్. ఆ రాత్రికి అక్కడ భోం చేసి తన ఇంటికి వస్తాడు. ఓ వారం తర్వాత థామస్ శ్రీరామ్ ఇంటికి పెళ్ళి తేదీ నిశ్చయమైనట్టు చెప్తాడు. నిర్ణీత తేదీన హిందూ, క్రైస్తవ పద్ధతులతో శ్రీరామ్, రోజ్ల వివాహం జరుగుతుంది. దాంపత్య జీవితంలోకి అడుగుపెడతారిద్దరూ. – ఇక చదవండి.]
అధ్యాయం-6
నవదంపతులు శ్రీరామ్, రోజ్లు ప్రతిరోజూ సాయంత్రం లండన్ లోని సుందర ప్రదేశాలు దర్శించేవారు. ఆ రోజు ఆదివారం బ్రిటీష్ మ్యూజియంను దర్శించి ఒకచోట కూర్చున్నారు.
“యక్ష ప్రశ్నలను గురించి చెప్పండి సార్!..” అడిగింది రోజ్.
శ్రీరామ్ చెప్పడం ప్రారంభించాడు. ఏకాగ్రతతో శ్రీరామ్‌ను చూస్తూ వుంది రోజ్.
“మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో వుండగా జలం కొరకు, ఒక కొలనుకు చేరి, గంగను స్వీకరించబోయిన యుధిష్టరుడు, పాండవ అగ్రజుడు, ధర్మరాజును పరీక్షించదలచిన యమధర్మరాజు యక్షుని రూపంలో వారిని అడిగినవే యక్ష ప్రశ్నలు. చిక్కు ప్రశ్నలకు, సమాధానం కష్టతరమైన ప్రశ్నలను యక్ష ప్రశ్నలంటారు. అవి డెబ్భై రెండు.
పూర్వకథ: అరణ్య వాసము చేయుచున్న పాండవుల వద్దకు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, తన అరణి ‘జపమాల’ లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని, దాన్ని తెచ్చి తనకు ఇవ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా, ధర్మరాజులు తన నలుగురు తమ్ములతో ఆ లేడిని పట్టుకొనుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి వారికి దొరకక మాయమైనది. లేడిని వెతికి వెతికి అలసట చెందియున్నవారు, ‘ధర్మజుడు’ నకులుని మంచినీరు తెమ్మని పంపినారు. నకులుడు ఎంతసేపటికి రానందున సహాదేవుని పంపారు. నకులుని వలె సహాదేవుడూ తిరిగిరాలేదు. అదే విధముగా ఒకరి తరువాత ఒకరుగా వెళ్ళి అర్జునుడు, భీముడు కూడా తిరిగి రాలేదు. ఆశ్చర్య ఆవేదనతో ధర్మరాజు బయలుదేరి ఒక జలాశయ కొలనును చూచినాడు. మంచినీటి కొలను ప్రక్కన పడియున్న నలుగురు తమ్ములనూ చూచినాడు. మదిలో వేదన, కళ్ళల్లో కన్నీరు, రోదించసాగాడు. భీతితో తల్లడిల్లిపోయాడు. అప్పుడు అదృశ్యవాణి పలికింది.
“ధర్మనందనా!.. ధర్మనందనా!.. నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో వున్నది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందున వారికి ఆ గతి పట్టినది. నీవైనా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో..” అన్నాడు యక్షుడు.
“అడగండి” అన్నాడు ధర్మరాజు.
ఆ యక్షుడు కొంగ రూపంలో వున్న యమధర్మరాజు. యక్షుడు (కొంగ) ప్రశ్నలడగడం ప్రారంభమైంది.
ఆ యక్షుడు కొంగ రూపంలో వున్న యమధర్మరాజు. యక్షుడు (కొంగ) ప్రశ్నలడగడం ప్రారంభమైంది.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
ధర్మరాజు జవాబు:- ‘బ్రహ్మం’
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
ధర్మరాజు జవాబు:- ‘దేవతలు’
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘ధర్మం’
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
ధర్మరాజు జవాబు:- ‘సత్యం’
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
ధర్మరాజు జవాబు:- ‘వేదం’
6. దేనివలన మహత్తును పొందును?
ధర్మరాజు జవాబు:- ‘తపస్సు’
7. మానవునికి సహాయపడునది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘ధైర్యం’
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
ధర్మరాజు జవాబు:- ‘పెద్దలను సేవించుటవలన’
9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును?
ధర్మరాజు జవాబు:- ‘అధ్యయనము వలన’
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
ధర్మరాజు జవాబు:- ‘తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.’
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
ధర్మరాజు జవాబు:- ‘మృత్యు భయము వలన’
12. జీవన్మృతుడెవరు?
ధర్మరాజు జవాబు:- ‘దేవతలకూ, అతిథులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు’
13. భూమికంటె భారమైనది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘జనని’
14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘తండ్రి’
15. గాలికంటె వేగమైనది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘మనస్సు’
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
ధర్మరాజు జవాబు:- ‘ఇతరులు తన పట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది’
17. తృణం కంటే లేసైనది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘చింత’
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘చేప’
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
ధర్మరాజు జవాబు:- ‘అస్త్రవిద్యచే’
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
ధర్మరాజు జవాబు:- ‘ యజ్ఞం చేయుటవలన’
21. జన్మించియు ప్రాణంలేనిది
ధర్మరాజు జవాబు:- ‘గుడ్డు’
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
ధర్మరాజు జవాబు:- ‘రాయి’
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
ధర్మరాజు జవాబు:- ‘శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన’
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
ధర్మరాజు జవాబు:- ‘నది’
25. రైతుకు ఏది ముఖ్యం?
ధర్మరాజు జవాబు:- ‘వాన’
26. బాటసారికి, రోగికి, గృహస్థునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
ధర్మరాజు జవాబు:- ‘సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు’
27. ధర్మానికి ఆధారమేది?
ధర్మరాజు జవాబు:- ‘దయ దాక్షిణ్యం’
28. కీర్తికి ఆశ్రయమేది?
ధర్మరాజు జవాబు:- ‘దానం’
29. దేవలోకానికి దారి ఏది?
ధర్మరాజు జవాబు:- ‘సత్యం’
30. సుఖానికి ఆధారం ఏది?
ధర్మరాజు జవాబు:- ‘శీలం’
31. మనిషికి దైవిక బంధువులెవరు?
ధర్మరాజు జవాబు:- ‘భార్య/భర్త’
32. మనిషికి ఆత్మ ఎవరు?
ధర్మరాజు జవాబు:- ‘కుమారుడు’
33. మానవునకు జీవనాధారమేది?
ధర్మరాజు జవాబు:- ‘మేఘం’
34. మనిషికి దేనివల్ల సంతసించును?
ధర్మరాజు జవాబు:- ‘దానం’
35. లాభాల్లో గొప్పది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘ఆరోగ్యం’
36. సుఖాల్లో గొప్పది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘సంతోషం’
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘అహింస’
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
ధర్మరాజు జవాబు:- ‘మనస్సు’
39. ఎవరితో సంధి శిథిలమవదు?
ధర్మరాజు జవాబు:- ‘సజ్జనులతో’
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
ధర్మరాజు జవాబు:- ‘యాగకర్మ’
41. లోకానికి దిక్కు ఎవరు?
ధర్మరాజు జవాబు:- ‘సత్పురుషులు’
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
ధర్మరాజు జవాబు:- ‘భూమి, ఆకాశములందు’
43. లోకాన్ని కప్పివున్నది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘అజ్ఞానం’
44. శ్రాద్ధవిధికి సమయమేది?
ధర్మరాజు జవాబు:- ‘బ్రాహ్మణుడు వచ్చినప్పుడు’
45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
ధర్మరాజు ఆవాబు :- ‘వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో’
46. తపస్సు అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం’
47. క్షమ అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘ద్వంద్వాలు సహించడం’
48. సిగ్గు అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘చేయరాని పనులంటే జడవడం’
49. సర్వధనియనదగు వాడెవడు?
ధర్మరాజు జవాబు:- ‘ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు’
50. జ్ఞానం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం’
51. దయ అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘ ప్రాణులన్నింటి సుఖము కోరడం’
52. అర్జవం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘ సదా సమభావం కలిగి వుండడం’
53. సోమరితనం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘ధర్మకార్యములు చేయకుండుట’
54. దు:ఖం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘అజ్ఞానం కలిగి ఉండటం’
55. ధైర్యం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘ఇంద్రియ నిగ్రహం’
56. స్నానం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం’
57. దానం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘సమస్తప్రాణుల్ని రక్షించడం’
58. పండితుడెవరు?
ధర్మరాజు జవాబు:- ‘ధర్మం తెలిసినవాడు’
59. మూర్ఖుడెవడు?
ధర్మరాజు జవాబు:- ‘ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు’
60. ఏది కాయం?
ధర్మరాజు జవాబు:- ‘సంసారానికి కారణమైంది’
61. అహంకారం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘అజ్ఞానం’
62. దంభం అంటే ఏమిటి?
ధర్మరాజు జవాబు:- ‘తన గొప్పతానే చెప్పుకోవటం’
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?
ధర్మరాజు జవాబు:- ‘తన భార్యలో, తన భర్తలో’
64. నరకం అనుభవించే వారెవరు?
ధర్మరాజు జవాబు:- ‘ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ. పితృదేవతల్నీ, ద్వేషించేవాడు. దానం చెయ్యనివాడు’
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
ధర్మరాజు జవాబు:- ‘ప్రవర్తన మాత్రమే’
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
ధర్మరాజు జవాబు:- ‘మైత్రి’
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
ధర్మరాజు జవాబు:- ‘అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు’
68. ఎక్కువమంది మిత్రులు వున్నవారు ఏమవుతాడు?
ధర్మరాజు జవాబు:- ‘సుఖపడతాడు’
69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
ధర్మరాజు జవాబు:- ‘అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు’
70. ఏది ఆశ్చర్యం?
ధర్మరాజు జవాబు:- ‘ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం’
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
ధర్మరాజు జవాబు:- ‘ప్రియయూ అప్రియమూ, సుఖమూ దుఃఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు.’
72. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు?
ధర్మరాజు జవాబు:- ‘నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదుఃఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్థిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటారో వారే స్థితప్రజ్ఞుడు.’
72 ప్రశ్నలు తానడిగి, వాటిని ధర్మరాజు ఇచ్చిన జవాబులకు యక్షుడు సంతుష్టుడైనాడు. వారి నిజ రూపం యమధర్మరాజు.. ఆ రూపమునకు మారి ధర్మరాజును, యమధర్మరాజు, కొలను నీటితో దాహం తీర్చుకోమన్నారు. మూర్చలో నెలవున్న దర్శణ నలుగురు సోదరులూ, యమధర్మరాజు గారి వీక్షణంతో మేల్కొన్నారు. అందరూ దాహంతీరా మంచినీటిని త్రాగారు. యమధర్మరాజుకు వారు నమస్కరించారు.
‘విజయోస్తు!’ అనే దీవెన నిచ్చి యమధర్మరాజుల వారు అంతర్ధానం అయినారు.
రోజ్!.. ఇది యక్షప్రశ్నల కథా సారాంశం!..” చిరునవ్వుతో చూచాడు రోజ్ ముఖంలోకి శ్రీరామ్.
రోజ్ చిరునవ్వుతో శ్రీరామ్‌కు నమస్కరించింది.
“రోజ్!..”
“చెప్పండి సార్!..”
“ఇప్పుడు ఆ నమస్కారం నాకెందుకు?”
“సార్!”
“చెప్పు!..”
“ఆ నమస్కారం మీకు కాదు!..”
“మరెవరికి?”
“మీలోని అద్వితీయ జ్ఞాపకశక్తి, మేధాశక్తికి సార్!” అందంగా నవ్వింది రోజ్.
“రోజ్!.. మనదంటూ ఏమీలేదు అంతా సర్వేశ్వరుల కృపాకటాక్షం” ఆనందంగా నవ్వాడు శ్రీరామ్.
సమయం సాయంత్రం ఆరున్నర.
“రోజ్!.. బయలుదేరుదామా!..”
“ఎస్ సార్!” లేచి నిలబడింది రోజ్.
కూర్చొని వున్న శ్రీరామ్ చేతిని రోజ్ వైపుకు సాచాడు.
రోజ్ శ్రీరామ్ చేతిని తన చేతిలోకి తీసుకొంది, లాగింది. శ్రీరామ్ రోజ్పై పడ్డాడు. రోజ్ క్రింద పడబోయింది. తన చేతులను రోజ్ నడుము చుట్టూ వేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ముఖాలు రెండూ చేరువ అయినాయి. శ్రీరామ్ పెదవులు రోజ్ నొసటిని తాకాయి. పరవశంతో రోజ్ గట్టిగా కౌగలించుకొంది. కొన్ని క్షణాలు వారు తాము వున్న చోటును విస్మరించారు.
“నీవు క్రిందపడతావేమోనని నాకు చాలా భయం వేసింది రోజ్!..”
“మీరు నా ప్రక్కన వుండగా నేను ఎలా క్రింద పడగలను సార్!..” పరవశంతో పలికింది రోజ్.
నవ్వుతూ శ్రీరామ్ రోజ్ వీపుపైన మెల్లగా తట్టాడు.
ఇరువురూ విడిపోయారు. కారును సమీపించారు. కూర్చున్నారు. శ్రీరామ్ కారును స్టార్ట్ చేశాడు.
రోడ్డుకు ఇరువైపులా విద్యుద్దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
‘నాకు త్వరలో వారసులు కావాలి. అంటే వారసులు కావాలి. ఆ బిడ్డ ముమ్మూర్తులా రోడ్లలా అందంగా వుండాలి. ఆమెను నేను ఎత్తుకోవాలి. ముద్దుపెట్టుకోవాలి. ఆమెను ఒక రాజకుమారిలా సాకాలి. పెంచి పెద్ద చేసి స్కూలుకు పంపాలి. బాగా చదువు నేర్పాలి. ఆమెను పదిమందికి సదా సాయం చేసే మంచి గుణాలను నేర్పాలి. ఆమె బాగా చదివి, గొప్ప ఉద్యోగాన్ని సంపాదించి హైందవ జాతిరత్నం కావాలి. అందరికీ తన పద్ధతుల వలన ఆదర్శవంతురాలు కావాలి.’
“సార్!..” రోజ్ పిలుపు..
శ్రీరామ్ ఆలోచన స్రవంతి ఆగిపోయింది. చిరునవ్వుతో రోజ్ ముఖంలోకి చిరునవ్వుతో చూచాడు. కళ్ళు ఎగరేశాడు ‘ఏమి!..’ అన్నట్లు.
“దేన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సార్ గారు!” చిరునవ్వుతో అడిగింది రోజ్.
“అవును!..”
“దేన్ని గురించి!”
“రోజ్!”
“చెప్పండి సార్!..”
“నాకు మన పాప కావాలి!..”
“ఏమిటీ?”
“మన పాప!”
“బాబు వద్దా!”
“అహా!”
“కూతురే కావాలా!”
“సరే!.. మనం రేపు డాక్టరు దగ్గరకు వెళ్ళాలి” నవ్వింది రోజ్.
“అవును సార్!.. నేను నెల తప్పాను” నవ్వుతూ సిగ్గుతో తలదించుకొంది.
“ఓ!.. థాంక్యూ రోజ్!..” ఆనందంగా తన ఎడం చేతితో రోజ్ భుజాలపై చేయి వేసి ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు శ్రీరామ్.
మరుదినం ఉదయాన్నే శ్రీరామ్, రోజ్లు లేడీ డాక్టరును కలిశారు. ఆమె రోజు పరీక్ష చేసి గర్భధారణను కన్ఫామ్ చేసి, వారికి విషెస్ చెప్పింది.
నేరుగా రోజ్ ఇంటికి వెళ్ళారు. రోజ్ తన తల్లికి విషయాన్ని చెప్పింది. దుర్గ ఆ విషయాన్ని తన భర్త థామస్‌కు చెప్పింది.
నలుగురూ ఎంతో ఆనందంగా నవ్వుకొన్నారు. దుర్గ జిలేజీతో వారి నోటిని తీపి చేసింది.
భోంచేసి శ్రీరామ్, రోజ్లు వారి ఇంటికి వెళ్ళిపోయారు ఆనందంగా.
ఆరునెలలు గడిచాయి.
ఏడవనెలలో దుర్గ, థామస్‌లు రోజ్‌కు సీమంత వేడుకను ఘనంగా జరిపారు. శ్రీరామ్, రోజ్ చేత లీప్ పెట్టించాడు. రోజ్‌ను ఏ పనీ చేయనీయకుండా అన్ని పనులనూ తనే చేసేవాడు.
థామస్ హిస్టరీ ప్రొఫెసర్. దుర్గ మ్యాథ్స్ లెక్చరర్. ప్రతి శనివారం ఆ దంపతులు శ్రీరామ్ ఇంటికి వచ్చేవారు. అన్ని పనులు ఆ రోజు అల్లుడుని చేయనీయకుండా వారు చేసేవారు.
నవమాసాలు ఎప్పుడు నిండుతాయా రోజ్ ఎప్పుడు ప్రసవిస్తుందా అని ప్రతి రాత్రి ఆ దంపతుల మధ్యన అదే చర్చ. రోజ్‌ను తన ప్రాణ సమానంగా చూచుకొనేవాడు శ్రీరామ్. అతను తనపట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు, రోజ్ తన అదృష్టాన్ని తలచుకొని ఆనందంతో పొంగిపోయేది.
రోజు నవమాసాలు నిండాయి. ఒకరోజు ఉదయం నొప్పులు ప్రారంభమైనాయి.
ఆ ముగ్గురూ రోజ్‌ను హాస్పిటల్లో చేర్పించారు. చేర్పించిన నాలుగు గంటల్లో రోజ్‌కు సుఖ ప్రసవం జరిగింది. పాప పుట్టింది. ఆ విషయాన్ని విన్న శ్రీరామ్ ఆనందంతో గంతులేశాడు. తన కోర్కెను తీర్చి ఆ సర్వేశ్వరులకు..
“సర్వేశ్వరా!.. నీవు దయామయుడవు. నీవు దయామయుడవు. నా కోర్కెను తీర్చావు తండ్రి!.. నీకు శతకోటి వందనాలు.” ప్రక్కన ఎవరున్నారనే విషయాన్ని లెక్క చేయకుండా పరవశంతో గొంతు విప్పి పలికి చేతులు జోడించారు.
ఆ దృశ్యాన్ని చూచిన దుర్గ, థామస్, ఇతరులూ అతనికి దైవం పట్ల వున్న భక్తికి ఆశ్చర్యపోయారు.
నర్స్ పిలుపుతో వార్డుకు వెళ్ళి పాపను, రోజ్‌ను చూచారు ఆ ముగ్గురు.
రోజ్ శ్రీరామ్ ను చూచి అందంగా నవ్వింది. శ్రీరామ్ రోజ్ చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. పాప రోజ్ ప్రక్కన వుంది. పాపను చూచి శ్రీరామ్..
“రోజ్!.. పాప నీ పోలిక. బంగారు బొమ్మ.!” పారవశ్యంతో పలికాడు.
దుర్గ, థామస్‌లు రోజ్‌ను పాపను చూచి ఎంతగానో సంతోషించారు.
“సార్!.. మీకు సంతోషమేనా!..” నవ్వుతూ అడిగింది రోజ్.
“మాటలతో చెప్పలేను రోజ్..” సున్నితంగా ఆమె చేతిని నొక్కాడు. నొసటిపైన ముద్దు పెట్టుకొన్నాడు. మూడవరోజున రోజ్, పాపను, శ్రీరామ్, దుర్గ, థామస్‌లు వారి ఇంటికి తీసుకొని వెళ్ళారు.
హైందవ సాంప్రదాయం ప్రకారం పాప పుట్టిన పదహారవ రోజు బారసాలను జరిపించి ‘గంగ’ అనే పేరును పెట్టారు శ్రీరామ్, రోజ్లు.
పాప పుట్టకముందు శ్రీరామ్ ఏడు ఏడున్నర వరకూ యూనివర్శిటీలో వుండేవాడు. కానీ.. ఇప్పుడు ఆరుగంటలకల్లా ఇంటికి వెళుతున్నాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని పాపను ఎత్తుకొని ఆమెకు మాటలు చెబుతూ ఆనందంగా ఆడుకొనేవాడు.
ఆరుమాసాలు రోజ్, పాప, శ్రీరామ్‌లు అత్తగారింట్లోనే వున్నారు. తరువాత వారి ఇంటికి వెళ్ళారు.
పాప ‘ఆ..ఉ’ అంటూ కేరింతలు కొడుతూ తల్లిదండ్రులను గుర్తు పట్టసాగింది. ఆమె బోసినవ్వులను చూచి శ్రీరామ్, రోజు మురిసిపోయేవారు.
శ్రీరామ్ గుర్రమై వంగితే రోజ్ కూతురు గంగను అతని వీపుపై కూర్చొనబెట్టి, పాప రెండు కాళ్ళను శ్రీరామ్ భుజాలపై వుంచి ఆ చిన్నారి నవ్వుతుంటే, వారిరువురూ నవ్వుకొంటూ అనుభవించినంత ఆనందం అక్షరాలకు అందనిది.
గంగ వయస్సు తొమ్మిది మాసాలు.. రోజ్ మళ్ళీ నెల తప్పింది..
విషయాన్ని విన్న శ్రీరామ్..
“రోజ్!.. నీకు ఏం కావాలి?” చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూస్తూ..
“నాకు మీలాంటి బాబు కావాలి సార్!..” సిగ్గుతో అతని కళ్ళల్లో ఓరకంట చూస్తూ చెప్పింది రోజ్.
“రోజ్!.. నీవు చాలా మంచిదానవు. ఆ దేవుడు నీ కోర్కెను తప్పక నెరవేరుస్తాడు బంగారం!..” నవ్వుతూ చెప్పాడు శ్రీరామ్.
అతని మాటలకు రోజ్ మురిసిపోయింది. శ్రీరామ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆనందంగా అతని నొసటన ముద్దులు పెట్టింది. ఇరువురూ పరవశంతో పెనవేసుకున్నారు.
రోజు నవమాసాలు నిండాయి. రాత్రి పదిగంటల ప్రాంతంలో నొప్పులు ప్రారంభమైనాయి.
ఆమె తల్లి దుర్గ, తండ్రి థామస్ శ్రీరామ్ ఇంట్లోనే వున్నందున వెంటనే హాస్పిటల్‌కు రోజ్‌ను చేర్చారు.
డాక్టర్ పరీక్షలు చేసి కవలలు ఆడ, మగ పుట్టబోతున్నారని చెప్పారు.
డాక్టర్ల మాటలు విన్న శ్రీరామ్, రోజ్, దుర్గ, థామస్‌లు ఎంతగానో సంతోషించారు. సుఖ ప్రసవం జరగాలని వారు నమ్మిన దేవుళ్ళను వేడుకొన్నారు.
పన్నెండు గంటలు గడిచిన తర్వాత డాక్టర్లు.. ‘మామూలు కాన్పు అయ్యేలా లేదు. సిజెరియన్ చేయాలి’ అని చెప్పారు. శ్రీరామ్ చేత పేపర్లపై సంతకాలు తీసుకొన్నారు.
‘మ్యాన్ ప్రపోజ్.. గాడ్ డిస్పోజ్..’
అది ఆ వ్యక్తికి అనుకొన్నది కావచ్చు.. వ్యతిరేకంగా కాకుండా పోవచ్చు. అది దైవ నిర్ణయం.
జగతిలోని అన్ని సంబంధాలు ఋణానుబంధాలే. ఇది ఆస్తికతత్వం. కాదని ఎవరూ అనలేరు.
రోజ్‌కు కాన్పు కష్టం అయింది. ఉదరాన్ని కోసి బిడ్డలను బయటికి తీశారు. డెలివరీ అయిన తరువాత రోజ్ మామూలు స్థితిలో లేదు. ఆపరేషన్ సమయంలో ఏదో పొరపాటు జరిగింది. కడుపు సెప్టిక్ అయ్యింది.
డాక్టరు ఎంతో హడావిడి పడ్డారు. రోజ్ ప్రాణాలను కాపాడేదానికి. కానీ.. వారి ప్రయత్నాలకు తగిన సుఖ ఫలితాన్ని వారు చూడలేకపోయారు.
సీనియర్ డాక్టర్ మేరీ విచారవదనంతో శ్రీరామ్ దుర్గ, థామస్‌ను సమీపించింది.
“హర్ హెల్త్ కండీషన్ ఈజ్ క్రిటికల్, ప్లీజ్ సి హర్ వన్స్” అంది.
ముగ్గురూ గంగతో సహా ICUలో ప్రవేశించారు.
రోజ్ కడుపు సెప్టిక్ వల్ల కననట్లుగానే ఉదరం ఉబ్బిపోయి ఉంది. ఆత్రంగా శ్రీరామ్ రోజ్ తల వైపుకు చేరి “రోజ్!.. రోజ్!” అని పిలిచాడు
రోజ్ బరువైన కళ్ళను బలవంతంగా తెరవలేక తెరిచింది. శ్రీరామ్ ముఖంలోకి చూచింది.
శ్రీరామ్ నయన ఆశ్రుధారలు ఆమె ముఖంపై పడ్డాయి. అతని కళ్ళల్లోకి ఎంతో ప్రయత్నం మీద చూచింది. తన కుడిచేతిని శ్రీరామ్ వైపు చాపింది. విరక్తిగా నవ్వింది. ఆమె నయనాల్లో ఆశ్రువులు. శ్రీరామ్ ముఖం ఆమెకు సరిగా కనుపించలేదు.
“సార్!..” అంది మెల్లగా
శ్రీరామ్ అత్రంగా కన్నీటితో ఆమె ముఖంలోకి చూచాడు.
మంచం ప్రక్కన ఊయలలో పడుకొనబెట్టి పుట్టిన బిడ్డలను అతి శ్రమతో తల త్రిప్పి చూచింది.
శ్రీరామ్ తన చేతిని ఆమె చేతిలో వుంచాడు.
“సార్!.. నా కథ.. ముగిసిపోబోతూ ఉంది. బిడ్డలు జాగ్రత్త.. ముగ్గురు బిడ్డలూ జాగ్రత్త. నాకు.. వారితో కలిసి బ్రతికే యోగం లేదు. సార్! పిల్లలు.. జా.. గ్ర..త్త..” తల ఒరిగిపోయింది.
శ్రీరామ్ భోరున ఏడుస్తూ తన తలను ఆమె తలకు చేర్చాడు.
దుర్గ, థామస్‌లు ఆవేదనతో భోరున ఏడవసాగారు.
వారి ఏడుపులను, తల్లి స్థితిని చూచిన గంగ “అమ్మా.. అమ్మా..” అంటూ ఏడవసాగింది.
నర్స్ వచ్చి తెల్లవస్త్రాన్ని రోజ్ ముఖం తెలియకుండా కప్పేసింది కన్నీళ్లతో.
“మీరు బయటికి వెళ్ళాలి సార్!..” లోస్వరంతో మెల్లగా చెప్పింది నర్స్.
వారు ఏడుస్తూ బయటికి నడిచారు.
మరో ముగ్గురు నర్సులు స్టెచర్తో వచ్చారు. గదినుంచి ఆ స్టెచర్ బయటికి నెట్టుకొని వెళ్ళారు.
కారిడార్‌ను దాటి హాస్పిటల్ ముందున్న పోర్టికోలో వున్న వ్యానులోకి రోజ్ వున్న స్ట్రెచర్ ఎక్కించబడింది.
శ్రీరామ్.. దుర్గ.. థామస్.. గంగలు భోరున ఏడవసాగారు.
వ్యాన్ వెనుకాల శ్రీరామ్ డ్రైవ్ చేయగా దుర్గ, థామస్, గంగలు శ్రీరామ్ ఇంటికి చేరారు.
హాల్లో చాపా బెడ్ షీట్ ను పరిచి నర్సులు రోజ్‌ను ఆ పడకపైకి చేర్చారు. కన్నీటితో వెళ్ళిపోబోయారు.
శ్రీరామ్ వారిని సమీపించి..
“నర్స్.. నా బిడ్డలు!..” కన్నీటితో దీనంగా అడిగాడు.
“రెండు మూడు రోజులు మేము చూచుకొంటాము సార్. డాక్టరు గారు చెప్పారు. మీరు జరుగవలసిన కార్యక్రమాలను ముగించి, రెండు రోజుల తర్వాత వచ్చి మీ బిడ్డలను తీసుకొని వెళ్లండి” అనునయంగా చెప్పింది ఆ నర్స్.
వారి ఏడుపులతో ఆ హాలు మారుమ్రోగింది.
ఇరుగు పొరుగువారు, రోజ్ బంధువులు శ్రీరామ్ యూనివర్శిటీ హితులు అందరూ వచ్చారు. వారికి దగ్గరైన వారు, వారు కన్నీరు కార్చుతూ.. ఆ ముగ్గురినీ ఓదార్చసాగారు.
ఆ రాత్రి వాళ్ళ పాలిట కాళరాత్రి..
మరుదినం పదిగంటల ప్రాంతంలో రోజ్ శవం స్మశానానికి తరలించబడింది. అందరినీ దుఃఖసాగరంలో ముంచి రోజ్ బంగారు తల్లి ఆత్మ పై లోకానికి వెళ్ళిపోయింది.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
