Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-7

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రోజ్ మరణించిన నాల్గో రోజున హస్పటల్‌కి వెళ్ళి పుట్టిన బిడ్డలను శ్రీరామ్ ఇంటికి తెస్తారు దుర్గ, థామస్. కూతురు పోయిన బాధలో ఉన్న దుర్గ, థామస్, భార్య పోయిన దుఃఖంలో ఉన్న శ్రీరామ్ బిడ్డలని సరిగ్గా చూసుకోలేకపోతారు. పలితంగా ఆ బిడ్డల ఆరోగ్యం క్షీణించి వారు మరణిస్తారు. శ్రీరామ్ దుఃఖం పట్టలేకపోతాడు. చిన్నారి గంగ తన తల్లి గురించి  శ్రీరామ్‌ని అడుగుతుంది. దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందని చెప్పగా, ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. అంతలో అక్కడికి వచ్చిన దుర్గ, థామస్‍లు వాళ్ళ పక్కన కూర్చుంటారు. దుర్గ మనవరాలి దృష్టిని మళ్ళిస్తుంది, థామస్ శ్రీరామ్‌కి ధైర్యం చెప్పి, మళ్ళీ మనుషుల్లో పడేలా చేస్తాడు. తేరుకున్న శ్రీరామ్ ఆఫీసుకి వెళ్ళడం ప్రారంభిస్తాడు. డీన్, ఇతర కొలీగ్స్, రోజ్ మరణం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తారు. గంగకి తల్లీ తండ్రీ తానే అవుతాడు శ్రీరామ్. మూడేళ్ళు గడుస్తాయి. గంగని స్కూల్లో చేరుస్తారు. ఆమె ఏకసంథాగ్రాహి. మూడవ తరగతిలోకి వస్తుంది. మరో ఏడాది గడిచేసరికి తెలుగు నేర్చుకుని, రోజ్ ప్రార్థనా పుస్తకం తీసుకుని అందులోని శ్లోకాలు చదువుతుంది. దుర్గ పాపని అభినందిస్తుంది. రోజ్ పాడినట్టే ఉందని మురిసిపోతాడు థామస్. రోజు మరణం తర్వాత విపరీతంగా మద్యం తాగడం అలవాటు చేసుకున్న థామస్ ఆరోగ్యం పాడయి మరణిస్తాడు. దుర్గ ఆవేదనకి అంతం ఉండదు. కొన్ని నెలలకు దుర్గ కూడా మరణిస్తుంది. కూతురుని తీసుకుని ఇండియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు శ్రీరామ్. కూతురు వార్షిక పరీక్షలు ముగియగానే విమానమెక్కి భారత్ బయల్దేరుతారు. – ఇక చదవండి.]

అధ్యాయం-8

శ్రీరామ్, గంగలు ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం చెన్నై చేరింది. అక్కడి నుండి వారు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో విశాఖలో దిగారు. వారిని దినకర్ విశాఖ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకొని గాజువాకలోని తన ఇంటికి కార్లో తీసుకొని వచ్చాడు.

దినకర్ తన భార్య స్వప్నకు కుమారుడు సుందర్‌కు గంగను శ్రీరామ్‌ను పరిచయం చేశాడు.

స్వప్న, సుందర్‍లు, శ్రీరామ్ గంగలను ప్రీతిగా పలుకరించారు. సుందర్ గంగ కన్నా రెండు సంవత్సరాలు పెద్ద.

దినకర్ పోర్టులో ఎక్సైజ్ ఆఫీసర్.

లండన్ నుండి చెన్నై పది గంటల (నాన్-స్టాప్) ప్రయాణం. దూరం 8230 కిలోమీటర్లు. చెన్నై టు వైజాగ్ 620 కిలోమీటర్లు. ఒక గంట ప్రయాణం.

శ్రీరామ్, గంగలు స్నానం చేసి ఆ ఇంటి వారందరితో కలిసి కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేశారు. సుందర్ ప్రీతిగా గంగను, తన గదిలోనికి తీసుకెళ్ళి క్యారమ్ ఆడసాగారు.

శ్రీరామ్, దినకర్, స్వప్నలు హాల్లో కూర్చున్నారు. గడిచిన లండన్ జీవితానుభవాలను శ్రీరామ్, ఆ దంపతులకు చెప్పాడు. రోజ్ మరణ విషయాన్ని విని వారు, ఎంతగానో బాధపడ్డారు.

“ఓకే శ్రీరామ్!.. గతం గతః, గతం మంచిగా సాగివుంటే ఆనందం, చేదుగా సాగిపోయుంటే విషాదం. నీవు ఆ గతాన్ని మరిచిపో. గంగ యోగక్షేమాల దృష్ట్యా నీవు, నీ భావి జీవితాన్ని ఎలా గడపాలనుకొంటున్నావో, బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. నీ నిర్ణయాన్ని అమలు పరిచేదానికి, నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది” అనునయంగా చెప్పాడు దినకర్.

“నీ మీద నాకు ఆ నమ్మకం వుందిరా!.. నా అమెరికా ప్రయాణానికి సూత్రధారివి నీవేగా!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

“అవును. వూరికి ఎప్పుడు వెళతావు?”

“రెండు రోజుల తర్వాత!.. ఇక్కడ నేను చేయదలచిన దాన్ని గురించి నేను లండన్ లోనే ఒక నిర్ణయానికి వచ్చాను.”

“ఏమిటది?”

“పిల్లల భవితకు కాలేజీలు ఓపెన్ చేస్తాను. చక్కటి విద్యను భావిభారత పౌరులైన బాలబాలికలకు నేర్పుతాను. ఇదే నా నిర్ణయం. నీ అభిప్రాయం ఈ విషయంలో ఏమిటి దినా..” అడిగాడు శ్రీరామ్. దినకర్ కొన్ని క్షణాలు ఆలోచించాడు.

“మంచి ఆలోచన అన్నయ్యా!..” అంది స్వప్న చిరునవ్వుతో.

శ్రీరామ్ దినకర్ ముఖంలోకి చూచి.. “దినా!.. నీ అభిప్రాయం?” అడిగాడు.

దినకర్ చిరునవ్వుతో..” శ్రీరామ్ మంచి ఆలోచనరా!.. నాకూ సమ్మతం” అన్నాడు.

ముగ్గురిదీ ఏకాభిప్రాయం కావడంతో ఆనందంగా నవ్వుకొన్నారు.

తరువాత శయనించారు.

మరుసటి రోజు ఉదయాన్నే మిత్రులు ఇరువురూ దినకర్, శ్రీరామ్ కోసం కొన్న ప్రక్క ఇంటికి వెళ్ళారు. ఇరువురూ ఇల్లంతా చుట్టి చూచారు.

“దినా!.. ఇల్లు చాలా బాగుంది” ఆనందంగా చెప్పాడు శ్రీరామ్.

ఇరువురూ ఇంటికి తాళం వేసి ముందున్న వరండాలోకి వచ్చారు. వారికి.. చలపతి, శ్రీరామ్ సోదరుడు ఎదురైనాడు. ఇరువురూ ఆశ్చర్యంతో అతన్ని చూచారు.

“శ్రీరామ్!.. మన చలపతి” నవ్వుతూ చెప్పాడు దినకర్.

శ్రీరామ్‌ని చూచిన చలపతి చిత్తరువులా నిలబడిపోయాడు అతని కళ్ళల్లో నీళ్ళు.

శ్రీరామ్ తదేకంగా తమ్ముడు చలపతిని చూచాడు.

చలపతి చిరునవ్వుతో మెల్లగా శ్రీరామ్‌ని సమీపించాడు.

“అన్నా!..” అంటూ ఆనంద పారవశ్యంతో చలపతి శ్రీరామ్‌ని కౌగలించుకొన్నాడు.

శ్రీరామ్ కళ్ళల్లో కన్నీరు.. రక్త సంబంధీకుడు సోదరుడు అయిన చలపతి కౌగిలింతతో శ్రీరామ్ మనస్సున ఆవేదన. ఆ అన్న తమ్ముల కలయిక ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత జరిగింది. ఇరువురి గళాలు ఆనందంతో మూగబోయాయి. కొన్ని క్షణాలు వారిరువురూ అలాగే వుండిపోయారు.

దినకర్ ఇరువురి భుజాలను తట్టి..

“పదండిరా!.. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం!..” నవ్వుతూ అన్నాడు.

మెల్లగా ముగ్గురూ దినకర్ ఇంటి వైపుకు నడిచారు.

శ్రీరామ్ గంగను పిలిచాడు. మేడమీద వున్న గంగ క్రిందికి వచ్చింది. తన తండ్రి ప్రక్కన కూర్చొనియున్న చలపతిని ఆశ్చర్యంతో చూచింది.

“అమ్మా!..” పిలిచాడు శ్రీరామ్.

“ఏం నాన్నా!..” తండ్రిని సమీపించింది గంగ.

చలపతి నవ్వుతూ గంగ ముఖంలోకి చూచాడు.

శ్రీరామ్ గంగ చేతులు పట్టుకొని..

“తల్లీ!.. వీడు నా తమ్ముడు చలపతి!.. నీకు చిన్నాన్న అమ్మా!..”

గంగ నవ్వుతూ చలపతి ముఖంలోకి చూచింది.

చలపతి చేతులు చాచి గంగను తన దగ్గరకు తీసుకొన్నాడు. బంగారు బొమ్మలా వున్న గంగను చూచి మురిసిపోయాడు చలపతి. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని..

“తల్లీ!.. నీవు మా అమ్మవమ్మా!..” పరవశంతో గద్గద స్వరంతో పలికాడు చలపతి. గంగ వంగి చలపతి పాదాలను తాకి కళ్ళకు అద్దుకొంది.

చలపతి కళ్ళల్లో కన్నీరు..

“చిన్నానా!.. ఎందుకు ఏడుస్తున్నారు!..” ఆశ్చర్యంతో చలపతి ముఖంలోకి చూస్తూ అడిగింది గంగ.

“వాడి కళ్ళకు నీవు మా అత్తయ్య అంటే మీ నాన్న అమ్మ.. అంటే మీ గ్రాండ్ మదర్ కనిపించావు. అందుకే గంగ వాడి కళ్ళల్లో ఆ కన్నీరు!” చిరునవ్వుతో చెప్పాడు దినకర్.

“చిన్నాన్నా!..”

“ఏం తల్లి!..”

“అత్తయ్యా, మామయ్యా, భారతి వదిన, నరసింహరాయుడు బావా రాలేదా!”

“అమ్మా!.. వారి పేర్లన్నీ నీకు ఎలా తెలుసు తల్లీ!..” కన్నీటిని పై పంచతో తుడుచుకొంటూ అడిగాడు చలపతి.

“చిన్నాన్నా!.. మన వాళ్లందరి పేర్లను నాన్న నాకు చెప్పారు!” చిరునవ్వుతో చెప్పింది గంగ.

“ఏం చదువుతున్నావు తల్లీ!..” అడిగాడు చలపతి.

“లండన్‌లో ఐదవ తరగతి పాసైనాను. ఇక్కడి స్కూళ్ళు తెరిచాక ఆరవ తరగతిలో చేరుతాను చిన్నాన్నా!..” మధురమైన తన కంఠంతో చెప్పింది గంగ.

“అన్నా!..”

“ఏమిటి చలపతి!” శ్రీరామ్ ప్రశ్న.

“అక్కా బావలు మిమ్మల్ని నాతో తీసుకొని రమ్మని పదే పదే చెప్పారు అన్నా!..”

“చలపతీ!.. వాడు రేపు వూరికి రావాలనే నిర్ణయించుకొన్నాడు” నవ్వుతూ చెప్పాడు దినకర్.

స్వప్న టిఫిన్‌కు గంట కొట్టింది.

అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. స్వప్న.. అందరికీ పొంగలి, కొబ్బరి అల్లం చెట్నీలను ప్లేట్లలో పెట్టి ముందు వుంచింది.

అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తిన్నారు. స్వప్న కాఫీ కప్పులను అందించింది, త్రాగారు.

“దినా!..” పిలిచాడు శ్రీరామ్.

“ఏం శ్రీరామ్!..”

“పనేం లేదు కదా!.. చలపతి కూడా వచ్చె. నేను గంగ వూరికి వెళ్ళి వస్తాము.”

“ఎప్పుడు బయలుదేరాలని?”

“ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర. వైజాగ్ టు నెల్లూరు 623km. ఎనిమిది గంటల ప్రయాణం అంటే. ఐదున్నర, ఆరుకల్లా చేరిపోతాము. దినా, బయలుదేరనా?” అడిగాడు శ్రీరామ్.

“ఓకే బయలుదేరు!” అన్నాడు దినకర్.

అందరికీ చెప్పి శ్రీరామ్, గంగ, చలపతి, దినా, మహేంద్రా కారులో బయలుదేరారు.

గంగ, స్వప్న, దినకర్‌లకు సుందర్‌కు బై చెప్పి ఆనందంగా కారు ముందు సీట్లో కూర్చుంది. చలపతి వెనుక సీట్లో.. చక్కని ఫోర్ వే రోడ్డు, రోడ్డు మధ్యలో కాగితపు పూలచెట్లు, మందారం, క్రోటన్స్ బాగా ఎదిగి పూలతో నిండి వున్నాయి. వాటిని చూచిన గంగ మనస్సుకు ఎంతో ఆనందం.

శ్రీరామ్, వూరు విడిచి వైజాగ్‌కు వచ్చే రోజుల్లో ఆ రోడ్ సింగిల్ తారు రోడ్డు. శ్రీరామ్ మనస్సులో ఆ పాత జ్ఞాపకాలు..

కాలేజీలో ఎం.ఎస్సీ ఫైనల్ ఇయర్లో అతనికి సెకండ్ ఇయర్లో చేరిన వసంతతో పరిచయం అయింది.

కారణం, శ్రీరామ్ స్కాలర్. అతను క్లాస్ ఫస్టు, కాలేజీ ఫస్టు..

ఆ కారణం అందరూ ఆడపిల్లలకు, శ్రీరామ్ అంటే ఎంతో అభిమానం, గౌరవం. (శ్రీరామ్, దినకర్ క్లాస్‍మేట్స్) మగవారిలో శ్రీరామ్ అంటే పేద మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో అభిమానం. బాగా వున్న సంపన్నుల సంతతికి శ్రీరామ్ అంటే ద్వేషం. కారణం అతని తెలివితేటలు. లెక్చరర్స్ అతన్ని అభిమానించే తీరుతెన్నులు. శ్రీరామ్ మధ్య తరగతి (కుటుంబం) విద్యార్థి. ఏకసంతగ్రాహి. అందుకే అతనికి అంతమంది అభిమానులు.

వైజాగ్ నుండి వారు ఐదున్నర గంటల్లో విజయవాడ చేరారు. హోటల్ మినర్వా గ్రాండ్లో భోజనం చేశారు. శ్రీరామ్ కారు నడుపుతున్నాడు. వారు ఐదుగంటలకు కావలి చేరారు. విజయవాడలో గంగ వెనుక సీట్లోకు వెళ్ళి పడుకుంది. చలపతి ముందు సీట్లో కూర్చున్నాడు.

వారి కారు కావలిని దాటింది. శ్రీరామ్ ఆది నుంచి నూరు, నూట ఇరవై కిలోమీటర్లు గంటకు అదే రీతిలో నడుపుతున్నాడు. మార్గంలో ఒక కారు ఆగి ఉంది. ఒక వనిత కారు దిగి దిక్కులు చూస్తూ ఉంది. డ్రైవర్ బ్యానెట్‌ను పైకెత్తి, ఇంజన్‌ను పరిశీలిస్తున్నాడు. ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది.

ముందుకు వెళ్ళిన తన కారును ఆ స్త్రీకి సాయం చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీరామ్ ఆపి దిగాడు. పదిహేను మీటర్ల దూరంలో వున్న ఆమెను సమీపించాడు.

ఆమె శ్రీరామ్‌ను పరీక్షగా చూడసాగింది.

శ్రీరా‍మ్ ఆమె.. వసంత అని గుర్తించాడు.

“మీ పేరు వసంత కదా అండీ!..” అడిగాడు శ్రీరామ్.

“మీ పేరు శ్రీరామ్ కదా!” చిరునవ్వుతో అడిగింది వసంత,

“అవును!.. నేను ఇంకా మీకు గుర్తువున్నానా!..”

“మన కాలేజీమేట్స్, ఎవరూ మిమ్మల్ని మరిచిపోలేరు!” చిరునవ్వుతో చెప్పింది వసంత.

“మీరు ఇక్కడ రోడ్లో..” శ్రీరామ్ పూర్తి చేయకముందే..

“కారు ప్రాబ్లం!..”

“ఎక్కడికి వెళ్లాలి?”

“నెల్లూరు!..”

“నేనూ అక్కడికే వెళుతున్నాను. నా కార్లో వస్తారా!:”

“అమ్మా!.. నేను కావలికి వెళ్ళి ప్యాన్ బెల్టు తెస్తానమ్మా!..” వారిని సమీపించి చెప్పాడు డ్రైవర్.

“సరే!..” అంది వసంత.

అతను ఏదైనా వాహనం దొరుకుతుందేమో.. అనుకొంటూ రోడ్డు ఆవలివైపుకు నడవసాగాడు.

“మస్తాన్!.. నేను ఈ సార్ వారి కార్లో వెళతాను. నీవు రిపేర్ చేసుకొని నెల్లూరికి రా!..” అంది వసంత.

“సరే అమ్మగారూ!..” మస్తాన్ జవాబు.

వసంత శ్రీరామ్ ముఖంలోకి చూచింది.

“రండి.. మిమ్మల్ని క్షేమంగా నెల్లూరు చేరుస్తాను” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

“థాంక్యూ సార్..” అంది వసంత.

ఇరువురూ శ్రీరామ్ కారును సమీపించారు.

వారిని చూచి చలపతి కారు దిగి వెనుక సీట్లో కూర్చున్నారు.

“వాడు నా తమ్ముడు. సీట్లో నిద్రపోతున్నది నా కూతురు!.. కూర్చోండి” చెప్పాడు శ్రీరామ్. వసంత ముందు సీట్లో శ్రీరామ్ ప్రక్కన కూర్చుంది. అతను కారును స్టార్ట్ చేశాడు.

కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. శ్రీరామ్ తదేకంగా రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు.

“సార్!..” పిలిచింది వసంత.

శ్రీరామ్ వసంత ముఖంలోకి చూచాడు.

“చెప్పండి!..”

“మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు?”

“వైజాగ్!”

“అక్కడ మీరు వర్క్ చేస్తున్నారా!”

“చేయబోతున్నాను. ఇరవై ఆరు సంవత్సరాలు లండన్లో వుండి రెండురోజుల క్రింద వైజాగ్ వచ్చాను.”

“మీ మిసెస్ గారు?”

“ఇన్ హెవెన్!”

వసంత ఆశ్చర్యంతో శ్రీరామ్ ముఖంలోకి చూచింది.

“మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?” అడిగాడు శ్రీరామ్.

“నేను వైజాగ్ నుంచే. నెల్లూరులో మా బంధువుల అమ్మాయి వివాహం..”

“ఓ.. వైజాగ్‌లో మీరు ఏం చేస్తున్నారు?”

“కాలేజీ ప్రిన్సిపాల్..”

“ఏ కాలేజీ!..”

“రాజమహేంద్ర డిగ్రీ కాలేజీ..”

“పిల్లలు”

“లేరు”

“మీవారు?”

“లేరు”

లేరు.. లేరు అనే జవాబు రెండుసార్లు వినడంతో శ్రీరామ్ వసంత ముఖంలోకి ఆశ్చర్యంతో చూచాడు.

వసంత చూపులు శ్రీరామ్ చూపులతో కలిశాయి.

“సార్!..”

“ఆ..”

“ఎందుకు అలా చూచారు?”

“ఎలా!..”

“ఎంతో ఆశ్చర్యంతో!..”

“మీ రెండు లేరు.. లేరు అనే దానికి కారణం!” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

వసంత గలగలా నవ్వింది.

శ్రీరామ్ క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి తలను ప్రక్కకు తిప్పుకొన్నాడు.

‘కాలేజీ రోజుల్లో ఈ వసంత నన్ను తరుచూ కలుసుకొనేది. తన సందేహాలకు జవాబులను నానుండి తెలుసుకొనేది. బహుశా తనకు నాకు నాలుగైదేళ్ళు వ్యత్యాసం. అంటే.. ప్రస్తుతం నాకు నలభై ఆరు అయితే తన వయస్సు ముప్పై ఎనిమిది, నలభైలోపు వుండవచ్చు. కానీ చూచేదానికి ముఫ్ఫై ఏళ్ళ అన్ మ్యారీడ్ యువతిలా వుంది. చిన్న వయస్సులోనే ప్రిన్సిపాల్ అయింది. సో.. షి ఈజ్ డెఫినెంట్లీ జీనియస్. వివాహం, పిల్లలు విషయంలో లేరు తప్ప మరేమీ చెప్పలేదు. కారణం ఏమిటో!..’ అనుకొన్నాడు శ్రీరామ్.

‘కాలేజీ బెస్ట్ స్టూడెంట్. ఎందరికో అభిమానులు. ఆ రోజుల్లో వారిని పరిచయం చేసుకోవాలని ఎంతో తాపత్రయపడేదాన్ని. వారి పరిచయ భాగ్యం నాకు కలిగింది. నా సందేహాలను సబ్జెక్ట్ పరంగా వారిని అడిగి తెలుసుకొనేదాన్ని. ప్రతి విషయాన్ని ఎంతో విశదీకరించి చెప్పేవారు. వారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్. గోల్డ్ మెడలిస్ట్. నేను సెకండ్ ఇయర్ స్టూడెంటు. మా పరిచయం బాగా సాగింది తొమ్మిది మాసాలే. కానీ.. వారి రూపం, మాటలు నా ఎదలో నిలిచిపోయాయి. వారు కాలేజీని విడిచివెళ్ళిపోయారు. కానీ.. అప్పుడప్పుడూ వారిని తలుచుకొనేదాన్ని. వారి అర్థాంగి కాబోయేవారు ఎవరో చాలా అదృష్టవంతురాలు, అని అనుకొనేదాన్ని. దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వీరిని కలవగలిగాను.’ అనుకొంది వసంత.

కారు నెల్లూరులో ప్రవేశించింది.

“వసంతా!.. ఎక్కడ దిగాలి?” అడిగాడు శ్రీరామ్.

“ఆత్మకూరు బస్టాండ్ దగ్గర. “

పెన్న బ్రిడ్జి దాటి ఐదు నిముషాల్లో కారు ఆత్మకూరు బస్టాండ్‌కు చేరింది. శ్రీరామ్ కారును ఆపాడు. వసంత కారు దిగింది. గంగ మేల్కొంది.

“నాన్నా!..”

“ఏం తల్లీ!..”

“ఆమె ఎవరు?”

“నా కాలేజీమేట్, పేరు వసంత”

చేతులు జోడించి, “నమస్తే! ఆంటీ..” అంది గంగ.

గంగను తదేకంగా చూస్తూ, “థాంక్యూ సార్” అంది వసంత.

వసంత గంగను చిరునవ్వుతో పరీక్షగా చూచింది. ‘స్వీట్ బేబీ’ అనుకొంది.

“నో మెన్షన్ ప్లీజ్!..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

కారును రివర్స్ చేసి, పెన్నా బ్రిడ్జి దాటి బుచ్చిరెడ్డి పాలెం వైపుకు నడుపసాగాడు శ్రీరామ్.

(ఇంకా ఉంది)

Exit mobile version